30, జనవరి 2016, శనివారం

పెద్దల పుస్తకాలు – దాగున్న వాస్తవాలు


సూటిగా... సుతిమెత్తగా........ 

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 31-01-2016, SUNDAY) 

పూర్వం సినిమాలు విడుదల చేసినప్పుడు వాటితో పాటు సినిమాలోని పాటలతో కూడిన చిన్న పుస్తకాన్ని  ప్రేక్షకులకు అమ్మేవారు. అవి కొనుక్కుని ఇంటికి వచ్చిన తరువాత వాటిని పాడుతూ పాటల్ని వల్లె వేయడం అదో సరదాగా వుండేది. పాటల పుస్తకాల  వెనుక అట్ట మీద,   చిత్ర నిర్మాత తదుపరి తీయబోయే చిత్రాల పేర్లు వుండేవి. చాలా కాలం క్రితం తెలుగు సినీ రంగంలో ఎదురు లేని మనిషిగా వెలిగిపోతున్న రోజుల్లో,  ఎన్టీ రామారావు తాను తీయబోయే ఒక చిత్రం పేరు  ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అని  ఒక పాటల పుస్తకంపై ముద్రించారు. కానీ ఎందుకో ఏమిటో చిత్రాన్ని ఆయన నిర్మించనే లేదు.
నేనూ ఎప్పుడయినా ఆత్మ కధ అంటూ  రాయడం అంటూ జరిగితే దానికి నడిచి వచ్చిన దారి అని పేరు పెట్టాలని ఎంతగానో మనసు పడ్డ మాట నిజం. జీవిత చరిత్రలు రాసుకోగలిగిన స్తాయి జీవితమా! నాది అన్న మీమాంసతో అది కొరుకుడు పడలేదు. చివరికి మార్పు చూసిన కళ్ళు అనే పేరుతొ నా మాస్కో జీవితంలో ఎదురయిన కొన్ని అనుభవాలను గ్రంథస్తం  చేయగలిగాను. 
తెలుగు సాహిత్యంలో నాకు నచ్చిన ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక  విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే  సరయిన మార్గం. ఏనుగుల వీరాస్వామి గారు రాసిన నా కాశీ యాత్ర పుస్తకం చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్నది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి  ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి ఈరకమయిన  పుస్తకపఠనం ఉపయోగపడుతుంది.  

  
నాందీప్రస్తావనే ఇంత విస్తారం కావడానికి నన్ను ప్రేరేపించిన అంశం ఒకటుంది. మళ్ళీ ఒక జీవిత చరిత్ర గురించి పత్రికల్లో వచ్చింది. రాసిన వ్యక్తి సామాన్యుడు కాదు. దేశ రాజకీయాల్లో కాకలు తీరిన మనిషి. సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించి ప్రస్తుతం దేశ ప్రధమ పౌరుడిగా రాష్ట్రపతి  స్థానంలో వున్న ప్రణబ్ కుమార్  ముఖర్జీ.
సరే! రాజకీయ నాయకులు రాసే జీవిత చరిత్రల మాదిరిగానే ప్రణబ్ ముఖర్జీ  రాసిన ‘కల్లోలిత కాలం’ అనే ఈ గ్రంధంలో కూడా జనాలకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు వున్నాయి. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు ఈ కోవకు చెందుతాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం  తాత్కాలికంగా అయినా  ప్రధాని పీఠం ఎక్కేందుకు తానూ ప్రయత్నించినట్టు ఆరోజుల్లో చెలరేగిన వదంతుల్లో నిజం లేదని ప్రణబ్  వివరణ ఇచ్చారు. అయితే ఈ పుకార్లు తనను, రాజీవ్ గాంధీ నుంచి ఎడం చేశాయని ఆయన పేర్కొన్నారు. ఆ నేపధ్యంలోనే తనకు కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికారని, అది తనను ఎంతో బాధ పెట్టిందనీ ఆయన రాసుకొచ్చారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడం రాజీవ్ చేసిన తప్పు అని అంటూనే, అందులో తన తప్పు కూడా వుందని ఒప్పుకున్నారు. ‘నాలో పేరుకుపోయిన నిస్పృహ  నాలోని సహనాన్ని మించిపోయింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీ పెట్టడం పొరబాటే’ అన్నారయన.
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మరో సంచలన వ్యాఖ్య చేసారు.
’కొన్ని వాస్తవాలు నాతోనే సమాధి అవుతాయి. అత్యంత గోప్యమైన అంశాలను ఇందులో నేను కావాలనే చేర్చలేదు. నా డైరీల్లో నిక్షిప్తమై వున్న ఆ రహస్యాలను నా తదనంతరం కూడా బయట పెట్టరాదు. ఆ డైరీలను డిజిటలిజ్ చేయాలని నా కుమార్తెకు సూచించాను. భవిష్యత్తులో పాలకులు అవసరమనుకుంటేవాటిని బయట పెడతారు’ అని చెబుతూ కొంత ఉత్సుకత పెంచారు.
స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య వల్ల తన ప్రాణాలకే  ముప్పు వుందని తెలిసికూడా ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాలకోసం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన కితాబు ఇచ్చారు.
అయోధ్యలో రామజన్మభూమి ఆలయ ద్వారాలు తెరవడం ప్రధానిగా రాజీవ్ చేసిన తప్పిదమని ఆయన  అభిప్రాయపడ్డారు.
‘కల్లోలిత కాలం’ గురించి ఆయన సాధ్యమైనంత వరకు నిజాయితీతోనే పుస్తకం రాసినట్టు ఇంతవరకు బహిర్గతమైన విషయాలు తెలుపుతున్నాయి.
సరే. దేశంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి రాసిన పుస్తకం కనుక సహజంగానే  ఈ పుస్తకానికి రావాల్సిన ప్రాచుర్యం ఇప్పటికే  వచ్చింది.
సందర్భం వచ్చింది కనుక మరో పుస్తకం గురించి చెప్పుకోవాలి.
మూడు తరాలకు చెందిన ఒక పేద దళిత కుటుంబం సాగించిన జీవనయానంలోని ఒడిదుడుకులను, కష్టనష్టాలను  తేటతెల్లం చేస్తూ డాక్టర్ వై.వి.సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్య అనే జీవిత చరిత్రను హార్పర్ కాలిన్స్ ఇండియా వారు ప్రచురించారు. తెలంగాణా  ప్రాంతంలో తండ్రినిబాబు’ అని పిలుస్తారు కాబట్టి, ఆ పుస్తకాన్ని గురించి తెలుగులో పరిచయం చేసేటప్పుడు బాలయ్య బాబు’ అని పేరు పెట్టాను.
డాక్టర్ సత్యనారాయణ పుస్తకం రాయడంలో ఎలాటి  భేషజాలకు లోనుకాలేదన్న వాస్తవం మనకు  ఇట్టే బోధపడుతుంది. తన కుటుంబం అనుభవించిన కడగండ్లను కళ్ళకు కట్టినట్టు చూపడంలో ఆయన ఎంతమాత్రంపరనిందా సూత్రాన్ని’  ఉపయోగించుకోలేదు.
రెండు శతాబ్దాలకు విస్తరించిన మూడు తరాల కధ, కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం నుంచి డాక్టర్ సత్యనారాయణ ముత్తాత నరసయ్యతో మొదలవుతుంది. ఈనాటికీ అవశేషాలు మిగిలిన దళితుల తాడన పీడనలు, అవమానాలు, ఆక్రోశాలు చదువుతుంటేమనిషి జీవితం ఇంత పర పీడనమా’ అన్న ఆలోచన కలుగుతుంది. దీనిలో సానుకూల అంశం ఏమిటంటే మనిషి తలచుకుంటే కష్టాలొక లెక్కకాదన్న వాస్తవం. దేన్నీ లెక్కపెట్టని గుండె ధైర్యం, పైకి రావాలనే చెక్కుచెదరని  తపన వుండాలే కాని మనిషి సాధించలేనిది ఏమీ లేదన్న  నిజం డాక్టర్ సత్యనారాయణ  రాసిన పుస్తకం  చదివినవారికి బోధపడడం తధ్యం.
మనసుల్ని కదిలించే సంఘటనను డాక్టర్ సత్యనారాయణ ఉదహరించారు.
మాదిగ కుటుంబంలో జన్మించిన నరసయ్య లేగదూడ చర్మంతో చెప్పుల జతను తయారు చేసి నిజాం నవాబుకు బహుకరిస్తాడు. కాలిజోళ్ల పనితనం గమనించి  ముగ్ధుడైన నిజాం నవాబు అతడికి యాభై ఎకరాలు దానంగా ఇస్తాడు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా వూళ్ళోని దొర, నరసయ్యకు నవాబు ఇచ్చిన యాభయ్ ఎకరాల్లో నలభై ఎనిమిది  ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు.
నరసయ్యకు ఒక కొడుకు. అతడి పేరూ  నరసయ్యే. జూనియర్ నరసయ్యకు పదునాలుగో ఏట అబ్బమ్మ అనే యువతితో   పెళ్లి చేస్తారు. అస్పృశ్యులయిన వాళ్ళిళ్లలొ జరిగే శుభకార్యాల్లో చోటుచేసుకునే  ప్రతి చిన్న విషయాన్ని రచయిత తనదయిన శైలిలో హృద్యంగా వర్ణించారు. వారికి పుట్టిన బిడ్డే రామసామి  అలియాస్ బాలయ్య.
కలరా వ్యాధి సోకి భార్య మరణించిన తరువాత ఆమె శవాన్ని భుజానికి ఎత్తుకుని  జూనియర్ నరసయ్య, కొడుకు బాలయ్యను వెంట  తీసుకుని, వూరుబయట వాగు చెంత గొయ్యి తవ్వి, భార్య శవాన్ని పూడ్చిపెట్టి,  వున్న వూరు విడిచిపెట్టి,  బాలయ్య మేనమామల పంచన చేరతాడు. వారి సాయంతో నిజాం రైల్వేలో చిన్న కొలువు సంపాదిస్తాడు. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయినా తల్లి లేని రామసామి అలియాస్  బాలయ్యను ప్రాణప్రదంగా  చూసుకుంటాడు. అలా పెరిగిన బాలయ్యకు  ధ్యేయం ఒక్కటే. చదువు. అది తనకు ఎలాగో అబ్బలేదు.  తనకు దక్కని చదువు తన సంతానానికయినా దక్కేలా చేయాలి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా అతడా లక్ష్యానికి దూరం జరగలేదు. పిల్లలు కూడా   అతడి కలను నిజం చేస్తూ  పెద్దవారవుతారు. స్కూళ్ళు, కాలేజీలు దాటి  విశ్వవిద్యాలయాలలో చేరి ప్రొఫెసర్ల స్తాయికి చేరుకుంటారు. వారిలో ఒకడే గ్రంధకర్త డాక్టర్ సత్యనారాయణ. కృషి వుంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్న కవి వాక్యం నిజం చేసిన మట్టిలో మాణిక్యం.
అవకాశాలు వుండాలే కాని మనిషి పెరుగుదలకు ఆకాశమే హద్దు అని నిరూపించిన డాక్టర్ సత్యనారాయణకు, ఆయన తండ్రి బాలయ్య బాబుకు నమోవాకాలు చెప్పకుండా ఉండలేము.
ఈ పుస్తకం గురించిన మరిన్ని వివరాలు కోరుకునేవారు సీనియర్  పాత్రికేయులు మల్లేపల్లి  లక్ష్మయ్యను సంప్రదించవచ్చు.                              

ఉపశ్రుతి : మహాకవి ‘శ్రీ శ్రీ’  వాకృచ్చినట్టు ‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో’ అది కాదు చరిత్ర అంటే. సామాన్యుడి జీవితం ఎప్పుడు ఎలా వుందో భవిష్యత్  తరాలకి తెలియచెప్పేది చరిత్ర. అలాటి చరిత్రలు, ‘జీవిత చరిత్రలు’గా మరిన్ని రావాలి. రావాలని ఆశిద్దాం! (30-01-2016)

రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

29, జనవరి 2016, శుక్రవారం

My One to One talk on Deccan TV on GHMC Elections with Senior Journalist Shri Satish Chandar

Satish Chandar's One to One chat with Bhandaru Srinivas Rao on GHMC elections in Deccan TV. LINK:
https://www.youtube.com/watch?v=rds9Inaq418

తప్పు! చెంపలు వేసుకోవాల్సినంత పెద్ద తప్పు!



చిన్నప్పుడు  మా వూరికి దగ్గరలో ఓ చిన్న రైలు స్టేషన్  వుండేది.
చిన్నప్పుడు వున్నది ఇప్పుడు లేదా అంటే నిజంగానే లేదు. ఖర్చులు  కూడా గిట్టుబాటు కావడం లేదని ఎత్తేశారు. అదన్నమాట.  ఆ స్టేషన్ ని ఆనుకుని ఒక ఎత్తయిన భవనం వుండేది. నిజానికి అది అన్ని వసతులువున్న భవంతి కాదు. రైల్వే వాళ్ళ సిగ్నల్ కేబిన్. అక్కడ పనిచేసేవాళ్ళని  మచ్చిక చేసుకుని ఇనుపమెట్ల మీదుగా పైకెక్కి  చూసేవాళ్ళం. తుపాకులు వరసగా తిరగేసిపెట్టినట్టు ఇనుప కమ్మీలు  ఉండేవి. వాటిని గట్టిగా లాగి పెడితే ఎక్కడో దూరంగా  వున్న రైలు పట్టాలు విడిపోవడమో, కలుసుకోవడమో జరిగేది. రైలు వెళ్ళే మార్గాన్ని మార్చడానికి అదో ఏర్పాటు. ఇప్పటికీ అలాగే ఉండవచ్చు. అక్కడ పనిచేసేవాళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తూ  ఆ దోవన వెళ్ళే రైళ్ళు, ఒకదానితో మరొకటి డీ కొట్టుకొట్టుకోకుండా, సరయిన ప్లాటుఫారాలమీదికి చేరేలా చూసేవాళ్ళు. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా  ఇక అంతే సంగతులు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో చాలామందిమి రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాము. రైల్వే వాళ్ళు ఇచ్చిన రగ్గులు కప్పుకుని, బెర్తులపై ఎంచక్కా ముడుచుకుని  పడుకుని,  కింద  పట్టాలపై రైలు పరుగెడుతున్న చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటాము. ఏదైనా రైలు స్టేషన్ దగ్గర పడ్డప్పుడు,  రైలు వేగంగా ఊగిపోతూ  దడదడ లాడుతూ  పట్టాలు మారుతున్న చప్పుడు విన్నప్పుడు గుండె కూడా అలాగే దడదడ లాడడం కద్దు. అర్ధరాత్రి వేళ జనం, అలా  హాయిగా, వెచ్చగా ఏం భయం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు అంటే అలాటి కేబిన్ లలో పనిచేసే సిబ్బంది తమ నిద్ర మానుకుని పనిచేయడమే కారణం.
పొద్దున్నే లేచి వేడివేడి కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తాం. మనకోసం ఎవరో ఒకరు, డబ్బులకే కావచ్చు, తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, తెలతెలవారుతుండగానే, పాల ప్యాకెట్లు,  పత్రికలు తెచ్చి,  మన గుమ్మం ముందు వేయడం వల్లనే మనకీ వైభోగం అన్న సంగతి ఆ క్షణంలో  గుర్తు రాదు.
ఇలా ఎందరో మహానుభావులు, వారి వారి జీవిక కోసమే కావచ్చు, వారి సుఖాలను ఒదులుకుని వేరేవాళ్ళు సుఖంగా బతకడం కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. అదంతా మర్చిపోయి, హాయిగా కాలు మీద కాలు వేసుకుని, ‘ఈ దేశంలో ఎవ్వరూ కష్టపడడం లేదు, నేను తప్ప’ అనే తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం నిజంగా తప్పే కదా! 


 (29-01-2016)


NOTE: Courtesy Image Owner 

27, జనవరి 2016, బుధవారం

మర్యాదకు మంగళం


సూటిగా.........సుతిమెత్తగా..............
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 28-01-2016, THURSDAY)

‘సహిష్ణుత’ మన దేశ సంస్కృతిలో భాగమని చెబుతారు. సహన శీలత శతాబ్దాల తరబడి దండలో దారంలాగా ఉంటూ వచ్చిందని విదేశీయులు సయితం కితాబులు ఇచ్చారు. ఈ మాటలు పదేపదే చెప్పడం వల్లనో, అదేపనిగా వింటూ వుండడం వల్లనో దేన్నయినా సహించడం, భరించడం భారతీయుల రక్తంలో కలిసిపోయింది. అయితే ఈ ‘సహిష్ణుత’కు కూడా ఒక హద్దు వుందని, కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఈ దేశపు సహనశీలతకు  కూడా తూట్లు పడుతున్నాయని ఇటీవలి పరిణామాలను గమనించినప్పుడు అనిపిస్తోంది. అందుకే, ‘ఇవ్వాళ  దేశానికి  బాగా అవసరమైన దేమిటి?’ అంటే,  ‘కాసింత సహనం’ అని వాకృచ్చాడొక పెద్దమనిషి.
సహన సంస్కృతికి పుట్టిల్లు అని చెప్పుకునే మన దేశానికి ప్రస్తుతం దాపురించిన  దుస్తితి ఇది.
హైదరాబాదు మహానగర పురపాలిక సంస్థకు జరుగుతున్న ఎన్నికల ప్రచార యుద్ధంలో పేలుతున్న మాటల తూటాల నేపధ్యంలో ఈ విషయం ప్రస్తావించుకోవాల్సి వస్తోంది.
ప్రచార పర్వంలో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు, తాము నగర అభివృద్ధికి ఏం చేయబోతున్నామో చెబితే ఎవరికీ  అభ్యంతరంవుండదు. అల్లాగే  గతంలో ఏం చేశారో ఆ ‘ప్రవర’ వల్లె వేసినా అక్షేపించాల్సింది ఏమీ వుండదు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నా ‘ఏదోలే! ఎన్నికల వేళ కదా! పోనీలే’   అని విని వూరుకోవచ్చు. ఎదుటి పక్షం వాళ్ళపై  దారుణమైన ఆరోపణలు చేసినా అంతకంటే వాళ్ళు చేసేది ఏముందని, చెప్పేది ఏముందని  సరిపెట్టుకోవచ్చు. కానీ, ప్రజల ఆహారపు అలవాట్లను ప్రచారాస్త్రంగా చేసుకున్నప్పుడు మాత్రం ఎదురు బాణాలు వేయకతప్పదు. ఈ విషయంలో  మిన్నకుండిపోవడం అంటే ఆ తప్పులో  మనమూ భాగస్వాములం అయినట్టే.
మాటకు వున్న ‘పవర్’ ఏమిటో  నేటి తరం రాజకీయ నాయకులకు  బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎలాటి మాటలు రువ్వితే అవి సంచలనాన్ని సృష్టిస్తాయో వారికి కరతలామలకం. ఆ సంచలనాలు కలిగించే పెను ముప్పులతో వారికి నిమిత్తం లేదు. అవి ప్రజల్లో ప్రేరేపించే భయసందేహాలతో వారికి సంబంధం లేదు. వారి వార్త మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం.
‘జిహ్వాగ్రే  మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక  అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు.  మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు. ‘వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల  జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.        
తినే తిండికీ, మతానికీ ముడిపెట్టి మాట్లాడడం యెంత తప్పో ప్రజల్ని పలానాదే తినండి, పలానాది తినకూడదు అనడం అంతే తప్పు. అసలా మాటకు వస్తే, ఆహారం అనేది మతం పుట్టకముందే వుంది. నాగరీక సమాజం ఆవిష్కృతం కాకమునుపే, మనుషులు అడవుల్లో జంతువుల్లా జీవిస్తున్న పాత రాతి యుగంలో కూడా మనుషులు తమకు నచ్చిందే తిని తమకు నచ్చినట్టే  జీవించారు. నాగరీకం ముదిరిన నేటి రోజుల్లో కూడా మనుషులు తమకు నచ్చిందే తింటున్నారు. అందుకే అన్నారు జిహ్వకో రుచి అని.
శాకాహారం తినే వాళ్ళు కూడా అన్ని రకాల కాయగూరలు తినరు. ఒకరు కాకర కాయ తింటారు. కొందరికి సొరకాయ సయించదు. మరి కొందరికి నషాళానికి అంటే కారం నాలుక్కి తగిలితే కాని ముద్ద గొంతు దిగదు.
అలాగే మాంసాహారుల్లో కూడా అనేక రుచిపచులు. గుడ్డు తినేవాళ్ళు అందరూ  కోడిమాంసం తింటారనుకోను. ఎనభయ్యవ దశకం చివర్లో నేను నా కుటుంబంతో కలిసి అయిదేళ్ళు మాస్కోలో వున్నాను. అక్కడివాళ్ళకి,  మాంసాహారులు కాకుండా శాకాహారులు అనే ఒక తెగ మనుషుల్లో వుందని తెలియదల్లె వుంది. ఆ రోజుల్లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఇస్కస్ ఆధ్వర్యంలో అనేక మంది తెలుగువాళ్ళు ఏటా మాస్కో వస్తుండేవాళ్ళు. నాకు తెలిసిన జర్నలిష్టులు కూడా వారిలో వుండేవారు. వాళ్ళు మాంసాహారులే అయినా, అక్కడి మాంసపు వంటకాలు నచ్చేవి కావు. అధికార విందుల్లో ఏదో మర్యాదకు భోజనం అయిందనిపించుకుని సాయంత్రం కల్లా మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఒండిపెట్టిన కాయగూరల భోజనం ఆప్యాయంగా ఆరగించి, ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. కాబట్టి చెప్పేదేమిటంటే ఒకళ్ళ ఆహారపు అలవాట్లను ఎద్దేవా చేయడం కానీ, తమ అలవాట్లే గొప్పవి అని డప్పు కొట్టుకోవడం కానీ నాగరికం అనిపించుకోదని. సభ్య సమాజంలో జీవించేవారు ఇలాటి ‘  ప్రల్లధనపు’ పలుకులకు స్వస్తి చెప్పాలని మాత్రమె.
మామూలుగా అయితే ఇటువంటి వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఇవ్వనక్కరలేదు. అయితే, జంట నగరాల్లో ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్త్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ఒకరకంగా వారి ప్రచార ఆర్భాటంతో, ప్రదర్శనలతో, ఊరేగింపులతో, సభలు, సమావేశాలతో నగరం అట్టుడికిపోతోంది. ఈ సమయంలో ప్రజల ఆహారపు అలవాట్లను గురించిన వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు ప్రజల్లో లేనిపోని అనుమానాలను, చీలికలను కలిగించే ప్రమాదం వుంది.  బాధ్యతారహితమైన రాజకీయ సంస్కృతికి అద్దం పట్టే ఈ రకమైన ప్రచారానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. మొదట ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా, దానికి ప్రతి విమర్శలు చేయడం వల్ల పరిస్తితి చేయిదాటిపోతే, అందుకు  ఇరువురిదీ సమాన బాధ్యతే  అవుతుంది. కానీ రాజకీయపు వేడిలో, అవసరాల అక్కరలో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. ఎన్నికల సంఘమే కల్పించుకుని ఇరు పక్షాలను పరిస్తితి ముదరకమునుపే కట్టడి చేయడం అవసరం.
ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగు పరచుకోవడం కోసం రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఇలాటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి ఆ తరువాత మరిచిపోవచ్చు. కానీ వీటి తాలూకు  ప్రభావం ప్రజల మనస్సులో పది కాలాలపాటు పేరుకుపోయే ప్రమాదం వుంటుంది. కానీ ఈ హెచ్చరికలు రాజకీయ నాయకుల చెవికెక్కవు. వారికి వారి రాజకీయ  ప్రయోజనాలే ప్రధానం. 
అన్ని మతాలలో జంతువుల్ని ప్రేమించే స్వభావం వుంది. కొన్నిజంతువుల్ని పవిత్రంగా  భావించి ఆరాధించే ఆచారం వుంది. పరమత సహనం గురించి ప్రబోధించేవాళ్ళు  పర  మతస్తుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించి తీరాలి. అన్ని మతాలూ ప్రజలు ఎలా జీవించాలి, వారి జీవన విధానాలు ఎలా వుండాలి అని బోధిస్తాయి. వాటిని తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు, ఇతర మతాలవాళ్లకు కూడా అలాటి వెసులుబాటు ఇవ్వాలి. తమ మతం, తమ ఆచారాలు ఎలా ప్రధానమో, ఇతరులకీ అలాగే అనే సహిష్ణుత అలవరచుకోవాలి. అన్నింటికీ ముందు రాజకీయాలు మతాల ముసుగు వేసుకోకుండా చూడాలి. మతాల పేరుతొ హాయిగా జీవిస్తున్న ప్రజల నడుమ చిచ్చు పెట్టకుండా చూడాలి. మతాన్ని రాజకీయంతో ముడిపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు ఇటువంటి మాటలు రుచించకపోవచ్చు. కానీ, విశాల జాతి హితం ముందు ఇవి అత్యల్ప స్వల్ప విషయాలు.
ఉపశృతి: వెనకో మునీశ్వరుడికి కాలజ్ఞానం వుండేది. జరగబోయేది ముందుగానే తెలుసుకోగలిగిన శక్తి ఆయనకు వుండేది. ఇక మరణం తప్పదు అనుకున్నప్పుడు ఆయనకు ఓ తీరని మనోవేదన పట్టుకుంది. ఈ జన్మలో తాను సర్వసంగ పరిత్యాగి అయిన ముని. వచ్చే జన్మలో అదే ఆశ్రమంలో ఒక ఎలుకగా పుట్టబోతున్నట్టు ముందుగా తెలియడం వల్లనే ఆ ఆవేదన. శిష్యుడిని పిలిచి చెబుతాడు. తాను  చనిపోయి అదే చోట ఎలుకగా పుట్టబోతున్నానని. ఇంతటి ఔన్నత్యం కలిగిన బతుకు బతికి కలుగులో ఎలుకలా బతకడం తనకు ఇష్టం లేదని, ఎలుక రూపంలో వున్న  తనను వెంటనే  చంపేసి ఆ జన్మకు పరిసమాప్తి కలిగించాల్సిందని. తనను గుర్తు పట్టడానికి తన నుదుటిపై ఒక తెల్లటి మచ్చ ఉంటుందని చెప్పి తనువు చాలిస్తాడు. ఆ శిష్యుడు ఎలుక రూపంలో వున్న  గురువును గుర్తుపట్టి, ఆయన ఆదేశం మేరకు ఆ ఎలుకను చంపబోతే గురువు వద్దని వారించి ఇలా అంటాడు.
‘మనిషిగా వున్నప్పుడు అదే ఉత్కృష్ట జన్మ అనుకుని, ఎలుకను చిన్నచూపు చూసి ఎద్దేవా చేశాను. అయితే,  ఇప్పుడు ఎలుకగా జన్మించిన తరువాత  అది ఎంతటి  గొప్ప  జన్మో నాకు అర్ధం అయింది’
ఇందులోని నీతి ఏమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడరాదు. చిన్న చూపుకు గురైన వారు ప్రతీకారేచ్చకు పూనుకోరాదు. ఒకరిని ఒకరు మన్నించుకోవడం ద్వారా మాత్రమే తామూ మనుషులమే అని అనిపించుకోగలుగుతారు.     (27-01-2016)



రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

            

26, జనవరి 2016, మంగళవారం

25, జనవరి 2016, సోమవారం

పాత్రనుబట్టే గాత్రం


పూర్వం తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్ అనే ఇద్దరు నటదిగ్గజాలు ‘ద్విచక్రాధిపత్యం’గా ఏలుతున్న రోజుల్లో, ఘంటసాల అనే గాయక చక్రవర్తి, పాటలకు సంబంధించి వారిద్దరికీ గాత్ర దానం చేస్తుండేవారు. వారు విడివిడిగా నటించిన సినిమాల్లోనే కాకుండా ఇద్దరూ కలిసి కలివిడిగా వేషాలు వేసిన చిత్రాల్లో కూడా ఘంటసాల వారి వారి గాత్రాలకు తగ్గట్టుగా పాటలు, పద్యాలు  పాడి, నిజంగా వారే పాడుతున్నారా అనే  భ్రమ కల్పించేవారు. పాత్రనుబట్టి గాత్ర సౌలభ్యం ప్రదర్శించడం అనే ఈ  ఘంటసాల ప్రక్రియను నేటి రాజకీయ నాయకులు అంది పుచ్చున్నారేమో అనిపిస్తుంది, అనేక సందర్భాలలో వాళ్ళు చేస్తున్న ప్రకటనలను గమనిస్తే. అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కారు. అన్నీ ఆ తానులో ముక్కలే అని అనిపించక మానదు, వాటిని సూక్షంగా పరిశీలిస్తే.
ఉపశ్రుతి: ఒకానొక పత్రికలో అనుదినం  రాశిఫలాలు రాసే ఒకానొక జ్యోతిష్కుల వారు అనివార్యకారణాల కారణంగా ఒకసారి సమయానికి వాటిని అందించలేకపోయారు. ఆ విషయాన్ని సంబంధిత సిబ్బంది సంపాదకుడి చెవిన వేశారు. అప్పుడాయనగారు ఏమాత్రం కంగారు పడకుండా,
అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా ఆర్డరు వేశారు. ‘నిన్న మేషానికి రాసింది ఈరోజు  వృషభానికి తగిలించండి. వున్నవి పన్నెండు రాశులు, వాటి ఫలితాలనే అటూఇటూ మార్చి రాయండి. ఈ రోజుకు పని అయిందనిపించండి’

   
NOTE: COURTESY IMAGE OWNER

23, జనవరి 2016, శనివారం

దారులు వేరైనా బారులొక్కటే!


రోజంతా చేసిన ప్రచారం ముగిశాక వివిధ పార్టీల కార్యకర్తలు చేరేిదెక్కడికి ?


(NOTE: COURTESY IMAGE OWNER)