10, ఆగస్టు 2018, శుక్రవారం

"సైకిల్ కాంగ్రెస్" - సాక్షి ఫోర్త్ ఎస్టేట్

గురువారం రాత్రి సాక్షి 'అమర్' ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: మల్లాది విష్ణు (వైసీపీ), నరహరిశెట్టి నరసింహులు (కాంగ్రెస్), శ్రీపతి రావు (బీజేపీ).
అంశం : "సైకిల్ కాంగ్రెస్"
LINK:
https://www.sakshi.com/video/daily-programmes-fourth-estate/fourth-estate-9th-august-2018-tdp-congress-alliance-1106019

9, ఆగస్టు 2018, గురువారం

రేడియోకి పాదాభివందనం – భండారు శ్రీనివాసరావు

నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది.
మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఇటువంటి సన్నివేశాలను హృద్యంగా జొప్పించారు కూడా.
మరి ఇప్పటికీ వెనుకటి మాదిరిగా రేడియో (ఆకాశవాణి) వింటున్నవాళ్ళు, దూరదర్సన్ చూస్తున్న వాళ్ళు వున్నారా అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా మునుపటి మాదిరిగా ‘ఈ సంగతి రెడియోలోవిన్నాం’ అని చెప్పేవాళ్ళు అంతగా కనిపించక పోవచ్చుకానీ వినేవాళ్ళు లేకుండా మాత్రం పోలేదు.
రేడియో వినడమే కాదు, రేడియో అంటే ప్రాణం అని చెప్పే ఒక వ్యక్తి ఈరోజు నాకు తారసపడ్డాడు. అతడి మాటల్లో నా ప్రసక్తి వుంది కాబట్టి అది ప్రస్తావించకుండా విషయం వివరించలేని పరిస్తితి నాది. కొంత స్వోత్కర్ష అనిపించినా దానికి మినహాయింపు ఇచ్చి నేను చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నా వినమ్ర పూర్వక విన్నపం.
ఇవ్వాళ నేనూ మా ఆవిడా తీరి కూర్చుని గిల్లికజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఆ తీరిక సమయాన్ని ఓ సినిమా చూడడంలో గడపాలని నిర్ణయించుకుని దాన్ని తక్షణం అమలుచేసాం. ఒక మాల్ లోని హాల్లో సినిమా చూసి ఇంటికి రావడానికి ఉబెర్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వుండగా ఆ వ్యక్తి మా ఆవిడతో మాట్లాడ్డం గమనించాను. రేడియోలో పనిచేసే శ్రీనివాసరావా అని అతడు ఆరా తీయడం కనిపించింది. కన్నుమూసి తెరిచేలోగా అతగాడు అదాటున ముందుకు వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టాడు. నలుగురిలో అతడలా చేయడంతో సిగ్గుతో ముడుచుకుపోయాను.
“ఇది నేను రేడియోకు పెడుతున్న నమస్కారం, వేరేలా అనుకోకండి” అనేశాడు.
తన పేరు సుభాష్ అని, కరీం నగర్ జిల్లా వాసిననీ, ప్రస్తుతం కూకట్ పల్లిలో వుంటున్నాననీ వివరాలు అడగకుండానే చెప్పాడు. రేడియో వినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటని చెబుతూ జేబులోనుంచి ఒక బుల్లి ట్రాన్సిస్టర్ తీసి చూపించాడు. వారానికి రెండు సార్లు వచ్చే వార్తావాహిని, ప్రతి గురువారం వచ్చే జీవన స్రవంతి వినేవాడినన్నాడు. 1989 లో నేను మాస్కో వెళ్లకముందు నేను చేసిన ప్రోగ్రాములు అవి. అంటే దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. టీవీల్లో భండారు శ్రీనివాసరావు అని చెబుతూ వుంటారు, అలా చూసి మిమ్మల్ని గుర్తు పట్టాను అని ఒక చిన్న వివరణ ఇచ్చి నా మనసు మూలల్లో తొలుస్తున్న సందేహాన్ని నివృత్తి చేసాడు.
ఆ రేడియో అభిమానితో ఓ సెల్ఫీ దిగాలనిపించింది. కానీ ఆ ప్రక్రియ నాకు రాదు. ఈ లోపల అతడే ఓ సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి తన సెల్ ఫోన్ తో తీసి ఒకటి నాకు వెంటనే వాట్సప్ లో పంపాడు.
ముందుగా మాస్కో రేడియో ప్రసక్తి ఎందుకు తెచ్చాను అంటే, ఆకాశవాణివాళ్ళు కూడా ఇటువంటి అభిమానులతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని.

కొసమెరుపు: కారెక్కగానే మా ఆవిడ అంది, గిల్లికజ్జాకు ప్రారంభ సూచికగా.
"మీరు రేడియో మనిషని అటు రెడియో వాళ్ళు, ఇటు దూరదర్సన్ వాళ్ళు ఎప్పుడో మరచిపోయారు, కనీసం రేడియో వినే వాళ్ళయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, సంతోషించండి"

1, ఆగస్టు 2018, బుధవారం

TIME TO ASK | Big Debate On Water Fight & Controversial Comments By Hari...





మంగళవారం రాత్రి Bharath Today TV నిర్వహించిన 'TIME TO ASK' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: ఇందిరా శోభన్ (టి. కాంగ్రెస్), సాంబారి సమ్మయ్య (టి.ఆర్.ఎస్.), వేణుగోపాల రెడ్డి (టి.బీజేపీ, వరంగల్ నుంచి). నిర్వహణ: Bharath Today TV Associate Editor: సాయి.

31, జులై 2018, మంగళవారం

ఓ పాము కధ – భండారు శ్రీనివాసరావు


“ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”
ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.
“నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన  చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి  నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా అనిపించింది.  కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి ‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా  వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!
‘మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు  ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో  తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’
పాము అలా చెప్పి మాయం అయిపోగానే అప్పటిదాకా  శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ తెలివిలోకి వచ్చారు.
వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.
‘ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా  తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’
అతడు ఆ టీవీ కెమెరామన్.
ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.       

25, జులై 2018, బుధవారం

దేవుడిని నమ్మేవారితో నమ్మనివారికి పేచీలు ఎందుకు? – భండారు శ్రీనివాసరావు


నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే.
దేవుడ్ని నమ్మని ఈ చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు.
లోకాయతఅంటే ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వ శాస్త్రాల  లాగా ఒక మూల పురుషుడు లేడు. సామాన్య ప్రజల్లో కొన్ని అనుమానాలు వుంటాయి. ఉదాహరణకు భగవంతుడికి పెట్టే ప్రసాదం ఆయన ఎప్పుడన్నా తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, ఈ లోకాయతులు ఆనాటి ఆధ్యాత్మిక వాదుల తిరస్కరణకు గురయ్యారు. నమ్మకానికీ,అపనమ్మకానికీ ఇది అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ లోకాయతులు దేవుడ్ని నమ్మరు. ఆత్మను, పునర్జన్మలను విశ్వసించరు. ఒక రకంగా అది వారి నమ్మకం. 
ఈనాటి చర్చల్లో ఒక కులానికి సంబంధించిన అనవసర ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తోంది. లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన చార్వాకుడు ఒక బ్రాహ్మణుడు. మరో చిత్రం ఏమిటంటే చార్వాక వధకు పూనుకున్నవారు కూడా బ్రాహ్మణులే.
మహాభారతంలోని శాంతిపర్వంలో ఈ చార్వాక వధ గురించిన ప్రస్తావన వుంది.
కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలాదిమంది బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి జమవుతారు. వారితో కలిసివచ్చిన చార్వాకుడు ధర్మజుడితో వాగ్వాదానికి దిగుతాడు. యుద్హంలో అనేకమంది బంధు మిత్రుల మరణానికి నువ్వే కారకుడివి. ఇంత చేసి నీవు సాధించింది ఏమిటి? నువ్వు బతికి ఉండడానికి వీల్లేదుఅంటూ గద్దిస్తున్న చార్వాకుడిని చూసి ధర్మరాజు ఖిన్నుడై బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరుణంలో తెప్పరిల్లిన మిగిలిన బ్రాహ్మణులు, చార్వాకుడు తమ ప్రతినిధి కాదని ధర్మరాజుకు నచ్చచెప్పి, ఆ కోపంలో చార్వాకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి అతడిని వధిస్తారు. చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
అలా చార్వాకుడి నుంచి ఈ నాటి దాకా పురాణాలను అధిక్షేపించిన అనేకమంది మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. అయినా వాటిపట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న భక్తి శ్రద్ధలు ఏమీ చెరిగిపోలేదు. 
ఒక్క మనదేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఇలా దేవుడ్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ ఇలాటి సంఘర్షణలు జరుగుతూ వస్తూనే వున్నాయి. దేవుడనేది ఒక నమ్మకం. అలా నమ్మేవారి నమ్మకాన్ని శంకించాల్సిన పనిలేదు. దేవుడ్ని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే. ఎవరి నమ్మకం వారిది. నమ్మకం మూఢనమ్మకంగా మారనంతవరకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఒక సినిమా నటుడ్ని గురించి ఒకింత నిరసనగా మాట్లాడితేనే తట్టుకోలేని అభిమానుల నడుమ జీవిస్తున్నాం. మరి కోట్లాదిమంది అనునిత్యం దేవుడిగా పూజించే పురాణ పురుషులను గురించి ఎగతాళిగా మాట్లాడితే ......
రాముడు దేవుడు కాదని మీ నమ్మకమైతే దాన్ని నమ్మేవారితో పంచుకోండి. దేవుడిని నమ్మేవారితో మీకు పేచీలు ఎందుకు
(ఇటీవల  హెచ్ ఎం టీవీ ఈ అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో నాకు సమయం లభించినప్పుడు చెప్పిన కొన్ని విషయాలు)

24, జులై 2018, మంగళవారం

గుర్రం ఎగరావచ్చు.... భండారు శ్రీనివాసరావు


కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు,  ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు.  వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ ఒకప్పుడు పత్రికల్లో పనిచేసిన వాడినే కనుక, నియమాలకు కట్టుబడి మాట్లాడకుండా లేచి వచ్చేశాను.
ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు సాంఘిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ‘ఎత్తిపోసి’ మరీ ప్రచురిస్తున్నారు. ట్వీట్ల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా అవి పతాక శీర్షికలలో దర్శనమిస్తున్నాయి.
కాలం తెచ్చే మార్పులముందు ఏ నియమాలూ, నిబంధనలూ నిలబడలేవేమో!