21, అక్టోబర్ 2015, బుధవారం
అంత సీను లేదు.....
లేబుళ్లు:
పప్పన్నం పెట్టే తాహతు లేదు
సూటిగా....సుతిమెత్తగా..... అక్షర సత్యాల్లో అర్ధ సత్యాలు
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 22-10-2015, THURSDAY)
“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి,
1984, అక్టోబర్ 31వ
తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు
బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర
పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ
అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి
కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట
పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక
ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో
కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ
దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు
దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే
బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది.
కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్
మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో
సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం
గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)
“వీపీ సింగ్ ప్రభుత్వ పతనానంతరం రాజీవ్ గాంధీని
ఆనాడే ప్రధానమంత్రిని చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటి రాష్ట్రపతి
వెంకట్రామన్ సుముఖత చూపని కారణంగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. పైగా రాజీవ్
బదులు ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలని వెంకట్రామన్ కోరుకున్నారు.”
ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ
సంగతులన్నీ, శ్రేమతి గాంధి అంతరంగికుడు ఎం.ఎల్ ఫోతేదార్
రాసిన ఒక పుస్తకంలో అక్షరబద్ధం అయ్యాయి.
శ్రీమతి గాంధీ దుర్నిరీక్షంగా దేశాన్ని
పాలిస్తున్న రోజుల్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇద్దరు అధికారులు తమ గుప్పెట్లో
పెట్టుకుని పాలిస్తూ వుండేవారు. శ్రీమతి గాంధీ ఆంతరంగిక వర్గంలోని వారు కాబట్టి
వారిరువురి మాటా మంత్రులకే కాదు, సీనియర్ అధికారులకు కూడా శిరోధార్యం. వారు ఏదైనా
చెప్పారంటే ఇక అది శిలాశాసనం. ఆర్.కే.
ధావన్, ఎం.ఎల్. ఫోతెదార్ అనే ఈ
ఇరువురూ, ఇందిర పుణ్యమా అని రాజకీయంగా కూడా ఎన్నో ఎత్తులకు ఎదిగారు.
ఫోతెదార్ రాసిన ఈ ఆత్మకధ పుస్తకం త్వరలో
మార్కెట్లోకి రానుంది.
పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి,
వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన
అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణ కర్తలు కూడా ఇటువంటి వారు
రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి
ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని అంశాలకు ముందుగానే మీడియా ద్వారా
ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది.
ప్రముఖులు జీవించివున్నకాలంలో, వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ
ప్రసిద్దుల జీవితాల్లో, జనాలకు
తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా
తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను
ఇలా ఆత్మకదల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం
ఉండడంలేదు. ఇది ఏదో మన దేశానికి సంబంధించింది మాత్రమె కాదు. నిజం చెప్పాలంటే ఇలా
పుస్తకాలను మార్కెట్ చేసే సంస్కృతి విదేశాలనుంచే దిగుమతి అయింది.
వాస్తవానికి, సాహిత్య ప్రక్రియల్లో ఆత్మకధలు లేదా
జీవితచరిత్రలు ప్రధానమయినవి. వీటిని చదువుతుంటే మనకు చెందని కాలానికి చెందిన అనేక
విషయాలను అవగాహన చేసుకోగలుగుతాము. మనం ఈనాడు చూస్తున్న ప్రదేశాలు, ఆచారవ్యవహారాలు వాటికి
పూర్వ రూపం ఎలావుండేదో తెలుసుకోవడానికి వీటిని చదవడం ఒక్కటే సరయిన మార్గం. ఏనుగుల
వీరాస్వామి గారు రాసిన ‘నా కాశీ
యాత్ర’ పుస్తకం
చదువుతుంటే ఆనాటి హైదరాబాదు నగరం ఎలావుండేదన్న వాస్తవ చిత్రం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అప్పటి ధరవరలు, వేషధారణలు, ఆహారవ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి
ఈరకమయిన పుస్తకపఠనం ఉపయోగపడుతుంది. అయితే ఇవి రాసిన వారు యెంత ఘటనాఘటన సమర్దులయినా
కించిత్తు స్వోత్కర్ష దొర్లడం కద్దు. కొన్నింట ఏకంగా ‘పర దూషణ’ ఏరులై పారుతుంది. ఇక ఆ
పెద్దమనిషి యెంతటి మేరుఘనగధీరుడయినప్పటికీ
ఆ రచనని ఆస్వాదించడం పంటికింద రాయి చందమే. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు
చేసినవాళ్లు రాసే తమ జీవిత చరిత్రల్లో ఈ
రకమయిన ‘ఆత్మ
స్తుతి-పరనింద’ తొణికిసలాడుతుంటాయి.
వీటివల్ల అసలు వాస్తవాలు మరుగున పడిపోతుంటాయి. మహాత్మా గాంధీ రాసుకున్న ‘మై ఎక్స్
పెరిమెంట్ విత్ ట్రూత్’ అనేది
దీనికి పూర్తి మినహాయింపు. తనలోని బలహీనతలను ఒప్పుకోవడానికి, బయట
పెట్టుకోవడానికి ఆయన ఎంతమాత్రం
సంశయించకపోవడం ఆ పుస్తకంలోని గొప్పతనం. అలాగే సందర్భాన్నిబట్టి, లేదా వాస్తవాలనుబట్టి
తనలోని గొప్పతనాన్ని కానీ, ఇతరులలో
తనకు నచ్చని విషయాలను కానీ చెప్పాల్సివచ్చినప్పుడు ఆ విషయాలను సుతిమెత్తగా చెప్పడం
మళ్ళీ ముళ్లపూడి వెంకటరమణ గారికే సాధ్యమయింది.
చిన్నప్పుడు అల్లరి
చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ
లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే ఛాన్సు వుండదు. ఒకవేళ
గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే
మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి
చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే
వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకున్నా,
రాయించుకున్నా అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు
రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. అందుకే, తృణమో
ఫణమో చదివించుకుని ఇలాటి ఆత్మకధలు లేదా
జీవిత చరిత్రలు రాయించుకునే రచనలకు ఈ
రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా
ముచ్చటపడి చదువుకునే రసకందాయఘట్టాలు
మచ్చుకయినా కనిపించవు కాబట్టీ ,
అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ, పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు
వ్యవహారం కాదు కాబట్టీ అటువంటి వాటి
జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత
చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే, అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో కొన్ని రసరమ్య ఘట్టాలు’ వుండేవుంటాయి. లేకపోయినా
‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర
అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ
సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు, ఆ
సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ
రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన
ప్రమోలుగా రూపొందించి, పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో
జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ
క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.
అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్
టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి. అందుకో చక్కని ఉదాహరణ, బ్రిటన్ మాజీ
ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో రాసిన “ప్రయాణం” అనే పుస్తకం. ముందు చెప్పిన విధంగానే
అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి
సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.
టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో ఒక ఫ్రెంచ్ యువతితో
ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహం నుంచి బయటపడడం ఒక
పట్టాన సాధ్యం కాలేదుట.
“ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’
అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ
పడుచువాడు, భవిష్యత్తులో
బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.
‘సన్’ పత్రిక లో వచ్చిన ఈ
‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది.
టోనీ పుస్తకాలూ వేడి వేడి పకోడీల్లా అమ్ముడు పోయాయి.
ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా
ఎగరేసుకుపోయారు. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం కాబట్టి
పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం
ప్రచురించారు.
పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్
అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి
ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు
తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.
ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా, యిరవై నాలుగు (బ్రిటిష్) పౌండ్లు మీవి
కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ'
అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ
ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది
వివాదాస్పదం అయింది.
పీవీ నరసింహారావు గురించి శ్రీమతి
గాంధీ తనతో ఇలా చెప్పారంటూ వెంగళరావు ఆ పుస్తకంలో
ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు.
కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్
దీక్షిత్ లాగే ఈయనా ఒక సీనియర్ అన్న
నమ్మకంతో ఆయన్ని(ఆంద్ర ప్రదేశ్) ముఖ్యమంత్రిని చేసాను. కానీ ఆయన బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ
కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు.
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన
కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు
రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని
నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది.
సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేసుకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక
లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు వెంగళరావు తన పుస్తకంలో
పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను
తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ.ఆర్.వొ. గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు
వ్యక్తులను బాధపెట్టేవిగా వున్నాయని,
వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను గ్రంధ ప్రచురణకు ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు
పర్వతాలరావు వివరణ ఇచ్చారు. అయినా ఆయన తన సహజ శైలిలోనే,
'ఏం పర్వాలేదంటూ' తన సలహాను పట్టించుకోలేదని, అంచేత ఆ పుస్తకంలో తన పేరు
ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు చెప్పారు.
అలాగే పర్వతాలరావు గారి పేరు అందులో ఎక్కడాలేదు.
ఈ కోవలోకి వచ్చేదే మరో
ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి
రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో
సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. కొందరు
సినీ ప్రముఖులను కించబరిచే వ్యాఖ్యానాలు అందులో
వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి
వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి.
అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై
జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. (21-1-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491
30595
20, అక్టోబర్ 2015, మంగళవారం
ఇదిగిదిగో అమరావతి ....(ఆహ్వానం)
రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు... వీరి వ్యవహార
శైలే విభిన్నం.
మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు
ఇద్దరికీ పెళ్లి పత్రికలు ఇచ్చివచ్చాను. పెద్దవాడి పెళ్ళి నాటికి బాబుగారు ముఖ్యమంత్రి. వై.ఎస్.ఆర్. ప్రతిపక్ష నాయకుడు. అలాగే చిత్రంగా
రెండోవాడి వివాహం నాటికి వీరి పాత్రలు తారుమారయ్యాయి. అయినా వచ్చి వధూవరులను
ఆశీర్వదించి వెళ్ళారు. అందుకే ఈ ఇద్దరు నాయకులంటే నాకే కాదు జర్నలిష్టు సోదరుల్లో
చాలామందికి అభిమానం. నేను దూరదర్సన్ నుంచి
రిటైర్ అయిన తరువాత కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు పిలుపులు
అందుతూనే వచ్చాయి. ఇదిగో ఇప్పుడు అమరావతి పిలుపు.
మధ్య్యాన్నం మామూలుగా నా బ్లాగు లోకంలో నేనుంటే,
పుల్లారావు యాదవ్ అనే ఆయన ఫోను చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మీ
ఇంటికి వచ్చి అమరావతి ఆహ్వానం ఇస్తారు, ప్రస్తుతం జర్నలిష్టు కాలనీలో వున్నాం,
ఇక్కడనుంచి ఎలా రావాలో చెబుతారా అని అడిగారు. అక్కడికి దగ్గరలో ఆంద్రజ్యోతి దగ్గర
మా అన్నగారు రామచంద్రరావు గారు వుంటారు, అక్కడ ఇవ్వండి, శ్రమపడి ఇంత దూరం రానక్కర లేదు అన్నాను. కానీ ఆయన,
చంద్రబాబునాయుడు నాయుడు గారు మిమ్మల్ని పర్సనల్ గా కలిసి ఇవ్వాలని చెప్పారని
చెప్పబోతుంటే నేనే వారించాను, పర్వాలేదు అక్కడ ఇవ్వండి, నాకు చేరుతుంది అని.
మొత్తం మీద వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారని మా అన్నయ్య ఫోనుచేసి చెప్పారు. ఫోటో తీసి వాట్స్ ఆప్ లో పోస్ట్ చేసారు.
(ఆహ్వానం పంపించడంలో ఇంత శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు గారికి ధన్యవాదాలు.)
లేబుళ్లు:
ఇదిగిదిగో అమరావతి ....(ఆహ్వానం)
19, అక్టోబర్ 2015, సోమవారం
చదివించే పుస్తకం- చదవాల్సిన పుస్తకం
మిత్రుడు సత్యారావు ఓ పుస్తకం రాసాడు. నిజానికి
అది ముందూ వెనుకా అట్టల్ని, ఫోటో పేజీలని మినహాయిస్తే అక్షరాలా ముప్పయి రెండు
పేజీల చిన్ని పొత్తం. ఏకబిగిన చదివించే శైలి కలిగిన పుస్తకం కాబట్టి చదివేయడం
అన్నది కొన్ని నిమిషాల పనే. ఇదొక సౌలభ్యం.
రచయిత సత్యారావు నాకు గత ముప్పయి అయిదేళ్ళు గా
తెలుసు. తెలుసు అనుకుంటున్నాను కానీ అతడి గురించి నాకు అసలు ఏమీ తెలియని విషయాలు
ఎన్నో వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు తెలిసింది. అతడు హైదరాబాదులో పరిచయం అయింది
ఆంద్ర జ్యోతి విలేకరిగా. నేను అప్పటికే 1975 నుంచి
రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. గతంలో జ్యోతిలో పనిచేసి వచ్చాను
కనుక అందులో పనిచేసే సత్యారావు అంటే అవ్యాజానురాగం. నన్ను భం.శ్రీ. అని
పిలిచేవాడు. రేడియోలో ప్రసారం చేసే
అసెంబ్లీ సమీక్షలు రాస్తుండేవాడు. మా దగ్గర తాత్కాలికంగా రిపోర్టింగ్ చేసే
వెసులుబాటు వుండేది. ఆ రోజుల్లో రోజుకు డెబ్బయి అయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళు
అనుకుంటాను. ఇప్పుడది బాగా పెరిగినట్టు వుంది. ఇదలా ఉంచుదాం. అలాటి
సత్యారావు ఆనతి కాలంలోనే ప్రభుత్వ సమాచార శాఖలో చేరి దాని డైరెక్టర్ స్థాయికి
ఎదిగాడు. ముఖ్యమంత్రులకు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసాడు. చివరికి క్యాబినెట్ హోదా కలిగిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. ఇవన్నీ నాకు తెలుసు.
కానీ ఈ పుస్తకంలో అతను రాసుకున్న కొన్ని విషయాలు
విభ్రాంతి కలిగించే విధంగా వున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు సత్యారావు
బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆఫీసు బాయిగా పనిచేసాడు. విలేకరుల సమావేశాలు జరిగినప్పుడు
కాఫీ టీలు అందించేవాడు. క్లబ్ లోనే
మెట్లకింద కాళ్ళు ముడుచుకుని రాత్రి పూట నిద్రపోయేవాడు. బెజవాడ హోటల్లో సర్వరుగా
పనిచేసాడు. అవన్నీ హాయిగా శ్రమజీవన సౌందర్యం తెలిసిన మనిషిగా ఎలాటి భేషజాలకు
పోకుండా అక్షరబద్ధం చేసాడు. అదీ అతగాడి సత్య నిష్ఠ. జర్నలిష్టుకు కావాల్సిన
మొట్టమొదటి అర్హత. అలాటివాడి ఎదుగుదల
క్రమాన్ని తెలిపేదే ఈ పుస్తకం. కంటి నీరు అదుముకుంటూ చదువుకోవాలి. చదువరులని మరీ
ఏడిపించడం ఇష్టం లేకనే సత్యారావు ఈ పుస్తకాన్ని అంత చిన్నగా రాసివుంటాడు. ఇక
చివరగా ఒక మాట. ‘మా వూరి దారి నుంచి...’ అనే తన జీవనయాన గాధను సత్యారావు మొదలు పెట్టిన క్రమం ఇలా వుంది. అదొక్కటి చాలు స్థాలీపులాక
న్యాయం మాదిరిగా ఈ పుస్తకం గొప్పదనం తెలపడానికి.
“అది 1977. నెల సరిగ్గా గుర్తు లేదు. బెజవాడ
ప్రెస్ క్లబ్. ఆజానుబాహుడైన ఒక పెద్దాయన నా సత్యారావు భుజము మీద చేయి వేసి మెట్లు
దిగుతున్నాడు.
‘ఏ వూరప్పా’ అడిగారాయన.
‘శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర సిరిపురం సార్!’
‘ఏం చేస్తున్నావప్పా’
చెప్పాను, ఆఫీసు బాయ్ నని.
‘బాగా చదువుకో అప్పా’ సలహా ఇచ్చి వెళ్లిపోయారాయన.
‘ఆయన ఎవ్వరో కాదు ఆంద్ర ప్రదేశ్ ప్రధమ
ముఖ్యమంత్రి, తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు.
జనతా పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా
బెజవాడ వచ్చి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రెస్ క్లబ్ కి వచ్చారు.”
భవిష్యత్తులో ఎక్కాల్సిన మెట్లకు చిహ్నంగా కాబోలు
సత్యారావుకు ఆ రోజు అలా రాజకీయాల్లో మేరునగ ధీరుడుగా భాసిల్లిన సంజీవరెడ్డి గారు ప్రెస్
క్లబ్ మెట్ల మీద తారసపడ్డట్టున్నారు.
ఆల్ ది బెస్ట్ సత్యారావ్!
('మా ఊరు దారి నుంచి...' పుస్తకావిష్కరణ)
రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి
రావూరి భరధ్వాజ కడపటి కోరిక
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో
వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది
జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ
జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో
వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను
రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.
"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం : "కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)
లేబుళ్లు:
రావూరి భరద్వాజ,
రెంటాల జయదేవ్
18, అక్టోబర్ 2015, ఆదివారం
అక్షరాలా ఐదు లక్షలు
చాలాకాలం వరకు, నిజం చెప్పాలంటే ఈనాటివరకూ
కూడా కంప్యూటర్ గురించి ఏబీసీడీలు కూడా తెలియని
నిరక్షరకుక్షిని నేను. అలాటివాడిని 29-11-2008 నాడు అంటే ఏడేళ్ళ క్రితం, మా పిల్లల పుణ్యమా అని ఈ బ్లాగులోకంలో అడుగిడి, తడబడుతూ అడుగులు వేస్తూ
పోయాను. “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య” అనే పేరుతో నేను ఆనాడు మొదలు
పెట్టిన ( http://bhandarusrinivasarao.blogspot.in/) సొంత
బ్లాగును వీక్షించిన వారి సంఖ్య ఈరోజుతో (18-10-2015) అయిదు
లక్షలు దాటిపోయింది. రాస్తూ పోతుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగిపోవడం అంత ఆశ్చర్యం
కలిగించే విషయం కాదుకాని, తెలుగులో నేను రాసే విషయాలను గమనించేవారి సంఖ్య ఈమేరకు వుండడం నాకు అత్యంత ఆనందాన్ని
కలిగిస్తోంది. అందుకు వారందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు. పొతే, ఇంతవరకు 1838 రచనలను ఈ
బ్లాగులో పోస్ట్ చేసాను. 3404 మంది స్పందించి తమ కామెంట్లు రాసారు. ఈ బ్లాగుకు 52 మంది ఫాలోయర్లు కూడా వున్నారు.Daily Average Audience
Statistics, Countrywise: (ఈ గణాంకాల వివరాలు అన్నీ కాపీ పేస్టు బాపతు.
తభావతు అనిపిస్తే నా అజ్ఞానం ఖాతాలో వేసేయండి)
|
కావున మరోమారు అందరికీ మరోమారు కృతజ్ఞతల మారు
వడ్డన.
థాంక్స్, షుక్రియా, స్పసీబా.
లేబుళ్లు:
అక్షరాలా ఐదు లక్షలు
రావూరి భరద్వాజ అసలు పేరు
(జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ మరణించి నేటికి రెండేళ్ళు)
జ్ఞానపీఠ్
పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి
ఓ చిన్న జ్ఞాపకం:
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని
రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి
అనువదించారు.
ఈ పుస్తకం వెనుక
చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా
అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ
అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the
RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి
అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు
రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని
శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ
మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్
ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు
కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా
చెప్పుకోవాలి.
రావూరి భరద్వాజ గారు
ఇంత పొడవు గడ్డం పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు
తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా
రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన
రాసిన 'పాకుడురాళ్ళు' నవల, కృష్ణా పత్రికలో సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో
ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం
లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా
వచ్చిందని మాత్రం చెప్పగలను.
లేబుళ్లు:
రావూరి భరద్వాజ అసలు పేరు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)








