2, జూన్ 2021, బుధవారం

రామోజీ గారి నుంచి ఫోను

 

2018లో ఓరోజు ఉదయం టీవీ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తరువాత వాట్సప్ కాల్ ఫ్లాష్ వెలిగింది. రామోజీరావు గారి ఫోటో. ఆశ్చర్యపోతూనే కాల్ రిసీవ్ చేసుకున్నా.

ఆప్యాయంగా పలకరిస్తూ భగీరధ గొంతు. భగీరధ సీనియర్ ఫిలిం జర్నలిస్టు. నలభయ్ ఏళ్ళకు పూర్వం మేము చిక్కడపల్లిలో ఉంటున్నప్పటి నుంచీ పరిచయం. నాలాగే ఆంద్ర జ్యోతి ప్రొడక్ట్. చాలా పుస్తకాలు రాసారు. ప్రత్యేకంగా పనికట్టుకుని మా ఇంటికి వచ్చి మరీ ఇచ్చి వెడుతుంటారు. అది ఆయన సహృదయత.

చంద్రబాబు, కేసీఆర్ నాలుగేళ్ల పాలన గురించి నేను రాసిన వ్యాసాలను ఆయన ప్రస్తావించారు. ‘మీరు మళ్ళీ ఇల్లు మారారట కదా! అడ్రసు చెప్పండి, నా కొత్త పుస్తకం ఒకటి మీకివ్వాలి’ అన్నారు భగీరధ. చెప్పాను. ఎందుకంటే పుస్తకం అంటే నాకు ప్రాణం. మనకు ఇష్టం ఉన్న రాత అయితే ఎంచక్కా చివరిదాకా చదువుకోవచ్చు. నచ్చలేదనుకోండి, పక్కన పడేయొచ్చు. అదే సంభాషణ అయితే.... ఇష్టం లేకపోతే ఎక్కడిదాకా సాగుతుందో మాట్లాడే ఇద్దరికీ తెలవదు. అందుకే పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు ఉండడు అంటారు.

ఫోను పెట్టేసే ముందు మనసులో తొలుస్తున్న అనుమానాన్ని బయట పెట్టాను, ఈ రామోజీగారి ఫోటో సంగతేమిటని. మంచి మితృడు కనుక భేషజం లేకుండా సమాధానం చెప్పాడు భగీరధ.

“అదా! ఒకసారి నేను ఆయనతో కలిసి దిగిన ఫోటో. మీఫోన్లో ఆయన ఫోటో వరకే డిస్ ప్లే అయినట్టుంది”

1, జూన్ 2021, మంగళవారం

మరణించే హక్కు

 హిందూ దినపత్రికలో వచ్చిన వార్త ఇది. అంచేత ఉత్ప్రేక్షలకు అవకాశం ఉండకపోవచ్చు.

ఈ పత్రిక రాసిన దాని ప్రకారం, చిత్తూరు జల్లా లోని ఒక పేద కుటుంబానికి ఎక్కడలేని కష్టం వచ్చి పడింది. అయిదేళ్ళ బాలుడికి బోన్ కేన్సర్. ఎక్కడలేని డబ్బు నయం కాని ఆ వ్యాధికి ఖర్చు చేస్తూ ఆర్ధికంగా, మానసికంగా చితికిపోయారు. దానితో తమ కుమారుడికి మరణం ప్రసాదించి అతడు పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయాల్సిందని పుంగనూరు కోర్టు తలుపు తట్టారు. కోర్టు వారి కేసు విచారించి అప్పీలును త్రోసిపుచ్చింది. కాకపోతే ఆ కేసును జిల్లా అధికార యంత్రాంగానికి నివేదించింది. ఇది ఇలా సాగుతుండగానే ఆ పిల్లవాడు గత ఆదివారం రాత్రి మరణించాడు.
అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.
‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.
ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణభీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.
జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు మనిషిని వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.
కొందరి మరణాలు కళ్ళారా చూసినప్పుడు ఇటువంటి చావు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. కొందరు అత్యంత సునాయాసంగా జీవితాన్ని చాలించినప్పుడు ఇలాంటి మరణం సిద్ధిస్తే యెంత బాగుండు అని వయసు పైపడినవారు అనుకోవడం కద్దు.
‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు కావాలి. శతమానం భవతి అంటూ నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.
పొద్దునపొద్దున్నే ఈ వేదాంతపు కబుర్లు చెప్పుకోవడానికి ‘యూధనేసియా’ అనే గ్రీకు పదం కారణం. దీనికి తెలుగు మీడియా చేస్తున్నసమానార్ధక అనువాదం ‘కారుణ్య మరణం’.
ఒక వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతూ తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు ‘కారుణ్య మరణం ఎంచుకునే అవకాశం అతగాడికి వుండాలనేది ఒక వాదన. వెంటిలేటర్ల వంటి కృత్రిమ వ్యవస్థల ద్వారా అతడి ఆయుర్దాయాన్ని కొంత కాలం పెంచడానికి ఆధునిక వైద్యం ఉపకరించవచ్చు కానీ, తద్వారా ఆ రోగి శారీరక బాధను కూడా పొడిగించినట్టే అవుతుంది. కాబట్టి, కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్ చాలాకాలంగా వినబడుతోంది. జీవించే హక్కులో, గౌరవంగా మరణించే హక్కు కూడా మిళితమై వుంటుంది కనుక, నయం కాని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి కారుణ్య మరణాలను ప్రసాదించే విధంగా చట్టాలు చేయాలనీ కొన్ని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.
కారుణ్య మరణాలపై దేశ వ్యాప్తంగా చాలా ఏళ్ళుగా చర్చ సాగుతూనే వుంది. వీటిపై అనేక వార్తా కధనాలతో పాటు, ఈ కధాంశంతో కొన్ని నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. కొన్నేళ్ళ క్రితం మరణించిన అరుణా షాన్ బాగ్ అనే మహిళ దీన గాధను కారుణ్య మరణాలను చట్టబద్ధం చేయాలనే వారు ఉదహరిస్తుంటారు. చిన్నవయస్సులోనే దారుణమైన లైంగిక అత్యాచారానికి గురై నలభై రెండేళ్ళ పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవచ్చంలా బతికి కన్నుమూసిన ఈ మహిళ తరపున జరిగిన న్యాయపోరాటం యావత్తు ఈ కారుణ్య మరణాలకు సంబంధించినదే.
సీవీ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే మాదిరి సిఫారసు చేసింది. అరుణా షాన్ బాగ్ అనే ఆ నర్సు మాదిరిగా జీవచ్చవంలా బతుకు ఈడ్చే స్థితికి చేరుకున్నవారికి, కోమాలోకి వెళ్ళిపోయి, తిరిగి ఎంతమాత్రం స్పృహలోకి వచ్చే అవకాశం లేదని నిర్ధారణ అయిన రోగులకి, కారుణ్య మరణం ఎంచుకునే వీలు కల్పించాలని అప్పట్లోనే లా కమిషన్ సూచించింది.
ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.
సరే ఈ విషయం పక్కనబెట్టి అసలు కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వడం వల్ల లాభనష్టాలు గురించి ఆలోచిద్దాము. మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు ఇది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో మంచానికి బందీగా మారి కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ కారుణ్య మరణం అనేది ఒక విముక్త మార్గంగా కనిపించవచ్చు.
అయితే కారుణ్య మరణాలకు చట్టబద్ధత కల్పించడం వల్ల సమాజంలో కొంతమందికి మాత్రమే ఊరట. అదెలా అంటే:
పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంతతత్వం మరింత పెరుగుతూ వుంటుంది. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా మానవ మనస్తత్వం ఈ విధంగానే ఆలోచిస్తూ వుంటుంది అనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్ ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారకుండా వుండే విషం కోసం అన్వేషించి ఒక రకం సర్పాన్ని అందుకోసం ఎంపికచేసుకుంటుంది. చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై, ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.
పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం అందరికీ దక్కదు.
శరీరం రోగగ్రస్తమై, నివారణ కరువై, అహరహం చావుకోసం చకోరపక్షుల వలె కన్నుల్లో వత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూసేవారికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న, కోర్టులు పరిశీలిస్తున్న ‘యుధనేసియా’ అంటే సునాయాస మరణ ప్రాప్తి అనేది నిజంగా వరమే.
ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం. ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది గొంతెమ్మ కోరికే. అయినా ఆలోచించాల్సిన విషయం.

ఉపశ్రుతి: మా చుట్టం ఒకరు బీ ఎస్ ఎన్ ఎల్ లో అధికారిగా పనిచేస్తున్నారు. వయసు 57. ఆఫీసులో పై అధికారి సిబ్బందికి ఇచ్చిన లంచ్ మీటింగ్ కు హాజరై ఇంటికి వచ్చారు. దుస్తులు మార్చుకుని వచ్చి టీ తాగుతూ అలాగే పక్కకి ఒరిగిపోయారు. మాసివ్ హార్ట్ అటాక్. అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా లేవు. అయినా కూడా ఆయన జీవన యానం అలా హాయిగా, ప్రశాంతంగా ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని అరుదయిన అవకాశం.
సాధ్యం కాదని తెలిసినా వయసుమళ్ళిన వాళ్ళలో చాలామంది కోరుకునేది ఇదే.
ముఖ్యంగా కరోనా కాలంలో.
(01-06-2021)

ఎస్వీ ప్రసాద్ గారి సంస్మరణలో – భండారు శ్రీనివాసరావు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో శ్రీ ఎస్వీ ప్రసాద్ ఏకబిగిన దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు.
ఆ తర్వాత జరిగిన అంటే 2004 ఎన్నికల తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన అధికారులకి స్థానచలనం జరగడం ఆనవాయితీ.
ఎస్వీ ప్రసాద్ నిబద్దత, నిజాయితీల మీద వై.ఎస్.ఆర్. కి ఉన్న నమ్మకం చేత, ఆయన్ని పిలిచి ఆయన కోరుకున్న పోస్టు ఇవ్వాలని సంకల్పించారు. కానీ ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమైన, కీలకమైన పోస్టులు కోరుకోలేదు. చాలా ఏళ్ళుగా విశ్రాంతి ఎరగకుండా పనిచేయడం వల్ల కావచ్చు, పనిభారం కొంత తేలికగా వుండే అప్రధాన పోస్టుని ఏరికోరి వేయించుకున్నారు. అదేమిటంటే – Environment Protection Training and Research Institute (EPTRI). అది హైదరాబాదులోనే వుంది కాని అలాంటి సంస్థ ఒకటి వుందని చాలా మందికి తెలియదు. అక్కడ డైరెక్టర్ గా ఆరు నెలలు కూడా పనిచేశారో లేదో తెలియదు, వై.ఎస్. ఆయన్ని అతి కీలకమైన పోస్టుకి ఎంపిక చేశారు. ఎస్వీ ప్రసాద్ గారెని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఇదేమిటి అని సొంత పార్టీ వాళ్ళు అడిగితె అది అంతే అని వై.ఎస్. జవాబు. తనకు అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినా, రాజకీయాల్లో సుదీర్ఘ కాలం వుండడం చేత ఐ.ఏ.ఎస్. అధికారుల పనితీరు తనకు కరతలామలకం అని చెప్పేవారు. ఎవరో ఒకరిద్దరు తప్ప సాధారణంగా చాలా మంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు Loyal to their duty అనేది ఆయన అభిప్రాయం. దీన్నే కొందరు Loyal to CM అని అన్వయించి చెబుతారు.
ఆయన సీఎం పేషీలో వుండడం వల్ల ఐ.ఏ.ఎస్. అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయంతో చక్కటి సమన్వయం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయాలు సత్వరంగా అమలు జరగాలంటే ఇలాంటి సమన్వయాన్ని అధికారులు కోరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయ పడ్డారు.
అనేకమంది, అదీ పరస్పర విరుద్ధమైన పార్టీల ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా పనిచేసే అవకాశం ఎస్వీ ప్రసాద్ గారెకి లభించింది. కత్తి మీది సాము లాంటి వ్యవహారాలను ముఖ్యమంత్రికి మాట రాకుండా, తను మాట పడకుండా చక్కబెట్టే చాణక్యం ఉంటేనే కాని ఇది సాధ్యపడదు.
కరోనా కారణంగా, అంత మంచి అధికారికి నూరేళ్లు నిండడం విషాదం.

(01-06-2021)

కింది ఫోటో:
1973 లో ఐ.ఏ.ఎస్. సహచరులతో ఢిల్లీలో దిగిన ఫోటో. కుడి వైపు చివర శ్రీ ఎస్వీ ప్రసాద్
May be an image of one or more people and people standing

చిరునవ్వుల ఐ.ఏ.ఎస్. ఎస్వీ ప్రసాద్ ఇక లేరు

 

మొన్నే ఓ మిత్రుడు ఫోన్ చేసి ప్రసాద్ గారు కరోనాతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి బాగాలేదు అంటున్నారు అని చెప్పాడు. పోలేని పరిస్థితి. నా దగ్గర వున్న ఫోన్ నెంబరుకు ఓ మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ అని. చూసి వుండరు. ఈ ఉదయం కన్ను మూశారు అని వార్త. ఎప్పుడూ చెదరని నవ్వు మొహంతో వుండే ఎస్వీ ప్రసాద్ గారు ఇక లేరు అని తలచుకుంటే చాలా బాధ వేస్తుంది.
అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ఒక్క మాట కూడా పడకుండా నెట్టుకు రావడం అంటే ఆషామాషీ కాదు. విజయభాస్కర రెడ్డి, ఎన్టీఆర్, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా అందరి చేతా సెహబాష్ అనిపించుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత విజిలెన్స్ కమిషనర్ గా చాలా కాలం పనిచేశారు.
గోటేటి రామచంద్రరావు గారి ఇంట్లో జరిగిన ఓ పెళ్ళిలో కలుసుకోవడమే ఆఖరి సారి.
వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను



(శ్రీ ఎస్వీ ప్రసాద్ IAS)


(01-06-2021)

30, మే 2021, ఆదివారం

సంక్షేమానికి పెద్దపీట జగన్ రెండేళ్ళ పాలన

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.


అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో జగన్ మోహన రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెప్పుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు. ఇది తప్పా ఒప్పా అంటే జవాబు వుండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రభుత్వాలను ఎలా తప్పు పట్టగలం? అలా అని,  అవే సర్వస్వంగా భావించి మిగిలిన అవసరాలను పక్కన పెడుతూ పొతే అభివృద్ది కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ఖజానాలో మిగిలే మొత్తమెంత? అభివృద్ధి లేని సంక్షేమం వల్ల రాష్ట్ర పురోభివృద్ధి ఎలా సాధ్యం? 

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉన్నప్పటికీ నైతిక బాధ్యత మాత్రం లేదు. కారణం ప్రజలు ఆయన పెట్టుకున్న  ప్రాధాన్యతలు  గుర్తెరిగి, ఏరికోరి మరీ అధికారం ఒప్పచెప్పారు.


ప్రతి ప్రజాప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటుంది. అలా ఏర్పరచుకున్న ప్రాధాన్యతల ప్రకారం తనకు తాను దిశానిర్దేశం చేసుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇందుకు మినహాయింపు కాదు.


అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడ అంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు అన్వయం చెప్పుకోవడంలో ఎవరి పద్దతులు వారికి వున్నాయి. ఒకరి భాష్యాన్ని మరొకరు అంగీకరించరు.

‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమ్’ అని ఆనాడు ఎన్టీ రామారావు బహిరంగంగా ప్రకటించేవారు. అలా అమల్లోకి వచ్చినవే రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పధకాలు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సుదీర్ఘ కాలంలో పాలన కొత్త పుంతలు తొక్కింది. ఒక యువ ముఖ్యమంత్రిగా ఆనాడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుని యువతరానికి ఒక ఆశాదీపికగా మారారు. ఇప్పటికీ వారిలో ఆ ఆరాధనా భావం చెక్కుచెదరకుండా వుంది.

ఆయన పరిపాలన ఫలితాలను, ఆయన ప్రాధాన్యతలను  ప్రజల్లో కొన్ని వయసుల వాళ్ళు, ముఖ్యంగా  యువకులు, మధ్య తరగతి, ప్రైవేటు ఉద్యోగ వర్గాల వాళ్ళు గుర్తించి గౌరవించారు. అభిమానించారు. ఇంకా ఆయనపట్ల వారిలో ఇలా పెంచుకున్న ఆరాధనా భావం అలాగే వుంది. అయితే ఆయనకు మాత్రం  రాజకీయంగా అచ్చిరాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేసిన ఆయన కృషిని మునిసిపల్ ఎన్నికలలో ప్రజలు గుర్తించలేదని ఆయనే బాధ పడ్డారు. అభివృద్ధి అంటే పైకి కానవచ్చే రోడ్లు, సుందరమైన భవనాలు కాదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. భుజానికి ఓ కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుంటే చాలు, ముఖ్యమంత్రిని సులభంగా కలవచ్చు అని ఎద్దేవా చేసాయి కూడా. ఆ అపప్రథ తొలగించుకోవడానికి ఆయన  2014 ఎన్నికలకు ముందు ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  

ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాలి అంటే సంక్షేమమే తారకమంత్రం అని రాజకీయనాయకులు  నమ్మే పరిస్థితి వచ్చింది. దాంతో తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో సాధ్యమైనన్ని తాయిలాలను దట్టించి వదలాల్సిన అవసరాన్ని అన్ని పార్టీలు దేశ వ్యాప్తంగా గుర్తించి అందుకు అనువైన పధకాలను ఆకర్షణీయమైన పేర్లతో రూపొందించే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు’ పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా అటువంటిదే. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2019 లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

జగన్ ఆ ఏడాది మే ముప్పయ్యవ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.  పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నవరత్నాలు హామీ ఆయన విజయానికి చాలావరకు దోహదం చేసివుండవచ్చు.  అయితే ఎన్నికల్లో జయాపజయాలకు సంక్షేమ పధకాలు అనే ఒక్క అంశమే కొలమానం కాదు. పాలక పక్షంపై ప్రజల్లో కలిగిన అసంతృప్తి అసహనంగా మారి, అసహనం ఆగ్రహంగా పెచ్చరిల్లి, ఆగ్రహం అవధులు ఎరుగని కసిగా రూపొందినప్పుడు ఎంతటి ప్రభుత్వాలయినా పేకమేడల్లా కుప్ప కూలుతాయి. ఈ కఠోర వాస్తవాన్ని జగన్ మోహనరెడ్డి ఖచ్చితంగా గమనంలో వుంచుకోవాలి. 


మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అనేక పధకాలకు కేటాయింపులు ప్రకటించినప్పుడు రెండేళ్లుగా ఇన్ని పధకాలు అమలవుతున్నాయా అని అనిపించింది. 

“నాడు, నేడు, జగనన్న విద్య దీవెన, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్. కాపునేస్తం. జగనన్న నేతన్న నేస్తం, లా నేస్తం, ఈ.బీ.సీ. నేస్తం, అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా, జగనన్న గోరు ముద్ద, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ ఒకేసారి విన్నప్పుడు పేర్ల విషయంలో తొందరపాటుతనం కానవస్తుంది ఎవరికయినా. 

వీటిల్లో కొన్ని కొత్తవి ఉండవచ్చు, మరికొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తున్నవి కావచ్చు. ఏవైనా ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. ప్రతి పధకానికి ఒక కాల నిర్ణయ పట్టిక పెట్టుకుని, నెలలు, తేదీల ప్రకారం ఒక పద్దతిగా ప్రతి పధకాన్ని అమలు చేస్తున్న మాట నిజం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. ఆ వైతరణి దాటి, అధికారంలోకి రాగానే ‘బోడి మల్లయ్య’ సామెత మాదిరిగా వ్యవహరిస్తుంటాయి అనే అపప్రథ వుంది. కానీ జగన్ మోహన రెడ్డి ఈ ఒక్క విషయంలో పాత బాణీని పక్కన పెట్టి కొత్త బాట ఎంచుకున్నట్టుగా వుంది. 

సంక్షేమం సరే, అభివృద్ధి మాటలేమిటి అనే విపక్షాల విమర్సలకు ఆయన బడ్జెట్ సమావేశంలోనే అన్యాపదేశంగా ఇలా జవాబు చెప్పారు.

“అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణం కాదు, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ల కనీస అవసరాలను తీర్చడం కూడా అభివృద్దే”

తోకటపా : పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా  ఆ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ.  

(30-05-2021

బెయిల్ మీద ఒక రోజు

 చాలా ఏళ్ళుగా ఉంటున్న ఇల్లే. అలవాటయిన ఇల్లే. కానీ ఏడాదిగా చూసి, చూసి, ఎక్కడికి బయటకి పోకుండా అక్కడే  వుండి, వుండి బోర్ కొట్టడం లేదా అని మావాడు అడిగాడు.

మళ్ళీ వాడే అన్నాడు, రేపు శనివారం ఊరి బయట మా ఫ్రెన్ వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి మళ్ళీ ఆదివారం ఉదయానికి వచ్చేద్దాము, అని.

రిస్కేమో అనబోయి మానేసి సరే అన్నాను.

ఈ కాలపు పిల్లలకు నచ్చని ఒకే మాట ‘రిస్కేమో అనేది. నేనూ నా కాలంలో రిస్క్ అంటే ఏమాత్రం భయం భక్తీ లేనివాడినే. ఇక పిల్లలకు ఏం చెబుతాను.

శనివారం అంటే ఈ ఉదయం ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి లాక్ డౌన్ ముగిసే సమయానికల్లా అక్కడికి చేరుకున్నాను. గేటు బయట, 1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్కమీద వింటేజ్ వనం అని ఇంగ్లీష్, తెలుగు అక్షరాల్లో రాసి గోడకు కొట్టి వుంది. విలేకరి చూపుకదా ఏమిటో మాసిపోయినట్టు కనిపించింది ఆ బోర్డు. పరికించి చూస్తే అది ఓ సీలింగు ఫ్యాన్ రెక్క. (అది 1960 ల నాటి ఓ పాత సీలింగ్ ఫ్యాన్ విరిగిన రెక్క అని  తరువాత తెలిసింది) ఇలాంటి ప్రదేశంలో ఒక పగలూ, ఓ రాత్రీ గడపడం ఎల్లా అనే అనుమానం మనసు మూలల్లో తొంగి చూసిన మాట వాస్తవం. కానీ పైకి అనలేదు. ఆ గేటు దగ్గర కాపలావాడు మావాడు తన  ఫ్రెండ్ పేరు అనిరుద్ అని  చెప్పగానే గేటు బార్లా తెరిచి పొమ్మన్నాడు. బాటకు రెండు వైపులా వ్యవసాయ క్షేత్రాలు. పెద్ద పెద్ద చెట్లు. కొంత దూరం పోయిన తర్వాత మరో గేటు. అక్కడ ఎప్పుడో మాంధాతల కాలంనాటి, శిధిలావస్థలోవున్న  పాత కారు. వెనక పెళ్లి ఊరేగింపుల్లో కనబడేవి ఈ  ఓపెన్ టాప్ ప్లిమత్ కార్లు.

ఇచ్చిన రెండు కాటేజీలు బాగున్నాయి. అక్కడ పనిచేసే ఆశారాం వచ్చి తాళం తీశాడు. శుద్ధ హిందీ మనిషి.

ఆ కాటేజీ యావత్తు చెక్కతో చేసినట్టు పైకి కనబడింది. ముందు చెక్కతో చేసిన చిన్న వసారా  నాలుగుకుర్చీలు, ఓ మేజా బల్ల. తలుపు తెరిస్తే, ఉడెన్ ఫ్లోర్, ఒకటే డబల్ కాట్ బెడ్ రూమ్, ఏసీ, ఓ వ్రాత బల్ల, రెండు కుర్చీలు. స్ప్లిట్ ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్. మెయింటెనెన్స్ బాగుంది. లోపల ఉడుక్కుంటున్న ఆత్మారాముడు ఆ ఏర్పాట్లు చూసి చల్లబడ్డాడు. మా కోడలు వచ్చి ముందు ఆ పరుపు మీద వేసి వున్న చద్దరు తీసేసి ఇంటి నుంచి తెచ్చిన బెడ్ షీట్ వేసింది. అలాగే దిండ్లు కూడా. గది, బాత్ రూమ్ సానిటైజ్ చేశారు.

కాసేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చాము. కారులో వస్తున్నప్పుడు పూర్తిగా కనబడలేదు. చుట్టూ పచ్చటి చెట్లు, పచ్చిక బయళ్ళు. ఏదో సినిమాలో మాదిరిగా ఇంటి నుంచి తెచ్చినవే..

ఒక చోట ఓ పాత కాలపు సింహ ద్వారం. దానికి ఇరువైపులా ‘అనగనగా అని తెలుగులో, ఇంగ్లీష్ లో రాసిన బోర్డులు వున్నాయి. చిన్నప్పుడు కధలన్నీ అనగనగా అనే వాక్యంతో, ఇంగ్లీష్ లో Once upon a time  అని మొదలు పెట్టారు. గడప దాటి లోపలకు వెడితే, అదేదో ఇంగ్లీష్ సినిమా Back to the future మాదిరిగా  మళ్ళీ నా చిన్నప్పటి రోజులకు వెళ్లినట్టు ఎక్కడ చూసినా పాత సామగ్రి. బాయిలర్లు, జాడీలు, ఇత్తడి గుండీలు, పాత కాలపు మేనాలు, గుర్రపు బగ్గీలు, ఈ కాలపు తరానికి ఆ మాటకు వస్తే నాకే తెలియని అనేక పాత కాలపు వస్తువులు. లాంతర్లు, చిమ్నీలు,  రేడియోలు, టేప్ రికార్డర్లు, చేటలు, విసన కర్రలు, కెమెరాలు, ఎప్పుడో అరవై ఏళ్లనాటి  బాంబే హల్వా స్వీట్ డబ్బాలు, బీహైవ్ బ్రాండీ ట్రేలు, సన్ లైట్ సోప్ కేలండర్లు, పిఠాపురం రాణి వాసం వారు వాడిన టేకు మేనా, చాలా పాత కాలం నాటి ఇంగ్లీష్ పుస్తకాలతో నింపిన బీరువాలు ఇలా అనేక వస్తువులు.

చిత్రలేఖనం, సంగీతం మీద ఆసక్తి కలిగిన వారు ప్రశాంతంగా తమ కళలకు మెరుగు పెట్టుకోవడానికి ఏర్పాట్లు.

ఇవన్నీ చూసిన తర్వాత పర్వాలేదు, రిస్క్ తీసుకుని అయినా మంచి చోటుకే వచ్చాను అనిపించింది.   (29-05-2021]

    



28, మే 2021, శుక్రవారం

ప్రజలకిచ్చిన మాటే వై.ఎస్. జగన్ బాట

 మే 30 వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు అవుతుంది. 

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్  రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన రెడ్డి గారు ఏమి సాధించారు?

జగన్ మోహన రెడ్డి గారి రెండేళ్ల పరిపాలన ఎలా వుంది ?

వినడానికి రెండు ప్రశ్నలు ఒకే మాదిరిగా వున్నా రెండింటిలో స్థూలమైన తేడా ఒకటి వుంది.

మొదటి దానికి జవాబు ఒక్క వాక్యంలో కూడా చెప్పవచ్చు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టు వుంది ఆయన పరిస్థితి.

శాసనసభలో అతి ఘనమైన మెజారిటీ వుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కాదనే వారు లేరు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితులను గమనిస్తుంటే వాటిని అమలు చేయడం ఆయన ఒక్కరి చేతిలో లేదని అర్ధం అవుతోంది. ఏ అడుగు వేసినా అది న్యాయ సమీక్షకు వెడుతోంది. నాకు తెలిసి గత కొన్ని దశాబ్దాల కాలంలో ఒక ప్రభుత్వ నిర్ణయాలు ఈ స్థాయిలో కోర్టుల పరిధిలో తిరస్కరణకు గురి కావడం ఎన్నడూ చూడలేదు. నిర్ణయాలలో లోపం అయినా వుండాలి. వాటిని న్యాయ సూత్రాలకు అన్వయించడంలో పొరబాటు అయినా జరిగి వుండాలి. అయితే, దీనిని త్వరితగతిన సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా ప్రభుత్వానికే వుంది.

ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎక్కడో నగరాల్లో వుండి చెబితే కుదరదు. ఆయన పాలన వల్ల మంచో చెడో ఆ ఫలితాలను  అనుభవించిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అధిక సంఖ్యలో వుండేది నగరాల్లో కాదు, పల్లెల్లో. నిజానికి జగన్ మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న నవ రత్నాలలో అధికభాగం వారి సంక్షేమానికి సంబంధించినవే కావడం వల్ల ఈ  ప్రశ్నకు జవాబు గ్రామాల్లో ఒక మాదిరిగా, నగరాల్లో మరో మాదిరిగా వచ్చే అవకాశం వుంది. అభివృద్ధి ఫలాలను నేరుగా రుచి చూసిన వారి అభిప్రాయమే నిఖార్సయినది. నగరాల్లో కొందరు దీనితో ఏకీవభించకపోవచ్చు. అభివృద్ధికి వారు చెప్పే భాష్యం వేరేగా వుంది. దానికి జవాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో చెప్పినట్టున్నారు. అభివృద్ధి అంటే  కేవలం ఆకాశహర్మ్యాల నిర్మాణం కాదు, పేదవాడి కనీస అవసరాలు తీర్చడం కూడా అభివృద్దే అని.

ఇదలా ఉంచితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.

చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్  ప్రధమ  ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో, తన సమయంలో చాలావరకు అధికారుల సమీక్షా సమావేశాల్లో గడిపేవారనే మాట వినబడేది. అందువల్ల పరిపాలన చేయాల్సిన అధికారుల విలువైన సమయం కొంత వృధా అయ్యేది. గంటల తరబడి సాగే ఈ సమీక్షల కారణంగా అధికారులు, సిబ్బంది అసహనానికి గురయ్యేవారు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తగ్గుతాయని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సమీక్షల బాట పట్టడం ఆశ్చర్యంతో పాటు, అసహనాన్ని కూడా పెంచుతోంది. నిజానికి ఈ సమీక్షలు కొత్తవేమీ కాదు. ప్రతి ముఖ్యమంత్రి అనుసరించిన విధానమే ఇది. కాకపొతే దాన్ని అమలుచేయడంలో తేడాలు ఉండేవి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సమీక్షలు జరిగేవి కానీ అవి చాలా సంక్షిప్తంగా సాగేవి. ఏదైనా కార్యక్రమం లేదా పధకం లేదా ప్రాజెక్టు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆలస్యం అవుతోంది అనుకున్నప్పుడు  వై.ఎస్. ఇటువంటి సమావేశాలు నిర్వహించేవారు. విభిన్న శాఖల అభ్యంతరాలు,  వాటికి పరిష్కారాలు ఆ సమావేశంలో అక్కడికక్కడే కనుగొనేవారు. దానివల్ల చాలా సమయం ఆదా అయ్యేది. సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది అని  తెలియగానే వై.ఎస్. సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయేవారు. ఇటువంటి పద్దతులను జగన్ మోహన రెడ్డి   అనుసరిస్తే  ఆయన తలపెట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత వేగం  పుంజుకునే  అవకాశం  వుంటుంది.

గత రెండేళ్ల కాలంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన మీద ప్రతిపక్షాలు, అనేక మీడియా సంస్థలే కాకుండా సోషల్ మీడియాలో సైతం వినవస్తున్న విమర్శ ప్రధానంగా ఒకటి వుంది. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమ పధకాల మీదనే ప్రజాధనం ఖర్చుచేస్తూ  ప్రభుత్వ ఖజానా ఖాళీ  చేస్తున్నారు అన్నదే ఆ విమర్శ. ఇదే లెక్కన రాబోయే  మూడేళ్లు వ్యవహరిస్తే రాష్ట్రం  అప్పుల ఊబిలో కూరుకు పోతుందని వాళ్ళ అంచనా.

ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను  జగన్ మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్న దాఖలా కనబడడం లేదు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ‘మా విమర్శలకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు?’ అంటూ టీవీ వేదికల మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం.

ప్రతిపక్షాల విమర్శలను, మీడియా సలహాలను జగన్ మోహన రెడ్డి ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం జనంలో ఉన్నమాట మిజమే. జగన్ పాలనను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఓ విశ్లేషకుడు ఇలా అన్నారు.

“రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మహా కోలాహలంగా వుంటుంది. వచ్చే పోయే ప్రయాణీకులు, తినుబండారాలు అమ్మేవారి కేకలు, రైళ్ళ కూతలు, పోర్టర్ల హంగామా. వీటన్నిటి నడుమ ఒక వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా, బయటి గందరగోళాన్ని చెవిన పెట్టకుండా దీక్షగా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అతడే స్టేషన్ మాస్టరు.

జగన్ మోహన రెడ్డి వ్యవహారశైలి దూరం నుంచి పరిశీలిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఈ స్టేషన్ మాస్టరే!”

అయితే, ఈ విషయంలో  జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం వేరుగా వుంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు తన మాటలు నమ్మి తన చేతికి అధికార పగ్గాలు అప్పగించారని, అంచేత తన పార్టీ ఎన్నికల ప్రణాళికే తనకు భగవద్గీత, బైబిల్ ఖురాన్ అని, ప్రజలకు ఇచ్చిన మాటే తనకు వేదమని  సందర్భం వచ్చిన ప్రతి చోటా ఆయన  చెబుతూ వస్తున్నారు.

ఇందులో వాస్తవం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపే ఘన విజయానికి దోహదం చేసిన అనేక కారణాల్లో, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా  వుంది. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు.  సుదీర్ఘ నిరీక్షణ అనంతరం,  ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని  తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

సంక్షేమం గురించి జనం స్పందనలు విభిన్నంగా వుంటాయి అనడానికి ఓ ఉదాహరణ.

పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. దానితో  రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. 

(28-05-2021)