3, ఏప్రిల్ 2021, శనివారం

పరిషత్ ఎన్నికల బహిష్కరణ సబబేనా ?

 ఎన్నికల బహిష్కరణ అనేది రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. గతంలో జరిగింది. భవిష్యత్తులో పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రస్తుతం ఏపీ పరిషత్ ఎన్నికల విషయంలో తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

కాకపోతే ఇటువంటి నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుపై  ప్రభావం చూపుతాయని అనేంతవరకు చర్చలు సాగుతుండడం కొంత వింతగా వుంది. నిజంగా అలాంటి అవకాశం ఉందా!

చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఏ నిర్ణయం అయినా ఆచితూచి  తీసుకుంటారు అనేది ప్రతీతి. అందుకు గతంలో యాక్టివ్ జర్నలిజంలో వున్నప్పుడు నేను కూడా ఒక సాక్షిని. ఎన్టీఆర్  నాయకత్వాన్ని కాదని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు ఎంతగా తటపటాయించారో  ఆనాటి జర్నలిస్టులకు బాగా తెలుసు. అలాగే వాజ్ పాయ్ కాలంలో బీజేపీతో జత కట్టే విషయంలో కూడా అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి కూడా తెలుసు. ఇక లోకేష్ రాజకీయ రంగప్రవేశం సందర్భంలో జరిగిన తర్జనభర్జనలు ఇన్నీఅన్నీ కావు. అలాగే 2018లో మోడీతో విబేధించి బీజేపీకి రాం రాం చెప్పిన సందర్భంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరించారు. ఈ నిర్ణయాన్ని, మరీ ముఖ్యంగా టీడీపీకి ఆగర్భ రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే పార్టీ  నిర్ణయాన్ని  తమ పార్టీలోనే  చాలామంది  స్వాగతించడం లేదు అనే సమాచారం క్షుణ్ణంగా తెలిసికూడా ఆయన ముందుకు వెళ్ళారని చెప్పుకుంటారు.    

రాజకీయ నాయకులకు ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అలాగే చంద్రబాబుది కూడా విభిన్నమైన బాణీ.

తను నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తనది కాదు, మొత్తం పార్టీది అనే అభిప్రాయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పార్టీలో అన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అనే సానుకూల సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈ రకమైన చర్చల ప్రక్రియ ఉపయోగపడ్డ మాట కూడా వాస్తవమే.

సరే! ప్రస్తుతానికి వస్తే, పరిషత్ ఎన్నికల విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ముందు ముందు ప్రభావితం చేయబోయే రాజకీయ అంశాల మీద ఈనాడు విస్తృతంగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య జనంలో చర్చలు సాగుతున్నాయి. ఇదేమంత కొత్త విషయం కాదని వాదించేవారు గతంలో జరిగిన బహిష్కరణలను ప్రస్తావిస్తున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో జయలలిత  అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.   అయితే ఇక్కడ స్థూలమైన తేడా ఒకటి వుంది. 

ఇక తమిళనాడులో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఎన్ని పార్టీలు వున్నా కూడా ప్రధానమైన పోటీ రెండు పార్టీల నడుమనే. ఒకరు పోటీ నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీకి, లేదా వేరే పార్టీలకూ మళ్లిపోయే అవకాశం అక్కడ బొత్తిగా లేదు.

టీడీపీ పరిస్థితి అల్లా కాదు. నలభయ్ ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలలో పాతుకుపోయిన పార్టీ. లీడర్లు, కేడర్లు కింది స్థాయి నుంచి కలిగిన రాజకీయ పార్టీ, ఆ లీడర్లకు, కేడర్లకు గుర్తింపు వచ్చేది, ఉనికి చాటుకునేది ఎన్నికల సమయంలోనే. పైగా నామినేషన్ల పర్వం కూడా పూర్తయిన తర్వాత బహిష్కరణ నిర్ణయం తీసుకుంటే మరి ఎన్నికల బరిలో ఉన్న తమవారి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఎదురుగా నిలబడి వుంది. బ్యాలెట్  పత్రంలో పేరు, పార్టీ గుర్తు వుండి కూడా ప్రచారం చేసుకోలోని దుస్థితి. ఇదే విషయాన్ని టీడీపీ అగ్రనాయకులు అశోక గజపతి రాజు మరికొందరు లేవనెత్తారు కూడా.

ఈ నేపధ్యంలో ఎన్నికలు జరిగితే టీడీపీ సాంప్రదాయక ఓటర్ల పరిస్థితి ఏమిటి? అలాగే కింది స్థాయిలో పార్టీ పేరు చెప్పుకుని ఉనికిని కాపాడుకుంటున్న కార్యకర్తల సంగతి ఏమిటి? వాళ్ళు ఎవరికి  ఓటు వేయాలి? ఒకసారి ఓట్లు అలా చీలిపోతే వాటిని తిరిగి రాబట్టుకోవడం ఎంత కష్టం?

ఈ సందర్భంలో అనేక ఏళ్ళ క్రితం ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాటల సందర్భంలో చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది.

‘మీ పార్టీకి బలం లేదని తెలిసి కూడా ఎందుకు బరిలో దిగుతారు?’ అనే ప్రశ్నకు ఆయన జవాబు.

‘గెలవడం గెలవక పోవడం మాకు ముఖ్యం కాదు. పార్టీ కేడర్ లో విశ్వాసం నింపడం ప్రధానం. ఒకసారి పొత్తుల్లో సీటు వదులుకుంటే ఇక ఆసీటు మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వుంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఈ కఠిన వాస్తవం తెలుసు’   

మరి టీడీపీ ఏం చేయాలి?

‘నిర్ణయం  ఉపసంహరించుకోలేని  పక్షంలో ఇతర పార్టీలకు  కాకుండా ‘NOTA’ కు ఓటు వేయమని తమ కేడర్ కు చెప్పాలి.

(03-04-2021)

రాయని కధ – భండారు శ్రీనివాసరావు

 ఎన్నాళ్ళ బట్టో ఒక కధ రాయాలని కోరిక. సిరా పెన్నులూ, కాగితాల రాతల కాలం చెల్లిపోయింది కానీ ఆ కధ ఇంకా ఒక రూపానికి రాలేదు. క్లుప్తంగా ఆ కధ ఏమిటంటే -

ఒక పనిమనిషి దారంటపోతూ పోతూ ఒక రూపాయి కాసుని నిర్లక్ష్యంగా రొంటిన దోపుకుపోవడం ఒక బిక్షగాడు చూస్తాడు. ఆ ఒక్క రూపాయి వుంటే తనకీ పూట తిండి సమస్య వుండదు కదా అని నిట్టూరుస్తాడు. పనిమనిషి ఆలోచనలు వేరు. వున్న ఒక్క రూపాయి ఏ మూలకూ చాలదు. మరో తొమ్మిది అర్జంటుగా కావాలి. పిల్లాడికి స్కూల్లో పది రూపాయలు ఫీజు కట్టడానికి ఆఖరి గడువు కూడా అయిపోయింది. రేపటిలోగా కట్టకపోతే పేరు కొట్టేస్తామని పంతులయ్య చెప్పాడు కూడా. యజమానురాలి ఇంటికి వెళ్లేసరికి ఆవిడ ఓ పది నోటు గూట్లో విసరడం చూస్తుంది. 'నిన్ననగా చెప్పాను ఈ మనిషికి ఏం లాభం, వంద ఉంటేగాని టైలర్ దగ్గర వున్న జాకెట్లు ఇంటికి రావు. వున్న ఈ పదీ ఎందుకూ పనికి రావు' ఆవిడ గొణుగుడు ఏనాడూ వినే అవకాశం బొత్తిగా లేని ఆమె మొగుడు ఓ గుమాస్తా రావు. పద్దులు రాస్తేకానీ పొట్టా గడవదు. పొద్దూ పొడవదు. దుకాణం షావుకారుకు ఒక వంద ఇవ్వడం ఒక లెక్క కాదు. కానీ 'విసిరి పారేసేది కూడా లెక్కించి పారేయాల'నే తత్వం ఆయనది. అయితే ఆయన గోల వేరే. సాయంత్రానికల్లా పది వేలు జమ చేయాలి. సరుకులు సప్లయి చేసేవాడి దగ్గర బాకీ కొండలా పెరిగిపోతోంది.

పది వేలు ఆయనకీ పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ ఏజెంటు అవసరం వేరే. గంటలో లక్ష కావాలి. 'ఎవడిస్తాడా ఎవడ్ని పట్టాలా' అని రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు. వందకు పది మిత్తి (వడ్డీ) తీసుకుని అప్పులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాడు.

ఆ సమయంలో ఆయన ఇనప్పెట్టె తెరిచి ఆలోచిస్తున్నాడు. దాంట్లో కట్టల పాములు పుట్టలు పెట్టినట్టు అన్నీ పెద్ద నోట్ల కట్టలే. కోటికి తక్కువ వుండవు. వడ్డీ వ్యాపారి నిలువు గుడ్లేసుకుని ఆ నోట్ల వంక చూస్తున్నాడు. ఎన్ని సార్లు లెక్కపెట్టినా అందులో రెండు కోట్లే లెక్క తేలుతున్నాయి. తన అవసరమా పదికోట్లు. ఎలా ఎలా ? ఇలా ఇలా సాగిపోతుంది, ఆ కధ.

 

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

నేను సైతం - భండారు శ్రీనివాసరావు

‘ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందు కూర్చుని టిక్కు టిక్కుమంటూ టైప్ చేస్తుంటారు, గూడలు అరిగిపోయేలా?’ (ఏమిటి ఉపయోగం? కూటికా! గుడ్డకా! సినిమాకా!) అనేది నా భార్య బతికున్న రోజుల్లో. బ్రాకెట్లో రాసినవి నా సొంత కపిత్వం.

రిటైర్ అయిన తర్వాత నేను రాస్తూ వచ్చిన వ్యాసాలను కొన్ని పత్రికల వాళ్ళు వేస్తూ వచ్చారు కానీ రచయితకు విదిలించింది ఏమీ లేదు. ఎక్కడో అక్కడ నేను రాసిన అక్షరాలకు నలుపూ తెలుపూ రంగులు అంటుతున్నాయి కదా అని నేనూ పట్టించుకోలేదు.
పొతే, నా బ్లాగుకు హిట్లు అన్ని లక్షలు అని చంకలు కొట్టుకోవడంతప్పిస్తే దాని రాతలవల్ల నాకు అంటుకున్నవి మెడ నొప్పులు, గూడ నొప్పులు మాత్రమే.
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్య సాయి కస్టపడి నా బ్లాగును Google Adsense తో అనుసంధానం చేశాడు. పాత వాటిని ఆ సంస్థ లెక్కలోకి తీసుకోదట. పోనీలే అనుకున్న్నాను.
నిన్ననో మొన్ననో చూస్తే రెండు అమెరికన్ డాలర్లు నా ఖాతాలో పడ్డట్టు కనిపించింది. అవి నా బ్యాంకు ఖాతాకు చేరి, జీ ఎస్ టి పోను ఎంత మిగులుతుందో అది నాకనవసరం.
డెబ్బయి అయిదేళ్ళ వయసులో నా రాతల ద్వారా నేను రెండు డాలర్లు సంపాదించాను, అంతే నాకు కావాల్సింది.



నా భార్య బతికి వుంటే, నేనో మిలియన్ డాలర్లు సంపాదించినంత సంతోషపడి వుండేది.
మొగుడనే వాడు ప్రయోజకుడు కావడాన్ని మించి ఏ భార్యకు అయినా సంతృప్తి ఏముంటుంది?
ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మనుమరాళ్లకు నా డబ్బులతో చిన్న చాకలేట్ కొనివ్వగలను అనే ఊహే నాకు ఆనందాన్ని ఇస్తోంది.
(02-04-2021)

ఆహా ఓహో అని ఎలా అనుకోవాలి? – భండారు శ్రీనివాసరావు

ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం నండూరి వారు, పురాణం వారు  ఆంధ్రజ్యోతి దిన, వార పత్రికల్లో రాయించిన సినిమా రివ్యూలు తప్పిస్తే తరువాత ఎప్పుడూ వాటి జోలికి పోలేదు.

ఈ మధ్య కరోనా కాలంలో కాలక్షేపం కోసం పిల్లలు పెట్టించిన (ఓటీటీ ప్లాట్ ఫారం) ఛానల్స్ లో సినిమాలు చూస్తున్నాను. మొదట్లో కొత్తవాళ్లు తీసిన, కొత్తవాళ్లు వేసిన కొంగొత్త సినిమాలు ఒకింత ఊరట, ఉల్లాసం  కలిగించిన మాట నిజమే. కానీ తరువాత తరువాత ఈ సినిమాల్లో కొత్తదనం పూర్తిగా లోపిస్తోంది, ఒక్క ఫోటోగ్రఫీ మినహాయిస్తే. ఈ కొత్త నటులు కూడా పాత పద్దతుల్లోనే పోతున్నారు. హీరో ఇంట్రడక్షన్ సీన్లు అవసరమా అనిపించేంత వెగటు కలిగిస్తున్నాయి. కధానాయకుడి (అతడి మొహం ఇంతకుముందు ఎప్పుడూ చూసిన దాఖలాలేదు)  బూటుకాలు  నేలను తాకగానే భూనభోంతరాలు దద్దరిల్లేటట్టు దుమ్ము లేవడాలు, ఒక్క చేత్తో పాతిక ముప్పయి మందిని చితక్కొట్టడాలు, చెవులు తుప్పు వదిలేలా ధ్వనులు ఇవి చూస్తుంటే, వింటుంటే  ఇక వీటిని చూడడం దండగ అనిపిస్తోంది. థియేటర్లలో అంటే  ఇలాంటి జిమ్మిక్కులు అవసరం కావచ్చు. కానీ ఇళ్ళల్లో కుటుంబాలతో కూర్చుని చూసేటప్పుడు ఆహ్లాదకరమైన దృశ్యాలు, సహజమైన వాతావరణం వుంటే ఆ తీరే వేరు.  వెనక బాపూ రమణలు సినీ రంగ ప్రవేశం చేయడానికి పూర్వం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తెలుగు సినిమా తీరుతెన్నులు గురించి అనేక కధనాలు సీరియల్ గా రాసేవారు. బెల్లం వ్యాపారంలో నాలుగు డబ్బులు వెనకేసుకున్నవాళ్ళు సినిమాలు తీయాలనే  కోరికతో మద్రాసు వచ్చి  నాలుగు రీళ్ళు చుట్టేసి చేతులు కాల్చుకున్న వైనాలను వైనవైనాలుగా రాసేవారు. ఈ సినిమాలు చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి.  

నేనయితే ఈ సినిమాలను, స్థాలీపులాక న్యాయంగా ఓ పది నిమిషాలు చూసి కట్టేస్తున్నాను,. బాగుంది అనిపిస్తే మరి కాసేపు చూస్తాను.

వీటి పేర్లు ఎందుకు రాయడం లేదంటే, సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలను బట్టే ఈ సినిమాల ఊపిరి ఆడుతుంది.

వాళ్ళ ఉసురు నాకెందుకు?

1, ఏప్రిల్ 2021, గురువారం

రజనీకాంత్ కి ఫాల్కే అవార్డ్

 

‘రజనీకాంత్ కి  ఫాల్కే అవార్డ్ అని స్క్రోలింగ్ వస్తోంది. అదేమిటి ఆయన స్టేచర్ కి  ఎప్పుడో వచ్చి ఉండాలే. ఇప్పుడేమిటి ఇలా! నిజానికి ఆయనకి ఇవ్వాల్సింది భారతరత్న

అన్నాడు ఓ మిత్రుడు ఫోన్ చేసి.

సరే  ఆయన భాషా అభిమాని, కాబట్టి ఆయనకు అర్ధం అయింది అది.

నాకు అర్ధం కాని విషయం ఓటుంది. ఇలా ఫాల్కే అవార్డుల వంటివి  సమయం సందర్భం చూసుకోకుండా ప్రకటించవచ్చా!

గతంలో ఇలాగే తమిళనాడు ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్జీ రామచంద్రన్ కు ఏకంగా భారత రత్న ప్రకటించింది కదా! ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఫాల్కే అవార్డ్ ప్రకటించింది అని సర్దిపుచ్చుకుంటే పోలా!

కానీ ఈ ట్రిక్కులు ఓట్లు రాల్చవని కాంగ్రెస్ కు అప్పుడు బోధ పడిన సంగతి ఇప్పటి పాలకులకు గుర్తు లేదేమో!

ఏదిఏమైనా ఒక మంచి నటుడికి ఒక మంచి అవార్డ్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.

ఇచ్చిన ప్రభుత్వానికి, పుచ్చుకునే భాషాకు అభినందనలు.   

(01-04-2021)

లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు

 ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు  తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా  నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు.  ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో  వెల్లడి కారాదు. (సోర్స్  చెప్పాల్సిన  అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓ ఉదయం (అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు కారణం) ఓ పత్రికా విలేకరికి  ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

‘ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

‘మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు

‘అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?

‘తెలియదే. ఎప్పుడు?’

‘నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

‘ఆయన డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి  వార్తను వండి వార్చడమే.

‘అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

‘కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన  ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.    

ఇతి వార్తాః   

ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు

 ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్’

ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’

అందుకోసం పొద్దటి నుంచీ తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్! ఇంతకీ ఆ జరగబోయే మంచి ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’

ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో కూడా ఊహించలేదు సుమా!’

ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు పడ్డాయేమిటి కడుపులో’

అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్ వచ్చేసింది. ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే నెలలో మరో రెండు  రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’

మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు ఇంకా మండుతాయి’

ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు. అన్నీ మంచి రోజులే. పించన్లు నాకూ మా ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి కాని దానికి మనం కొనిపెట్టలేని అవేవో ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనకు పోయేదేమీ లేదు. వాళ్ళందరూ గెలవాలనే మనం దేవుడ్ని కోరుకుందాం’

అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’

అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా నొక్కేద్దాము, ఓ పనైపోతుంది. ఏవంటావ్’

(01-04-2021}