25, మే 2016, బుధవారం

భారతీయ యోగా


పొందలేని దాన్ని సాధించగలగడాన్ని యోగం అంటారు.  ఉదాహరణకు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని సాధించడం అంత సులభం ఏమీ కాదు. సాధించాలంటే అందుకుతగ్గట్టుగా శరీరాన్ని  తయారు చేసుకోవాలి. ఈ సాధనే యోగా. ఈ సాధన చేసేవారిని పూర్వం యోగులు అనేవారు. యోగసాధన ద్వారా లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన వారిని యోగయుక్తులు అంటారు. లక్ష్యసాధన ఒక ఎత్తయితే, సాధించిన దాన్ని పదిలపరచుకోవడం మరో ఎత్తు. మొదటిది యోగం, రెండోది క్షేమం. ఈ 'యోగక్షేమాల' ప్రసక్తి భగవద్గీతలో కూడా వుంది. గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో  అంటాడు భగవానుడు అర్జునుడితో, " అనన్యాచింతయంతోమా యేజనాః పర్యూపాసతే,  తేషామ్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్" అని. అంటే  'వేరే ధ్యాస లేకుండా నన్నే తలుస్తూ, నన్నే ధ్యానిస్తూ పోతే వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను' అని స్తూలార్ధం. అలాగే,  'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే దానితో 'బాదరాయణ బ్రహ్మ సూత్రాలు' మొదలవుతాయి. ( ఈ బ్రహ్మ సూత్రాలు వేద వ్యాస విరచితమనీ, కాదు బాదరాయణుడు రాశాడనీ కొన్ని వాదాలు వున్నాయి. ఆ ఇద్దరూ ఒకరనే వాదం కూడా వుంది, అది వేరే విషయం) బ్రహ్మసూత్రాలలో చెప్పిన  అధాతో అంటే 'అటు పిమ్మట...'. శరీరాన్ని యోగాతో ఆత్మసాక్షాత్కారానికి అనువుగా 'మార్చుకున్న పిమ్మట' అని భాష్యం చెప్పుకోవచ్చు. శంకర భాష్యాన్ని ప్రముఖ పండితులు పుల్లెల రామచంద్రుడు తెనిగించి  పుణ్యం కట్టుకున్నారు. అందులోని జిజ్ఞాస అధికరణంలో ఈ యోగ ప్రసక్తి వుంది. ఈ యోగ సూత్రాలను  పతంజలి మహాముని  వెలికితీసి ఒకచోట గుదిగుచ్చి పంచాంగాలతో, కర్మ యోగము, రాజ యోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగములతో కూడిన 'యోగ దర్శనం'   తయారు చేశారు. అదే పతంజలి యోగశాస్త్రంగా ఈనాటికీ మన్ననలు అందుకుంటోంది.  పతంజలి యోగానికి ఇచ్చిన నిర్వచనం 'యోగసు కర్మ కౌశల్యం', 'చిత్తవృత్తి నిరోధం'. ఏ కర్మ (పని) చేసినా దాన్ని  నైపుణ్యంతో చేయడం, మానసిక చాంచల్యాలను జయించడం అని అర్ధం చెప్పుకోవచ్చు.


ఇందుకోసం ఆయన సాధన చతుష్టయాన్ని ప్రబోధించారు. నిత్యానిత్య వస్తువు వివేక జ్ఞానము, ఇహలోక పరలోక విషయం భోగ వైరాగ్యము, శమదమాది సాధన సంపద, మోక్షం పొందాలనే తీవ్రమైన వాంఛ- ఈ నాలుగు అలవరచుకుని యోగసాధన మొదలు పెట్టాలి. శమదమాది సాధన సంపద అంటే ఒకటి శమము( మనో నిగ్రహము), రెండు  దమము ( బాహ్య ఇంద్రియ నిగ్రహము ) మూడు  ఉపరతి (విషయాలనుంచి వెనక్కు మరలడం) నాలుగు తితిక్ష (సహనం), అయిదు  శ్రద్ధ (శాస్త్రాదుల పట్ల పరిపూర్ణ విశ్వాసం).  ఈ అయిదూ యోగసాధకుడికి అత్యవసరం. బ్రహ్మ సూత్రాలలో చెప్పిన మొదటి సూత్రం 'యధాతో బ్రహ్మ జిజ్ఞాస' అంటే అటు పిమ్మట అనేది, 'ఈ అయిదూ సాధించిన' పిమ్మట అనేది గ్రాహ్యం. తద్వారా  ఆత్మ సాక్షాత్కార సాధన సులభం అవుతుంది. ఈ నైపుణ్యం అలవరచుకోవడం కోసం కర్మయోగాది పంచ యోగాలు ఉపయోగపడతాయి. కర్మ, రాజ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు కర్మతో మొదలయి జ్ఞానంతో అంతమవుతాయి.  ఈ జ్ఞాన సాధనతో యోగి యోగయుక్తుడు/ యోగసిద్ధుడు కాగలుగుతాడు.
పతంజలి చెప్పిన అష్టాంగయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి విభాగాలు వున్నాయి.
ఇవన్నీ సరే, మామూలు మనిషికి ఇవన్నీ యెందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

మానవ శరీరం శాశ్వితం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించి  పోయేదే. జీవుడు శాశ్వితం. అతడికి నాశనం లేదు. కానీ శరీరాన్ని ఆవహించుకుని వున్న జీవుడికి ఆ తాత్కాలిక ఆవాసం మీదనే మోజు. తద్వారా సంప్రాప్తించిన సుఖ దుఃఖాలతో మునిగితేలుతుంటాడు.  ఈ అజ్ఞానం తొలగగానే లౌకిక  వ్యవహారాలను  నిర్లిప్త వైఖరితో పరికించే స్తితి వస్తుంది. ఇట్టి స్తితికే ముక్తి,  కైవల్యం, అపవర్గం అని పేర్లు. ఇలాటి స్తితిని దేహం వుండగానే చేరుకోగలిగితే అది జీవన్ముక్తి అనిపించుకుంటుంది. ఈ యావత్ యోగ సాధన అంతా ఈ స్తితికి చేరుకోవడం కోసమే.

24, మే 2016, మంగళవారం

నరేంద్ర మోడీ - ప్రధానిగా రెండేళ్ళు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 26-05-2016, THURSDAY)

సూటిగా....సుతిమెత్తగా....





“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ  పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి.  పేరు సుహేల్ సేథ్. 
ఈయనకు బహుముఖాలు వున్నాయి.  ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ  పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న  విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్  బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ  జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ  కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  
రెండేళ్ళక్రితం నరేంద్రమోడీ ప్రధాన మంత్రి కాగానే ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని  గొప్ప కితాబు ఇచ్చారు.
“ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన  ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. ఇది మరో వాస్తవం’ అంటారు సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం వుందనుకోను. ఆయనే  స్వయంగా చెప్పుకున్నట్టు  ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్  మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు. కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో దాగున్న  సమర్ధ రామదాసు మనకు కనబడతాడు. 
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది. 
“మోడీ గుజరాత్ సీతయ్య.  కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
“ఉదాహరణకు రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
అంతే కాదు, మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఆ రాష్ట్రంలో లేదు. మిగులు విద్యుత్ తో రాష్ట్రం వెలిగి పోయింది.”
మోడీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే రెండక్షరాలు  ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. రెండేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది మూడేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మధ్యలో రెండేళ్ళు. అందులో రెండో ఏడు కేవలం లెక్కకే.  ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
ప్రధానిగా మొదటి ఏడాది నిరుడు పూర్తి చేసుకున్నప్పుడు మోడీ మీద జనం అభిప్రాయాల్లో మార్పులేదు. 2014లో అఖండ మెజారిటీతో  మోడీకి పట్టం కట్టేటప్పుడు జనంలో ఆయన పట్ల ఎలాంటి నమ్మకం, విశ్వాసం వున్నాయో అవి అలాగే   ఏమాత్రం చెక్కు చెదరకుండా వున్నాయి. ఎంతటి సమర్ధుడికయినా చెప్పినవన్నీ చేసి చూపించడానికి ఒక ఏడాది కాలం చాలా తక్కువ అని జనసామాన్యంలో వున్న అభిప్రాయమే అందుకు కారణం.
అందరికీ  గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిరుడు ఇదే రోజుల్లో దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు. 
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు  తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు.  మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
“ఇవన్నీ  ప్రారంభం మాత్రమే. దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. మీరు కలలు కంటున్న మంచి భారతాన్ని మనం కలిసి నిర్మించుకుందాం. ఈ విషయంలో మీ సంపూర్ణ సహకారం, మద్దతు  నాకు లభిస్తుందన్న విశ్వాసం నాకున్నది’ అంటూ ప్రధాని తన లేఖ ముగించారు.
ఈ మాటలు చెప్పిన తరువాత  మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున  జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే,  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
రాజకీయుల దగ్గర లేని ఆయుధం ప్రజల దగ్గర వుంది. తమను ఏమార్చే పాలకులను  అయిదేళ్ళకోమారు సుతారంగా మార్చగల ‘ఓటు’ అనే బ్రహ్మాస్త్రం తమ వద్ద వుందన్న ఎరుక ఇప్పుడు జనంలో వుంది. వారికి ఈ విషయం తెలుసన్న సంగతి పాలకులే తెలుసుకోవాలి.
ఉపశృతి:
నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత
 విడ్డూరంగా వుంటాయి.
మోడీ గురించిన అలాంటి ఒక నిజం చెప్పుకుందాం.
1990 వ సంవత్సరం.
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా పాతికేళ్ళ కిందటి ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే  మళ్ళీ  అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు  అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా  జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని వాళ్ల బెర్తుల్ని  దర్జాగా ఆక్రమించుకున్నారు. రాజకీయనేతలు కదా! పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయి   లేకుండా పెద్ద గొంతుకతో, అసభ్య పదజాలంతో  సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతపెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో తారసపడ్డారు. రాత్రి అనుభవం ఇంకా  మనసులో పచ్చిగా  వుండిపోవడంతో  యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత  ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవన వాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ  నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ.  శిక్షణ కోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల  రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ, మర్యాదకు  వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు  శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
అంతే ఈ కధ.
మోడీ ప్రధానమంత్రి అయిన తొలి రోజుల్లో ఆ  రైల్వే  అధికారిణి రాసిన ఈ కధనం ఆంగ్ల దిన పత్రిక  హిందూలో వచ్చింది.
ప్రధానమంత్రి హోదాలో  వున్న ఇప్పటి నరేంద్ర మోడీ గురించి కూడా అలాంటి  ఒక గొప్ప కధనం చదవాలని, వినాలని ఎవరయినా కోరుకుంటే అది అత్యాశ మాత్రం  కాదు. కానీ అలాంటి అవకాశం ఇప్పుడు వుందా అంటే ఆయన  అభిమానులకి  కూడా అనుమానమే.
మరో  మూడేళ్ళ  వ్యవధానం వుంది కదా! వేచి చూద్దాం!
(25-05-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595   




23, మే 2016, సోమవారం

ప్రెస్ క్లబ్


హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. కొత్త కార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు.
గతంలో నేను ఒకసారి క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. మరోసారి ఓడిపోయాను.
గెలిపించింది నా క్లబ్ కుటుంబసభ్యులే. ఓడించింది ఆ  కుటుంబ సభ్యులే. కాబట్టి ఆ జయాపజయాలను నేను ప్రతిష్టగా తీసుకోలేదు. హాయిగా అప్పుడప్పుడూ క్లబ్  కి వెళ్లి వస్తూనే వున్నాను. అందర్నీ పలకరిస్తున్నాను. వాళ్ళూ నేనంటే అంతే ఆప్యాయంగా, కొండొకచో గౌరవంగా వుంటున్నారు.
కావున నా మనవి, నా సలహా ఏమిటంటే అందరూ కలిసివుండండి. అందర్నీ  కలుపుకు పొండి. పదవుల్లో ఎవరు వున్నా  క్లబ్ అందరిదీ  అనుకుంటే నాలుగు మంచి పనులు చేసి చూపించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది.
జర్నలిష్టులకు వృత్తి రీత్యా రాజకీయవాసనలు తప్పనిసరి. వాటిని క్లబ్ బయటే ఒదిలి లోపలకి వస్తే ఏ చిక్కూ ఉండదు.
గొప్ప క్లబ్ లో సభ్యులం అని నలుగురూ చెప్పుకుంటుంటే వినాలని కోరుకుందాం.  ఆ గొప్పతనంలో వున్న మాధురిమను అందరం ఆస్వాదిద్దాం.

గెలిచిన  వారికి అభినందనలు. గెలవని వారికి శుభాకాంక్షలు.   

21, మే 2016, శనివారం

పనిలేని మనుషులు


ఎయిర్ టెల్ మొబైల్  బిల్లు కట్టాలని మా ఇంటికి దగ్గరలో జూబిలీ  హిల్స్ రోడ్  నెంబర్ 36 లో వున్న వాళ్ళ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి వెళ్ళడం  కొత్తాకాదు, అక్కడి అనుభవం కొత్తాకాదు. మొత్తం ఎయిర్  కండిషన్డ్  ఆఫీసు. ఎయిర్ లైన్స్  ఆఫీసును తలదన్నేలా చక్కటి అందమైన యూనిఫారాల్లో అయిదారుగురు అమ్మాయిలు కంప్యూటర్ల వెనుక గేములుఆడుకుంటూ వున్నట్టు కానవస్తారు.  బిల్లు కట్టాలని అడగగానే, జవాబు చెప్పడానికి కూడా ఓపిక లేనట్టు  ఒక మూలన వున్న ఆటో బిల్లింగ్ పేమెంట్ మిషన్ వైపు చేయి చూపిస్తారు. ఆ మిషన్ దగ్గరికి వెడితే అది యక్ష ప్రశ్నలు వేసి అసలు పేమెంటు చేసే సమయానికి ‘సర్వర్ డౌన్’ అంటుంది. ఇదేమిటని  ఆ అమ్మళ్ళని అడిగితె, ‘సర్వర్ డౌన్ అయితే మేమేం చేస్తాం, వెయిట్ చేయండి’ అంటూ నోటితో కాకుండా సైగలతోనే  జవాబు చెబుతారు. నోరు తెరిస్తే  నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు.
పది నిమిషాలు గడిచినా సర్వర్ డౌన్ విషయంలో  ఏమీ తేడా లేదు. అక్కడి ఉద్యోగినుల వైఖరిలో కూడా తేడా లేదు.
ఓ పది నిమిషాలు చూసి, అద్దాల తలుపులు తెరుస్తూ, మూస్తూ వున్న వాచ్ మన్ ని  పిలిచాను. అక్కడ వున్నవాళ్ళందరూ (కావాలనే పనిచేసేవాళ్ళు అనడం లేదు) వినేట్టు అతడితో చెప్పాను.
“ఇదిగో నా బిల్లు మొత్తం. ఆ  సర్వర్ మళ్ళీ ఉపయోగంలోకి వస్తే ఈ డబ్బు కట్టు. ఒకవేళ కట్టక పోయినా నేనేమీ బాధపడను, ఎందుకంటే బిల్లు కట్టడానికి వచ్చిన వాళ్ళను  ఈ ఆఫీసు వాళ్ళు పెడుతున్న బాధకంటే అదేమీ ఎక్కువకాదు.” అంటూ బిల్లు డబ్బులు అతగాడి చేతిలో పెట్టి చక్కా  వచ్చేశాను.
వాచ్ మన్   మంచి వాడిలాగా వున్నాడు. బిల్లు కట్టినట్టు సాయంత్రానికి మెసేజ్ వచ్చింది. అతడి మంచితనం అర్ధం అయింది.
కానీ అర్ధం కానిదల్లా ఒక్కటే.

వేలకు వేలు  జీతాలు తీసుకునే  అక్కడి ఉద్యోగులు, బిల్లు కట్టాలని వచ్చే వారికీ ఆ మాత్రం సాయం చేయలేరా? 

       

రాజీవ్ గాంధీ - ఓ జ్ఞాపకం


(ఈరోజు రాజీవ్ వర్ధంతి)
ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ.
ఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని అంజయ్యగారికి ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  ఆయనగారికి క్షణం తోచేది కాదు. ‘శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట.

లాకేత్వం, దక్కొమ్ము


‘ఆయన దగ్గరకు సాయానికి వెళ్ళకు, లాకేత్వం, దక్కొమ్ము బాపతు’ అనే వాళ్ళు  మా చిన్నప్పుడు.
కాస్త పెద్దయిన తరవాత కానీ అందులోని  అర్ధం బోధపడలేదు.
అంటే ఏమీ లేదు. లేదనే.
‘లా’ కు ఏత్వంఅంటే ‘లే’, ‘ద’ కు కొమ్మంటే ‘దు’. ‘లేదు’.
లేదు, కాదు అనేవాడి దగ్గరికి పోయి ఏం లాభం అని ప్రతిపదార్ధ తాత్పర్యం.
మరి అడగందే అమ్మయినా పెట్టదంటారు. అటువంటప్పుడు అడక్కపోతే ఎలా అని లా పాయింటు తీసేవాళ్ళు వున్నారు.
నిజమే. పని వున్నప్పుడు ఆ పని చేసిపెట్టేవాడిని అడగాలి.
అయితే కొన్ని చేసే పనులు వుంటాయి. కొన్ని కాని పనులు వుంటాయి. మరికొన్ని ‘కాని’ పనులూ వుంటాయి. అంటే, చేయకూడనివి, చేయరానివి అని అర్ధం.
కొందరు చేయగలిగిన చేవ కలిగిన వాళ్ళుంటారు. కొందరు చేయలేకపోయినా ఆ చేవకు కొదవుండదు.
కొందరు చేయగలరు. కానీ చేసే చొరవ, చేవా రెండూ వుండవు.
మరికొందరు చేయలేరు, కానీ పనులు చేయించే చొరవ, చేవ రెండూ పుష్కలం.
ఇక చేయగలిగీ చేయను అనే మొండి రకం, చేయలేను, నా వల్ల కాదు అని మర్యాదగా తప్పుకునే రకం కూడా తారసపడుతుంటారు.
చేస్తాను, చెప్పండి అదెంత పనంటూ చిటికెలు వేసి పని కాకపోవడానికి కారణం ఆయన మాత్రం కాదని మనచేతనే  నమ్మించే మనుషులూ మన మధ్యనే వుంటారు.
ఒకర్ని అపర శ్రీరామచంద్రులు,  నిప్పులాంటి వాళ్ళు, నిజాయితీకి నిలుటద్దాలు అంటాము.
ఇంకొకర్ని సమర్ధ రామదాసులు అని పిలుస్తాము.
మొదటి వారిని బయట వాళ్ళు మెచ్చుకుంటే ఇంట్లోవాళ్ళు పనికిరాని రకంగా లెక్క గడతారు.
రెండో రకం వారిని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే, పనులు చేయించుకున్న తరువాత  బయట వాళ్ళు, ‘ఒట్టి లంచావతారం’ అనే పేరు పెట్టేస్తారు. 

   
ఈ మధ్య ఇంకో థియరీ వినబడుతోంది.
‘లేదు, నా వల్ల కాదు’ అని మొదట్లోనే అంత్య నిష్టూరపు బాణీ ఎత్తుకోవాలని మేనేజిమెంటు పాఠాల్లో మొదటే చెబుతారని విన్నాను.
‘నో’ చెప్పగలిగిన వాడు సిబ్బంది చేత పనులు బాగా చేయిస్తాడని  అదో నమ్మకం.
‘చచ్చినా సెలవు ఇవ్వను’, ‘అరిచి గీ పెట్టినా జీతం పెంచను’, బహుశా ఇలాంటి ‘నో’లు కాబోలు.
సరే! ఇది ఇలా ఒదిలేద్దాం.
ఒక్కటి మాత్రం నిజం.

‘నో’ చెప్పిన వాడ్ని మిత్రుల జాబితా నుంచి తొలగించడం అంటే మన స్నేహంలోనే  ఏదో స్వార్ధం వుందనుకోవాలి.  

NOTE: COURTESY IMAGE OWNER

బీభత్సం


కోళ్ళ ఫారం వంటి  అపార్ట్ మెంట్లలో వుంటే  ఇలానే వుంటుంది.
హోరు గాలికి టపటపా కొట్టుకునే కిటికీ తలుపులు మూసుకోవడం, పిక్కటిల్లేలా వినబడే ఉరుములు,  పిడుగుల చప్పుడు వినబడకుండా చెవులు మూసుకోవడం, ఈ వర్షంలో పైన మొక్కలకి నీళ్ళు పోసే పని తప్పిందని సంతోష పడడం, కరెంటు, నెట్టూ వుంటే ఆ అనుభూతుల్ని కవితలుగా చెక్కడం. అంతే!
వాన పడితే కరెంటు  పోతుంది. జనం అలవాటు పడ్డ ఓ వాస్తవం. వాన వస్తుందేమో అనుకున్నా సరే, కేబుల్ టీవీ ఆగిపోవడం అనేది అలాంటి మరో పచ్చి నిజం.
గాలి వానకి రాత్రి చాలా సేపు  కరెంటూ లేదు, రాత్రంతా టీవీ లేదు.
పొద్దున్న పేపర్లో చూసేదాకా రాత్రి నగరంలో గాలి వాన  సృష్టించిన బీభత్సం తెలియదు. అంచేతే, ఆకాశంలో యుద్ధం కవితలో  అర్జునుడి పేర్లలో ఫల్గుణ, పార్ధివ వరకు రాసి, బీభత్స అనే మరో పేరు రాయలేదు.
ఇప్పుడు తెలుస్తోంది, పత్రికల్లో ఫోటోలు చూసిన తరువాత.








విరిగిపడ్డ చెట్లు, కూలిన కరెంటు స్తంభాలు, నడిరోడ్లపై కార్లపై పడ్డ హోర్డింగులు.
రాత్రి యుద్ధంలో బీభత్సుడు కూడా పాల్గొన్నాడని, పేరుకు తగ్గట్టే విధ్వంసం సృష్టించాడని.  

(21-05-2016)