28, మే 2021, శుక్రవారం

దటీజ్ ఎన్టీఆర్

 దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం సంగతి

టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.

ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. పీ ఆర్ వొ, (మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు) తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.

"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.

అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.

దటీజ్ ఎన్టీఆర్.

 

27, మే 2021, గురువారం

అంతరంగంలో ఆధ్యాత్మికం

 

భండారు శ్రీనివాసరావు అనే నేను ...
బాగానే వుంది, నువ్వే శ్రీనివాసరావువి. మరి ఆ ఆ పేరు తీసేస్తే నీవెవరు?
నిన్ను గుర్తు పట్టేది ఎల్లా? నీ రూపం చూశా? నీ మాటలు వినా? నీ రాతలు చదివా? ఎలా?
ఈ శరీరానికి ఆ పేరు ఉందా! లేదా పేరును బట్టి శరీరానికి శ్రీనివాసరావు అనే అస్తిత్వం వచ్చిందా!
ఈ నేను కాని దాన్ని నేను, నేను అనుకోవడం అజ్ఞానం అవుతుందా!
అంటే ఈ నేను, నేను కాదని బోధపరచుకోవాలా!
సత్యం బోధ పడడానికి ఎంత దూరం దృష్టి సారించాలి. అంత దూరం దృష్టి ఆనుతుందా!
పెంజీకటి కావల అన్నాడు పోతన,
అంటే పెనుచీకటికావల వెలుగు ఉంటుందా! అసలు ఈ కటిక చీకటిని చీల్చి చూడడం ఎల్లా!
దేహంలో ఆరు కోశాలు అని అంటారు.
అన్నమయ కోశం (అన్నంతో జీవించేది), ప్రాణమయ కోశం ( శరీరంలో వున్న వ్యవస్థ), మనోమయ కోశం(ఆలోచింప చేసేది), విజ్ఞానమయ కోశం ( జ్ఞానం కలిగించేది), ఆనందమయ కోశం ( దివ్యానుభవం కలిగించేది).
మొదటి అయిదు దాటి చూస్తే చివరిదానికి చేరుకుంటాడు మానవుడు. దాన్ని కూడా దాటి చూడగలిగితే సర్వం ఆనందమయం. అక్కడ గోచరిస్తుంది ప్రకాశంతో విరాజిల్లే ఆత్మ.
అదే అసలయిన నేను అంటారు భగవాన్ రమణ మహర్షి.
గీతలో చెప్పినట్టు చంపేదెవరు? చచ్చేదెవరు?
అంతా నీ భ్రమ.
అన్నీ నేనే అనే పరమాత్మ ఒకటి వుంది. మిగిలినవన్నీ భ్రాంతులే.
నేనెవరు అని ఓమారు మనల్ని మనం ప్రశ్న వేసుకుని నిశ్చల ధ్యానంతో జవాబు వెతుక్కుంటే ..
ప్రతి మనిషి శరీరంలో మూడు భాగాలు. ఒకటి ఉపాధి (శరీరంతో కూడిన నేను), రెండోది స్థూల శరీరం (రక్తమాంసాలు కలిగినది), మూడోది సూక్ష్మ శరీరం (జీవుడు)
కంటికి కనబడే స్థూల శరీరాన్నే నేను అనే ఓ మిథ్యా భావనలో, భ్రమలో ఉంటాము.
జీవుడు అనే సూక్ష్మ శరీరము, జన్మజన్మల కర్మఫలాలను అనుభవించడానికి స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ఆ కర్మ ఫలాలు కూడా మూడు.
ప్రారబ్ధం, ఆగామి, సంచితం.
ప్రస్తుత శరీరంలో జీవుడు అనుభవిస్తున్న కర్మని పుణ్యం, ప్రారబ్ధం అంటారు.
అనాదిగా తెచ్చిపెట్టుకున్న కర్మని ఆగామి అంటారు.
కర్మశేషం వుంటే అది సంచితంగా మరో జన్మలో దఖలు పడుతుంది.
కర్మశేషం తొలగిన రోజున జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. అంటే పాపపుణ్యాలు రెండింటినీ క్షయం చేసుకోవడం అన్నమాట.
ఏమి అర్ధం అయింది? అంత తేలికగా అర్ధం కానిది, అంతం లేనిది కనుకే వేదాంతం అన్నారు.
అర్ధం అయినా కాకపోయినా ఈ వయస్సులో అప్పుడప్పుడైనా కొన్ని ఆముష్మిక విషయాలు గురించి ఆలోచించడం మంచిదనిపించి ఈ రాతలు. అంతే!
(27-05-2021)

మహానాడు


తెలుగుదేశం పార్టీ వార్షిక సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ మహానాడు అని తొలుత నామకరణం చేసినప్పుడు అందరు ఇదెక్కడి పేరు అని ఆశ్చర్యపోయారు. కానీ తదాదిగా మహానాడు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది.
మాస్కోలో వున్న అయిదేళ్లు మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్ని మహానాడు కార్యక్రమాలకు నేను రేడియో విలేకరిగా హాజరయ్యాను.
చంద్రబాబునాయుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజు అక్కడికి చేరుకున్నాం. ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ 9 వారికి ఓ ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు. పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఏదో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని తెలుసుకోలేని విషయాలు వాళ్లకు తెలుస్తాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు ఏ పార్టీ సమావేశాలు అయినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము.

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మోహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట!

జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు

 ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెహ్రూ మరణించిన వార్త రేడియోలో విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.
‘మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.
నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా వున్నాయి.
ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం బాగా గుర్తుండిపోయింది.
నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది. అ గదిలో కూర్చోవడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)
నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది ఎవరో కాదు, జవహర్ లాల్ నెహ్రూనే అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు రాస్తున్నారని అనుకునేవారు.
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే –
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'
ఇదీ మా బావగారు రామచంద్రరావు గారు చెప్పిన మాట.
1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీ ని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఒకసారి గూగుల్ లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఎన్టీయార్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీయార్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం.
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళ లాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు, ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి.
దేశ ప్రగతికి మన వంతు కృషి ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు.
నెహ్రూ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్సనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
చివరిగా ఒక మాట.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.
(కింది ఫోటో: నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తల పట్టుకు కూర్చున్న దృశ్యం)



26, మే 2021, బుధవారం

పోలేదు, వున్నారు

 

కవికుల పరమేష్టి బిరుదాంకితులు, బహు గ్రంధ రచయిత, వివిధ సాహితీ ప్రక్రియలతో పాఠకులను ఎంతో కాలంగా అలరిస్తున్న సాహిత్య ద్రష్ట, సరికొత్త శైలితో మహిళా పాఠకురాళ్ళను అమితంగా ఆకట్టుకున్న ప్రతిభాశాలి అయిన శ్రీ ఏకాంబరం తన యాభయ్యో ఏట గత సాయంత్రం....”

ఇలా అనంతంగా సాగుతున్న వార్తాప్రసారాన్ని వింటూ ఒక శ్రోత పక్క శ్రోతను అడిగాడు.,  పోయాడా ఏమిటి అని. ఆయన జవాబు ఇచ్చేలోగా సమస్యాపూరణం పూర్తి చేశాడు ఆ న్యూస్ రీడర్.

“.....నగరంలో కన్నుల పండువగా జరిగిన ఓ కార్యక్రమంలో పలు సాహితీ సాంస్కృతిక సంస్థల నుంచి ఘన సన్మానం పొందారు”

గతంలో రేడియో వార్తల మీద ఇలాంటి జోకులు పేల్చేవాళ్ళు.

నీతి: పుట్టిన రోజయినా, మరోటి అయినా సూటిగా చెప్పడం మంచిది. ఈ కరోనా కాలంలో మరీ అవసరం.

(26-05-2021)

 

గురు దక్షిణ

 స్వాతంత్రానంతరం పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని దేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సర్కారు కొలువులు  పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు గ్రామీణులకు తెలిసిన ఉద్యోగాలు కొన్ని మాత్రమే. తహసీల్దారు, మునసబు, కరణం, పోస్టు మేష్టారు, బడి పంతులు వగైరా.

తరవాత్తరవాత బీడీవో, ఆయన కింద రకరకాల  ఎక్స్ టెన్షన్ అధికారులు. పేరులో అధికారి అని వున్నా నిజానికి అవి గుమాస్తా వంటి చిన్న ఉద్యోగాలే. వాటిని తెలుగులో విస్తరణాధికారి అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో మా  రెండో అన్నయ్య కూడా ఖమ్మం జిల్లాలో చేరాడు. తదనంతర కాలంలో ఆయన స్టేట్ బ్యాంక్ పీవోగా సెలక్ట్ అయి ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ గా రిటైర్ అయ్యారు.

గ్రాడ్యుయేషన్ కాగానే మా అన్నయ్య చేసిన ఉద్యోగాల్లో బ్లాక్ ఎస్.ఈ.వొ., ఒకటి. ఆ రోజుల్లో పంచాయతి సమితిని బ్లాక్ అనేవారు. అంతకు ముందే ఒక పెద్ద మనిషి మధిర ప్రాంతం నుంచి కొత్తగూడెం వెళ్లి అక్కడ పంచాయతీ సమితిలో ఇలాంటి ఉద్యోగంలోనే చేరారు. ఆయనే ఈ పోస్టుకు కథానాయకుడు. పేరు చేకూరి కాశయ్య. స్వయం కృషికి మారుపేరు. కొత్తగూడెం సమితిలో పనిచేసింది కొద్ది కాలమే అయినా, అయన పనికట్టుకుని ఊరూరూ తిరిగారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా స్థానికులతో చక్కటి పరిచయాలు పెంచుకున్నారు. స్వతహాగా నలుగురితో కలిసిమెలిసి తిరిగే మనస్తత్వం కావడం వల్ల అతి త్వరగా అన్ని గ్రామాల్లో కాశయ్య గారి పేరు తెలవని వాళ్ళు అంటూ లేకుండా పోయారు.

ఇంతలో పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చాయి. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి సమితి ప్రెసిడెంట్ కాగలిగారు. ఇది కేవలం ఆయన స్వయం కృషి.

ఆ రోజుల్లో విల్లీస్ జీపులు ఉండేవి. జిల్లా మొత్తంలో కొద్ది మంది అధికారులకే వాహన యోగం. వారిలో ఒకరు డీ.పీ.ఆర్.వొ.  కాకపొతే ఉద్యోగ అవసరాల దృష్ట్యా జీపు బదులు పెద్ద వ్యాన్ వుండేది. (మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కెరీర్ ఈ ఉద్యోగంతోనే మొదలయింది. తదనంతర కాలంలో అదే శాఖకు అంటే సమాచార, పౌర సంబంద శాఖకు డైరెక్టర్  అయ్యారు) మరొకరు బ్లాక్ డెవలప్ మెంటు ఆఫీసర్ (బీ.డి.వొ). ఆయన దౌరాకు బయలుదేరి జీపు ఎక్కగానే బిలబిల మంటూ కింది ఉద్యోగులు జీపు వెనక సీట్లలో సర్దుకు కూర్చొనే వారు.

మొన్న మొన్నటిదాకా కాశయ్య గారు కూడా అలా ఎగబడి తోసుకుని వెనక సీట్లో ఇరుక్కుని కూర్చుని ప్రయాణాలు చేసిన వారే. కానీ ఆయన ఇప్పుడు సమితి ప్రెసిడెంటు. ఆ హోదాలో ఆయన సీటు ముందుకు మారింది. ఆయన ఎంత నిరాడంబరజీవి అంటే ఇటువంటి విశేషాలన్నీ ఆయనే తన సహచరులతో పంచుకునేవారు.

ఇక తర్వాత జిల్లా మొత్తానికి జిల్లా పరిషద్ చైర్మన్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే. ఇలా అనేక మెట్లు ఎక్కినా ఆయన తన మూలాలని మరచిపోలేదు. తనతో కలిసి పనిచేసిన, లేదా తనకు పరిచయం వున్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకునేవారు. మనిషి మొహం చూసి బాగున్నారా అని పలకరించడం కాకుండా పేరు పెట్టి పిలిచి మరీ ఆత్మీయత చూపేవారు.

ఉద్యోగ పర్వంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ చెన్నై స్టేట్ బ్యాంక్ సీ జీ ఎం గా వెళ్ళిన మా అన్నయ్య ఒకసారి   వివాహ వేడుక  కోసం ఖమ్మం వచ్చారు. ఆ సమయంలో రైల్వే ప్లాటు ఫారం మీద కాశయ్య గారు కనబడ్డారు.  ఆయన గబగబా దగ్గరకు  వచ్చి ఏం రామచంద్ర రావు గారు, ఎలా వున్నారు, ఇప్పుడు మద్రాసులో ఉన్నారట కదా!’ అని పలకరించేసరికి మా అన్నయ్య ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. పేరు గుర్తు ఉండడమే కాదు, తాను ప్రస్తుతం ఏ వూళ్ళో వున్నది తెలిసింది అంటే తన పరిచయస్తులను గురించి ఆయన కనుక్కుంటూ ఉంటారని ఆయనకు అర్ధం అయింది. ఉన్నత స్థానాలకు ఎదిగిన  మనుషుల్లో ఇది చాలా అరుదనేది మా అన్నయ్య అభిప్రాయం.

కొన్నేళ్ళ క్రితం ఖమ్మం వెళ్ళాను, డాక్టర్ ఏ.పీ. రంగారావు గారితో  కలిసి 104 పని మీద. ఖమ్మం వచ్చాము కదా అని ఫోన్ చేస్తే కాశయ్య గారు వెంటనే మేమున్న గెస్ట్ హౌస్ కు వచ్చారు. మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్లి,  ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు అంటారేమో, దాన్ని దాటి వెళ్లి,  నిర్మాణంలో వున్న గురు దక్షిణ ప్రాంగణాన్ని చూపించారు. చాలా విశాలంగా చాలా బాగా నిర్మిస్తున్నారు. అక్షరం ముక్క నేర్పి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దిన గురువులకు దక్షిణగా వారి శేష జీవితం సుఖ ప్రదంగా వుండడం కోసం కాశయ్య గారు తలపెట్టిన బృహత్ పధకం అది.

ఆ వయసులో కూడా  ఆయన పడుతున్న తపన, శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది.

స్వయం కృషితో తాను అనుకున్నది సాధించి, ఎన్నో  ఎత్తులకు ఎదిగి కూడా  పాదాలను ఆన్చిన తల్లి నేలను మాత్రం మరచిపోని  కాశయ్య గారికి నా అశ్రు నివాళి


(చేకూరి కాశయ్య)

(



 



(25-05-2021)          

‘నా బలమా! నీ నామ బలమా!’

 

నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.

నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరకా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు  రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.

మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.

ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.

ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.

నారాయణ గారెకి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.

భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారెతో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే  మిగిలింది

ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.

సరే ఇదలా ఉంచితే ..

ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు.  దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.

ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారెకి భవిష్యత్ వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.

చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి  పట్రంమంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు  చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.

పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు.  కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక రసం, కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు  వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.

వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా  కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా  లోపిస్తోంది.

(26-05-2021)