10, నవంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 12 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 10-11-2019, SUNDAY)

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.
"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.

అలాగే మరో జ్ఞాపకం.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు,  కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన  లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.
తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు పదిమంది  చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన  కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది  ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.
ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్  వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారిగా మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాల రావు పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విలేకరికి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా,  కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్  పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చుని  ‘నేను విన్నది నిజమే!’ అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.
కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన గండిపేట నివాసంలో ‘శవపూజలు’ చేస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. వాటిని తిప్పి కొట్టడానికి హైదరాబాదు నుంచి కొందరు విలేకరులను (అప్పుడు గండిపేట దూరమే అనిపించేలా వుండేది) అక్కడికి తీసుకు వెళ్ళారు. రామారావు గారు స్వయంగా విలేకరులను వెంటబెట్టుకుని ఆశ్రమంలో ఆణువణువూ చూపించారు. ఆ సందర్భంలో నేను అడిగితే రెడియోకోసం కాసేపు మాట్లాడారు. ఆశ్రమం వెలుపల ఒక చప్టా లాంటి దానిమీద ఎన్టీఆర్ బాసింపట్టు వేసుకు కూర్చున్నారు. ఆయన ముందు టేప్ రికార్డర్ వుంచి నేను పక్కగా ఆ చప్టా మీదనే కూర్చున్నాను. ఈ సన్నివేశాన్ని మిత్రుడు జీఎస్ రాధాకృష్ణ (అప్పుడు ‘వీక్’ ఇంగ్లీష్ వార పత్రిక కరస్పాండెంటు) ఫోటో తీసి ఇచ్చాడు. నేను మాస్కో వెళ్లి వచ్చేవరకు అది భద్రంగానే వుంది. కానీ ఆ తరవాత అనేక అద్దె ఇళ్ళు మారే క్రమంలో ఆ విలువైన ఫోటో పోగొట్టుకున్నాను.
ఇక రేడియోకి, రామారావు గారికీ నడుమ సాగిన ఒక వివాదం చెప్పి ముగిస్తాను.
ముప్పయి అయిదేళ్ళ క్రితంసంగతి
టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల దరిమిలా రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ పాలన మొదలయింది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వుండడంతో రాజకీయ క్రీనీడలు అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియో, దూరదర్శన్ ల మీద కూడా పడ్డాయి. ఆ రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని అనావృష్టి ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, ప్రెస్ మీట్ పెట్టి రేడియో, దూరదర్శన్ లకు కూడా కబురు పంపారు. కరవు ప్రాంతాలలో ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని రికార్డ్ చేసి సందేశం రూపంలో ప్రసారం చేయాలని కోరారు.
ఆబిడ్స్ లోని ముఖ్యమంత్రి నివాసాన్ని చేరుకున్న మా సిబ్బంది రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ కిర్రు చెప్పులు చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగివచ్చారు. ముఖ్యమంత్రి  ప్రధాన పౌర సంబంధ అధికారిగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు తయారు చేసిన సందేశం ప్రతిని ఆమూలాగ్రం ఓ మారు తిరగేసి, తాము సిద్ధం అన్నట్టు తలపంకించారు. రికార్డింగు మొదలయింది.
"ప్రియమైన రాష్ట్ర ప్రజలారా!..." అని ప్రసంగం ప్రారంభించారు. అదే స్పీడులో కొనసాగుతుందని అంతా అనుకున్నాం. కానీ ఆయన హఠాత్తుగా ఆపి, 'కట్ వన్ - టేక్ టు' అన్నారు. మా వాళ్ళు రికార్డింగు ఆపేశారు. వందల సినిమాల్లో అనర్ఘళంగా డైలాగులు చెప్పిన అనుభవం ఆయనది. ఏ పదాన్ని ఎక్కడ వొత్తి పలకాలో, ఏ వాక్యాన్ని ఎక్కడ విరిచి చెప్పాలో ఆయనకు కొట్టిన పిండి. కానీ, ఇక్కడే ఎదురయింది మాకు వూహించని, ఆ మాటకు వస్తే అంతవరకూ అనుభవంలో లేని ఇబ్బంది. ఈ కట్లు, టేకుల విషయం తెలియకుండా రికార్దింగుకు రావడం వల్ల, తెచ్చిన టేపులు సరిపోలేదు. ఆఘమేఘాల మీద పంపించి స్టూడియో నుంచి అదనపు టేపులు తెప్పించి రికార్డింగు ముగించామనిపించారు.
అసలు కధ స్టూడియోకు చేరిన తర్వాత మొదలయింది. ఏ టేపు విన్నా కట్లూ, టేకులూ అన్న రామారావుగారి స్వరమే. ఆరాత్రే ప్రసారం కావాల్సి వుండడంతో సిబ్బంది అంతా టెన్షన్ కు గురయ్యారు. సీ ఎం గారి మొదటి ప్రసంగం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ కమీషనర్ (పూర్వాశ్రమంలో తపాలా శాఖ డైరెక్టర్) సైదులు గారు, డైరెక్టర్ సీ,వీ, నరసింహారెడ్డి గారు అంతసేపూ మాతోపాటే రేడియో డబ్బింగు గదిలోనే వుండిపోయారు. కట్లూ టేకుల మధ్య వున్న ముఖ్యమంత్రిగారి సందేశాన్ని మా వాళ్లు కష్టపడి మాస్టర్ టేపు మీదకు ఎక్కించి డబ్బింగు పని పూర్తి చేసి ప్రసారం నిమిత్తం అనౌన్సర్ కి అప్పగించి వూపిరి పీల్చుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డబ్బింగు పూర్తయిన తరువాత చూసుకుంటే మాకెంత నిడివి అవసరమో ముఖ్యమంత్రి సందేశం అంతే వ్యవధికి అతికినట్టు ఖచ్చితంగా సరిపోయింది.
దటీజ్ ఎన్టీఆర్.
అయితే ఈ ఉదంతం ఎంతగా చిలవలు పలవలు వేసిందంటే ఒక దశలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వివాద స్థాయికి చేరుకుని ఆ పిదప అలాగే చల్లారిపోయింది.
(ఇంకా వుంది)

రేడియో రోజులు – 11 – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA telugu daily on 09-11-2019, Saturday)

రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో - ఇంకా ఎవరెవరు వస్తున్నారని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైట్ వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు.

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఎప్పుడో డిల్లీలో వున్నప్పుడు మినహా తప్పకుండా వారి కార్యక్రమాన్ని వింటూవుంటానని చెప్పేవారు. రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే

ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.

ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.

అలాగే కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమం రూపొందించే తీరుకు ముగ్ధులై,  కార్మికులు కాని వారు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. బాలల పత్రిక ‘చందమామ’ ను చదవడానికి పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ మక్కువపడినట్టుగా. అందులో రాంబాబుగా డి. వెంకట్రామయ్య గారు, చిన్నక్కగా శ్రీమతి వి.రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా వట్టెం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో స్టార్ డం సంపాదించుకున్న రేడియో కళాకారులు. స్కూళ్ళు, కాలేజీల్లో జరిగే వార్షికోత్సవాలకు వీరిని ముఖ్య అతిధులుగా పిలిచి సన్మానించేవారు. వెంకట్రామయ్యగారు తరువాతి కాలంలో న్యూస్ రీడర్ గా మారారు. రిటైర్ అయ్యేంతవరకూ అదే ఉద్యోగం.

ఈ రేడియో కళాకారులవి గొర్రె తోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను చేరకముందు – శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు,  న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, నండూరి విఠల్ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరుకాక, భాస్కరభట్ల కృష్ణారావు, శారదా శ్రీనివాసన్, రతన్ ప్రసాద్ (చిన్నక్క), తిరుమలశెట్టి శ్రీరాములు, వింజమూరి సీతాదేవి, మాడపాటి సత్యవతి, జ్యోత్స్నా ఇలియాస్, ఇందిరా బెనర్జీ ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి  అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారులేరు. ఇందిరాగాంధీ ప్రధాని కావడానికి పూర్వం సమాచార ప్రసార శాఖల మంత్రిగా వున్నప్పుడు రేడియోలో పనిచేసే స్టాఫ్ ఆర్టిస్టుల స్తితిగతులు అర్ధంచేసుకుని, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ( పే స్కేల్స్) జీత భత్యాలు లభించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రమోషన్లు ఇతర సౌకర్యాలు కూడా వర్తింపచేశారు.

ఆకాశవాణి నిలయ కళాకారుల ప్రసక్తి వచ్చింది కాబట్టి, వారిలో కొందరు తమ వృత్తిధర్మం పట్ల ఎంతటి నిబద్ధతతో ఉంటారో తెలియచెప్పే ఒక ఉదంతాన్ని రేడియోలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు మాటల సందర్భంలో వివరించారు.
మహాలయ పక్షాలను పురస్కరించుకుని పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ఆయన ఇటీవల సతీసమేతంగా కాశీ వెళ్ళారు. గంగానది ఉధృతంగా వొడ్డును వొరుసుకుని పారుతోంది. ఒక్క కేదారేశ్వర ఘాట్ లోనే వారికి వెసులుబాటు దొరికింది. అక్కడ విధులను సక్రమంగా పూర్తిచేసుకుని ఘాట్ సమీపంలోని ఒక గుడి దగ్గరకు వెళ్ళారు. ఆ ప్రాభాత వేళలో వినవచ్చిన వయోలిన్ వాయిద్య సంగీతం ఆయన్ని ఆకర్షించింది. పరికించి చూస్తే ఒక అరుగులాంటి గద్దెపై కూర్చుని ఎవరో వయోలిన్ వాయిస్తున్నారు. ఒక్క కట్టు పంచె తప్ప ఆయన శరీరంపై ఎలాంటి ఆచ్చాదనా లేదు. స్వతహాగా సంగీత ప్రియుడయిన కృష్ణారావు గారు త్యాగరాజ స్వామివారు ఓ కృతిలో  ఆలపించినట్టు ‘నాదలోలుడై బ్రహ్మానందాన్ని’ అనుభవించిన అనుభూతిని పొందారు. ‘నాద తనుమనిశం శంకరం నమామి’ అనే  త్యాగరాయ కృతిని చిత్తరంజన్ రాగంలో వయొలిన్ పై అద్భుతంగా పలికిస్తున్న ఆ కళాకారుడికి పాదాభివందనం చేద్దామని వెళ్ళారు. చిరుకానుకగా తన చేతికి వచ్చిన కొంత మొత్తాన్ని ఇవ్వబోగా ఆయన మృదువుగా తిరస్కరించి అవసరంలో ఉన్నవారికి ఎవరికైనా  ఇవ్వండి అని చెప్పారు. మాటల మధ్యలో ఆయన పేరు తెలియగానే ఆశ్చర్యపోవడం కృష్ణారావు గారి వంతయింది. ఎందుకంటే గంగాతీరంలో ఒంటరిగా కూర్చుని వయొలిన్ వాయిస్తూ తన్మయత్వంలో ఓలలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో నిలయకళాకారులు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి.  కృష్ణారావుగారు వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ గా అప్పుడు పనిచేసేరోజుల్లో వారితో పరిచయం కూడా వుండేది. అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీ సూర్య దీప్తి, బెంగుళూరులో పదవీవిరమణ అనంతరం తుచ్చమైన లౌకిక సుఖాలను పరిత్యజించి, కాశీ వెళ్లి అక్కడే ఒంటరిగా భాగీరధీ తీరంలో వయోలిన్ పై కృతులు పలికిస్తూ సంగీత పారవశ్యంలో తన శేష జీవితాన్ని గడుపుతున్నారు.

(ఇంకా వుంది)

9, నవంబర్ 2019, శనివారం

ఆలాపన – భండారు శ్రీనివాసరావు.



సినిమా నుంచి బయటకు రాగానే పక్కనే ఉన్న తాజ్ మహల్ కు వెళ్లి కాఫీ తాగి నడుచుకుంటూ చిక్కడపల్లి లోని ఇంటికి రావడం అలవాటు. హోటల్లో జనం పల్చగా వున్నారు. మా పక్క టేబుల్ మీద ఓ యువ జంట చూడ ముచ్చటగా వున్నారు.
టిఫిన్ చేసి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుంటే మరో టేబుల్ మీద అనిల్, అతడి భార్య కనబడ్డారు. నన్ను చూడగానే అతడు బాధగా మొహం పెట్టాడు.
‘విషయం తెలిసింది, వద్దామని అనుకున్నాను. వేరే వూళ్ళో వుండడం వల్ల రాలేక పోయాను. సారీ బాస్.’
అతడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు.
‘మేమూ అటువైపే వెడుతున్నాం. పదండి కార్లో డ్రాప్ చేస్తాను’ అన్నాడు.
‘థాంక్స్. మేమూ కార్లోనే వచ్చాము. అదే ఉబెర్. అదుంటే కారూ, డ్రైవర్ రెండూ ఉన్నట్టే’ నవ్వాను.
అతడు విచిత్రంగా చూసాడు.
‘సరే. నీ మాటే వింటాను. ఒక్క నిమిషం’ అంటూ మా టేబుల్ వైపు వెళ్లాను. యువ జంట అక్కడే వుంది. ఎవరూ లేరు.
నా కళ్ళు హోటల్ అంతా పరికిస్తున్నాయి.
అనిల్ వచ్చి భుజం మీద చేయేసి పదండి బాస్ అన్నాడు.
మెలకువ వచ్చి చూస్తే గడియారం మూడు చూపెడుతోంది.
చిక్కడపల్లి ఇంట్లో వుండి నలభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఉబెర్లు ఎక్కడివి.
క్రమంగా వాస్తవం బోధపడింది.
కాకతాళీయం కావచ్చేమో కానీ ఇద్దరం కలిసి బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుని పంజాగుట్ట గలేరియా మాల్ మల్టిఫ్లెక్స్ లో అనేక సినిమాలు చూశాము. ఉబెర్లో వెళ్ళడం ఉబెర్లో రావడం.
జనవరిలో NTR కధానాయకుడు, F2, మార్చిలో మా మేనల్లుడి కొడుకు విమల్ నటించిన జెస్సీ, లక్ష్మీస్ NTR, మేలో మహర్షి, జులైలో ఓ! బేబీ, చివరిగా అదే నెల 31 న డియర్ కామ్రేడ్.
అంతే! అదే ఆఖరు. ఆగస్టు 17 న తను లేదు.
ఏ సినిమా అయినా చూసి సూపర్ అంటుంది. సినిమా ఒక్కటే తను అడిగే కోరిక. నిజానికి అది పెద్ద విషయమేమీ కాదు. కానీ నాకు బోర్. అందుకే నా ఇతర కార్యక్రమాలకు అడ్డం రాకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం నాలుగు గంటలకు వుండే సినిమాలు బుక్ చేసేవాడిని.
ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం.
జేీవితమే సినిమా అయిపోయింది.
ఇష్టం లేకపోయినా, బోరు కొట్టినా చూడక తప్పదు.


8, నవంబర్ 2019, శుక్రవారం

మూడేళ్ళ క్రితం మోడీ ప్రయోగించిన ‘బ్రహ్మ శిరోనామకాస్త్రం’


పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడేళ్ళు నిండాయి. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాలనం చేయడానికి మోడీ ప్రయోగించిన ఈ ‘బ్రహ్మ శిరోనామకాస్త్రం’ గురికి తగిలిందా లేక గురి తప్పిందా అనే విషయంలో ఇన్నేళ్ళుగా చర్చోప చర్చలు సాగుతూనే వున్నాయి.
మహాభారతంలో ప్రస్తావించిన ఈ అస్త్రాన్ని సర్జికల్ స్ట్రైక్ తో పోల్చవచ్చు.
నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధికి  కారణమైన కణంఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్నిపాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి అపాండవం భవతుఅంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినాబ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.
భారత ఆర్ధిక వ్యవస్థకు ఏమాత్రం విఘాతం కలుగకుండా నల్లదనం, నకిలీ కరెన్సీ, శత్రుపీడ మొదలయిన చెదపురుగులను తుదముట్టించాలని మోడీ ఈ పెద్ద నోట్ల రద్దు తలపెట్టారు. ఒక రకంగా అశ్వద్ధామ ప్రయోగించిన అస్త్రం వంటిదే.
మరి ఫలితాలు? ఇంకా ప్రశ్నార్ధకమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.  


రేడియో రోజులు – 10 – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 08-11-2019, Friday, today)

చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు  ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు, అన్నన్ని సంగతులు ఎలా గుర్తుంటాయని.' కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని. కొన్నేళ్ళ క్రితం  సర్వే వాళ్ళు వచ్చి అడిగారు,  'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ.  నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు  మిడిమిడి జ్ఞానం బాపతు.  అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే  మనలో నిండుకుని వున్న  అజ్ఞానం చాలావరకు అంధకారంలోనే కప్పబడిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర  ఖండన ముండనలు, హర్షాతిరేక  ప్రకటనలు,  ప్రగాఢ సంతాప ప్రకటనలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. ( ట్విట్టర్, ఫేస్ బుక్ ల పుణ్యమా అని ఇప్పుడిలా  పేపరాఫీసుల చుట్టూ  తిరిగే అవస్థ వారికి  తప్పింది)
వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారి వారి నొసటిరాత ప్రకారం  మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే  స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. కానీ పేరు వేరుగా వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' ఆ ఎంపీ ఈ ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డును పరికించి చూస్తే మాత్రం  అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటే ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే  ఇప్పుడు మాత్రం మాజీ.  'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు, హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో  చిన్న అక్షరాలలో ముద్రించారు. 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకు నేనే సమాధాన పడ్డాను.
అలా ఆసారి కూడా నా  అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల,  ఇదిగో ఇప్పుడిలా,  కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను.
రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన  పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి,  రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.
(ఇంకా వుంది)

7, నవంబర్ 2019, గురువారం

అరమరికలు లేని స్నేహం


స్నేహం అంటేనే స్వచ్చత. దాపరికం, స్వార్ధం ఇసుమంత కూడా  లేనిదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. మిగిలినవన్నీ పరిచయాలు మాత్రమే.
ఇప్పుడు మీరు చదవబోతున్న కధనంలోని పాత్రలన్నీ నిజమైనవే. కాకపొతే ఆ పాత్రలు పలికిన పలుకులన్నీ ఒక ప్రత్యక్ష సాక్షి నోట విన్నవే.
కాకినాడ జే.ఎన్.టీ.యూ. చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. అక్కడ విద్యాభ్యాసం చేసి జీవితాల్లో స్థిరపడిన విద్యార్ధులు ఒక సాంప్రదాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారుట. అదేమిటంటే, ఒక బ్యాచ్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులు  పాతికేళ్ళ తర్వాత అదే కళాశాలలో కలుస్తారు. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళు ప్రతియేటా అదేచోట కలుస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుని రెండు మూడు రోజులు సరదాగా గడపడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని విన్నాను. ఇది నిజమైతే నిజంగా గొప్ప సంగతే.
ఈ ఏడాది నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాతికేళ్ళ క్రితం ఆ కాలేజీలో చదువుకున్న ఓ  బ్యాచ్ కి చెందిన మొత్తం 180 మందిలో 130 మంది  హాజరయ్యారు. వారిలో ఇద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సీనియర్  పోలీసు అధికారి వున్నారు. అమెరికా నుంచి వచ్చిన ముప్పయ్ మంది దంపతయుక్తంగా పాల్గొన్నారు. కొందరు కళాశాల రోజుల్లోనే ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినవారు కూడా వున్నారు. 
రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ మధ్యంతర కాలంలో ఎవరికి వారు జీవితాల్లో వారు స్థిరపడ్డారు. కళాశాలలో కలిసి చదువుకున్న తమ సహాధ్యాయే తమకు  పై అధికారిగా వచ్చిన ఉద్యోగులు కూడా కొందరు  వున్నారు. ఆఫీసులో సార్ సార్ అనే మర్యాద పిలుపులు కాస్తా  ఈ సమ్మేళనంలో పాత  రోజుల్లోమాదిరిగా షరామామూలు  అరేయ్ ఒరేయ్ కి మారిపోయాయి.
‘ఐ.ఏ.ఎస్. కాగానే మమ్మల్ని మరచిపోయావు. నేను పనిచేస్తున్న డిపార్ట్ మెంటుకి నువ్వే హెడ్డువి. ఏదో ఫ్రెండువి  కదా కలవాలని వస్తే నన్ను లోపలికే పంపలేదు.’ డివిజినల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నాడు.
‘భలేవాడివే! విజిటర్స్ స్లిప్ మీద నీ పేరు చూసి నా పియ్యేను పంపించి మరీ పిలిపించా కదా! ఇలా నిష్టూరం ఆడితే ఎలా’ జవాబిచ్చాడు ఆ ఐ.ఏ.ఎస్.
పోలీసు అధికారి అన్నాడిలా. ‘ఈ ఉద్యోగం పుణ్యమా అని నాకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడూ నీడలా స్టెన్ గన్లు పట్టుకుని సెక్యూరిటీ గార్డులు. దేశ సరిహద్దుల్లో వున్నప్పుడు  ఎలాగూ తప్పదు. నేను చదువుకున్న చోటు ఇది. ఇక్కడన్నా నన్ను వదిలిపెట్టండిరా బాబూ అని బతిమిలాడుకుని వాళ్ళని మెయిన గేటు దగ్గరే వదిలి వచ్చాను’
అందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఆ నవ్వులు అలా ఓ మూడు రోజుల పాటు పువ్వులు పూస్తూనే వున్నాయి. ఒకరు పెద్దా అని లేదు, ఒకరు చిన్నా అనిలేదు. అందరూ టైం కాప్స్యూల్ లో మాదిరిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళారు. కేరింతలతో, కాలేజీ కబుర్లతో సాగిపోతున్న ఆ ధారా ప్రవాహం ఎవరో అన్న ఒక్క మాటతో ఆగిపోయింది.
‘అన్నట్టు గణేష్ ఏడీ?’
పొట్టిగా వుండే గణేష్ కూడా వారందరితో పాటే అదే కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. పెళ్లయింది. ఒక పిల్లాడు. ఏమైందో తెలియదు ఏదో అస్వస్తతకు గురై హఠాత్తుగా కన్నుమూశాడు. అమెరికాలోనే ఉంటున్న కళాశాల సహాధ్యాయులు  గణేష్ భార్యను, పిల్లల్ని  పట్టుబట్టి కాకినాడ తీసుకువచ్చారు. గణేష్ లేడన్న విషయం తెలిసి స్నేహితులందరూ ఎంతో బాధ పడ్డారు.
గణేష్ కొడుకు కల్పించుకుని అన్నాడు.
‘మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే మా నాన్న ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది. ఇక్కడ అరమరికలు లేని మీ స్నేహం గమనించిన తర్వాత చనిపోయి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తోంది’
ఈ మాటలతో అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.                  

రేడియో రోజులు – 9 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA telugu daily on 07-11-2019, Thursday)
రేడియో  విలేకరిగా పనిచేసిన రోజుల్లో ఒక్క పాలక పక్ష నేతలతోనే కాకుండా ప్రతిపక్షంలో వున్న నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి.
నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరినప్పుడు నాకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. 1978 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ నాయకులు మరో ఇద్దరితో కూడా నాకు బాగా పరిచయం వుండేది. ఒకరు శ్రీ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాగా రెండో నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు. పైగా ఆ రోజుల్లో  వీరిద్దరూ జిగ్రీ దోస్తులు. ఒక మంచం, ఒక కంచం అంటారే అలా అంత స్నేహం వారి మధ్య. నాలాగే ఆ కాలంలో పనిచేసిన విలేకరులందరికీ ఈ విషయం తెలుసు.
ఆ రోజుల్లో సీనియర్ పాత్రికేయులందరూ వయసులో, అనుభవంలో చాలా పెద్ద వారు. వాళ్ళ ఆహార్యం కూడా పెద్దరికంగా వుండేది. కొందరు పంచెలు, లాల్చీలు ధరిస్తే కొందరు సూటూ బూటుతో కనబడేవారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరేమో యువకులు.  బహుశా అదొక కారణం అయుంటుంది ప్యాంటూ చొక్కా వేసుకుని తిరుగుతున్న నాలాంటి విలేకరులతో మాటామంతీ కలపడానికి.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఉవ్వెత్తున ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ ను అనుదినం దుమ్మెత్తిపోస్తూ వున్నప్పుడు కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోలేదు. పైగా అవకాశం లభిస్తే మామగారి (ఎన్టీఆర్) పైనే పోటీ చేస్తానని విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఆయన చాంబర్ నుంచే నేను రేడియోకి ఫోన్ చేసి చెప్పడం, అది వెనువెంటనే వార్తల్లో రావడం జరిగిగింది. ఎన్టీఆర్ పార్టీ  పెట్టిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్ నుంచి అధికారం కైవసం చేసుకున్న కొన్నాళ్ళ వరకు వై.ఎస్. బాబుల  స్నేహం కొత్త చిగుళ్ళు వేస్తూనే వుంది. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత వారి దారులూ వేరయ్యాయి, పార్టీలూ  వేరయ్యాయి. దాంతో  సహజంగానే ఆ నాటివరకు వారి నడుమ వెల్లివిరిసిన  స్నేహం వసివాడిపోయింది. వారితో నా పరిచయం కూడా విడివిడిగా కొనసాగింది.
ఇతర పార్టీల్లో కూడా నాకు మంచి పరిచయం వున్న నాయకులు అనేకమంది వుండేవారు. ఆ పరిచయాలు మరింత బలపడడానికి కూడా ప్రధాన కారణం నాకున్న రేడియో విలేకరి అనే ట్యాగ్ లైన్.
శాసనసభలో సీపీఎం నాయకుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు గారు వ్యవహరించేవారు. ఆకారంలోనూ, ఆహార్యంలోను నిజంగా పెద్దమనిషి. ఆ రోజుల్లో అంటే రేడియో ఏకచ్ఛత్రాధిపత్యం సాగిపోతున్న కాలంలో అసెంబ్లీ జరిగే రోజుల్లో ప్రతిరోజూ సభాకార్యక్రమాలపై అదే రోజు రాత్రి రేడియోలో ఒక సమీక్షాకార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. హైదరాబాదులోని పాత, కొత్త  ఎమ్మెల్యే హాస్టళ్ళలో ప్రత్యేకంగా మైకులు పెట్టి వినిపించేవాళ్ళు. అసెంబ్లీ ముగిసిన తర్వాత హాస్టళ్ళలో చాలామంది శాసన సభ్యులు, ఇతరులు గుమికూడి  ఈ కార్యక్రమం ఆసక్తిగా వినేవాళ్ళు. తమ తమ నియోజక వర్గాల సమస్యలు గురించి తాము సభలో  లేవనెత్తిన విషయాలు తమ ప్రాంతం  వారికి వెనువెంటనే తెలుస్తాయని వారి అభిప్రాయం. అయితే ఈ సమీక్షలను రేడియోలో పనిచేసే మేము కాకుండా పత్రికలలో పనిచేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలు రిపోర్ట్ చేసే విలేకరుల చేత  రాయించేవాళ్ళం. అలా అయితే నిష్పాక్షికంగా సమీక్షించే అవకాశం ఉంటుందన్నది రేడియో అధికారుల భావన.  వాటిలో ఏదైనా తప్పులు దొర్లాయా అనేది పర్యవేక్షించడం వరకు మాత్రమే వార్తావిభాగం బాధ్యత. ఒకసారి బోడేపూడి వారు ఏదో అంశంపై సభలో మాట్లాడారు. అందుకు విరుద్ధంగా రేడియో సమీక్షలో ప్రసారం అయిందని వారికి ధర్మాగ్రహం కలిగింది. వెంటనే రేడియో స్టేషన్ అధికారులకు అసెంబ్లీ నుంచి తాఖీదు వచ్చింది. ఏదైనా తభావతు జరిగిందని స్పీకర్ భావిస్తే రేడియో స్టేషన్ డైరెక్టర్ అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెప్పాలి. (ఇప్పుడు ఈ నిబంధనలు వున్నాయో లేదో తెలియదు. వున్నా పాటిస్తున్నారో లేదో తెలియదు)
ఇది తెలియగానే నేను  అసెంబ్లీ ఆవరణలో బోడేపూడివారిని కలిసి విషయం చెప్పి పొరబాటు ఎలా జరిగిందో చెప్పాను. ఆయన సంతుష్టపడ్డారు. అంతేకాదు, తన పిర్యాదును ఉపసంహరించుకున్నట్టు స్పీకరుకు లేఖ రాసి ఆ ప్రతిని స్వయంగా తీసుకుని వచ్చి మా స్టేషన్ డైరెక్టర్ కు అందచేశారు. అది వారి మంచితనం, అది వారి హుందాతనం.
(ఇంకా వుంది)