9, జులై 2017, ఆదివారం

అవినీతి వేలం పాటలు తగ్గించాలి


నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. ముందు కాసేపు ఆ విషయాలనే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ మా పెద్దన్నయ్య పర్వతాల రావు గురించి రాసింది చదివినట్టున్నారు. ఆయనతోనే మా సంభాషణ మొదలయింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా వుంటే పర్వతాల రావుగారు తెలుగు ప్రజలు గర్వించే రచయిత అయ్యేవారనేది వెంకట్రావు గారి అభిప్రాయం.
తరువాత సంభాషణ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ వైపు మళ్ళింది. ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు నేను ‘వివరణ’గా చెప్పాను. ఆకాశవాణి విలేకరిగా ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలు ఉండేవని, అయితే వారిలో అంజయ్య, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురితో వ్యక్తిగత పరిచయం ఎక్కువని, కారణం వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు నాకు బాగా నచ్చడం వల్ల కావచ్చునని చెప్పాను. వైఎస్ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ మొదలయిన పధకాలను యథాతధంగా కొనసాగించి ఉన్నట్టయితే ఈ సరికి తెలుగు రాష్ట్రాలలో అట్టడుగు ప్రజలు బాగుపడి వుండేవారన్నాను. ఇంజినీర్ అనిపించుకోవడం వల్ల బడుగువర్గాలకు చెందిన వారికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సమాజంలో వారి స్థాయి పెరిగి, వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోతుందని, ఈ పధకం వల్ల ఇతరత్రా లభించే లబ్దికంటే ఇది చాలా ముఖ్యమని అన్నాను. దీనికి ఉదాహరణలు ఇచ్చాను. ఇవన్నీ గతంలో నేను నా బ్లాగులో రాసుకున్నవే. అమల్లో కొన్ని లోపాలు వున్నాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతితో పోల్చినా, ఈ పధకాల వల్ల బడుగు,బలహీన వర్గాలకు జరిగే ప్రయోజనాలతో పోల్చి చూసుకుంటే వీటిల్లోని లొసుగులు చాలా స్వల్పమని చెప్పాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పధకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు బాగా నష్ట పోయారని అన్నాను.
తరువాత సహజంగానే టాపిక్ వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్లీనరీ మీదకు మళ్ళింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రస్తావన వచ్చింది. గతంలో జగన్ లక్ష కోట్ల అవినీతి గురించి విస్తృత ప్రచారం జరిగిందని, లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ పదేపదే చెబుతూ పోవడంతో అదే నిజమని జనం నమ్మే పరిస్తితి వచ్చిందని, అంతిమంగా వేసిన చార్జి షీట్లలో పేర్కొన్న అవినీతి ఆ స్థాయిలో కనబడలేదని, ఇటువంటి ప్రచారాల వల్ల ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చేమో కానీ ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావం పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నాను. ఇప్పుడు వై.ఎస్.ఆర్.సీ.పీ. అదే పల్లవి ఎత్తుకుని చంద్రబాబును అవినీతి చక్రవర్తి గా అభివర్ణిస్తూ, గత మూడేళ్ళ కాలంలో ఆయన అవినీతి మూడుకోట్ల డెబ్బయి లక్షల స్థాయిలో వుందని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం వేసారని చెబుతూ, ఇలా అవినీతి లక్షల కొట్లలో జరుగుతున్నట్టు పై పాటలు పాడుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పొతే ప్రజలకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే ప్రమాదం ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పాను.
ఆంద్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఎదుటివారిని విమర్శలతో ఎండగట్టె క్రమంలో ముందుకు వెడుతున్నాయని, ప్లీనరీలో జగన్ పక్షం వాళ్ళు ‘చంద్ర నామస్మరణ’ చేస్తే, ప్లీనరీ వెలుపల టీడీపీ మంత్రులు మూకుమ్మడి ‘జగన్నామ స్మరణ’ చేసారని చెప్పాను.
(విచిత్రం ఏమిటంటే ఈ రోజు (ఆదివారం) ఉదయం TV-5 News Scan లో కూడా విజయ్ నారాయణ్ ఈ అంశాల మీదనే నా అభిప్రాయం అడిగారు. దాదాపు ఇదే మోస్తరు జవాబులు చెప్పాను)

7, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర (1996) నాలుగో భాగం – కొమరగిరి అన్నపూర్ణ

ఋషీకేశ్ లో బస్సు దిగగానే తొందర తొందరగా కాలకృత్యాలు పూర్తి చేసుకుని గంగా స్నానానికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా నున్నటి తళతళ మెరిసే గుండ్రాళ్ళు. మంచి మంచివి  ఎంపికచేసుకుని తీసుకుపోతుంటే వాటికంటే మంచివి కనిపించేవి.  అలా వాటిని ఏరుకుంటూ కుప్ప  పోస్తుంటే గమనించిన ఓ పెద్దాయన, ‘ఆ  గుండ్రాళ్ళు  ఏం చేసుకుంటారు, మంచి  సాల గ్రామాలు దొరుకుతాయి, వెతుక్కోండి’ అని సలహా చెప్పి చక్కా పోయాడు.
గంగలో నీళ్ళు ఫ్రిజ్ నుంచి తీసినట్టు చాలా చల్లగా వున్నాయి. పెద్ద వాళ్ళం అలా ఇగపు నీళ్ళతోనే వణుక్కుంటూ స్నానాలు ముగించాము, స్వర్ణ, భారతి పెద్ద కోడలు మాత్రం ఎంతో ఓపిగ్గా మా తడి బట్టలు ఆరవేయడంలో, సంచులు మోయడంలో సాయపడుతూ వుంది. సురేష్ పెళ్ళయిన తరువాత శారదక్కయ్యకు స్వర్ణతో అంతగా పరిచయం వున్నట్టు లేదు. స్వర్ణను చూసి చాలా ముచ్చట పడింది. అలాంటి కోడలు దొరికిన భారతి అదృష్టవంతురాలని, పెద్ద వాళ్ళను కనిపెట్టుకుని చూసే ఓపిక ఉన్న కోడలు దొరికిందని కితాబు ఇచ్చింది. బట్టలు ఆరిన తరువాత గుండ్రాళ్ళు మోసుకు వద్దామంటే మాకు అలవి కాలేదు. చివరకు ఏరినవన్నీ అక్కడే వదిలేసి శాంపిల్ కు కొన్ని తెచ్చుకున్నాము. బస్సులో శివానంద ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడ కూడా అన్నీ పాలరాతి విగ్రహాలే. రాధాకృష్ణులు, శివానంద, హనుమాన్ విగ్రహాలు ఉన్న ఆ హాలు ఎంతో ప్రశాంతంగా వుంది. ఈ వయస్సులో, ఆరోగ్యం సరిగా లేని స్తితిలో ఇంత దూరాభారంలో ఇలా యాత్రలు చేస్తూ ఇవన్నీ చూడగలుగుతున్నాను అంటే అది కేవలం భగవంతుని కృప వల్లే సాధ్యం.
అక్కడినుండి లక్ష్మణ్ ఝూలా వెళ్ళాము. మధ్యలో స్తంభాలు అనేవి లేకుండా ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తీగెలు బిగించి గంగపై నిర్మించిన వంతెన అద్భుతంగా వుంది. దీనిపై వాహనాలను అనుమతించడం లేదు, కేవలం కాలినడకన వెళ్ళే వాళ్ళు మాత్రమే. మనం వంతెన మీద నడుస్తుంటే అది ఉయ్యాల మాదిరిగా ఊగుతుంది. అందుకే లక్ష్మణ్ ఝూలా అన్నారు. ఝూలా అంటే ఉయ్యాల. కొందరు ‘రాం ఝూలా’ అని కూడా అంటుంటారు. ఆ వంతెన మీద నుంచి కిందికి చూస్తే స్వచ్చంగా పారుతున్న గంగా ప్రవాహం మనోహరంగా కానవస్తుంది. నాకయితే కళ్ళు తిరిగినట్టయింది. మొదట భయం వేసింది కాని తరువాత బాగానే  అనిపించింది.
రంగారావు గారికి రుద్రాక్షలు కొనుక్కోవాలని అంటే బస్సు వాళ్ళు ఓ దుకాణానికి తీసుకువెళ్ళారు.   ఆయన మూడువేలు పెట్టి రుద్రాక్షలు, నవరత్న గొలుసులు, ఉంగరాలు కొన్నారు. అక్కడ చెప్పులు తెగితే వేరే జత కొనుక్కున్నాము. మందులు, గ్లూకోజు వంటివి పెట్టుకోవడానికి వీలుగా వుండే ఓకే చిన్న బ్యాగు నేను కొనుక్కున్నాను, గుర్రం మీద వెళ్ళాల్సి వస్తే బేగ్ అయితే తేలిగ్గా ఉంటుందని.
అక్కడ నుండి టాక్సీ మాట్లాడుకుని మళ్ళీ లక్ష్మణ్ ఝూలా వద్దకు చేరుకున్నాము. అక్కడ ఒక చిన్న హోటల్లో ఇడ్లీ తిని, కాఫీ తాగి త్రిమూర్తుల ఆలయానికి వెళ్ళాము. ఆ గుడి అనేక అంతస్తులతో కట్టారు. త్రిమూర్తులు సకుటుంబంగా అక్కడ కొలువు తీరారు. వారితో పాటు సప్త ఋషులు, సనకసనందనాదులు, నారదుడు విగ్రహాలు అయినా సజీవంగా ఉన్నట్టే కానవచ్చారు. పదమూడు అంతస్తులు ఎక్కితే అక్కడ శంకరాచార్యుల వారున్నారని అన్నారు. కానీ నాకు చేతకాక పోలేదు. విమల, స్వర్ణ ఓపిక చేసుకుని అన్ని మెట్లు ఎక్కారు.
తరువాత దత్తాత్రేయులు, దుర్గాదేవి, సంకట మోచన్ హనుమాన్, విఘ్న వినాశక గణేష్   ఆలయాలు చూసాము. ‘అక్కడ వుండే పాండు రంగడు ఇక్కడ వున్నాడు’ అని అంటారు కానీ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి నదులు, దేవాలయాల పవిత్రత, ఆ సమయంలో మనలో కలిగే అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం అనుభవిస్తే కాని అర్ధం కాదు.

(ఇంకా వుంది)               

6, జులై 2017, గురువారం

బదరీ, కేదార్ యాత్ర (1996) మూడో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


రైల్లోనే రెండో రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయమే లేచి మొహాలు కడుక్కున్నాం. మా కంపార్టు మెంటులో మిగిలిన వాళ్ళందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుంటున్నారు. అది చూసి ప్రేమ ‘ఢిల్లీ వచ్చిందేమో’ అన్నది. శారదక్కయ్య కిటికీ లో నుంచి చూసి ‘ఢిల్లీలో ఇలా ఖాళీ స్థలాలు వుంటాయా!కాదేమో’ అన్నది సందేహంగా. ఇంతలో శేషు, రంగడు వచ్చి ‘ఢిల్లీ వచ్చింది, పదండి’ అనేసరికి అందరం హడావిడిగా సామాన్లు తీసుకుని కిందికి దిగాము. అక్కడ హిందీ తప్ప మన మాట వినిపించదు. టాక్సీలు మాట్లాడుకుని ఇండియా హోటల్ కు వెళ్ళాము. స్నానాలు ముగించి మధ్యాన్నం ఆంధ్రా భోజనం పెట్టే హోటలుకు వెళ్లి భోజనం చేసాము. నాకూ, ప్రేమకూ మొదటి నుంచి హోటళ్ళలో వాళ్ళు పెట్టే కంచాల్లో అన్నం తినబుద్ది అయ్యేది కాదు. ఒకసారి తమ్ముడు శ్రీనివాసరావు చిన్నవాడయినా మాకు ఓ పెద్ద మాట చెప్పాడు. ‘వాళ్ళు తిన్న కంచం, వీళ్ళు తగిన గ్లాసు అనుకుంటే మనసు పరిపక్వం కాదు. అందరూ భగవత్ స్వరూపులే అనుకున్నప్పుడు ఆ తేడా రాదు. అలాంటివి మనసులోకి రానివ్వకూడదు’. అప్పటి నుంచి ఆ తేడా తీసేసుకుని ఏ కంచంలో అయినా తింటూనే వున్నాను. భోజనాలు అయిన తరువాత ఊరు తిరిగి చూద్దామంటే కళ్ళు తిరిగే ఎండ, వడగాలి. అందుకని హోటల్ కు తిరిగొచ్చి పండుకున్నాము. టాక్సీలో వచ్చేటప్పుడు రంగడు ‘ఇదిగో ఇదే ఇండియా గేట్’ అంటూ చూపించాడు. ఢిల్లీలో మేము చూసిన విశేషం అదొక్కటే. అదీ కారులోనుంచి.
మంచి నిద్ర పట్టింది. ఇంతలో బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీద్దామంటే రావడం లేదు. కింది గదిలో విమల, ప్రేమ పడుకున్నారు. పైన గదిలో నేనూ, శారదక్కయ్య, సావిత్రి పడుకున్నాము. తలుపు తెరుచుకోలేదు. మాకు భయం వేసింది. పై గది నుండి కింది గదిలోకి ఇనుప మెట్లు వున్నాయి. అది మా అదృష్టం. వెంటనే దిగి కిందికి వెళ్ళాము. విమల తలం తీసింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాము. తలుపు కొట్టిందెవరో తెలియలేదు.
బదరీ, కేదార్ యాత్రకు ముందుగా మాట్లాడుకున్న బస్సు ఎక్కాము. మేమే పదకొండుమందిమి. ముందుగా బస్సును ఢిల్లీలోని హనుమాన్ మందిర్ వద్దకు తీసుకుపోయారు. కేదార్ యాత్ర కష్టమైంది కదా! భగవదనుగ్రహం కోసం అక్కడ బస్సుకు పూజ చేయించారు. అందరం దిగి గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అన్నీ పాలరాతి విగ్రహాలు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమ విగ్రహాలే కాకుండా వినాయకుడు, కుమారస్వామి, శివుడు, పార్వతి ఇలా అందరూ వున్నారు. సంతోషి మాత, లక్ష్మీనారాయణుడి విగ్రహాలు కూడా వున్నాయి. ఈ యాత్రల్లో మొదలు చూసిన గుడి ఇదే. ఆంజనేయ స్వామి విగ్రహం ఒక వైపు తిరిగి వుంటుంది. అంచేత అయన మోహంలో ఒక కన్నేమనకు కనబడుతుంది. ఇలాంటిదే మా వూరు కంభంపాడు హనుమంతుడి గుడిలో వుంది. ఒక బల్లపరుపు రాతి మీద విగ్రహం చెక్కడం చేత మా వూరి గుడిలో హనుమంతుడికి కూడా ఒక కన్నేకనిపిస్తుంది. మళ్ళీ బస్సెక్కాము. మన వైపు బస్సులే చాలా నయం. అక్కడి బస్సుల్లో ఎందుకో కానీ సీట్లు ఇరుకిరుకుగా వుంటాయి. అయినా సర్దుకుని అలాగే నిద్ర పోయాము. తెల్లారేసరికి ఋషీకేష్ చేరాం. (ఇంకా వుంది)

5, జులై 2017, బుధవారం

మాస్కోలో కారప్పూస

  
మాస్కో రేడియోలో పని ముగించుకుని ఆఫీసునుంచి బయలుదేరాలని అనుకునే సమయంలో నటాషా ఎదురుగా వచ్చింది. రష్యన్ భాషలో ‘ట’ లు లేవు, ‘త’లు తప్ప అనేవారు కలం కూలీ జీ. కృష్ణ గారు.  కానీ, నేను మాత్రం  కాస్త వత్తిపలికినట్టుగా వుంటుందని ‘నటాషా’ అని  పిలిచేవాడిని. నా రష్యన్ భాషా ప్రావీణ్యం పేరు పెట్టి పిలవడం వరకే. ఆ తరువాత ఏదో సినిమాలో జంధ్యాల చెప్పినట్టు ఆదివారం మధ్యాన్నం టీవీ వార్తలే. అంటే కేవలం సైగలే.
నటాషా రష్యన్ భాషలో  గడగడా ఏదో చెప్పింది. ఆ చెప్పిన దాన్ని తెలుగు తెలిసిన నా రష్యన్ సహచరుడు గీర్మన్  అనువదించి చెప్పాడు. ‘నతాషా ఇప్పుడు మీతో మీ ఇంటికి రావాలని అనుకుంటోంది. మీ ఆవిడ హండి క్రాఫ్ట్స్ ఎలా చేస్తారో చూస్తుందట’. మా ఆవిడ ఈ విద్య ఎప్పుడు నేర్చుకుందని నేను తటపటాయిస్తుంటే, మళ్ళీ ఆవిడే గుట్టు విప్పింది. కిందటి వారం ఇంట్లో చేసిన కారప్పూస ఆఫీసుకు తెచ్చి సంతర్పణ చేసాను. కారప్పూస  అలా చుట్టలు చుట్టలుగా  ఒకదానిలో ఒకటి అలా లాఘవంగా ఎలా దూర్చామో చూడాలని నటాషా కోరిక. ఓస్! ఇంత చిన్న కోరిక తీర్చడానికి ఇబ్బంది ఏముంది. ఇద్దరం కోట్లు తగిలించుకుని మెట్రోలో పడి ఇంటికి చేరాము. ఇక అప్పుడు మొదలయింది మా వంటింట్లో కారప్పూస చేసే విధాన ప్రక్రియ ప్రదర్శన.  మా ఆవిడ అప్పటికప్పుడు పిండి తడిపి ముద్దలు చేసి కారప్పూస గిద్దెల్లో కూరి బాగా కాగిన నూనె మూకుడులో వేస్తుంటే  నటాషా కళ్ళార్పకుండా విభ్రమంగా ఆ యావత్తు కార్యక్రమాన్ని దీక్షగా వీక్షించింది. చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపులు, కారప్పూస తిన్నప్పుడు కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళలో కలిసిపోయాయి. ‘యెంత బాగున్నాయో’ అంది వెడుతూ వెడుతూ  రష్యను భాషలో, అదేపనిగా  కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదుకుంటు.
స్పసీబా (థాంక్స్)  నటాషా!

(పాతికేళ్ళ క్రితం మాస్కో అనుభవాల నుంచి)       

1996 బదరీ కేదార్ యాత్ర (రెండో భాగం) – కొమరగిరి అన్నపూర్ణ


మా యాత్ర ఏమో కానీ అందుకోసం మా చెల్లెలు ప్రేమ బిడ్డలు ఫణి, మణి పడ్డ హడావిడి అంతాఇంతా కాదు. చక్కిలాలు, కారప్పూస, కజ్జెకాయలు, వేయించిన అటుకులు ఇంకా రైల్లో తినడానికి పులిహోర, పెరుగన్నం, ఒంటి పూట వాళ్ళకోసం పూరీలు, కూర అన్నీ చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. మా పెద్ద తమ్ముడి మూడో అమ్మాయి వాణి వచ్చి బదరీ, కేదార్ వెడుతున్నారు కదా, మా తరపున కూడా దణ్ణం పెట్టండి అంది. ‘మీ అందరి పేరుపేరునా సహస్రనామాలు మొదలు పెడితే ఇక మా దణ్ణం ఎప్పుడే’ అని నేనంటే అందరూ నవ్వుకున్నారు.
సాయంకాలం అరింటికే స్నానాలు ముగించుకుని నాలుగు ఆటోల్లో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు రైలు నాంపల్లి ఒదిలింది. రైలు సికింద్రాబాదులో ఆగినప్పుడు శారదక్కయ్య కొడుకు వచ్చి కలిసాడు. ‘మా అమ్మ మేము ఎంత వద్దంటున్నా వినకుండా మారాం చేసి యాత్రలకు బయలుదేరి వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. రైలు బయలుదేరగానే అనాదరం సర్దుకుని కూర్చున్నాం. రాత్రి పన్నెండు గంటలకు ఖాజీపేట చేరాము. రంగడు, శేషు టీసీతో మాట్లాడి వచ్చి, రండి, రండి. ఏసీలో సీట్లు దొరికాయన్నారు. సామాన్లు మోసుకుంటూ అందరం రైలు దిగి ఆరు డబ్బాల అవతలవున్న ఏసీ కోచ్ వద్దకు పోయి ఎక్కాము.
తెల్లవారకముందే  మెలకువ వచ్చి బయటకు చూస్తె,  సేవాగ్రాం అనే స్టేషన్ కనబడింది.  ఆ బోర్డు చూడగానే, మహాత్మా గాంధీ, అయన ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం గుర్తుకువచ్చాయి. స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పేరుతొ సబర్మతి నుండి దండి వరకు పాదయాత్ర  మొదలుపెట్టారు. బ్రిటిష్ పాలకులు ఆయన్ని అరెస్టు చేసి రెండేళ్లకు పైగా నిర్బందించారు. విడుదల అయిన తరువాత గాంధీజీ ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రం సిద్ధించేవరకు తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళేది లేదని. మధ్య భారతంలో నాగాపూరుకు దగ్గరలో ఉన్న సేవాగ్రాం అనే చిన్న పల్లె టూరును ఆయన తన మకాంగా ఎంచుకున్నారు. నిజానికి ఆ వూరు పేరు వేరే. సేగావ్ కాబోలు. కానీ సేవా దృక్పధం ప్రతిబింబించేలా ఆయన దాన్ని సేవాగ్రామ్ గా పేరు మార్చారని చెప్పుకునేవారు. ఇవన్నీ మా చెవుల్లో పడడానికి కారణం లేకపోలేదు. మా  బావల్లో ఇద్దరు, అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేరుగా పాల్గొంటే, మరో బావ కౌటూరు కృష్ణ మూర్తి పరోక్షంగా స్వతంత్ర సైనికులకు అజ్ఞాతంలో వుండి సేవలు అందించారు. పెద్ద బావ, రెండో బావ  పెళ్లి అయిన కొత్తల్లోనే  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. వాళ్ళు జైల్లో వున్నప్పుడు మా నాన్నగారు వారిని పుట్టింటికి, కంభంపాడు తీసుకువచ్చి మా బావలు బయటకు వచ్చేవరకు తన దగ్గరే ఉంచుకున్నారు. అప్పటికి మా పెళ్ళిళ్ళు కాలేదు. అక్కయ్యలు మూడో నెల కడుపుతో వున్నప్పుడు జైలుకు వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు మాసాల శిక్ష అనుభవించి విడుదల అయిన తర్వాతనే తమ కన్న బిడ్డలను కళ్ళారా చూసుకోగలిగారు.

4, జులై 2017, మంగళవారం

బదరీ, కేదార్ యాత్ర (1996) – శ్రీమతి కీ. శే. కొమరగిరి అన్నపూర్ణ


(ప్రారంభం)
మా చిన్న తమ్ముడు భండారు శ్రీనివాసరావు కాలు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి, చెల్లెలు భారతితో కలిసి హైదరాబాదు వెళ్ళాము. అప్పుడే భారతి పెద్ద కోడలు, సురేష్ భార్య స్వర్ణ మాకో సంగతి చెప్పింది, వైష్ణవీదేవి దేవాలయం చూడడానికి వెడుతున్నామని. వాళ్ళ అన్నయ్య కాశ్మీరులో పెద్ద మిలిటరీ అధికారి. అత్తామామల్ని తీసుకుని కాశ్మీర్ చూడడానికి రమ్మని ఆయన కబురు చేసాడు. వస్తే, వైష్ణవీ దేవి దర్శనం కూడా చేయిస్తానని అన్నాడు. వీళ్ళు సరే అన్నారట. దాంతో చెల్లెలు భారతి, ఆమె భర్త తుర్లపాటి పాండు రంగారావుకి కూడా స్వర్ణ ఢిల్లీ పోవడానికి రైలు రిజర్వేషన్లు చేయించింది. అనుకోకుండా వచ్చిన నన్ను కూడా ప్రయాణం కమ్మన్నారు. బొంబాయిలో వున్న మా రెండో కుమారుడికి విషయం తెలిసి ‘మా అమ్మను కూడా యాత్రకు తీసుకు వెళ్ళండి, అవసరమైన పైకం పంపుతాను’ అని కబురు చేసాడు. ఆ విధంగా నా ప్రయాణం ఖరారు అయింది. 
ఈలోగా, కంభంపాడులో మా మూడో తమ్ముడు భండారు వెంకటేశ్వర రావు కుమార్తె పద్మ పెళ్లి. అక్కాచెల్లెళ్లు అందరం మళ్ళీ ఆ పెళ్ళిలో కలిసాం. మా యాత్ర సంగతి తెలుసుకుని మా అక్కయ్యలు శారద, సరస్వతి, సావిత్రి, చెల్లెలు ప్రేమ, తాము కూడా వస్తామనడం, వాళ్ళ పిల్లలు కొలిపాక రాజేంద్రప్రసాద్, తుర్లపాటి సాంబశివరావు, కౌటూరు దుర్గాప్రసాద్, పింగిలి శ్రవణ్ కుమార్ సరే అనడం చకచకా జరిగిపోయాయి. మా చిన్నబ్బాయి రంగారావు, సావిత్రి చిన్న కొడుకు శేషగిరి రావు కలిసి మా అందరి రిజర్వేషన్ ఏర్పాట్లు చూసారు. ప్రయాణం సమయానికి మా మూడో అక్కయ్య సరస్వతి, మా బావగారి ఆరోగ్య పరిస్తితి దృష్ట్యా రాలేకపోయింది. నాలుగో అక్కయ్య సావిత్రి కూతురు పర్చా విమల యాత్రీకుల బృందంలో చేరింది.
నేను మా అబ్బాయి రంగారావును తీసుకుని ఒక రోజు ముందే పెనుగంచి ప్రోలు నుంచి బస్సులో బయలుదేరి హైదరాబాదు వెళ్ళాను. ఎందుకంటే నాకు రేడియోలో రికార్డింగు వుంది. నిజానికి ఆ రికార్డింగు జరగాల్సింది 23 వ తేదీన. కానీ అప్పటికి నేను యాత్రల్లో వుంటాను. అంచేత తమ్ముడు శ్రీనివాసరావు రేడియో స్టేషన్ లో సంబంధిత అధికారికి ఫోను చేసి నా రికార్డింగు 13 వ తేదీకి మార్పించడంతో ఆ పని కూడా పూర్తయింది. ఆ రోజు కృష్ణ శతకం చదివాను. హార్మనీ ఉండడంతో నా గొంతులోని నీరసం, బడలిక కప్పడిపోయాయి. తరువాత స్తిమితపడి నరసింహ శతకం చదివాను. బాగా వచ్చిందన్నారు, అక్కడి అధికారిణి పుట్టపర్తి నాగ పద్మిని. ఆవిడే నేను ఎప్పుడు రేడియోకి వెళ్ళినా దగ్గరుండి రికార్డింగు చేయిస్తుంటారు. చాల మంచి మనిషి. ( ప్రముఖ పండితులు పుట్టపర్తి నారాయణాచార్యులు గారి అమ్మాయి. అంచేత మా తమ్ముడు శ్రీనివాసరావు, వాడూ రేడియోలోనే పనిచేస్తాడు, ఆవిడ్ని ‘గురు పుత్రిక’ అని పిలుస్తుంటాడు)
తరువాత వైద్య సలహా కోసం డాక్టర్ మనోహర్ (మా పెద్దక్కయ్య రాధ రెండో కొడుకు, పెద్దవాడు అయితరాజు పాండురంగారావు కూడా డాక్టరే. కానీ డాక్టరు అనేవాడు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదన్నది వాడి నియమం. అయితే మా చుట్ట పక్కాల్లో ఎవరికి ఒంట్లో బాగా లేకపోయినా మా కుటుంబానికి 108 లాగా గుర్తు వచ్చేది వాడే. మనోహర్ చూసి ఒకసారి డాక్టర్ నాగభూషణం గారి వద్దకు వెళ్ళమన్నాడు. ఆయన మా డాక్టర్ రంగారావు కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు. మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించాడు. మా బదరీ కేదార్ యాత్ర విషయం చెప్పి, ‘వెళ్ళవచ్చా’ అని అడిగాను. ఆయన నవ్వి, ‘ మీ అక్కచెల్లెళ్ళు అంతా కలిసి వెడితే బదరీ కేదారేమిటి మానస సరోవర్ యాత్ర కూడా నిక్షేపంగా చేయగలరు. మీ మనోబలం అలాంటిది’ అన్నాడు. ‘మీ పెద్దక్కయ్య (డాక్టర్ రంగారావు తల్లి) కూడా సుస్తీ లెక్క చేయకుండా ప్రయాణాలు చేస్తూ వుండేది. మీరంతా కలిసి ప్రయాణాలు చేస్తూ ఉండడమే మీకు మందు. వేరే మందులు మీకు అవసరం లేదు. నిశ్చింతగా వెళ్లి రండి” అని ధైర్యం చెప్పాడు. కేదార్ యాత్రలో బాగా ఎత్తుకు వెళ్లి నప్పుడు వేరే బాధలు కలగకుండా కొన్ని మందులు ఇచ్చి దగ్గర వుంచుకోమన్నాడు. అదేమిటో, చికిత్స చేస్తాడు కానీ ఫీజు తీసుకోడు. బతిమిలాడితే, ‘అయితే నన్నూ, రంగారావును వేరుగా చూస్తున్నారా’ అంటాడు. అసలు పేషెంట్లకు ఆయన ఇచ్చే ధైర్యపు వచనాలతోనే సగం జబ్బు తగ్గిపోతుంది. 

(ఇంకా వుంది)

1, జులై 2017, శనివారం

డాక్టర్స్ డే – భండారు శ్రీనివాసరావు


వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగాప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. సైకిల్ డాక్టరుగారని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నానులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీఆరేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడుమార్పేమయినా కానవస్తున్నదంటారా!

కనీసం ఈనాడు ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!