26, ఏప్రిల్ 2021, సోమవారం
రావణుడిని చంపింది రాముడు కాదు
25, ఏప్రిల్ 2021, ఆదివారం
టీకా తాత్పర్యం – భండారు శ్రీనివాసరావు
టీకా హిందీ పదం అని పాశం యాదగిరి కుండ బద్దలు కొట్టి మరీ చెబుతాడు. కాదనడానికి లేదు. ఎందుకంటే ‘హిందీ నా మదర్ టంగ్, తెలుగు స్టెప్ మదర్ టంగ్’ అని మరో కుండ బద్దలు కొడతాడు.
టీకా అంటే బిందు, అంటే బొట్టు, అంటే సింధూరం, అంటే చుక్క అంటూ ఇలా ఎన్నో అంటేల తర్వాత చెబుతాడు, ఓ కధ. లోగడ భుజాల మీద టీకా వేసేటప్పుడు ‘ఏం కాదు చిన్న బొట్టు’ అంటూ వేసేవారట. నిజంగానే అక్కడ పడ్డ పుండు నయమయిన తర్వాత బొట్టు మాదిరిగా మచ్చ పడేది.
మా చిన్నతనంలో టీకాలు వేసేవాళ్ళు ఊరికి వచ్చాడని తెలియగానే వాళ్లకు కనబడితే పట్టుకుని టీకాలు పొడుస్తారని భయపడి చిన్నపిల్లలం వారి గడ్డి వాముల్లో దాక్కునే వాళ్ళం. అయినా పట్టుకుని పొడిచేవాళ్ళు. టీకా వేసిన చోట మరునాడు పొంగేది. చీము పట్టేది. రసి కారేది. సలసలమని సూదులతో గుచ్చినట్టు నొప్పి. దానితో పాటే జ్వరం. ఆ టీకా బాధలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఆ టీకాలు ఏమిటో, ఎందుకు వేస్తారో తెలియని వయసు. పెద్దవాళ్లు కూడా చెప్పేవాళ్ళు కారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకి సరైన దారులు ఉండేవి కావు. అయినా టీకాల వాళ్ళు మాత్రం ప్రతి ఊరూ తిరిగి టీకాలు వేసేవాళ్ళు.
ఆ టీకాల పుణ్యమా అని దేశంలో మశూచి వ్యాధి అంతరించి పోయింది. అలాగే పిల్లకు చిన్నతనంలో వచ్చే కోరింత దగ్గులు (ఆస్తమా వాళ్ళ లాగా ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టుగా విడవకుండా దగ్గడం) చిన్న పిల్లల చేష్టలు ( ఉన్నట్టుండి మెలికలు తిరిగి కళ్ళు తేలవేయడం) ఇలా అనేకం వచ్చాయి. అన్ని రకాల టీకాలు వేయించుకున్నాం రాగి దమ్మిడీ ఖర్చు లేకుండా.
ఇవెప్పుడో చిన్నప్పటి టీకాల సంగతులు.
తర్వాత పల్స్ పోలియో వచ్చింది. అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను.
ప్రభుత్వాలు, ప్రజలు ఏకతాటిపై నిలుస్తే ఒక మహమ్మారిని ఎలా తిప్పికొట్టి, రూపుమాపవచ్చో అనడానికి మనదేశంలో జరిగిన ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఒక ఉదాహరణ. చిన్నతనంలో వచ్చే ఈ వ్యాధికి గురయి ఏటా లక్షలాదిమంది పిల్లలు జీవితాంతం వికలాంగులుగా జీవచ్ఛవాల మాదిరిగా జీవించే దుస్థితి నుంచి బయట పడేయడానికి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఒక సంజీవనిలా పనిచేసింది.
బాగా గుర్తుంది. 1995 డిసెంబరు 10. దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క రోజున అయిదేళ్ళ లోపు వయసున్న చిన్నపిల్లలకు అందరికీ పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వేలాదిమంది డాక్టర్లు, లక్షలాదిమంది వైద్య సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో సైనికుల మాదిరిగా పాల్గొన్నారు. ఒక ఊరు ఒక వాడ అనిలేదు. బస్సు స్టేషన్లలో, విమానాశ్రయాలలో సైతం పోలియో డ్రాప్స్ వేశారు. కొండలు, గుట్టల్లో నివసించే వారి పిల్లలకు ఈ డ్రాప్స్ వేయడానికి వైద్య సిబ్బంది శ్రమ అనుకోకుండా వెళ్ళారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు వున్నారని తెలిసినా సరే, వదిలి పెట్టకుండా చిన్న చిన్న గూడేలకు, తండాలకు వెళ్ళారు.
హైదరాబాదులో విషయాలు ఒక విలేకరిగా నాకు తెలుసు. అప్పుడు హైదరాబాదు పురపాలక సంస్థ ఇండియా పాపులేషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న డాక్టర్ ఏపీ రంగారావును జంటనగారాలకు సంబంధించి బాధ్యుడిగా ఆరోగ్యశాఖ కార్యదర్శి రేచల్ చటర్జీ నియమించారు. పల్స్ పోలియో ప్రాముఖ్యత, అవసరం గురించి సామాన్య ప్రజానీకంలో అవగాహన కలిగించడానికి విస్తృతమైన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజుల్లో ఇటువంటి వాటికి రేడియో బాగా ఉపయోగపడేది. అంచేత ఈ ఈ కార్యక్రమంలో నేనూ కొంత భాగస్వామిని గా వున్నాను.
డిసెంబరు పదో తేదీ దగ్గర పడింది. హడావిడి పెరిగింది. పల్స్ పోలియో కార్యకర్తలు అందరూ ఒక రోజు ముందే తొమ్మిదో తేదీ సాయంత్రానికే మునిసిపల్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అంతా పోలింగుకు వెళ్ళే ఎన్నికల అధికారుల మాదిరిగా తరలి వచ్చి పోలియో డ్రాప్స్ వున్న బాక్సులను వెంటబెట్టుకుని వెళ్ళారు.
మరునాడు ఉదయం అప్పటి గవర్నరు, ముఖ్యమంత్రి పిల్లలకు డ్రాప్స్ వేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలుపుసొలుపు లేకుండా పనిచేసిన వైద్య సిబ్బంది ఆ రాత్రి ఇళ్లకు చేరేసరికి అర్ధరాత్రి దాటి వుంటుంది. కార్యక్రమం జయప్రదం అయిన సంతోషంలో వారికి అలసట తెలియలేదు.
ప్రతి పల్స్ పోలియో రోజున కనీసం పదిహేడు కోట్ల మంది పిల్లలకు ఈ డ్రాప్స్ వేస్తూ వచ్చారు. అలా చేస్తూ పొతే, దేశంలో చిట్ట చివరి పోలియో కేసు వెస్ట్ బెంగాల్ లోని హౌరా జిల్లాలో 2011 జనవరి 13 వ తేదీన రిపోర్ట్ అయింది. అదే దేశంలో చివరి పోలియో కేసు. తర్వాత, అంటే అధికార గణాంకాల ప్రకారం 2012 మే 2 వరకు ఒక్కటంటే ఒక్క పోలియో కేసు కూడా రిపోర్ట్ కాలేదు. పోలియో రహిత దేశంగా భారత దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012 ఫిబ్రవరి 24న అధికారికంగా ప్రకటించింది.
(25-04-2021)
మృదు భాషణకు మారుపేరు జస్టిస్ రమణ
(Published in both Andhra and Telangana editions of Andhra Prabha today, 25-04-2021)
అవి
నేను మాస్కో నుంచి వచ్చిన కొత్త రోజులు. సంజీవ రెడ్డి నగర్ లో ఉంటున్న మా మాస్కో మిత్రుడు
ఒకరిని కలవడానికి వెళ్లి అక్కడికి దగ్గరలోనే
జస్టిస్ రమణ ఇల్లు వుందని జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను. అప్పుడే హైకోర్టు
నుంచి వచ్చినట్టున్నారు. వేరెవరో కాకుండా ఆయనే స్వయంగా ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.
పలానా అని చెప్పి ఇప్పుడు కలవడానికి
వీలుపడుతుందా అని అడిగాను. ‘భలే వాళ్ళే రండి. చాలా రోజులయింది కలిసి’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు.
వెళ్లి కలిసాను. అంతకు ముందు పెద్ద పరిచయమేమీ లేదు. అయినా ఆయన పలకరించిన తీరు అదీ నేను ఇప్పటికీ
మరిచిపోలేను. అప్పటికే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక
ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. నేను రేడియో విలేకరిని మాత్రమే. ముందు
అప్పాయింట్ మెంటు తీసుకోకుండా కలవ్వచ్చా అని నేను ఆలోచించలేదు. చిత్రం ఏమిటంటే, ముందుగా చెప్పాపెట్టకుండా నన్ను కలవడానికి ఆయన కూడా తటపటాయించ లేదు. భేషజాలు లేని మనిషి
అనిపించింది.
మనిషి
ఆకారం చిన్న. కానీ చేసిన ఉద్యోగాలు పెద్ద హోదా కలిగినవి. అయినా నిరాడంబరంగా వుండడం
మరింత విచిత్రం. ఆయనతో గడిపింది కాసేపే అయినా హాయిగా మాట్లాడారు.
మాస్కో జీవితం గురించి అడిగారు. పుస్తకాలు అంటే రమణ గారెకి చాలా చాలా ఇష్టం
అని అప్పుడే తెలిసింది. తెలుగు అంటే మరెంతో ఇష్టం అని కూడా.
తరవాత
కలవడం అనేది చాలా ఏళ్ళ తరువాత జరిగింది. హిందూ రెసిడెంట్ ఎడిటర్, కీర్తిశేషులు హెచ్.
జే. రాజేంద్ర ప్రసాద్ రాసిన పాత్రికేయ అనుభవాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణను
మరోసారి కలిసే అవకాశం లభించింది. అప్పటికి ఆయన ఢిల్లీ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
ఏదో
మొక్కుబడి ప్రసంగం కాకుండా రాజేంద్ర ప్రసాద్
రాసిన పుస్తకం గురించి, ఆయన
గురించి లోతుల్లోకి వెళ్లి మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగం అందరినీ
ఆకట్టుకుంది. ఒక సీనియర్ పాత్రికేయుడి
పుస్తకం కాబట్టి ఆవిష్కరణ కార్యక్రమానికి దేవులపల్లి అమర్ మొదలయిన సీనియర్
జర్నలిస్టులు చాలామంది హాజరయ్యారు. జస్టిస్ రమణ తన ప్రసంగంలో ఆ మాట కూడా చెప్పారు.
ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులను కలుసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే తను ఈ
కార్యక్రమానికి వచ్చినట్టు చెప్పారు. సభికులలో కూర్చుని వున్న జర్నలిస్టులను ఆయన
పేరు పెట్టి ప్రస్తావించడం మరింత ఆశ్చర్యం అనిపించింది. బహుశా న్యాయవాద వృత్తిలోకి
రాకపూర్వం కొన్నాళ్ళు ఓ ప్రముఖ తెలుగు వార్తా
పత్రికలో పనిచేసిన అనుభవం వల్ల కావచ్చు, జస్టిస్ రమణకు జర్నలిస్టులు అంటే సానుకూల భావం.
నిజానికి
న్యాయమూర్తులకు,
పాత్రికేయులకు చుక్కెదురు. పత్రికల వారితో ముచ్చటించే విషయాలు వారికి ఆట్టే వుండవు.
కానీ జస్టిస్ రమణ ఆ రోజు ఆయన అనుకున్న
సమయానికి మించి ఎక్కువసేపు అక్కడ గడిపారు. ప్రోగ్రాం ముగిసిన తరువాత కూడా
జర్నలిష్టులతో మాటామంతి కొనసాగించారు.
తక్కువ
మాట్లాడడం,
మాట్లాడిన నాలుగు ముక్కలూ మృదువుగా మాట్లాడడం, వాటిల్లో వ్యంగ్యం లేకపోవడం, అన్నింటికీ మించి ఆధిక్యతా ధోరణి
రవంత కూడా కనబడకపోవడం జస్టిస్ రమణకున్న
సహజ లక్షణాలని ఆయన్ని ఎరిగున్న ఎవరైనా
ఇట్టే చెప్పగలరు.
ఇప్పుడాయన దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సర్వోన్నత న్యాయమూర్తి. ఒక తెలుగు వ్యక్తి అంతటి అత్యున్నత స్థానానికి ఎదగడం తెలుగువారందరికీ గర్వకారణం. (EOM)
24, ఏప్రిల్ 2021, శనివారం
మంచి నిర్ణయం, భేషైన నిర్ణయం
కరోనా వాక్సిన్ ని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. చాలా సముచితమైన నిర్ణయం. ఇది ఎప్పుడో చేయాల్సింది అనే చర్చలు ఇక అనవసరం.
అయితే
ఒక మాట! ఇటువంటి సూచనే గతంలో చేయడం జరిగింది.
మసూచికి,
పోలియోకు ప్రభుత్వాలే ముందుకు వచ్చి టీకాలు, పోలియో డ్రాప్స్ వేసిన సంగతి
ప్రస్తావిస్తే, ప్రతిదీ
ప్రభుత్వాలే ఉచితంగా ఇవ్వాలా! ఆ మాత్రం ఖర్చు భరించలేరా అని కొందరు దీర్ఘాలు
తీశారు. ప్రజల్లో కొంతమందికి ఆ కొనుగోలు శక్తి ఉన్నమాట నిజమే. కానీ ప్రభుత్వమే
పూనుకుని ఒక ఉద్యమంలా వేయడం వల్ల మశూచి వ్యాధి దేశంలో లేకుండా పోయింది. పోలియోకి
అడ్డుకట్ట పడింది.
అదికాకుండా, ఇలాగే సెకండ్ వేవ్ కొనసాగి, మరోసారి లాక్ డౌన్ పరిస్థితి
ఎదురయితే!
దాన్ని
తట్టుకోగల స్థితి ఉందా! మొదటి సారి లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి
అతలాకుతలం అయింది. సామాన్యుల నడ్డి విరిగింది. వలస కూలీలు వందల కొద్దీ మైళ్ళు
నడిచి స్వస్థలాలకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ నష్టంతో పోలిస్తే, లేదా భవిష్యత్తులో ఎదురయ్యే
నష్టాన్ని అంచనా వేసుకున్నా దేశ జనాభాకు ఉచితంగా కోవిడ్ టీకాలు వేయడమే సముచితం
అనిపిస్తుంది.
అందుకే
ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించేది.
(24-04-2021)
'నేనే!
'నేనే! నేను తప్ప వేరు లేదు’ అనుకునే ‘అహం
బ్రహ్మాస్మి’ల కోసం, మహాకవి, సంస్కృత
పండితుడు భవభూతి ఈకింది సూక్తిని ప్రవచించారు.
'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'.
విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది.
వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ
వుంటాం.'
(నిజానికి వ్యావహారికంలో అహం బ్రహ్మాస్మి అర్ధం వేరే విధంగా మారింది. నేనే బ్రహ్మం, జీవుడూ, దేవుడూ
ఒక్కరే అనేది దీని మూలార్ధం. ఇక్కడ అహం అంటే అహంకారం కాదు)
ఏమి బాధలే హలా!
పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్ ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.
అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు
కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.
ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో
కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి
వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత
అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా
కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని.
భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో
వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము
మోయడం బాధగా లేదులే’ అంటాడు.
దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.
దొరకని పుస్తకంలో విజయవాడ
నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే నా భోజనం. ఆయన అక్కడే చాప మీద వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.
ఆఫీసులో గుర్రపు నాడా
ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే
వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్
తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో ఉండేవి. అంతమాత్రం
డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం
కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో
చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు
పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే యాభయ్ రూపాయలు వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని
మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చేబదులు చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’
తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు
ఆస్కారమే వుండేది కాదు.
ఇక అసలు విషయానికి
వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే
ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం
కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.
ఈ మధ్య ఇల్లు
మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం
కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలో ‘భారతి’ సాంస్కృతిక
సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్
సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో
వారి ప్రస్తావన వుంది)
ఈ పుస్తకం నుంచి
కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.
“హువాన్ చాంగ్
చూసిన బెజవాడ”
చైనా యాత్రీకుడు
హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి
వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ
చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న –
క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క –
చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం
రాజధాని అమరావతి కాదు). అప్పటి తెనకచక దేశానికి
బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా
వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో
నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా
కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి
తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి
సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.
ఇంకో విచిత్రమైన
విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను
వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన
వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు
పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు
ఎగుమతి అయ్యేవి.
ఈ పట్టణానికి అనేక
పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా
ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి
పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.
హువాన్ చాంగ్ తో
పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు
