20, అక్టోబర్ 2015, మంగళవారం

ఇదిగిదిగో అమరావతి ....(ఆహ్వానం)


రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు... వీరి వ్యవహార శైలే విభిన్నం.
మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇద్దరికీ పెళ్లి పత్రికలు ఇచ్చివచ్చాను. పెద్దవాడి పెళ్ళి నాటికి  బాబుగారు ముఖ్యమంత్రి.  వై.ఎస్.ఆర్. ప్రతిపక్ష నాయకుడు. అలాగే చిత్రంగా రెండోవాడి వివాహం నాటికి వీరి పాత్రలు తారుమారయ్యాయి. అయినా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. అందుకే ఈ ఇద్దరు నాయకులంటే నాకే కాదు జర్నలిష్టు సోదరుల్లో చాలామందికి అభిమానం.  నేను దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తరువాత కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు పిలుపులు అందుతూనే వచ్చాయి. ఇదిగో ఇప్పుడు అమరావతి పిలుపు.



మధ్య్యాన్నం మామూలుగా నా బ్లాగు లోకంలో నేనుంటే, పుల్లారావు యాదవ్ అనే ఆయన ఫోను చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మీ ఇంటికి వచ్చి అమరావతి ఆహ్వానం ఇస్తారు, ప్రస్తుతం జర్నలిష్టు కాలనీలో వున్నాం, ఇక్కడనుంచి ఎలా రావాలో చెబుతారా అని అడిగారు. అక్కడికి దగ్గరలో ఆంద్రజ్యోతి దగ్గర మా అన్నగారు రామచంద్రరావు గారు వుంటారు, అక్కడ ఇవ్వండి, శ్రమపడి ఇంత దూరం  రానక్కర లేదు అన్నాను. కానీ ఆయన, చంద్రబాబునాయుడు నాయుడు గారు మిమ్మల్ని పర్సనల్ గా కలిసి ఇవ్వాలని చెప్పారని చెప్పబోతుంటే నేనే వారించాను, పర్వాలేదు అక్కడ ఇవ్వండి, నాకు చేరుతుంది అని. మొత్తం మీద వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారని మా అన్నయ్య ఫోనుచేసి చెప్పారు.  ఫోటో తీసి వాట్స్ ఆప్ లో పోస్ట్ చేసారు.



(ఆహ్వానం పంపించడంలో ఇంత శ్రద్ధ తీసుకున్న  చంద్రబాబు గారికి ధన్యవాదాలు.)



   

19, అక్టోబర్ 2015, సోమవారం

చదివించే పుస్తకం- చదవాల్సిన పుస్తకం


మిత్రుడు సత్యారావు ఓ పుస్తకం రాసాడు. నిజానికి అది ముందూ వెనుకా అట్టల్ని, ఫోటో పేజీలని మినహాయిస్తే అక్షరాలా ముప్పయి రెండు పేజీల చిన్ని పొత్తం. ఏకబిగిన చదివించే శైలి కలిగిన పుస్తకం కాబట్టి చదివేయడం అన్నది కొన్ని నిమిషాల పనే. ఇదొక సౌలభ్యం.
రచయిత సత్యారావు నాకు గత ముప్పయి అయిదేళ్ళు గా తెలుసు. తెలుసు అనుకుంటున్నాను కానీ అతడి గురించి నాకు అసలు ఏమీ తెలియని విషయాలు ఎన్నో వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు  తెలిసింది. అతడు హైదరాబాదులో పరిచయం అయింది ఆంద్ర జ్యోతి విలేకరిగా. నేను అప్పటికే 1975 నుంచి రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. గతంలో జ్యోతిలో పనిచేసి వచ్చాను కనుక అందులో పనిచేసే సత్యారావు అంటే అవ్యాజానురాగం. నన్ను భం.శ్రీ. అని పిలిచేవాడు.  రేడియోలో ప్రసారం చేసే అసెంబ్లీ సమీక్షలు రాస్తుండేవాడు. మా దగ్గర తాత్కాలికంగా రిపోర్టింగ్ చేసే వెసులుబాటు వుండేది. ఆ రోజుల్లో రోజుకు డెబ్బయి అయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళు అనుకుంటాను.  ఇప్పుడది బాగా  పెరిగినట్టు వుంది. ఇదలా ఉంచుదాం. అలాటి సత్యారావు ఆనతి కాలంలోనే ప్రభుత్వ సమాచార శాఖలో చేరి దాని డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రులకు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసాడు. చివరికి  క్యాబినెట్ హోదా కలిగిన ప్రెస్  అకాడమీ చైర్మన్ అయ్యాడు. ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఈ పుస్తకంలో  అతను రాసుకున్న కొన్ని విషయాలు విభ్రాంతి కలిగించే విధంగా వున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు సత్యారావు బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆఫీసు బాయిగా పనిచేసాడు. విలేకరుల సమావేశాలు జరిగినప్పుడు కాఫీ టీలు  అందించేవాడు. క్లబ్ లోనే మెట్లకింద కాళ్ళు ముడుచుకుని రాత్రి పూట నిద్రపోయేవాడు. బెజవాడ హోటల్లో సర్వరుగా పనిచేసాడు. అవన్నీ హాయిగా శ్రమజీవన సౌందర్యం తెలిసిన మనిషిగా ఎలాటి భేషజాలకు పోకుండా అక్షరబద్ధం చేసాడు. అదీ అతగాడి సత్య నిష్ఠ. జర్నలిష్టుకు కావాల్సిన మొట్టమొదటి అర్హత.  అలాటివాడి ఎదుగుదల క్రమాన్ని తెలిపేదే ఈ పుస్తకం. కంటి నీరు అదుముకుంటూ చదువుకోవాలి. చదువరులని మరీ ఏడిపించడం ఇష్టం లేకనే సత్యారావు ఈ పుస్తకాన్ని అంత చిన్నగా రాసివుంటాడు. ఇక చివరగా ఒక మాట. ‘మా వూరి దారి నుంచి...’ అనే తన జీవనయాన గాధను సత్యారావు  మొదలు పెట్టిన క్రమం ఇలా వుంది. అదొక్కటి చాలు స్థాలీపులాక న్యాయం మాదిరిగా ఈ పుస్తకం గొప్పదనం తెలపడానికి.
“అది 1977. నెల సరిగ్గా గుర్తు లేదు. బెజవాడ ప్రెస్ క్లబ్. ఆజానుబాహుడైన ఒక పెద్దాయన నా సత్యారావు భుజము మీద చేయి వేసి మెట్లు దిగుతున్నాడు.
‘ఏ వూరప్పా’ అడిగారాయన.
‘శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర సిరిపురం సార్!’
‘ఏం చేస్తున్నావప్పా’  
చెప్పాను, ఆఫీసు బాయ్ నని.
‘బాగా చదువుకో అప్పా’  సలహా ఇచ్చి వెళ్లిపోయారాయన.  
‘ఆయన ఎవ్వరో కాదు ఆంద్ర ప్రదేశ్ ప్రధమ ముఖ్యమంత్రి, తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు. జనతా పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజవాడ వచ్చి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రెస్ క్లబ్ కి వచ్చారు.”
భవిష్యత్తులో ఎక్కాల్సిన మెట్లకు చిహ్నంగా కాబోలు సత్యారావుకు ఆ రోజు అలా రాజకీయాల్లో మేరునగ ధీరుడుగా భాసిల్లిన సంజీవరెడ్డి గారు ప్రెస్ క్లబ్ మెట్ల మీద తారసపడ్డట్టున్నారు.

ఆల్ ది బెస్ట్ సత్యారావ్!  

('మా ఊరు దారి నుంచి...' పుస్తకావిష్కరణ)  
         

రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి

రావూరి భరధ్వాజ కడపటి కోరిక
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ  గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది.  మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.

"
ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన  సమాధానం : "కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)





18, అక్టోబర్ 2015, ఆదివారం

అక్షరాలా ఐదు లక్షలు


చాలాకాలం వరకు, నిజం చెప్పాలంటే ఈనాటివరకూ కూడా  కంప్యూటర్ గురించి ఏబీసీడీలు కూడా తెలియని  నిరక్షరకుక్షిని నేను.  అలాటివాడిని 29-11-2008 నాడు  అంటే  ఏడేళ్ళ క్రితం, మా పిల్లల పుణ్యమా అని  ఈ బ్లాగులోకంలో అడుగిడి, తడబడుతూ అడుగులు వేస్తూ పోయాను. “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య” అనే పేరుతో నేను ఆనాడు మొదలు పెట్టిన ( http://bhandarusrinivasarao.blogspot.in/) సొంత బ్లాగును వీక్షించిన వారి సంఖ్య ఈరోజుతో (18-10-2015) అయిదు లక్షలు దాటిపోయింది. రాస్తూ పోతుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగిపోవడం అంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదుకాని, తెలుగులో నేను రాసే విషయాలను గమనించేవారి  సంఖ్య ఈమేరకు వుండడం నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. అందుకు వారందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు. పొతే, ఇంతవరకు  1838  రచనలను ఈ బ్లాగులో పోస్ట్ చేసాను. 3404 మంది స్పందించి తమ కామెంట్లు రాసారు. ఈ బ్లాగుకు 52 మంది ఫాలోయర్లు కూడా వున్నారు.Daily  Average  Audience Statistics, Countrywise: (ఈ గణాంకాల వివరాలు అన్నీ కాపీ పేస్టు బాపతు. తభావతు అనిపిస్తే నా అజ్ఞానం ఖాతాలో వేసేయండి)
India
1260
United States
588
Russia
107
Australia
48
United Arab Emirates
44
United Kingdom
39
Germany
26
Singapore
24
Saudi Arabia
21
Kuwait
19

కావున మరోమారు అందరికీ మరోమారు కృతజ్ఞతల మారు వడ్డన.
థాంక్స్, షుక్రియా, స్పసీబా.

  

రావూరి భరద్వాజ అసలు పేరు


(జ్ఞానపీఠ అవార్డు పొందిన  రావూరి భరద్వాజ మరణించి నేటికి రెండేళ్ళు)
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
ఓ చిన్న జ్ఞాపకం: 
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా చెప్పుకోవాలి.


రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల,  కృష్ణా పత్రికలో   సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను.


17, అక్టోబర్ 2015, శనివారం

నడిచి వచ్చిన దారిలో .....

2005లో హైదరాబాదు దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున వీడ్కోలు ప్రసంగం  
అందరికీ నమస్కారం...
జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.
నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.
చూస్తుండగానే రేడియోలోను, ఇక్కడా ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల,  చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు. పైగా ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.
అసూయ తెలియని  పై అధికారులు, ఆత్మీయత కనబరిచే సాటి సిబ్బంది, నిజానికి  ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
అందుకే, అత్తలేని కోడలులాగా అందరిలోను, అందరితోను కలిసిపోయి, కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగాననే అనుకుంటున్నాను.
అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరినోఒకరిని వృత్తి ధర్మంగా  నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే ‘సారీ’ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం, పరమార్ధం.
నాకు ‘సరిగా’  మాట్లాడడం రాదు. ఇది నా మాట కాదు. మా ఆవిడ ఉవాచ. ముఖ్యంగా మనసు ఆర్ద్రం అయిన ఇలాటి సందర్భాలలో.
అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.
మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...
నిజమే! కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...
అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.



-భండారు శ్రీనివాసరావు, 31-12- 2005. 

నిత్య చైతన్యం అవసరం అంటున్న చంద్రబాబు గారు ఇది వినండి


‘నిధులిచ్చి వెళ్ళడం కాదు నిత్య చైతన్యం అవసరం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుఈరోజు విజయవాడలో చేసిన ఉద్బోధకు సంబంధించిన  స్క్రోలింగు  టీవీ తెరపై పరుగు తీస్తున్న సమయంలోనే ఇంగ్లండులో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి ఫోను చేశాడు. కాకతాళీయం కావచ్చు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రం తనకు అందిందని చెప్పాడు.
సాయికి మొదటి నుంచి స్వగ్రామం అంటే మక్కువ ఎక్కువ. నిజానికి హైదరాబాదులో ఉంటున్న మాకంటే ఇంగ్లండులో ఉంటున్న మా సాయికే మా వూరు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. ఎందుకంటె స్మార్ట్ విలేజ్ విదేశీ వాలంటీర్లలో వాడొకడు. మా ఊరుకు సంబంధించిన ఎమ్మార్వో ప్రతి గురువారం ఉదయమే మా ఊరుకు వచ్చి సాయంత్రం దాకా వుండి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిన్తుంటారు. ఆయనవద్ద  ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ వుంది. దాని సాయంతో మావాడు ఆయనతో నెట్ సంబంధం పెట్టుకుని అన్ని సంగతులు ఆరా తీస్తుంటాడు. ఆ అధికారి కూడా మా వాడు ఏది అడిగినా కాదనకుండా అన్ని సంగతులు చెబుతుంటాడు. దానికి కారణం వుంది. వూళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మావాడు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తుంటాడు. వూళ్ళో వాడు చదువుకున్న స్కూల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేర్వేరుగా మరుగు దొడ్లు కట్టించారు. ఫోను చేసినప్పుడల్లా తాజా పరిస్తితిని వూళ్ళో వాళ్ళతో చర్చిస్తుంటాడు. ఆ మాటల్లో తెలిసిందేమిటంటే   లావెట్రీలు అయితే కట్టించారు కానీ వాటిని సరిగా శుభ్రం చేసే వాళ్ళు లేరు. పేరుకు ఒక మనిషిని పెట్టారు. కానీ అతడు మండలం మొత్తంలోని అన్ని గ్రామాలను చూసుకోవాలి. పైగా అతడికి ఇచ్చేది కూడా స్వల్పం. దీనికి తోడు  అయిదారు మాసాలకోసారి చెల్లింపులు. అంచేత అతడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్తితి. అలాగే గ్రామంలో ఇతర సంక్షేమ పధకాలు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఏపనీ సకాలంలో పూర్తవడం లేదని మా వాడు గుర్తించాడు. దానితో వాడికి వాడే స్వయంగా పూనుకొని ఓ పరిష్కారాన్ని అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో వివరించాడు. డబ్బుకోసం పనులు ఆపవద్దనీ, అవసరమైన మొత్తం ఎంతో తెలియచేస్తే తాను సర్దుబాటు చేస్తాననీ, నిధులు విడుదల అయినప్పుడు తనకు తిరిగి ఇచ్చే విషయం ఆలోచించుకోవచ్చనీ వారికి చెప్పాడు. నిజంగా ఇది ఎంతో మంచి ఆలోచన. నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇతర ఎన్నారై శ్రీమంతులు కూడా ఈ విధమైన డబ్బు సర్దుబాటు కార్యక్రమానికి పూనుకుంటే ఏ మంచి పధకం కూడా నిధుల కొరతతో అరకొరగా మిగిలిపోదు.
ఇక ప్రభుత్వానికి చెప్పేదేమిటంటే స్మార్ట్ విలేజ్ పరిస్తితే ఇలా వుంటే ఆ హోదాకు నోచుకోని ఇతర గ్రామాల సంగతేమిటి?
ముఖ్యమంత్రి, అధికార సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నా కూడా ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగ మించవచ్చన్నది మావాడి మాటల్లో నాకు బోధపడింది. నిజంగా ఈ ఆలోచన గురించి విదేశాల్లో ఉంటూ జన్మ భూమికి ఏదో తపన వున్నవాళ్ళందరూ ఆలోచన చేయాలి. 
కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలవకూడదనే మనస్తత్వం కాబట్టి,  స్కూల్లో మరుగు దొడ్లను పరిశుభ్రం చేసే వాడికి బకాయిలు పెట్టకుండా పనిచేయించడానికి, అల్లాగే ఇతరత్రా కార్యక్రమాలకు మా సాయి  డబ్బు సర్దుబాటు చేసేవుంటాడు.
ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కనిపెట్టి ఆహ్వాన పత్రిక పంపారో ఏమో తెలియదు కానీ, తన పేరు మీద వచ్చిన  దాన్ని చూసుకుని వాడి సంతోషం అంతా ఇంతా కాదు.