రాజకీయం కోసం వాదోపవాదాలు చేయండి. కానీ కొన్ని రోజులే. ఆ తర్వాత కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ పొవాలనుకుంటే మాత్రం మరో పరాజయానికి సంసిద్ధం కండి.
14, మార్చి 2021, ఆదివారం
పరాజితులు నేర్వాల్సిన పాఠం – భండారు శ్రీనివాసరావు
మీడియాలో సిత్రాలు
మా ఆవిడ బెస్ట్ ఫ్రెండ్
Co
చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు
చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్
సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ
రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు
దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది.
ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ
ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు.
అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు.
సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది
నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను
ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా
సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ (ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ) నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని.
చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్
ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని
కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా
ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం ’ అన్నారు.
నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్
గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.
ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో
జ్ఞాపకం వుంది.
హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం
వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం
రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా
వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి.
టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న
రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని
ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పుడు మెట్రో లేదు,
డివైడర్ మాత్రమే వుంది)
కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం
వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు
క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి
చేరుకున్నారు.
13, మార్చి 2021, శనివారం
ఆడవాళ్ళతో జాగ్రత్త - భండారు శ్రీనివాసరావు
‘ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ‘ అన్నాడు ఏకాంబరం
12, మార్చి 2021, శుక్రవారం
పదేళ్లనాటి మాటే అయినా నిత్య సత్యం – భండారు శ్రీనివాసరావు
అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి
వార్త
ఏడాది పాలన
పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి
ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్న, దానికి సమాధానం ఇలా
వున్నాయి. (25-11-2011)
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది
వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”
“మేమంతా ఐకమత్యంగా
ఉంటేనే తిరిగి గెలుస్తాం”
(2011 నవంబరులో
ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి
ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం
దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్ ప్రాహుహ్
మామకోనాస్తి కిం
భయం”
ఈ సంస్కృత
శ్లోకానికి తెలుగు అనువాదం:
“ఒకడు పది
గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని
తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర
చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం
“ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు
మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్
వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను
తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన
‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
రాయాలంటే భయమేస్తోంది – భండారు శ్రీనివాసరావు
‘రాయాలనే వుంది. కానీ భయమేస్తోంది’ అన్నాడు ఓ ముప్పయ్ అయిదేళ్లకు పైగా పరిచయం ఉన్న ఓ సీనియర్ పాత్రికేయ మిత్రుడు, ‘ఖాళీగానే వున్నావ్, ఏదైనా రాయొచ్చు కదా’ అనే నా ప్రశ్నకు జవాబుగా.
ప్రముఖ ఆంగ్ల పత్రికలో విలేకరిగా పాత్రికేయ
జీవితం ప్రారంభించి అదే పత్రికలో దాదాపు నలభయ్ ఏళ్ళు పనిచేసి ఉన్నత స్థానానికి
ఎదిగిన ప్రస్థానం ఆయనది. రాజకీయ నాయకులతో అంటకాగిన జీవితం. ముఖ్యమంత్రులను,
మంత్రులను నేరుగా కలిసి, లేదా ఫోనుచేసి మాట్లాడగలిగిన అవకాశం కలిగిన వృత్తి. ఆయన రాసిన
వార్తలకు రాజకీయ నాయకులు స్పందించి నేరుగా ఆ పత్రిక ఆఫీసుకే వెళ్లి ఆయన్ని కలిసి
తమ గోడు విన్నవించుకున్న సందర్భాలు అనేకం.
‘సోషల్ మీడియాలో నువ్వూ మరికొందరు మితృలు
రాస్తున్న జ్ఞాపకాలు ఆసక్తిగా చదువుతుంటాను. నాకూ రాయాలని అనిపిస్తుంది. కానీ మన
రోజుల్లో ఏదైనా వార్త కానీ వ్యాసం కానీ రాస్తే
దాన్ని సానుకూలంగా తీసుకునే వారు. లేదా ఓ ఖండన ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం
ప్రచురించేవాళ్ళం. జర్నలిజంలో, రాజకీయాల్లో అలాంటి విలువలు ఉండేవి. ఇప్పుడు
నాయకులే కాదు, వారి
అనుచరులు, అభిమానులు
కూడా చెలరేగిపోయి ఉచ్చనీచాలు లేకుండా కామెంట్లు పెడుతున్నారు. వారికి మనం రాసిన
దాంతో నిమిత్తం లేదు. మొత్తం వ్యాసంలో వారి అభిమాన నాయకుడు లేదా పార్టీకి ఎక్కడైనా
వ్యతిరేకంగా రాశామా అన్నదే వారికి ముఖ్యం. అలా వారికి అనిపిస్తే చాలు, కాగితం మీద
పెట్టడానికి వీలులేని వికృత భాషలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా అని మన బంగారం
మంచిదని నేను అనడం లేదు. జర్నలిజం అనేది మార్కెట్లో దొరికే మిగిలిన వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది. ఏ
వార్త వెనుక ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో సామాన్య పాఠకుడికి కూడా ఇట్టే అర్ధం
అవుతోంది. మీడియా యాజమాన్యాలే రాజకీయ రంగులు నిస్సిగ్గుగా పూసుకుని
తిరుగుతున్నప్పుడు ఇక మనం చేయగలిగింది
ఏముంది?”
మిత్రుడి పలుకుల్లో నిర్వేదంతో కూడిన నిజం
ధ్వనించింది.
‘సరే! ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే
నువ్వు తప్పకుండా ఇదంతా ఓ పోస్టు రూపంలో రాస్తావనే నమ్మకం నాకుంది. ఆ విధంగా నా
మనసులోని భారం కొంతైనా తగ్గుతుందేమో’
(12-03-2021)