18, ఏప్రిల్ 2020, శనివారం

రజ్జుసర్ప భ్రాంతి – భండారు శ్రీనివాసరావు

తాడును చూసి పాము అని భ్రమించడం వల్ల చిక్కేమీ వుండదు కానీ పామును తాడు అనుకుని పట్టుకుంటేనే ప్రమాదం.
దేవరకొండ ప్రసాద్ ఆయన ఫేస్ బుక్ లో స్నేహితుడు మాత్రమే కాదు, విజయవాడ సీవీఆర్ స్కూల్లో క్లాస్ మేట్ కూడా. నాలాగే పదవీవిరమణ అనంతరం విశ్రాంత జీవనం గడుపుతూ, ఫేస్ బుక్ లో తన పోస్టింగులతో మంచి స్నేహబృందాన్ని తయారు చేసుకున్నారు. చేసింది బ్యాంకు ఉద్యోగం. అయినా సమకాలీన సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. వీరి తమ్ముడు దేవరకొండ మురళి కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు నా చిన్ననాటి స్నేహితుడు.
ఈ ప్రసాద్ దేవరకొండ ఈ రోజు మధ్యాన్నం రెండున్నర ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టారు. అదేమిటంటే:
“బీజేపీ లీడర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డిగారిని AP పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేసారు. ఎందుకు చేసారో తెలియదు. అయన పాపం చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సీఎం గారికి మద్దతుగా TV డిబేట్లలో మద్దతుగా మాట్లాడేవాడు. అలాగే సోము వీర్రాజుగారు, విష్ణు కుమార్రాజుగారు, కూడా మంచి మద్దతుదారులు. GVL గారయితే సీఎం గారికి ఏ చిన్నసమస్య వొచ్చిన AP లో వాలిపోయి TV ల్లో మద్దతుగా మాట్లాడేవారు. రాజధాని మార్పుకి మద్దతు ప్రకటించారు. CM గారు ఇవి దృష్టిలో ఉంచుకుని విష్ణువర్ధన్రెడ్డి గారిని విడుదల చేయగలరని ఆశిస్తున్నాను”
నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
విష్ణువర్ధన రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖుడు. ఆయనకు కేంద్రంలో డిప్యూటి మంత్రి హోదా కలిగిన నెహ్రూ యువక కేంద్రం ఉపాధ్యక్ష పదవి వుంది. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాదులో అరెస్టు చేయడం ఏమిటి అని.
విష్ణువర్ధనరెడ్డి గారికి ఫోన్ మెసేజ్ పెట్టాను. ఆయన తిరిగి కాల్ చేశారు. విషయం చెప్పి వివరణ అడిగితే ఆయన చిన్నగా నవ్వారు.
‘విష్ణువర్ధన రెడ్డి అరెస్టు నిజమే. కానీ ఆ విష్ణువర్ధనరెడ్డిని నేను కాదు’ అంటూ విషయం చెప్పుకొచ్చారు.
మెదక్ జిల్లాకు చెందిన ఒక విష్ణువర్ధన రెడ్డి మాజీ పైలట్. కాణిపాకం దేవాలయంలోకి చెప్పులతో జనాన్ని అనుమతిస్తున్నారని ఒక సెల్ఫీవీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
అయితే ఆయన పొరబాటు పడి అతిగా స్పందించారు. కాణిపాకం దేవాలయానికి చెందిన కొన్ని గదుల్లో కరొనా క్వారంటైన్ నడుపుతున్నారు. ఆయన కాణిపాకం దేవాలయంలోనే అదంతా జరుగుతోందని అర్ధం వచ్చేట్టు వీడియో పోస్ట్ చేసారు. దీనిపై ఏపీ పోలీసులు స్పందించి ఆయన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో విషయం ఏమిటంటే కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి బీజేవైఎం అద్యక్షులు రెడ్డి గారు అనంతపురంలోనే వుండిపోయారు.
ఇద్దరి పేర్లు ఒకటే కనుక ప్రసాద్ పొరపడి ఉండవచ్చు. కానీ ఆయన పోస్టు చదివిన వారికి వేరే భావన కూడా కలుగుతుంది. అక్కడ అరెస్టు కంటే ఏపీ ప్రభుత్వం పై తనకున్న వైమనస్య భావమే అందులో ద్యోతక మవుతుంది. అంతేకాకుండా ఏపీ బీజేపీ నాయకుల్లో కొందరి పేర్లను ఉదహరిస్తూ వారంతా జగన్ అనుకూలురు అనే అభిప్రాయం వచ్చేలా ఆ పోస్ట్ వుంది.
నిజానికి దీనిపై ఇంత వివరణ అవసరం లేదు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయింది నా క్లాస్మేట్. కాబట్టి ఇంతగా రాయాల్సి వచ్చింది.
రాజకీయ పరిస్తితులు ఉద్రిక్తంగా వున్నప్పుడు ప్రతిదీ వివాదాస్పదమే అవుతుంది. పెళ్లి పుస్తకం సినిమాలో ముళ్ళపూడి వారన్నట్టు, అపార్ధాలు ముసురుకున్నప్పుడు సీతా అన్నా బూతుగా వినిపిస్తుంది. అందుకే జాగ్రత్త అవసరం. నాకు ఇలాంటి వార్తలు తెలిసినా తొందరపడి పోస్ట్ చేయను. నా సోర్సుల ద్వారా నిర్ధారించుకుంటాను. ఈ వెసులుబాటు అందరికీ ఉండకపోవచ్చు. అటువంటప్పుడు తెలిసిన వాళ్ళను సంప్రదించాలి. ఈ లోగా కొంపలు మునిగేది ఏమీ వుండదు. రాజకీయ పార్టీల వాళ్ళంటే అది వేరే సంగతి. చిక్కుల్లో చిక్కుకోవడం వారికి తెలుసు. బయటకు రావడం వారికి తెలుసు.
ఈ విషయం నా స్నేహబృందంలోని ప్రసాద్ వంటి వాళ్ళు తెలుసుకోవాలి.

రోశయ్య గారితో కాసేపు – భండారు శ్రీనివాసరావు


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పాత విషయాలు కదా తేదీలు సంవత్సరాలు సరిగా గుర్తుండడం లేదు.
తిరుపతికి దగ్గరలో, మరీ అంత దగ్గర కాదు, శ్రీ సిటీ అనే ఒక సెజ్ రూపు దిద్దుకుంటోంది. ఆ సంస్థ పీఆర్వో కి మాకు ఆ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలనే సత్సంకల్పం కలిగింది. జర్నలిస్టు శంకర్, జ్వాలా నేను. తిరుపతిలో స్వామి దర్శనం అనే మాట మమ్మల్ని మరో మాట మాట్లాడ నివ్వలేదు. హైదరాబాదు నుంచి విమానంలో చెన్నై వెళ్లి, అక్కడి నుంచి శ్రీ సిటీ కారులో అక్కడికి చేరడం మా ప్రోగ్రాం.
సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్ భవన్ కు ఫోన్ చేసి తుల్జానంద్ సింగ్ తో మాట్లాడాడు. ఆయన వెంటనే రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నైలో దిగేంతవరకు ఈ రాజ్ భవన్ సందర్శన కార్యక్రమం లేదు. ఏ వూరు పోయినా ఆ వూళ్ళో ఎవరెవరు తెలిసిన వాళ్ళు వున్నారో వాళ్లకి ఫోను చేయడం కాని, వీలయితే కలిసిరావడం కానీ జ్వాలా పీఆర్ లో ఒక భాగం.
తుల్జానంద్ రండి రండి అంటూ ఆహ్వానం పలకడం, మేము ప్రయాణిస్తున్న వాహనం రూటు మార్చుకుని రాజ్ భవన్ లోకి దూసుకుపోవడం జరిగింది. లోపలకు వెళ్ళగానే అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా పేరుతొ పలకరించి, ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం. ఎప్పటెప్పటివో సంగతులు చెప్పారు. తెనాలి, గుంటూరు, విలేకరులను ఆయన పేర్లతో సహా గుర్తు పెట్టుకోవడం గమనించి ముచ్చటేసింది.
పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం బాగా కుదించుకు పోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్ నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.
'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'
చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకున్న సంజాయిషీ అది.
కాసేపు కబుర్లు చెప్పుకుని, తుల్జానంద్ సింగ్ ఫోటోలు తీయగా తీయించుకుని, రోశయ్య గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పి మళ్ళీ రోడ్డున పడ్డాము. దోవలో శరవణ భవన్ కనిపిస్తే టిఫిన్లు, కాఫీల పనిపూర్తి చేసుకుంటుంటే జ్వాలా ఎవరితోనో తెలుగులో ఫోన్లో మాట్లాడుతూ కన్పించాడు. దాంతో మరో స్టాప్ అనివార్యం అని తేలిపోయింది.
అప్పుడీ గూగుల్ మ్యాపులు లేవు. దోవలో దారి కనుక్కుంటూ కువైట్ శర్మ గారింటికి వెళ్ళాము. నిజానికి ఆయన బాంబే శర్మగారు. షిప్పింగ్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. అప్పుడెప్పుడో ఏదో పని మీద బాంబే వెడితే (అప్పటికి ముంబై కాలేదు) ఆయన జ్వాలని, నన్నూ ఒకరోజంతా షిప్పులో అతిధులుగా మర్యాదలు చేశారు. బీరు సీసాల్లో కాకుండా టిన్నుల్లో దొరుకుతుందన్న లోకజ్ఞానం అప్పుడే కలిగింది. . ప్రపంచంలో దొరికే అరుదైన స్కాచ్ విస్కీలు అన్నీ ఆ షిప్ బార్లో వున్నాయి.
ఆ తర్వాత శర్మ గారు కువైట్ వెళ్ళిపోయారు. అక్కడ ఉండగానే యుద్ధం వచ్చి ఆ దేశంలో ఉన్న భారతీయులు అందరూ కట్టుబట్టలతో స్వదేశం చేరుకోవాల్సి వచ్చింది. అలా కాందిశీకులుగా దేశం చేరుకున్నవారిలో శర్మ గారి కుటుంబం కూడా వుంది. పిల్లలు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళూ పేరంటాలు అయిన తర్వాత ముందు ఢిల్లీలో, తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు.
ఆయన ఇంటికి వెళ్ళే సరికి శర్మ గారికి ఒంట్లోబాగాలేదని తెలిసింది. పడక పక్కన ఆక్సిజన్ సిలిండరు వగైరా. మమ్మల్ని చూడగానే ఒంటిమీద అంటించిన తీగెల్ని సినిమాలో హీరోలా పీకి పారేసి డ్రాయింగు రూములో మా దగ్గర కూర్చుని హుషారుగా కబుర్లు మొదలు పెట్టారు. శర్మ గారి భార్య కూడా సంతోష పడింది, ఆయనలో మార్పు చూసి.
తర్వాత అడంగు శ్రీ సిటీ. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి వుంది. అక్కడ తయారయ్యే వస్తువులు అన్నీ ఎగుమతికి ఉద్దేశించినవి కాబట్టి అక్కడ కష్టమ్స్ అధికారుల అనుమతి లేకుండా లోపలకు బయటకు రాకపోకలు నిషిద్ధం. అయితే ముందస్తు ఏర్పాట్ల కారణంగా మా వాహనానికి గేట్లు బార్లా తెరుచుకున్నాయి. గెస్ట్ హౌస్ లో దిగి కాసేపు విశ్రాంతి. సెజ్ ఉన్నతాధికారులతో ఇష్టాగోష్టి మాటలు. ఆ తర్వాత మమ్మల్ని సెజ్ లోని వివిధ ఉత్పత్తి విభాగాలకు తీసుకు వెళ్ళారు. విశాలమైన రోడ్లు. చల్లటి నీడనిస్తూ బాగా పెరిగిన చెట్లు. కాలిబాటలు. వాటికి కూతవేటు దూరంలో పెద్ద పెద్ద భవనాలు. ఫాక్టరీ షెడ్లు.
మెత్తటి దూది కూరిన బొమ్మలు తయారు చేసే ఫాక్టరీకి వెళ్ళాము.
నా చిన్నప్పుడు మా నాన్నగారు చెన్నపట్నం నుండి ఓ దూది (కూరిన) చిన్న కుక్క బొమ్మ తెచ్చారు. యెంత ముద్దొచ్చేదో!
పెరిగి పెద్దయి మాస్కోలో ఉద్యోగం చేసే రోజుల్లో అక్కడ బొమ్మలే బొమ్మలు. సోఫాలో కూర్చోబెడితే మనకంటే పెద్దగా కనబడే భారీ సైజు ఎలుగుబంటి బొమ్మ నాకు ప్రాణసమానంగా వుండేది. అదేమిటో ఏండ్లు మీద పడుతున్నా బొమ్మలన్నా, చందమామ పత్రిక అన్నా మోజు రోజు రోజుకూ పెరిగిపోతూనే వుంది.
శ్రీ సిటీలో వున్న బొమ్మల ఫాక్టరీ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసే ఫాక్టరీ అయినా చాలా పెద్దగానే వుంది. చైనా వాళ్ళది కాబోలు. (Pals Plush Ltd., China). ఇక్కడి వ్యవహారాలను శ్రీమతి సీమా నెహ్ర పర్యవేక్షిస్తున్నారు. వెంట వుండి అందులోని విభాగాలను అన్నీ చూపించారు. ఎగుమతుల వ్యవహారం కాబట్టి నాణ్యతలో రాజీపడే ప్రసక్తి వుండదు. పిల్లల బొమ్మలు కాబట్టి వాటితో ఆడుకునే చిన్నారులకు ఎలాటి అనారోగ్యసమస్యలు, ప్రమాదాలు కలగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాల్లో ఏమాత్రం తభావతు వచ్చినా ఇంతే సంగతులు. మొత్తం సరుకు తిప్పి పంపిచేస్తారు. ఇన్ని ప్రమాణాలు పాటించే ఈ యూనిట్ లో పనిచేసేవాళ్ళు చాలామంది ఆ చుట్టు పక్కల వుండే జనాభాలో అరకొర చదువులు చదివిన వారే కావడం గమనార్హం. వారికి సాంకేతిక పరమైన శిక్షణ ఉచితంగా ఇచ్చి ఉపాధులు కూడా అక్కడే కల్పిస్తున్నారు.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

వృత్తి, ప్రవృత్తి


(ఎటో వెళ్లిపోయింది మనసు)  
‘వైద్యం నా వృత్తి, రచనావ్యాసంగం నా ప్రవృత్తి’ అంటుంటారు రెండింటిలో చేయి తిరిగిన వాళ్ళు.
చిన్నప్పటి నుంచి నాకు తెలుగంటే అవ్యాజానురాగం. బహుశా వేరే ఇతర భాషలు ఒంటపట్టక పోవడం దీనికి కారణమేమో! మాస్కో రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో నాకు రష్యన్ భాష నేర్పడానికి ఒక టీచరమ్మను పెట్టారు. ఆవిడ వారానికి మూడు సార్లు మా ఇంటికి వచ్చి రష్యన్ పాఠాలు చెప్పేది. చివరికి జరిగిందేనిటంటే నాకు రష్యన్ ఒక్క ముక్క అంటకపోగా ఆవిడ మాత్రం ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది. సరే! మా ఇద్దరు పిల్లలు అక్కడే ఇండియన్ ఎంబసీ వారి స్కూల్లో చదువుకున్నారు. మాస్కో మొత్తంలో అదొక్కటే  ఇంగ్లీషు మీడియం స్కూలు. క్లాసులో వుండేది పదిహేను, ఇరవై మంది విద్యార్ధులే అయినా ఒకడు అమెరికా, మరొకడు ఇంగ్లాండ్, ఇంకొకడు ఆఫ్రికా, ఇండోనేషియా ఇలా  ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలా వుండేది. మిగిలిన వాళ్ళు మన దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు.  ఇలా మొత్తం ఇంటర్నేషనల్. అయితే వీళ్ళని కలిపి వుంచేది దండలో దారంలా ఇంగ్లీషు భాష ఒక్కటే.
ఆ మాస్కో అధ్యాయం ముగిసి ఇండియాకు తిరిగొచ్చాము. పెద్ద వాడు ఇంజినీరింగు పాసయ్యాడు. చిన్నవాడు డిగ్రీ. ఇంజినీరింగు అయిన తర్వాత ఉద్యోగాల వేట. ఆ రోజుల్లో పెద్ద కంపెనీల వాళ్ళు  ఎక్కడెక్కడినుంచో ఫోను ఇంటర్వ్యూలు చేసి అభ్యర్ధుల్ని  వడపోసేవాళ్ళు. చివరికి పర్సనల్  ఇంటర్వ్యూదాకా వెడితే ఏముంది అక్కడ అందరూ ఐఐటీవాళ్ళు పోటీ.  అక్కడ మా వాడికి మాస్కో ఇంగ్లీష్ అక్కరకు వచ్చి సెలక్టు అయి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోవాడు  కేవలం డిగ్రీ అయినా ఇంగ్లీష్ ప్రావీణ్యం వాడిని ఒక అంతర్జాతీయ సంస్థలో పెద్ద ఉద్యోగిని చేసింది.
నాది ప్రవృత్తి, వాళ్ళది వృత్తి.  
అలా అడ్జస్ట్ అయిపోయి, ‘తెలుగదేలయన్న’ అని పద్యాలు పాడుకుంటూ  నా తెలుగు అభిమానాన్ని నాలోనే దాచుకున్నాను.  

16, ఏప్రిల్ 2020, గురువారం

సర్కారీ రేడియోలో ఉన్న స్వేచ్చ ఈనాటి మీడియాకు వున్నదా!


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
సుమారు  మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ, ఆ మాటకు వస్తే కేంద్రప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా  'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు  అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
రేడియో వార్తల సేకరణ, కూర్పు, ప్రసారాల్లో 'విధి నిర్వహణా స్వేచ్ఛ' గురించి సోదాహరణంగా చెప్పుకోవడం సముచితంగా వుంటుంది.   
నర్రావుల సుబ్బారావు గారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో  అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆయన్ని చూడగానే హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ అని ఎవరూ అనుకోరు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.
ఒకసారి ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని అన్నారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.
“చూడు సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తె ఇక్కడ సమాధానం   చెప్పాల్సిన అవసరం నాకు  లేదు”
ఇరువురూ హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి  ముగిసిపోయింది.
రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ఈడువాడే, కొంచెం చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.
‘గంటలో ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది రేడియోకి ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత జర్నలిస్టుల  స్వేచ్చ గురించి తీరిగ్గా  మాట్లాడుకుందాము’
అతడు చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ రాదని అతడికీ తెలుసు.
ఆ తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.   

మహాభారతంలో కూటనీతి – భండారు శ్రీనివాసరావు


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన  సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి  వున్నాయి.  అయితే, అతడి దురదృష్టం,  అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి  వినాశనానికి హేతువు అయింది.
దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా  వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి పంచపాండవులను హతమార్చాలనే పన్నాగం బెడిసి కొట్టడంతో దుర్యోధనుడిలోని అసూయాద్వేషాలకు అంతం లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో కౌరవ సలహాదారులలో ఒకడయిన కణికుడు దుర్యోధనుడికి ఇచ్చిన సలహాలు కూటనీతి పేరిట ప్రాచుర్యం పొందాయి. ప్రత్యర్ధుల పీచమణచడానికి ఉద్దేశించిన ఈ కుటిల పన్నాగాలకు సంబంధించి   మహాభారతంలో ఏకంగా ఒక అధ్యాయమే వుంది. కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈనాటి రాజకీయులు కణికుడు బోధించిన ఆ కూటనీతినే పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ కూటనీతి ప్రకారం రాజు అనేవాడు శత్రురాజుపై హమేషా ఓ కన్నేసి ఉంచాలి. తనకు నమ్మకస్తులైన సాటి రాజులను వైరి రాజుకు అనుకూలంగా మాట్లాడేటట్టు చేయాలి.
దేశ సంచారం చేసే కొంతమంది పండిత శ్రేష్టులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇరుగుపొరుగు రాజ్యాల్లో తన మంచితనం గురించి, తన సామర్ధ్యం గురించి తన సుపరిపాలన గురించి సానుకూల ప్రచారం ప్రజాబాహుల్యంలోకి చొచ్చుకు పోయేలా చేయాలి.
విశ్వాసపాత్రులయిన తన సొంత మనుషులను  కొంతకాలంపాటు శత్రు దేశపు రాజు కొలువులో చేర్పించి వారి ద్వారా అతడి లోగుట్లను, బలహీనతలను గురించిన సమాచారం తనకు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు వైరి ప్రభువుల ఎదుట తనను తూలనాడుతూ ఆ రాజు నమ్మకాన్ని చూరగొనేలా చూసుకోవాలి.
ఇలా అనేకానేక బోధలు ఈ కూటనీతిలో వున్నాయి.
అవన్నీ ఆ గాంధారిసుతుడు ఎన్ని ఏమేరకు ఆచరించాడో లేదో తెలియదు కానీ మహాభారతంలో పేర్కొన్న ఆ కూటనీతి శాస్త్రాన్ని ఈనాటి రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా ఆచరణలో పెడుతున్నారు.
‘ఎందుకైనా మంచిది అతడిపై ఓ కన్నేసి ఉంచు’ అంటుంది సినిమాలో ఓ దుష్ట పాత్ర. ‘ఒక కన్నేమిటి రెండు కళ్ళూ అతడిమీదనే’ అంటుంది అతడి సహాయక దుష్టపాత్ర.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు అసెంబ్లీ లాబీ విశేషాలు సేకరించే విలేకరులు కొందరు లాబీలో ఒక చోట చేరి ఆ వైపుగా వచ్చిన ఒక మంత్రితో పిచ్చాపాటీ మాటలు కలిపారు. మూడు దశాబ్దాల అనుభవం వున్న ఓ సీనియర్ పాత్రికేయుడు హాస్యోక్తిగా ఆయనపై ఓ వాక్బాణం విసిరి, అది విని అక్కడ ఉన్న  అందరూ పెద్దగా నవ్వుతుండగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళాడు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి.  ఆ విలేకరిని  చూస్తూనే ముఖ్యమంత్రి ఒక చిరునవ్వు నవ్వి, ‘ఏమిటి మా మంత్రిని అలా  ఆట పట్టిస్తున్నావ్’ అని అడిగారు. జరిగి  నిమిషాలు కూడా  గడవక ముందే ఈ విషయం సిఎం చెవులకు ఎవరు చేరవేసారా అని ఆశ్చర్య పోవడం ఆ విలేకరి వంతయింది.
అలా పనిచేస్తాయి ప్రభుత్వ నిఘా వర్గాలు. టెర్రరిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి వారి ఆనుపానులు సంబంధిత అధికార వర్గాలకు అందచేయడం వారి ప్రాధమిక బాధ్యత. కానీ వాళ్ళు ఎక్కువగా దృష్టి సారించేది ప్రత్యర్ధి పార్టీల నాయకుల మీద. నిఘా విభాగంలో పనిచేసిన అధికారే మరో విశేషం ఓ సందర్భంలో చెప్పారు. తన సొంత పార్టీ  నాయకుల గురించిన సమాచారం మీదే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఆసక్తి చూపేవారట.
అలా మహాభారత కాలంనాటి ఆ కూటనీతి నేటి భారత కాలంలో ఇలా వూడలు దిగి విస్తరిస్తోంది.   

15, ఏప్రిల్ 2020, బుధవారం

మబ్బుల్లో రాజకీయాలు

(ఎటో వెళ్ళిపోయింది మనసు)
టీవీ చర్చల్లో పాల్గొనే విశ్లేషకులకు వివరంగా మాట్లాడే అవకాశం అరుదుగా లభిస్తుందనేది స్వానుభవం.
‘నువ్వీరోజు గంట చర్చలో మాట్లాడింది నాలుగున్నర నిమిషాలు మాత్రమే’ అని ఒకసారి జ్వాలా లెక్క కట్టి మరీ చెప్పాడు. ఇక ఉండబట్టలేక ఓ టీవీ యాంకరిణితో అన్నాను కూడా, ‘మాట్లాడే చాన్స్ లేకపోతే పీడా పాయె. కనీసం తెరమీద అన్నా కాసేపు కనబడేట్టు చూడండి. మా ఆవిడ అనుమానస్తురాలు కాదు కానీ ప్రతిసారీ ఇలా టీవీ చర్చల పేరుతొ ఇంకెక్కడో తిరిగొస్తున్నానని ఏనాటికయినా అనుమానించే ప్రమాదం లేకపోనూ లేదు’.
నా మాటలో శ్లేష ఆ అమ్మడికి అర్ధమయిందో లేదో నాకు తెలియదు. అంతకంటే గట్టిగా చెప్పడం నాకు రాదు.
ఒక రోజు ఉదయం టీవీ 5 ఛానల్లో ఎక్జిక్యూటివ్ ఎడిటర్ (ఇప్పుడు ఎడిటర్ అయ్యారు) విజయ్ నారాయణ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం వారాలబ్బాయిగా నా హాజరీ అక్కడ. అలా అయిదారేళ్ళు క్రమం తప్పకుండా వెళ్లి వుంటాను. విజయ్ గారికి నా మీద అవ్యాజానురాగమో ఎందుకో తెలియదు కాని ముందు నా చేతనే మాట్లాడిస్తుంటారు. తర్వాత అవకాశం ఇచ్చే ఛాన్స్ రాదు అనేమో!
‘ఏపీ రాజకీయ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు?’ అనేది ఆయన అడిగిన ప్రశ్న. బహుశా ఈ ప్రశ్ననే మార్చి మార్చి అనేక డజన్ల పాటు అనేక చర్చల్లో అడిగివుంటారు. నేను పలుమార్లు నా జవాబునే తిరగేసి మరగేసి చెప్పివుంటాను.
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. వాటి చాటున దాగున్న రాజకీయ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలో మబ్బుల్లోకి చూస్తే వాటిలో ఒకరికి ఏనుగు ఆకారం కనిపిస్తుంది. మరికొందరికి అదే మబ్బులో మరో ఆకారం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించేవారికి కూడా విభిన్నమైన చిత్రాలు కనబడుతున్నాయి. రాజకీయపు పొరలు తొలగించుకుని చూస్తే వాస్తవమైన రాజకీయ చిత్రం గోచరిస్తుంది”
ఆనాటి చర్చలో నాతోపాటు శ్రీ కుటుంబరావు (టీడీపీ, అమరావతి నుంచి), శ్రీ రఘురాం (బీజేపీ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో) పాల్గొన్నారు.



ఎటో వెళ్ళిపోతోంది మనసు


ఈ లాక్ డౌన్ కాలంలో అందరికీ పుష్కలంగా దొరుకుతోంది ఒక్కటే! అది ఖాళీ సమయం. ఎంత ఖర్చు చేస్తున్నా ఇంకా మిగిలిపోతోంది. కాబట్టి గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. మనసు ఎటు తిరిగితే అటు తిరుగుదాం అనిపిస్తోంది. చిన్ననాటి సంగతులు, స్కూలు,  కాలేజి జ్ఞాపకాలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, విదేశాల్లో తిరుగుళ్ళు ఇలా ఏదిపడితే  అది గుర్తు చేసుకోవడం. అందుకోసమే ఈ రాతలు. దీనికి ఒక పద్దతి అంటూ వుండదు. ముళ్ళపూడి వారి ‘కోతికొమ్మచ్చి’ లాగా ముందుకూ, వెనక్కి, వెనక్కీ ముందుకూ. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు రెండూ వుంటాయి. కష్టాలను మనసులోనే దాచేసుకుని  ఆనంద క్షణాలను అందరితో పంచుకుంటే ఈ కరోనా హాలిడేస్ ని మరింత ఎంజాయ్ చేయగలుగుతాం.
“ఫేస్ బుక్ లో కానీ, పత్రికల్లో కానీ ఎవరు రాసినవి వాళ్ళు చదువుకోవడమే. మొహమాటానికి లైకులు కొట్టినా పూర్తి పాఠం చదివేవారు బొత్తిగా లేకుండా పోయార”ని  మితృడు  జ్వాలా నరసింహరావు ఒక పోస్టుకు కామెంటు పెట్టాడు. మొన్నమొన్నటి వరకు నాదీ ఇదే  అభిప్రాయం. ఫేస్ బుక్ లో ప్రవేశించిన చాలాకాలం వరకు నేను రాస్తూ పోయానే తప్ప ఇతరులు ఏం రాస్తున్నారనేది అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు వేరే వ్యాపకాలు చాలా ఉండేవి. ముప్పూటలు రోజూ ఏదో ఒక టీవీ స్టూడియోకి పోయిరావడం, నా బ్లాగుకు, పత్రికలకు వారం వారం వ్యాసాలు రాసే పనిలో తలమునకలుగా వుండడం, ఇప్పట్లా ఇంట్లో ‘ఒంటరితనం’ లేకపోవడం ఇలా అనేకానేక కారణాలు. ఇప్పుడు ఈ బాదర బందీలు లేవు. మా ఆవిడ పోయినదగ్గరి నుంచి ఐచ్చికంగా ఇవన్నీ  మానేసాను. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా ఒంటరితనం నన్ను తోడుగా చేసుకుంది. దాంతో ఫేస్ బుక్ లో  ఎవరు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు అనేదానిపై ఆసక్తి పెరిగింది. ఆణిముత్యాల వంటి రచనలు కళ్ళబడ్డాయి. మెరికల్లాంటి రచయితలు పరిచయం అయ్యారు. వాళ్ళ పూర్వ రంగం చూస్తే వాళ్ళలో ఎవ్వరూ కాగితం మీద కలం పెట్టిన వారిలా లేరు. కానీ వాళ్ళ రచనల్లో వడీ, వేగం, సహజత్వం ఏ ప్రమాణాల ప్రకారం తీసుకున్నా చేయి తిరిగిన రచయితలకు   ఏమాత్రం తీసిపోవు. మరో వాస్తవం ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళ ఫోటోలు పెట్టుకున్న ఆడవాళ్ళు మాత్రం కాదు. నేను ఫేస్ బుక్ లో ప్రవేశానికి ముందు ఒక నియమం పెట్టుకుని పాటిస్తూ వచ్చాను. బాగా తెలిసిన ఆడవారు అయితే తప్ప నేను లైక్ కూడా కొట్టను. కామెంట్ల జోలికి పోను. మొదట్లో అది నా అహంభావానికి చిహ్నంగా భావించినవాళ్ళూ వున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళే ఈవిషయం నాతో చెప్పారు. ఏడెనిమిది మంది మహిళలు, నలుగురయిదుగురు మగవాళ్ళు రాసినవి నేను తప్పకుండా చదువుతాను. ఫేస్ బుక్ లో సాధారణ పోస్టులకి భిన్నంగా, హాయిగా ఇంట్లోని  సంగతులు, చిన్ని చిన్ని ముచ్చట్లు చాలా ఆహ్లాదకరంగా రాస్తుంటారు. ఎవరినీ నొప్పించేవి కావు.
మరో సంగతి ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది నా పోస్టులు చదివేవారిలో లేరు. నేను రాసేవి చాలావరకు రాజకీయ పరంగా వుంటాయి. బహుశా వారి అభిరుచికి తగినట్టుగా ఉండకపోవచ్చు.
అందుకే జ్వాలా అభిప్రాయంతో నేను ఏకీవభించడం లేదు. ఓ ఎనిమిది నెలలకు పూర్వం అయితే ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.