29, జులై 2016, శుక్రవారం

రేడియో భేరి - 7

రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య

పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు. 1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు ‘రేడియో అన్నయ్య’, ‘రేడియో అక్కయ్య’ అనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి వారిద్దరూ చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ‘ఆటవిడుపు’ అనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ – పదకొండేళ్ళ వయస్సులో 1941 జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944 సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

28, జులై 2016, గురువారం

రేడియో భేరి -6

గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు

1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. ‘బిల్హణీయం’ విశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని: కృష్ణ శాస్త్రి రాసిన ‘శర్మిష్ట’, ‘వూర్వశి’, ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన ‘కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన ‘మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’, శ్రీ శ్రీ రాసిన ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది ‘అతిధి శాల’. ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు ‘రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత ‘దక్ష యజ్ఞం’ - సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు లేని ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు – రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన ‘బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు’ అనే రేడియో నాటికలు 1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి, 1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం 14 నాటికలు రాశారు. వీటిల్లో ‘మరో ప్రపంచం’ ఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు ‘కనుపాప’. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు. ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

27, జులై 2016, బుధవారం

రేడియో భేరి - 5

పడమటి కొండలా? పశ్చిమ కొండలా?

1938 అక్టోబర్ 3 నుంచి పాఠశాల విద్యార్ధుల కోసం ప్రసారాలు మొదలయ్యాయి. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను మరింత బాగా తెలుసుకోవడానికి ఈ రేడియో ప్రసారాలు తోడ్పడాలని ఆశించారు. పిల్లలకు ఆసక్తి కలిగించే తీరులో ఆటపాటలనూ, నాటికలను వాడి పాఠాలు చెప్పడానికి ప్రయత్నం జరిగింది. 1938 నవంబర్ 2 నుంచి తెలుగులో గ్రామస్తుల కార్యక్రమాలు మొదలయ్యాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించాలన్నది ఈ కార్యక్రమాల ధ్యేయం. వ్యవసాయం, పశు పోషణ, పారిశుధ్యం, సహకారం మొదలయిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పురాణ పఠనం, జానపద గేయాలు ఈ కార్యక్రమాలలోని తక్కిన అంశాలు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలను వ్యవసాయ శాఖ నిర్దేశకుల పర్యవేక్షణలో రూపొందించేవారు. అప్పట్లో మద్రాసు రాజధానిలో వ్యవసాయ నిర్దేశకులుగా వున్న సీ.హెచ్. రామరెడ్డి, రేడియోలో ప్రసారం కోసం తాము ఆమోదించిన ప్రసంగాలు రాసిన అధికారులకుప్రభుత్వ సొమ్ము కాకుండా తానే స్వయంగా ఒక్కొక్క వ్యాసానికీ ఐదేసి రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1939 సెప్టెంబర్ 5 నుంచి ఉదయం, మధ్యాహ్నం ప్రసారాలు మొదలు పెట్టారు. 1939 అక్టోబర్ 1 నుంచి తెలుగులో వార్తాప్రసారాలు మొదలుపెట్టారు. 1939 నవంబర్ 2 నుంచి కళాశాల విద్యార్ధులకోసం ప్రసారాలు ప్రారంభించారు.
ఇన్ని కార్యక్రమాల నేపధ్యంలో – రేడియోకు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. ఉచ్చారణకు సంబంధించి ఓ వొరవడి దిద్దుకోవడంతో పాటు శాస్త్ర సాంకేతిక విషయాల ప్రసారంలో పదాల వాడుకను స్థిరపరచాల్సి రావడం, శ్రోతల స్థాయిని బట్టి వారి వయస్సునుబట్టి అనువైన వాడుక భాషను అలవాటు చేయడం, సంగీత సాహిత్యాలకు సంబంధించి శ్రోతలలో అభిరుచిని పెంపొందించడం, జాపదకళారూపాలను, పాటలను గుర్తించడం, ఔత్సాహికులకు తమ ప్రతిభను కనబరచడానికి అవకాశాలు కల్పించడం, సామాన్య ప్రజల అభిప్రాయాలనూ, అనుభవాలనూ వినిపించడం, శాస్తీయ దృక్పధాన్ని పెంచడం వంటివి ఆ బాధ్యతలలో కొన్ని.
తెలుగుకు సంబంధించి రేడియో వాడుకలోకి తెచ్చిన కొన్ని పదాలు సరైన అవగాహనతో వాడినట్టు కనిపించదు. ఉదాహరణకు- ‘relay’ అనే ఆంగ్ల పదానికి దగ్గరగా ఉండే తెలుగు మాట ‘అంచె’. తమిళంలో నేటికీ ఆ తెలుగుమాటను పోలిన ‘అంజల్’ అనే మాట వాడినా, ఆకాశవాణి తెలుగు కేంద్రాలు మాత్రం ‘రిలే’ అనే ఇంగ్లీష్ పదాన్నే వాడుతుంటాయి. ఉష్ణోగ్రతల విషయంలో - Maximum అనే మాటకు ‘గరిష్ట’ అనీ, minimum అనే మాటకు ‘కనిష్ట’ అనీ వాడుతుంటాయి. కానీ ఇలా చెప్పడంవల్ల ‘ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ’ అనే అర్ధాలు స్పురించవు. అలాగే, వ్యవసాయానికి సంబంధించి ‘ఆశించడం’ అనే పదాన్ని ‘సోకడం’’ అనే అర్ధంలో వాడకంలో వుంది. ‘పడమటి గోదావరి జిల్లా’ అని ఎంచక్కా అనకుండా ‘పశ్చిమ గోదావరి’ అని అనేస్తుంటారు. పడమటి కొండల్ని పశ్చిమ కొండలు అనడం ఎక్కడయినా విన్నారా? కాకుంటే దేశాల పేర్లు వూర్ల పేర్లు, వ్యక్తుల పేర్లు సరిగా పలకడానికి ఆకాశవాణి ఎప్పటికప్పుడు సూచనలు రూపొందించుకుంటూ వుంటుంది. ఒకరకంగా నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి ‘మూలపుటమ్మ’ అనవచ్చు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

26, జులై 2016, మంగళవారం

రేడియో భేరి - 4

రేడియో శైలి

తొలి ప్రసారాలనుబట్టి – మద్రాసు కేంద్రం వివిధ ప్రక్రియలలో ప్రసారం చేసేదని తెలుస్తోంది. సాహిత్య విషయాలను గురించే కాకుండా ఇతర అంశాలను గురించి సరళమైన భాషలో ప్రసారాలు మొదలు పెట్టింది. ప్రసంగాలనే కాక నాటకాలను, గేయాలను వినిపించింది. ఏకొందరో తప్ప చాలామంది సరళమైన భాషలోనే ప్రసంగాలు చేసేవారు. రేడియో ప్రసంగం కానీ, నాటకం కానీ వినగానే మొదటిసారే అర్ధం కావాలి. అంటే కఠినమైన, అన్వయం కల పొడుగుపాటి వాక్యాలు పనికిరావు. భాష సమాస భూయిష్టం కాకుండా తేలికగా వుండాలి. ‘మయ నాగరికత గురించి మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రసంగం రేడియో పద్ధతిలో రాసినట్టు కనిపిస్తుంది. తేట తెలుగులో రాసిన ఆ ప్రసంగం నుంచి కొన్ని వాక్యాలు. ‘ఈ యుగం యెంత చిత్ర మైనదో. ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోను పరిశోధనే.! నిప్పూ నీరూ, గాలీ ధూళీ .... ఇంతెందుకు.. మన....పంచేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయమూ అఖండ పరిశోధనల పాలపడుతున్నది. నిప్పును శోధిస్తున్నారు. నీటిని గాలిస్తున్నారు. గాలిని చీలుస్తున్నారు. రాతిని పగులగొడుతున్నారు. భూమిని తవ్వి పోగులు పెడుతున్నారు.’
1939 నాటికి గేయాల ప్రసారం ఓ దారిలో పడింది. ఆ ఏడాది మల్లవరపు విశ్వేశ్వరరావు రాసిన ‘బిల్హణీయం’ సంగీత నాటకం ప్రసారం అయింది. సూరి నారాయణమూర్తి రూపొందించిన ఈ సంగీత నాటకానికి బీ.వీ. నరసింహారావు సంగీతం సమకూర్చడం మాత్రమే కాకుండా నాయక పాత్ర పోషించారు.
లలిత సంగీతం అన్న పేరు ప్రాచుర్యంలోకి రాని ఆ రోజుల్లో ‘గీతావళి’ పేరుతొ భావగీతాలు ప్రసారం చేసేవారు. ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడడానికి కొత్త గీతాలు కావలసి వచ్చాయి. పండుగలు వస్తే ప్రత్యేకంగా పాటలు రాయించి పాడించేవారు.
రేడియోకు మాత్రమే ప్రత్యేకమైన ప్రక్రియ ‘రూపకం’. (ఆంగ్లంలో దాన్ని ఫీచర్ - FEATURE- అంటారు.) రేడియోకి ప్రత్యేకమైనవి కనుక రూపకాల రచన, రూపకల్పన విలక్షణంగా వుంటాయి. తెలుగులో ప్రసారం అయిన తొలి రూపకం ‘కృష్ణదేవరాయ వైభవం’. 1941 జనవరి 15 నాడు ప్రసారమైన ఈ రూపకం మౌలిక రచన చేసిన వారు ఆకొండి వేంకటేశ్వరరావు. రేడియోకు అనువుగా రూపక రచన చేసి దానికి ప్రాణం పోసిన వారు ఆచంట జానకీరాం. చరిత్రను రసవత్తరంగా వినిపించడానికి చేసిన ఆ ప్రయత్నం ఎందరినో ఆకర్షించింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

25, జులై 2016, సోమవారం

రేడియో భేరి - 3


తొలి తెలుగు రేడియో నాటకం ‘అనార్కలి’

1938 జూన్ 18 నాడు రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, 1938 జూన్ 21 నాడు ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వర రావు, 1938 జూన్ 23 నాడు ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగించారు. (ప్రసార వ్యవధి 15 నిమిషాలు. ప్రసార సమయం రాత్రి 8 గంటల 15 నిమిషాలు.)
తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన పున్నావజ్జల భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి, అక్బర్ పాత్రను డాక్టర్ అయ్యగారి వీరభద్ర రావు పోషించారు. ఈ నాటకం 1938 జూన్ 24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి ప్రసారం అయింది.
జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ (మొదట ప్రసారం 1938 జూన్ 25 రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ) ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది. 1939లో తిరుచినాపల్లిలో రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపింది.
రేడియో కార్యక్రమాల గురించి శ్రోతలకు తెలపడానికి మద్రాసు కేంద్రం 1938 జూన్ నుంచి తెలుగులో ‘వాణి’, తమిళంలో ‘వానొలి’ పక్ష పత్రికలను ప్రారంభించింది. కొన్ని సంచికల తరువాత వాణి ప్రచురణ నిలిచిపోయింది. 1948లో విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభం అయిన తరువాత తిరిగి వాణి ప్రచురణ మొదలయింది. క్రమంగా ఆదరణ కరువై 1980 ప్రాంతాలలో ఆగిపోయింది. ‘వాణి’లో వివిధ రేడియో కేంద్రాల నుంచి ప్రసారం అయిన ప్రసంగాలు, కవితలు, గోష్టులు, సంగీత పాఠాలవంటివి ఎన్నో వెలువడుతూ వుండేవి. తొలి సంచికలో విజయవాడ రేడియో కేంద్రం లక్ష్యాలను వివరిస్తూ, ‘ఈ కేంద్రం రాష్ట్రం లోని జనులందరికీ ఉపయోగకరంగా వుండగలదు. ఈ స్టేషనులో గ్రామస్తుల వినోదార్ధం ఒక గంట ప్రత్యేకించబడ్డది. ఇంతే కాకుండా తక్కిన విషయాలను కూడా ప్రజలలోకి వివిధ తరగతులవారికి అనుకూలముగానుండేటట్లుగా ఏర్పరుపబడ్డది’ అని పేర్కొన్నారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

24, జులై 2016, ఆదివారం

రేడియో భేరి - 2

రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది ఎవరు?
1935లో హైదరాబాదు, ఆ తరువాత సెప్టెంబర్ 10 నాడు మైసూరులో ఒక రేడియో కేంద్రం ఏర్పాటు చేశారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి ఆ కేంద్ర సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు. 1937 సెప్టెంబర్ 30 నాడు తిరువాన్కూర్ సంస్థానం ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
హైదరాబాదు నుంచీ, మద్రాసు నగర పాలక సంస్థ రేడియో నుంచి ప్రసారమైన తెలుగు రేడియో కార్యక్రమాల వివరాలు లభ్యం కావడం లేదు. కనుక రేడియోలో తెలుగు ప్రసారాల ప్రస్తావన గురించి తెలుసుకోవడానికి 1938 జూన్ 16 నాడు మొదలయిన మద్రాసు రేడియో కేంద్రం చరిత్రను పరిశీలించాలి. ఆ నాడు ఆ కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి) చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ, రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
ఆ కేంద్రం ఆ సాయంకాలం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి, సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. (జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు 1939 ఏప్రిల్ ఒకటి నుంచి 14 దాకా ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు) మద్రాసు రేడియో కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ఖ్యాతి కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆయన అప్పుడు చేసిన ప్రసంగం లోని మొదటి వాక్యాలు ” నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’ వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి. ఆయన ఇలా చెప్పారు.”యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశ వాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక” (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

23, జులై 2016, శనివారం

రేడియో భేరి -1

రారండోయ్ రారండోయ్  రేడియో చరిత్ర  వినరండోయ్ !
ఇది ఆకాశవాణి  సమగ్ర చరిత్ర అని చెప్పలేను కానీ, ఈ వివరాలు ఇవ్వడంలో సహకరించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు, రచయిత డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ రేడియోకి సంబంధించి ఒక అధారిటీ అని ఘంటాపథంగా చెప్పగలను. ఆయన రాసినవీ, చెప్పినవీ కలబోస్తే ఈ రూపం వచ్చింది. చిత్తగించగలరు.

ఆకాశవాణి
దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. తెలుగువారయిన రావు బహదూర్ సీ వీ కృష్ణ స్వామి సెట్టి, మద్రాసులోనూ, మాంచెస్టర్ లోను విద్యాభ్యాసం చేసి 1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. ఆ నగర వీధులలో మొదటిసారి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన ఘనత కూడా వారిదే. 1910లో విమాన ప్రయాణం చేసిన తొలి భారతీయులలో ఆయన కూడా ఒకరు. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు. ఈ రేడియో క్లబ్ లో పుర ప్రముఖులు ఎందరో సభ్యులుగా వున్నప్పటికీ, ఆ సంస్థ కార్యదర్శిగా వున్న కృష్ణ స్వామి సెట్టి పాత్ర ప్రధానమైనది. రేడియో క్లబ్ నెలకొల్పాలని ప్రతిపాదించి, ఆ క్లబ్ ద్వారా ప్రసారాలు జరగడానికి ఆయన ఎంతో కృషి చేశారు. 1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై 31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. 1927 అక్టోబర్ లో మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మూతపడింది. కానీ, కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కాని ఆ ప్రసారాలు కూడా పరిమితమైనవే. ఈ ప్రసారాలలో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవు. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు చిత్తూరు, వేంకటగిరి మొదలయిన చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని అప్పటి వార్తల వల్ల తెలుస్తున్నది.
1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో 200 వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి 3 నుంచి అది నిజాం అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి.
1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే కేంద్రాన్ని (ప్రసారిణి) సరూర్ నగర్ ఓ ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు మొదలు పెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు చేసేవారు. అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు. రిలే స్టేషన్ (ప్రసారిణి) మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది. హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు. కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. మల్లి పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి.
1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం – భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)