18, ఏప్రిల్ 2017, మంగళవారం

బహుకాల దర్శనం


గుండు చేయించుకున్న వాళ్లకు  తమ నెత్తి మీద జుట్టు లేదు అన్న స్పృహ ఎన్నడూ కలగదు. కానీ ఎదుటివారు ఆ తేడాను ఇట్టే పట్టేస్తారు. తేడా అయితే పడతారు కానీ మనిషిని అయితే గుర్తుపట్టలేరు. ఈ కారణంగానే  గుండూ రావులు ఎదుటి వారిని కనబడగానే  ‘హలో సుబ్బారావు బాగున్నావా’ అనేస్తుంటారు. గుండూరావును ఆ గుండుతో  పోల్చుకోలేని సుబ్బారావులు జుట్టు పీక్కుంటూ వుంటారు.
ఈరోజు పార్కులో పెళ్లి నడకలు నడుస్తున్న సమయంలో దూరంగా ఎదుటి నుంచి పరుగు లాంటి నడకతో వస్తున్న ఓ పెద్దమనిషి కనిపించాడు. ఎక్కడో చూసినట్టు వుందే అనుకుంటూ ఉండగానే బుర్రలో లైటు వెలిగి ‘మన ఏబీసీడీ ప్రసాద్ కదూ’ అనిపించింది. వెంటనే ఎదురెళ్ళి ‘ఏం ప్రసాద్ గారు ఎలా వున్నారు, మీరు అమరావతిలో వున్నారనుకుంటున్నాను’ అనేశాను. కానీ ఆయన మోహంలో నన్ను గుర్తుపట్టిన ఛాయలు కనిపించలేదు. అప్పుడు గుండు గుర్తొచ్చి దాన్నొకసారి గోక్కుంటూ ‘ తిరుపతి’ అన్నాను. అయన తేరిపార చూసి, మరు క్షణంలో నన్ను గట్టిగా పట్టుకుని ‘ఎన్నాల్టికెన్నాళ్ళకు మిమ్మల్ని  చూసాను చాలా సంతోషం, నిజంగా ఈరోజు చాలా మంచి రోజు’ అన్నాడు.  నిజానికి అయన ఇంటి పేరు ఏబీసీడీ కాదు.  
అయితే కొందరి పేర్లను, వారి ఇంటి పేర్లను  వాళ్ళతో నిమిత్తం లేకుండానే ఇతరులు అందరూ కలిసి మార్చేస్తుంటారు.
వారిలో ఏబీసీడీ ప్రసాద్ ఒకరు. ఆయన అసలు పేరు ఎల్.వీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పార్టీ కార్యాలయంలో పత్రికా సంబంధాలు వగయిరా చూస్తుండేవారు. అంచేత హైదరాబాదులోని పత్రికల వాళ్ళందరికీ ఆయన చిరపరిచితుడు. ప్రెస్ వాళ్ళే పెట్టారు ఏబీసీడీ ప్రసాద్ అని ఆయన ఇంటిపేరుకో మారుపేరు. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా. రాష్ట్రం విడిపోయిన తరువాత చూసి చాలా కాలం అయింది.
పరవాలేదు, అప్పుడప్పుడన్నా ఇలా పార్కుల్లో మార్నింగు వాకులు చేస్తుంటే, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు తెలుగు సినిమాల్లో ఇంటర్వెల్ తరువాత కలుసుకున్నట్టు, పాత స్నేహితులు పార్కుల్లో   తారసపడే అవకాశాలు ఉన్నాయన్న మాట.   

అంచేత ఏమన్నమాట! అంతయు మన మేలునకే! 

జీవన యానంలో ఓ చిన్ని పాదయాత్ర


“పార్కుకు వెడదామా?” అంది మా ఆవిడ.
“నలభయ్ ఏళ్ళు ఆలస్యం అయిందేమో!” అనబోయి తెలివి తెచ్చుకుని, ఆ మాట బయటకు అనకుండా నాలుక కిందే నొక్కిపట్టి  యాభయ్ ఏళ్ళ కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాను.   
మొత్తం మీద మా జీవన యానంలో ‘తొలి నడక’, నా డెబ్బయ్యవ ఏట  బ్రహ్మానందరెడ్డి పార్కులో మొదలయింది.
‘మా నడక మా కాళ్ళ మీద మేము నడవడానికి తల ఒక్కింటికి పాతిక రూపాయల టిక్కెట్టా! ఔరా’ అనబోయి మళ్ళీ మా ఆవిడ తొలిసారి కోరిన కోరిక గుర్తొచ్చి గమ్మున ఉండిపోయాను.
అదే మొదటిసారి ఆ పార్కులో నా కుడి కాలు పెట్టడం. ఇంత కాలం బ్రహ్మానందరెడ్డి పార్కు గురించి ఏదో బ్రహ్మాండంగా ఊహించుకుంటూ వచ్చిన నేను అక్కడి వాతావరణం చూసి కాస్త నిరాశ పడ్డాను. నడక దారి చుట్టూ చెట్లు వున్నాయి కానీ వాటిలో చాలావరకు ఎండిన మోడులే. పచ్చగా ఉండాల్సిన పొదలు కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయివున్నాయి. ఎండాకాలం కదా మనుషులమే మోడులుగా తయారవుతున్నప్పుడు చెట్లు అనగా యెంత అని సరిపుచ్చుకున్నాను. నాకెందుకో అక్కడ పచ్చటి వృక్షాలకంటే నడిచే మనుషులే ఎక్కువ అన్న భావన కలిగింది. అది ఎల్లా వుంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ వచ్చేదా నా పిచ్చికాని.

ఈ ఉరుకుల పరుగుల హైదరాబాదు నగరంలో ఇంతమంది నడిచేవాళ్ళు వున్నారా అనిపించింది. వారంలో ఒక్కరోజయినా అందరూ వాహనాలు షెడ్లో పెట్టి నటరాజా సర్వీసు మొదలు పెడితే నగర ఆరోగ్యం చక్కబడుతుంది కదా అని కూడా  అనిపించింది. కానీ అది అత్యాశ. పార్కులో నడవడానికి కార్లు వేసుకు వచ్చేవాళ్ళు ఆఫీసులకు కూడా అలా నడిచి  వెడతారా! ఊహాతీతం.      

16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రోతలు కోరిన పాటలు


పూర్వం రేడియో సిలోన్ లో మీనాక్షి పొన్నుదొరై ఘంటసాల వోం, సుశీలా వోం అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటుంటే  మా బామ్మగారు ఆమె తెలుగును  ఆటపట్టించేది. కానీ ఆమె వేసే తెలుగు పాటల్ని కోరుతూ వందల సంఖ్యలో శ్రోతలు ఉత్తరాలు రాసేవాళ్ళు.
ఆ తరువాత చాలా ఏళ్ళకు నేను హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత శ్రోతలు రాసే కార్డుల్ని బట్వాడా చేయడానికి తపాలా బంట్రోతులు (అనవచ్చా) కిందామీదా పడడం కళ్ళారా చూసాను.
“అమలాపురం నుంచి అరుంధతి ఆమె కుటుంబసభ్యులు, ఆదిలాబాదు నుంచి యాదగిరి ఆయన కుటుంబ సభ్యులు, అనంతపురం నుంచి వీరారెడ్డి, రంగారెడ్డి, వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులు, శ్రీకాకుళం నుంచి అప్పల నాయుడు ఘంటసాల సుశీల పాడిన యుగళగీతం ప్రసారం చేయమని కోరుతున్నారు.”
ఇలా వచ్చిపడ్డ  వందలాది ఉత్తరాల గుట్టలోనుంచి శ్రోతలు కోరిన పాటల్ని ఎంపిక చేసుకోవడానికి అనౌన్సర్లు చాలా ప్రయాస పడేవాళ్ళు.  
అలాగే, స్కూలు అడ్మిషన్ సీజను వచ్చింది అంటే తెలిసిన వాళ్ళు తమ పిల్లలకోసం విలేకరుల వెంట పడడం ఒక విలేకరిగా నాకు తెలుసు. రిటైర్ అయి పుష్కర కాలం దాటిన తరువాత కూడా వస్తున్న ఎస్సెమ్మెస్ అభ్యర్ధనలు చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
అలాంటిది, తలచుకుంటే ఏదైనా చేయగలిగిన అధికారాలు కలిగిన ముఖ్యమంత్రికి రోజూ ఎన్ని విజ్ఞప్తులు వస్తుంటాయో అర్ధం చేసుకోవడానికి కష్టపడనక్కర లేదు.
మరి ఏపీ సీఎమ్ కనెక్ట్ యాప్ అంటున్నారు.
ఆయన్ని ఉడ్డుకుడుచుకోనిస్తారా! అనుమానమే!
ఉపశృతి: లోగడ ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం వున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన అందివ్వడానికి అహరహం శ్రమించేవారు. ఒక కార్డు ముక్క తనకు రాస్తే చాలు సమస్యలను చిటికెలో పరిష్కరిస్తానని ఓ ప్రకటన చేసారు. అంతే! పోస్టాఫీసుల్లో కార్డులు దొరకని పరిస్తితి ఏర్పడింది. ప్రజల సమస్యలు కనిపించకుండా పోయాయి, కొత్త సమస్యల మరుగున పడి.   

15, ఏప్రిల్ 2017, శనివారం

అన్నం పెట్టే రైతుకు యెంత చేసినా తక్కువే


(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను)
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, ఆ మాటకు వస్తే జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి యేవో కనుక్కుని ప్రభుత్వాలు సకాలంలో వాళ్లకు అందిస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సాయం కూడా సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)

9, ఏప్రిల్ 2017, ఆదివారం

దుర్బలస్య బలం రాజ....

సాధారణంగా టీవీ చర్చల్లో వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవడం నాకు అలవాటు. ఈరోజు టీవీ- 5, చర్చలో చాణక్యుడు, కృష్ణ దేవరాయల ప్రసక్తి వస్తే, అచ్చం ఇలాగే కాదు కాని మొత్తం మీద నేను చెప్పిన మాటలు ఇవి. పొద్దుటి కార్యక్రమం గురించి ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయనగరం జిల్లానుంచి ఫోను చేసి బాగుందని అన్నప్పుడు ఆ విషయాలు నలుగురితో పంచుకోవాలని ఈ పోస్టు. అంతే!
‘దుర్బలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని కొన్ని పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే, ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!
‘ఎవరి పాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా అంటే సందేహమే.
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా ఆయన సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రోటోకాల్ పేచీలు


ప్రజాప్రతినిధులు, వారికి ఇవ్వాల్సిన మర్యాదలు (ప్రోటోకాల్) గురించి చర్చ జరుగుతోంది. పేరుకు ముందు గౌరవనీయులు అనే పదం విధిగా తగిలించాల్సిన వారిలో కొందరి దురుసు ప్రవర్తన కూడా పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఈ నేపధ్యంలో ఓ ముప్పయ్యేళ్ళ నాటి జ్ఞాపకం మనసులో కదలాడింది.
అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తూ ఉండేవాడిని. ప్రతి ఫ్లోర్ లో ఉద్యోగులకోసం క్యాంటీన్లు ఉండేవి. ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడి తమకు కావల్సినవి తెచ్చుకోవాలి. తెలుగు విభాగంలో గీర్మన్, విక్టర్ అని ఇద్దరు సహాయకులు వుండేవాళ్ళు. ఒకరోజు క్యాంటీన్  కు వెళ్లి క్యూలో వున్నప్పుడు నావెనుక ఒకాయన నిలబడ్డారు. ఆయన సోవియట్ ప్రభుత్వంలో రేడియో టెలివిజన్ వ్యవహారాలు చూసే శాఖకు మంత్రి. నేను తప్పుకుని ఆయనను ముందుకు రమ్మని మర్యాదకోసం కోరితే ఆయన మృదువుగా తిరస్కరించారు. మా లాగే మా మంత్రి కూడా క్యూలో నిలబడి డబ్బులు చెల్లించి కాఫీ తాగి  వెళ్ళిన వైనం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అలాగే,  మంత్రులు, సీనియర్ అధికారులు  ప్రభుత్వం సమకూర్చిన వాహనాల్లో వచ్చేవాళ్ళు. అయితే, ఆఫీసు గేటు ముందు తనిఖీ సిబ్బందికి తమ గుర్తింపు పత్రాలు చూపించిన తరువాతనే  లోపలకు రావడం నేను ఎన్నో సార్లు గమనించాను.
అంటే ఏమిటి? వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం కోసం కొన్ని సదుపాయాలు కల్పించారు. మిగిలిన విషయాల్లో వాళ్ళు కూడా నలుగురితో సమానమే.

ప్రత్యేక  సదుపాయాలు, ప్రత్యేక హక్కులు వీటి నడుమ సన్నటి గీత వుంటుంది. మన దురదృష్టం. మన దేశంలో ఈ విభజన రేఖ కనబడకుండా చేశారు.  

6, ఏప్రిల్ 2017, గురువారం

వినడం ఓ సుగుణం

ముఖ్యమంత్రులను, సీనియర్ అధికారులను విలేకరుల సమావేశాల్లో  కొందరు ప్రశ్నించే తీరుతెన్నులు గమనించిన తరువాత ప్రశ్నలు అడిగే  పద్దతికే నేను స్వస్తి చెప్పాను. కీర్తిశేషులు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. ఆయన ఒకసారి నాతో  అన్నారు, ‘ఒక తమాషా చూశారా.  ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నవారినీ, వారు అడిగే ప్రశ్నలను గుర్తు పెట్టుకోండి. రేపు వాళ్ల పత్రికల్లో వాటిని గురించి ప్రస్తావన ఏమైనా  వుంటుందేమో గమనించండి.’    
అయితే ఇది ఆయన చేసిన ఒక  సాధారణ పరిశీలనగానే పరిగణించాలి తప్ప  జర్నలిస్టులను అందరినీ ఉద్దేశించి  చేసినదిగా భావించనక్కరలేదు.
అయితే, ఆయన మరో మాట కూడా చెప్పారు.
కొందరు విలేకరులు ఆర్భాటం కోసం వేసే ప్రశ్నలకు నాయకులు చెప్పే జవాబులను జాగ్రత్తగా గమనిస్తే మంచి వార్తను పట్టుకునే అవకాశం వుంటుంది. కాబట్టి ఎంతో అవసరం అనుకుంటే తప్ప ప్రశ్నల జోలికి పోకుండా వినదగునెవ్వరుచెప్పినపాలసీ పెట్టుకుంటే మనం సవివరమైన వార్త అందించడానికి వీలుంటుంది.
చూసి నేర్చుకోవాలంటారు. కానీ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు.