18, నవంబర్ 2020, బుధవారం

ఢిల్లీ తెలుగు అకాడమి నాగరాజు ఇకలేరు

 

ఢిల్లీలో తెలుగు వారి  మరో సాంస్కృతిక కార్యశూరుడు కన్ను మూశారు.

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్. నాగరాజు కరోనా కాటుకు బలయ్యారు. సన్ షైన్ ఆసుపత్రిలో గత పదమూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ కొద్ది సేపటి క్రితమే మరణించినట్టు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఆనంద కుమార్ తెలియచేసారు. విషాదం ఏమిటంటే నాగరాజు అమ్మగారు కూడా కరోనా చికిత్స తీసుకుంటూ వారం క్రితమే చనిపోయారు.


(ఢిల్లీ తెలుగు అకాడమి  నాగరాజు)


ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీ స్థాపించి పెద్ద సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహించిన నాగరాజు మృతి తెలుగు సాంస్కృతిక లోకానికి తీరని లోటు.

ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉంటూ ఢిల్లీలో తెలుగువారికి తలలో నాలుకలా మసలుకున్న ఏడిద గోపాల రావు మరణించిన కొద్ది రోజులకే నాగరాజు కూడా కన్నుమూయడం సాంస్కృతిక  ప్రియులకు తట్టుకోలేని విషాదం.

(17-11-2020)

16, నవంబర్ 2020, సోమవారం

బెదురుగొడ్డు (కథానిక) - భండారు శ్రీనివాసరావు

 

పొద్దున్నే సెల్ మూగడంతో సుబ్బారావుకు మెలకువ వచ్చింది.
‘కరోనా భయంతో ఎన్నాళ్ళు అలా కొంపలో పడుంటావు. మధ్యాన్నం అలా శేఖరం ఇంటికి పోయొద్దాం, రెడీగా వుండు, ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను’ అని కట్ చేశాడు సుందరం.
సుబ్బారావు ఎప్పుడూ ఇంతే! అవతలవాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించడు.
స్నానం చేస్తుంటే రాత్రి అనుభవం గుర్తుకు రావడం మొదలయింది సుబ్బారావుకి. రాత్రి గడుస్తుందా లేదా అనేంత భయకరమైన అనుభవం.

తెల్లవారుతుండగా కాబోలు తల భారంగా అనిపించింది. ముక్కు పూడుకుపోయినట్టు శ్వాస పీల్చడం కష్టం అయింది. పక్క మీద నుంచి లేచి కూర్చోలేకపోయాడు. కరోనా లక్షణాలేమోనని దడ పట్టుకుంది. భార్యను లేపి చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే ఆవిడ తనలా కంగారు పడకపోగా తేలిగ్గా తీసుకుని ఎదురు అక్షింతలు వేస్తుంది. ‘మీకు అన్నీ అనుమానాలే! కరోనా లేదు, పాడూ లేదు. మీకేదో కల వచ్చింది. కాసిని మంచి నీళ్ళు తాగి పడుకోండి’ అంటుంది, తనకు తెలుసు.

సుబ్బారావు ఫోనుకు మెలకువ వచ్చి లేచినప్పుడు మళ్ళీ ఏమీ లేదు. అంతా మామూలుగానే వుంది. బహుశా కరోనా గురించే అస్తమానం ఆలోచిస్తూ వుండడం వల్ల ఇలాటి కల వచ్చిందేమో. అందరూ అంటున్నట్టు.
స్నానం చేసి భార్య పెట్టిన టిఫిన్ తినేసరికి సుందరం రానే వచ్చాడు. చేతులు శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కుని, మొహానికి కొత్త మాస్కు తొడుక్కుని సుబ్బారావు కారెక్కాడు. ఎక్కడో వూరి బయట ఓ గేటెడ్ కమ్యూనిటీలో శేఖరం విల్లా కొనుక్కున్నాడు.
కారులో వెడుతుంటే చెప్పాడు సుందరం, శేఖరానికి కేన్సర్ పాజిటివ్ అని. అది విని నివ్వెరపోయాడు సుబ్బారావు. శేఖరం సిగరెట్ తాగడు, మందు అలవాటు లేదు, కనీసం పాన్ కూడా వేసుకోడు. అతడికి కేన్సర్ రావడం ఏమిటి?
ముగ్గురూ బాల్యం నుంచి స్నేహితులు. ఉద్యోగాలు కూడా ఉన్న ఊళ్లోనే రావడంతో ఆ స్నేహం మరింత బలపడి కొనసాగుతూ వచ్చింది. కాకపోతే చిన్నతనంలో వారిమధ్య ఈగోలు లేవు. ఇప్పుడు అవి వచ్చిపడ్డాయి.

శేఖరం అంటే సుబ్బారావుకు కాసింత అసూయ. ఎవర్నీ మాట్లాడనివ్వడు. తను చెప్పిందే వేదం అన్నట్టుగా వుంటుంది అతడి వ్యవహారం. అది సుబ్బారావుకు నచ్చదు, కానీ పైకి చెప్పలేడు. అది అతడి బలహీనత.

కేన్సర్ పేరు వెంటే చాలు జనం డీలా పడిపోతారు. సుబ్బారావు కజిన్ కు డాక్టరు బయాప్సీ చేయాలని చెప్పగానే ఇంటిల్లిపాదీ కుంగిపోయారు. ఒకపూట భోజనాలే చేయలేదు. బయాప్సీ రిపోర్ట్ వచ్చి ఏమీ లేదని తెలిసేదాకా ఎవ్వరూ సరిగా ఊపిరే పీల్చుకోలేదు. కేన్సర్ అంటే అంత భయం. ఎందుకంటే దానికి చికిత్స లేదని తెలిసి కూడా చేయించాలి. మనిషి చనిపోతాడని తెలిసి కూడా చివరిదాకా బతికించుకునే ప్రయత్నం చేయాలి. జబ్బుతో రోగి, ఖర్చుతో ఇంటివాళ్ళు కుంగి కృశించిపోతారు. ఫలితం లేని ప్రయత్నం. అయినా చేయక తప్పదు.
మరి శేఖరం ఎలా ఉన్నాడో. బతకడం కష్టం అని తెలిసిన వ్యాధి పట్టుకున్నదని తెలిసినప్పుడు, ఆ మనిషిలో వెనుకటి గాంభీర్యం అలాగే వుండదు. ఆ స్థితిలో అతడ్ని ఎలా పలకరించాలి? ఎలా ద్జైర్యం చెప్పాలి?

“చూడు సుబ్బారావ్!”
సుందరం పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు.
‘అతడికి కేన్సర్ అని మనకు తెలిసినట్టు అతడికి తెలియదు. కాబట్టి తొందరపడి నోరు జారకు’ అని హెచ్చరించాడు సుందరం.

గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ లో కరోనా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని శేఖరం విల్లాకు చేరుకున్నారు.
ఇద్దరూ మెట్లెక్కి డోరు దగ్గర నిలబడి కాలింగు బెల్ నొక్కారు.

లోపల ఓ గదిలో శేఖరం పక్క మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. పక్కన స్టూలు మీద మందు సీసాలు, బత్తాయి రసం గ్లాసు.
ఇలా ఊహించుకుంటున్న సుబ్బారావుకు ‘తలుపు తీసే వుంది, లోపలకు రండి’ అని ఖంగున వినపడింది శేఖరం గొంతు. సుబ్బారావు ఆశ్చర్యపోతూ సుందరంతో కలిసి లోపలకు అడుగుపెట్టాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడ్ని మరింత నిశ్చేష్టుడిని చేసింది.

శేఖరం. అతడి భార్య సోఫాలో కూర్చుని నెట్ ఫ్లిక్స్ లో Bad Boy Billionaires: India వెబ్ సీరియల్ ఎపిసోడ్ ఏదో చూస్తున్నారు.
‘ఈ బయో పిక్ సీరియల్ బాగా తీశారు. ఇలాంటివి తీయాలంటే కాస్త గుండె ధైర్యం కావాలి. అప్పటికీ ఎన్నో కోర్టు కేసులు. అన్నీ తట్టుకుని ఈ నెల మొదట్లో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు” అంటున్నాడు శేఖరం టీవీ ఆపుచేస్తూ.

సుబ్బారావుకి అసలేం జరుగుతున్నదీ అర్ధం కావడం లేదు. శేఖరాన్ని ఎలా ఓదార్చాలి అని వస్తే అతగాడేమో బయో పిక్ సీరియల్స్ గురించి మాట్లాడుతున్నాడు.

“రైట్ సుందరం మంచి పని చేసావు, బెదురుగొడ్డును కూడా వెంటబెట్టుకు వచ్చావ్”
సుబ్బారావుకు రోషం పొడుచుకు వచ్చింది. కానీ శేఖరం ప్రవర్తన వల్ల కలిగిన ఆశ్చర్యం దాన్ని పక్కకు నెట్టేసింది. సుందరం తప్పకుండా పొరపడివుంటాడు, సందేహం లేదు. శేఖరం నిక్షేపంగా వున్నాడు, పైగా అతడి పొగరు కూడా ఏమీ తగ్గలేదు, లేకపోతె తనని అంత మాట అంటాడా! బెదురుగొడ్డట బెదురుగొడ్డు.

ఇంతలో సుబ్బారావు ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ శేఖరం భార్య మాట వినపడింది.
“ఏమండీ ఈ కరోనా కారణంగా మీరిద్దరూ మా ఇంటికి రావడమే మానేశారు. మామూలుగా అవుతే మిమ్మల్ని భోజనం చేసిపోమ్మనేదాన్ని. కానీ మీరు ఏమంటారో అని సంక్షేపించాను” అంటూనే శేఖరం భార్య మూడు గాజు గ్లాసులు తెచ్చి మేజా బల్ల మీద పెట్టింది.
“కరోనా అయినా వీటికి ఇబ్బంది లేదు కదా! మా వారికి కూడా మంచి కంపెనీ” అన్నదావిడ.

“అరేయ్ మీకు తెలియదు కదా మా డాక్టరు చెప్పాడు, మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి. అసలే కరోనా రోజులు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ మధ్యనే మా బావమరది మంచి బాటిల్ తెచ్చి పెట్టాడు. ఇవ్వాళ మీరు నాకు కంపెనీ ఇచ్చి తీరాలి” అన్నాడు శేఖరం, బల్ల మీద సోడాలు సర్దుతూ.

సుబ్బారావు ఇదంతా నిలువుగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. బీరుకు, విస్కీకి తేడా తెలియని శేఖరం మందు పార్టీ ఇవ్వడం ఏమిటి? ఇచ్చెనుబో తను కూడా తాగుతాను అనడం ఏమిటి? అదీ భార్య ముందే. ఏమిటో, అంతా విచిత్రంగా వుంది. కేన్సర్ భయంతో వచ్చిన మతి చాంచల్యం కాదుకదా!

ఈ ఆలోచనల్లో ఉండగానే శేఖరం తనకు గ్లాసు అందించి చీర్స్ చెబుతున్నాడు.
“మామూలుగా అయితే మా ఆవిడ మంచింగ్ ఏదో చేసేది. కానీ మధ్యలో కరోనా భయం ఒకటి ఏడిసింది కదా! భయం అంటే జ్ఞాపకం వచ్చింది. మన బెదురుగొడ్డు ఈ కరోనా కాలాన్ని ఎలా నెట్టుకు వస్తున్నాడో. వీడి భయం ఏమో కానీ పాపం ఆ మహాతల్లిని ఏం బెదరగొడుతున్నాడో ఏమో”

సుబ్బారావుకు అనుమానం కొండలా పెరిగిపోతోంది. సుందరం చెప్పింది నిజమేనా! శేఖరానికి కేన్సర్ వచ్చిన మాట కరక్టేనా! మరి వీడేమిటి ఆ జబ్బు వచ్చింది తనకు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. సరే వీడంటే మొండి ఘటం. మరి వాడి భార్య సంగతి. ఆమె మోహంలో లేశమాత్రం కంగారు లేదు. పైగా మొగుడికి కంపెనీ ఇమ్మంటుంది.

ఇంతలో శేఖరం మాట వినపడి సుబ్బారావు ఈ లోకంలోకి వచ్చాడు.
“అరేయ్ కంగార్రావ్ నువ్వు వినాలిరా ఈ సంగతి. మొన్నీమధ్య పొట్టలో అదేపనిగా నొప్పిగా వుంటుంటే తెలిసిన డాక్టరుకి చూపించాను. ఆయన క్రియాటి నైన్ టెస్ట్ చేయించాడు. One point two వుంది. పర్వాలేదు కిడ్నీ ప్రాబ్లం కాదేమో అన్నాడు. బాటిల్ ఇచ్చాడు అని చెప్పానే మా బావమరది, వాడు మిలిటరీలో డాక్టరు. రిపోర్టులు అవీ చూసి ఒకసారి సీటీ స్కాన్ తీయిద్దాము డౌట్ క్లియర్ అవుతుంది అన్నాడు, ఆ డౌటేమిటో చెప్పకుండా. స్కాన్ చేయిస్తే ఇదిగో ఇది బయటపడింది. తరువాత బయాప్సీ అన్నారు. అనగానే అర్ధం అయిపొయింది ఇదేదో కేన్సర్ బాపతు అని. అదే కన్ఫర్మ్ అయింది. ముందే తెలిసింది కాబట్టి కొంత ఛాన్స్ వుంది అంటున్నారు డాక్టర్లు. చాన్స్ అంటే తెలుసు కదా Life Extension అన్న మాట. కాబట్టి నేను కూడా చాన్స్ తీసుకో దలచుకోలేదు. ఇన్నాళ్ళు తాగుడూ గట్రా ఏమీ లేకుండా గడిపేశాను. అ డాక్టర్ గారేమో ఇక నీ ఇష్టం కానీయ్ అని పచ్చ జెండా ఊపాడు. వెంటనే మీ ఇద్దరూ జ్ఞాపకం వచ్చారు. ఇన్నేళ్ళు మీరు ఎప్పుడు అడిగినా నేను కంపెనీ ఇవ్వలేదు, అందుకని నేనే మీకు హోస్ట్ చేయాలని సుందరానికి ఫోన్ చేసి చెప్పాను సుబ్బును కూడా తీసుకురమ్మని. ఇద్దరూ వచ్చారు, సంతోషం. నాకు ఈ ఆట రూల్స్ ఆట్టే తెలియవు. మీరే సెల్ఫ్ హెల్ప్ చేసుకోవాలి, నాకూ చేయాలి. నా భార్య ఏమీ అనుకోదు, ఆమెకు కూడా విషయం అర్ధం అయిపోయింది. మన చేతిలో ఏమీ లేదని. కానీ మన చేతిలో గ్లాసులు వున్నాయి. రైట్! చీర్స్ చెప్పండి ఫర్ మై హెల్త్”

సుబ్బారావుకు ఆ క్షణంలో, శేఖరంలో తను ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త శేఖరం కనిపించాడు.

(16-11-2020)

12, నవంబర్ 2020, గురువారం

వార్తలు చదివిన ఏడిద గోపాల రావు ఇక లేరు

 “ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.

ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.

ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.

1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.

వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.

రేడియో వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో ఈరోజు (గురువారం) కన్నుమూశారు.



(శ్రీ ఏడిద గోపాలరావు)


అబుల్ కలాం అబ్దుల్ కలాం కాదు

 


అందరికీ అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాన్ని తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది అనే వారు హైదరాబాదు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ కీర్తి శేషులు శ్రీ ఆర్.జే.రాజేంద్రప్రసాద్.

పొద్దున్న ఏదో ఛానల్ లో స్క్రోలింగ్  కనబడింది ఈరోజు అబ్దుల్ కలాం జయంతిని జాతీయ విద్య దినోత్సవంగా పాటిస్తున్నారని. మొదటి పదం మినహా అన్నీ కరక్టే. పేరే తప్పు. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. పూర్తిపేరు  మౌలానా సయ్యీద్ అబుల్ కలాం గులాం మొయుద్దీన్ అహ్మద్ బీన్ ఖైరుద్దీన్ ఆల్ హుస్సేనీ ఆజాద్. 1888 నవంబరు 11 వ తేదీన జన్మించారు. గొప్ప విద్యావేత్త. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి.  ఆయన హయాములోనే జాతీయ విద్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఈనాడు భారతీయ విద్యాలయాలకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన Indian Institute Of Technology (I.I.T.) University Grants Commission వంటి సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ  ఉచితంగా ప్రాధమిక విద్యను బోధించాలనేది ఆయన ఆశయం. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1998 లో హైదరాబాదులో మొట్టమొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. ఆయన జయంతి నవంబరు పదకొండో తేదీని జాతీయ విద్య దినోత్సవంగా జరపాలని 2008లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మాజీ  రాష్ట్రపతి  ఏపీజే  అబ్దుల్  కలాం అనుకుని పొరబడి ఆ టీవీ స్క్రోల్ చేసి ఉండవచ్చు. పొరబాటే కావచ్చు కానీ ఒకింత జాగ్రత్త పడి తెలుసుకుని రాసిఉంటే బాగుండేది అనేది భవదీయుడి అభిప్రాయం.  

 

8, నవంబర్ 2020, ఆదివారం

రోటీ పచ్చళ్ళ వేణుగోపాల్ ఇక లేరు

 


అందరికీ తనదైన శైలిలో రోటీ పచ్చడి రుచి చూపించిన వాసిరెడ్డి వేణుగోపాల్ ఇక లేరు.



అంశం ఎలాటిదైనా సరే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పి పాఠకులను అభిమానులుగా చేసుకున్న వేణుగోపాల్  ఇక లేరు.

స్నేహానికి ప్రాణం ఇస్తూ  చక్కని చిక్కని నైంటీ ఎమ్మెల్ మాటలతో మిత్ర బృందాన్ని అలరించిన వేణుగోపాల్ ఇక లేరు.

నమ్మలేని ఈ నిజాన్ని యాంకర్ మిత్రుడు చంద్ర పొద్దున్నే తెలియచేస్తే, వేణుగోపాల్ గారి సోదరి వాసిరెడ్డి పద్మ గారు ధ్రువ పరిచారు.

వేణుగోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటూ ఒంటరి అయిపోయిన రోలూ రోకళ్ళకు, ఆయన ప్రేమతో పెంచిన అనేక మొగ జీవాలకు సానుభూతి తెలియచేసుకుంటున్నాను.  

7, నవంబర్ 2020, శనివారం

అమెరికా ఎన్నికల్లో కలాలకు సంకెళ్ళు దేనికి?

 సరే! జగను, బాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ అంటే మీ లెక్కలేవో మీకున్నాయి. నిష్పక్షపాతంగా రాయాలి అంటే మీ ఇబ్బందులేవో మీకున్నాయి. అలాగే, ఆర్ధిక సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వగైరా వగైరా!

మరి ఎవరి కొమ్మూ కాయల్సిన అవసరం లేని సందర్భం వచ్చినప్పుడు కూడా మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా, భయమూ, బెదురూ లేకుండా వార్తను వార్తగా రాయడానికి ఏమి అడ్డం వస్తోంది. అమెరికా ఎన్నికల్లో ట్రంపునో, బైడన్ నో మోయాల్సిన అవసరం ఏమొచ్చింది?

ట్రంపు మేనమామ కొడుకూ కాదు, బైడన్ మేనత్త కొడుకూ కాదు. వాళ్ళు మీకు ఇచ్చే ఆర్ధిక వత్తాసూ ఏమీ లేనప్పుడు మీ కలాలకు బానిస సంకెళ్ళు దేనికి? ఎందుకోసం?

5, నవంబర్ 2020, గురువారం

అవునా! ఇది నిజమేనా! – భండారు శ్రీనివాసరావు

 

వినగానే ముక్కుమీద వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే సంగతులు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అలాంటిదే ఇది.

సరే! అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుస్తాడా ట్రంపే మరోసారి విజయం సాధిస్తాడా అనేది ఇవ్వాళ కాకపొతే మరో వారం రోజుల్లో అన్నా నిర్ధారణ అవుతుంది. అప్పటిదాకా టీవీల్లో నిరంతర చర్చలు ఎలాగూ తప్పవు. అదికాదు విన్న సంగతి. ఈ విషయం అమెరికన్ జ్యుడిషియరీ సిష్టం గురించి.

అమెరికాలోని తెలుగువాళ్ల సంస్థ టానాకు చెందిన జై తాళ్ళూరి, ఒక తెలుగు ఛానల్ లో మాట్లాడుతూ చెప్పిన దాని ప్రకారం అక్కడి సుప్రీం కోర్టు జడ్జీలకి పదవీ విరమణ వయసు అంటూ వుండదు. జడ్జీ స్థానం ఖాళీ కావాలంటే వారు రాజీనామా అన్నా చేయాలి, లేదా మరణించాలి. ఒక్కసారి ఆ కుర్చీ ఎక్కితే, చనిపోయేవరకు వారికి ఆ పదవి అంటిపెట్టుకునే వుంటుంది. వారిని నియముంచే అధికారం అమెరికన్ ప్రెసిడెంటుకు మాత్రమే వుంటుంది. కానీ ప్రతి ప్రెసిడెంటుకూ ఆ అవకాశం లభించదు. ఎందుకంటే ఖాళీలు ఏర్పడడం అంత సులభం కాదు. తమ నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక జడ్జీని నియమించగలిగితే అదే గొప్ప. ఆ అవకాశం కూడా రాని ప్రెసిడెంట్లు చాలామంది వున్నారు. అలాంటిది డొనాల్డ్ ట్రంపు కి మాత్రం ఏకంగా ముగ్గురిని నియమించే అపూర్వ అవకాశం లభించింది. ఆయన హయాములో మూడు స్థానాలకు ఖాళీ ఏర్పడడమే అందుకు కారణం.

ప్రస్తుతం అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో డెమొక్రాట్ ప్రెసిడెంట్లు నియమించిన వారు నలుగురు కాగా రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నియమించిన వాళ్ళు అయిదుగురు వున్నారట.
కౌంటింగ్ సరళిపై అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన ట్రంప్, సుప్రీం తలుపు తడతాను అని అంతకంటే బాజాప్తాగా ప్రకటించడానికి ఇదే కారణమా!

మన దేశంలో కూడా జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఇది తెలియరావడం కేవలం కాకతాళీయమే. (05-11-2020)