31, అక్టోబర్ 2016, సోమవారం

ఎంతచెట్టుకు అంత గాలి (కధానిక)


పది కోట్లు ఖరీదు చేసే రాజశేఖరం కారు ఎయిర్ పోర్ట్  ప్రైవేటు గేటు  దాటి టార్మాక్ మీద ఆగివున్న అతడి సొంత విమానం వద్దకు చేరుకుంది.  పైలట్  స్వయంగా వెంటబెట్టుకుని అతడ్ని లోపలకు తీసుకువెళ్ళాడు. కాసేపు తనని డిస్టర్బ్ చేయవద్దని సిబ్బందికి చెప్పి రాజశేఖరం  బెడ్ పై వాలిపోయాడు. ఆలోచనాలోచనాలకి నిద్ర ఎలా పడుతుంది.  ఒకటా రెండా! రెండే రెండు రోజుల్లో లక్షకోట్లు సిద్ధం చేయాలి? దేశదేశాల్లో విస్తరించివున్న తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి పోకుండా వుండాలంటే అంత మొత్తం వెంటనే కావాలి. ఎలా అన్నదే జవాబు దొరకని ప్రశ్న.
రాజశేఖరాన్ని విమానం ఎక్కించి తిరిగివస్తున్నాడు అతడి కంపెనీ సీయీఓ బెనర్జీ. నున్నటి రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోతోంది. కోటుజేబులో నుంచి తీసి చూసుకున్నాడు. కోటి రూపాయల చెక్కు. అవసరం అంటే బాసు మరో మాట అడ్డు చెప్పకుండా చెక్కు రాసి ఇచ్చాడు. అది సరే. మరో కోటి యెట్లా! వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఒక్కగానొక్క కూతురికి చక్కటి సంబంధం కుదిరింది. రెండు కోట్లు కట్నం. మరో మూడు  పెళ్లి ఖర్చులకి. పరపతి అంతా వాడితే,  మూడు కోట్లు సర్దుబాటు అయ్యాయి. మరో కోటి కావాలి. ఎల్లా అన్నదే కోటి రూపాయల ప్రశ్న.
బెనర్జీని ఇంట్లో దించి అటునుంచి అటే ఆఫీసుకు చేరుకున్నాడు అతడి పర్సనల్ అసిస్టెంట్ రామారావు. దారి మధ్యలో  బెనర్జీ ఇచ్చిన కోటి చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసాడు. తనకు అవసరం అని చెబితే ఏ కళన ఉన్నాడో మహానుభావుడు లక్ష రూపాయల కట్ట తన చేతిలో పెట్టాడు. ఆఫీసుకు వెళ్లి  కారు దిగుతుండగానే సెల్ మోగింది. చూడకుండానే అర్ధం అయిపొయింది ఆ ఫోను ఎవరు చేసారో. కుర్చీలో కూర్చుంటూ వుండగానే మరోసారి మోగింది. గతి లేక ఆన్సర్ చేసాడు.
“చూడండి రామారావు గారు, ఇప్పటికి ఆరు సార్లు డిఫాల్ట్ అయ్యారు. మంచి కంపెనీ అని మీ పర్సనల్ లోన్ విషయంలో ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాము. ఇక ఆగడం కష్టం. పైనుంచి  మాకు ప్రెషర్ పెరుగుతోంది. ఏం  చేస్తారో తెలవదు. రెండు రోజుల్లో ఆరు కిస్తీల బకాయిలు వడ్డీతో కలిపి ఒకేమాటు కట్టేయండి. ఇది ఫైనల్. వార్నింగు అనుకున్నా మేము చేయగలిగింది లేదు’        
అప్పు చేసి కొన్న కొత్త విల్లాలో గృహప్రవేశం చేసి ఏడాదికూడా కాలేదు. కొడుకూ, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారన్న  భరోసాతో అంత అప్పు చేశాడు. అయితే నెల తిరగకుండానే వాళ్ళని బెంచిలో పెట్టారు. విల్లా  చాలా పెద్దది. కానీ,  అప్పు అంతకంటే  పెద్దదిగా కనబడుతోంది. బాసు ఇచ్చిన లక్ష వడ్డీకి కూడా సరిపోదు. మరి మిగిలిన పాతిక లక్షలు ఎల్లా.
ఇంటికి వస్తూనే డ్రైవర్ పరంధాములుకి లక్ష ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో! రామారావుకు మనసులో ఏదో మూల అనుమానం.
స్కూటర్ నడుపుతున్నాడే కాని పరంధాములు మనసు మనసులో లేదు. పిల్లాడు ఇంజినీరింగు మూడో ఏడు చదువుతున్నాడు. ఇంటిల్లిపాదీ కడుపు కాల్చుకుని చదివిస్తున్నారు. ఒక్క ఏడాది ఎలాగో లాక్కువస్తే వాడి జీవితం ఒడ్డున పడుతుంది. చదివి ఉద్యోగం చేసి ఇంటి కష్టాలు తీర్చాలని అతడూ శ్రద్ధగా చదువుతున్నాడు.  కానీ శ్రద్ధ ఒక్కటే సరిపోదు కదా! కాలేజీ  వాళ్లకి ఫీజు కూడా కావాలి. పదివేలు ఫీజుకట్టమని, లేకపోతే పేరు తీసేస్తామని  కాలేజీలో చెప్పి పది రోజులు అవుతోంది. అమ్మగార్ని అడిగితే ‘అయ్య ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు, వచ్చిన తరువాత అడిగి చూడు’ అన్నది. దిగాలు పడ్డ తన మొహం చూసి ఏవనుకున్నదో లోపలకు వెళ్లి ఓ ఐదువేలు తెచ్చి ఇచ్చి, మిగిలింది ఎక్కడయినా తెచ్చి  పని గడుపుకో’ అంది. బ్యాంకులో కట్టమని యజమాని ఇచ్చిన లక్ష రూపాయలు జేబులో వున్నాయి. కానీ తనకు కావాల్సింది ఐదు వేలే! అవి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు?      
బ్యాంకులో డబ్బు కట్టి పరంధాములు ఇల్లు చేరేసరికి కధ వేరే విధంగా వుంది. పక్కింటి పిల్లాడికి  ప్రాణం మీదకు వచ్చింది. చిన్నాసుపత్రి నుంచి పెద్దాసుపత్రికి ఇలా తిప్పడంతోనే, అలా  తిరగడంతోనే ఆ పిల్లాడి తండ్రి చిక్కిపోయింది.  రోగం మాత్రం పెద్దది అయ్యింది.  'ఏవేవో పరీక్షలు జరూరుగా  చేయాలి, అయిదు వేలు కట్టమన్నారు. ఇల్లంతా వెతికినా యెర్ర ఏగానీ లేదు. చివరికి పరంధాములే వాళ్లపాలిట పరంధాముడు అయ్యాడు. అతడి పిల్లాడి ఫీజు డబ్బు ఆసుపత్రిలో ఫీజుగా మారింది.
అయిదు వేలు యెట్లా అన్న ప్రశ్న మళ్ళీ పదివేలకు రూపు మార్చుకుంది.
పిల్లాడి ఫీజు సమస్య కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. 

26, అక్టోబర్ 2016, బుధవారం

పనికొచ్చే ముక్క


నాకొక మంచి నాస్తిక మితృడు వున్నాడు. ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళే సరికి రేడియోలో ఆధ్యాత్మిక  ప్రవచనాలు వింటూ కనిపించాడు. నా మొహంలో ఆశ్చర్యం గమనించి అతడే చెప్పాడు.
ఆచార్యుల  బోధనల్లో దేవుళ్ళ ప్రసక్తి ఎలా వున్నప్పటికీ, మంచి జీవితం గడపడానికి పనికొచ్చే అనేక విషయాలు వుంటాయని, అంచేతే వాటిని క్రమం తప్పకుండా వింటుంటానని అన్నాడు.

భేషయిన మాట!   

24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ భోగం ఎన్నాళ్ళు?

రాత్రంతా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నట్టుగా చప్పుళ్ళు. తెల్లారి బాల్కానీనుంచి కిందికి చూస్తే నల్ల తివాచీ పరిచినట్టు కొత్త రోడ్డు. 


కాంట్రాక్టర్ ఎవడో మంచివాడులాగా వున్నాడు, ఎవరికీ ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో పని పూర్తిచేశాడు. మూడు పొరల్లో వేశాడు. పైకి దిట్టంగానే కానవస్తోంది.
‘అయినా ఈ భోగం ఎన్నాళ్ళులే, గట్టిగా ఒక వాన పడిందాకనే’ అంటున్నాడు పక్క పోర్షన్ ఆయన. ఎవరి అనుమానాలు వాళ్ళవి. అందుకే లోగడ చెప్పుకున్నట్టు ప్రతి రోడ్డు పూర్తి చేయగానే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు, పర్యవేక్షణ చేసిన అధికారి వివరాలు, ఫోను నెంబర్లు, రోడ్డు ఖర్చు, వేసిన తేదీలతో సహా అక్కడే రోడ్డు పక్కన బోర్డులు పెట్టిస్తే ఆ రోడ్డు మంచి చెడుల బాధ్యులను నిర్ణయించినట్టు అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు.

22, అక్టోబర్ 2016, శనివారం

చెత్త పేపర్లు


అపార్ధం చేసుకోకండి. ఇక్కడ కవి హృదయం పత్రికలు అనికాదు.
పత్రికల ద్వారా అనునిత్యం ఇంటింటికీ చేరుతున్న చెత్త అని అర్ధం.
అదిగో మళ్ళీ అపార్ధం మొహం పెట్టారు. ఇదేమీ బాగాలేదు. దిన పత్రికలు రాసుకొస్తున్న చెత్త అని కాదు,  ఇళ్ళకు మోసుకొస్తున్న చెత్తాచెదారం అని.
పత్రికల్లో పేజీలను మించి ప్రకటన కరపత్రాలు వాటిల్లో ఉంటున్నాయి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేర్వేరు డబ్బాల్లో వేయమంటున్నారు సర్కారు వారు. ఆ పనికి ఇది అదనం. టమాటాలు కిలో కేవలం యాభయ్ రూపాయలు మాత్రమే అనే దగ్గర మొదలు పెడితే, కోట్లకు పడగలెత్తిన ఆసాములు సయితం ఓ కన్నేసి చూడడానికి సంశయించే రమ్యహర్మ్య భవంతుల వరకు ఈ ప్రకటనల కరపత్రాలు, పత్రిక తెరవగానే ముందు కంట్లో పది ఆ తరువాత  ఇల్లంతా పరచుకుంటాయి. పత్రిక కొంటే ఈ చెత్త అదనం అన్నమాట.
పత్రికల సర్క్యులేషన్ నిర్ధారించడానికి ఏవేవో లెక్కలు వుంటాయి. ఓ పత్రికా మిత్రుడు (ఆయన నా మిత్రుడు, పత్రికలకు కాదు) సరదాగా ఓ మాట అన్నాడు, ‘ఏ పత్రికలో ఈ రకం చెత్త యెంత ఎక్కువ వుంటే అది అంత గొప్ప ప్రజాదరణ కలిగిన పత్రిక’ అని.
ఇక కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఈ చెత్తను జాతీయం చేసుకుని ఏకంగా తమ పత్రికల పేజీల్లోకే జొప్పించి అదనపు రాబడి పెంచుకుంటున్నాయనే అపవాదు వుంది. అది వేరే విషయం.
పైన చెప్పిన మిత్రుడే మరో మాట చెప్పారు.
“అనవసరంగా ఇంతంత పెట్టుబడులు పెట్టి పత్రికలు పెట్టడం ఎందుకు, ఏదో ఒక చిన్న పత్రికను ఇంట్లోనే ముద్రించి (సాంకేతికత పుణ్యమా అని ఆ వెసులుబాటు వుంది), టీవీలు చూస్తూ వార్తలు గిలికేసి  పెద్ద పెద్ద సర్క్యులేషన్ కలిగిన  పెద్ద పత్రికల పొట్టలో కూరితే, కాణీ ఖర్చులేకుండా ఇంటింటికీ చేరుతుంది కదా!”
మంచి ఐడియానే! ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత టైం తప్ప.          

21, అక్టోబర్ 2016, శుక్రవారం

రాజకీయ వారసులు, వారసత్వ రాజకీయాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-10-2016, SUNDAY)
అది సంపద కావచ్చు, అధికారం కావచ్చు.
వాటిని కూడబెట్టినవారికి ఒకటే సమస్య, తమ వారసులకు వాటిని భద్రంగా ఒప్పచెప్పడం ఎలా అన్నదే!
ఒకడు వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తూ పొలాలు కొంటూ పోతాడు. పిల్లలు ఉద్యోగాల పేరుతొ విదేశాలకు యెగిరి పోతుంటే ఆ భూముల్ని ఎవరు చూడాలి, ఎవరు కాపాడాలి, ఎవరు అనుభవించాలి?
పెద్దతనం మీద పడినప్పుడు అన్నేళ్ళుగా ఇంటి వ్యవహారాలపై పెత్తనం చేస్తూ వచ్చిన ఆ ఇంటి పెద్దమనిషికి పట్టుకునే పెద్ద బెంగ.
మరొకడు వైద్యం చేస్తూనో, ఇంకొకడు  వకీలుగా ప్రాక్టీసు చేస్తూనో పది తరాలకు సరిపడా పోగుచేస్తాడు. పోయేటప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలకే  ఆ ప్రాక్టీసు ఒప్పచెప్పాలని తెగ మధన పడతారు.
అలాగే నటీనటులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు అందరికీ ఒకే కోరిక, తమ సామ్రాజ్యాలకు తమ పిల్లలే వారసులు కావాలని.  ఈ విషయంలో వీళ్ళందర్నీ తలదన్నే వర్గం ఒకటుంది, అది రాజకీయం.  
పూర్వం రాజులు, మహారాజులకి వారసులే రాజ్యానికి వచ్చేవారు. వారసుల నడుమ పొరపొచ్చాలు వస్తే మహా భారత యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. రాజ్యాధికారం వారసత్వ హక్కు అని కొందరు, కాదు, రాజ్యం వీరబోధ్యం అంటూ మరికొందరూ చరిత్ర పుటల్ని రక్తసిక్తం చేసారు.
రాజకీయ వారసత్వం గురించి ముచ్చటించుకునే ముందు ఓ పూర్వకాలపు ముచ్చట చెప్పుకోవాలి.
ఒక రాజుగారికి వయసయిపోయింది. పేరుకు తొమ్మిదిమంది యువరాజులు వున్నారు కానీ వారందరూ పనికి పోతరాజులే కాని సింహాసనం మీద కూర్చోదగిన వాళ్ళు కాదు. తన వారసుడు ఎవరనే విషయంలో రాజుగారు తన ఆస్థాన గురువును సంప్రదించాడు. ‘తండ్రిగా అయితే నీకు ఇష్టం వచ్చిన వాడిని వారసుడిగా ఎంచుకో. రాజుగా అయితే రాజ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకో’ అని గురువు సలహా ఇస్తాడు.
రాజులు, రాచరికాల సంగతి సరే. ప్రస్తుతం ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అయినా రాజకీయాల్లో ఈ వారసుల మాట పదేపదే వినబడుతోంది. మొన్నటికి మొన్న తమిళనాడులో డీ ఎం కే కురువృద్ధుడు కరుణానిధి  తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు స్టాలిన్ పేరు ప్రకటించి, ఆ పార్టీలో, తన కుటుంబంలో ప్రకంపనలు సృష్టించారు. ప్రస్తుతం అధికారంలో లేని పార్టీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో తెలియదు.
ఈ పవిత్ర భారత దేశంలో ఒక విచిత్రమైన ద్వైదీభావం వుంది. ఇప్పటికీ ఎన్నికల్లో రాజకీయ వారసులే ఫలితాలను ప్రభావితం చేస్తారు. కానీ జనాన్ని విడిగా అడిగి చూడండి. తద్విరుద్ధంగా మాట్లాడతారు. నవతరం ఓటర్లలో  కొంత మార్పు కానవస్తోంది. కేజ్రీవాల్ పార్టీ పెట్టి ‘నేను భిన్నమైన వాడిని’ అంటే మురిసిపోయారు. ‘మా చుట్టూ పోలీసులు వుండరు, ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోము, అధికారానికి వచ్చినా నేనూ మా  మంత్రులు బుగ్గ కార్లు వాడము, పెద్ద భవంతుల్లో ఉండము, అంతేకాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయరు, అలాంటివాళ్ళకి టిక్కెట్లు ఇవ్వము’ అని తెగేసి చెబుతుంటే వినేవాళ్ళకు విచిత్రంగా అనిపించింది.
‘సెహభాష్, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే!’  అని జనం  క్యూలల్లో నిలబడి ఓట్లు వేసి గెలిపించారు.
అంటే, వారసత్వ రాజకీయాలతో, రాజకీయ వారసులతో జనాలు అంతగా విసుగెత్తి పోయారని అనుకోవాలా!
విసుగెత్తిపోయిన మాట నిజమే కానీ వారి  వరస పూర్తిగా మారలేదు.
ప్రస్తుతం వున్న లోక సభలో మూడింట రెండువంతుల మంది సభ్యులు నలభై ఏళ్ళ లోపువాళ్ళు. అయితే వారి దగ్గరి బంధువుల్లో చాలామంది రాజకీయాల్లో తలనెరిసినవాళ్ళే. ప్రస్తుత లోకసభలో ఇరవై మంది అత్యంత సంపన్నులయిన సభ్యుల్లో పదిహేనుమంది వారసత్వంగా  ఎన్నికల్లో గెలిచి వచ్చినవాళ్ళే కావడం గమనార్హం. మరో సంగతి ఏమిటంటే ఈ నలభై వసంతాల యువ పార్లమెంటు సభ్యులు పది మందిలో తొమ్మిది మంది రాజకీయ వారసులుగా కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచి సభలో అడుగుపెట్టారు.
దేశ రాజకీయాల తీరు తెన్నులు గమనించేవారికి తెలిసే వుంటుంది. అనేక నియోజకవర్గాల్లో ఒక కుటుంబం పెత్తనమే నడుస్తూ వుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో వుంటే జనాలు ఆ పార్టీకే ఓట్లు వేస్తుంటారు.  వీటికి ఏ పార్టీ మినహాయింపు కాదుకాని, వామపక్షాలు, బీజేపీ కొంత మెరుగు.
ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాజకీయ వారసులు వున్నారు. అయితే పార్టీలు వాళ్ళ కుటుంబాల పెత్తనంలో ఉండడానికి ఒప్పుకోవు. కానీ, మన దేశంలో, పొరుగున వున్న పాకీస్తాన్ లో, ఇంకా ఫిలిప్పీన్స్ లో పరిస్తితి ఇందుకు భిన్నం. మన దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనే కాకుండా, బిజూ జనతా దళ్, రాష్ట్రీయ లోక్  దళ్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్  పార్టీ  వంటి  ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ వారసత్వ సంస్కృతి వుంది.
వారసుల గొడవతో సంబంధంలేని రాజకీయ నాయకుల జాబితా తయారు చేసి అక్షర క్రమంలో  కుదిస్తే అదిలా వుంటుంది.
అహమద్ పటేల్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్, మాయావతి, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధి.   

17, అక్టోబర్ 2016, సోమవారం

పరమ రోత టీవీ ప్రోగ్రాం


పూర్వం వీధి నాటకాల్లో కేతిగాడు అనేవాడు రంగ ప్రవేశం చేసి తన వెకిలి చేష్టలతో గ్రామీణ ప్రజల్ని నవ్వించేవాడు. ఈటీవీలో ఓ ప్రోగ్రాం వస్తోంది. దాన్ని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. ఈ ప్రోగ్రాం, పేరేమిటో తెలియదు కాని, ఇందులో ఒకరా ఇద్దరా అనేకమంది కేతిగాళ్ళు. వీళ్ళ చేష్టలు, ఆకారాలు వెకిలిగా, వికృతంగా వున్నాయి. దీనికి తోడు ఆ కార్యక్రమానికి జడ్జీలుగా వచ్చిన ప్రసిద్ధ నటీనటులు పగలబడి నవ్వుతుండడం చూసి మరింత రోతగా అనిపించింది. దీన్ని నేను ఇంతవరకు చూడలేదు, కానీ వింటూ వస్తున్నాను. రామోజీ రావు గారు తమ ఛానల్లో వచ్చే ప్రతిదీ చూసి ఓకే చేస్తారని చెబుతుండగా విన్నాను. నేను విన్నది నిజం కాదేమో అనిపిస్తోంది ఇది కొన్ని సెకన్లపాటు చూసిన తరువాత.

15, అక్టోబర్ 2016, శనివారం

యోగి వేమనను తప్పుగా అర్ధం చేసుకున్న ఏపీ పార్టీలు


పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!

తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ వేమన  పద్యం భావం.

అయితే  ఆంధ్రప్రదేశ్ లో పాలకపక్షం, ప్రధాన  ప్రతిపక్షం వేమన నీతిని  మరో విధంగా  అర్ధం చేసుకున్నట్టున్నాయి. ఒకే మాట పదిమంది  పదిసార్లు చెబితే అదే నిజమై పోతుందన్న నమ్మకం పెంచుకున్నట్టు వుంది, వాళ్ళ  తరహా  చూస్తుంటే. ఒకరు ఒకటంటే, దాన్ని ఖండఖండాలుగా ఖండిస్తూ  పది మంది పది అంటారు. వెరసి ఓ వేయి మంది లక్షసార్లు అన్న ఫీలింగు కలుగుతోంది టీవీలు  చూసేవారికి.