26, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు – 24 - భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily on 24-11-2019, SUNDAY)

ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు

స్క్రిప్ట్ ఒకటే. చదివేది అదే మైకు ముందు. మరి రేడియో వార్తలు చదివే వాళ్ళలో ప్రత్యేకత ఏమిటి?
ఢిల్లీ నుంచి గతంలో తెలుగు వార్తలు చదివిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాణీ.
నిజమే.ఎవరు చదివినా అవే వార్తలు. కానీ చదవడంలో ఓ విరుపు. చదువుతూ చదువుతూ ఎక్కడో ఓ మెలిక. వార్తకు తగ్గట్టు స్వరంలో హెచ్చుతగ్గులు. వీటిని బట్టే ఆ రోజుల్లో శ్రోతలు వార్తలు మొదలయిన తర్వాత కూడా చదివే వ్యక్తిఎవరన్నది సులువుగా గుర్తు పట్టేవాళ్ళు.
అద్దంకి మన్నార్ వార్తలు చదువుతుంటే  జెట్ విమానంలా ఉరుకులు పరుగులు పెట్టినట్టు సాగిపోయేవి. దుగ్గిరాల పూర్ణయ్య గారు కంచు కంఠంతో నింపాదిగా చదివేవారు. కందుకూరి సూర్య నారాయణ గారు ప్రతి వాక్యాన్ని తనదైన శైలిలో ముగించేవారు. మావిళ్ళపల్లి  రాజ్యలక్ష్మి గారిది మరో తరహా. నిండుగా సాగిపోతున్న గంగా ప్రవాహం మాదిరిగా వుండేది. జోళిపాల్యం మంగమ్మ గారు వార్తలు చదువుతుంటే మరి కాసేపు అలా అలా వినాలి అనిపించేలా వుండేది. ఏడిద గోపాల రావు గారు వార్తల్ని చదువుతుంటే ముచ్చట్లు చెబుతున్నట్టు ముచ్చటగా ఉండేవి.  చొప్పదంటు లాంటి వార్తలకు కూడా ఆ మహానుభావులు జీవం పోసేవారు. అందుకే శ్రోతలను అంతగా ఆకట్టుకోగలిగారు.
ఢిల్లీలో ఆకాశవాణికి  చాలా పెద్ద వార్తా విభాగం వుంది. అనేక జాతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారం చేస్తుంటారు. ప్రసార భారతి ఏర్పాటు అయిన తరువాత ఆయా దేశీయ భాషల్లో బులెటిన్లు రూపొందించే విభాగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలోనే ఢిల్లీ నుంచి తెలుగు వార్తా విభాగాన్ని యావత్తూ, సిబ్బందితో సహా హైదరాబాదుకు మార్చారు. ఢిల్లీలోని ఆకాశవాణి జనరల్ న్యూస్ రూమ్ లో ఇంగ్లీషులో జాతీయ వార్తలతో కూర్పు చేసిన  బులెటిన్ కాపీని హైదరాబాదుకు పంపితే ఆ వార్తల్ని  న్యూస్ రీడర్లు తెలుగులోకి తర్జూమా చేసుకుని చదువుతున్నారు. కాకపొతే  ప్రాధాన్యతను బట్టి కొన్ని స్థానిక వార్తలను కూడా ఆ బులెటిన్ లో చేరుస్తారు.
న్యూ ఢిల్లీ నుంచి – కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు,  మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్ప కాలం)
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.

పెద్దవిశేషమేమిటంటే మహాకవి శ్రీ శ్రీ  సయితం  కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు  అనౌన్స్సర్ల సంఘం ఇటీవల  వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యెక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు, గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి
రేడియో అక్కయ్యగా ప్రసిద్దురాలయిన తురగా జానకీ రాణి, సుప్రసిద్ధ హాస్య రచయిత తురగ కృష్ణ మోహన రావు దంపతుల ముద్దుల బిడ్డే ఈ ఉషారమణి. 
(ఇంకా వుంది)

రేడియో రోజులు – 25 – భండారు శ్రీనివాసరావు


( Published in SURYA daily  on 26-11-2019, Tuesday)
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్
కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా,  కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్‌, వయోలిన్‌, పియానో,  కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు పోసుకుని ఇప్పటికి ఎనభై ఏళ్ళు దాటింది. అయినా, నేటికీ ఆ ట్యూన్‌ స్మార్ట్  ఫోన్ లో  రింగ్‌ టోన్‌గా వినిపిస్తోంది. వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ అవుతూనే ఉంది.

ఇంతకీ ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌ని కంపోజ్‌ చేసిందెవరో తెలుసా..? ఆ సంగీతజ్ఞుడి పేరు వాల్టర్  కౌఫ్‌మన్‌. చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన వ్యక్తి. 1934లో ముంబైకి వచ్చిన కౌఫ్‌మన్‌, బాంబే చాంబర్‌ మ్యూజిక్‌ సొసైటీలో పియానో వాద్యకారుడిగా ఉండేవాడు. ఇండియన్‌ బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీ విజ్ఞాపన మేరకు 1936లో ఒక ట్యూన్‌ కంపోజ్‌ చేసి ఇచ్చాడు కౌఫ్‌మన్‌. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాల మేళవింపుగా దీనిని రూపొందించాడాయన. శివరంజని రాగం ఆధారంగా దీనిని కంపోజ్‌ చేశారని చెబుతారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ ట్యూన్‌ని మారుద్దామని కొందరు అన్నారట! అయితే, ఈ స్వరంలో ప్రణవనాదం అయిన ఓంకారం ప్రతిధ్వనిస్తున్నట్టు ఉందనే అభిప్రాయంతో ఆ ట్యూన్ మార్చే ప్రయత్నాన్ని విరమించుకున్నారట ఆకాశవాణి అధికారులు.
1934 లో ఇండియాకు వచ్చిన పద్నాలుగేళ్ళపాటు ఈ దేశంలోనే వుండిపోయాడు. బాంబేలోని విల్లింగ్టన్ జింఖానాలో ప్రతి గురువారం నాడు ఒక సంగీత కచ్చేరీ ఇచ్చేవాడు. ఆయన బృందంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  సంగీత విద్వాంసుడు జుబెన్ మెహతా  తండ్రిగారయిన మెహ్లీ మెహతా వుండేవారు. ఆయన వయొలిన్ పైనా,  కౌఫ్‌మన్‌ పియానో పైనా శ్రోతలను అలరిస్తూ వుండేవారు.  ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్  ట్యూన్ లో వయొలిన్ వాయించింది మెహ్లీ మెహతా అనేవారు కూడా లేకపోలేదు.
కౌఫ్‌మన్‌ సంగీతంలో దిట్ట. పూర్వపు జెకొస్లవాకియా దేశంలో 1907 లో జన్మించిన ఈ సంగీత కారుడు, బెర్లిన్ సంగీత కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నాడు. నాజీల బాధితుడిగా అతడు భారతదేశానికి ఓ కాందిశీకుడుగా వచ్చాడు. ఇండియాకు వీసా దొరకడం చాలా సులభం కాబట్టి తాను ఈ దేశాన్ని ఎంచుకున్నానని ఆయన చెప్పేవాడు.
1937  నుంచి  1946 వరకు ఆల్ ఇండియా సంగీత విభాగంలో డైరెక్టర్ గా రేడియోలో పనిచేశాడు. ఈ  దేశపు అతి గొప్ప సంగీత కళాకారులను గురించి తెలుసుకోవడానికి  ఈ ఉద్యోగం ఎంతగానో  ఉపకరించిందని తను రాసిన ఒక పుస్తకంలో  ఆయన వెల్లడించారు.
పాతతరానికి చెందిన అనేకమంది భారతీయ  సంగీత విద్వాంసులు రేడియో వారు చెక్కుల  రూపంలో ఇచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, విచ్చు రూపాయలలో ఇస్తే సంతోషంగా తీసుకునేవారని, ఆ నాణేలను జాగ్రత్తగా లెక్కపెట్టుకోవడానికి తమ వెంట ఎవరో ఒకరిని తోడు తెచ్చుకునేవారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇండియా వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 1957 లో అమెరికాలో స్థిరపడడానికి ముందు కొన్నేళ్ళు ఇంగ్లాండ్ లో, కెనడాలో గడిపారు. 1984 లో కౌఫ్‌మన్‌ అక్కడే కన్ను మూశారు.

(ఇంకా వుంది)

23, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు – 23 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily  on 23-11-2019, Saturday, today)

వార్తలు చదువుతున్నది ఏడిద గోపాల రావు
“ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”
ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.
ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ మీరు ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.
1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి ఆఫేసులో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు. వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.
ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా  సోదరుడు.  సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ  కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి  స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు.  రంగస్థలంపై  మహాత్మా  గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.
కింది ఫోటో : రంగస్థల గాంధి శ్రీ ఏడిద గోపాల రావు 

(ఇంకా వుంది)   


22, నవంబర్ 2019, శుక్రవారం

ఇప్పుడు చెబుతాను - భండారు శ్రీనివాసరావు


“మృత్యువుతో సహజీవనం చేస్తున్న విషయం మనిషికి మరణించేవరకు తెలియదు”
అని ఎందుకు రాశానో ఇప్పుడు చెబుతాను.
మాకు తెలిసిన ఒకావిడ ఈ మధ్య అమెరికాలో ఉన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళారు. ఆ దేశానికి పలు పర్యాయాలు ఒంటరిగా వెళ్లి వచ్చిన అనుభవం కూడా వుంది. ఈసారి తిరిగి వస్తూ దుబాయ్ లో దిగి షాపింగ్ చేశారు. అక్కడినుంచే హైదరాబాదులో వున్న తన కుమార్తెకు ఫోను చేసి ఏమి కావాలో కనుక్కుని మరీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశారు. దుబాయ్ లో విమానం ఎక్కిన తర్వాత కూడా మరోసారి ఫోన్ చేసి హైదరాబాదు ఎప్పుడు చేరేది వివరాలు చెప్పారు.
హైదరాబాదులో ఉంటున్న ఆవిడ కుమార్తె తన భర్తతో కలిసి శంషాబాదు వెళ్ళారు, తల్లిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకు రావడానికి. విమానం లాండ్ అయింది. ప్రయాణీకులందరూ ఒక్కొక్కరుగా ట్రాలీలు తోసుకుంటూ బయటకు వస్తున్నారు. ఆఖరి ప్రయాణీకుడు కూడా వచ్చారు కానీ తల్లి జాడ లేదు. వేచివున్న కుటుంబ సభ్యుల్లో ఆందోళన. పెరుగుతోంది. ఇంతలో అనౌన్స్ మెంటు.
‘పలానా ప్రయాణీకురాలి తరపువాళ్ళు ఎవరైనా వచ్చివుంటే దయచేసి వచ్చి ఆవిడ బాడీ తీసుకువెళ్ళండి’
వినగానే వాళ్ళ గుండె జారిపోయింది. ఫోన్లో మాట్లాడి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇలా ఎలా జరిగింది?
అసలు జరిగిందేమిటంటే....
దుబాయ్ లో విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత ఆవిడ వాష్ రూమ్ కు వెళ్ళింది. యెంత సేపైనా బయటకి రాకపోవడంతో తోటి ప్రయాణీకులు విమాన సిబ్బందికి చెప్పారు. వారు గట్టి ప్రయత్నం చేసి తలుపు తెరిస్తే అక్కడ నిర్జీవంగా పడి వుంది. మాసివ్ హార్ట్ అటాక్ మరణానికి కారణం అని నిర్ధారించారు.
అందుకే అంటారు మృత్యువుకు బహు రూపాలు. ఎవరిని ఏ రూపంలో, ఎప్పుడు దగ్గరికి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు.



రేడియో రోజులు -22 – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 22-11-2019, Friday)

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య
ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో మరో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య

(శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య)

ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం  తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్  రీడర్ కాగలిగారు.   
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.
నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.
ఎనభై పదులు దాటిన  పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య  శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతున్నారు.
(ఇంకా వుంది)       


21, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 21 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 21-11-2019, Thursday)
వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్  
“మన్నార్. అంటే మన  తెలుగు వాడేనా. కాకపొతే  తెలుగులో ఈయన చేత వార్తలు ఎందుకు చదివిస్తున్నారు? ఇంటి పేరు అద్దంకి కదా! తెలుగువాడే అనడానికి వేరే రుజువెందుకు?’
ఇలా సాగేవి చిన్నప్పుడు ఊళ్ళల్లో పంచాయతీ  రేడియో వింటూ చర్చలు.
అద్దంకి మన్నార్ పదహారణాల తెలుగువాడు.  పూర్తి పేరు అద్దంకి ఎంబెరు మన్నార్. మాటా, పలుకూ, ఆహార్యం ఇలా అన్నింటా తెలుగుతనం తొణికిస లాడేది. పైగా సంప్రదాయానికీ, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన వాడు.
మన్నార్ కుమారుడు అద్దంకి రాం కుమార్ కూడా రేడియోలోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. తాను రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో సైతం పురస్కారాలు అందుకున్నాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మా వార్తా విభాగంలోనే పనిచేస్తూ అందరికీ తలలో నాలిక మాదిరిగా ఉండేవాడు. ఎప్పుడో పూర్వ కాలంలో  రేడియోలో తమ గొంతు వినిపించిన అనేక మంది ప్రసిద్దుల స్వరాలను రాం కుమార్ భద్రపరిచి ఉంచాడు. తండ్రికి నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. 
ఆయన మన్నార్ గురించి చెప్పిన ఓ కధనం ఆసక్తిదాయకంగా వుంది.
“చాలా ఏళ్ళ క్రితం రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓసారి ఢిల్లీలోని పార్లమెంటు  భవనంలోని ఒక సమావేశ మందిరంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. భోజన విరామానికి కొద్దిసేపటికి   ముందు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు గారు కాసేపు అనర్ఘలంగా తెలుగులో ప్రసంగించారు. ఎన్టీఆర్ మాట్లాడిన అంశాలను రాజీవ్ గాంధి తనపక్కనే కూర్చున్న పీవీ నరసింహారావు గారిని అడిగి తెలుసుకున్నారు.
“భోజన విరామ సమయంలో పీవీ పనుపున ఇద్దరు అధికారులు పక్కనే వున్న రేడియో స్టేషన్ కు వెళ్ళారు. తెలుగు విభాగంలో అప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్ కూర్చుని పనిచేసుకుంటున్నారు. అనువాదపు పని అని చెప్పగానే పూర్ణయ్య గారు నేను బులెటిన్ చూసుకుంటాను, మీరు వెళ్లండని మన్నార్ గారికి పురమాయించారు. మన్నార్ వెళ్లి పీవీ గారిని కలిసారు. భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన (ఎన్టీఆర్) మాట్లాడతారు, అదేదో తెలుగులో రాసి తనకిమ్మన్నారు, పీవీ.  ఆయనతో ఉన్న చనువుతో మన్నార్, ‘అయ్యా. నేను ముక్కస్య ముక్క అనువాదం చేయలేను. అందులో ఎన్టీఆర్ గారిది గ్రాంధిక తెలుగు’ అనడంతో పీవీ నవ్వేశారు.
ఎన్టీఆర్  తో  మన్నార్ కి కూడా పరిచయం వుంది. తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించేందుకు మన్నార్ ని పిలిపించారని ఎన్టీఆర్ కి  అర్ధం అయింది. భోజన విరామం తర్వాత ఆయన తెలుగు జోలికి పోకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే ప్రసంగం పూర్తి చేశారు”
అద్దంకి మన్నార్ ఆకాశవాణి తరపున మాస్కో వెళ్లి రేడియో మాస్కోలో కొంతకాలం పనిచేశారు. ఆరోజులలో తన అనుభవాలను వివరిస్తూ ‘ప్రావ్దా’ అనే చిన్ని పుస్తకాన్ని రచించారు.     
మల్లాది సూరిబాబు గారు ఆంద్రభూమి పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాస పరంపర ఒకదానిలో అద్దంకి మన్నార్ గారి ప్రసక్తి వుంది. ఈ వ్యాసం చదివిన తర్వాతనే మన్నార్ న్యూస్ రీడర్ కాకముందు విజయవాడ రేడియో కేంద్రంలో కొన్నేళ్ళు అనౌన్సర్ గా పనిచేసిన విషయం తెలిసింది.
అందులో మల్లాది గారు ఇలా రాసారు.
“మాటల్లో గంభీరత, స్పష్టత, చక్కని శ్రుతి, మాధుర్యం ఎనౌన్సర్‌కుండవలసిన లక్షణాలు. మనిషి ఎదురుగా లేకుండా కంటికి కనిపించకపోయినా గొంతు మాత్రం చెవికి ఆకర్షణగా వినాలనిపించేలా వుండాలి.
ఎనౌన్సర్ వేరు. న్యూస్ రీడర్ వేరు. చదివే విధానంలో తేడా వుంటుంది. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైన తొలి రోజుల్లో 1959లో ఎనౌన్సర్‌గా చేరి న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధుడైన ఎంబెర్ మన్నార్ ని  ఈతరం వారెరుగరు.
విలక్షణమైన గొంతు, 20 నిమిషాల్లో చదవవలసిన వార్తల్ని పదే పది నిమిషాల్లో వేగంగా అత్యంత స్పష్టంగా చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈ అద్దంకి మన్నారు. స్వగ్రామం నూజివీడు సమీపంలోని చిన్న గ్రామం కానుమోలు. రేడియోకు కొన్ని ప్రమాణాలున్నాయి. బహిరంగంగా మనం ఇష్టపడి అభిమానించి ఎన్నుకున్న రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో తోలు తీస్తా, తాట తీస్తాలాంటి మాటలున్నా యథాతథంగా వార్తల్లో చెప్పరు. చెప్పకపోవటమే రేడియోకున్న గౌరవం. ఖండించారనో, గర్హించారనో, కొన్ని సున్నితమైన అందమైన పదాలు వాడి సరిపెట్టి, హుందాగా తప్పుకుంటారు. కల్పలత, చిత్రతరంగిణి లాంటి సినిమా పాటల కార్యక్రమాలను సమర్పించటంలో మన్నార్‌కు సాటి మరొకడు లేడనిపించుకున్న ఎనౌన్సర్ అనతికాలంలోనే న్యూస్ రీడరై, ఢిల్లీ నుంచి వార్తలు చదివేవాడు.
వార్తల లైవ్స్టూడియోలో కూర్చుని చివరి నిమిషంలో అందే వార్తనైనా అందంగా, అనువదించేసి, తొట్రుపాటు పడకుండా ఆ వార్త చదవటం మన్నార్ ప్రత్యేకతగా చెప్పేవారు. వార్తలు చదివే వారిలో నాటకీయతఉండదు. ఉండకూడదు కూడా. వార్తలను ఒక ప్రవాహంలా, ధారలా, సొగసుగా, స్పష్టంగా చదివి కీర్తిని మాత్రమే సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి మన్నార్”
(మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)
(ఇంకా వుంది)

20, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు – 20 – భండారు శ్రీనివాసరావు



(Published  in SURYA  daily on 20-11-2019, Wednesday, today)

“ప్రాంతీయ వార్తలు  చదువుతున్నది డి. వెంకట్రామయ్య ....”
నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను చిన్నతనం నుంచీ అభిమానించే ఈ  కధారచయితే నాకు భవిష్యత్తులో  సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! 
వస్తున్న కధల్లో రాశి పెరిగివాసి తగ్గి,  ఆ బాపతు వాటిని 'చదవడం ఎందుకు మానేస్తే పోలాఅని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి,  'రాయడం మానేస్తే పోలాఅనిపించి  ఆయన రచనా వ్యాసంగానికి దూరమయ్యారేమోనని నా అనుమానం. 
రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు, నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసంస్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే, అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీరాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్ పద్నాలుగో తేదీన నేను  తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
మా ఇద్దరివీ వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూనాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూవాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.
నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట,  పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూరాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.
నిజానికి వెంకట్రామయ్య అసలు ఉద్యోగం న్యూస్ రీడర్. అంటే వార్తలు అనువదించి చదవడం వరకు మాత్రమే. బులెటిన్లు తయారు చేయడం కాదు. కానీ ఆయన తనంతట తానే అన్నిరకాల బాధ్యతలు భుజానికి ఎత్తుకునే వారు.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో, పరిచయస్తులనో ఏదో పేరుతొ వచ్చిన వారితో మొహమాటంగా వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితోవార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీనిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యం చేసుకోవడం ఆయనకు ఇష్టం వుండేది కాదు.  ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూసూత్రాలూ వల్లించేవాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! ఆ కొద్దిమందిలో వెంకట్రామయ్యగారు ముందుంటారు.
వార్తల విషయంలో ఎటువంటి మడులూ, దడులూ కట్టుకోకుండా, ఎటువంటీ దడుపూ లేకుండా నిర్భయంగా,  స్వేచ్చగా రేడియో వార్తలు ఇచ్చే నేను ఒక్క వెంకట్రామయ్య గారి విషయంలో కాస్త వెనుకా ముందూ చూడడానికి కారణం ఆయనలోని ఈ నిబద్దతే.  

ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు,
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు,
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి,
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీసాన్నిహిత్యాన్నీస్నేహాన్నీ ఉపయోగించుకుని, వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు. దాన్ని గురించి స్నేహితులతో చెప్పేవారు 'యిది శ్రీనివాసరావు పుణ్యమేఅని. నిజానికి  పాపపుణ్యాల పైనాదేవుళ్ళూ దెయ్యాల పైనా ఆయనకు  ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఆయన నోట పుణ్యం అనే మాట అనిపించగలిగాను.
అతికొద్ది 'మంచికధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్యఅసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం' పేరుతోనో (కార్మికుల కార్యక్రమంలో రాంబాబుగా) రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దేఅయినప్పటికీపుస్తక ప్రియులను 'పెద్దగాఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్నిరాసారన్నది కాకుండా, 'ఏమిరాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారంఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగేరావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని(రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయించిన రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.
కాకపోతే, రచన సాయి గారి పుణ్యమా అని ఆయన రాసిన రేడియో అనుభవాలను ఎమెస్కో వారు ఒక పుస్తకంగా వేశారు. సంతోషం.
చక్కటి విషయాలు, ఎవరికీ తెలియనివి అనేకం రాసారు. మరింత సంతోషం.
ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదివినప్పుడు చాలా మంచి పుస్తకం అనిపించక తప్పదు. అయితే  అదే సమయంలో స్వోత్కర్ష కొంత మోతాదు మించింది అనే అభిప్రాయం కూడా కలగక తప్పదు. తనని తాను  ఎలివేట్ చేసుకునే క్రమంలో కొందరు రేడియో సహోద్యోగులను చిన్న చూపు చూసారా అని కూడా అనిపించక మానదు.
నిర్మొహమాటంగా వుండడం తన సహజ లక్షణమని నమ్మే వెంకట్రామయ్య గారు నా ఈ విమర్శను సరయిన రీతిలో స్వీకరిస్తారనే నమ్మకం నాకు  వుంది.


(శ్రీ డి. వెంకట్రామయ్య)

(ఇంకా వుంది)