26, మార్చి 2019, మంగళవారం
KSR Live Show | YS Jagan Counter on Babu over KCR's 1000Cr for AP Electi...
ప్రతి మంగళవారం మాదిరిగా ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి లక్ష్మీ పార్వతి (వై.ఎస్.ఆర్.సి.పీ.), శ్రీమతి సీతాకుమారి (బీజేపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్).
25, మార్చి 2019, సోమవారం
వై ఎస్ వస్తే రాష్ట్రం రావణకాష్టమే!
2004లో ఎన్నికలు ముగిశాయి. వై ఎస్
నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. ప్రత్యర్ధి శిబిరం టీడీపీ తో
పాటు కాంగ్రెస్ లోని కొన్ని వర్గాల్లో
కలవరం. వైఎస్ ముఖ్యమంత్రి అయితే ఎలా! ఈ రాష్ట్రం ఏమైపోతుంది. పార్టీలు సరే.
అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లలో కూడా ఇదే కలవరపాటు. ఆందోళన.
పాత జానపద చిత్రాలలో రాజుగారి సైనికులు
వూళ్ళపై పడి దోచుకునేవారు. ఆడవారిని చెరపట్టేవారు. ఇలాంటి సన్నివేశాలు
దర్శనమిస్తాయని నోళ్ళు నొక్కుకున్నారు.
కానీ తర్వాత ఏం జరిగింది. రౌడీ మూకలు వీధుల్లో
స్వేచ్చావిహారం చేయలేదు. ఇళ్ళపై పడలేదు. ముఠాకక్షలు, కార్పణ్యాలు ప్రబలలేదు.
హత్యలు, మాన భంగాలు జరగలేదు. అధికారులను వేధించలేదు. అసలు కర్ఫ్యూ అనేది గతకాలపు
ముచ్చట అయింది. పై పెచ్చు అనేక కొత్త కొత్త ప్రజా సంక్షేమ పధకాలకు ఆయన పాలనా కాలం ఒక సాక్ష్యంగా
నిలిచింది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ఇతర
ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాడు. ఎందుకంటే
మనది రాజ్యాంగానికి కట్టుబడి నడిచే వ్యవస్థ కనుక.
ఈ మధ్య ఓ ఇష్టాగోష్టి సమావేశంలో మాజీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు ఈ సంగతి చెప్పారు.
కాబట్టి ఎన్నికల ద్వారా అధికారంలోకి
వచ్చిన ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిందే. అంతే కాని జానపద చిత్రాల్లో మాదిరిగా దుందుడుకు
ధోరణితో పాలించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ విధంగా సాగుతున్న ప్రచారానికి
ఎలాంటి ప్రాతిపదిక లేదని ఆయన చెప్పిన మాటల తాత్పర్యం.
లేబుళ్లు:
వై ఎస్ వస్తే రాష్ట్రం రావణకాష్టమే!
Why AP Parties Increase Welfare Schemes More Than a Limit? | The Debate ...
ప్రతి సోమవారం ఉదయం మాదిరిగానే ఈరోజు AP 24 X 7 Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రాజీవ్ (వై.ఎస్.ఆర్.సీ. పీ)
24, మార్చి 2019, ఆదివారం
వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లేనా | News Scan LIVE Debate With Vijay...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 News Scan Live Debate With Vijay On AP Politics చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ సాయిబాబా (టీడీపీ), శ్రీ కఠారి శ్రీనివాస్ (విశ్లేషకులు, శ్రీ షఫీ (విశ్లేషకులు)
రోజూ చచ్చి బతికే జర్నలిస్టు
ప్రకాశశాస్త్రి గారు పూర్వకాలపు
జర్నలిస్టు. మరీ అంత పాతకాలపు మనిషేమీ కాదు. 1975లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో
చేరిన తర్వాత వారిని ప్రతిరోజూ సచివాలయం ప్రెస్ రూములో కలిసేవాడిని. భేషజాలు
అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే తత్వం.
ఆయన ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు
కాబోలు, జూనియర్ రిపోర్టర్ ఎవరైనా కలవగానే, ‘ఏరా
అబ్బాయి ఏవిటి విశేషాలు’ అని చాలా ఆప్యాయంగా పలకరించేవారని ఆకాలంలో ఆయనతో పనిచేసి
ఇప్పుడు మీడియాలో సీనియర్లుగా ఉన్న చాలామంది గుర్తు చేసుకుంటూ వుంటారు.
తను ఆరోజు రాసిన వార్త మరునాడు పత్రికలో
పడగానే అది చూపిస్తూ, ‘అరె అబ్బాయి, ఈరోజుతో మనం చచ్చినట్టే లెక్క. మళ్ళీ మనం రాసిన వార్త రేపు వస్తే అప్పుడు మనం బతికున్నవాళ్ళలో జమ. వార్తలు
రాస్తుంటేనే జనాలు మనం బతికున్నట్టు
అనుకుంటారు. ఏరోజు రాయకపోతే ఆరోజు అంతే సంగతులు. ఇదేరా మన జీవితం’ అని సరదాగా చెబుతుండేవారట.
అన్నట్టు టీవీ 9 అనగానే గుర్తొచ్చే పేరు మురళి. ఈ మురళి ఎవరో కాదు ఈ ప్రకాశశాస్త్రి గారి కుమారుడే.
కాశీపట్నం చూడరబాబూ! – భండారు శ్రీనివాసరావు
(Published in SURYA
daily on 24-03-2019, SUNDAY)
మా చిన్నతనంలో పల్లెటూళ్ళకు పర్వదినాల్లో జంతర్ మంతర్ పెట్టె వాళ్ళు
వచ్చేవాళ్ళు. అది చూడడానికే వింతగా వుండేది. మూడుకాళ్ల స్టాండు పై
నిలబెట్టేవాళ్ళు. లోపల బొమ్మలను చూడడానికి వీలుగా ఓ పక్కన రంధ్రం వుండేది. ఒకడు తాళం కొడుతూ ‘కాశీపట్నం చూడరబాబూ’ అంటూ
కాశీ విశ్వనాధ దేవాలయమూ, గంగా నదీ మొదలయిన బొమ్మలు చూపుతుండేవాడు.
కాశీ పట్నం చూడర బాబు
విశ్వనాథుని చూడ బాబు
కలకలలాడే గంగా నదినీ
కన్నుల పండగ చూడర బాబూ.......అని పాడుతూ వచ్చే ఆ జంతర్ మంతర్ పెట్టెలవాళ్ళు ఊళ్లోకి రాగానే జనం ఎగబడేవారు.
విశ్వనాథుని చూడ బాబు
కలకలలాడే గంగా నదినీ
కన్నుల పండగ చూడర బాబూ.......అని పాడుతూ వచ్చే ఆ జంతర్ మంతర్ పెట్టెలవాళ్ళు ఊళ్లోకి రాగానే జనం ఎగబడేవారు.
పక్క వూళ్ళో తిరుణాల చూడడమే
అబ్బురమనుకునే రోజులు. ఇక ఏకంగా ఎక్కడో
ఉన్న కాశీపట్నం చూపిస్తాను రమ్మంటుంటే ఇక చెప్పేదేమి వుంటుంది.
డబ్బులిచ్చిమరీ చూసేవాళ్ళు. లోపల బొమ్మలు
కదలకపోయినా అవి కదులుతున్నాయి అనేంత హంగామా చేసేవాళ్ళు ఈ జంతర్ మంతర్
పెట్టెలవాళ్ళు.
ప్రస్తుత కాలంలో మేనిఫెస్టోల పేరుతొ ఆయా రాజకీయ పార్టీలు చేస్తున్న హంగామా
చూస్తుంటే అలనాటి, మా చిన్నతనంలో చూసిన ఈ పెట్టెలవాళ్ళు గుర్తుకొస్తున్నారు.
“సుమతీ
శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో
వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి
పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. ఓటర్లని
ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. ఆకర్షించడానికి వేయని పిల్లి
మొగ్గలు వుండవు. వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం
లేని నాలుక, మండువేసవిలోనైనా సరే వారి చేత
చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. ఒళ్ళు గడ్డ కట్టే చలికాలంలో కూడా వెచ్చటి
వాగ్దానాల దుప్పటి కప్పుతుంది.
కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్ ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు, ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్
చేసి కనుక్కున్న సంక్షేమ పధకాల ప్రకటనలతో వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ప్రజలనుంచి ముక్కు పిండి పన్నులు
వసూలు చేసి నింపుకున్న ఖజానా డబ్బులతోనే ఓటర్లకు నజరానాలు గుప్పిస్తూ, ఇలా ఈ చేత్తో తాయిలాలు
ఇచ్చి అలా ఆ చేత్తో ఓట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే
రాజకీయ పార్టీల మేమిఫెస్టోలు నూటికి
నూరుపాళ్ళు అచ్చంగా ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులనే చెప్పాలి.
వాగ్దానకర్ణుల మాదిరిగా ప్రకటిస్తున్న
తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు
లేవు. అసలు ఇస్తారా ఇవ్వరా, ఏరు దాటినా పిదప బోడి మల్లయ్య బాపతా అనే ప్రశ్నలకు
సమాధానాలు వుండవు. ఇందులో ఒకరు తక్కువ
తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.
అందుకే ఉచితానుచితాల ఊసెత్తకుండా ‘ఉచిత తాయిలాలు’ భారీగా ప్రకటించుకుంటూ పోతున్నారు.
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక
మేనిఫెస్టోను విడుదల చేయడం రివాజు. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే
ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు
(గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి
చేయబోతున్నదో అనే అనేకానేక ఉచిత వరాలతో కూడిన ఎన్నో వివరాలు ఈ
మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు
చేస్తుంది. ఇందునిమిత్తం పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు
సమావేశాలు జరిపి, ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన
అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో
వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల
నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల
అనేది మరో పెద్ద తంతు. ఓటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు
చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే
అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్
మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన
ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు ముందు ఓ తప్పనిసరి తతంగంగా తయారయింది. కాకపొతే, ఎన్నికల తరువాత మాత్రం
మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు
చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి
అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులను చిత్తు చేయాలంటే ఓటర్లు
కూడా తమ సొంతమేనిఫెస్టోలు విడుదల చేయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.
‘మీరిలా వోటు వేసి గెలిపించండి.
మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల
మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి.
అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో
ముందుకు వస్తేనే కాని రాజకీయ పార్టీల లేనిపోని హామీల వరదకు అడ్డుకట్ట పడదు. ఈ
నేపధ్యంలో వచ్చిన ఆలోచనే ‘ఓటర్ల మేనిఫెస్టో’
1. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే
ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని
యెలా అమలు చేయబోతున్నామో అన్న విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అనుమానాలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా ఎన్నికల
ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా వోటర్లకు తెలియచెప్పాలి. యేరు
దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన తరువాత బోడి మల్లయ్య
సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు
అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో
వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే
మొదటి ఏడాది వ్యయాన్ని హామీ ఇచ్చిన పార్టీలే
తమ పార్టీ నిధులనుంచి ఖర్చు
చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి
చెప్పాలి. ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని
ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పే బాధ్యత మీడియా
తీసుకోవాలి.
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే
పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం
సాగించాలి. సాధ్యమైనంత వరకు ఇందుకు మీడియాను ఉపయోగించుకోవాలి (డబ్బిచ్చి కాదు
సుమా! లేకపోతే ఇది మరో క్విడ్ ప్రోఖో అయ్యే ప్రమాదం వుంది)
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. వీలయితే, ఆన్
లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ రాజకీయ పార్టీ కూడా
ప్రజాస్వామ్య హక్కు పేరుతొ రద్దీగా వుండే రోడ్లపై ధర్నాలు, బైఠాయింపులు, రాస్తారోఖోలు నిర్వహించరాదు. అలాగే
ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను
ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా
ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి.
ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు
వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం చూపిస్తున్నారు. అలాకాకుండా
రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష
ప్రసారం చేయాలి.
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ
ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన
స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ అంటే త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా
గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ వసూలు చేయాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే
కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన తరువాత అధికార
అందలం ఎక్కడం కోసం ఏర్పడే అవకాశవాద కూటములను నిషేధించాలి.
ఇవి కొన్ని మాత్రమె. ప్రజాభిప్రాయాన్ని
సేకరించి ఈ ఓటర్ల మేనిఫెస్టోలను మరింత సమగ్రం చేసే బాధ్యతను ప్రజాసంఘాలు
నెత్తికెత్తుకోవాలి.
తోకటపా:
‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను
అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను
సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్
లేబుళ్లు:
కాశీపట్నం చూడరబాబూ! మేనిఫెస్టోలు
21, మార్చి 2019, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)