25, నవంబర్ 2018, ఆదివారం

సీట్ల కేటాయింపులో ‘వెనుకబడిన’ తరగతులు – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON 25-11-2018, SUNDAY)
నేను ఈ తరగతులకు చెందినవాడిని కాను. కానీ ఈ మాట చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు.
ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయంచేసిన దాఖలా కనబడడం లేదు. ఎన్నికలకు ముందు ప్రతిసారీ ప్రముఖంగా వినబడే ‘వెనుకబడిన తరగతులు’ అనే పదం ఎన్నికలు కాగానే మరపున పడడం కొత్త విషయం ఏమీ కాదు. రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ‘గెలుపు గుర్రాలు’ అనే ఓ కొత్త పదం ఈ పాత పదాన్ని మరింత వెనక్కి నెట్టింది.
ఈ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నీటి వాలుకు, గాలి వాటానికి అనుగుణంగానే పడవ నడపడం ఒక విధానంగా మలచుకున్నారు. నాయకులు ఈ విషయం బయటకి చెప్పుకోవడానికి కూడా భేషజం ప్రదర్శించడం లేదు. పైపెచ్చు ‘మాది రాజకీయ పార్టీ, సత్రాలు, మఠాలు కావు’ అని బాహాటంగానే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మారిన పరిస్తితులకు అనుగుణంగా పార్టీలు కూడా ఎంతోకొంత సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొత్తేమీ కాదు. ఏం చేసినా, ఏం చెప్పినా చిట్టచివరకు  గెలుపు ఒక్కటే పరమావధి అయినప్పుడు, ఆ విజయానికి, తద్వారా లభించే అధికారానికి దూరమై భారంగా గడపడం కంటే ఏదో ఒకటి చేసి నెగ్గడం అనేది ముఖ్యమైపోయింది. సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలనే అన్ని పార్టీలకు వుంటుంది. అలా చేయాలంటే ముందు అధికార పీఠం అధిరోహించాలి కదా!
ఇదిగో! ఈ మిషతోనే అన్ని  పార్టీలవాళ్ళు ఎన్నికల్లో  టిక్కెట్లు ఇచ్చే విషయంలో ‘గెలవగలిగిన సత్తా’ ఒక్కటే ప్రధాన అర్హతగా ఎంచుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. అంచేతే, సంఖ్యాబలం కలిగివున్న ‘వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఇతర బలహీనవర్గాల వాళ్ళు’ ఎన్నికల పరుగు పందెంలో వెనుకబడిపోతున్నారు.  ఎస్సీ, ఎస్టీలకురాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల పుణ్యమా అని వారి వాటా వారికి ఇవ్వక తప్పని పరిస్తితి. హక్కుగా ఆ అర్హత లేని వెనుకబడిన తరగతుల వాళ్ళు నోరు విప్పలేని పరిస్తితి. అలా అని రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు అసలు సీట్లు ఇవ్వకుండా మొహం చాటేయడం లేదు. సరైన అభ్యర్ధులు దొరకని చోట్లా, కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకున్న బీసీ అభ్యర్ధులు లభించిన చోట్లా ఖాళీలను పూరించినట్టు భర్తీ చేస్తూనే వున్నారు. ఆ పని చేసి మేము ఇతరులకంటే బీసీలకు ఈ విషయంలో ఎక్కువ న్యాయం చేస్తున్నామని ప్రకటించుకుంటున్నారు.
వచ్చే నెలలో తెలంగాణా నూతన రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ తంతు పూర్తయింది. రాష్ట్రంలోని నూట పందొమ్మిది స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్ధులు ఎక్కడ పోటీ చేస్తున్నారనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది.
స్థూలంగా జాబితాలను పరికించినవారికి మళ్ళీ ఈఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే ఇచ్చినట్టు కనబడుతోంది. వారికి ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. బీసీలకి ఈసారయినా జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా అనేదే ప్రశ్న. జరగలేదని చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు.
ముందు పాలక పక్షం టీఆర్ఎస్ ని తీసుకుంటే ఆ పార్టీ ఎవ్వరితో పొత్తు లేకుండా మొత్తం నూట పందొమ్మిది స్థానాల్లో పోటీపడుతోంది. అందులో 26 బీసీలకు కేటాయించింది. కేంద్రంలో పాలక పక్షం అయిన బీజేపీ, మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తూ వాటిల్లో 32 స్థానాలు బీసీలకు ఇచ్చింది.  మహాకూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన 99  సీట్లకుగాను, కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో బీసీ  అభ్యర్ధులను నిలబెట్టింది. 13 సీట్లు లభించిన తెలుగుదేశం పార్టీ మూడింటిని బీసీలకు వదిలింది. కాగా,  టీజేఎస్ తనకు దక్కిన  8 సీట్లలో రెండు సీట్లలో బీసీ అభ్యర్ధులను ప్రకటించింది.  మహాకూటమిలో మరో భాగస్వామి అయిన సీపీఐకి బీసీల విషయంలో గడ్డు పరీక్ష ఎదురయింది. తన భాగానికి వచ్చిన మూడు సీట్లలో రెండు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కిందకు పోయాయి. మిగిలింది ఒక్క జనరల్ సీటు. ఈ ఎన్నికల్లో తలపడుతున్న తమ పార్టీ రాష్ట్ర నాయకుడికి ఆ సీటు ఇవ్వక తప్పని పరిస్తితి. అదే చేసింది.
పొతే,  మరోకూటమి బీఎల్ఎఫ్ 109 స్థానాల్లో పోటీచేస్తూ ఏకంగా 58 సీట్లలో  బీసీ అభ్యర్ధులను నిలబెట్టింది. ఈ కూటమి బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించిన మాట వాస్తవమే.  వారు గెలిచి శాసన సభలో అడుగు పెట్టగలిగితే చట్ట సభలో వెనుకబడిన తరగతుల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది.
ఇక అగ్రవర్ణాలకు పెద్ద పీట వేసిన పార్టీల్లో టీఆర్ఎస్ 59 సీట్లతో అగ్రస్థానంలో వుండగా, 50 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 41 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో వుంది. టీడీపీ తనకు దక్కిన 13 సీట్లలో ఏడింటిని అగ్రవర్ణాలకే కట్టబెట్టింది. బీఎల్ ఎఫ్ కూటమి తాను పోటీ చేసే 109 స్థానాల్లో  51 సీట్లని అగ్రవర్ణాలకి కేటాయించింది. మిగిలిన పార్టీలు పోటీ చేసే స్థానాలే రెండంకెల సంఖ్య దాటే పరిస్తితిలేదు కనుక వాటిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు.     
ఆర్ధిక, సామాజిక కోణంలోనే కాదు మొత్తం మానవ సమాజంలో మానసికంగా బలవంతులయినప్పటికీ, శారీరకంగా బలహీన వర్గం అయిన మహిళలకు ఈసారి కూడా  ఆయా పార్టీలు పెద్దగా ప్రాతినిధ్యం కల్పించిన దాఖలా కనబడడం లేదు. అన్ని పార్టీలు కలిసి ఆడవారికి ఇచ్చిన సీట్లు 43 అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 11, టీడీపీ 1, టీజేఎస్ 1, సీపీఐ 1, బీజేపీ 15, బీఎల్ఎఫ్ 10 స్థానాలు స్త్రీలకు కేటాయించాయి. ఆకాశంలో సగం అనే నినాదాన్ని  ప్రకటనలకే సరిపుచ్చినట్టయింది.
అన్ని పార్టీలకి సీట్ల లెక్కలు తేలాయి. తిరుగుబాటు అభ్యర్ధుల బెడదను లాలించో, బుజ్జగించో చాలావరకు తగ్గించుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 1825 మంది బరిలో మిగిలారు. వీరిలో అధికులు ఇండిపెండెంటు అభ్యర్ధులు.
చూస్తుండగానే పోలింగు ఘడియ దగ్గర పడుతోంది. ప్రచారానికి మిగిలిన వ్యవధి కూడా  కొద్ది రోజుల్లోకి వచ్చింది.
అందరికంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. కేసీఆర్ బహిరంగ సభలతో, కేటీఆర్ రోడ్డు షోలతో బిజీగావున్నారు. టిక్కెట్టు విషయంలో భరోసా కలిగిన మహాకూటమి నాయకులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర లేపారు.
యూపీయే చైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి గత శుక్రవారం నాడు  మేడ్చల్ లో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో ప్రసంగించి తమ ఉపన్యాసాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహాకూటమిలో తొలుత  సీట్ల సర్దుబాట్ల విషయంలో బయల్పడిన అనేక కీచులాటల కారణంగా ఒకింత మసకబారిన కూటమి నిబద్ధత నేపధ్యంలో, మేడ్చల్ సభ ఒక ఎనర్జీ టానిక్ లా కూటమి నేతలకు ఊరట కలిగించివుంటుంది. దుమ్ము రేగినప్పుడు దానిని అణచడానికి నీళ్ళతో కళ్ళాపి చల్లినట్టు ఈ మహాసభ, మహా  కూటమిలో ఏర్పడ్డ లుకలుకలను ఒక మేరకు కమ్మేసింది. సోనియా గాంధి చేసిన క్లుప్త ప్రసంగం హుందాగా సాగింది. తెలంగాణా తానే ఇచ్చినట్టు గొప్పలకు పోకుండా ఆ ఖ్యాతిని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఖాతాలోకి జమచేస్తూ అటు హుందాతనాన్ని, ఇటు రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించడం ఆమె ప్రసంగంలో ప్రత్యేక ఆకర్షణ. నిజానికి తెలంగాణ రాష్ట్రము ఇచ్చే విషయంలో నాడు జరిగిన అనేక మంతనాల్లో రాహుల్ గాంధి కీలక పాత్ర ఏమీ లేదన్న విషయం తెలిసి కూడా పార్టీ పగ్గాలు మోస్తున్నది రాహుల్ కాబట్టి సోనియా ఆయన పేరును  ఈ సందర్భంలో ప్రస్తావించడానికి కారణం అయివుంటుంది. తన అత్తగారయిన ఇందిరా గాంధి మాదిరిగానే, ‘తల్లి’ సెంటుమెంటు అస్త్రాన్ని సోనియా ఈ సభలో ప్రయోగించారు.’ తెలంగాణా నా బిడ్డ, కొత్త రాష్ట్రంలో తమ బంగారు భవిష్యత్తు పట్ల ప్రజలు పెంచుకున్నఆకాంక్షలను నెరవేరుస్తామని చెబుతూనే, ఇక్కడి పరిస్తితులను చూసి తల్లిగా తాను తల్లడిల్లి పోతున్నానని చెప్పడం సెంటిమెంటు వ్యూహంలో భాగమే అని పరిశీలకులు భావిస్తున్నారు.  తెలంగాణా గడ్డపై జరిగిన సభలో ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని ప్రకటించడం వెనుక  రాజకీయ వ్యూహం దాగుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యేకించి మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా రానున్న లోక సభ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటు ప్రయత్నాలను మెరుగుపరచడానికి బహుశా ఈ ప్రస్తావన చేసి ఉండవచ్చు. తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం అటు సార్వత్రిక ఎన్నికల మీదా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీదా పడే అవకాశం ఉన్న రీత్యా ఈ ముందు  జాగ్రత్త ప్రకటన  చేయడానికి కారణం కావచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇచ్చిన హామీకి మరింత ఊతం కల్పిస్తూ యూపీఏ అధినేత్రి సోనియా ఈ మాటలు చెప్పడం వల్ల రానున్న  ఏపీ ఎన్నికల్లో తమ పార్టీకి లాభించే వీలుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించి ఉండవచ్చు. అయితే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఈ ప్రస్తావన తేవడం టీకాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడడం కష్టమే. సోనియా ప్రకటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో తెలంగాణా వాదులు నిరసన వ్యక్తం చేయడం మొదలయింది కూడా.
ఇక అసలు విషయానికి వస్తే,  కాంగ్రెస్ అధినాయకులు చాలామంది హస్తిన నుంచి తరలి వచ్చి హైదరాబాదులోనే మకాం పెట్టారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబునాయుడు ఈనెల 28, 29 తేదీల్లో ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నిర్వహించే రోడ్డు షోలలో పాల్గొంటారని మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
పొతే, తెలంగాణాలో ఎన్నికల సమరానికి పార్టీలన్నీ సమాయత్తం అయ్యాయి. దేశంలో ఇరవైతొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా గడ్డపై మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఓటర్లు స్వేచ్చగా  ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని పార్టీలు సహకరిస్తే రాజ్యాంగ బద్దమైన విద్యుక్త ధర్మాన్ని  పాటించిన గౌరవం వాటికి దక్కుతుంది.

24, నవంబర్ 2018, శనివారం

Discussion on Sonia Gandhi And Rahul Gandhi Medchal Bahiranga Sabha | Pu...





ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం  ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ శ్రీ పవన్ దాచరాజుతో నేను....

23, నవంబర్ 2018, శుక్రవారం

Damn Sure TRS Will Definitely Win In Telangana | TRS Ravinder Reddy | #S...









ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజుఉదయం మహా న్యూస్ 'అజిత' సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ మానవతా రాయ్ (టీ కాంగ్రెస్), శ్రీ రవీంద్ర రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన)

Telangana Congress Bahiranga Sabha InFluence On Voters | Analyst Bandari...





ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజుఉదయం మహా న్యూస్ 'అజిత' సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ మానవతా రాయ్ (టీ కాంగ్రెస్), శ్రీ రవీంద్ర రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన) 

20, నవంబర్ 2018, మంగళవారం

Discussion | Manish Kumar Sinha claims suggest illegal CBI intercepts un...





ఈరోజు మంగళవారం రాత్రి ABN Andhra Jyothy  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు ( వైస్ చైర్మన్, ఏపీ ప్రనాలికామండలి, అమరావతి నుంచి), శ్రీ విష్ణువర్ధన రెడ్డి ( వైస్ చైర్మన్, జాతీయ నెహ్రూ యువక కేంద్రం, బీజేపీ, ఢిల్లీ నుంచి), శ్రీ రామశర్మ ( ఏపీ కాంగ్రెస్), ABN యాంఖర్ : రూప.

కదిలిన కందిరీగ తుట్టె – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily in it’s edit page, SUNDAY, 18-11-18) 
“సీబీఐ కి భయపడే మనిషిని కాదు. అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే కీలుబొమ్మ సంస్థ. ఆ బూచిని చూపి బెదిరించాలంటే నాతో కుదరదు. జాగ్రత్త!”
ఈ మాటలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరబాటు పడ్డట్టే. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అచ్చం ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు మాట్లాడారు. అప్పట్లో ఆయన గోద్రా మారణ హోమం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చంద్రబాబునాయుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ‘ జాతిని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ మొదలుపెట్టిన ఉద్యమానికి ఊతం ఇస్తూ ఒకనాడు మోడీ మహాశయులు చెప్పిన మాటలనే తిరిగి వల్లె వేస్తున్నారు. 
దీన్నిబట్టి సామాన్యుడికి అర్ధం అయ్యేది ఏమిటంటే కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా, కేంద్రంతో రాష్ట్రాల సంబంధాలు బాగున్నప్పుడు ఒక రకంగా, చిట్లిపోయినప్పుడు ఇంకోరకంగా రాజకీయ నాయకులు తమ నాలుకలను మడతవేసి మాట్లాడతారని.
ఈఏడాది మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మార్గం పట్టాయి. అప్పటివరకు నాలుగేళ్ళుగా అధికార తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి ఒక్క వై ఎస్ ఆర్ సీపీ మాత్రమే. ఇప్పుడు దానికి తోడుగా బీజేపీ కలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మిత్రపక్షం అంటూ లేకుండా పోయింది, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ను మినహాయిస్తే. 
1994 చివర్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన దాదిగా ఒకేసారి అన్ని వైపుల నుంచి ఎదురయ్యే రాజకీయ ప్రత్యర్ధి శిబిరాలతో పోరాడాల్సి వచ్చిన సందర్భం చంద్రబాబునాయుడుకు ఎదురు కాలేదు. అటు కేంద్రంతో కయ్యం. ఇటు అనుక్షణం కయ్యానికి కాలుదువ్వడానికి అవకాశం కోసం ఎదురు చూసే ప్రధాన ప్రత్యర్ధి వైసీపీ. మరో వైపు చీటికీ మాటికీ చీకాకు పెడుతున్న పవన్ కళ్యాణ్ జనసేన.
2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రులుగా వున్నవాళ్ళందరూ ఈ నాలుగేళ్ల కాలంలోనే ప్రత్యర్దులుగా రూపాంతరం చెందారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని సరిపుచ్చుకున్నా చంద్రబాబుకు ఇది సరికొత్త అనుభవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, తదుపరి ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో చక్కని సయోధ్య వుండేది. వాజ్ పాయ్ ప్రధానిగా వున్నప్పుడు బాబు మాటకు తిరుగుండేది కాదు. ఢిల్లీ వెళ్ళాల్సిన పనిలేకుండానే కావాల్సిన పనులన్నీ నోటిమాటతో హైదరాబాదు నుంచే చక్కబెట్టుకోగల్గిన పరిస్తితి వుండేది. టీడీపీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ మొదటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావుకు కూడా ఈ వైభోగం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ తాను కలలో సయితం వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వుండడం చేత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల రాజకీయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ నాయకుడిగా వున్నప్పుడు కేంద్రంలో ఆ కూటమి అధికారంలోకి రాగలిగింది కానీ, దురదృష్టం రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అయ్యింది. దీనికి పూర్తి విరుద్ధ రాజకీయ పరిస్తితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. తద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల ప్రతిభావంతుడనే కితాబు ఆయన ఖాతాలో చేరింది. 
ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు కాలంలో సుమారు తొమ్మిదిన్నరేళ్ళ పాటు అధికారానికి దూరమై, పార్టీని కాపాడుకుకునే క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన అంశం కూడా అనుకోకుండా కలిసివచ్చింది. విడివడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో సమర్ధుడని సంపాదించుకున్న మంచి పేరు మరోసారి కలిసివచ్చి మరోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్మిన మోడీ ప్రభావం, అప్పుడే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి నేరుగా దిగకుండా అందించిన స్నేహహస్తం, ఆయన వ్యక్తిగత ఆకర్షణ, ఇవి సయితం, చేజారిపోతుందేమో అని ఒక దశలో సందేహపడ్డ రాజకీయ అధికారం ఆయన చేతికి అందేలా తోడ్పడిన మాట కూడా నిజం. 
రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్తితులు ఊహించలేనంత వేగంతో మారిపోవడం మొదలయింది. కేంద్రంలో కుదురుకున్న భారతీయ జనతా పార్టీ చూపు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయడం వైపు మళ్ళింది. రాష్ట్రంలో దొరికిన అధికారాన్ని పదిలపరచుకుని శాశ్వతం చేసుకునే దిక్కుగా తెలుగుదేశం రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.
రాజకీయ స్నేహాలకు కూడా ఒక పరిమితి వుంది. అధికారం దక్కేవరకు, స్వప్రయోజానాలు దెబ్బ తిననంతవరకు ఆ స్నేహాలు చెక్కుచెదరకుండా వుంటాయి. అధికారం ఒకసారి చేతికి దొరికిన తర్వాత తామే సర్వంసహా పరిపాలకులు కావాలనే దుగ్ధ మొదలవుతుంది. అది స్నేహానికి చీడ పురుగుగా తయారవుతుంది. మామూలుగా చంద్రబాబు కావాలని ఎవరితో పేచీ పెట్టుకునే మనిషి కాదు. మనసులోనే దాచుకుని అనువయిన సమయం వచ్చినప్పుడు ఎదురుదెబ్బ తీయాలని ఆలోచించే చాణక్య నీతిని వొంటబట్టించుకున్న రాజకీయ దురంధరుడు. అందుకే మొదటి నాలుగేళ్ళు మిన్నకుండిపోయి, కేంద్రమే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే భావాన్ని ప్రబలనిచ్చి, రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాను కేంద్రంపై యుద్ధం చేస్తున్నాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ఆ తర్వాతనే తన ప్రణాళికను కట్టుదిట్టంగా అమలుచేసినట్టు కానవస్తోంది. అందులో బాగమే ఇప్పుడు తాజాగా రగిలించిన సీబీఐ వివాదం.
సీబీఐ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థల పనితీరు మీద సామాన్య జనంలో కంటే రాజకీయ వర్గాలలోనే ఎక్కువ భయసందేహాలు వున్నాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలను గురించి సామాన్యులు భయపడే అవసరం వుండదు. సమాజంలోని బడాబడా వర్గాల వ్యవహారాలపైనే ఆ సంస్థలు ఓ కన్ను వేసి ఉంచుతాయి. దీనికి తగ్గట్టు రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ అస్త్రాన్ని కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ప్రయోగించడం అనేది కొత్త విషయమూ కాదు. ఇది తెలిసిన వాళ్ళు కనుకనే రాజకీయ నాయకులు సీబీఐ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పటి తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. దీనికి ఉదాహరణే ముందు ప్రస్తావించిన మోడీ మాటలు, చంద్రబాబు తాజాగా ప్రయోగించిన జీవో అస్త్రం. 
ఈ జీవో పై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఏపీ లోని రాజకీయ పార్టీలు తమ తాజా విధానాలకు తగ్గట్టుగా విషయాన్ని అన్వయించుకుని భాష్యాలు చెబుతున్నాయి. ఏపీలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ అంటూ వెలువడిన వార్తలు సంచలనం సృష్టించాయి. మరి రాష్ట్రాలలో కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను ఎవరు చూడాలి అనే ప్రశ్నకు ఈ జీవోను సమర్ధిస్తున్న వర్గాలే సమాధానం చెబుతున్నాయి. కేంద్ర సిబ్బంది అవినీతి అక్రమాలు కనిపెట్టే బాధ్యత కేవలం సీబీఐకి మాత్రమే దఖలు పరచినట్టు చట్టంలో ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవినీతి నిరోధక శాఖ కూడా ఈ పని చేయవచ్చనీ ఆ వర్గాల వాదన. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ ఘర్, హరియాణా తో సహా పందొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే అమల్లో వుందని నొక్కిచెబుతున్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో వున్న పద్ధతినే ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 
అయితే ఇన్ని వివరణలు ఇస్తున్న ఈ వర్గాలు జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది. అది ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంచుకున్న సమయం. ఆంధ్రాలో ఇటీవల ఐటీ దాడులు జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీవాళ్లు ఇదే ప్రశ్న లేవనెత్తారు. టీడీపీ ఎన్డీయే తో కలిసివున్నప్పుడు జరగని దాడులు, సంబంధాలు తెగతెంపులు చేసుకున్న తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు సంధించిన ప్రశ్న గుర్తుండే వుంటుంది.
సీబీఐ పరిధి గురించి మూడు మాసాల క్రితం సార్వత్రిక అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటన్నది జీవో గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వీళ్ళూ వాళ్ళూ చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న ప్రశ్నలు రాజకీయ ప్రేరేపితం కాబట్టి దానిమీద చర్చించి ప్రయోజనం వుండదు.
ప్రత్యర్ధుల పీచమణచడానికి, రాజకీయ ప్రయోజనాలను పొందడానికి వాడుకుంటూ తన అధీనంలోని సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనే వాదన ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలో యూపీఏ అధికారంలో వున్నప్పుడు ఇదే మాట ప్రతిపక్షం నోట వినబడింది. ఇప్పుడు అదే బాణీ ప్రతిపక్షంగా మారిన మిత్ర పక్షం నుంచి వినబడుతోంది. మళ్ళీ ఎన్నికల్లో పాత్రలు తారుమారయితే ఇదే తంతు కొనసాగుతుంది.
‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. దేశాన్ని కాపాడాలి’ అనే నినాదంతో విభేదించేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అయితే జనం కాపాడాల్సింది ఈ నినాదాలు ఇస్తున్న నాయకులనా, దేశాన్నా అనే దగ్గరే సందేహాలు పొటమరిస్తున్నాయి. ఎందుకంటే గతంలోకి చూస్తే ఏఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారం దఖలు పడిన తర్వాత చెప్పిన మాటని నిలబెట్టుకున్న దాఖలా లేదు.
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దూరదృష్టి కలిగిన వెనుకటి తరం నేతలు, తమతో ఏమాత్రం పోల్చలేని రాజకీయ నాయకులు తమ తరవాతి తరంలో పుట్టుకొస్తారని ఎంతమాత్రం ఊహించి వుండరు. అంచేతే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వచించే విషయంలో విశాల దృక్పధాన్ని ప్రదర్శించారు. రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలన్నీ తమ పరిధుల్లో వ్యవహరిస్తూ, ఇతర వ్యవస్థల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోబోవు అనే నమ్మకంతో రాజ్యాంగాన్ని తయారు చేసివుంటారు.
ఇప్పుడు పరిస్తితి తద్విరుద్ధంగా ఉంటోంది. అలనాటి ఆ మహా నాయకులు ఆశించిన స్థాయిలో ఈనాటి రాజకీయ నాయకులు లేరన్నది నిర్వివాదాంశం. ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారం శాశ్వతం అని భ్రమించేవాళ్ళూ, ఆ భ్రమల్లో కూరుకుపోయి ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఈ రోజు రాజకీయ రంగాన్ని ఏలుతున్నారు. ప్రతిదీ తమ కనుసన్నల్లో, తాము కోరుకున్నట్టు జరగాలని శాసిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేదు. ఎవరికి వారు తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాలను తమ ఇచ్చవచ్చిన రీతిలో అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రయోజనాలకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా భంగం వాటిల్లినా సరే, దాని దుష్ప్రభావాన్ని ఎదుటివారి మీదకు నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. 
అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు తిరిగిపోయే వేగంతో తమ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్ణీత కక్ష్యను దాటి రావడం అంటూ జరగదు. జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని గ్రహాలు గతి తప్పకుండా భ్రమిస్తుంటాయి. 
రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, అధికారులు అందరూ పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగ బద్ధులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కుర్చీ మీద కూర్చోగానే ఆ ఒట్టు తీసి గట్టున పెడతారు. 
‘దేశాన్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్తలని పరిరక్షించాలి’ అనే వారు జాతికి మాట ఇవ్వాలి. తమ అధికారంలో ఉన్న వ్యవస్థలని అదే చిత్తశుద్ధితో కాపాడతామని, వాటిలో తమ జోక్యం ఉండదనీ. అలా ఇచ్చిన మాటని త్రికరణ శుద్ధిగా నిలబెట్టుకోవాలి.
ఇది జరగని నాడు ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. వ్యవస్థలు ఇలాగే అధికారంలో ఉన్నవారికి అణిగిమణిగి పనిచేస్తూనే వుంటాయి. ప్రజల అవస్థలు అలాగే కొనసాగుతుంటాయి. 
ఇలా చేసే ఈ ప్రయత్నాలన్నీ తమని మభ్య పెట్టడానికి పన్నే రాజకీయ వ్యూహాల్లో భాగాలని, తమకు ఒరిగేది ఏమీ లేదని ప్రజలు గ్రహించిన నాడు, ఇక సరిదిద్దుకోవడానికి రాజకీయులకు వ్యవధానం మిగలదు.
కాబట్టి రాజకీయం చేసేవాళ్ళు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి.
‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”

యాదగిరి ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు


పొద్దున్న సాక్షి నుంచి ఇంటికి వస్తుంటే పాశం యాదగిరి ఫోను.
‘బాగా రాశావు ‘బడు’ ధాతు గురుంచి’ అన్నాడు.
యాదగిరి బాగుంది అన్నాడు అంటే అది ఓ సర్టిఫికేట్. అతడికి తెలియని సబ్జెక్ట్ లేదు. అన్ని భాషల్లో ప్రావీణ్యం. చాలా విషయాలు జ్ఞాపకం వుంటాయి.  కానీ ఎప్పుడో కాని కాగితం మీద కలం పెట్టడు. అయితే ఒక సుగుణం వుంది. ఫోను చేసి చాలావాటిని నాలాంటి వాళ్ళతో పంచుకుంటాడు. ఇక నాకా రోజు రాసుకోవడానికి ముడి సరుకు దొరికినట్టే.
ఇవ్వాళ కూడా పాత కబుర్లు అనేకం చెప్పాడు. నేను రాసిన నార్లగారి ‘బడు’ ధాతువు ప్రధానాంశం. ‘బడు’ అని  రాసేవాడు పెద్ద బడుద్దాయి అని నార్ల చీవాట్లు పెట్టేవాడట. ఇన్నయ్య గారితో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 లో వున్న నార్లగారి ‘లుంబిని’  ఇంటికి వెడుతుండేవాడట. ఒకసారి మాటల్లో ఈ బడు ధాతు గురించిన ప్రస్తావన వస్తే హిందీ ఉర్డూ భాషల్లో కూడా ఈ బడు ధాతువు లేదని యాదగిరి చెప్పాడు. ‘మై ఖానా ఖాయా హు.’ (అన్నం తిన్నాను) అంటారు కానీ ‘ఖానా మేరే ద్వారా  ఖాయా గయా’ (అన్నం నాచేత తినబడినది) అనరు అనేది ఉదాహరణగా చెబితే నార్లవారు సంతోషపడి, కుర్రాడివయినా బాగా చెప్పావు అని మెచ్చుకున్నారట. ఆయన ఎవరికో ఫోను చేసి ఈ బడు ధాతువు వేరే ఏదైనా భారతీయ భాషల్లో ఉందా అనే విషయం ఆరా తీసారట. ఆర్య, ద్రావిడ భాషల్లో ఎక్కడా లేదని లేదని సూత్రీకరించారట. ‘ఇదంతా అనువాదకులు తెచ్చిన అబర్ధం. ఇంగ్లీష్ వాడు తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతితెలివికి పోయి చేసిన పని’ అని అన్నారట. ‘కోహినూరు వజ్రం  ఇండియా నుంచి ఎత్తుకు రాబడినది’ అని నిజం ఒప్పుకోవడం వారికి ఇష్టం  వుండదు. అందుకే “Kohinoor came from India” (కోహినూర్ ఇండియా నుంచి వచ్చింది) అంటారు. భగత్ సింగ్ ను ఉరి తీసారు  (Bhagath Singh was hanged) అనకుండా ‘ఉరితీయపడ్డాడు’ అంటారు.  నేరాలు చేసేవాళ్ళు సృష్టించిన పద ప్రయోగం ఇది.  మోడరన్ ఇంగ్లీష్ లో కూడా ఈ బడు ధాతు నిషిద్దం’ అని నార్లవారు విశదం చేసారని యాదగిరి చెప్పాడు.