12, డిసెంబర్ 2015, శనివారం

గాలి బుడగ ఈ జీవితం


జాతస్య మరణం ధృవం అని తెలిసిన వాళ్ళు కూడా మరణం పలానా ఘడియలో  అని ముందుగా తెలిస్తే కుదేలయిపోవడం ఖాయం.


మార్గశిర మాసం మొదటి రోజున పొద్దున్నే ఒక టీవీ ఛానల్ కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చేసరికి బయట గేటుకి కట్టేసివున్న రెండు మేకలు ‘మేమే’ అంటూ ఆప్యాయంగా పలకరించాయి. వాటి నుదుటిని ముట్టుకుని దువ్వుతుంటే మా వాచ్ మన్ కొండలరావు వచ్చాడు. ‘జత పన్నెండు వేలు’ అన్నాడు. అతడికిది అలవాటే. గతంలో ఎంతో డబ్బు పోసి పందెం కోళ్ళు కొనుక్కొచ్చి పెంచడం, సీజను కాగానే అవి మాయం కావడం  నేను చూస్తూనే వున్నాను. అల్లాగే మళ్ళీ పందెం మేక పోతులు కొనుక్కొచ్చాడని అనుకున్నాను.
‘మా చుట్టాలు వస్తారు, రేపు పెద్దమ్మ అమ్మవారికి నైవేద్యం పెడతాము’ చెప్పాడు కొండల రావు. అది వింటూనే,  మేక నుదుటిపై వున్న చేయి ఒణికింది. ‘మే మే’ అని పలకరించిన వీటి జీవితానికి రేపే ఆఖరి రోజు’ అని తెలియగానే ఎలాగో అనిపించింది.

‘మీ  జీవితం ఈ క్షణంతో సరి’ అని తెలిస్తే మనుషులు ఏమైపోతారో’     

11, డిసెంబర్ 2015, శుక్రవారం

నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలు



నరసారావుపేట శతాబ్ది ఉత్సవాలు  వైభవంగా జరుగుతున్నాయి అంటే అది స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి పుణ్యమే అనుకోవాలి. ఇప్పుడే కాదు, గతంలో కోటప్ప కొండకు గత వైభవం తెచ్చే కృషిలో కూడా డాక్టరు గారి పాత్ర వుంది. నరసారావుపేట వాస్తవ్యులలో చాలామంది తమ వూరి ఘనత గురించి చెప్పుకుంటూ వుంటారు. ప్రత్యేకంగా ఒక బ్లాగు కూడా నడుస్తోంది. (http://www.narasaraopet-bloggers.blogspot.com/)  



సుజాతగారి ఆ బ్లాగులో నరసారావుపేటలో అంతరించిపోతున్న గూడు రిక్షాల గురించి చదివాను. చదివిన తరువాత గూడు రిక్షాలతో నాకున్న అనుభవాలు మదిలో మెదిలాయి.
ఒకానొక రోజుల్లో గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగావున్నారన్న విషయం ఆ బ్లాగు పై వచ్చిన ‘పలకరింపులు’ తెలియచేస్తున్నాయి. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.

ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?

9, డిసెంబర్ 2015, బుధవారం

సూటిగా.....సుతిమెత్తగా...... కర్నాటక సంగీత శిఖిరం నేదునూరి

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 10-12-2015, THURSDAY)

(డిసెంబరు ఎనిమిది నేదునూరి వారి ప్రధమ వర్ధంతి)

1968  జనవరి నెల.  నలభై ఏడేళ్ళనాటి మాట.  హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదికమీద  నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు   ఎం చంద్రశేఖరన్ , మృదంగ విద్వాంసులు  దండమూడి రామ్మోహనరావులు సహకరిస్తుండగా,   నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన  తన్మయస్తితిలో  తేలిపోయింది.  త్యాగరాజస్వామి  వారు ఎంతటి  ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి,  కృష్ణమూర్తి గారి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్  అయిదు నిమిషాలపాటు రవీంద్రభారతి ఆడిటోరియం,  నేదునూరివారి సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్   తమిళుడు. అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్  తమిళంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా జీవితం ధన్యమయింది. ఇంత  గొప్ప సంగీతాన్ని పక్కనే  కూర్చుని వినే భాగ్యం కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా  మనగలిగిన అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను' 

(సంగీత కళానిధి కీర్తిశేషులు నేదునూరి)

చంద్రశేఖరన్ గారి నోటి నుంచి ‘సంగీత కళానిధి’ అనే పదం రావడం యాదృచ్చికమైనా,  తరువాతి రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై  సంగీత అకాడమివారు  ఏటా ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘సంగీతకళానిధి’ బిరుదు. ప్రతి సంగీత  విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం కన్నా మిన్నగా  భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది. తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి  ఈ పురస్కారం లభించడంపట్ల హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే ఆయనకు  ‘సంగీత కళానిధి’ పురస్కారం ప్రకటించినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నది డాక్టర్ మర్రి  చెన్నారెడ్డి. ఆయనకు ఆ రోజుల్లో పీ.ఆర్.ఓ గా   వున్న వనం జ్వాల నరసింహారావు (ప్రస్తుతం ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కే,చంద్ర శేఖర రావు కార్యాలయంలో ముఖ్య పౌరసంబంధ అధికారిగా పనిచేస్తున్నారు)కు నాడు ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆర్వీవీ కృష్ణారావు ద్వారా ఈ విషయం తెలిసింది. నేదునూరి వారికి పురస్కార ప్రకటన సంగతి తెలుసుకున్న చెన్నారెడ్డి గారు  నేదునూరి వారిని అభినందిస్తూ   చక్కని సందేశం కూడా పంపారు.
ఆ పురస్కారం అందుకున్న తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది. స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని బెజవాడలోని అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.
చెన్నై మ్యూజిక్  అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా డిసెంబరు నెలలో జరిగే  సంగీత ఉత్సవాల్లో  1951  నుంచి క్రమం  తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు  కచ్చేరీ చేస్తూ వస్తున్న  ఘనత నేదునూరి వారిది. అప్పటి వరకు కళానిధి  పురస్కారం పొందిన వారు మొదటి వరసలో ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో, ప్రముఖ సంగీత కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కచ్చేరీలు ఇస్తారు. దేశం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు ఆ సంగీతాంబుధిలో వోలలడుతారు. చెన్నై  నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.  తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు.    చెన్నైకి మకాం  మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను  సంగీత పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం ఆయనకే చెల్లింది.

నేదునూరి వారు కన్నుమూయడానికి కొద్దిరోజులముందరే   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమాచార సలహాదారు   పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. ఉత్తరాంద్రను నిరుడు అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో తీసుకున్న చర్యలు గురించి  నేదునూరివారు ప్రశంసించినట్టు  వార్తలు కూడా  వచ్చాయి.
నేదునూరి కృష్ణమూర్తి గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ అశేష యశస్సును తన వెనుకే  వొదిలి,  తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ  మాండలిన్ శ్రీనివాస్, శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తిని  గత ఏడాదిలోనే  పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.
నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే 'పద్మ' అవార్డులు  లభించాయి కానీ వారి గురువుకు  రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి  అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం.
కర్ణాటక సంగీతంలో గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన  నేదునూరి బాణీని  అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో  ఈ నెల ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలు కావాల్సి వుంది. అయితే భారీ వర్షాలు, వరదలతో బాగా దెబ్బతిని నెమ్మదిగా కోలుకుంటున్న చెన్నై నగరంలో ఈ ఏడాది సంగీత ఉత్సవాలు గతంలో మాదిరిగా జరగడం అనుమానమే.  చెన్నై మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో,   టీ.టీ.కే. ఆడిటోరియంలో ఒకవేళ జరిగినా, ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ  లేకపోవడం ఖచ్చితంగా ఒక లోటు.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

8, డిసెంబర్ 2015, మంగళవారం

ఫిలియాస్ ఫాగ్ గుర్తున్నాడా?


జూల్స్ వెర్న్  రాసిన ‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం’ (Around the World in Eighty days) నవల్లో కధానాయకుడు.
అలాటివాడు ఒకాయన  మా బంధువర్గంలోనే  వున్న సంగతి ఈరోజు తెలిసింది. ఆయన పేరు కూరపాటి సీతారామారావు. వయస్సు ఏడు పదులపైనే. దేవాదాయ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన స్వయంగా చెప్పిన ఆయన సొంత అనుభవం.
తెల్లవారితే హైదరాబాదులో అల్లుడి ఇంట్లో శుభకార్యం. జరూరుగా ఒక స్నేహితుడితో కలిసి శృంగేరి వెళ్ళాల్సిన సందర్భం. ముందు జాగ్రత్తగా మెంగుళూరునుంచి హైదరాబాదుకు విమానం టిక్కెట్టు కొనుక్కున్నారు. తీరా వెళ్ళిన సమయానికి విమానం చక్కా యెగిరి పోయింది. బస్  స్టాండుకు వెళ్లి కనుక్కుంటే హైదరాబాదు వెళ్ళే ఆఖరి  బస్సు అప్పుడే బయలు దేరి వెళ్లిపోయింది. ఆ స్థితిలో మామూలుగా ఉసూరుమంటూ నిట్టూర్చి ఏమి దారి అని వాపోయే పరిస్తితి. కానీ మన సీతారామారావు గారు ఫిలియాస్ ఫాగ్ వ్యవహారం కదా! వెళ్లి వాకబు చేసారు, వెళ్ళిపోయిన బస్సులో టిక్కెట్లు ఏమైనా మిగిలాయా, ఫుల్లుగా వెళ్ళిందా అని. పోయిన బస్సులో టిక్కెట్లు గురించి అడుగుతాడేమిటి ఈ పెద్దమనిషి అని కన్నడంలో ఆశ్చర్యపోతూ, ‘రెండు  సీట్లు ఖాళీ’ అని ఇంగ్లీష్ లో చెప్పాడు కౌంటర్ మనిషి.  ఈయన వెంటనే డబ్బు తీసి ఇచ్చి ‘నాకో టిక్కెట్టు ఇవ్వండి’ అన్నాడుట. ఈయనగారి వరుస చూసి అప్పటికే తల తిరిగి పోయి వున్నాడేమో కౌంటరు ఉద్యోగి మారుమాట్లాడకుండా  టిక్కెట్టు తీసి ఇచ్చాడు. ఈయన అంతకంటే మర్యాదగా అడిగారు. “ఒక్క సాయం చేయండి, నేను వచ్చిన టాక్సీలో వెళ్లి ఆ బస్సు పట్టుకుంటాను, కాస్త ఆ బస్సు డ్రైవర్ కు సెల్ ఫోనులో చెప్పండి కాస్త నెమ్మదిగా పోతుండమని”. అలా చెప్పడమేమిటి, టాక్సీ ఎక్కి రయ్యి రయ్యిమని వెళ్లి,  వెళ్లి పోతున్న ఆ బస్సును పట్టుకోవడం ఏమిటి, తెల్లారేసరికల్లా హైదరాబాదులో దిగి ఎంచక్కా  అల్లుడు గారి  ఇంట్లో వ్రతానికి హాజరు కావడం ఏమిటి అంతా జూల్స్ వెర్న్ నవల్లో మాదిరిగా చకచకా జరిగిపోయాయి (ట)   

5, డిసెంబర్ 2015, శనివారం

“కంట నిదుర రాకపోతే...... .....పడ్డావనుకొ ప్రేమలో ......”


అని ఓ తెలుగు సినిమా పాట వుంది.
అది ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం వుంది. రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడు మారుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఓ జర్నలిష్టు మిత్రుడు ఏకంగా ఓ ధర్మా మీటరు కనిపెట్టాడు. ఎవరయినా ఒక లీడరు తన సొంత పార్టీ అధినాయకుడ్ని మీడియాలో పనికట్టుకుని అదేపనిగా పొగుడుతున్నాడు అంటే అతగాడు అతిత్వరలోనే ఆ పార్టీని ఒదిలి వెడుతున్నాడని అర్ధం. అల్లాగే, ప్రతిపక్షాన్ని అదేపనిగా చీల్చి చెండాడుతున్నాడు అంటే రేపోమాపో ఆ పార్టీలోకే గోడ దూకుతున్నాడు అని అర్ధంట.
అంటే ఏమిటన్న మాట. రాజకీయ నాయకులు సొంత  పార్టీకి ఎప్పుడు గుడ్ బై  చెబుతున్నారు, ఇంకో పార్టీలోకి ఎప్పుడు దూకుతున్నారు  తెలుసుకోవాలంటే టీవీల్లో  చర్చలు చూస్తే సరిపోతుందని ఆ మితృడి కవి హృదయం.


NOTE: Courtesy Cartoonist 

సూటిగా....సుతిమెత్తగా ....... చెన్నై కంటి నీరు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 06-12-2015, SUNDAY)

చెన్నై కంటి నీరు ధారగా కారుతోంది.
తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమని లెక్కలు చెబుతున్నారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూస్తున్నవారికి నిజమే అనిపిస్తోంది.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకున్న దాఖలా లేదు.
చెన్నై వర్ష బీభత్సం గురించి మీడియా వెయ్యి గొంతులతో వివరిస్తోంది. ఇంతటి విపరీత పరిణామాన్ని ముందెవ్వరూ ఊహించినట్టు లేదు. చెన్నై ప్రధాన వీధులు, రైల్వే ప్లాటుఫారాలు,  సందులు, గొందుల్లో వరద ప్రవాహాలను, నీట మునిగిన భవంతులను  చూసిన తరువాత కానీ జరిగిన ఉత్పాతం తాలూకు ఉధృతం అర్ధం కాలేదు. జనజీవనాన్ని ఏదో కొద్ది కాలం పాటు స్తంభింప చేసే షరా  మామూలు తుపాను తాకిడే అనుకున్నారు కానీ, అసాధారణ రీతిలో అతలాకుతలం చేసే ప్రకృతి వైపరీత్యంగా  అంచనా వేయలేకపోయారు.
తుపాను, భూకంపాల వంటివి సంభవించినప్పుడు జరిగిన నష్టం ఏపాటిదన్నది రోజులు గడిస్తే కానీ పూర్తిగా అవగతం కాదు. వాస్తవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ముందు కంటికి కనిపించిన దానికంటే అధికంగా వుండే అవకాశాలే ఎక్కువ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే వచ్చి పరిస్తితులను స్వయంగా చూసివెళ్ళారు. దాదాపు రెండువేల కోట్ల రూపాయల మేరకు ఆర్ధిక సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కనీసం ఐదువేల కోట్లయినా కావాలని ప్రధానిని అభ్యర్ధించారు. సరే ఇవన్నీ షరా మామూలుగా జరిగిపోయే విషయాలే. అయిదు వేలు కాదు, పదివేల కోట్లు సాయం అందినా భౌతిక నష్టాలు పూడ్చుకోవడానికి పనికి రావచ్చేమో కానీ చెన్నై ప్రజలు దాదాపు వారం రోజులుగా పడ్డ మానసిక వేదనను పూర్తిగా తొలగించవచ్చన్న పూచీ లేదు.


చుట్టూ నీళ్ళే! కానీ,  గుక్కెడు కూడా అవి తాగడానికి పనికి రావు. అరకొర విద్యుత్ సరఫరా అవుతుంటేనే సర్దుకుపోవడం కష్టం. అలాటిది రోజుల తరబడి అంధకారం. పక్కింటికి పోవాలంటేనే పదిసార్లు తాళాలు లాగిచూసుకుని, అనేక  జాగ్రత్తలు చూసుకుని అడుగు బయట పెట్టే రోజులు. అలాటిది, పొరుగు వారితో కూడా ఒక మాట చెప్పకుండా,  కట్టుబట్టలతో బయటపడి  ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ,  ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా నడుంలోతు నీళ్ళల్లో దాదాపు ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్తితి. చంటి పిల్లలకు పాలు, పెద్దవారికి వేళకు తిండీ మందులు సరి చూసుకునే వ్యవధానం వుండదు. ఒక కష్టం కాదు, ఒక ఇబ్బంది కాదు, పగవారికి కూడా రాకూడదు అనుకునే రీతిలో, పక్కవాడికి కూడా చెప్పుకోవడానికి వీలులేని పరిస్తితిలో, ప్రాణాలు దక్కించుకోవడం ఎల్లా అని  రోజుల తరబడి దిక్కుతోచని స్తితిలో కాలం గడపడం అంటే యెంత దుర్భరమో చెన్నై ప్రజలకు అనుభవంలోకి వచ్చివుంటుంది. ఆ సమయంలో వారి  మానసిక స్తితి గురించి  ఊహించుకోవడం కూడా దుర్భరం. ప్రస్తుతం చెన్నై వాసుల పరిస్తితి ఎలావుందంటే వర్షం పేరు చెబితేనే  వారికి కంటి మీద కునుకు వుండడం లేదు. ఆకాశం వైపు చూస్తున్నారు, మళ్ళీ వాన కురుస్తుందేమో అన్న భయంతో. ఆకాశం వైపే  చూస్తున్నారు ఎవరయినా హెలికాప్టర్ లో వచ్చి ఆదుకుంటారేమో అనే ఆశతో. ఆశల సంగతేమో కానీ భయాలు మాత్రం నిజమవుతున్నాయి, కాస్త తెరిపి ఇచ్చినట్టే కానవచ్చి మళ్ళీ వాన ముసురు కమ్ముకుంటోంది అనే తాజా వార్తల నేపధ్యంలో. వాతావరణ శాఖ అంచనాలు కూడా వారి ఆందోళనలను  రెట్టింపు చేస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చెన్నై పరిస్తితి గురించి లోక సభలో ఒక ప్రకటన చేస్తూ, ‘ప్రస్తుతం చెన్నై మహా నగరం, చుట్టూ జలరాశి కమ్ముకున్న దీవిలా వుంద’ని పేర్కొనడం అక్కడి వాస్తవ పరిస్తితికి అద్దం పడుతోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ స్పందించి కొన్ని సహాయక చర్యలకు నడుం బిగించాయి. చెన్నై నగరానికి వెళ్ళే అన్ని జాతీయ రహదారులపై టోల్ వసూలును డిసెంబర్ పదకొండువరకు నిలిపివేయడం జరిగింది. వర్షాల తాకిడికి ముందే చెన్నై వెళ్ళడానికి ఎయిర్ ఇండియా విమానాల టిక్కెట్లు కొనుక్కున్న ప్రయాణీకులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చెన్నై దగ్గరలో వున్న విమానాశ్రయాలకు వెళ్ళడానికి వెసులుబాటు కల్పించారు. వాన నీరు ముంచెత్తడం వల్ల చెన్నై ఎయిర్ పోర్ట్ లో చిక్కుకు పోయిన వందలాదిమంది ప్రయాణీకులను, ఆర్కోణం తీసుకువెళ్ళి అక్కడినుంచి భారత వైమానిక దళం విమానాల్లో  హైదరాబాదు తరలించారు. సైనిక దళాలు పడవలతో రంగప్రవేశం చేసి వరదలు చుట్టూ ముట్టిన ప్రాంతాలనుంచి ఆపన్నులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సహాయ శిబిరాలు  నిర్వహిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు ఆహార పదార్ధాలు, ఇతర నిత్యావసర సామగ్రి చేతనయిన మేరకు  అందిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకు పోయిన వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు.   
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినిపోయిన పరిస్తితుల్లో, ఇళ్ళ కప్పులపై నిలబడి ఆహార పొట్లాల కోసంఎదురు చూసే ప్రజల్ని టీవీల్లో చూసినప్పుడు కడుపు తరుక్కుపోవడం సహజం. మొలలోతు  నీళ్ళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పసిబిడ్డల్ని పొదివిపట్టుకుని వెడుతున్న భార్యాభర్తల్ని చూసినప్పుడు కూడా మనసు అలాగే చివుక్కుమంటుంది.
ఇలాటి ప్రకృతి వైపరీత్యాలు గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే.  వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి  పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే.  ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులు కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం.
బ్రిటిష్ వారి  కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన  ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో మిగిలింది ఇదే. జరిగింది ఇదే. భారీ వర్షాలకు చెన్నపట్నం మునిగిపోయింది అని జనాలు వింతగా చెప్పుకునే విషమ పరిస్తితి.
ఇదొక అంకం. చెన్నైలోనే కాదు. అన్ని రాష్ట్రాలలోను, అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్తితి. రెండువేల సంవత్సరంలో హైదరాబాదులో పడ్డ వర్షాలకు ట్యాంక్ బండు పొంగిపొరలి వచ్చిన  మూసీ వరదలు సృష్టించిన భయంకర పరిస్తితులు పాలకులు మరచిపోయారేమో కానీ ఆ చేదు అనుభవాలు, అనుభవించిన  జనాలకు మాత్రం ఇంకా జ్ఞాపకం వున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది  మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన  అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. చెన్నై ప్రజలు కూడా గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంబై పౌరుల మాదిరిగానే అత్యంత నిబ్బరంగా వ్యవహరించినట్టు సాంఘిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.
స్పందించడం మానవనైజం. సాంఘిక మాధ్యమాల్లో ఇది బాగా కానవస్తోంది. ఎక్కడెక్కడివాళ్ళు ‘హెల్ప్ చెన్నై’ అని నినదిస్తున్నారు. బాధితులకు చేరుతుందన్న నమ్మకం లేకపోయినా ‘ఈ కష్ట కాలంలో మీ వెంటే మేము’ అనే సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
‘మా ఇంటికి రండి, మా ఇంటి తలుపులు మీకోసం  తెరిచే ఉంచాము’ అంటూ చెన్నైలో  సురక్షిత ప్రాంతాల్లో వున్న ప్రజలు, ఆపదలో చిక్కుకున్న తమ తోటి ప్రజలకు భరోసా ఇస్తూ పోస్టింగులు పెట్టారు. నిజంగా ఇది ముదావహం.
వీటివల్ల బాధితులకు ఒరిగేదేమీ లేకపోవచ్చు. కానీ మానవత్వం ఇంకా బతికే వుంది అనే నిజం నలుగురికీ తెలుస్తుంది. (05-12-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner 

4, డిసెంబర్ 2015, శుక్రవారం

యక్ష ప్రశ్న


“ధర్మరాజా! నీ తమ్ములను బతికించుకునే ఉద్దేశ్యంతో నా ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పిన తీరు దేవతలు సైతం మెచ్చదగిన రీతిలో వుంది. సందేహం లేదు. చివరాఖరుగా నా ఈ చివరి ప్రశ్నకు సమాధానం చెప్పగలవేమో ప్రయత్నించు.
“ఫలానా పార్టీ నాయకుడు ఈ నిమిషంలో ఏ పార్టీలో వున్నాడు?”

“..................” 

(NOTE: Courtesy Image Owner)