17, జనవరి 2019, గురువారం
16, జనవరి 2019, బుధవారం
కనుమనాడు మా ఇంట పండగ సందడి
పాతికేళ్ళ క్రితం మేము పంజాగుట్ట
దుర్గానగర్ కాలనీలో ఉన్నరోజుల్లో మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం ఈ సాయంత్రం
మా ఇంటికి వచ్చింది. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ
పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. వీళ్ళలో ఒకమ్మాయి కళ తన ఇద్దరు మొగ పిల్లలకు తను పెంచిన మా పిల్లల పేర్లే, సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. యాదమ్మ, మల్లయ్యలకు ఇప్పుడు ముగ్గురు
మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు.
పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి
చిన్నమ్మాయి ( మాకళ్ళ ముందే పుట్టింది, ఇప్పుడు పాతికేళ్ళు) తిరుపతమ్మ (పెళ్ళిలో
రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను
చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి
వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’
Left to Right (Sitting)
Goutham Kartik, Sai Rama Krishna, Samruddhi, Sandeep, Sreemanya, Santosh, Manojna
Left to Right (Standing)
Sampoorna, Abhiram, Nirmala Bhandaru, Kala, Bhagya, Tirupatamma (Roopa), Yadamma
వాళ్ళు వున్న సమయం మాకు నిజంగా పండగ
మాదిరిగా హాయిగా గడిచిపోయింది.
15, జనవరి 2019, మంగళవారం
నందమూరి తారకరామారావు గారు, ఓ జ్ఞాపకం
ఈ వృత్తాంతం ఎందుకు గుర్తుకు వచ్చిందో
చివర్లో చెబుతాను. బహుశా చెప్పాల్సిన పని కూడా వుండదు అనుకుంటాను.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం
సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా
తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం
మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ
సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని
రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా
బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి
వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి
వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా
నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా
సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ
తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ
కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు
వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త
దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు
వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు
రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను.
ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను.
కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో
చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక
నేనేమి మాట్లాడను?”
నిన్న మా ఆవిడా నేనూ NTR కధానాయకుడు సినిమా చూశాము.
లేబుళ్లు:
ఓ జ్ఞాపకం,
నందమూరి తారకరామారావు గారు
KSR Live Show | YS Sharmila Files Fresh complaint | ఎందుకింత దిగజారుడు ర...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీలో కేఎస్ ఆర్ లైవ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ క్రిశాంక్ (కాంగ్రెస్), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ)
14, జనవరి 2019, సోమవారం
తొందరపడ్డదాన్ని కాదు (కధానిక) – భండారు శ్రీనివాసరావు
ఆదివారం. లిఫ్ట్ అలుపూ సొలుపూ లేకుండా
పైకీ కిందికీ తిరుగుతోంది. చిన్నా పెద్దా సామాన్లు ఖాలేగా ఉన్న మా పక్క పోర్షన్ లోకి చేరుతున్నాయి. నలుగురు
పనివాళ్ళు పెద్ద పెద్ద టీవీలను , మంచాలను, అరమరాలను మెట్ల మీదుగా తెస్తున్నారు.
సాయంత్రానికల్లా ఇల్లు పట్టనంత సామానును ఇంట్లో అమర్చిపోయారు. తీరా చూస్తే ఒక వయసుమళ్ళినావిడ,
రిటైర్ అయిన మొగుడు.
వుండేది ఇద్దరే. పిల్లలు అమెరికాలో
వుంటారట. ఇరవై నాలుగ్గంటలు వుండే పనిమనిషి, వంటకు ఇంకో మనిషి. పెద్ద టీవీలు
ఉన్నాయన్న మాటే కానీ ఆవిడ ఎప్పుడూ పూజాపునస్కారాలతోటో, రామకోటి రాస్తూనో వుండేది.
ఇక ఆయన పొద్దున్న ఇంగ్లీష్ పేపర్లో తలదూరిస్తే మళ్ళీ మధ్యాన్న భోజనం వరకు ఆ వార్తలే ఆయనగారికి భోజనం అన్నట్టుగా వుంటారు.
వంట మనిషి రోజూ ఆరున్నొక్క తీరుగా
రకరకాల చిరుతిండ్లు చేసిపెడుతుంటుంది. కానీ ఏనాడూ ఆవిడ నోరు తెరిచి ‘ఈ మిఠాయి ఉండ
నోట్లో వేసుకుని చెప్పమ్మా మరదలా’ అంటుందేమో అని చాలా రోజులుగా అనుకుంటూ
వుండేదాన్ని. కానీ ఏనాడూ ఆమె నోటంట ఈ మాట రాలేదు. దాంతో నేనే కావాలని మా ఇంట్లో చేసిన వాటిని తీసుకుపోయి
ఇస్తుండేదాన్ని. తిని తెగ మెచ్చుకునేది. ‘నీ చేతితో ఏం చేసినా అమృతం సుమా’ అనేది.
సంక్రాంతి వచ్చింది. ‘చూడు మరదలా! రేపు
నువ్వూ తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రావాలి. మరచిపోవద్దు’ అంటే ఆశ్చర్యపోయాను.
పండగనాడు రకరకాల వంటకాలు వడ్డించింది.
స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిఉండొచ్చు అనుకున్నా.
‘ఏదీ మీ వంటమ్మాయి కనిపించడం లేదు’
అన్నాను అటూ ఇటూ చూస్తూ ఆవిడ ఇచ్చిన తాంబూలం నోట్లో వేసుకుంటూ.
‘పండక్కి వాళ్ళ ఊరుకు వెళ్ళింది. రేపు
సాయంత్రం వస్తుంది. ఇన్నాళ్ళు ఆమె చేసి పెడితే మేము తింటున్నాము. ఇరుగూ పొరుగును
పిలిచి ఆమె మీద భారం వేయడం ఎందుకని ఊరుకున్నాను. ఇదిగో! ఈరోజు ఇవన్నీ నా చేత్తో చేసినవే. ఎలా వున్నాయో
చెప్పు. వంటింట్లోకి పోయి చాలా కాలం అయింది. ఇది తెలిస్తే మా పిల్లలు ఊరుకోరు’
ఏం చెప్పను?
ఆవిడ వయసే కాదు, మనసుకూడా పెద్దది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
