2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ, నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.
6, ఆగస్టు 2021, శుక్రవారం
మరపున పడని రోజు
కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా – భండారు శ్రీనివాసరావు
(Published in ANDHRAPRABHA on 08-08-2021, SUNDAY)
షర్మిల పొలిటికల్ టార్గెట్ ఎవరు..?
ఆగస్టు జ్ఞాపకాలు
5, ఆగస్టు 2021, గురువారం
“కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం”
(Published in Andhra Prabha Daily)
“కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం” అంటూ గత కొన్ని దశాబ్దాలుగాఅంతర్జాతీయ వేదికలపై భారత దేశం చేస్తూ వస్తున్న ఈ వాదన రెండేళ్ల క్ర్తితం వాస్తవ రూపంలో మనముందు నిలిచింది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకావడంతో ఇది సాధ్యపడింది.
మనదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇద్దరు ప్రధాన
మంత్రులు వుండేవారు అనే సంగతి బహుశా నేటి తరంలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే
స్వతంత్ర భారతంలో స్వయంగా రూపొందించుకున్న రాజ్యాంగం అదే దేశంలో ఒక రాష్ట్రం అయిన
జమ్మూ కాశ్మీర్ లో వర్తించదు అనే వింత పోకడ ఒకటి ఉండేదని ఆ రోజులు గురించి తెలిసిన
వారికి బాగా జ్ఞాపకం.
ఈ విచిత్రమైన రాజకీయ పరిస్థితికి కారణం రాజ్యాంగంలో
పొందుపరచిన 370వ అధికరణం.
దీనిద్వారా సంక్రమించిన విశేషమైన అధికారాలతో జమ్మూ కాశ్మీర్, భారతదేశంలో
అంతర్భాగంగా వుంటూనే కొన్ని ప్రత్యేక హక్కులను దశాబ్దాల తరబడి అనుభవిస్తూ
వచ్చింది. ఈ కారణంగానే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రధాన మంత్రి పదవి, ప్రత్యేక
రాజ్యాంగం, ప్రత్యేక
పతాకం, ప్రత్యేక
పౌరసత్వం, దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోను లేనన్ని ప్రత్యేక
హక్కులు.
370 వ అధికరణాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ రకంగా
చూసినా చారిత్రాత్మక నిర్ణయమే. ఈ అధికరణం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని
కలగచేస్తూవచ్చింది. ప్రసిద్ధ రచయిత జార్జ్ ఆర్వెల్
చెప్పినట్టు ‘అందరూ సమానమే, కాకపొతే వారిలో కొందరు ఎక్కువ
సమానం” అనే పద్దతిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొన్ని రాజకీయ పరిస్థితులు, మరి కొన్ని రాజకీయ
అవసరాలు, ఒత్తిడుల కారణంగా
దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే కొన్ని ప్రత్యేక హక్కులను, అపరిమితమైన అధికారాలను అనుభవిస్తూ వచ్చింది. మోడీ ప్రభుత్వం
తీసుకున్న ఈ
నిర్ణయం దరిమిలా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం కూడా దేశంలోని మిగిలిన
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది.
రాష్ట్రాల నడుమ అసమానతలను తొలగించినట్టు అయింది.
370వ అధికరణం వున్న కాలంలో దేశంలో మరెక్కడా లేని విధంగా జమ్మూ
కాశ్మీర్ పౌరులు రెండు విధాలైన పౌరసత్వాలను అనుభవిస్తూ వచ్చారు. ఒకటి కాశ్మీర్
పౌరసత్వం కాగా మరోటి భారత దేశ పౌరసత్వం. ఈ అధికరణం తొలగించిన తర్వాత జమ్మూ
కాశ్మీర్ లో నివసించే ప్రజలు సైతం ఇతర దేశ ప్రజల మాదిరిగా ఒకే ఒక పౌరసత్వం అదీ
భారత పౌరసత్వం మాత్రమే కలిగివుంటారు.
ఈ అధికరణం కారణంగా విచిత్రంగా కానవచ్చే మరో
విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్
రాష్ట్రానికి సొంత రాజ్యాంగాన్ని అనుమతించడం. అంతేకాదు, ఆ రాష్ట్రానికి విడిగా సర్వంసహా అధికారాలు దఖలు
పరచడం. సొంత చట్టాలను చేసుకుని అమలుచేసే అవకాశం కల్పించడం. ఆ రాష్ట్రం శాసనసభ
అనుమతిస్తే తప్ప కేంద్ర శాసనాలు సైతం అక్కడ అమలుకు నోచుకోని దుస్థితి.
ఒకే దేశంలో ఒక రాష్ట్రంగా వుంటూనే జమ్మూ
కాశ్మీర్ ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రత్యేక హక్కులు అనుభవిస్తూ వచ్చింది. మరి ఇన్ని
ప్రత్యేకతలను రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రానికి దఖలు పరచిన తర్వాత జమ్మూ కాశ్మీర్
రాష్ట్రం, భారతదేశంలో అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న
వాదనలలో డొల్లతనం వున్నట్టు అంగీకరించడమే అవుతుంది కదా!
అంచేతనే, ఈ అసమానతలకు భరతవాక్యం పలుకుతూ మోడీ
నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ అధికరణాన్ని రద్దు చేసింది.
తద్వారా, రాష్ట్రాల నడుమ అసమానతలకు స్వస్తి పలికింది.
దీనికి పూర్వం అక్కడి ప్రజలకు వున్న ప్రత్యేక
హక్కులు ఇన్నీ అన్నీ కావు. ఆ రాష్ట్రంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఆ రాష్ట్ర ప్రజలకే వీలు. బయటివారు
జమ్మూ కాశ్మీర్ లో భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయడానికి పూర్తిగా అనర్హులు.
ఇప్పుడు ఈ వివక్షకు తెర పడింది.
మరో విడ్డూరమైన సంగతి ఏమిటంటే ఆ రాష్ట్రానికి
విడిగా ఒక అధికారిక పతాకం వుంది. ఇప్పుడు ఆ రాష్ట్రానికి కూడా మిగిలిన
దేశంతోపాటుగా ఒకే ఒక జాతీయ జండా. అది, త్రివర్ణ పతాకం.
లోగడ జమ్మూ కాశ్మీర్ శాసనసభ పదవీ కాలం ఆరేళ్లు.
ఈ అధికరణం తొలగింపు తర్వాత అక్కడ కూడా అయిదేళ్లకు పరిమితం అయింది.
దేశం మొత్తంలో ముస్లిం జనాభా అల్పసంఖ్యాక
వర్గానికి చెందినది అయితే, జమ్మూ కాశ్మీర్ లో మాత్రం వీరు జనాభాపరంగా
అధిక సంఖ్యాకులు. అక్కడ హిందువులు, సిక్కులు అల్ప సంఖ్యాకులు. అధికరణం తొలగించిన
తర్వాత ఈ అల్ప సంఖ్యాకులకు పదహారు శాతం
రిజర్వేషన్లకు అవకాశం లభించింది.
సమాచార హక్కు చట్టం దేశం మొత్తంలో వర్తించే
శాసనం అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇది వర్తించేది కాదు. ఇప్పుడు ఆ చట్టం
కూడా జమ్మూ కాశ్మీర్ లో వర్తించే చట్టంగా మారిపోయింది.
ఇంతకు ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో లధాక్ అనే
ప్రాంతం ఒక భాగంగా వుండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి
విడదీసి, విడిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే జమ్మూ
కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి దాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు
చేశారు. కాకపొతే జమ్మూ కాశ్మీర్ కు శాసన సభ వుంటుంది, లదాక్ విషయంలో శాసన సభ అంటూ వుండదు. అంతే
తేడా!
తోకటపా:
ఎటూ కాశ్మీర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి
దానికి సంబంధించిన ఒక జోక్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఐక్యరాజ్యసమితిలో
భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
“ కాశ్మీర్ అంశంపై
మాట్లాడడానికి ముందు భారత పౌరాణిక
ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కశ్యప మహర్షి అనే
దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన
కాశ్మీర్ లో సంచారం చేస్తుండగా ఒకచోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ
రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి
అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు
చేరేసరికి, అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు
కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి
ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“అంత పురాతన కాలంలో
పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం
భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“అదే నేను కూడా
చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్
ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి
సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు. (05-08-2021)
4, ఆగస్టు 2021, బుధవారం
పోట్లాడే పురోహితుడు – భండారు శ్రీనివాసరావు
‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.
అయితే ఈనాటి ఈ వ్యాస ప్రేరకుడు అయిన
బ్రాహ్మణుడు యుద్ధాలు చేసేవాడు కాదు, శాపాలు
పెట్టేవాడూ కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవాడు. అదీ ఆయన అడిగినంత
సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన ఆయనకు నచ్చకపోవడం
వల్ల.
ఇందులో విశేషం ఏముంది?
చాలా సందర్భాలలో విన్నదే కదా
అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని
అనిపించింది.
వీరి పేరు ఇంగువ వెంకయ్య గారు. మా
స్వగ్రామంలో మా ఇంటి పురోహితులు. శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా
పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి
శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్
దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో
అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.
మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు
సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర
ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి
కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ
మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే
వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది.
అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు.
సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.
ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి
వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల
ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ
కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమతమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను
తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి
వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం
లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని
అపోహ పడే ప్రమాదం కూడా వుంది.
‘వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య
వెంకటేశ్వర రావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.
మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో
సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో
తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట
పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ
ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య
గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే.
నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.
గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకుకుని నవ్వుకునేవారు.
(కింది ఫోటో: 1985లో మా పెద్దన్నయ్య పెద్ద కుమారుడు రఘు వివాహం, తర్వాత వ్రతం చేయిస్తున్న వెంకయ్య గారు)

