1, మే 2021, శనివారం

దీన్ని దోపిడీ అని కాకుండా వేరే విధంగా అనొచ్చా!


మా వాచ్ మన్ భార్య చెప్పింది. వాళ్లకు తెలిసిన వాళ్లకు ఒంట్లో నలతగా వుంటే ఓ డాక్టరు దగ్గరికి వెళ్ళారుట. కన్సల్టేషన్ వంద రూపాయలే తీసుకుంటాడు కనుక మంచి డాక్టరు అని వాళ్ళ నమ్మకం.

తీరా వెడితే, వీళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఓ కాగితం మీద సీటీ స్కాన్ అని రాసి, అది ఎక్కడ తీసుకోవాలో అది కూడా చెప్పి, ఆ రిపోర్టుతో రమ్మని తన ఫీజు నూర్రూపాయలు తీసుకుని పంపించేశాడుట.

సీటీ స్కాన్ అంటే వేలతో వ్యవహారం. ఇలా ప్రతి చిన్న విషయానికి అంత పెద్ద టెస్టులు రాయాల్సిన అవసరం ఉంటుందా!
క్లినిక్కుల వాళ్ళే ఇలా చేస్తుంటే, కార్పొరేట్ వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా!

“చిన చేపను పెద చేప. చిన మాయను పెను మాయ. అది స్వాహా. ఇది స్వాహా’
(01-05-2021)

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

కొలనరావు ఇక లేడు

 నా చిన్న మేనల్లుడు కొలనరావు కొలిపాక (లచ్చుబాబు) అనేక వేలమందికి స్నేహపాత్రుడు. ఆ  కొలనరావు ఇక లేడు. కరోనా కాటుకు బలై  29-04-2021  రాత్రి కన్ను మూశాడు.


(కొలనరావు)

ఈ మూడు ముక్కలు రాయడానికే నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఉబుకి వస్తున్న కన్నీళ్లు అక్షరాలను మసకబారుస్తున్నాయి.  ఏం చెప్పను? ఏం రాయను? భగవంతుడా!  వయస్సులోనే వాడికి నూరేళ్లు నిండిపోతాయని ఏనాడూ అనుకోలేదు. కళ్ళముందు చిన్నవాళ్లు రాలిపోవడమే పెద్దవాళ్లు చేసుకున్న పాపం అని మా బామ్మ చెప్పేది.

28, ఏప్రిల్ 2021, బుధవారం

రాకూడని కష్టం

 

ఫేస్ బుక్ మిత్రురాలు శ్రీమతి షమీర్  జానకిదేవి, సంజీవరావు  దంపతులకు కరోనా గర్భశోకం  మిగుల్చింది. ముప్పయ్యేళ్లు  కూడా నిండని వారి చిన్న కుమార్తె ఈ తెల్లవారుఝాఅమున కన్ను మూసింది. ఆరేడు నెలల పసివాడిని  ఈ లోకంలో వదిలేసి.

బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపే జానకి గారెకి ఈ దుర్ఘటన శరాఘాతం.

రెండేళ్ల క్రితం మా ఆవిడ చనిపోయినప్పుడు ఆ విషయం తెలుసుకున్న జానకి గారు, ఆవిడ భర్త సంజీవరావు గారు  అతికష్టం మీద అడ్రసు పట్టుకుని వచ్చి పరామర్శించి వెళ్ళారు.

కుమార్తె భౌతిక కాయాన్ని వారికే అప్పగించడానికి వీలులేని రోజుల్లో ఆ  దంపతులను ఓదార్చడానికి ఎవరు వెళ్ళాలి?

ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.

కింది ఫోటో: జానకి గారి అల్లుడు, చనిపోయిన కుమార్తె, ఆరేడు నెలల బాబు 




పడిలేచిన కెరటం

 

సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు.

పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్.

అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, హోండా మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే హోండా మోటారు కంపెనీ స్థాపకుడీయన. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్నో పాట్లు పడ్డాడు. పడడమే కాదు పడి లేచాడు. లేచి నిలబడ్డాడు. తాను నిలబడి తన కంపెనీని నిలబెట్టాడు.

అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఈ జపానీయుడికి చిన్నతనం నుంచి వాహనాలు అంటే ఎంతో మోజు. ఆ రోజుల్లో వాళ్ల వూరికి వచ్చే మోటారు వాహనాలను చూడడానికి, వీలుంటే ఒకసారి చేతితో తాకడానికి చాలా మోజుపడేవాడు. ఆ అవకాశం దొరక్క కేవలం ఆ మోటారు వాహనం నుంచి వెలువడే చమురు వాసన పీల్చి తృప్తిపడేవాడు. అలాటి వాడు భవిష్యత్తులో ఒక పెద్ద మోటారు వాహనాల కంపెనీ స్తాపించగలడని వూహించడానికి కూడా వీలులేని రోజులవి. బతుకు తెరువుకోసం ఓ గరాజులో పనికి కుదిరాడు. కానీ అతడి ఆరాటం బతుకు బండి నడపడం కాదు. మోటారు బండి తయారు చేయడం.

ఈ క్రమంలో అతడి ఆలోచనలనుంచి రూపుదిద్దుకున్న పిస్టన్ అతడి బతుకు బాటను ఓ మలుపు తిప్పింది. అంతా ఓ గాట్లో పడుతోందని అనుకుంటున్న సమయంలో వచ్చిన భూకంపంలో అతడి ఫాక్టరీ సర్వనాశనం అయింది. కధ మళ్ళీ మొదటికి వచ్చింది. భూకంపం అతడి ఫాక్టరీని ద్వంసం చేయగలిగింది కాని అతగాడి పట్టుదలను కాదు కదా! అందుకే అతడు కధ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మరింత కసిగా.

అతడి కృషితో ఫాక్టరీ తిరిగి ఉత్పత్తి మొదలు పెట్టింది. అంతా సజావుగా సాగుతోంది. ఆర్డర్లు పెరుగుతున్నాయి. కంపెనీ కోలుకుంటోంది. ఈ దశలో మళ్ళీ కోలుకోలేని డెబ్బ తగిలింది. రెండో ప్రపంచయుద్ధం పుణ్యామా అని హోండా ఫాక్టరీ మూతపడింది.

యుద్ధం ముగిసింది. హోండా మళ్ళీ నడుం బిగించాడు. పట్టుదలే అతడి పెట్టుబడి. అంతకంటే మించిన పెట్టుబడి మరి ఏముంటుంది. అందుకే అతడి కల ఫలించింది. వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఇక రాలేదు. కంపెనీ అప్రతిహతంగా అభివృద్ధి పధంలో పురోగమించింది. దేశదేశాల్లో హోండా పేరు మారు మోగింది. విశ్వవ్యాప్తంగా హోండా కార్లకు ఆదరణ పెరిగింది. మోటారు వాహనాల రంగంలో హోండా పతాకం వినువీధులకు ఎగిరింది.

పడిలేచిన కెరటం’ అంటే ఇదేనేమో!

(2015)

27, ఏప్రిల్ 2021, మంగళవారం

కరోనా అనుభవాలు గుణ పాఠాలు కావాలి

 

‘పెసరట్టు వేయాలంటే  పెసర పిండి కావాలి. పెసర పిండి కావాలంటే పెసలను నానబోసి రుబ్బాలి. పెసలు నానడం అనేది మనిషి చేతిలో లేదు. దానికి కొంత వ్యవధానం అవసరం. ఎంత డబ్బువున్నా, ఎంత అధికారం వున్నా పెసలని వున్నట్టుండి నానేలా చేయడం అసాధ్యం. కాబట్టి డబ్బుతో అన్ని పనులు సాధ్యం కావు’  అనే అర్ధం వచ్చే ఒక సన్నివేశం బాపూరమణల అందాల రాముడు సినిమాలో వుంది.

విస్తరిస్తున్న కరోనాని మట్టుపెట్టడం అనేది తమ ఒక్కరి చేతిలో లేదని అటు పాలకులకు, ఇటు పాలితులకు తెలిసివచ్చేటప్పటికి ఏడాది పుణ్య కాలం గడిచిపోయింది. ఈ అంతుపట్టని రోగాన్ని అంతం చేసే వాక్సిన్ తయారు చేయడం అనేది ఏడాదిలోపే పూర్తి చేయడం భారత దేశం సాధించిన ఘనకార్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాక్సిన్  తారక మంత్రం కాదని కూడా  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ వాక్సిన్ మంచి ఫలితాలి ఇచ్చినప్పటికీ,  దేశంలో అందరికీ ఈ వాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడం అంత త్వరగా సాధ్యపడేట్టు లేదు.

ఈ లోగా పులిమీద పుట్రలా  కరోనా రెండో దాడి మొదలయింది. మొదటిదే నయమనిపించేలా వుంది ఈ రెండో దాడి. అసలు కరోనా గురించే జనాలకు సరైన అవగాహన లేదు అనుకునే తరుణంలో ఈ వ్యాధి గురించి రకరకాల కధనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా ఎప్పటికప్పుడు తన స్వరూప స్వభావాలు  మార్చుకుంటున్నదని మరో సమాచారం. ఇవన్నీ  వింటుంటే ఏదో హాలీవుడ్ సైంటిఫిక్ సినిమా గుర్తుకు వస్తోంది.

ఒకటి వాస్తవం. ఈ కరోనాని అంత  తొందరలో అదుపు చేయడం కష్టం. ఎప్పటికి అంటే చెప్పలేని పరిస్థితి. వారాలు కావచ్చు. నెలలు కావచ్చు.  చూస్తుండగానే ఏడాది గడిచింది. వాక్సిన్ కనుక్కుంటే చాలు దీన్ని తరిమి తరిమి కొట్టొచ్చు అనుకున్న ఆశలపై రెండో వేవ్ నీళ్ళు చల్లుతోంది.

టీవీ పెడితే, పేపరు తెరిస్తే చాలు  ఆందోళన కలిగించే వార్తలు. గతంలో బింకంగా వున్న వాళ్ళు కూడా బెంబేలు పడుతున్నారు. మందులు, మాస్కులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, వాటిల్లో తగిన సదుపాయాలు, ఆఖరికి ఆక్సిజన్ అన్నింటికీ కొరత  అంటుంటే, వాటిని వింటుంటే భయం వేయకుండా ఉంటుందా!

ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. ఈ కరోనా ప్రపంచంలో అడుగిడడానికి ముందు ఎన్ని ఆసుపత్రులు వున్నాయో ఇప్పుడూ అన్నే వున్నాయి.  అప్పుడున్న సంఖ్యలోనే  సిబ్బంది. నలుగురు వస్తే భోజనం పెట్టగల ఇంటికి హఠాత్తుగా నలభయ్ మంది చెప్పాపెట్టకుండా వస్తే,  ఏ ఇల్లాలు అయినా ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు పరిస్థితులు అలాగే వున్నాయి.

మామూలుగా ఏ ఆసుపత్రిలో అయినా, అది సర్కారీ దవాకానా కావచ్చు, ప్రైవేటు ఆసుపత్రి కావచ్చు సదుపాయాలు పరిమితంగానే వుంటాయి. ఒక వంద పడకల ఆసుపత్రిలో డెబ్బయి అయిదు జనరల్ వార్డులోనో, ప్రత్యేక గదుల్లోనో వుంటే,  ఓ పాతిక పడకలు ఐ.సీ.యూ. లో వుంటాయి. ఇది ఉదాహరణకు చెప్పే లెక్క మాత్రమే. ఇప్పుడు కరోన వచ్చిన తర్వాత జనరల్ వార్డులో వుండే రోగులందరూ ఐ.సీ.యూ.ల్లో ఉండాల్సిన పరిస్థితి. అందరికీ ఆక్సిజన్ కావాలి. ముందు అందాల రాముడు సినిమా గురించి చెప్పింది ఇందుకే. డాక్టర్లను, నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆక్సిజన్ ఎక్కడ నుంచి తెస్తారు. నిజానికి చుట్టూ వున్న గాలిలో ఆక్సిజన్ వుంటుంది. కానీ దాన్ని రోగులకు అవసరమయ్యే రీతిలో తయారు చేయడం, సరఫరా చేయడం  రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పనా!  ఎంత అధికారం వున్నా, ఎన్ని వనరులు వున్నా, ఎంత చిత్తశుద్ధి వున్నా కొన్ని సాధ్యం కానివి వుంటాయి. వీటికి మంత్ర దండాలు వుండవు.      

మళ్ళీ లాక్ డౌన్ మాటలు వినపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పదు కూడా. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ముందు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

కిందటిసారి హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సమాజంలో అనేక మంది ప్రత్యేకంగా  రెక్కాడితేకాని  డొక్కాడని  బీదాబిక్కీ, వీధి వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు. లాక్ డౌన్ కారణంగా పని దొరక్క, స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి రవాణా సదుపాయాలు లేక, సామాను నెత్తిన పెట్టుకుని  మైళ్లకు మైళ్ళు నడిచి వెడుతున్న దృశ్యాలు ఇంకా జనం మనస్సులో పచ్చిగానే వున్నాయి. వాళ్ళందరూ  సొంత ఊళ్లకు వెళ్లి పోయేలా వారికి తగిన వ్యవధానం ఇస్తూ లాక్ డౌన్ ప్రకటించాలి. లేని పక్షంలో గత ఏడాదిలో చూసిన హృదయవిదారక దృశ్యాలే పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

ఇక్కడ కేంద్రమా, రాష్ట్రాలా అని కాదు, పాలకులు అందరికీ ఒకే విజ్ఞప్తి.

అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోతే ఈ దేశాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు.    

(27-04-2021)

ఎం.సత్యనారాయణరావుగారు – ఓ జ్ఞాపకం

 

వెనుకటి  రోజుల్లో హైదరాబాదు రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్. చైర్మన్ లైన్లోకి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో,  ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే, నిర్మలా వసంత్, విజయకుమార్  వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన.

అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక, మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మూడు పర్యాయాలు లోక సభ సభ్యులుగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే,  రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో,  ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

అలాంటి రేడియో అభిమాని, రాజకీయ కురువృద్ధుడు అయిన ఎం. సత్యనారాయణ రావు రాత్రి కరోనా కాటుకు బలయ్యారు అని తెలిసినప్పుడు ఈ ఉదంతం గుర్తుకు వచ్చింది.

వారికి నా శ్రద్ధాంజలి

(27-04-2021)

26, ఏప్రిల్ 2021, సోమవారం

మరుగున పడిన ‘మణిరత్నం’

కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియక పోవచ్చు. జర్నలిష్టు మిత్రుడు వీ.జే.ఎం. దివాకర్ కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...

ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాథ్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి, బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్ కెమెరామన్ గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్ లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు.
కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా సప్తపది అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్ గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు. తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.
అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.