27, ఆగస్టు 2021, శుక్రవారం
వయో వృద్ధులు, జ్ఞానవృద్ధులు – భండారు శ్రీనివాసరావు
రాజకీయ గీత
"అదేమిటండీ. ప్రెస్ ని ఎదురుగా పెట్టుకుని అంతేసి అబద్ధాలు అలవోకగా చెప్పేశారు?"
"చూడూ. రాజకీయాల్లో
నేనెక్కడ వున్నాను? తెలుసుకదా! నువ్వెక్కుతున్న
నిచ్చెన పైమెట్టు మీద. నువ్వేమో ఇంకా మొదటి మెట్టు దాటలేదు. ఒక నీతిపాఠం చెబుతా, గుర్తెట్టుకో.
అబద్ధం చెప్పు. కానీ గోడ కట్టినట్లు ధాష్టీకంగా చెప్పు. జనం అప్పుడే నమ్ముతారు.
అది అబద్దమో కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదుటి పార్టీ మీద వుంటుంది. ఇంకో
సంగతి. ప్రెస్ కి కూడా ఇలాంటి సంగతులే కావాలి. పెద్దగా కష్టపడకుండా పెద్దగా ఖర్చు
పెట్టకుండా పబ్లిసిటీ రావాలంటే ఇదే ఉత్తమ మార్గం. సరే పోయి వాళ్ళకి ఏమేం కావాలో
దగ్గరుండి చూసుకో. పో."
26, ఆగస్టు 2021, గురువారం
చట్టాలున్నా శిక్షలు లేవ్.. ఏపీ మహిళలపై ఆగని అకృత్యాలు | MAHAA NEWS
25, ఆగస్టు 2021, బుధవారం
ఆగస్టు 25న ఏం జరుగుతుంది?
ఏపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి బెయిలా! జెయిలా అంటూ మీడియాలో చాలా రోజులనుంచి తీవ్రాతితీవ్రంగా చర్చలు సాగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆ రోజున సీబీఐ కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇస్తుందని లోగడే ప్రకటించడం జరిగింది.
గతంలో ఒకసారి శ్రీ
కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం
జరుగుతుంది? అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్
నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది’ అని చెప్పడం గుర్తుకువస్తోంది.
చివరికి 25న ఏం జరిగింది అంటే, తీర్పును వచ్చేనెల (సెప్టెంబరు) పదిహేనుకు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
(25-08-2021)
24, ఆగస్టు 2021, మంగళవారం
15 రోజుల్లో ముగిసిన కధ
2019 ఆగస్టు పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, కార్డియాక్ అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం రెండు వారాల లోపు వ్యవధానంలో వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం నోములు, ముత్తయిదువులకు వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు, ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని రామోజీ ఫిలిం సిటీలో ఒక రోజల్లా సరదా తిరుగుళ్ళు...ఒకటా రెండా....అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.
తిథుల ప్రకారం ఈరోజు మా ఆవిడ ఆబ్దీకం.
అమెరికాలో మా పెద్దవాడు సందీప్, కోడలు
భావన, ఇక్కడ రెండోవాడు సంతోష్, కోడలు
నిషా ఆబ్దీకం బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కర్త బాధ్యత లేని భర్తగా మౌనంగా నేను
ఇదంతా చూస్తున్నాను.
(24-08-2021)
