16, ఆగస్టు 2016, మంగళవారం

అమ్మకు వందనం


శ్రావణ మాసం అనగానే  మా  అందరికీ  నువ్వే  గుర్తుకు వస్తావు.  జరిగి ఇరవై రెండేళ్ళు  దాటిపోతున్నా ఆ రోజు మా అందరికీ ఇంకా  బాగా జ్ఞాపకం వుంది. శుక్రవారం నోముకు  అంతా సిద్ధం చేసుకున్న నలుగురు కోడళ్ళు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నీ పిల్లలం నలుగురం.
కోడళ్ళని  కన్న కూతుళ్ళుగా చూసుకున్న నువ్వు  వారి నోముకు అడ్డం ఎలా వస్తావు. పూజలు పూర్తయి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తరువాత కానీ నువ్వు దాటిపోలేదంటే అది నీ అవ్యాజ ప్రేమకు నిదర్శనం. ఆ  రుణంతీర్చుకోలేనిది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యావత్  కుటుంబం  కాశీ వెళ్లి అంతిమ సంస్కారాల క్రతువు ముగించడం అన్నది నీ ఒక్క విషయంలోనే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నీ ఆబ్దీకం అనేది చుట్టపక్కాలు అందరికీ  ఒకచోట కలుసుకునే సందర్భంగా మారిపోయింది. మన ఇంట నలుగురూ కలిసి జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది.

నువ్వు ధన్యజీవివి. నీ  కడుపునపుట్టి మేము కూడా ధన్యులమయ్యాం.        

15, ఆగస్టు 2016, సోమవారం

జెండా పండుగ


దసరా, దీపావళి మొదలయిన పండగల సరసన చేర్చదగిన జాతీయ పర్వదినాలు ఆగస్టు పదిహేను, జనవరి యిరవై ఆరు.
పంద్రాగష్టును మొదటిసారి పండుగ రూపంలో స్వతంత్ర భరతజాతి యావత్తు ఒక్కటై జరుపుకున్ననాటికి నేను నెలల బిడ్డని. రెండో పండగ- రిపబ్లిక్ డే - గణతంత్ర దినోత్సవాన్ని తొలిసారి జరుపుకున్నప్పుడు నా వయస్సు అటూఇటుగా నాలుగేళ్ళు. అంటే దాదాపు నాతోపాటే పెరిగి పెద్దవుతూ వచ్చిన పర్వదినాలు ఇవి.
నిండు నూరేళ్ళు జీవించ గలిగే అవకాశం వుంటే – డెబ్బయి వసంతాలు అన్నది మనుషుల విషయంలో పెద్దమాటే. కానీ ఒక జాతి జీవితంలో ఇదొక లెక్కలోది కాదు. అయితే, ఏ ఏటికాయేడు వెనక్కి తిరిగి చూసుకుని సాధించినది ఎంతో లెక్కలు వేసుకోకపోతే సాధించాల్సిన లెక్కలు తేలడం కష్టం. అందుకని ఈ ఏడాది ఈ పండుగ సమయంలో అందరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు 'నడిచి వచ్చిన దారి' ని ఒకమారు పరిశీలించుకోవాల్సిన సందర్భం ఇది.
నాకు ఊహ తెలుస్తున్న వయస్సులో ఈ రెండు పండగలను యెంతో ఉత్సాహంతో జరుపుకున్న రోజులు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. పొద్దున్నే లేచి బడికి వెళ్లి త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని ఊరంతా తిరుగుతూ ప్రభాత్ భేరిలో పాల్గొనే వాళ్ళం.
ప్రభాత్ భేరి అనే మాటకు అర్ధం తెలియని వయసు. అయినా అలా ఊరేగింపుగా బయలుదేరి 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ వుంటే ఊరంతా ఉత్సాహం ఉరకలెత్తేది. 'జనగణమన' గీతంలో- ఏ ఏ భాషల ప్రస్తావనవుందో, ఏ ఏ ప్రాంతాల ప్రసక్తి వుందో మాకు అప్పటికి తెలియదు. ఆ గీతాన్ని ఎవరు రాసారో, ఏ భాషలో రాసారో అంతకంటే తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే అది అందరి గీతం. జనగణమన చరణాలలోని - 'న' ను 'న' లాగా- 'ణ' ను 'ణ' లాగా, తప్పులు దొర్లకుండా ఎలా పాడాలన్న తపన ఒక్కటే మాకు తెలిసింది. ఢిల్లీ ఎక్కడ వుందో తెలియదు, ఎర్రకోట అంటే తెలియదు, కానీ దానిపై చాచా నెహ్రూ జండా ఎగురవేస్తాడని మాత్రం తెలుసు. ఏమీ తెలియని అజ్ఞానంలోని మధురిమను ఆస్వాదించడం కూడా ఒక మంచి అనుభవమే అని ఈనాడు ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే అనిపిస్తోంది.
అవును. ఎక్కడికి పోయాయి ఆ రోజులు?
'లేవరా నాన్నా! ఈరోజు స్కూల్లో జండా ఎగరేస్తారు తొందరగా వెళ్ళాలి' అంటే- ‘కాసేపు పడుకోనీ మమ్మీ, ఈ రోజు సెలవే కదా!' అని పిల్లలు నసిగే రోజులు వచ్చేసాయి. పండగ దినం స్తానంలో సెలవు రోజు వచ్చింది. తప్పులు లేకుండా ‘జనగణమన' పాడడం పోయి – ఆ గీతంలో తప్పులెన్నే రోజు వచ్చింది. భారతీయ జండాకు బదులు మరో జండా ఎగురవేస్తామనే వితండ వాదం పుట్టుకొచ్చింది.ఏటేటా జరిగే పతాక ఆవిష్కరణలు మొక్కుబడిగా మారిపోయాయి. ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయం మధ్య, నిఘా పోలీసుల డేగ కళ్ళ పహరాల నడుమ , జాతీయ పండుగలు జరుపుకునే దుస్తితి దాపురించింది.
సైనిక కవాతులు, శస్త్రాస్త్ర ప్రదర్శనలు, భారీ టాంకులు, వైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతను, జాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
గతమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం వారు, ఈనాటి పరిస్తితులను చూసి – 'మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతో, కులాల కుంపట్లతో, ప్రాంతీయ ద్వేషాలతో దేశం యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగా, సంపాదనే ఉపాధిగా, అడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా , నీతికి దూరంగా, అవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్థలు, మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితం, తానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే –
నిస్సహాయంగా నిలబడి జనం చూడాల్సి రావడం యెంత విషాదం, యెంత దారుణం, యెంత దుస్తరం,యెంత బాధాకరం?
అయితే ఏమిటట?
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ డెబ్బయి ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.
గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.
అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు, 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే గుర్తుపట్టి వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.
'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.
ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.
అయితే , 'అంగట్లో అన్నీవున్నా అల్లుడి నోట్లో శని' అన్న సామెత చందంగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఏడుు దశాబ్దాల పైచిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది. స్వతంత్ర భారతం ఆలపిస్తున్న స్వేఛ్చా గీతికల్లో వుండి వుండి అపశ్రుతి వినబడుతోంది.
వెడుతున్న దోవ మంచిదే. కానీ, నడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. కాలికి కాలే అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.
విభిన్న స్వరాలతో వినిపిస్తున్న సందేశం మంచిదే. కానీ మధ్య మధ్య వినబడుతున్న అపస్వరాలు అసలు అర్ధాన్నే మార్చివేస్తున్నాయి.
అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది. హరించి వేస్తోంది.
స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగా, ధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం కళ్ళ ముందే ఆవిష్కృత మవుతోంది.
అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యం, అతి సహజం. కానీ అవి తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండా, తప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం. అభివృద్ధి సురుచిర సాధ్యం.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వార్షికోత్సవ శుభసమయంలో మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

14, ఆగస్టు 2016, ఆదివారం

బెస్ట్ ప్రొడ్యూసర్


విలేకరి: మీరు చాలా పెద్ద పెద్ద నిర్మాతలతో గొప్పచిత్రాలు అనేకం నిర్మించారు కదా! వారిలో ఎవరు మంచి నిర్మాత అని మీరు అనుకుంటున్నారు?"
దర్శకుడు: "ప్రభుత్వం"

ఎలా అని అనుకోకూడదు, అలానే అని అనుకోవాలి


ప్రసిద్ధ పాత్రికేయులు ఏ.ఎన్.జగన్నాధ శర్మ సంపాదకత్వంలో వెలువడే ‘నవ్య’ వారపత్రిక తాజా సంచికలో ఒక సీరియల్  లో వచ్చిన వాక్యాలు ఇలా వున్నాయి.( సీరియల్ : మదరిండియా, రచయిత: వక్కంతం సూర్యనారాయణ రావ్, 17-08-2016, 34వ పేజీ, మూడో కాలమ్, ఆఖరి పేరా) 

“వినడం వేరు పాటించడం వేరు.
‘బైక్  మీద  జాగర్త నాయనా! నెమ్మదిగా వెళ్ళు అని తల్లి కొడుక్కి చెబుతుంది.
‘ఓ అలాగే’ అన్న కొడుకు జాగర్తగా, నెమ్మదిగా వెడతాడన్న గ్యారంటీ ఉందా’! “
ఇక మూడేళ్ళు వెనక్కి వెడదాం.
2013 అక్టోబరులో  నేను నా బ్లాగులో ‘వినుడు వినుడు’ అనే పేరుతొ ఒక పోస్టింగు పెట్టాను. అందులో ఒక పేరా ఇలా వుంటుంది.
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకతఅనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడుతలిదండ్రుల మాట జవదాటడుఅని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

మనుషుల్లోనే కాదు, రచనల్లో కూడా పోలికలు వుంటాయి. పోలికనిబట్టి ‘కాపీ’ అనడం  భావ్యం కాదు. సరదాగా తీసుకుంటే  జీవితం కూడా సరదాగా  గడుస్తుంది.



సలాం సలీం


ప్రముఖ రచయిత ఏ.ఎన్. జగన్నాధశర్మ సంపాదకత్వంలో, ఆంధ్రజ్యోతి ప్రచురించే ‘నవ్య’ వారపత్రిక తాజా  సంచిక (17=08-2016) లో ఒక అద్భుతమైన  కధ చదివాను. తెలుగు కధకు నోబెల్ బహుమతి వస్తుందన్న ఆశ ఏ కోశానా లేదు కానీ, సలీం రాసిన ‘నరకకూపం’ అనే ఈ కధ అంతకుమించిన పురస్కారానికి అర్హమైనది అనే అభిప్రాయం నాకు ఈ కధ చదివిన తరువాత కలిగింది.
ఈ కధలో అంత విషయం ఏముందోతెలుసుకోవాలంటే  అంటే ఈ కధ చదివి తీరాలి.
రచయిత సలీం గారికి నోబెల్ ఎలాగూ రాదు. ఎందుకంటే ఆయన తెలుగులో రాస్తారు. అందుకే సలీం గారికి  ఓ ‘సలాం!’పెట్టి ఊరుకుంటున్నాను.


పాఠకులకు చట్టబద్ధ హెచ్చరిక: ఈ కధలో ఇతివృత్తం ఎలాటిదంటే, మొదలు పెట్టి ఎందుకు మొదలు పెట్టామా అని చీదరించుకుంటాం. చదువుతూ పొతే, ఇలాటి జీవితాలు కూడా మన నడుమే సాగుతున్నాయా అని ఆశ్చర్య పోతాము. కధలో ప్రధాన పాత్ర వృత్తి అలాటిది. అతడి జీవితం మనకే కాదు అతడికే నచ్చదు. అయినా జీవిక కోసం దానితోనే అతగాడి సహజీవనం. అది తెలుసుకుని, అర్ధం చేసుకుని రాయడానికి రచయిత పడ్డ శ్రమకు ఇవ్వవచ్చేమో రెండు నోబెల్ పురస్కారాలు.
ఆయనకి ఇటువంటి గుర్తింపు వస్తే ఆయన యెంత సంతోషపడతారో నాకు తెలియదు. కానీ  నేను మాత్రం ఇంతటి గొప్ప రచయిత జీవిస్తున్న కాలానికి చెందినవాడిగా చాలా గర్వపడతాను.

(కాకతాళీయం కావచ్చు, రాత్రే ఈ కధ చదివాను, పొద్దున్న పత్రికల్లో మొదటి పుటలోనే ‘నలుగుర్ని  మింగిన మ్యాన్ హోల్’ అంటూ విషాద వార్త.)     

13, ఆగస్టు 2016, శనివారం

అతడు - ఆమె - ఆవిడ

‘ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’
ఆఫీసునుంచి  ఇంటికి వచ్చి  సైకిలు స్టాండు  వేస్తున్న  శంకరం కళ్ళు  ఆశ్చర్యంతో   విచ్చుకున్నాయి.
భార్య  నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.
పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.
'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.
మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది.  కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా. ఇక, ఇంట్లో  ‘ఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు  భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.
ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట  మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.
ఇంతకీ  శంకరం భార్య మొగుడ్ని  వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ'  ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి.  పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’  రోజులు వెళ్లమారుస్తోంది.
భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక  శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.
'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా  కమ్మిన కళ్ళల్లో  గిర్రున తిరిగాయి. 
ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా  కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.
బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.
రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.
'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'
శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.
'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే  ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'
శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు. మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా  వినబడుతోంది.


(NOTE: COURTESY IMAGE OWNER)

ఇక్కడ వుండే పాండురంగడు అక్కడ వున్నాడు


నేను హిందువును. ఆ మాట చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎందుకంటే  హిందూ మతం పరమత సహనాన్ని బోధిస్తుంది. ఇతర మతాలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఈ సూత్రం పాటించని మనిషి హిందువు కావచ్చు కానీ  హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తి మాత్రం కాదు.
ఫేస్ బుక్  లో అప్పుడప్పుడు కొందరు ఫోటోలు పెడుతుంటారు. పలానా దేశంలో పెద్ద హిందూ దేవాలయం నిర్మించారని. ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఒక హిందువుగా సంతోషం వేస్తుంది. మరి అలాగే ఇతర మతస్తులు కూడా  తమ దేవాలయాలను లేదా  ప్రార్ధనా మందిరాలను నిర్మించుకుంటే  వారికీ అలాగే ఆనందం అనిపిస్తుంది. అది సహజం. వారి సంతోషంలో పాలు పంచుకోగలిగితే మరింత సంతోషం.
సమస్య ఎక్కడ వస్తుందంటే మత మార్పిడులను  ప్రోత్సహించినప్పుడు  మాత్రమే. ఇది తగని పని. పార్టీ మార్పిళ్లను సమర్ధించేవారు ఒక మాట చెబుతుంటారు, స్వచ్చందంగా వచ్చి చేరుతున్నారని. ఇదీ అలాంటిదే. నమ్మశక్యం కాని విషయం.
అడవిలో రకరకాల జంతువులు కలిసి సహజీవనం చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని మాంసాహారులు, మరికొన్ని శాకాహారులు. అయినా కలిసే వుంటాయి. వేటాడుకుంటూ  కూడా కలిసే వుంటాయి కాని అడవి విడిచి రావు. వాటికీ  తెలుసేమో తమకన్నా ప్రమాదకర జీవులు అరణ్యాల బయట వున్నాయని.
ఒక కుటుంబంలో వున్నవాళ్ళకే ఇష్టాలలో అనేక తేడాలు వున్నప్పుడు  సంఘంలో అవి తప్పవు. ఎవరి ఇష్టాన్ని వారు నిలబెట్టుకుంటూనే పరుల అభిరుచులను గౌరవించినప్పుడే సహజీవనం సాధ్యం.  
ఇందుగలడందులేడను సందేహము కూడదన్న దేవుడు సర్వోపగతుండు.
అన్నిచోట్లా ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు.
సందేహము లేదు.  
దేవుడ్ని నమ్మండి, కానీ దేవుడి పేరుతొ గిల్లికజ్జాలు పెట్టుకోకండి.

తాను సృష్టించిన ఈ మనుషులు కాపాడితే కాని తన ఉనికిని కాపాడుకోలేనంత దుర్బలుడు కాదాయన.