6, జులై 2021, మంగళవారం

అందరూ అత్తలే - భండారు శ్రీనివాసరావు

 అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -

సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.

ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.

'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.

అప్పుడెప్పుడో  ఓసారి రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.

అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది. అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?

వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.

ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని. 

5, జులై 2021, సోమవారం

దేవుడనేవాడున్నాడా ?

 నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే.

దేవుడ్ని నమ్మని ఈ చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు.

లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. సామాన్య ప్రజల్లో కొన్ని అనుమానాలు వుంటాయి. ఉదాహరణకు భగవంతుడికి పెట్టే ప్రసాదం ఆయన ఎప్పుడన్నా తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, ఈ లోకాయతులు ఆనాటి ఆధ్యాత్మిక వాదుల తిరస్కరణకు గురయ్యారు. నమ్మకానికీ,అపనమ్మకానికీ ఇది అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ లోకాయతులు దేవుడ్ని నమ్మరు. ఆత్మను, పునర్జన్మలను విశ్వసించరు. ఒక రకంగా అది వారి నమ్మకం.

ఈనాటి చర్చల్లో ఒక కులానికి సంబంధించిన అనవసర ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తోంది. లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన చార్వాకుడు ఒక బ్రాహ్మణుడు. మరో చిత్రం ఏమిటంటే చార్వాక వధకు పూనుకున్నవారు కూడా బ్రాహ్మణులే.

మహాభారతం’లోని శాంతిపర్వంలో ఈ చార్వాక వధ గురించిన ప్రస్తావన వుంది.

కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలాదిమంది బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి జమవుతారు. వారితో కలిసివచ్చిన చార్వాకుడు ధర్మజుడితో వాగ్వాదానికి దిగుతాడు. ‘యుద్హంలో అనేకమంది బంధు మిత్రుల మరణానికి నువ్వే కారకుడివి. ఇంత చేసి నీవు సాధించింది ఏమిటి? నువ్వు బతికి ఉండడానికి వీల్లేదు’ అంటూ గద్దిస్తున్న చార్వాకుడిని చూసి ధర్మరాజు ఖిన్నుడై బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరుణంలో తెప్పరిల్లిన మిగిలిన బ్రాహ్మణులు, చార్వాకుడు తమ ప్రతినిధి కాదని ధర్మరాజుకు నచ్చచెప్పి, ఆ కోపంలో చార్వాకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి అతడిని వధిస్తారు. చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.

అలా చార్వాకుడి నుంచి ఈ నాటి దాకా పురాణాలను అధిక్షేపించిన అనేకమంది మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. అయినా వాటిపట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న భక్తి శ్రద్ధలు ఏమీ చెరిగిపోలేదు.

ఒక్క మనదేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఇలా దేవుడ్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ ఇలాటి సంఘర్షణలు జరుగుతూ వస్తూనే వున్నాయి. దేవుడనేది ఒక నమ్మకం. అలా నమ్మేవారి నమ్మకాన్ని శంకించాల్సిన పనిలేదు. దేవుడ్ని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే. ఎవరి నమ్మకం వారిది. నమ్మకం మూఢనమ్మకంగా మారనంతవరకు వచ్చిన నష్టం ఏమీ లేదు.

ఒక సినిమా నటుడ్ని గురించి ఒకింత నిరసనగా మాట్లాడితేనే తట్టుకోలేని అభిమానుల నడుమ జీవిస్తున్నాం. మరి కోట్లాదిమంది అనునిత్యం దేవుడిగా పూజించే పురాణ పురుషులను గురించి ఎగతాళిగా మాట్లాడితే ......

రాముడు దేవుడు కాదని మీ నమ్మకమైతే దాన్ని నమ్మేవారితో పంచుకోండి. దేవుడిని నమ్మేవారితో మీకు పేచీలు ఎందుకు?

 

4, జులై 2021, ఆదివారం

మందు ఎక్కడ దొరుకుతుంది ?

 

డాట్టరు గారూ! మీ ఫీజు సరే కానీ మీరు రాసిన ఈ మందులు ఎక్కడ దొరుకుతాయండీ?”

అదే మరి కాలేది. అవతల అంత మంది పేషెంట్లు వుంటే ఏవిటీ చచ్చు, చొప్పదంటు ప్రశ్న?”

అలా కోపం చేసుకోకండి. మీరు పెద్దమనసుతో వింటానంటే చెబుతా!”

అదేదో తొందరగా చెప్పి ఏడవ్వయ్యా మగడా!”

మొన్నీమధ్య మా చిన బామ్మర్దిగాడి మూడో బామ్మర్ధికి ఒంట్లో నలతగా వుంటే మీ దగ్గరికే పంపించాకదండీ. మీరేమో మంచిగా చూసి మాత్తర్లు అవీ రాసిచ్చారు కదండీ. ఆడేమో ఆ చీటీ అట్టుకుని వూళ్ళో సగం మందుల షాపులు చుట్టేశాడండీ! కానేమోనండీ ఒక్క చోట దొరికితే ఒట్టండీ. ఒకడేమో అదే మందు గోలీలు వేరే కంపెనీవి వున్నాయంటాడు. మీరు కోప్పడతారనుకుని వేరే షాపుకు వెళ్ళాడండీ. ఆడేమో వందా నూటయాభయ్యా అని అడిగాడుటండీ. వందలూ, ఏలూ మాత్తర్లు నాకెందుకయ్యా, నీలాగా దుకాణం వుందనుకున్నావా అన్నాట్ట మా వోడు. దుకాణపోడు పెద్దగా నవ్వి, అదికాదయ్యా బాబూ పవరు, మాత్తర్ల పవరు యెంత నూరా నూట యాభయ్ ఎంజీలా’ అని అడిగాట్ట. ‘ఆ పవర్లు మీ డాట్టారు రాయలేదు ముందు పోయి కనుక్కో. తర్వాత వచ్చి మందు కొనుక్కో’ అన్నాట్టండీ. ఫీజు వంద అంటే ఇచ్చాము కానీ ఈ మాత్తర్లకు కూడా ఇంత ఇసయం వుందా అని మా ఓడు తెగ మనాది పడిపోయి, ఆ మాత్తర్ల కోసం తిరిగి తిరిగి చివరికి కొననేలేదు. వాడనేలేదు. కానండీ, డాట్టరు బాబూ, మీ చేయి వాసి మహా గొప్పది కదండీ, అంచేతండీ, ఆడికండీ జరం చేత్తో తీసేసినట్టు తగ్గిపోయిందండీ! ఏ గోలీ వేయకుండానే

3, జులై 2021, శనివారం

లాకేత్వం ద క్కొమ్ము - భండారు శ్రీనివాసరావు

 ‘ఆయన దగ్గరకు సాయానికి వెళ్ళకు, లాకేత్వం, దక్కొమ్ము బాపతు’ అనే వాళ్ళు మా చిన్నప్పుడు.

కాస్త పెద్దయిన తరవాత కానీ అందులోని అర్ధం బోధపడలేదు.
అంటే ఏమీ లేదు. లేదనే.
‘లా’ కు ఏత్వంఅంటే ‘లే’, ‘ద’ కు కొమ్మంటే ‘దు’. ‘లేదు’.
లేదు, కాదు అనేవాడి దగ్గరికి పోయి ఏం లాభం అని ప్రతిపదార్ధ తాత్పర్యం.
మరి అడగందే అమ్మయినా పెట్టదంటారు. అటువంటప్పుడు అడక్కపోతే ఎలా అని లా పాయింటు తీసేవాళ్ళు వున్నారు.
నిజమే. పని వున్నప్పుడు ఆ పని చేసిపెట్టేవాడిని అడగాలి.
అయితే కొన్ని చేసే పనులు వుంటాయి. కొన్ని కాని పనులు వుంటాయి. మరికొన్ని ‘కాని’ పనులూ వుంటాయి. అంటే, చేయకూడనివి, చేయరానివి అని అర్ధం.
కొందరు చేయగలిగిన చేవ కలిగిన వాళ్ళుంటారు. కొందరు చేయలేకపోయినా ఆ చేవకు కొదవుండదు.
కొందరు చేయగలరు. కానీ చేసే చొరవ, చేవా రెండూ వుండవు.
మరికొందరు చేయలేరు, కానీ పనులు చేయించే చొరవ, చేవ రెండూ పుష్కలం.
ఇక చేయగలిగీ చేయను అనే మొండి రకం, చేయలేను, నా వల్ల కాదు అని మర్యాదగా తప్పుకునే రకం కూడా తారసపడుతుంటారు.
చేస్తాను, చెప్పండి అదెంత పనంటూ చిటికెలు వేసి పని కాకపోవడానికి కారణం ఆయన మాత్రం కాదని మనచేతనే నమ్మించే మనుషులూ మన మధ్యనే వుంటారు.
ఒకర్ని అపర శ్రీరామచంద్రులు, నిప్పులాంటి వాళ్ళు, నిజాయితీకి నిలుటద్దాలు అంటాము.
ఇంకొకర్ని సమర్ధ రామదాసులు అని పిలుస్తాము.
మొదటి వారిని బయట వాళ్ళు మెచ్చుకుంటే ఇంట్లోవాళ్ళు పనికిరాని రకంగా లెక్క గడతారు.
రెండో రకం వారిని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే, పనులు చేయించుకున్న తరువాత బయట వాళ్ళు, ‘ఒట్టి లంచావతారం’ అనే పేరు పెట్టేస్తారు.
ఈ మధ్య ఇంకో థియరీ వినబడుతోంది.
‘లేదు, నా వల్ల కాదు’ అని ఆదిలోనే అంత్య నిష్టూరపు బాణీ ఎత్తుకోవాలని మేనేజిమెంటు పాఠాల్లో మొదటే చెబుతారని విన్నాను.
‘నో’ చెప్పగలిగిన వాడు సిబ్బంది చేత పనులు బాగా చేయిస్తాడని అదో నమ్మకం.
‘చచ్చినా సెలవు ఇవ్వను’, ‘అరిచి గీ పెట్టినా జీతం పెంచను’, బహుశా ఇలాంటి ‘నో’లు కాబోలు.
సరే! ఇది ఇలా ఒదిలేద్దాం.
ఒక్కటి మాత్రం నిజం.
‘నో’ చెప్పిన వాడ్ని మిత్రుల జాబితా నుంచి తొలగించడం అంటే మన స్నేహంలోనే ఏదో స్వార్ధం వుందనుకోవాలి.

2, జులై 2021, శుక్రవారం

ఆత్మ విశ్వాసం

 ఏకాంబరరానికి దిక్కు తోచడం లేదు. వున్నదంతా వ్యాపారంలో పెట్టాడు. కాలం కలిసిరాలేదు. లాభాలమాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబళ్ళు కూడా  వెనక్కి రాలేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫోను మోగితే అప్పులవాళ్లేమో అని భయం. తలుపు తడితే తీయడానికి సంకోచం, అప్పిచ్చిన వాళ్లు ఏకంగా ఇంటి మీదికే వచ్చేరేమో అని. ఒక్కోసారి ఆర్ధిక  ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా మదిలో మెదిలేది.

దిక్కు తోచని ఏకాంబరం ఓ రోజు మధ్యాన్నం నిర్మానుష్యంగా పార్కుకు వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. మొహం చూస్తే ఎక్కడో చూసిన మొహమే అనిపించేలా వుంది.  సూటూ బూటూ డబ్బున్న వాడి మాదిరిగానే కనిపించాడు. ఆ వచ్చిన వాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏకాంబరానికి అతడెవరో తెలియగానే మతి పోయింది. ఆ వృద్ధుడు ఆ వూర్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే అత్యంత ధనికుడు. దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు వున్నాయి. అతడిలా అన్నాడు.

'చూడండి. మీరేదో ఇబ్బందుల్లో వున్నట్టున్నారు. ఆర్ధిక సమస్య అయితే నాకు ఒదిలేయండి' అంటూ మాట్లాడుతూనే జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి చెక్కుపై సంతకం చేసి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. 'సరిగ్గా ఏడాది తరువాత ఇదే పార్కులో కలుద్దాం. వడ్డీ అవసరం లేదు కాని అసలు మాత్రం ఇవ్వండి చాలు'

చెక్కు చేతిలో పెట్టి అతడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

తీసి చూస్తే పాతిక లక్షలకు రాసిన చెక్కు అది. అప్పులు తీర్చగా  ఇంకా కొంత మిగులుతుంది కూడా. ఏదయితేనేం భగవంతుడు,  వృద్ధుడి రూపంలో వచ్చి  తనకో దారి చూపించాడు.

ఇంటికి వెడుతూ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో అతడికి మరో ఆలోచన వచ్చింది. పాతిక లక్షల చెక్కు. అదీ దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడు ఇచ్చిన చెక్కు. అది తన జేబులో వుంది. ఇక దేనికీ భయపడాల్సిన పనిలేదు. ముందు వ్యాపారవ్యవహారాలు చక్కదిద్దాలి. ఎటొచ్చి ఎటు పోయినా రామబాణం వంటి చెక్కు తన దగ్గరే  వుంది.

ఆ వూహ అతడిలో ఆత్మ విశ్వాసం నింపింది. ఇక ఆ రోజు నుంచి అతడి తరహా తీరు పూర్తిగా  మారిపోయాయి. చెక్కు ఇచ్చిన ఆత్మ బలంతో అతడు ముందుకు అడుగులు వేసాడు. వెనుకటి ఆత్మన్యూనతా భావం మచ్చుకు కూడా కానరాకుండా పోయింది. ఆత్మవిశ్వాసంతో సాగించిన  అతడి వ్యాపారానికి కూడా తిరుగు లేకుండా పోయింది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చాడు.

చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగింది. వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెక్కు తీసుకుని అదే పార్కుకు వెళ్ళి అదే బెంచీ మీద కూర్చుని ఎదురుచూడ్డం మొదలు పెట్టాడు. అనుకున్నట్టే వృద్ధుడు వచ్చాడు. 'మిత్రమా యెలా వున్నావు? కులాసాయేనా'  అని కుశల ప్రశ్నలు వేసాడు. 'మీ దయవల్ల బాగున్నాను. పోతే, మీ చెక్కు ఉపయోగించుకునే అవసరం పడలేదు' అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టి దణ్ణం పెట్టాడు ఏకాంబరం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు మగ నర్సులు వచ్చారు. 'ఇక్కడ వున్నావా మహా ప్రభూ! నీకోసం ఆసుపత్రి అంతా వెతుకుతున్నాం' అంటూ  ఏకాంబరం వైపు చూసి చెప్పారు. 'నేను పలానా పలానా. గొప్ప ధనికుడ్ని. డబ్బేమన్నా కావాలా అని అడిగాడా! అడిగేవుంటాడు. అతడికి ఇది మామూలే. ఎందుకంటే  ఇది మామూలు పిచ్చి కాదు' అంటూ ఆ వృద్ధుడిని బలవంతాన తీసుకుపోయారు.

ఏకాంబరం నివ్వెరపోయాడు. ఎంతో ధనికుడు అనుకున్న ఇతడు పిచ్చివాడా. అతడిచ్చింది చెల్లని చెక్కా!'

కానీ ఆ తరువాత ఆలోచిస్తే ఆ పిచ్చివాడి రూపంలో అతడికో జీవిత సత్యం బోధపడింది.

ఆ చెక్కు వుందన్న భరోసాతో అతడు వ్యాపారంలో ముందుకు సాగాడు. 'అవసరం అయినప్పుడు అదే ఆదుకుంటుంది' అన్న 'నమ్మకం' అతడ్ని ముందుకు నడిపించింది. ఆ ఆత్మ విశ్వాసం ఎంతో కలిసివచ్చింది. పట్టింది బంగారం అయ్యింది. అప్పుడే ఆ చెక్కు బ్యాంకులో వేసి వుంటే అసలు విషయం తెలిసిపోయేది. కధ అక్కడే పూర్తిగా ఆగిపోయేది.

భగవంతుడు కూడా అలాటి భరోసానే. ప్రతిదానికీ దేవుడ్ని వాడుకోవాలని చూడకుండా ఆయన మన వెంటే వున్నాడనే నమ్మకంతో ముందుకు వెడితే అంతా బాగుంటుంది. మనిషి కృషికి దేవుడు అనబడే ఓ కానరాని అదృశ్య శక్తి అండ ఎప్పుడూ  వుంటుంది.

NOTE: పైన కధకి, కింద ఫోటోకి సంబంధం ఏమిటి అనే సందేహానికి నా సమాధానం. Adsense ద్వారా వచ్చే ఆదాయం అంత త్వరగా పెరగదు. సింగిల్ డిజిట్ నుంచి వంద దాటేవరకూ ఎలాంటి పేమెంట్లు ఉండవని ఒక అనుభవశాలి చెప్పారు. చూద్దాం. ఇప్పుడు కాకపొతే, రేపు, రేపు కాకపొతే మరో రోజు. కధలో చెప్పిన ఆత్మ విశ్వాసం వుంటే సాధించడం తేలిక కాకపోయినా మరీ అంత కష్టం కూడా కాదేమో!



 

Senior Journalist Bhandaru Srinivasa Rao Analysis on Telugu States Water dispute ...

1, జులై 2021, గురువారం

అన్నం పెట్టే చేతికి చేయూత –భండారు శ్రీనివాసరావు

(ఈరోజు రైతు దినోత్సవం)


రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి. కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి. ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు. ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు, వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’ రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!
ప్రభుత్వాలూ! ఆలోచించండి!