16, మార్చి 2016, బుధవారం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ – కొన్ని జ్ఞాపకాలు


(ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన సూవెనీర్ ను తెలంగాణా పురపాలక శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు బుధవారం సాయంత్రం (15-03-2016) విడుదల చేశారు. క్లబ్ తో  వివిధ హోదాల్లో నాకున్న అనుబంధం గురించిన వ్యాసాన్ని  అందులో  ప్రచురించారు. అదే ఇది.)
“ఎంతటి పెద్ద సంస్థ అయినా చిన్నగానే మొదలవుతుంది. ఈనాడింత గొప్పగా హైదరాబాదులో ఒక లాండ్ మార్క్ మాదిరిగా  పేరు తెచ్చుకున్న ప్రెస్ క్లబ్  పుట్టుక కూడా అంతే. బషీర్ బాగ్ చౌరాస్తాకు దగ్గరలో ఫతే మైదాన్ వద్దనరసంచారం అంతగా కనబడని ప్రాంతంలోయాభయ్ ఏళ్ళ క్రితం ఒక చిన్న రేకుల షెడ్డులో పురుడు పోసుకుంది. ప్రెస్ క్లబ్ ఏర్పడిన పదేళ్లకు కాబోలు నేను రేడియో విలేకరిగా 1975 లో హైదరాబాదులో పాదం మోపాను.  ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టిన వేళావిశేషం ఎట్టిదో కానీదానితో నా అనుబంధం నేటికీ కొనసాగుతూనే వస్తోంది.
”హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగాక్లబ్ ఉపాధ్యక్షుడిగాక్లబ్ కార్యదర్శిగావివిధ హోదాల్లో అనేక దశాబ్దాలపాటు ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.
“వార్తా పత్రికల్లో పనిచేసే సిబ్బందిలో ప్రత్యేకించి విలేకరులకు ప్రెస్  క్లబ్ తో సాన్నిహిత్యం ఎక్కువఎందుకంటె  మోస్తరు విలేకరుల సమావేశాలకు అదే నెలవు. పగలు విధి  నిర్వహణ కారణంగా ప్రెస్  క్లబ్ కి వెళ్ళే విలేకరులకు సాయంత్రం కాలక్షేపాలకు కూడా అదే విడిది.
”ప్రెస్ క్లబ్   బషీర్ బాగ్ ప్రాంతంలో వున్నప్పుడు నేను పనిచేసే ఆకాశవాణి కేంద్రం దానికి కూతవేటు దూరంలో లేదా నడిచి వెళ్ళగలిగేంత దాపులో  వుండడం కూడా క్లబ్ తో నా అనుబంధం బలపడడానికి దోహదం చేసి వుంటుంది. చిన్నపాటి విలేకరుల సమావేశాలే కాకుండా ముఖ్యమంత్రులువిదేశీ అతిధులుప్రముఖ క్రీడాకారులుఉన్నతాధికారులతో మీట్  ది ప్రెస్ పేరిట జరిగే సమావేశాలు కూడా ప్రెస్ క్లబ్ లోనే జరిగే సాంప్రదాయం కారణంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనతి కాలంలోనే నగరంలో ఒక ముఖ్యమైన లాండ్ మార్క్ హోదాను సముపార్జించుకుంది.
“అనేక మంది ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే తొట్టతొలి మీట్ ది ప్రెస్ అక్కడే జరిగేది. నాకు తెలిసి దాదాపు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక సందర్భంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ని సందర్శించి విలేకరులతో మాటామంతీ సాగించిన వాళ్ళే.


“అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. కపిల్ దేవ్క్లైవ్ లాయడ్అజహరుద్దీన్ఎం.ఎల్. జయసింహఎంపైర్ రామస్వామి వంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు హైదరాబాదు ప్రెస్ క్లబ్ ని సందర్శించడం నాకెరుక. క్లబ్ తరపున నిర్వహించిన సార్క్ మీడియా టోర్నమెంటు క్లబ్ చరిత్రలో ఒక ముఖ్యమైన పుట. చెన్నైలోని అమెరికన్  ఎంబసీ సహకారంతో హైదరాబాదులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై  ఒక సదస్సు నిర్వహించడం జరిగింది.
“సదస్సు అనగానే తటాలున ఒక విషయం గుర్తుకు వస్తుంది.
“క్లబ్ స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భం పురస్కరించుకుని రజతోత్సవాలు జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. అప్పుడు కార్యదర్శి ఎం.ఎస్. శంకర్. నేను వైస్ ప్రెసిడెంటుని. ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందుకు వచ్చి సహాయ హస్తం అందించే వ్యక్తి జ్వాలా నరసింహా రావు. మా ముగ్గురికీ ఒక ఆలోచన వచ్చింది. ఎన్నికల సంస్కరణలపై ఒక సదస్సు నిర్వహించిఆనాడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనరుగా వున్న శేషన్ తో కీలక ప్రసంగం ఇప్పిస్తే యెట్లా ఉంటుందని. అనుకున్నదే తడవుతన ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్ళిన జ్వాలా పనిగట్టుకుని వెళ్లి శేషన్ ని కలిసి విషయం ఆయన చెవిన వేసాడు. తరువాత కొద్ది రోజులకే శేషన్ హైదరాబాదు వచ్చి రాజభవన్  గెస్ట్  హౌస్ లో  విలేకరుల సమావేశం పెట్టారు. అది కాగానే వెళ్లి ఆయన్ని కలవాలని మా ప్లాను. అయితే ఆరోజు విలేకరుల మీద ప్రత్యేకించి ఫొటోగ్రాఫర్ల మీద ఆయన  విశ్వరూపం ప్రదర్శించడం చూసి మేమే సంకోచించి ఆయన్ని కలవాలనే ఉద్దేశ్యం  విరమించుకోవాలనుకున్నాం. ఇంతలో ఒక అధికారి వచ్చి
శంకర్ ఎవరుశేషన్ గారు రమ్మంటున్నారు అని పిలిచాడు. ముగ్గురం తటపటాయిస్తూనే లోపలకు వెళ్లాం. బయట చూసిన మనిషికీలోపల మమ్మల్ని ఆయన పలకరించిన తీరుకూ హస్తిమ శకాంతరం తేడా కనిపించింది. ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, కూర్చోబెట్టి  వివరాలు అడిగి తెలుసు కున్నారు. అప్పటికే  గదిలో వున్న ఒక వ్యక్తిని చూపెడుతూ, ‘నాకు ఇంగ్లీష్  నేర్పిన గురువుగారు అంటూ మాకు పరిచయం చేసారు. పేరు వినగానే మాకు అర్ధం అయిందిహిందూ ఆంగ్ల దినపత్రికలో వారం వారం నో యువర్ ఇంగ్లీష్ శీర్షిక రాసేది ఆయనే అని.
“మా సదస్సుకు రావడానికి దాదాపు అంగీకరించినట్టే మాట్లాడారు.
“ఈలోగా అనుకోని పరిణామం సంభవించింది. శేషన్  బహిరంగ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. పత్రికలు విషయం పేర్కొంటూ , ‘న్యాయస్థానం శేషన్ ని నోరు మూసుకోమందని అభివర్ణించాయి. దాంతో  శేషన్ ప్రసంగం లేకుండానే ప్రెస్ క్లబ్ కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది.
“రవీంద్రభారతిలో కవి సమ్మేళనం బాధ్యత సీనియర్ సభ్యుడు డి. వెంకట్రామయ్య భుజాన వేసుకుంటేఉర్దూ ముషాయిరా నిర్వహణను మరో సీనియర్  మోహన్ దివాకర్ తన భుజస్కంధాలకు ఎత్తుకున్నాడని నాటి విషయాలను  సోమశేఖర్ గుర్తు చేసుకున్నాడు.  అప్పట్లో జనం  ఘనంగా చెప్పుకునే కలర్ టీవీని ఈసీఐఎల్ వాళ్ళు క్లబ్ కి కానుకగా ఇవ్వడంఓసారి క్లబ్  కు వచ్చిన స్టేట్ బాంక్ సీజీఎం శ్రీ పురోహిత్ అక్కడికక్కడే క్లబ్ కి  కావాల్సిన ఫర్నిచర్ ని విరాళంగా ప్రకటించడం మరి కొన్ని జ్ఞాపకాలు. అలాగే క్లబ్ సోమాజీ గూడాకు మారినప్పుడుఓసారి కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు  టేబుల్ టెన్నిస్ పరికరాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నేను వెంటనే రోజుల్లో స్పోర్ట్స్ అధారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి ఫోను చేసి టెన్నిస్ టేబుల్ విరాళంగా ఇవ్వడానికి వీలు పడుతుందా అని అడిగాను. దానికి ఆయన జవాబుగా, ‘అక్కడ (క్లబ్ లో ) ఎంతసేపు వుంటారని అడిగారు. బహుశా తనిఖీ చేయడానికి వస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఆయనఉద్దేశ్యం వేరు.  మేము అడిగినవన్నీ అదే రోజు క్లబ్ కి చేర్పించేసారు.
“ఎంపీ రవీంద్రనాథ్ములుగు సోమశేఖర్ఎమ్మెస్ శంకర్దేవులపల్లి అమర్వల్లీశ్వర్నగేష్ కుమార్ మొదలయిన వారితో కలిసి అనేక కార్యవర్గాల్లో పనిచేసే అవకాశం నాకు లబించింది. ఒక ఏడాది క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఏడాది కార్యవర్గ సభ్యుల సహకారంతోక్లబ్ లో సభ్యుడే ప్రధానం (Member is supreme) అనే నినాదంతో  చేయగలిగిన కొన్ని మంచి పనులు చేసి చూపించడం జరిగింది. వాటిని పేర్కొంటే స్వోత్కర్ష అవుతుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రవాహం వంటిది. దానిమీద ఎవరిదో ఒకరి ముద్ర వేయాలని ప్రయత్నించడం వృధా. ఒక వేళ వేయాలని అనుకున్నా సాగే ప్రవాహంపై అది నిలవదునిలబడదు.
“అందుకే ఒక మాట. ప్రెస్ క్లబ్ ఈనాడు ఇంతటి ఉచ్ఛస్థితిలో వుందంటే దానికి కారణం సభ్యులుగాహితైషులుగా ఉంటూ వస్తున్న ఎందరో మహానుభావులు.
“వారందరికీ వందనాలు.(16-03-2016)

నైతిక పరాజయమా! సాంకేతిక విజయమా!

సూటిగా.........సుతిమెత్తగా...........భండారు శ్రీనివాసరావు

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 17-03-2016, THURSDAY)
  
“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో   శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన  ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మ సూక్ష్మం ఇందులో దాగుంది.
అంధ్రప్రదేశ్ శాసనసభలో పాలక ప్రతిపక్షాల నడుమ సాగుతున్న ‘నీదా నాదా పైచేయి’ క్రీడలో అడుగడుగునా ఇది ప్రతిఫలిస్తోంది.  ముందు ప్రభుత్వంపై, ఆపై అసెంబ్లీ స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ, ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగిన తీరు తెన్నులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 


సరే! సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానాలు ఎటుతిరిగీ  నెగ్గవన్న సంగతి ముందే తెలుసు కనుక ఫలితంపై  ఎవ్వరికీ ఆసక్తి లేదు. పెట్టింది అవిశ్వాసమైనప్పటికీ,  కట్టు తప్పి గోడదూకిన తన సభ్యులపై అనర్హత వేటు వేయించడానికే ఇదంతా అన్న తన మనసులోని ఆలోచనను ప్రతిపక్షం  దాచుకోలేదు. అయితే,  చర్చదాకా వచ్చినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడమే ప్రధానాస్త్రంగా ప్రయోగించాలని తలపెట్టడం ఆ పార్టీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు వేయించాలని చేసిన ప్రయత్నం యావత్తు, తీర్మానంపై జరిగిన ఓటింగు సమయంలో డివిజన్ కు పట్టుపట్టకపోవడంతో నిరర్ధకమైంది. దాన్ని తనకు అనువుగా వాడుకుని పాలక పక్షం మూజువాణీ ఓటుతో తీర్మానాన్ని వీగిపోయేట్టు చేసి, వ్యూహాత్మకంగా పావులు కదపడంలో తనదే పైచేయి అని నిరూపించుకుంది.
పొతే చర్చ సందర్భంగా ఉభయ పక్షాల నడుమ సాగిన వాగ్యుద్ధంలో నైతిక విలువలు పూర్తిగా పక్కకు తప్పుకుని, సభామర్యాదలు సంపూర్తిగా  మంట కలిశాయి. ఈ విషయంలో పాలకపక్షం కొంత  సంయమనంతో వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వీక్షకులకు కలిగింది. కాకపొతే, ముందే చెప్పినట్టు, కదనరంగంలో  ధర్మాధర్మాల ప్రసక్తికి  తావుండదు. అక్కడ  విజయమే ప్రధానం.  
ఈసారి ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డి పూర్తిగా సంసిద్ధమై వచ్చి తన వాదనను బలంగా వినిపించ గలిగిన పరిణతిని ప్రదర్శించారు. అయితే, ఈ పరిణతి,  ప్రసంగ సందర్భంగా వాడిన  పదజాలం కారణంగా పలచ పడిపోయింది.  ముఖ్యమంత్రిని, సభానాయకుడిని  ఏకవచనంలో సంబోధించడం సభామర్యాద కాదు, ఈ పద్దతిని ఆయన  సరిదిద్దుకుంటే బాగుండునన్న భావం టీవీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నవారిలో  కలిగింది. అయితే, అదేసమయంలో, కొందరు పాలకపక్ష సభ్యులు, ఆయనపై  ఎదురుదాడికి దిగిన క్రమంలో దొర్లిన అసభ్య పదాలు విన్న తరువాత, సభా మర్యాదలను  గాలిలో కలపడంలో తామూ తక్కువ తినలేదని నిరూపించుకోవడంలో  కృతకృత్యులయ్యారు. మరి, ఇక్కడా విజయమే ప్రధానం కదా!
ఇక ప్రతిపక్ష  వైఎస్ఆర్ సీపీ సహజంగానే తనకు దొరికిన సమయాన్ని ప్రభుత్వంపై తాను ఇన్నాళ్ళుగా చేస్తూ వస్తున్న ఆరోపణలను పునశ్చరణ చేయడానికే ఉపయోగించుకుంది. వీటిలో నవ్యత్వం లేకపోయినా  అవే  ఆరోపణలను  అసెంబ్లీ వేదికగా చేసి రికార్డులకెక్కేలా చేయాలనే ఆ పార్టీ ధ్యేయం కొంతవరకు నెరవేరింది. పదేపదే చేస్తున్న ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలత పెట్టి వుంటాయి. ఆరోపణలకు ఆధారాలు చూపించాలనీ, వాటిని  సభాముఖంగా నిరూపించిన తరువాతనే  ముందుకు పోవాలని ఆయన  ప్రతిపక్ష నేతకు సవాలు విసిరారు. చంద్రబాబు విసిరిన ఈ సవాలుతో కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీల నడుమ సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెర పడబోతున్నదేమో అనే చిరు ఆశ కలిగిన మాట నిజం.
అయితే అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉండవచ్చు, వుండకపోవచ్చు. కానీ, వాటిని అసెంబ్లీలో నిరూపించగలగడం అసాధ్యమైన వ్యవహారం. అందుకే తెగుతుందనుకున్న ఈ వ్యవహారం, ప్రతిపక్షం సీబీఐ దర్యాప్తుకోసం పట్టుబట్టడంతో  ముడి విడలేదు సరికదా మరింత బిగుసుకుంది.    
చర్చ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని సమర్ధవంతంగా సభ దృష్టికి తీసుకు రావడానికి ప్రతిపక్షానికి ఇదొక సదవకాశం. అలాగే వాటి గురించిన సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వానికి కూడా అసెంబ్లీని మించిన వేదిక మరోటి వుండదు. అయినా కానీ ఉభయపక్షాలు ఈ విషయంలో వైఫల్యం చెందాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంత జరిగిన తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.                     
ఈ అవిశ్వాస తీర్మానాలు ఒక విషయాన్ని స్పష్టం చేసాయి. వై ఎస్ ఆర్ సీపీ నాయకత్వం ఈసారి విషయాలను సాకల్యంగా అధ్యయనం చేసి సభకు వచ్చిన మాట వాస్తవమే అయినా అనుభవలేమి ఆ పార్టీకి అడ్డుగోడగా నిలిచింది. అనుభవం పుష్కలంగా వున్న టీడీపీ నాయకత్వం నిబంధనలను అడ్డుపెట్టుకుని, సాంకేతిక కారణాలను సాకుగా చూపి మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఇది మరింత తేటతెల్లం అయింది. తీర్మానం చర్చకు తీసుకోవడానికి పద్నాలుగు రోజుల వ్యవధి ఇవ్వాలనే నిబంధనను అప్పటికప్పుడే మూజువాణీ ఓటు ద్వారా సస్పెండు చేసి, ప్రతిపక్షానికి కాలూ నోరూ కూడదీసుకునే వ్యవధానం ఇవ్వకుండా ప్రభుత్వ పక్షం చర్చను చేపట్టిన తీరు ఇందుకు ఉదాహరణ.   నిజానికి ఈ అవిశ్వాస తీర్మానాలను లెక్క చేయాల్సిన పరిస్తితి పాలక పక్షం టీడీపీకి  లేదు. సంఖ్యాబలం పుష్కలంగా వున్నప్పుడు వాటిని ఖాతరు చేయాల్సిన అవసరమూ లేదు, అగత్యమూ లేదు. అయినా ఈ రెండు పార్టీలకి ఎందుకింత పట్టుదల అంటే ఒకటే కారణం. వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మందిపై అనర్హత వేటు పడేలా చూడడం వైసీపీ ప్రధాన ధ్యేయం అయితే,  ఆ వేటు  పడకుండా వారిని కాపాడుకోవడం టీడీపీ లక్ష్యం. ఈ విషయంలో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అనర్హత వేటు పడకుండా చూడగలిగితే తమ పార్టీలోకి మరిన్ని వలసలు పెరిగే అవకాశం వుంటుందన్న ఆశ కూడా ఇందుకు దోహదం చేసి వుండవచ్చు.
అవిశ్వాస తీర్మానం మళ్ళీ ఆరు మాసాల దాకా పెట్టేందుకు వీలులేదు. ఒకరకంగా వై ఎస్ ఆర్ సీపీకి ఇదొక  ఇబ్బందే.  అయినా సరే, రాజ్యాంగపరంగా  తనకున్న ఈ వెసులుబాటును ఆ పార్టీ ఇప్పుడే వాడేసుకుంది. కారణం, రాజకీయ అనివార్యత. కట్టు దప్పిన తన ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు పడేలా చూడకపోతే, పార్టీలో పడ్డ గండి మరింత పెద్దది అయ్యే ప్రమాదం పొంచి వుంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇంత ప్రయాస, ఇంతటి లాయలాస.
ప్రజలు, ప్రజాసమస్యలు అనేవి రాజకీయులకు ఊతపదాలు. ఉపన్యాసాలవరకే అవి పరిమితం. వారికి, వారి పార్టీలకి రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ చివరిలో తనను గురించి చెప్పుకున్నసంగతులు  ఆయన జీవితంలో ఇంతవరకు నలుగురికీ తెలియని విషయాలను ఆవిష్కరించాయి. గత కాలంలో, అంటే ఆయన చిన్నతనంలోని దుర్భర పరిస్తితులు ఈనాటి తరానికి తెలియని విషయాలు. నడిచి వచ్చిన దారిలో అడ్డుపడిన ముళ్ళ కంపలు ఆయనకు  ఇప్పటికీ గుర్తున్నాయి. కలతపెట్టే సంగతులే అవి. అయితే,  చర్చ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు మనస్తాపం కలిగించేవి కావచ్చు కానీ, ప్రజాజీవితంలో కొనసాగుతున్నప్పుడు అవి  గుర్తుంచుకోవాల్సిన విషయాలే.
   
ఉపశృతి: ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం అంటారు.  ఎందుకో ఇది వినడానికే విడ్డూరంగా వుంటుంది. ప్రతిపక్షానికి పాలకపక్షంపై అవిశ్వాసం, అపనమ్మకం వుండక ప్రేమ ఎందుకు వుంటుంది. ఈ రెండూ ఒకదానిని మరొకటి విశ్వసించవు. విశ్వాసంలోకి తీసుకోవు.
నిజానికి, ప్రభుత్వంపై, పాలకులపై  విశ్వాసం వుండాల్సింది వారిని ఓటేసి అధికారం అప్పగించిన ప్రజలకు. ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వాధినేతల ప్రధమ కర్తవ్యమ్. ప్రతిపక్షంపై కాదు, ఈ విషయంపై పాలకులు నిరంతరం  ఓ కన్నేసి ఉంచాలి.(16-03-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595       

           

15, మార్చి 2016, మంగళవారం

రాజ్యసభలో ‘చిలుకపలుకులు’


“ఏపీ కి ఇచ్చిన హామీలకి కేంద్రం కట్టుబడి వుంది. ఏపీ పట్ల చిత్తశుద్ధితో వుంది”
ప్రత్యేక హోదా గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి జైట్లీ జవాబు.



శభాష్!

14, మార్చి 2016, సోమవారం

సాగర సాయంత్రం


బతికితే అలా బతకాలి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు. నాకు మాత్రం అనిపిస్తోంది జర్నలిష్టు అనేవాడు చనిపోతే అరుణ్ సాగర్  లా చనిపోవాలని.



మరోటి కూడా అనిపించింది, సాగర్  చనిపోలేదేమో.....నిన్న ఆదివారం రాత్రి హైదరాబాదులో సాగర్ మిత్రులు ఏర్పాటు చేసిన ‘ఏ షామ్ ....సాగర్ కే నామ్’ ప్రోగ్రాం చూసిన తరువాత.  అంత మందిలో ఎక్కడో అక్కడ ముచ్చట్లు చెబుతూ, బాతాఖానీ వేస్తూ సరదాగా టైం పాస్ చేస్తున్నాడేమో.  


చిన్నతనంనుంచీ పెద్ద సంఖ్యలో  సంపాదించుకున్న స్నేహితులు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన దెవరు అనేకంటే రానిదెవ్వరు చెప్పడం తేలిక.
సాగర్  ఇష్టపడే మనుషులు తాము ఇష్టపడే సాగర్ గురించిన కబుర్లు చెప్పుకుంటూ, సాగర్ కు ఇష్టమైన పాటలు వింటూ కాలక్షేపం చేసారు.  సాగర్ ఇష్టపడేవన్నీ అక్కడ  ఏర్పాటు చేశారు. అలా ఆ సాయంత్రం వచ్చిన అందరికీ సాగర్ నామస్మరణతో గడిచిపోయింది.

ఒక మనిషి జీవితానికి ఇంకేం ధన్యత కావాలి. అరుణ్ సాగర్ ఆ విధంగా ధన్యుడు. (14-03-2016)