20, జులై 2017, గురువారం

అధికారం చుట్టూ ఈగలు



ఓ నలభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా చేసిన పీ. నరసారెడ్డి   చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హై కోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధ వేస్తుందని చెప్పారు. కానీ  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి  వస్తే,  కొంత కాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్  సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. 
ఆయన్ని కలిసివచ్చిన తరువాత ఇందిరకు సంబంధించి ఇలాంటిదే మరో ఉదంతం నాకు జ్ఞాపకం వచ్చింది.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం  జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వరలింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక, దాన్ని పక్కన పడేసి, చేత్తో తినడం అలవాటు లేకపోయినా ఇబ్బంది పడుతూనే   ఇందిరాగాంధి తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి  మొదలయినవాళ్ళు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి, అక్కడ  వసతి సరిపోకనో యేమో, మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడకు  బ్రేక్ ఫాస్ట్  ఏర్పాటుచేసే  బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.
మొత్తం మీద  ఇందిరాగాంధీ ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న పెవిలియన్ మైదానం  చాలా ముందుగానే జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

17, జులై 2017, సోమవారం

వెంకయ్యనాయుడు - కొన్ని జ్ఞాపకాలు



రాజకీయాలు తరువాత.
ముందు ఒక తెలుగువాడిగా వెంకయ్యనాయుడు గారికి అభినందనలు.
ఒక విలేకరిగా ఆయన గురించిన కొన్ని పాత స్మృతులు తెలపడం ఒక్కటే ఈ పోస్టు లక్ష్యం.
1972 - 73
ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తె వయసులో పెద్దవాడనుకున్నాము కానీ వయసులో చాలా చిన్న.
1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు బీజేపీ ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జై పాల్ రెడ్డి గారు. ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా,  శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ  ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ప్రతి పత్రికా శాసన సభలో ఛలోక్తులు అనే శీర్షికతో ఒక కాలం ప్రచురించేవి. వాటిల్లో సింహభాగం వారివే ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే.  వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో  ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో ఆయన కొనసాగిస్తూ వస్తూనే  వున్నారు.      
ఆయనతో నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఏదైనా వార్తను పత్రికలకు ఎలా చెప్పాలో, రేడియోకు ఎలా చెప్పాలో ఆయనకు కరతలామలకం. మాకు మధ్యాన్నం మళ్ళీ సాయంత్రం వార్తలు ఉండేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం చెప్పండి’ అనేవారు, ‘కాదు’ అనడానికి వీల్లేకుండా.
ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి విడత  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అద్వానీని చాలా దగ్గరగా ఆ సందర్భంలోనే చూడడం తటస్తించింది. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే ‘వచ్చిన పనేమిటని’ ఆయనే  ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి మాట్లాడారు కూడా.
ఏడాది క్రితం ఒకసారి హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల చేత చప్పట్లు కొట్టించుకునే ప్రసంగం చేసి  మధ్యలో విమానం టైం అయిందని వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.
మొత్తం దేశానికి ప్రధమ పౌరుడి తర్వాత స్థానం ఆయనదే అనే అవకాశాలు  మెండుగా వున్న వెంకయ్య నాయుడు గారికి ముందస్తు అభినందనలు.             
       

బదరీ కేదార్ యాత్ర (ఎనిమిదో భాగం) 1996 – కొమరగిరి అన్నపూర్ణ


స్వర్ణ, సురేష్, రంగడు మాత్రం చీకటితోనే లేచారు. మమ్మల్ని లేపి, మొహాలు కడిగించి వేడి వేడి కాఫీలు తాగించారు. తలకు మంకీ టోపీ, కాళ్ళకు  ఉలెన్ సాక్సూ తొడిగారు. మేం ఎవరం స్నానాలు చేయలేదు. మేమే కాదు బస్సులో వచ్చిన వాల్లెవ్వరూ చేయలేదు. మొహాలు, చేతులు కడుక్కోడానికే కాదు, తాగడానికి కూడా వేన్నీళ్ళే. ఒక్క రంగారావుగారు మాత్రం అంత చలిలోనూ పట్టుదలగా స్నానం చేసే బయలుదేరారు.
అందరం గుడికి చేరాం. పై నుంచి మంచు గడ్డలు ఊడి పడుతున్నాయి. క్యూ చూస్తె పెద్దదిగా వుంది. చలి సూదుల్తో పొడుస్తోంది. ఆ క్యూలో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు కలిసారు. అందులో ఒకామె రాజ్యం ఒదినె కూతురు. ఖమ్మం పర్సా శ్రీనివాసరావు మామయ్య మనుమరాలు. ఆమె బిడ్డనే బెజవాడలో వుండే  తెన్నేటి భాస్కరరావుగారి కొడుక్కి ఇచ్చారు. అంటే మా మేనత్త కూతురికి వియ్యపురాలు. ఆమె గుండె జబ్బు మనిషి. కేదార్ చూడాలని మనసు పడితే వెంటపెట్టుకుని తీసుకు వచ్చారు. హార్టు పేషెంటువి, కేదార్ ఎలా వెడతావ్ అని గద్దించ కుండా ఓపిగ్గా యాత్రలకు తిప్పుతున్నారు.
గుడి నిండా జనం. ఒకటే నెడుతున్నారు.అప్పుడు ఎవరో ఒకాయన మమ్మల్ని పిలిచి తలకాయ పట్టి దేవుడికి తాకించాడు.భగవంతుడే ఆయన రూపంలో వచ్చాడా అనిపించింది. మొత్తం మీద కేదార దేవుడ్ని చూడాలనే మా చిరకాల వాంఛ నెరవేరింది.
పాండవులు యుద్ధంలో అందర్నీ సంహరించారు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం యజ్ఞం చేయాల్సి వచ్చిందట. నా వెంట వస్తే స్వర్గానికి దారి చూపిస్తానని శివుడు చెప్పాడట. శివుడు వాళ్ళని గుప్త కాశీ వరకు తీసుకువచ్చి మాయమై పోయాడట. అప్పుడు అర్జునుడు శివుడ్ని వెతుక్కుంటూ గౌరీ కుండ్ వరకు వెళ్ళాడట. శివుడు ఎద్దు రూపంలో కానవచ్చాడు.  అర్జునుడు రెండు పర్వతాల మీద రెండు కాళ్ళు వుంచి నిలబడ్డాడు. ఆ కాళ్ళ మధ్యనుండే అంతా వెడుతున్నారు. కానీ శివుడు మాత్రం పోలేదు. దాంతో ఆ ఎద్దే శివుడని గ్రహించి అర్జునుడు ఆ ఎద్దు తోకని కేదార్ లో తొక్కిపడతాడు.తోక కేదార్ లో వుంటే మొహం మాత్రం నేపాల్ లోని పశుపతినాధ ఆలయంలో వెలిసిందట. అది స్థల పురాణం అని చెప్పారు. అందుకే కేదార్ లో దేవుడు, లింగాకారంలో కాకుండా  ఎద్దు తోక కుచ్చు ఆకారంలో ఉంటాడు.      
రాత్రి రాగానే గదిలో కరెంటు లేదు. కుంపట్లు పెట్టారు. అవి వుంటే గదిలో మనకు ఆక్సిజన్ సరిపోదు. ఆ గది అద్దెఒక రాత్రికి వంద రూపాయలు. కప్పుకునే పరుపులకు ఒక్కొక్క దానికి పదిహేను రూపాయలు చార్జి.
రూముకు వచ్చి కాఫీలు తాగాము. కప్పు కాఫీ పది, టీ ఏడు రూపాయలు. మంకీటోపీలు, ఉలెన్ సాక్స్ ధరించి అందరం మళ్ళీ డోలీలు ఎక్కాం. ఈసారి అన్ని డోలీలు కలుపుకుంటూ వచ్చాము. వచ్చేటప్పుడు వాన లేదు. ఎండ కాస్తూ వుంది. చలి బాధ సాంతం తగ్గలేదు కానీ చాలా నయం. బాగానే మాట్లాడుకోగలుగుతున్నాం. గుర్రాల మీద వస్తున్న సురేష్ వాళ్ళు మధ్య మధ్య కలుస్తున్నారు. కొండలు పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపించాయి. ఆ కొండలపై ఎవరో మొక్కల్ని నాటి, నీళ్ళు పోసి పెంచినట్టు గుబురుగా వున్నాయి. పోతన భాగవత పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘అడవిలోన నున్న అబలుండు వర్ధిల్లు, రక్షితుడు మందిరమున జచ్చు’

దారి వెంట గంగామాయి హోరున శబ్దం చేసుకుంటూ మాతోనే వస్తున్నట్టు వుంది. మా ప్రయాణమంతా ఋషీకేష్ నుండి గంగ ఒడ్డునే జరుగుతోంది. పోతనగారు ఈ దృశ్యాలను ఎలా వర్ణించారో. గంగావతరణం రాసారంటే మాటలా! ఎంతో ఆశ్చర్యం వేసింది. నాలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా, ‘గొల్లపిల్లల  వేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు యేతుల కనుగొంటి వయ్య, నీకెవరు చెప్పిరయ్య’ అంటూ  పద్య రూపంలో ఆశ్చర్యపోయారు. లోయలో పారుతున్న గంగని చూస్తుంటే నగర చక్రవర్తుల కధ, భగీరధ ప్రయత్నం గుర్తుకు వచ్చాయి. (ఇంకా వుంది)           

15, జులై 2017, శనివారం

ద్రాస్త్విచ్ కగ్జిలా


నాకే విచిత్రం అనిపించింది నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకుండే పరిస్తితి నాది. అలాంటిది .....
పాతికేళ్ళు దాటిందేమో చూసి, నిన్న ప్రెస్ క్లబ్ లో అమర్ తో కనబడ్డాడు. ‘తెలుసు కదా మన...’ అని అమర్ అనేలోగా  నేనే ముందుగా “ద్రాస్త్విచ్ కగ్జిలా నరేందర్” అనేశాను. అతడూ వెంటనే “ఎలా వున్నారు శ్రీనివాసరావు గారూ” అంటూ పలకరించాడు.
నరేందర్ అంటే గూడవల్లి నరేంద్రనాథ్. ఢిల్లీ ఎం.డీ.టీ.వీ. ఛానల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్. రిటైర్ అయిన తరువాత కూడా ఆ టీవీ లోనే పనిచేస్తున్నాడు. గూడవల్లి నాగేశ్వర రావుగారి అబ్బాయి. సోవియట్ యూనియన్ అయిదోతనం కోల్పోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సంస్థ) కు గూడవల్లి నాగేశ్వర రావు గారు కర్తాకర్మా క్రియా అన్నీను. నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఈ సంస్థ తరపున అనేకమంది మాస్కో వచ్చిపోతుండేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో అక్కడ భోజన వ్యవహారాలు సరిగా ఇమడక ఏదో ఇంత సాంబారు, పెరుగన్నం తినడానికి మా ఇంటికి వస్తుండేవారు. నరేందర్ మాస్కోలోనే చదువుకుని ఇండియా తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండేవాడు. అలనాటి పరిచయం మాది. మళ్ళీ ఇనాల్టికి ఇలా తటస్థ పడ్డాడు. నరేందర్ మంచి మిత్రుడు. కాబట్టే తిరుపతి వెళ్లి వచ్చి చప్పున గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్న నన్ను వెంటనే పోల్చుకోగలిగాడు.



సరే ఈ కగ్జిలా ఏమిటంటారా!    
మాస్కోలో వుండగా మాస్కో రేడియో వాళ్ళు నాకు రష్యన్ నేర్పడానికి ప్రత్యేకంగా ఒక టీచర్ ని పెట్టారు. ఆవిడ వారానికోసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లు తింటూ, మరో పక్క నాకు  రష్యన్ పాఠాలు చెప్పేది. ఏతావాతా జరిగిందేమిటంటే, ఆవిడ పుణ్యమా అని  నాకు నాలుగు తడిపొడి రష్యన్ మాటలు పట్టుపడ్డాయి, ఆవిడేమో ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది.
ఆ పొడి మాటల్లో ఒకటి  ‘కగ్జిలా’. అంటే హౌ ఆర్ యు? (ఎలా వున్నారు?)        


14, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర – ఏడో భాగం (1996) – కొమరగిరి అన్నపూర్ణ


ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్నారు. వర్షం ఆగడం లేదు. చలి దుర్భరంగా వుంది. మేమంతా దుప్పట్లు కప్పుకుని కూర్చున్నాం. భారతి బాధ చూడలేకపోయాం. ఒక  కిలోమీటరు ఉందనగా మళ్ళీ ఆపారు. అక్కడ కొండ నిటారుగా వుంది. డోలీవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడం కష్టంగా వుంది. తొందరగా గదికి చేర్చమని భాష రాకున్నా సైగలతో చెప్పాం. వాళ్లకు అర్ధం అయినట్టు వుంది. పైగా ఇలాంటి ప్రయాణాల్లో అనుభవం కూడా వుంది. మా కష్టం చూసి వాళ్ళు, తమ కష్టాన్ని లెక్కచేయకుండా త్వరత్వరగా కేదార్  లో ఒక గూటికి చేర్చారు. ఐతే ఈ హడావిడిలో గైడు చెప్పిన గదికి కాకుండా మరో దాంట్లో దింపాడు. అందులో మూడు మంచాలు వున్నాయి. భారతిని ఒక మంచంపై పడుకోబెట్టి పరుపు కప్పారు. మేం దారిలో బాగానే వున్నాం కానీ డోలీ దిగేసరికి చలి వెన్నులోనుంచి పుట్టుకొచ్చింది. మా సామాను ఏమైందో తెలియదు. మా వాళ్ళు ఏమైనారో తెలియదు.  పరుపు పైన కప్పుకుని పడుకున్నాము. భారతిని ఏడవకే అని చెబుదామంటే మాట పెగలడం లేదు. నోట్లో మాట బయటకి రావడం లేదు. భగవంతుడా నీదే భారం అనుకున్నాము. గజేంద్ర మోక్షంలో పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావులు తప్పెను  మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నించదగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా”
ఇప్పుడు మాదీ అదే పరిస్తితి. ఆయన తప్ప వేరే దిక్కులేదు. మాయదారి మల్లిగాడు సినిమాలో చెప్పినట్టు ‘ఆయన మీదే భారం వేసి వచ్చాం. కాబట్టి చచ్చినట్టు వస్తాడురా దేవుడు’ అనే మొండి ధైర్యం వచ్చి అలాగే కూర్చున్నాము. నిజంగా తలచుకున్నట్టే వచ్చాడు భగవంతుడు స్వర్ణ, సురేష్ ల రూపంలో. మిగిలినవాళ్ళు కూడా వర్షంలో తడిసి గుర్రాల మీద మేమున్న చోటికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే ప్రాణాలు లేచివచ్చాయి. డోలీ వాళ్ళు మమ్మల్ని దింపాల్సిన చోట కాక వేరే చోట దింపారు. మేం ఏమయ్యామో అని వాళ్ళు ఓపక్క చలికి ఒణికిపోతూనే తెగ కంగారు పడుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోగా పొద్దుగుంకింది. చలి తీవ్రత మరింత పెరిగింది. చేతులు ఎలా కొంకర్లు పోయాయంటే పొయ్యిలో చేయి పెట్టినా స్పర్స తెలిసేట్టు లేదు. పరుపులు కప్పుకుని పడుకున్నాం కానీ పాడు చలి వాటిల్లోకి కూడా దూరి ఒణికిస్తోంది.

మా పరిస్తితి చూసి వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళేమో పిల్లవాళ్ళు. పెద్దవాళ్ళ పరిస్తితి చూస్తే ఇలావుంది. అలాగే పడుకున్నాం. ఆశ్చర్యం అలాగే నిద్రపోయాం. శారీరక, భౌతిక ఇబ్బందులను మత్తులా మరిపించే శక్తి ఒక్క నిద్రాదేవతకు మాత్రమే ఉందేమో! (ఇంకా వుంది)         

12, జులై 2017, బుధవారం

పుట్టింట్లో రెండు గంటలు

రోజూ ఎన్ని టీవీ చర్చలకు వెళ్ళినా ఆలిండియా రేడియో రికార్డింగ్ కు వెళ్ళడంలో కిక్కే వేరప్పా. ఏవిటో ఫేస్ బుక్ భాష అలవడుతున్నట్టుంది కాబోలు. ఎంతయినా   నా వృత్తి జీవితంలో రేడియో నా పుట్టిల్లు. అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళ అనుబంధం. 1975 నవంబరు 14 న అందులో  మొదటిసారి కుడికాలు మోపాను. పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఈరోజు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది.   రిటైర్ అయి అడుగు బయట పెట్టి పుష్కర కాలం దాటింది కానీ బయట వాచ్ మన్ల దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక మా ప్రాంతీయ వార్తా విభాగం సిబ్బంది సంగతి చెప్పక్కరలేదు. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.  దీనికంతటికీ కారణం రేడియోలో తెలుగు ప్రసంగాలు చూసే అధికారి సీతారాంబాబు  మొన్నీమధ్య ఫోను చేసి ‘సాంఘిక మాధ్యమాల మంచీ చెడుల’పై ఒక ప్రసంగవ్యాసం రాయాలని కోరారు. ఈరోజు సాయంత్రం రికార్డింగ్ అన్నారు. మళ్ళీ ఒక్కసారి పాత పరిచయస్తులని పలకరించే అవకాశం దొరికిందని ఆనందంగా వెళ్లాను. ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.  అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్  ని  ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో,  అందరూ వినే రోజుల్లో ఈ భోగాలు లేవు.

అనుకున్నట్టే చాలామంది కలిశారు. ఇన్నేళ్ళ తరువాత గుర్తు పట్టి పలకరించిన వారి సౌహార్ధతకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను?    

11, జులై 2017, మంగళవారం

అన్నయ్య గొప్పతనం మరోమారు తెలిసింది – భండారు శ్రీనివాసరావు


మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప  మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకొసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని ఒక బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను. ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను  జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతొ రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని శ్రీ కే.ఆర్. పరమహంస గారు,  మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి   నెట్లో భద్రపరిచారు. 
ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్  కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది. 

ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది వారి సహకారంతో గ్రందావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
నిన్న (మంగళవారం) సాయంత్రం హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రందావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు. సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ చేసిన ఇంగ్లీష్ లో చేసిన ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
For  full  20 minutes, Sridhar  Guruji, spoke  about  Annayya  (BHANDARU PARVATALA RAO) in a largely  attended  meeting. He started his speech  like this.....
‘Normally we will  start  any  pravachanam  by  invoking  Lord  Ganesha. Today I will start with  mentioning  about  a great, good, knowledgeable  and highly  simple and dear friend Parvatalarao’  Like  this  he spoke  for 20 minutes, paying  glorious  tributes to Annayya. We were all deeply  touched.” - B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ అన్నట్టు “ మా అన్నయ్య పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను 
బడయు పాత్రత పాత్రత వలన ధనము 
ధనము వలనను ధర్మంబు దాని వలన 
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని  ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.