23, జనవరి 2016, శనివారం

ఇంకో ఇంగ్లీష్ జోకు


ఒకానొక  ఇంగ్లీష్ దేశంలో ఒకానొక  ఇంగ్లీష్ మహిళ, నెలల బిడ్డను వెంటబెట్టుకుని  ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. {ఇన్ని ఇంగ్లీష్ లు ఎందుకు  అంటే ఇది ఇంగ్లీష్ జోకు కనుక  నేను చేసేది కేవలం స్వేచ్చానువాదమే కనుక.)
బలహీనంగా కనిపిస్తున్న ఆ పసి పిల్లవాడిని చూడగానే డాక్టరు ఆమెను అడిగాడు, పిల్లవాడికి తల్లిపాలు పడుతున్నారా లేక డబ్బా పాలా అని. ‘తల్లిపాలే’ అని ఆవిడ జవాబు.
డాక్టరు అన్నాడు ‘అయితే పరీక్ష చేయాల్సింది బాబును కాదు, మిమ్మల్ని’ అంటూనే, ఆవిడను పై ఉడుపులు తీయమన్నాడు. తన చేతులతో ఆమె చనుమొనలు పిండి చూసి  పెదవి విరిచి చెప్పాడు.’నేను ముందే  అనుకున్నాను, మీకు పాలు సరిగా పడలేదని, అంచేతే పిల్లవాడు బలహీనంగా ఉన్నాడని. వుండండి పాలు పట్టడానికి మందులు రాసిస్తాను’
ఆవిడ గాభరాగా అంది. “అక్కరలేదు డాక్టర్. నేను ఈ పిల్లవాడి తల్లిని కాను, వాడి మామ్మని. అమ్మాయికి సెలవు దొరక్కపోతే నేను తీసుకువచ్చాను. అది రాకపోవడం కూడా  మంచిదేయింది’ 
గమనిక: తెలుగు, English అజ్ఞాతలకోసం ఒరిజినల్ ఇంగ్లీష్ జోకు. అవి యెంత ముదురుగా  ఉంటాయో, వాటిని ఎంతగా సానపట్టి రాయాల్సివస్తోందో తెలపడానికి మాత్రమే ఈ ప్రయత్నం.

A woman and a baby were in the doctor's examining room waiting for the doctor to come in for the baby's first exam. 
Finally, the doctor arrived, examined the baby, checked his weight, and being a little concerned, asked if the baby was breast-fed or bottle-fed.
"Breast-fed," she replied.
"Well! We'll have to check you out. Alright then, strip down to your waist," the doctor ordered.
She undressed and the doctor began his exam.
He pinched her nipples, then pressed, kneaded, and rubbed both breasts for a while in a detailed examination. He frowned, then continued squeezing and pressing for a few more minutes.
Motioning to her to get dressed, he said,
"No wonder this baby is underweight - you don't have any milk!" 
"I know," she said. "I'm his Grandma, but I'm certainly glad I came."


దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని

సూటిగా.....సుతిమెత్తగా....  

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోయి నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.
మన దేశానికి స్వతంత్రం వచ్చి కొంచెం అటూ ఇటూగా అరవై ఎనిమిదేళ్ళు. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో, బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సొంత రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని దశాబ్దాల స్వతంత్ర జీవనంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా – పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే, నేనున్నానంటూ దీనజనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.
అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా, కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని అశేష జనావళి స్తితి రాముని కాలంనాటి కధలోని కప్పను తలపిస్తోంది.
ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయాధీశులే - కంచే చేనుమేసిన చందంగా దొరికిపోయి అభిశంసనలకు గురికావడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం ఇవన్నీ షష్టిపూర్తి చేసుకున్న స్వతంత్ర భారతానికి అంటుకున్న మరకలు. కడిగినా వొదలని మురికి.
ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-
నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే – వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా - తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. కాకపొతే, దొంగని దొంగే పట్టించిన చందంగా అందరి భాగోతాలు తెర చాటునుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల అంటే ఇదే కాబోలు. ఏదో ఒక రకంగా భవిష్యత్ తరాలకు మేలుచేసేదే కాబట్టి ఆహ్వానించదగ్గ పరిణామమే అనుకోవాలి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.
అవినీతి అంశంగా ఈ రోజున దేశంలో, రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు అవినీతిని ఈసడించుకునే పౌరులందరినీ కలత పరుస్తున్నాయి. 
సమస్యతో సంబంధం వున్న పక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.
వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది. అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే. రాజ్యాంగం ప్రసాదించిన పవిత్రమయిన వోటు హక్కుని సరిగా వాడుకోకుండా, లేదా అసలు వాడుకోకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో పాలు పంచుకున్నవాళ్లమే.
ఈ సందర్భంలో- కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.
“భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”
చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముప్పూటలా వాక్రుచ్చే రాజకీయనాయకుల మాటలన్నీ నీటి మూటలని మొత్తం మూటకట్టి మూలన పడేయనక్కరలేదు. ఎందుకంటె ఆ విదేశీ యాత్రీకుడు దేవుడి విషయంలో చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది. మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు – ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.
కవికుల తిలకుడు తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు – ‘దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని’.
(23-01-2016)

21, జనవరి 2016, గురువారం

THANKS ధన్యవాదాలు


థాంక్స్, స్పసీబా, ధన్యవాదాలు ఏ భాషలో చెప్పినా దాని విలువే వేరు. 


ప్రతి రోజూ మనం అక్షరాలా పద్నాలుగువందల నలభయ్ నిమిషాలు ఖర్చు చేస్తున్నాము. వాటిల్లో  నాలుగయిదు  నిమిషాలను మనకు ఈ  జీవితాన్ని ప్రసాదించిన ఆ సర్వేశ్వరుడికో, మనకు ఎంతోకొంత ఆనందాన్ని కలిగిస్తున్న తోటివారికో, సౌకర్యాలను అందిస్తున్న పనివారికో ధన్యవాదాలు తెలపడానికి ఉపయోగిస్తే ఎంతో మంచిది. ఒక రకంగా ఇది మంచి భవిష్యత్తుకు మంచి పెట్టుబడి కూడా. అంచేత మీకు సాయపడ్డ ప్రతివారికీ కృతజ్ఞతలు తెలపడం మరిచిపోకండి. డబ్బు వెదచల్లినా కాని పనులు మంచి మాటతో అవుతాయి.  
NOTE: Courtesy Image Owner

పాకీజా


డెబ్బయ్యవ దశకంలో నేను బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ గారు, దిన వార పత్రికలకి నాచేత  సినిమా  రివ్యూలు  రాయించేవారు. ఇంట్లో పాత కాగితాలు తిరగేస్తుంటే దాదాపు శిధిలావస్థకు చేరిన ఓ పాత ఆంద్ర జ్యోతి వారపత్రిక ( ఇప్పుడు పేరు ‘నవ్య’ గా మారింది) లోని ఓ పేజీ దొరికింది. 



చూస్తే అది హిందీ సినిమా ‘పాకీజా’ గురించి నేను రాసిన రివ్యూ.  చదవడానికి వీలైన భాగం ఇలా వుంది.
“ఈచిత్రంలో నటించిన మీనాకుమారి, సంగీతం అందించిన గులాం మహమ్మద్  ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కాని వారి  ప్రతిభకు తార్కాణంగా ఈ చిత్రం నిలచిపోతుంది.
నవాబుల ఆనందం కోసం నాట్యం చేసే నాట్యకత్తెల గుండె గదుల్లో అణగారిన కోర్కెలకు, తీరని వాంఛలకు, ఆత్మార్పణ చేసుకునే వారి ‘కొవ్వొత్తి’ జీవితాలకు అద్దం  పట్టే  విధంగా ఈ చిత్రంలో ప్రదర్శించిన ఫోటోగ్రఫి ‘వెలకట్టలేని విలువను ఈ చిత్రానికి సమకూర్చిపెట్టింది.
“గులాబ్ మహల్ భవన సౌందర్యం భారీ సెట్టింగుల రూపంలో ఈ సినిమా స్కోప్ చిత్రంలో చక్కగా అమిరింది.
“అశోక్ కుమార్, రాజ్ కుమార్, మీనాకుమారి వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి నౌషాద్ శ్రవణపేయమయిన నేపధ్య సంగీతం అందించారు.
నిర్మాణ. దర్సకత్వ బాధ్యలతో పాటు కమల్ ఆమ్రోహి సంభాషణలు కూడా సమకూర్చారు. జస్ జీత్ డిస్ట్రిబ్యూటర్స్ (సికిందరాబాదు) ద్వారా ఆంధ్రాలో ఈ చిత్రం విడుదల అయింది. -భండారు
తోకటపా: సినిమా పాటల పుస్తకంలో వుండే ‘కధ’ మాదిరిగా చిత్రాల రివ్యూ వుండేది. వుండాలి కూడా. అందుకే నండూరి రామమోహనరావు గారు ఈ సినిమా ప్రీవ్యూ లను  ‘ఫ్రీవ్యూలు’ అనేవారు. అంటే ఉచితంగా చూసేవి అని అర్ధం. రివ్యూలు కూడా అందుకు తగ్గట్టే వుండాలన్నది ఆయన కవి హృదయం.       


“నవ మిధునం”


(దెబ్బయ్యవ దశకంలో పురాణం సుబ్రమణ్య శర్మగారి సంపాదకత్వంలోని ‘ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం)
(నలభై అయిదేళ్ళ క్రితం రాసిన నా తొలి రచనల్లో ఇదొకటి.
ఇది నాటకం కాదు, నాటికా కాదు. కధా కాదు, కధానికా కాదు. దీన్ని ‘సంభాషణ’ అనవచ్చేమో. ఇందులోని పాత్రలకు ప్రత్యేకంగా పేర్లేమీ లేవు. కొత్తగా పెళ్ళయిన ఒక భర్తా, ఒక భార్యా, కోడల్ని వెనకేసుకొచ్చే ఒక అసాధారణ అత్తగారు. వారి రోజువారీ మాటలు, ముచ్చట్లే ఇతివృత్తం. మూడు పాత్రలే కాబట్టి ఎక్కడా పేర్లు వుండవు. సందర్భాన్ని బట్టి ఎవరి ‘పలుకో’ అర్ధం చేసుకోవచ్చు)


ఒకరోజు, అది ఏ రోజయినా కావచ్చు, వాళ్ళింట్లో తెల్లవారింది.
“ఇలా అయితే నేనిక్కడ ఉండను బాబూ”
“ఏం...ఎక్కడికి వెడతావేమిటి?”
“ఇంకెక్కడికి? హాయిగా అత్తయ్య దగ్గరికి..”
“ఓహో! ఆవిడ దగ్గరయితే రాణీ వారికి జరిగినట్టు జరుగుతుందనా? ఇటు పుల్ల తీసి అటు పెట్టనివ్వదు, ఈ ముద్దుల కోడలు ఎక్కడ అరిగిపోతుందో అని”
“ఆవిడనేం సాధించనక్కరలేదు. ఆవిడ చాలా మంచిది. ఇలా ప్రతిదానికీ, వెక్కిరింతలు, వేళాకోళాలు వుండవు”
“అయితే నేను మంచివాడిని కానంటావు”
“అలా అని ఎవరన్నారు? నాకు వంట చేయడం సరిగా రాదని పెళ్ళికి ముందు మీకు తెలియదా? అబద్దాలు చెప్పి నన్నేమి కట్టబెట్టలేదు కదా!”
“ఓహో! రాణీగారికి కోపం వచ్చినట్టుందే. అబ్బే నీకు వంట రాదని ఎవడా గూస్ కూసింది. నీ వంటకేం బ్రహ్మాండం. హోటల్ వాళ్ళు నీ దగ్గర ట్రిక్స్ నేర్చుకుంటే ప్రతిరోజూ ‘ఈ రోజు స్పెషల్’ బోర్డులు పెట్టుకోవచ్చు”
“ఛీ! పొండి”
“పోతున్నాలే ఎలాగూ టైమయింది కదా!”
“అయ్యయ్యో! అలా వెడుతున్నారేమిటండీ, వంటయిపోవచ్చింది. భోంచేసి వెళ్ళండి”
“ఎప్పటికి, సాయంత్రానికా? ఇప్పటికే లేటయింది, వస్తాను”
“సాయంత్రం కాస్త పెందలాడే ఇంటికి రాండి, ఏ అర్ధరాత్రికో దయచేయకుండా”
“చిత్తం మహారాణీ!”


“సుబ్బమ్మ గారూ....ఓ సుబ్బాయమ్మ గారు”
“ఏవిటండీ ఆ గావు కేకలు..అవతల....”
“చిత్తం తమరు చెప్పినట్టు అయిదు కొట్టగానే వచ్చేశాను సుబ్బమ్మ గారు”
“నన్ను ఆ పేరుతొ ఏమీ పిలవనక్కరలేదు... నాకు అంత అందమైనది కాకపోయినా మంచి పేరే పెట్టారు మా వాళ్ళు”
“అల్లాగా! అసలు సుబ్బాయమ్మ పేరులో వున్న   గొప్పతనం నీకేం తెలుసు. వంట మనుషులందరికీ అలాంటి పేరే వుంటుంది. అలా పిలిస్తేనన్నా నీకు కాస్త వంట  చేయడం వంట పడుతుందేమో అని భవదీయుడి ఆశ”
“మళ్ళీ గాలి నా వంట మీదకే తిరిగింది. మీతో వేగడం తెలియక  చస్తున్నాను”
“వంట గదిలో గిన్నెల్ని చూస్తె తెలుస్తుంది నీతో వేగడం యెంత కష్టమో. సొట్టు పడ్డ గిన్నెలు, కొప్పులిరిగిన కప్పులు, మూతల్లేని జాడీలు. వీటిని అడిగితే నీ కధ చక్కగా చెబుతాయి”
“మీ ఆగడం రోజురోజుకూ మితిమీరుతోంది. చూడండత్తయ్యా మీ అబ్బాయి...”
“అత్తయ్యా!..... ఏం కలవరిస్తున్నావా? అయితే  నిన్ను తప్పకుండా మా అమ్మదగ్గరికి పంపాల్సిందే”
“దాన్నెందుకురా పంపడం? ..నేనే  వచ్చేశాను మి మ్మల్ని చూడాలనిపించి”
“అమ్మా! నువ్వా? నువ్వెప్పుడు వచ్చావే! చూసావా నువ్వు వచ్చినట్టు ఒక్క ముక్క నాతొ చెప్పలేదు”
“ఏదీ నన్ను చెప్పనిస్తేనా! ఎంతసేపూ సుబ్బమ్మా, సుబ్బాయమ్మా ఆ గొడవే కాని”
“ఇందాకటి నుంచి  అంతా వింటున్నాను లేరా! అయినా చిన్న పిల్ల, కొత్త చోటు. అల్లా ప్రతిదానికీ వెక్కిరిస్తుంటే మనసు బాధ పెట్టుకోదు? నెమ్మదిగా చెప్పుకోవాలి కానీ ఇలా కసురుకుంటే ఎల్లారా”
“ఇంకేం. డిఫెన్స్ లాయరు కూడా వచ్చేసింది. నా  పని  ఖాళీ!”


“అమ్మా! సాయంత్రం సినిమాకి పోదాం రెడీగా వుండండి”
“నేనెందుకురా! నువ్వూ అమ్మాయి వెళ్ళండి”
”తను కూడా వస్తున్నది కనుకనే ఇప్పుడు చెప్పడం. ఆమె సింగారం పూర్తయి కనీసం సెకండ్   షోకన్నా అందుకోలేక పోతామా అని”
“చూడండత్తయ్యా! ఇదీ మీ అబ్బాయి వరస. నాదే ఆలస్యం అని దెప్పుతారు కానీ, సినిమాకు పోదాం అని చెప్పిన సంగతి ఆఫీసుకు వెళ్ళేదాకా గుర్తుంటే అదృష్టమే”
“అది కాదేఅమ్మా! ఒకసారి ఏం చేసిందో తెలుసా! ఇలాగే సినిమాకు వెడదామని అయిదుగంటల కల్లా  ఇంటికి వచ్చాను. ఇప్పుడే ఒక నిమిషం ఒక నిమిషం అంటూ అద్దం ముందు కూర్చుని మూడు ఝాములు చేసింది. తీరా వెడితే రిక్షా దిగాల్సిన అవసరం లేకపోయింది. అదే రిక్షాలో పడి ఇంటికి చేరాం”
“అదేమిట్రా! టిక్కెట్లు దొరకలేదా!”
“ఇంకేం టిక్కెట్లు రెండో ఆట కూడా ఒదిలారు”
“మరీ చోద్యం చెబుతారు. సినిమా నుంచి వచ్చేసరికి పొద్దు పోతుందని ఏకంగా వంట పని ముగించుకు వెడదామని మొదలు పెట్టాను. ఏదీ చేయనిస్తేగా”
“పప్పు చారులో పోపు ఎలా పెట్టాలో పక్కింటి పిన్ని గారిని అడిగి వచ్చేలోగా పొయ్యి మీద పెట్టిన పప్పు మాడి కూర్చుంది”
“మీరు అక్కడే వున్నారు, కాస్త కనిపెట్టి చూస్తారు అనే ధైర్యంతో వెళ్ళాను. తెలిసీ తెలియక పోపు పెడితే తినేటప్పుడు అది తక్కువయింది  ఇది ఎక్కువయింది  అని వంకలు పెడతారని వెళ్ళాను కానీ,  పప్పు మాడిపోతుందని నేనేమన్నా కలకన్నానా”
“నేను మాత్రం ఆరోజు నీ వంట తిన్నానా ఏమిటి? చివరికి హోటల్లోనే కదా భోజనం”
“”ఆహా. మీ తిండి సంగతి అక్కడ చూసాను లెండి. రూపాయలు తగలేసి రావడమే కాని నాలుగు మెతుకులు కూడా గతికినట్టులేదు”
“డబ్బులు ఇస్తున్నాము కదా అని బకాసురుడిలా మెక్కుతామేమిటి”
“బకాసురుడిలా తినమన్నా తినబుద్దేస్తుందేమిటి హోటల్ తిండి. ఒక కారం లేదు, ఒక ఉప్పు లేదు, వట్టి చప్పిడి మెతుకులు”
“ఇంతకీ ఆ వంటకంటే నీ వంటే నయమంటావ్ అంతేనా”
“అరేయ్! ఏమిట్రా ఈ వాదనలు. ఆఫీసుకు పోయే పనేమీ లేదా ఈ పూట.”
“ఎందుకు లేదమ్మా! నీ ముద్దుల కోడలితో వాదం పెట్టుకుంటే ఇక ఆ రోజుకు అన్నం, ఆఫీసు రెండూ వుండవు”
“సరే కానీ, ఇదిగో టిఫిన్ బాక్సు,  పట్టుకెళ్లండి”
“టిఫినా! చచ్చాన్రా భగవంతుడా! పేరు తెలియకపోతే మానె. తీపో కారమో చెప్పు, ఆఫీసులో బతికిపోతాను”
“అదేమిట్రా అలా అంటావు”
“అవునమ్మా! ప్రతి రోజూ ఉదయమంతా కుస్తీ పట్టి, నామ,రూప, రుచి రహితమైన ఒక బ్రహ్మ పదార్ధం చేసి  టిఫిన్ బాక్సులో పెట్టి ఇస్తుంది. లంచ్ టైంలో   వెధవాయిలందరూ చుట్టూ చేరతారు. ఇక ఒకటే గోల. ‘రంగు వుండి రుచి వాసనా  లేని పదార్ధాన్ని ఏమంటారురా అవధాన్లూ’  అంటాడు ఒక సన్నాసి వెధవ. ‘ఒరేయ్ మనవాడు పెట్టి పుట్టాడురా. వీడి భార్య రోజూ ఒక కొత్త వంటకం తయారుచేసి ఇస్తుంది’ అంటాడు మరో కొక్కిరాయి. ‘ఏరా! ఆ  వారపత్రికలో ఇలా చేసి మాడండి రాసేది మీ ఆవిడేనట్రా’ అని ఇంకోడు జోకుతాడు.  ఇలా అంతా కలిసి నా దుంప తెంపుతారనుకో”
“ఈరోజు ఆ ఇబ్బందేమీ వుండదు, పట్టుకెళ్లండి”
“ఏవిటో ఈరోజు విశేషం”
“విశేషాలు, ససేషాలు ఏవీ లేవు. నన్నసలు వంటింటి ఛాయలకే రానివ్వడం లేదు అత్తయ్య. వంటంతా ఆవిడే చేసారు”
“ఇంకేం నువ్వు తీరిగ్గా పుస్తకాలూ పత్రికలూ చదువుకుంటూ కాలక్షేపం చేద్దువు కాని. రాకరాక ఆవిడ వస్తే గరిట చేతికిచ్చి పైగా ఆమె రానివ్వడం లేదు అంటావా! అమ్మా ఎక్కువ చనువివ్వకే. నా  నెత్తి మీది నుంచి నీ నెత్తి మీదికి ఎక్కుతుంది”
“అందుకేకదరా నేనిక్కడికి వచ్చింది. అదిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు. ఎత్తుకెత్తుగా చూసుకోవాలి ఇక నుంచి. చాకిరీ చేయించాలనే ముచ్చట వుంటే రేపు పుట్టబోయే బిడ్డ చేత  చేయిద్దువుగానిలే”
“అమ్మ దొంగా! యెంత విషయం దాచావు.  వుండు నీ సంగతి చెబుతాను. ఏదీ ఎటు వెళ్ళింది. సరేలే సాయంత్రం సిద్ధంగా వుండండి సినిమా చూసి హోటల్లో భోంచేసి వద్దాము”



“సినిమా ఎలా వుంది?”
“నా మొహంలా వుంది”
“తెలుగు సినిమా నీ మొహంలా వుంటే రోజుకొకటి చూసేవాడిని”
“ఏం నేను అంత బాగున్నానా”
“నేకేం అప్సరసలా వున్నావు. అందులో అమ్మవు కాబోతున్నావు. అన్నట్టు మరచిపోయాను. నీ మీద నాకు కోపం వచ్చింది కదా! నీతో అస్సలు మాట్లాడను”
“మళ్ళీ ఇదేం  తిక్క. నామీద కోపం ఎందుకు”
“ఎందుకా! నాకు చెప్పకుండా కొన్ని దాచిపెడితే కోపం రావాలా అక్కరరాలేదా”
“నాతొ మాట్లాడన్నారు కదా మరి”
“మరచిపోయానని ముందే చెప్పాగా”
“ఇంకేం సమస్యే లేదు. అటు తిరిగి పండుకోండి”
“సరే కాని..”
“కాణీలు అర్ధణాలు లేవన్నానా”
“అదికాదు. ఇంత మంచి వార్త తెలిసింది కదా!  నీకు బహుమతి కావద్దూ”
“ఇప్పుడు వద్దు. పాపాయి  నిద్ర పోతోంది”
“అలా  కుదరదు....”
“ఉష్! ఏమిటా మొండితనం? బయట అత్తయ్య పడుకున్నారు”

(1970)
NOTE: Courtesy Image Owner   

19, జనవరి 2016, మంగళవారం

అందరూ అందరే

  
అనగనగా ఓ ఏకాంబరం అడివి దారిన ఒంటరిగా వెడుతుంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న ఓ స్వామి హఠాత్తుగా  ఎదురుపడి అతడి చేతిలో ఓ మకిలి  పట్టిన రాగి దీపం వుంచి, ఎలా వచ్చాడో అలా మాయం అయిపోయాడు. ఆశ్చర్య పోతున్న ఏకాంబరం ఎదుట దీపం భూతం ప్రత్యక్షమయింది. అడగగానే అది అన్ని కోరికలు తీరుస్తుందని ఏకాంబరం సంబరపడబోతే ఆ భూతం వారించి ఇలా అంది. ‘నువ్వనుకుంటున్నట్టు నేను చందమామ కధలోని భూతాన్ని కాదు. నేను మరో టైపు.   నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు గిట్టదు. నాముందు ఎవరయినా అబద్దం చెప్పారంటే ఊరుకోను. పైగా  చెంప చెల్లుమనిపిస్తాను జాగ్రత్త’ అంది.


ఏకాంబరం ఆ భూతం దీపాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయి భార్యాపిల్లల ముందు దాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. రాత్రి భోజనాలు అయిన తరువాత భార్యను, కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని దీపం భూతాన్ని పిలిచాడు. పిలవగానే ప్రత్యక్షమయింది భూతం.
ఏకాంబరం కొడుకుని అడిగాడు ‘ఈరోజు స్కూలుకి వెళ్ళావా?’ అని.
‘వెళ్లాను, ఈరోజు  లెక్కల మాస్టారు రాకపోతే సైన్సు మాస్టారు ఆ క్లాసు తీసుకున్నాడు’ అని కొడుకు చెప్పాడు. భూతం అతడి చెంప చెళ్ళుమనిపించింది. ‘లేదు లేదు స్కూలు ఎగ్గొట్టి కృష్ణావతారం సినిమాకు వెళ్ళాన’న్నాడు ఆ కుర్రాడు. అ జవాబు విని భూతం మళ్ళీ అతడి గూబ గుయ్యిమనిపించింది. అబద్ధం చెబితే అది ఊరుకునే రకం కాదని  గ్రహించిన ఆ పిల్లాడు, ‘లేదు లేదు, స్కూలుకు డుమ్మా కొట్టి  నా ఫ్రెండ్స్ తో కలిసి ‘లేచి పోదాం రా’ సినిమా చూసాను’ అని నిజం చెప్పేసాడు.
తండ్రి కల్పించుకుని ‘ఇంత లేవు, అప్పుడే అడల్ట్ సినిమాలు కావాల్సి వచ్చాయా?  కాలేజీలో చేరే దాకా సినిమాలే చూడలేదు’ అన్నాడు. అతడి మాట ముగిసేలోగానే భూతం ఏకాంబరం చెంప పగలగొట్టింది.
ఇదంతా చూస్తూ తల్లి అంది, ”నేనెప్పుడు చెబుతుంటాను చూశారా అదే నిజమయింది, మన పిల్లాడికి అన్నీ మీ బుద్దులే.”
ఈసారి ఆగదిలో మరోసారి చెంప చెల్లుమన్న  శబ్దం వినిపించింది. ఏకాంబరం తేరుకుని చూసేసరికి,  భార్య కందిన తన  చెంప నిమురుకుంటూ కనిపించింది.

(ఓ ఇంగ్లీష్ గల్పికకు చేసిన స్వేచ్చానువాదం)  

NOTE: Courtesy Image Owner    

అర్దాంగితో అధిక ప్రసంగం కూడదు


ఏకాంబరం ఏకాంతం దొరకబుచ్చుకుని భార్య పీతాంబరంతో ఇలా అన్నాడు.
“మన పెళ్ళయి పాతికేళ్ళయింది. అప్పుడు ఒక చిన్న గదిలో అద్దెకు వుండేవాళ్ళం. టేబుల్ ఫ్యాను, బ్లాక్ అండ్ వైట్ టీవీ, తిరగడానికి ఒక  సైకిలు. అయినా  ఏ లోటూ అనిపించేది కాదు. పైగా పెళ్ళయిన కొత్త రోజులాయె.  ఓ పాతికేళ్ళ అందమైన అమ్మాయితో రోజులు హాయిగా గడిచిపోయేవి.
“ఇప్పుడు చూడు. అయిదు పడక గదుల విశాలమైన మంచి ఇల్లు. ప్రతి గదిలో స్ప్లిట్  ఏసీలు. అన్ని గోడలకు గోడంత వెడల్పు పెద్ద పెద్ద  టీవీలు,రెండు  బెంజి కార్లు,  ఇన్ని వున్నా ఏం లాభం !  యాభయ్ ఏళ్ళ బొండాం పెళ్ళాంతో కాపురం”
మొగుడి మాటలు విని పీతాంబరం ఒళ్ళు మండి ఇలా అంటించింది.
“సరే! అల్లాగే ఒక పాతికేళ్ళ పడుచు పిల్లను చూసుకోండి. మళ్ళీ అద్దె గది కాపురం, టేబుల్ ఫ్యాను, బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఆ డొక్కు పాత సైకిల్ పాత బతుక్కి మళ్ళడానికి మీకు ఎంతో కాలం పట్టదు”  


NOTE: Cartoon Courtesy Shri “BAPU”