6, సెప్టెంబర్ 2021, సోమవారం

తరాల అంతరం – భండారు శ్రీనివాసరావు

 

చనిపోయే ముందు కొడుక్కు చెప్పాడు తండ్రి.

నేను ప్రతి రోజూ ఉదయం స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అని కోరుకుంటూ ఉండేవాడిని. నువ్వూ అలాగే కోరుకో’ అని కన్నుమూశాడు.

కొడుకు తండ్రి చెప్పినట్టే చేశాడు. కాకపోతే కొద్దిగా మార్చి దేవుడ్ని వేడుకున్నాడు.

నేను బాగుండాలి. అందరూ బాగుండాలి’

అతడికీ ఒకరోజు చివరి రోజు వచ్చేసింది.

తన కొడుకుని పిలిచి తనకు తన తండ్రి చెప్పినట్టే చెప్పి చనిపోయాడు.

అతడి కొడుకూ తండ్రి చివరి కోరికను కొద్దిగా మార్చి నెరవేర్చాడు.

ముందు నేను బాగుంటేనే కదా! ఇతరుల బాగోగులు చూసేది. కాబట్టి నేను బాగుండేటట్టు చూడు స్వామీ!’

అనేది అతడి ప్రార్ధన.

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

వసంత్ విహార్ ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒక నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళే వాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.

నేను రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులు, ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన మకాము. చిన్నప్పటి నుంచి  తన గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్  అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా వృత్తిరీత్యా రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.

ఒకరోజు జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై  ఎక్కించుకుని ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.

అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో  కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది. కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు. గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.

ఈ నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన బొమ్మకంటి సత్యనారాయణ రావు గారెని కలుసుకున్నాము. (మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావు, ఐ.పి.ఎస్.  పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు)

మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకుడు లేదు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.

అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“ఒర్రేయ్  నరసింహం!  పార్టీ అంటే మాటలు కాదురా! అంత  బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసాడు.

ఇంకో మాట కూడా అన్నాడు. ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు అనిపించలేదు. మరి ఆమె గురించి అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ ‘గాంధారి గర్వ భంగం అవుతుంది చూడండి అన్న మాట గుర్తుంది.  

(05-09-2021)         

4, సెప్టెంబర్ 2021, శనివారం

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను – భండారు శ్రీనివాసరావు

 

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..

రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. రేడియోలో చేరడానికి ముందు ఓ అయిదేళ్ళు బెజవాడ నుంచి నార్ల వారి సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశాను. అక్కడ ఉద్యోగపర్వం ఆఖరు అధ్యాయం నడుస్తుండగా ఎమర్జెన్సీ వచ్చి పడింది. మిగిలిన రంగాల సంగతేమో కానీ, దాని ప్రభావం పత్రికా రంగంపై బాగానే పడింది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు 'ఆ ఖాళీ పేజీలు’ ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. 

ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.

వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.

వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.

బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి రిక్షాలో ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. అద్దె మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. తమ ఇంట్లో ఆ ఒక్క వాటా రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. 

ఆ పదేళ్ళలో ఇలాటివి ఎన్నో అనుభవాలు

తెలుగు భాష చిరంజీవి - భండారు శ్రీనివాసరావు

 తాళ పత్రాలు, ఘంటాలు, పుల్ల కలాలు, కరక్కాయ సిరాల కాలంలో బతికిన తెలుగు భాష, కలాలు, కాగితాల దశలో అంత్య దశకు చేరుకున్నదేమో అని భయపడ్డాను. అయితే ఇంటర్నెట్ రంగ ప్రవేశం చేసి సంజీవని పుల్లను తాకించి మళ్ళీ ప్రాణం పోసింది. చిన్నా పెద్దా అందరూ తెలుగులో ఎంచక్కా రాసేస్తున్నారు. ఇక భయం లేదు! తెలుగు భాషకు మరణం లేదు

మాతృభాష అంటే నాకు తగని మమకారం. అందుకే నా అన్ని పోస్టులు తెలుగులో రాస్తున్నానంటే మాత్రం నన్ను నేను మోసం చేసుకున్నట్టే. సరైన ఇంగ్లీషు నాకు వచ్చివుంటే నా పోస్టులకు రీచ్ కూడా చాలా పెద్ద స్ధాయిలో వుండేది. కేవలం చక్కటి ఇంగ్లీషు రాదు అనే ఒకే ఒక్క కారణంగా నేను నా వృత్తి జీవితంలో చాలా పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోయాను. అనేక మెట్లు కిందనే వుండిపోయాను. జీవితం బోధించిన ఈ పాఠం వల్లనే నేను ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలికాను. కొన్నేళ్ల క్రితం వరకు రష్యా, చైనాల్లో వారికి ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. కానీ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు పెట్టి అక్కడివారికి ఆంగ్లం నేర్పిస్తున్నారు.

ఇప్పుడు ప్రపంచం ఎలా వున్నదంటే ఒక్కసారి వెనకపడితే ఇక అక్కడే వుండిపోవాల్సివస్తుంది. ఇది నా అనుభవం మీద చెబుతున్న వాస్తవం. ఇందులో రాజకీయాలు లేవు

 

(04-09-2021)

నవ్వడం మరచిపోతున్నామా? – భండారు శ్రీనివాసరావు

 మా పక్కింటి పాపాయి, పది నెలల పాప, నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.

నలభయ్ ఏళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా ఒక కాగితం వుండేది.
‘మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి’ అని దానిమీద రాసిపెట్టాను. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే, ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!’ అని పైకి చెప్పుకున్న రోజులవి.
కానీ ఇప్పుడో. గుండె కదిలిస్తే పెదాలపై కదిలే కల్మషం లేని నవ్వులు కనిపిస్తున్నాయా అంటే అవునని చెప్పడం కష్టం. అసలు నవ్వడం లేదా అంటే నవ్వుతున్నాం, తెచ్చిపెట్టుకున్న నవ్వుల్ని పెదాలపై అతికించుకుని నవ్వుతున్నాం.
‘నవ్వగలగడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం’ అని నవ్వు గురించి నవ్వుల రేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది.
కాకపొతే, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజమే! హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు రోగంలా అందర్నీ అంటుకుంటోంది.

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆ గాలీ .....ఆ నేలా...... భండారు శ్రీనివాసరావు

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయేమో! ఆనాటి గురుతులన్నీ స్పష్టాస్పష్టంగా మనసులో మెదులుతున్నాయి. మరచిపోతానేమో అన్న సంశయంతో ఈ రాతలకు శ్రీకారం.

మా ఊరు కంభంపాడు. అప్పట్లో చాలా వెనకపడ్డ ప్రాంతం. అయినా అన్నీ ఉండేవి. స్వావలంబన లాంటి మాటలు వాటి అర్ధాలు అప్పట్లో తెలవ్వు. కానీ అన్నీ అమర్చినట్టు ఉండేవి.
మా ఇంటికి దగ్గరలో అంటే నడిచిపోయే దూరంలో చెరువు గట్టు కింద మా మాగాణి పొలాల పక్కన ఓ మెరక మీద మంచి నీళ్ళ బావి. పైగా గిలకల బావి. నాలుగువైపులా గిలకలు ఉండేవి. ఊరి మొత్తానికి అదొక్కటే మంచి నీటి వనరు. మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉప్పు నీటి కషాయం. స్నానాలకు, ఇతర అవసరాలకు ఆ నూతి నీళ్ళే వాడేవాళ్ళం. మా అమ్మగారు వెంకట్రావమ్మ, మా చిన్న మేనత్త చిదంబరం తడి మడి చీరెలతో వెళ్లి మంచి నీటి బావి నుంచి బిందెలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు. అప్పుడప్పుడూ వాళ్ళతో నేనూ వెళ్ళే వాడిని. దోవలో వీర బ్రహ్మం ఇల్లు. ఆయన ఉలీ, బాడిసె పట్టుకుని ఎడ్లు లాగే బండ్లు తయారు చేసేవాడు. నేను అక్కడే ఒక మొద్దు మీద కూర్చుని చూస్తూ కూర్చుండేవాడిని. బండి చక్రాలు, వాటికి ఆకులు అలా కొలతలకు తగ్గట్టుగా ఎలా చెక్కేవాడో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఏమీ చదువుకున్నవాడు కాదు. కానీ బండి ఇరుసు ఏ కొలతలతో చెక్కితే బండి బ్యాలెన్సుగా నడుస్తుందో ఆ విధంగా తయారు చేసేవాడు.
ఆ పక్క వీధిలో కమ్మరి కొలిమి. ఆయనకూ చదువు రాదు. కానీ ఇనుమును కొలిమిలో ఎర్రగా కాల్చి రకరకాల సామాగ్రి తయారు చేసేవాడు.
ఒక వీధిలో వస్త్రాల హనుమంతరావు అని నా దోస్తు ఇల్లు వుండేది. ఆడామగా బట్టలు నేసేవాళ్ళు. ఇంటి బయట చేతికి రంగులు పూసుకుని దారాలకు రంగులు అద్దేవాళ్ళు. ఇంట్లో మగ్గం మీద చీరెలు దోవతులు నేసేవాళ్ళు.
చిన్ని రాములు కొట్లో మిఠాయి ఉండలు, లౌజు ముక్కలు కూడా అమ్మేవాళ్లు. ఇళ్ళల్లో లాంతర్లు, చిమ్నీ దీపాలకు వాడే కిరసనాయిలు అక్కడే కొనేవాళ్ళం. కిరోసిన్ డబ్బా పైన ఒక మూలలో వున్న రంధ్రంలో గొట్టం లాంటి సాధనం వుంచి పైకీ కిందికీ అంటుంటే డబ్బాలో కిరోసిన్ సీసాల్లో పడేది.
ఆ పక్కనే కుండలు చేసేవారు. కుండలు చేసే విధానం చూస్తుంటే కళ్ళు తిరిగిపోయేవి. ఒక చక్రం మీద మట్టి ముద్ద వుంచి ఆ చక్రాన్ని వేగంగా ఒకసారి తిప్పేవాళ్ళు. చేతి వేళ్ళతో ఆ ముద్దను సుతారంగా తాకుతూ చిత్రవిచిత్రంగా కుండలు తాయారు చేసేవాళ్ళు. ఆ ముద్ద నుంచి కుండల ఆకారాలు వస్తుంటే ఏదో మాయాజాలంగా అనిపించేది.
సాయంత్రం అయ్యేసరికి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాడ నుంచి బ్యాండు మేళం వినపడేది. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు గిరాకీ లేని రోజుల్లో అలా తీరి కూర్చుని సినిమా పాటలు ప్రాక్టీసు చేస్తుంటారని. అలాగే సన్నాయి మేళం వాయించేవాళ్లు. మా ఇంటికి చుట్టపక్కాలు ఎవరైనా వస్తే వాళ్ళు పెట్రోమాక్స్ లైట్ తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ లైటు వెలిగిస్తుంటే పిల్లలం అందరం కళ్ళప్పగించి చూస్తుండే వాళ్ళం. పొడుగాటి వత్తి తగలబడిపోకుండా చిన్న ఆకారంలోకి మారిపోయి తెల్లటి వెలుగులు విరజిమ్మడం నిజంగా ఆశ్చర్యంగా వుండేది. ఆ వత్తి ఎర్రపడి కాంతి తగ్గినప్పుడల్లా గాలి కొట్ట్టేవారు.
మా ఊరు పంచాంగాలకు ప్రసిద్ధి. వాటిని రాసే సిద్ధాంతులు ముగ్గురు వుండేవాళ్ళు. ఒకే ఊరు నుంచి మూడు పంచాంగాలు రావడం గొప్పగా చెప్పుకునే వారు. గొలుసుకట్టు రాతలో, తెలుగు అంకెలతో రాసిన పంచాంగాలను ఆ సిద్ధాంతులు తెనాలి తీసుకువెళ్లి అక్కడ అచ్చు వత్తించేవారు. ఉగాది రావడానికి ముందుగానే చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడి మోతుబరులకు పంచాంగాలు ఇచ్చి ఆశీర్వదించేవాళ్లు. సంభావన రూపంలో వచ్చిన ప్రతిఫలం ఎంత ఇస్తే అంత తీసుకుని తిరిగివచ్చేవారు.
మంచి నీళ్ళ బావికి వెళ్ళే దోవలో ముస్లిం ల కోసం పీర్ల సావిడి వుండేది. పీర్లను ఊళ్ళో ఊరేగించిన తర్వాత మళ్ళీ ఈ సావిడిలో భద్రపరిచేవాళ్ళు. షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది. ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు. బ్లాకు బోర్డులు లేవు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, సుద్ద బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.
అప్పయ్య మాస్టారి తండ్రి శివరాజు నాగభూషణం గారు తెలవారకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకుని ఇంటి బయట నిలబడి ఉచ్చైస్వరంతో ఆలపించే కృష్ణ శతకంలోని పద్యాలే ఊరంతటికీ కోడి కూత.
మా ఇంటికి వెనుక రెండు దేవాలయాలు ఒకే ప్రాకారంలో ఉండేవి. పక్కనే కోనేరు వుండేది. కాలక్రమంలో అది పూడిపోయింది. ఆ గుళ్ళకు మేమే వంశ పారంపర్య ధర్మకర్తలం. వాటికి మాన్యాల రూపంలో నలభయ్ ఎకరాల దాకా భూమి వుండేది, కానీ వాటి మీద వచ్చే అయివేజు స్వల్పం. వూళ్ళో వాళ్ళే పూనుకుని పండుగ దినాల్లో ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించేవారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన తిరుణాలకు, అది జరిగినన్ని రోజులూ మా వూరినుంచి రంగు కాగితాలతో అలంకరించిన ప్రబ్భండ్లు (ప్రభలు) మేళతాళాలతో ఇంటికొకటి బయలుదేరేవి.
ఆ రోజుల్లో మా ఊర్లో రెండు రకాల సేద్యపు నీటి వనరులు ఉండేవి. ఒకటి చెరువు, రెండోది మునేటి కాలువ. ఒకప్పుడు ఈ రెంటి కిందా అధిక భాగం భూములు మావే. ఐదో అక్కయ్య భర్తది పొరుగూరు పెనుగంచి ప్రోలు. ఆ బావగారు వచ్చినప్పుడల్లా గుర్రపు సవారీ. రాగానే గుర్రాన్ని మేతకు వదిలేసేవాడు. అది మేసినంత మేరా మామగారు (అంటే మా నాన్నగారు) తాలూకు పొలాలే, ఏం పరవాలేదు అని చెప్పుకునే వారు నా చిన్నతనంలో.
ఇప్పుడు ఇవన్నీ ఏవీ లేవు అని చెప్పను కానీ అప్పటి మాదిరిగా లేవు. కొన్ని అసలే లేవు, జ్ఞాపకాలు తప్ప.
వీరబ్రహ్మం లేడు, ఎడ్ల బళ్ళు తయారుచేసే వాళ్ళు లేరు. ఆ బండ్లే లేవు. ఎడ్లూ లేవు. నాటి మగ్గాలు లేవు, బట్టలు నేసేవాళ్ళు లేరు. చిన్ని రాములు కొట్టు లేదు. షట్టర్లు కలిగిన దుకాణాలు వచ్చాయి. కుండల తయారీ లేదు. స్టీలు సామాను, ఫ్రిజ్ లు గృహప్రవేశం చేసాయి.
స్వయం సమృద్ధి కాకపోయినా స్వయం పోషకంగా వుండే మా ఊరు ఇప్పుడు అన్ని ఊళ్లలో ఒక ఊరు. అంతే!
పాస్ పోర్టులో నేటివ్ ప్లేస్ కాలం పూర్తి చేయడానికి మాత్రం పనికి వస్తోంది.




ఏపీ కి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ : Bandaru Srinivasa Shocking Comments ...

ఇలాంటి శీర్షికలు పెట్టి బెదరగొట్టాలి అనుకున్నారు. ఇంటి పేరు బండారు అని రాసి రక్షించారు. సోషల్ మీడియాలో    బండారు శ్రీనివాస రావు అని ఓ  వ్యక్తి  వున్నాడు. పాపం ఆయనకు  దీనితో  ఏమీ సంబంధం లేదు. ఈ వీడియోలో వున్నది నేనే. కాకపోతే మొత్తం అంతా పుటం వేసి చూసినా నా నోటి నుంచి  శీర్షికలో పెట్టిన   ఆ మాట వినపడదు. 
అది గ్యారెంటీ.
ఈరోజు ఉదయం (03-09-2021) మహా న్యూస్ ముఖాముఖి చర్చా కార్యక్రమంలో యాంకర్ శివతో నేను.



LINK: https://youtu.be/Vd0A1OaQSyw