7, సెప్టెంబర్ 2021, మంగళవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 వెనుకటి రోజుల్లో -

రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-

ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ' మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ' అన్నాడు కోపంగా.

'పరిష్కారం మీ చేతుల్లోనే వుందికదా' అన్నాను జవాబుగా.

ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో - 'ఎలా?' అన్నాడు మరింత కోపంగా.

'మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.' అన్నాను కూల్ గా.

రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో - ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, 'భలే వారే' అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.

మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.

అయితే- ఎంతో కష్టపడి ప్రోగ్రాం తయారుచేసామనే భావనతో వుండే సిబ్బంది - విమర్శలను తట్టుకోలేకపోవడం కూడా సహజమే. కానీ, ఇక్కడ మరో నిజం కూడా ఒప్పుకోవాలి. వ్యంగాస్త్రాలను అలవోకగా సంధించగల మీడియా వారు కూడా కొండొకచో వ్యంగాన్ని భరించలేరు. కొన్ని పాళ్ళు స్వామి భక్తీ, కొన్నిపాళ్ళు వృత్తిమీది అనురక్తి - కలగలసి వారినలా మారుస్తుంది. అయితే- విమర్శలు చేసేవారికి - వాటిని స్వీకరించగల సహృదయత వుండాలనుకోవడం అత్యాశ కాదేమో!

ఆలోచిస్తే తప్పేముంది?

 

6, సెప్టెంబర్ 2021, సోమవారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

 ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.”

(పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

 

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

 

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.

నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.

కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.

నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’

అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.

తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.

అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.

ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’

అనేది అతడి ప్రార్ధన.

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

వసంత్ విహార్ ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒక నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళే వాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.

నేను రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులు, ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన మకాము. చిన్నప్పటి నుంచి  తన గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్  అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా వృత్తిరీత్యా రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.

ఒకరోజు జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై  ఎక్కించుకుని ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.

అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో  కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది. కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు. గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.

ఈ నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన బొమ్మకంటి సత్యనారాయణ రావు గారెని కలుసుకున్నాము. (మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావు, ఐ.పి.ఎస్.  పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు)

మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకుడు లేదు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.

అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“ఒర్రేయ్  నరసింహం!  పార్టీ అంటే మాటలు కాదురా! అంత  బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసాడు.

ఇంకో మాట కూడా అన్నాడు. ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు అనిపించలేదు. మరి ఆమె గురించి అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ ‘గాంధారి గర్వ భంగం అవుతుంది చూడండి అన్న మాట గుర్తుంది.  

(05-09-2021)         

4, సెప్టెంబర్ 2021, శనివారం

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను – భండారు శ్రీనివాసరావు

 

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..

రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. రేడియోలో చేరడానికి ముందు ఓ అయిదేళ్ళు బెజవాడ నుంచి నార్ల వారి సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశాను. అక్కడ ఉద్యోగపర్వం ఆఖరు అధ్యాయం నడుస్తుండగా ఎమర్జెన్సీ వచ్చి పడింది. మిగిలిన రంగాల సంగతేమో కానీ, దాని ప్రభావం పత్రికా రంగంపై బాగానే పడింది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు 'ఆ ఖాళీ పేజీలు’ ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. 

ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.

వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.

వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.

బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి రిక్షాలో ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. అద్దె మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. తమ ఇంట్లో ఆ ఒక్క వాటా రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. 

ఆ పదేళ్ళలో ఇలాటివి ఎన్నో అనుభవాలు

తెలుగు భాష చిరంజీవి - భండారు శ్రీనివాసరావు

 తాళ పత్రాలు, ఘంటాలు, పుల్ల కలాలు, కరక్కాయ సిరాల కాలంలో బతికిన తెలుగు భాష, కలాలు, కాగితాల దశలో అంత్య దశకు చేరుకున్నదేమో అని భయపడ్డాను. అయితే ఇంటర్నెట్ రంగ ప్రవేశం చేసి సంజీవని పుల్లను తాకించి మళ్ళీ ప్రాణం పోసింది. చిన్నా పెద్దా అందరూ తెలుగులో ఎంచక్కా రాసేస్తున్నారు. ఇక భయం లేదు! తెలుగు భాషకు మరణం లేదు

మాతృభాష అంటే నాకు తగని మమకారం. అందుకే నా అన్ని పోస్టులు తెలుగులో రాస్తున్నానంటే మాత్రం నన్ను నేను మోసం చేసుకున్నట్టే. సరైన ఇంగ్లీషు నాకు వచ్చివుంటే నా పోస్టులకు రీచ్ కూడా చాలా పెద్ద స్ధాయిలో వుండేది. కేవలం చక్కటి ఇంగ్లీషు రాదు అనే ఒకే ఒక్క కారణంగా నేను నా వృత్తి జీవితంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోయాను. అనేక మెట్లు కిందనే వుండిపోయాను. జీవితం బోధించిన ఈ పాఠం వల్లనే నేను ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలికాను. కొన్నేళ్ల క్రితం వరకు రష్యా, చైనాల్లో వారికి ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. కానీ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు పెట్టి అక్కడివారికి ఆంగ్లం నేర్పిస్తున్నారు.

ఇప్పుడు ప్రపంచం ఎలా వున్నదంటే ఒక్కసారి వెనకపడితే ఇక అక్కడే వుండిపోవాల్సివస్తుంది. ఇది నా అనుభవం మీద చెబుతున్న వాస్తవం. ఇందులో రాజకీయాలు లేవు

 

(04-09-2021)

నవ్వడం మరచిపోతున్నామా? – భండారు శ్రీనివాసరావు

 మా పక్కింటి పాపాయి, పది నెలల పాప, నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.

నలభయ్ ఏళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా ఒక కాగితం వుండేది.
‘మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి’ అని దానిమీద రాసిపెట్టాను. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే, ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!’ అని పైకి చెప్పుకున్న రోజులవి.
కానీ ఇప్పుడో. గుండె కదిలిస్తే పెదాలపై కదిలే కల్మషం లేని నవ్వులు కనిపిస్తున్నాయా అంటే అవునని చెప్పడం కష్టం. అసలు నవ్వడం లేదా అంటే నవ్వుతున్నాం, తెచ్చిపెట్టుకున్న నవ్వుల్ని పెదాలపై అతికించుకుని నవ్వుతున్నాం.
‘నవ్వగలగడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం’ అని నవ్వు గురించి నవ్వుల రేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది.
కాకపొతే, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజమే! హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు రోగంలా అందర్నీ అంటుకుంటోంది.