17, జులై 2020, శుక్రవారం
నిలువెత్తు వెంకన్న
15, జులై 2020, బుధవారం
అనుకున్నామని జరగవు అన్నీ .......
రాత్రి మిత్రుడు భగీరధ ఫోన్ చేసాడు. క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు. ఆయనకీ నాకూ ఓ బాదరాయణ సంబంధం వుంది. ఇద్దరమూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఉద్యోగులమే. ఆయన సినిమా విలేకరి. నేను అది కాక మిగిలినవి. హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో దగ్గర దగ్గరలో అద్దెకు వుండేవాళ్ళం. సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ఆకళింపు చేసుకున్నవాడు. సహృదయుడు కావడం వల్ల వృత్తిగతంగా ఏర్పడ్డ పరిచయాలను నాలుగు కాలాల పాటు పదిలపరచుకోగలిగాడు. ఆ అనుభవసారంతో అనేక పుస్తకాలు రాశాడు. మనిషి వున్నప్పుడు లేనప్పుడు కూడా ఆమనిషిని గుర్తు చేసేవి ఆ పుస్తకాలే అంటాడు గర్వంగా.
మాటల్లో అడిగాడు మీ రేడియో అనుభవాలను కూడా గ్రంధస్తం చేయొచ్చుకదా అని. ఫేస్ బుక్ మిత్రుల్లో కూడా అనేకమంది నాకు ఈ సలహానే ఇచ్చారు. సినిమాలు చూసేవాడు చూడాలి. సినిమాలు తీయాలని అనుకోకూడదు, అనుకుంటే చేతులు కాల్తాయి అనేది నా రొటీన్ జవాబు.
ఈ జవాబుకు జవాబా అన్నట్టు అమెరికా నుంచి ప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నాకొక మెసేజ్ పంపారు. ఫేస్ బుక్ లో నా రేడియో రోజుల అనుభవాలు చదివాననీ, వాటిని తాము ఒక పుస్తకంగా తీసుకు వస్తాననీ. ఆయన పనుపున ఓ పెద్ద మనిషి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అన్నీ కంప్యూటర్ లో వున్నాయి. ఎవరినైనా అడిగి కాపీలు తీసి పంపిస్తానని చెప్పి పంపించేశాను. ఈలోగా కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. ఆ ప్రతిపాదన ప్రస్తుతానికి అటక మీద పదిలంగా వుంది.
వినాయకుడి పెళ్లి అంటే మాటలా! ఎన్నో కలిసిరావాలి.
13, జులై 2020, సోమవారం
ఆడని సినిమాలు
నాకు ఊహ తెలిసినప్పటినుంచి, తెలియక ముందు నుంచి గత డెబ్బయి అయిదేళ్లకు పైగా సినిమాలు ఆడుతూనే వున్నాయి. వాటిల్లో బాగా ఆడిన సినిమాలు, సరిగా ఆడని సినిమాలు అంటూ ఉండేవి కానీ అసలు సినిమాలు ఆడని రోజులు ఉండేవి కావు. కర్ఫ్యూలు, బంద్ ల సందర్బాలలో సినిమాహాళ్ళు మూసేసినా అది తాత్కాలికం. చిన్నప్పుడు మా వూళ్ళో సినిమా హాలు లేదు కాని పొరుగున మూడుమైళ్ళ దూరంలో వున్న ఊళ్లలో టూరింగు టాకీసులు ఉండేవి. అలాంటిది జీవితంలో మొట్టమొదటిసారి ఉంటున్న ఊళ్లోనే కాదు యావత్ దేశంలో ఎక్కడా సినిమాలు ఆడని పరిస్తితి కనిపిస్తోంది. ఒక్కరోజు కాదు, నాలుగు మాసాలుగా ఇదే పరిస్తితి. ఈ శతాబ్దంలోనే కాదు, గత శతాబ్దంలో సయితం ధియేటర్లు వుండికూడా ఎక్కడా సినిమాలు ఆడకపోవడం అన్నది ఇదే మొదటిసారి. గతంలో టీవీలు వచ్చిన కొత్తల్లో అనుకునేవాళ్లు ఇక సినిమాల శకం ముగిసిపోయిందని. అలా జరగలేదు. పైగా సినీరంగం మరింత విస్తరించింది.
ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ దశ కూడా చూస్తున్నాం. ఇది తాత్కాలికం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ రంగంలో కోటికి పడగలెత్తినవాళ్ళతో పాటు పూటగడవని వాళ్ళు కూడా వున్నారు. (13-07-2020)