24, జులై 2021, శనివారం

గుర్రం ఎగరావచ్చు.... భండారు శ్రీనివాసరావు

 కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు, ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు. వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ ఒకప్పుడు పత్రికల్లో పనిచేసిన వాడినే కనుక, నియమాలకు కట్టుబడి మాట్లాడకుండా లేచి వచ్చేశాను.

ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు సాంఘిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ‘ఎత్తిపోసి’ మరీ ప్రచురిస్తున్నారు. ట్వీట్ల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా అవి పతాక శీర్షికలలో దర్శనమిస్తున్నాయి.

కాలం తెచ్చే మార్పులముందు ఏ నియమాలూ, నిబంధనలూ నిలబడలేవేమో!

23, జులై 2021, శుక్రవారం

ఈ సినిమాలు మీ కోసం కాదు – భండారు శ్రీనివాసరావు

 పత్రికల్లో ప్రకటనల ఖర్చు లేదు. నటీనటుల పారితోషికాల భారీ భారాలు లేవు. ధియేటర్లు దొరకవన్న బాధ లేదు. తీయడం వదలడం. అదేమిటో, కరోనా కూడా ఈ సినిమా నిర్మాణాలకు అడ్డంకి కాలేదు.  

మధ్యాన్నం భోజనం చేయగానే పిల్లలు ఆహానో ఓహోనో ఏదో ఒక ప్లాట్ ఫారం మీద ఓ ఓటీటీ సినిమా పెడతారు. ఈ సినిమాల  కోసమే పుట్టారు అన్నట్టు కొందరు గడ్డపు హీరోలు. ఒక చేతిలో సిగరెట్టూ, మరో చేతిలో మందు గ్లాసు. “ధూమపాము, మద్యపానము ఆరోగ్యానికి హానికరం” అనే  చట్టబద్ధ హెచ్చరికను సినిమా నడిచినంత సేపు వేసుకోవాల్సిన దుస్థితి. ఏమైనా సరే, హీరోయిన్ ను పెళ్ళాడడమే హీరోయిజం అనే తరహాలో ఏదో పగబట్టినట్టు ఆమెను  భౌతికంగా, మానసికంగా   హింసించడం,  పూటుగా తాగి, ఆమె ఇంటిమీదకు వెళ్లి  తలితండ్రులతో నానా గొడవ పడడం. కన్నవారిని హేళన చేయడం. ఆ హీరోకి తోడు ఓ చిన్న స్నేహితుల ముఠా. దాదాపు ప్రతి సినిమాలో ఇవే సీన్లు రిపీట్.      

ఆడపిల్లలు క్లబ్బుల్లో అర్ధరాత్రి దాకా తాగడాలు. ఆపైన వారిపై దౌర్జన్యాలు ఇవన్నీ వీటిల్లో  చూస్తుంటే కంపరంగా అనిపిస్తోంది.

వెనక అనేవాళ్ళు వివిధ భారతిలో మంచి పాటలు వినాలంటే చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక వుండాలని. ఎంతో వేచి చూస్తేనే  గాలానికి ఓ మంచి చేప పడేదిట. అలాగే  ఓపికతో వినగా వినగా రేడియోలో ఒక మంచి పాట వినబడుతుందట. ఈ ఓటీటీలో కూడా అంతే! ఎప్పుడో  ఓసారి తగులుతుంది  ఓ మంచి చిత్రం మళయాళం సినిమా డబ్బింగు రూపంలో.

ఇప్పటిదాకా  ఓ పాతిక ముప్పయి ఇలాంటి సినిమాలు చూసివుంటాను. అయితే అన్ని సినిమాలు కలిపి ఓ అరగంట కూడా చూసి ఉండను. పది నిమిషాలు చూడగానే విసుగుపుట్టి తర్వాత నా పనేదో నేను చూసుకుంటాను.

వీటిల్లో కనీసం ఓ పాతిక చిత్రాల మీద ఫేస్ బుక్ లో ఓసారి చూడొచ్చు అనే కితాబులు కనిపించాయి.

అది ఆశ్చర్యం.

‘ఈ సినిమాలు మీ తరం కోసం కాదులే అంకుల్. మీ ముందు తరం వాళ్ళు మెచ్చిన సినిమాలు మీరెన్ని చూసారు?’ అని అడిగాడు ఓ బంధువుల అబ్బాయి.

ఆ అబ్బాయి చెప్పింది మాత్రం పచ్చి నిజం.

తరం మారినప్పుడు అభిరుచులు కూడా మారతాయి.

(23-07-2021)

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు

 

(మూడేళ్ల క్రితం వారాలబ్బాయి మాదిరిగా ప్రతి రోజూ ఒక టీవీ చర్చకు పోయివచ్చే రోజుల్లోని ముచ్చట)

AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం ((23-07-2018)

 Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగేఅని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. వాళ్ళూ వీళ్ళూ కాదు,  స్వయంగా నాయకులే ఆ మాటలు  చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.

“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్నాయం చూస్తాము’ అని చెప్పి వుంటే, ప్రజలకు నచ్చచెప్పి  వుంటే, ఎవరెన్ని చెప్పినా ప్రజలు  వారి మాటనే నమ్మేవారు. ప్రజల్ని మీరు  విశ్వాసం లోకి తీసుకుంటే  వాళ్ళు  మిమ్మల్ని నమ్ముతారు.  అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. 

“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్నపాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పుడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని తెలియగానే అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”

“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు తప్పదు. కానీ, కనీసం కొంతయినా ప్రజలకోసం చేయండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

23-07-2021

Below File Photo



22, జులై 2021, గురువారం

పెగాసస్ గుర్తు చేసిన పాత పోస్టు

“మరుగేలరా ఓ రాఘవా” అని పాడుకునే రోజులకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు బస్ స్టాండ్’ అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి ఇప్పుడు (అంటే పదేళ్ల క్రితం) నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:

2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
“గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....”
“ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్ కార్డ్ నెంబర్ చెబుతారా?”
“కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
“థాంక్స్. పొతే ఫాక్ట్ చెక్ చేసుకుంటాను. దయచేసి సహకరించండి. మీ పేరు ఏకాంబర రావు. మాదాపూర్ లో మహారాజా ఛాట్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఏడాదిగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. సారీ అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్ కావడం వల్ల కేబుల్ షార్టేజ్ కారణంగా ఇంకా షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం ,మీ మొబైల్ నెంబరు 9999898889. ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
“నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలావున్నాయి?”
“సిష్టంతో కనెక్ట్ అయివున్నాం సర్”
“సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...”
“వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.”
“ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
“యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా పన్నెండు వందలు”
“కార్డు మీద పే చెయ్యవచ్చా?”
“తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్! కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగాలేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు. హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్ మాత్రమే కట్టాల్సి వుంటుంది”
“ ఓ షిట్! ************”
“సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.”
“ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”
“అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి ఏమిటి తల్లి! బల్లి లాగా...”
ఇవతల వ్యక్తి పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు.

21, జులై 2021, బుధవారం

దేవుడు ఫేస్ బుక్ చదువుతాడా!

చదువుతాడనిపిస్తోంది నా వరకు.

రెండేళ్ల క్రితం, అంటే 2019లో ఇదే రోజున ఈ కింది పోస్టు పెట్టాను, దేవుడి ప్రస్తావనతో. అంతే!
నెల తిరగకుండానే నా తిక్క కుదురుస్తూ, మా ఆవిడని తీసుకువెళ్ళిపోయాడు.
పెళ్ళికి పూర్వం తర్వాత – నేనూ మా ఆవిడ
పెళ్లి కాక ముందు నేను వీర దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి. పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో పని చేసేవాడిని కాను.
పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు. తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.
అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని నేను ఆయనపై శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.
ఇప్పుడు ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.
ఎవరి గోల వారిది.



(21-07-2019)

20, జులై 2021, మంగళవారం

ఇదో రకం తుత్తి

 అప్పుడప్పుడు ఇలా కూడా అభిప్రాయం అడిగి తీసుకుని అచ్చులో నా పేరు వేస్తుంటారు. అదో తుత్తి. థాంక్స్ రిషిక

LINK to PRINT


https://theprint.in/politics/how-congress-became-irrelevant-in-andhra-pradesh-in-a-span-of-just-7-years/698407/

ప్రజాసేవ

 ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:

“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”

విలేకరి:

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో  రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

విలేకరి:

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధం పర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.