18, అక్టోబర్ 2015, ఆదివారం

రావూరి భరద్వాజ అసలు పేరు


(జ్ఞానపీఠ అవార్డు పొందిన  రావూరి భరద్వాజ మరణించి నేటికి రెండేళ్ళు)
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
ఓ చిన్న జ్ఞాపకం: 
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా చెప్పుకోవాలి.


రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల,  కృష్ణా పత్రికలో   సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను.


17, అక్టోబర్ 2015, శనివారం

నడిచి వచ్చిన దారిలో .....

2005లో హైదరాబాదు దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున వీడ్కోలు ప్రసంగం  
అందరికీ నమస్కారం...
జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.
నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.
చూస్తుండగానే రేడియోలోను, ఇక్కడా ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల,  చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు. పైగా ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.
అసూయ తెలియని  పై అధికారులు, ఆత్మీయత కనబరిచే సాటి సిబ్బంది, నిజానికి  ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?
అందుకే, అత్తలేని కోడలులాగా అందరిలోను, అందరితోను కలిసిపోయి, కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగాననే అనుకుంటున్నాను.
అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక, ఎప్పుడో ఒకప్పుడు, ఎవరినోఒకరిని వృత్తి ధర్మంగా  నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే ‘సారీ’ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం, పరమార్ధం.
నాకు ‘సరిగా’  మాట్లాడడం రాదు. ఇది నా మాట కాదు. మా ఆవిడ ఉవాచ. ముఖ్యంగా మనసు ఆర్ద్రం అయిన ఇలాటి సందర్భాలలో.
అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.
మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...
నిజమే! కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...
అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.



-భండారు శ్రీనివాసరావు, 31-12- 2005. 

నిత్య చైతన్యం అవసరం అంటున్న చంద్రబాబు గారు ఇది వినండి


‘నిధులిచ్చి వెళ్ళడం కాదు నిత్య చైతన్యం అవసరం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుఈరోజు విజయవాడలో చేసిన ఉద్బోధకు సంబంధించిన  స్క్రోలింగు  టీవీ తెరపై పరుగు తీస్తున్న సమయంలోనే ఇంగ్లండులో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి ఫోను చేశాడు. కాకతాళీయం కావచ్చు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రం తనకు అందిందని చెప్పాడు.
సాయికి మొదటి నుంచి స్వగ్రామం అంటే మక్కువ ఎక్కువ. నిజానికి హైదరాబాదులో ఉంటున్న మాకంటే ఇంగ్లండులో ఉంటున్న మా సాయికే మా వూరు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. ఎందుకంటె స్మార్ట్ విలేజ్ విదేశీ వాలంటీర్లలో వాడొకడు. మా ఊరుకు సంబంధించిన ఎమ్మార్వో ప్రతి గురువారం ఉదయమే మా ఊరుకు వచ్చి సాయంత్రం దాకా వుండి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిన్తుంటారు. ఆయనవద్ద  ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ వుంది. దాని సాయంతో మావాడు ఆయనతో నెట్ సంబంధం పెట్టుకుని అన్ని సంగతులు ఆరా తీస్తుంటాడు. ఆ అధికారి కూడా మా వాడు ఏది అడిగినా కాదనకుండా అన్ని సంగతులు చెబుతుంటాడు. దానికి కారణం వుంది. వూళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా మావాడు ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తుంటాడు. వూళ్ళో వాడు చదువుకున్న స్కూల్లో మగపిల్లలకు, ఆడపిల్లలకు వేర్వేరుగా మరుగు దొడ్లు కట్టించారు. ఫోను చేసినప్పుడల్లా తాజా పరిస్తితిని వూళ్ళో వాళ్ళతో చర్చిస్తుంటాడు. ఆ మాటల్లో తెలిసిందేమిటంటే   లావెట్రీలు అయితే కట్టించారు కానీ వాటిని సరిగా శుభ్రం చేసే వాళ్ళు లేరు. పేరుకు ఒక మనిషిని పెట్టారు. కానీ అతడు మండలం మొత్తంలోని అన్ని గ్రామాలను చూసుకోవాలి. పైగా అతడికి ఇచ్చేది కూడా స్వల్పం. దీనికి తోడు  అయిదారు మాసాలకోసారి చెల్లింపులు. అంచేత అతడిని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్తితి. అలాగే గ్రామంలో ఇతర సంక్షేమ పధకాలు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఏపనీ సకాలంలో పూర్తవడం లేదని మా వాడు గుర్తించాడు. దానితో వాడికి వాడే స్వయంగా పూనుకొని ఓ పరిష్కారాన్ని అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో వివరించాడు. డబ్బుకోసం పనులు ఆపవద్దనీ, అవసరమైన మొత్తం ఎంతో తెలియచేస్తే తాను సర్దుబాటు చేస్తాననీ, నిధులు విడుదల అయినప్పుడు తనకు తిరిగి ఇచ్చే విషయం ఆలోచించుకోవచ్చనీ వారికి చెప్పాడు. నిజంగా ఇది ఎంతో మంచి ఆలోచన. నిధులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇతర ఎన్నారై శ్రీమంతులు కూడా ఈ విధమైన డబ్బు సర్దుబాటు కార్యక్రమానికి పూనుకుంటే ఏ మంచి పధకం కూడా నిధుల కొరతతో అరకొరగా మిగిలిపోదు.
ఇక ప్రభుత్వానికి చెప్పేదేమిటంటే స్మార్ట్ విలేజ్ పరిస్తితే ఇలా వుంటే ఆ హోదాకు నోచుకోని ఇతర గ్రామాల సంగతేమిటి?
ముఖ్యమంత్రి, అధికార సిబ్బంది చిత్తశుద్దితో పనిచేస్తున్నా కూడా ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగ మించవచ్చన్నది మావాడి మాటల్లో నాకు బోధపడింది. నిజంగా ఈ ఆలోచన గురించి విదేశాల్లో ఉంటూ జన్మ భూమికి ఏదో తపన వున్నవాళ్ళందరూ ఆలోచన చేయాలి. 
కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలవకూడదనే మనస్తత్వం కాబట్టి,  స్కూల్లో మరుగు దొడ్లను పరిశుభ్రం చేసే వాడికి బకాయిలు పెట్టకుండా పనిచేయించడానికి, అల్లాగే ఇతరత్రా కార్యక్రమాలకు మా సాయి  డబ్బు సర్దుబాటు చేసేవుంటాడు.
ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కనిపెట్టి ఆహ్వాన పత్రిక పంపారో ఏమో తెలియదు కానీ, తన పేరు మీద వచ్చిన  దాన్ని చూసుకుని వాడి సంతోషం అంతా ఇంతా కాదు.  
         

చూస్తోంది ఇంతే! చూడాల్సింది ఇంకెంతో!

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-10-2015, SUNDAY)
సూటిగా ......సుతిమెత్తగా
చూస్తోంది ఇంతే! చూడాల్సింది ఇంకెంతో!  
‘చెప్పేవాడు లేక చెడిపోయాడ’ని సామెత. నవజాత ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల వరస చూస్తుంటే ఈ నానుడి గుర్తొస్తోంది.
సమస్యల అమావాస్యల్లో ఆవిర్భవించిన ఈ కొత్త రాష్ట్రంలో ప్రతి రోజూ ఒక సమస్యే. ఆ సమస్య కూడా పాలక ప్రతిపక్షాల నడుమ సమస్య. ప్రజల సమస్య యెంత మాత్రం కాదు. వారి సమస్యలు వారికి వున్నాయి. ఆకాశానికి ఎగబాకుతున్న ఒక్క పప్పుల ధరలు చాలు వారి కష్టాలు, సమస్యలు ఏ తీరున వున్నాయో చెప్పడానికి. కానీ అవేవీ ఏలినవారికీ కనపడ్డం లేదు, వారిని నిలదీయాల్సిన ప్రతిపక్షానికీ పట్టడం లేదు. వారి వారి రాజకీయ అంశాలే ఆయా  పార్టీల ప్రాధాన్యతాక్రమంలో మొదటి వరుసలో వున్నాయి.
పాలక పక్షం టీడీపీ, రాజధాని నిర్మాణ శంకుస్థాపన పనుల్లో ప్రస్తుతం మునిగితేలుతోంది. ఏకైక ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సి.పీ. మరో కార్యక్రమం లేనట్టు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వేళ్ళాడుతోంది. నిజానికి ఈ రెండూ చాలా ముఖ్యమైన అంశాలే. కానీ ప్రాధాన్యత కలిగిన అంశాల జాబితా ఆ కొత్త రాష్ట్రానికి చిన్నదేమీ కాదు. చాంతాడంత వుంది.
సరే! ఎన్నాళ్ళు గానో జనాలు ఎదురుచూస్తున్న రాజధాని శంకుస్థాపన మహోత్సవం ఘడియ దగ్గరపడుతోంది. ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే అన్నారు, తన కళ్ళముందు కనిపిస్తున్నవి రెండే రెండు. అవి రాజధాని, పోలవరం అని. నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవి రెండూ రెండు కళ్ళు అని కూడా చెప్పారు. ఇది కూడా వాస్తవం. ఈ రెండూ రాష్ట్రానికే కాదు దాన్ని పాలిస్తున్నటీడీపీ రాజకీయ భవిష్యత్తుకు  కూడా అత్యంత ఆవశ్యకం. నిజం చెప్పాలంటే మరో మూడున్నర  ఏళ్ళ తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండూ  ఆ పార్టీకి ‘ట్రంపు కార్డులు’. తన పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్ళే యవనాశ్వాలు. 
పాలనాపరంగా చూసినా, రాజకీయ ఎత్తుగడల కోణం నుంచి చూసినా చంద్రబాబునాయుడు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అతి సమర్ధుడు. సీనియర్ కూడా. అంచేత ఎన్నికల సమయంలో బ్రహ్మాస్త్రాల మాదిరిగా ఉపయోగపడే ఈ ఆయుధాల విలువ బాగా ఎరిగిన నాయకుడాయన. 
అంచేతే ఆయన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. ఎన్నికల నాటికన్నా ఈ స్వప్న నగరాన్ని ఓ మేరకు అయినా పూర్తి చేసి, అది పూర్తిగా పూర్తి చేయాలంటే  తనలాటి సమర్దుడయిన నాయకుడు తప్పనిసరి అనే భావన ప్రజల్లోకి పంపించగలగాలి. అలాగే పోలవరం. ఎన్నికల కోయిల కూసేలోగా దాన్ని పూర్తి చేయడం కష్టమే అయినా పట్టుదల  వుంటే అసాధ్యం కాదని నిరూపించడం ఆయన వ్యూహంలో భాగం కావచ్చు. తన సమర్ధతత పైన నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాలు. ఆ నమ్మకమే తన విజయానికి అసలు సిసలు పునాది. అది జనాల్లో నాటుకుపోయేలా చేయగలిగితే మిగిలిన విషయాలు పట్టించుకోనవసరం లేదు. అందుకోసమే ఆయన మరో పని లేదన్నట్టు రాజధాని నిర్మాణం పట్లే తన శక్తియుక్తులన్నీ వాడుతున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన రాజధాని నగరాన్ని ఆయన మూడేళ్ళలో నిర్మించడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. దశలవారీగానే జరుగుతుందనీ తెలుసు.  కానీ అది పూర్తి కావాలంటే మాత్రం అందులో తన పాత్ర వుండి తీరాలన్న విశ్వాసం కలిగించడం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ముందున్న మొదటి సవాలు. అందుకే ఎన్ని విమర్శలు ఎదురయినా, ఎన్ని ఆటంకాలు ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నా అయన అలుపు ఎరగకుండా ముందుకే సాగుతున్నారు.

ఈ క్రమంలో ఆహ్వానాల గురించి ప్రతిపక్షం లేవనెత్తిన అంశం టీకప్పులో తుపాను. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అదీ యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఓ  శుభ సందర్భం దగ్గర పడుతున్నప్పుడు  ప్రతిపక్షనేత తన సహజ శైలిలో ఓ సంచలన ప్రకటన చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోడం లేదని చెప్పడం ఒక ఎత్తు. కానీ జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, తనకు పిలుపు అందినా వెళ్ళేది లేదని ముక్తాయింపు కూడా ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు అంటున్నట్టు అది జగన్ మోహన రెడ్డి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం కాకపోయినా, తొందరపాటు చర్య అన్నది సుష్పష్టం. రాజధాని నిర్మాణంలో పాలక పక్షం ఒంటెత్తు పోకడలకు పోతున్నదని ఆయన పార్టీ మొదట నుంచీ వాదిస్తోంది. అటువంటి అంశాలను, అందులో బహిర్గతం కాని అంశాలు ఏవైనా వుంటే వాటిని సాక్ష్యాధారాలతో బయట పెట్టడానికి బదులు ఆయన ఎంచుకున్న ఈ ‘బహిష్కరణ’ బాట జనామోదం పొందడం కష్టం.  కాకపొతే, ఆయన పనిలో పనిగా  ఈ  నిర్ణయానికి పురికొల్పిన ఎనిమిది అంశాలను తన ప్రకటనకు జత చేసి రాజకీయ చర్చలకు తెరతీసారు.
వీటిలో చాలావరకు ఆ పార్టీ ప్రస్తావిస్తూ వచ్చిన విషయాలే. చేస్తూ వచ్చిన ఆరోపణలే. శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ‘నాలుగయిదు వందల కోట్లు తగలేస్తున్నామన్నది నిరాధారమైన ఆరోపణ. అందులో ఏమాత్రం నిజం లేద’ని తెలుగు దేశం మంత్రులు మూకుమ్మడిగా విరుచుకు పడ్డారు. మంత్రులు చెప్పేది వాస్తవం కావచ్చు. కానీ జరుగుతున్న ప్రచారార్భాటం తీరుతెన్నులు చూస్తుంటే,  ‘ఏమో! నిజమేనేమో!’ అనే శంకలు కలిగే అవకాశం లేకపోలేదు. ఏలికలు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
‘శంకుస్థాపన కార్యక్రమానికి రాను’ అని ముందుగానే ప్రకటన చేయడం జగన్ మోహన రెడ్డి పొరబాటే. అలాగే రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షాన్ని  ‘రాష్ట్ర రాజధాని వంటి  అత్యంత ప్రాముఖ్యత’ కలిగిన విషయంలో విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరించడం పాలక పక్షం చేసిన పొరబాటు.
వాస్తవంగా చూస్తే వడ్ల గింజలో బియ్యపు గింజ సామెత బాపతు. ఆధిక్యతా భావాన్ని అదుపులో వుంచుకోలేక పోవడం కలిగే పరిణామాలు ఇలానే వుంటాయి. నిజమే రెండు రాజకీయ పార్టీల నడుమ సయోధ్య అంత సులభం కాదు. అందులోనూ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య మరింత దుస్తరం. అంత మాత్రాన ప్రతిదీ రాజకీయం చేస్తూ పొతే ప్రయోజనం ఏముంటుంది? రాజధాని నిర్మాణం వంటి ముఖ్యమైన వేడుక జరుగుతున్నప్పుడు ఇష్టం వున్నా లేకపోయినా దాన్ని మనసులో ఉంచుకుని  అందులో పాలుపంచుకోవడం  ప్రతిపక్షం  బాధ్యత. అల్లాగే ప్రతిపక్ష నాయకుడితో పాలక పక్షానికి ఎన్నెన్ని ఇబ్బందికర అంశాలు అడ్డం వున్నా, ఆయన హోదాకు తగినట్టుగా ఆహ్వానం గురించిన సమాచారం ముందస్తుగానే అందించి వుంటే బాగుండేది. పెళ్ళి కార్డు పోస్టులో పంపించే గృహస్తులు కూడా, యెంత పని ఒత్తిళ్ళ నడుమ కూడా తీరిక చేసుకుని చుట్టపక్కాలను, బంధు మిత్రులను ఫోను చేసి ఆహ్వానించడం పరిపాటి. మర్యాద కూడా.  ఎందుకో కారణం తెలవదు కానీ అదిక్కడ లోపించింది.  ఈ రగడ జరక్కముందే ముఖ్యమంత్రే ఫోను చేసి ఆహ్వానించి వుంటే చంద్రబాబు ఔన్నత్యాన్ని గురించి జనం చెప్పుకునే వారు. 1995 లో ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకు వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి గుర్తున్న వాళ్లకి నేటి ఆయన వ్యవహారశైలి  మింగుడు పడుతుండక పోవచ్చు. ఔదార్యం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రాజకీయ నాయకులు కావాలనే కోల్పోతున్నారేమో అనే భావన కలుగుతోంది.
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధానం వుంది. వాటిల్లో విజయావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటినుంచే  ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడంలో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. అయితే ఈ క్రమంలో, ఆంద్రప్రదేశ్ లోని  పాలక ప్రతి పక్షాలు రెండూ ప్రజలు తమపై  పెట్టిన బాధ్యతకు దూరంగా జరుగుతున్నాయేమో అని, ఎన్నోఏళ్ళుగా  రాజకీయాల క్రమం పరిశీలిస్తున్న వారికి అనిపిస్తోంది. ఇది యెంత త్వరగా వాళ్ళు సరిదిద్దుకుంటే రాష్ట్రానికి అంత మంచిది.
కొంచెం సర్దుబాటు, కొంచెం అవగాహన చాలు ఇటువంటి అనవసర అంశాలు వివాదాస్పదం కాకుండా చూడడానికి.
ముందు చెప్పుకున్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా వినేవాళ్ళు అంతకంటే లేరు.
(17-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595                             


16, అక్టోబర్ 2015, శుక్రవారం

భార్యతో మాట్లాడ్డం ఎలా?


(నిఝంగా వొట్టు నాకూ తెలవదు. కానీ రాయడానికి తెలవక్కరలేదు అని మాత్రం తెలుసు)

ఓప్పుడు అంటే చాలా చాలా కాలం  కిందట - ఓ సినిమాలో చెప్పినట్టు 'లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో' అలా అన్నమాట. అంతకాలం క్రితం నేను మా ఆవిడతో బోలెడు బోలెడు మాట్లాడేవాడిని. పెళ్ళికి ముందు మాట్లాడడానికి వీలుండేది కాదు కాబట్టి ఎక్సర్ సైజ్ పుస్తకాల్లో సీరియల్  ఉత్తరాలు రాసేవాడిని. అవన్నీ మా ఆవిడ పుట్టింటి అరణంగా ఇప్పటికీ అపురూపంగా దాచి పెట్టుకుంది. అలాటివాడిని ఏమైందో ఏమిటో అసలు ఆవిడతో మాట్లాడడమే మానేసాను. చుట్టూ ప్రపంచం పెరిగిపోయి పెళ్ళాంతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోవడం అనేది మగవాళ్ళకు పెద్ద అబ్బురమేం కాదు. కానీ బొత్తిగా మాటలు లేకపోతే ఎల్లా. అల్లా ఆలోచించి ఆలోచించి ఎల్లాగైనా సరే మళ్ళీ పాతకాలం మాటా ముచ్చట్ల కాలంలోకి వెళ్లాలని టైం మిషన్ ఎక్కాను. దిగి చూసేసరికి మొత్తం సీనే మారిపోయింది. అరవ తెలుగు సీరియల్ చూస్తూ మా ఆవిడ సమస్త ప్రపంచాన్ని మరచిపోయి అందులో లీనమై వుంది. కల్పించుకుని మాట్లాడబోతే, 'వుండండి అత్త కోడలికి విషం కలిపిన కాఫీ ఇచ్చి ఇప్పటికి మూడు వారాలయింది ఇంతవరకు తాగి చావలేదు. తాగినా చస్తుందో లేదో తెలిసి చావడం లేదు. మీరు చెప్పే  ముచ్చట్లు ఏవో మధ్యలో ప్రకటనలు వస్తున్నప్పుడు చెప్పండి' అనేసింది. ఓహో! మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో దాక్కున్న చిలకలో వున్నట్టు మా  ఆవిడ వీక్ నెస్ ఎక్కడ వుందో తెలిసిపోయింది. అక్కణ్ణించి, రెండో గదిలో వున్న రెండో టీవీలో అరవ తెలుగు హిందీ సీరియళ్లన్నీ వరసపెట్టి ఏకధాటిగా చూడ్డం మొదలు పెట్టి, మా  ఆవిడతో మాటలు కలిపి చూసాను. ఈ చిట్కా అమోఘంగా పనిచేసింది. జీడిపాకం కధలే కాబట్టి తోచినట్టు  కధ అల్లి,  జరిగిందీ జరగబోయేది వూహించి చెబుతుంటే  మా ఆవిడ చెవులొప్పగించి వినడం మొదలెట్టింది. ఆ తరువాత నేను ఏ కబుర్లు చెప్పినా తల వూపడం ఆవిడ వొంతయింది.
చట్టబద్ధ హెచ్చరిక: ఇలాటి చిట్కాలు ఎల్లరు భార్యల దగ్గర ఎల్లకాలం పనిచేయకపోవచ్చు. అందరూ మా ఆవిడలాంటి గంగి గోవు రకాలు కాకపోవచ్చు కదా!

(చక్కటి టీవీ కార్టూన్ గీసిన కార్టూనిష్టు గారికి ధన్యవాదాలు)


ఆ రోజులే వేరు


అమరావతి నిర్మాణానికి  పర్యావరణ  అనుమతుల విషయంలో గందరగోళం. ఒక టీవీ వాళ్ళు కేంద్రమంత్రి అనుమతులన్నీ ఇచ్చేసారంటారు. మరో టీవీ లో అనుమతులు ఇవ్వడానికి మేము సిద్ధం, రాష్ట్ర  ప్రభుత్వం నుంచి నివేదిక రావడమే తరువాయి అన్నట్టు స్క్రోలింగు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?

చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి  అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం  నా విధి. అది నేను పాటించాను.  తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.

ఇలా  ఉండేవి ఆ రోజులు. నిజంగా  ఆ రోజులే వేరు.            

15, అక్టోబర్ 2015, గురువారం

మరపురాని మనుషులు


తురగా కృష్ణ మోహన రావు పేరిట ఉత్తమ జర్నలిష్ట్ అవార్డ్ స్వీకరించిన సందర్భంలో నా ప్రసంగ పాఠం  
"తురగా కృష్ణ మోహన రావుగారు.
"ఎందుకో ఆయన కూడా ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా – మరో  ఒకటిరెండేళ్ళలో నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే -  ఏ లెక్కన చూసుకున్నా – నా దృష్టిలో   ఆయన బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్ అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో ఈ  అవార్డ్ ఏమిటి చెప్పండి.  కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
"జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు – దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
"ఇక అసలు విషయానికి వస్తే – నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక వారపత్రికలో ‘రాజధాని కబుర్లు’ అనే శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన  అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా  కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను. అది చిన్న ఉద్యోగం కావచ్చు.  అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి నాకది పెద్ద ఉద్యోగమే.
"కృష్ణ మోహన రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు  చదివిన అనుభవంతో నేను ఈ మాట  చెబుతున్నాను.
"తురగా వారు చిలికించిన  హాస్యం లాంటి హాస్యం  ఈ నాటి సమాజానికి ఎంతో  అవసరం. జనంలో  ‘నవ్వు’ చచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు, నవ్వించే వాళ్ళు  బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం. వుంది.  ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ ‘మాట కచ్చేరీ’ మొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని చూస్తూ మీ ఆవిడ కూడా ‘ఏమిటీ నవ్వేది మా ఆయనేనా’ అని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ మాట్లాడితే నవ్వుల తుపాన్.
"ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ‘ఆరోగ్య శ్రీ’
"రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
“మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.”
"పుట్టగానే ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు  చదవండి. వాటిని  ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
"ఎనీ డౌట్ ?  నాకయితే లేదు.
"ఇది సగర్వంగా  నేనిస్తున్న సర్టిఫికేట్"


('తురగా అవార్డు'కు నన్ను ఎంపిక చేసిన తురగా జానకీరాణి గారు ఈ లోకం నుంచే తప్పుకుని నేటికి ఏడాది. ఈ ప్రధమ వర్ధంతి రోజున ఆవిడను మరో సారి ఇలా గుర్తు చేసుకుంటున్నాను - భండారు శ్రీనివాసరావు)