30, జులై 2021, శుక్రవారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఇంగ్లీష్  తేదీల ప్రకారం మా అమ్మగారి పుణ్య తిధి)

మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.

మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.

అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.

కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.

“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.

మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”


( 1987 నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో )

29, జులై 2021, గురువారం

పూర్తి అయిన జీవిత పదబంధం

 ఆదివారం వచ్చిందంటే మా ఆవిడకి నాలుగాటలు సినిమా చూసిన సంబరం. పదబంధాలు, గళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోతుంది, ఆదివారంనాడు  డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున తీసిన ఫోటో ఇది. పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను ఎందుకో లేచివచ్చి ఈ ఫోటో తీశాను.

అదే ఆమె ఆఖరి ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదు, నాకూ తెలియదు.

ఆ కుర్చీ ఆ టేబుల్ అలాగే వున్నాయి, ఆమె లేదు.



మూడు వారాల్లో మనుషులు ఇలా మాయం అయిపోతారా!

28, జులై 2021, బుధవారం

కేసీఆర్ వ్యూహాల వెనుక లెక్కలేంటి..? | KCR Master Plan on Huzurabad By Po...

ఈ ఆధాన్ ప్రధాన్ ఎందుకయిందంటే

‘ఎందుకండీ ఈ వెబ్ ఛానల్స్ కు ఇంతర్వ్యూలు. మీరు చెప్పినదానికి, వాళ్ళు పెట్టే హెడ్డింగులకు పొంతన వుండదు’ అని చాలా మంది హితైషుల హితవచనాలు. ఇదిగో  ఆ సమయంలో ఈ ఆధాన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇందులో నాకు కనిపించిన ప్లస్ పాయింట్లు ఏమిటంటే :

ఇది లైవ్ టెలికాస్ట్. మనం చెప్పింది చెప్పినట్టు అప్పటికప్పుడే  గాలిలో కలుస్తుంది. మధ్యలో కత్తిరింపులు, యాడింగులు గట్రా వుండవు. శీర్షికల తలనొప్పిలేదు.

చెప్పిన ప్రతి మాటకు మనమే బాధ్యులం. నేను అలా అనలేదు అని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు. అంచేత వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. అది మన మంచికేగా!

పొతే అంతా జూమ్ వ్యవహారం.  యాంకర్ ఒకచోట, మనం మన ఇంట్లో. గడపదాటి బయటకు పోనక్కరలేదు, ఈ కరోనా కాలంలో.      





26, జులై 2021, సోమవారం

సంచలనం రేపుతున్న రామోజీ లేఖ


Aadhan Media  ఛానల్  ఇంటర్వ్యూలో యాంకర్ శేషుకు ఇచ్చిన ముఖాముఖి 






https://youtu.be/SMMmxSJ8pNs

దేవుడ్ని ఒదిలేయండి! - భండారు శ్రీనివాసరావు

 బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు

'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం
'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
అలానే దేవుడు!
దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అంటారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'
దేవుడి పేరుపెట్టి మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే, చాలు మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.
'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని అన్నీ ఆయనకే ఒదిలి చాప చుట్టేయడం ఇంకా పనికి మాలిన పని.
గజేంద్ర మోక్షం పద్యాలు రాస్తున్నప్పుడు భక్త పోతన్న గారికే అనుమానం వచ్చింది, 'కలడు కలండనెడి వాడు కలడో లేడో' అని.
మనమనగానెంత?
వ్యర్దవాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ దేవుడే చూసుకుంటాడు.
అంచేత ఆయన మానాన ఆయన్ని ఒదిలేయండి.
ఎందుకంటే,
దేవుడు మనలాగా కాదు. ఆయనకి బోలెడు పనులుంటాయి.




24, జులై 2021, శనివారం

పేరెంట్స్ డే

 (ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. అందుకే అలానే ఉంచేశాను)


“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు.
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే బాధ మాత్రం మిగిలింది” అని.
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.
మన దేశంలో ఈ ఏడాది, 2021 జులైలో వచ్చే ఆఖరి ఆదివారం పేరెంట్స్ డే. అంటే జులై, 25.
“ప్రపంచవ్యాప్తంగా తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.
మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి మనల్ని మనసారా ప్రేమించేది, మనం బాగుండాలని కోరుకునేది మన తలితండ్రులు మాత్రమే.
(25-07-2021)

గుర్రం ఎగరావచ్చు.... భండారు శ్రీనివాసరావు

 కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు, ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు. వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ ఒకప్పుడు పత్రికల్లో పనిచేసిన వాడినే కనుక, నియమాలకు కట్టుబడి మాట్లాడకుండా లేచి వచ్చేశాను.

ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు సాంఘిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ‘ఎత్తిపోసి’ మరీ ప్రచురిస్తున్నారు. ట్వీట్ల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా అవి పతాక శీర్షికలలో దర్శనమిస్తున్నాయి.

కాలం తెచ్చే మార్పులముందు ఏ నియమాలూ, నిబంధనలూ నిలబడలేవేమో!