4, ఆగస్టు 2021, బుధవారం

ఢిల్లీలో ఉక్కు పిడికిలి.. కేంద్రం కదిలేనా


https://youtu.be/7NxiDn5NGiI

జర సోచో! – భండారు శ్రీనివాసరావు

 ఓ మూడేళ్ల క్రితం మా ఇంటికి చందా కట్టి తెప్పించుంటున్న ఒక  హిందూ ఆధ్యాత్మిక మాస పత్రికలో ఒక స్వామి వారు ప్రవచించిన శ్లోకం ఇది.

“అశ్వోనైవ, గజోనైవ, సింహో నైవచ నైవచ, అజాపుత్రం బలింధత్తే

దేవో దుర్బల ఘాతకా:"

గుర్రాన్ని, ఏనుగును బలి ఇవ్వరు. సింహాన్ని బలిచ్చే ఆలోచన కూడా చేయరు. కానీ మేకపిల్లను మాత్రమే బలిస్తారు. దేవతలు సైతం దుర్బలుల్నే వేధిస్తారని తాత్పర్యం.

ఇందులో కొందరికి జగన్ కనబడ్డాడు. మరి కొందరికి రాజకీయం కనబడింది. ఇంకొందరికి ఏకంగా మతమే కానవచ్చింది.

ఇలా మనం సంకుచితంగా ఆలోచిస్తూ పోతుంటే కొన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పలేము. ఒక మంచి శ్లోకాన్ని వినలేము. ఒక సుభాషితాన్ని పలకలేము.  

నేను రాస్తున్న వాటిపై కొందరుపెడుతున్న వ్యాఖ్యలు చదువుతుంటే వారి విజ్ఞానానికి జోహార్లు చెప్పాలని అనిపిస్తుంది. నా అజ్ఞానానికి సిగ్గుపడాల్సివస్తోంది. ఏదిఏమైనా ఈ వయస్సులో మరికొన్ని కొత్త అక్షరాలు దిద్దుకోవడానికి ఇది సరికొత్త "పలకాబలపం" అనిపిస్తోంది. అందరికీ ధన్యవాదాలు.

(04-08-2021)

జర్నలిష్టులతో జర జాగ్రత్త - భండారు శ్రీనివాసరావు

 

(సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు ఆర్.జే. రాజేంద్రప్రసాద్ ' డేట్ లైన్ ఆంధ్ర', 'వీచిన ప్రాంతీయ పవనాలు' అనే పేరుతొ రాసిన రెండు పుస్తకాలు, కొన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయాలను మన కళ్ళముందు వుంచుతాయి. హైదరాబాద్ హిందూ ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా, ఆ పత్రిక న్యూస్ బ్యూరో చీఫ్ గా గడించిన అనేక సంవత్సరాల అనుభవంతో రాసిన ఈ పుస్తకాల్లో ఒక నిబద్ధత కలిగిన పాత్రికేయ దృక్కోణం కానవస్తుంది. ఈ గ్రంధాలలోనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు)

డాక్టర్ చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు (కాంగ్రెస్ పార్టీలో) అసమ్మతి కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. తనను అభిమానించే అనుచరులతో తన గదిలో కూర్చుని వాళ్ళతో జోకులు వేస్తూ కాలాన్నే మరచిపోయేవారు. ఆయనను చూడడానికి వచ్చిన జనం బయట కిక్కిరిసి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి తనని చూడడానికి వస్తే ప్రధాన కార్యదర్శిని ఉడికించడానికా అన్నట్టు ఆయన్ని బయట వెయిట్ చేయించి ముందు ఆయన జూనియర్ అయిన ఉప కార్యదర్శిని లోపలకు రమ్మనేవారు.

“ 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధి అధికారంలో లేరు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐ) తన ఆర్ధిక అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లోని కాంగ్రెస్(ఐ) ప్రభుత్వాలపై ఆధారపడింది. చెన్నారెడ్డి క్రమం తప్పకుండా ఢిల్లీకి డబ్బు పంపేవారు. దీనివల్ల ఆయనకూ చెడ్డపేరు వచ్చింది. (చెడు వార్తలు రాకుండా) పత్రికలను మేనేజ్ చేసేందుకు అనేకులు రంగంలోకి దిగారు. మంత్రి సరోజినీ పుల్లారెడ్డి సచివాలయంలోని ప్రెస్ రూముకు వచ్చి’విలేకరులు క్యాంటీన్ లో డబ్బు పెట్టి కాఫీ తాగడం ఏమిటి’ అంటూ ‘విలేకరులకు రోజూ అతిధిమర్యాదలు జరగాల’ని ఆదేశించారు. (పనిచేసే) విలేకరులు సంబరపడిపోలేదు కాని, గుర్తింపు పత్రాలు వుండి యే పత్రికకు వార్తలు రాయని జర్నలిస్టులు మాత్రం మంత్రి ఔదార్యాన్ని వాడుకున్నారు.

ఇలా వుండగా ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి కారు, తోడుగా ఒక అధికారి ఇలా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే వార్త ఆదివారం నాడు ఆ పత్రికలో వస్తుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే ఆ పత్రికలో వార్త వచ్చింది. కానీ అనుకున్నట్టుగా రాలేదు. ముఖచిత్రంపై చెన్నారెడ్డి ఫోటో వేసి ‘చెన్నారెడ్డి! మోస్ట్ కరప్ట్ సీఎం!’ అని శీర్షిక పెట్టారు. వ్యాసరచయిత తాను హైదరాబాదులో విమానాశ్రయం నుంచి ఆటోరిక్షాలో ఓ మధ్యతరగతి హోటల్ కు వెళ్లానని, డ్రైవర్ మీటర్ పై అయిదు రూపాయలు అదనంగా డిమాండ్ చేసాడని, అదేమిటని అడిగితె ముఖ్యమంత్రికి తాను కమీషన్ ఇవ్వాలని చెప్పాడని పత్రికలో రాసాడు.”

 

2, ఆగస్టు 2021, సోమవారం

జల జగడం.. తేలేనా..?


https://youtu.be/-j8RRIdCjro

కలుసుకుంటే అదో సుఖము

 ఆదివారం తర్వాత ఈ రోజంతా  స్తబ్దుగా వుండిపోయాను.

నిన్న మధ్యాన్నం పరకాల సుధీర్  గారింటి లోపలకు  అడుగుపెడుతున్నప్పుడు ఎలాగో అనిపించింది. దాదాపు మూడేళ్లు కావస్తోంది నేను వేరేవారి ఇంటికి  అలా ఒంటరిగా వెళ్లి.  

ఆ సాయంత్రం పరకాల గారింటి నుంచి బయటకు వస్తుంటే మనసు ఖాళీగా అనిపించింది. అదేమిటో చిత్రం, మనసు తేలిక పడ్డట్టుగా కూడా అనిపించింది. నా మనసు ఖాళీగా అనిపించడానికి కారణం, పాత స్నేహితులం అందరం ఒక్కచోట ఇలా కలిసి అలా విడిపోవడం. మనసు తేలిక కావడానికి కారణం, ఇన్నేళ్ళ తర్వాత అందరం ఇలా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం.

మనుషులు మనుషులు కలవడం కూడా ఒక అపూర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయని ఏనాడూ అనుకోలేదు.

ముప్పయ్యేళ్ల క్రితం నేను రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో పనిచేసిన  నేవల్ కమాండర్లు సుధీర్ పరకాల, ఆయన భార్య  రమా పరకాల, దాసరి రాము, ఆయన భార్య అమ్మాజీ రాము, స్టీల్ అధారిటీ తరపున పనిచేసిన ఇంజినీర్ కే.వీ. రమణ, భార్య  త్రిలోచన రమణ, హిందూస్తాన్ ఏరో నాటిక్స్ తరపున పనిచేసిన  శ్రీధర్ కుమార్, ఆయన భార్య  విశాల శ్రీధర్ కుమార్ నిన్న స్నేహితుల దినోత్సవం రోజున సికిందరాబాదు ఆర్మీ ఏరియా దాటిన తర్వాత ఒక సివిలియన్ కాలనీలో నివాసం ఉంటున్న  పరకాల సుధీర్, రమ దంపతుల ఇంట్లో కలుసుకున్నాం. ఓ నాలుగ్గంటల పాటు సాగిన కాలక్షేప సహిత భోజన కార్యక్రమంలో పాత కబుర్లు అనేకం  కలబోసుకున్నాం.

దాదాపు రెండేళ్లుగా తెలిసిన వారితో, తెలియని వారితో ఫోన్లో మాట్లాడడం తప్ప ముఖతః మాట్లాడుకున్నది చాలా చాలా తక్కువ.

కరోనా కాలానికి ముందు, మా ఆవిడ జీవించివున్న రోజుల్లో మాస్కో మిత్రుల కలయికలు చాలా తరచుగా జరుగుతూ ఉండేవి. ఎందుకంటే వీరందరికీ, మాస్కోలో, ఇక్కడా కూడా దండలో దారంగా వుండేది  నా శ్రీమతి నిర్మల.  




(02-08-2021)

1, ఆగస్టు 2021, ఆదివారం

"మన రేడియో, మా రేడియో, నా రేడియో"

 

ఒక ఏడాది రేడియో దినోత్సవం రోజున :

అయిదేళ్ళ క్రితం కాబోలు నా మితృడు జర్నలిస్ట్ డైరీ సతీష్ రూపొందించిన వీడియోలో నేను.
'రేడియో కార్మికుడు' అని నన్ను పరిచయం చేసిన సతీష్ సహృదయతకు నా ధన్యవాదాలు.


(28) Journalist Diary Nov 12th 2013 Part 1 - YouTube