14, అక్టోబర్ 2015, బుధవారం

రేపు లేదు


పెసిమిజం అనుకోకండి. నిజంగా  రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.
మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి. ఒక రోజు ఆవిడ ఓ మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది. ఎలాటి రోగంరొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.
మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించలేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ గుర్తులా మిగిలి పోయింది.
‘రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.     
నిజమే అనిపించింది.
అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట. 
ఎందుకంటే రేపు మనది కాదు.  

13, అక్టోబర్ 2015, మంగళవారం

ప్రజలు గమనిస్తున్నారు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 15-10-2015, THURSDAY)
అక్టోబరు ఇరవై రెండో తేదీన, విజయ దశమి పండుగ వేళ  ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునాది రాయి వేయబోతున్నారు. అయిదు కోట్ల ఆంద్ర ప్రజలకు నిజంగా ఇది పర్వదినమే. సందేహం లేదు. యావత్  ప్రజానీకాన్ని ఈ చారిత్రిక కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక నూతన మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచిప్రతి పురపాలక వార్డు నుంచి కొంత మట్టి, కొన్ని నీళ్ళు సేకరించి నూతన రాజధాని ప్రాంతానికి తరలించే  కార్యక్రమం ఇప్పటికే పెద్దఎత్తున సాంప్రదాయబద్ధంగా మొదలయింది కూడా. ‘మన మట్టి- మన నీరు- మన సంకల్పం- మన అమరావతి’ అనే ఈ  ఆలోచనలో నవ్యత్వం ఉన్నమాట నిజమే. అది  మెచ్చదగిందే. అయితే ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న ఈ  మహత్తర శంకుస్థాపన  కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్న విధానం పరికిస్తే మాత్రం అంతా ఏకపక్షంగా సాగిపోతున్నదేమో అనే శంక కలుగుతోంది.
బీహారులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో కేవలం యాభయ్ ఏడు శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమరావతి నగర శంకుస్థాపన ఏర్పాట్లు గురించి చెబుతూ ఈ బీహారు ఎన్నికల ప్రస్తావన ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. సంబంధవుందని చెప్పడానికే ఈ ప్రయత్నం. అయిదేళ్ళ క్రితం జరిగిన బీహారు ఎన్నికల తొలి దశలో ఓటు వేసిన వారి శాతం కన్నా ఈ నెల పన్నెండో తేదీ సోమవారం నాడు జరిగిన మొదటి దఫా పోలింగులో అది ఈసారి ఏడు శాతం పెరిగింది.  తాజా  ఎన్నికల ప్రచార ఉధృతితో పోల్చి చూస్తే పోలింగు బూతులకు వెళ్లి బాధ్యతగా  ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఆ మేరకు పెరగలేదనే చెప్పాలి. మొదటి విడత పోలింగు ప్రకారం ప్రతి నూరుమంది ఓటర్లలో కేవలం యాభయ్ ఏడు మంది మాత్రమే ఓటు వేసారు. అసలు ఎన్నికలతో  నిమిత్తం పెట్టుకోకుండా నిర్లిప్తంగా   ఇళ్ళ వద్దనే ఉండిపోయిన వారు నలభయి మూడుమంది ఉన్నారన్న మాట.  నూటికి నూరు శాతం ఓటింగు అనేది ఎన్నడూ జరగని వ్యవహారమే. డెబ్బయి శాతానికి మించి పోలింగు జరగడం అనేది కూడా  చాలా అరుదు.  మొత్తం ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికలో గెలిచిన  అభ్యర్ధికి  పడే  వోట్ల శాతం చాలా తక్కువే. ఈ యాభయ్ ఏడు శాతం మందిలో కూడా ఆయా పార్టీల కార్యకర్తల్నిఅభిమానుల్ని మినహాయిస్తేఎటువంటి ముందస్తు నిర్ణయానికి రాకుండా కేవలం అభ్యర్ధి గుణగణాల ప్రాతిపదికన ఓటు వేసేవారు కూడా గణనీయంగా వుంటారు.  అంటే ఏమిటన్నమాట. ఇటీవలి కాలంలో మనల్ని పాలిస్తున్న ఏ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు పూర్తిగా లేదు. పోలయిన ఓట్లలో ఎక్కువ తెచ్చుకున్న అభ్యర్ధి విజేతగా చట్ట సభలో అడుగుపెడతాడు. అలాటి అభ్యర్ధుల్ని ఎక్కువమందిని గెలిపించుకున్న పార్టీ అయిదేళ్లపాటు పాలిస్తుంది. అంటే ఒకరకంగా ప్రజల్ని పాలిస్తున్న ప్రభుత్వాలన్నీ మైనారిటీ సర్కారులే. కానీ రాజ్యాంగం ఈ లెక్కలు ఒప్పుకోదు. ఎక్కువ ఓట్లుసీట్లు గెలిచినవాళ్ళే రాజ్యాంగం ప్రకారం పాలకులు. మరి అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకుఈ లెక్కలకూ ఏమిటి సంబంధం అంటే వుంది. రాజ్యాంగబద్ధంగా కాదు. నైతికంగా. అదెట్లా అంటే-
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీకి  గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కట్టబెట్టి, రాష్ట్రాన్ని పాలించే హక్కును ఆ పార్టీకి  ప్రజలు ఇచ్చారు.  ఆ పార్టీ రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా పధకాలుప్రాజెక్టులు రూపొందించుకునే వెసులుబాటు హక్కును కూడా ప్రజలే ఆ పార్టీకి ఇచ్చారు. అయితే మొత్తం ఓట్లుఆ ఓట్లలో పోలయిన ఓట్లువీటిని పరిగణనలోకి  తీసుకుంటే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం అంత గణనీయం కాదు. ఈ పరిస్తితి ఒక్క తెలుగు దేశానిదే కాదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ తరపున గెలిచినాఆ అభ్యర్ధిది ఇదే వరస. అభ్యర్ధుల్ని గెలిపించుకున్న పార్టీలదీ ఇదే వరస. అంచేతఅయిదు కోట్ల ప్రజలందరికీ  సంబంధించిన అమరావతి వంటి రాష్ట్ర  రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించే నైతిక హక్కును  మెజారిటీ ప్రజలు తెలుగు దేశం పార్టీకి మాత్రమే గుంపగుత్తగా దఖలు పరచినట్టు అర్ధం కాదు. అయితే రాజధానిని ఎక్కడ నిర్మించాలిఎలా నిర్మించాలి అనే విషయంలో పాలకపక్షం తీసుకునే నిర్ణయాలను  తప్పుపట్టే అవకాశం లేదు. ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన ఆ పార్టీకి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి ఒక విషయం. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో  ఆయనే సీనియర్. ఇంత  అనుభవం వుండి కూడా, మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన  కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఒక  రాజకోవిదుడి దృష్టితో కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు.
విడిపడి ఏర్పడ్డ ఆ కొత్త  రాష్ట్రానికి రాజధాని అనేది ఇప్పుడు ప్రధాన ఆవశ్యకత. నూతన రాష్ట్ర అవసరాల జాబితాలో దాని ప్రాధాన్యం మొట్ట మొదటిది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం  పూనుకున్నప్పుడుఆ ప్రయత్నానికి ప్రజలుపార్టీలు  అందరూ సహకరించాల్సిందే. కానీవారిని ఈ మహత్తర కార్యక్రమంలో  కలుపుకోవడంకలిసిరానివారిని కూడా కలిసివచ్చేలా చేసుకోవడం, ప్రత్యేకించి ప్రజాస్వామ్య యుగంలో  పాలక పక్షం ప్రధాన బాధ్యత. ఈ కర్తవ్య నిర్వహణలో పాలకపక్షం బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు.  కనీసం ఆ దిశగా ప్రయత్నించిన  దాఖలాలు కూడా కానరావడం లేదు. పండుగలా చేసుకోవాలని ఓ పక్క పిలుపు ఇస్తున్నారు. మళ్ళీ  అదే నోటితో, బొట్టు పెట్టి పిలవడానికి ఎవరింట్లో పండుగ’ అని మెటికలు విరుస్తున్నారు. పండగ అంటే ఏమిటి. వేలాదిమంది కలిసి చేసుకునే ఉత్సవాలు పండుగే. ఇళ్ళల్లో ఎవరికి వారు చేసుకునే పండుగలు పండుగే.  రాష్ట్రం మొత్తానికి ఇది పండుగ అయినప్పుడు అందరూ కలిసి చేసుకుంటేనే అది పండుగలా వుంటుంది. పార్టీలకి అతీతంగా ఇది జరగాలని పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కోరుకుంటున్నారు. కలిసిరాని వాళ్ళు ఉండవచ్చు. కలుపుకు పోవాలని చూసినా వాళ్ళు కలిసి రావడం లేదని సమర్ధించుకునే అవకాశాన్ని పాలక పక్షం చేజేతులా జారవిడుచుకుంటోంది. ప్రభుత్వం ఈ  విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది అనే మంచి మాట నలుగురి చేతా అనిపించుకునే సావకాశాన్ని కూడా ఒదులుకుంటోంది.  మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇంత  ముఖ్యమైన శుభసందర్భంలో యావన్మందిని కలుపుకు పోవడం లేదన్న అభిప్రాయం జనంలో లేదని పాలక పక్షానికి చెందినవారు కూడా గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాజధాని నగర శంకుస్థాపన వంటి  విషయాల్లో ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించగల నైతిక హక్కు వారికి లేదని చెప్పడానికే ఓట్ల శాతం లెక్కలు వివరించాల్సివచ్చింది. రాజ్యాంగ హక్కు ఉండవచ్చు. అది వేరే విషయం. ఇది నైతికతకు సంబంధించిన అంశం.                                 
 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీవారికి టీడీపీ పాలక పక్షంగా వుండడం ఇష్టంగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది పాలక పక్షం కాకుండా పోదు. అల్లాగే,  వై.ఎస్.ఆర్.సీ.పీ. అంటే టీడీపీ నాయకులకుశ్రేణులకు గిట్టకపోవచ్చు. అంతమాత్రాన ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాకుండా పోదు. పైగా శాసనసభలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మాత్రమే కాదుఏకైక ప్రతిపక్షం కూడా. కానీ ఈ వాస్తవాలను   ఏనాడూ గుర్తించిన దాఖలా లేదు. అసలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రతి అంశం, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పీ. అనే  రెండు పార్టీల మధ్య వ్యవహారంగా మారిపోతోంది. ‘నీదా నాదా పైచేయి’ అన్న పద్ధతిలో రూపు దిద్దుకుంటోంది. ఇదొక విషాదం.  
ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారి పల్లె నుంచి అమరావతి ప్రాంతానికి మట్టి, నీళ్ళు తరలించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ‘కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అయిదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు ప్రతిబింబించేలా నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది’ అని. శంకుస్థాపన కార్యక్రమంతో ఆ శుభ కామనకు అంకురార్పణ జరగాలని కోరుకుందాం. 
  
ఉపశృతి : ‘నైతిక హక్కుచిత్తశుద్ధిప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే  ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతు నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదుఅసలు ఏ పార్టీకి చెందనివాళ్ళురాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.   (13-10-2015)  

NOTE: Courtesy Image Owner


9, అక్టోబర్ 2015, శుక్రవారం

ప్రతిపక్షరహిత ప్రజాస్వామ్యం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-10-2015, SUNDAY)

ఒకానొక కాలంలో మహాత్మా గాంధీ, లోక్ నాయక జయప్రకాష్ నారాయణ్ ప్రవచించిన పార్టీ రహిత ప్రజాస్వామ్యం అనే సూత్రాన్ని నాస్తిక ఉద్యమ నిర్మాత ‘గోరా’ (గోపరాజు రామచంద్ర రావు), 70 వ దశకంలో  ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల జరిగే మేలుకన్నా కీడే ఎక్కువన్నది ఈ సిద్ధాంత కర్తల సూత్రీకరణ. కాల క్రమంలో ఈ వాదన పూర్తిగా మరుగున పడిపోయింది.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని అన్ని వ్యవస్థలను రాజకీయ పార్టీలే శాసిస్తూ వస్తున్నాయి.  ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు ఒదిలి అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం  పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధం లేని  పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం. ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసి, ప్రతిపక్షాలన్నీ ఏకమై, తమ పార్టీ పేరును, సిద్ధాంతాలను పక్కనబెట్టి  ఒకే పేరుతొ, ఒకే జెండాతో, ఒకే ఎన్నికల గుర్తుతో,  ఒకే ఒక్క అజెండాతో,  కాంగ్రెస్ ఓటమి, ఇంకా గట్టిగా చెప్పాలంటే నాటి పాలకురాలు ఇందిరాగాంధీని గద్దె దించడానికి జరిగిన ‘జనతాపార్టీ’ ప్రయోగం, ఈ స్వార్ధ రాజకీయ కీచులాటల కారణంగానే మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోయింది.
పాలక పక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు ఈనాడు ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతి పక్షాలను గౌరవించడం సంగతి అటుంచి అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. చట్ట సభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు,  ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి. ఈ బలహీనత వల్లే, ఓ పక్క  పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా సాగిపోతున్నప్పుడు కూడా,  ఓ ఖండన ప్రకటన చేసి ఊరుకోవడం మినహా గట్టిగా నిలదీయలేకపోతున్నాయి. అంతే కాదు గద్దె ఎక్కిన వెంటనే, ఒకప్పుడు తాము కూడా ప్రతిపక్ష  పాత్ర పోషించిన విషయం గుర్తు చేసుకోవడానికి సయితం  పాలక పక్షాలు ఇష్టపడడం లేదు. ఆ రోజుల్లో చెప్పిన మాటలను, చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను స్పురణకు తెచ్చుకోవడానికి కూడా ఇచ్చగించడం లేదు. పైపెచ్చు ఇప్పుడు తాము అనుభవిస్తున్న పాలక పక్షం హోదా సదా  శాస్వితం అనే భ్రమలో ఉంటున్నాయి.
అయితే చరిత్ర చెప్పే పాఠాలు వేరుగా వున్నాయి.
1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పటివరకు కనీ వినీ ఎరుగని అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 520 లోక సభ స్థానాల్లో ఏకంగా 411  సీట్లు గెలుచుకుని  భారత ఎన్నికల ఇతిహాసంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
రాజీవ్ గాంధి తల్లిగారయిన ఇందిర హయాములో కానీ, ఆయన  తాతగారయిన భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. అలాగే నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అధినాయకుడు నరేంద్ర మోడీ పార్టీకి ఆ నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ సువిశాల భారతంలో లభించిన సీట్లు అక్షరాలా రెండే రెండు. వాటిల్లో ఒకటి అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్ధి  గెలుపొందిన  గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.    అలాటి బీజేపీ తిరిగి అయిదేళ్లలోనే పుంజుకుని ఎన్నికల్లో 85 స్థానాలకు ఎగబాకింది. 1984 లో రికార్డు స్థాయిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ,  అదే రాజీవ్ నాయకత్వంలో 197 స్థానాలకు పడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమయింది. 1984 లో 30 సీట్లు గెలుచుకుని లోక సభ లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళ తరువాత జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు గెలవగలిగింది.
పొతే, ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా దేశ ప్రజలు తమ ఓటు హక్కు ఉపయోగించి ఇదేమాదిరి రికార్డులకు తెర తీసారు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం 336 సీట్లు సంపాదించి  ఎన్డీయే కూటమి సాధించిన విజయం నిజంగా చరిత్రాత్మకం. సంకీర్ణ యుగంలో జాతీయ పార్టీల ప్రాభవం క్రమేపీ కనుమరుగయిపోతున్న సమయంలో మోడీ, బీజేపీ గుర్తు మీద  282 సీట్లు సంపాదించి పెట్టి ఆ పార్టీకి అపూర్వ వైభవం కట్టబెట్టారు. ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల ఆసరా, అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించడం ఇప్పటి రోజుల్లో చాలా ఘనమైన సంగతే. అయితే నెలలు తిరక్కుండానే ఏం జరిగిందన్నది కూడా గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురయిన అవమానం అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో పసికూన ‘ఆప్’ చేతుల్లో  ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిన విషమ స్తితి. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో ‘ఆప్’ భారత ఎన్నికల చరిత్రనే తిరగరాసింది.  ఢిల్లీ అసెంబ్లీ లోని మొత్తం డెబ్బయి స్థానాల్లో అక్షరాలా అరవై ఏడు సీట్లలో ఆ పార్టీ  విజయం సాధించి, అప్పటికి  మంచి ఊపులో ఊగిపోతున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు చుక్కలు చూపించింది. దేశానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళుగా జరిగిన మొత్తం మూడువందల అసెంబ్లీ ఎన్నికల్లో  ఎప్పుడూ ఏ  పార్టీ కూడా ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోలేదు.
కాబట్టి రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు సాధించబోయే విజయాలకు సోపానాలు కావాలి. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు.  అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు. అధికార పీఠం అనేది ఈ ప్రజాస్వామ్య యుగంలో శాస్వితం కాదు. అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట  కాల వ్యవధిలోనే  ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాస్వితంగా  మిగిలిపోతాయి.

ప్రజలు అధికారం ఇచ్చింది తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి కాదు. దీపం ఉండగానే సొంత ఇల్లు చక్కబెట్టుకోవడానికి అంతకంటే కాదు.  సమాజ హితాన్ని కాంక్షిస్తూ యావత్  ప్రజానీకానికి మేలు చేసే పనులు చేస్తూ సంక్షేమ సమాజాన్ని నిర్మించడానికి. ఇది గుర్తు చేయడానికే, చరిత్ర చెప్పే పాఠాలను ఇలా గుర్తు చేయాల్సి వస్తోంది. (09-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595          

NOTE: Courtesy Image Owner 

7, అక్టోబర్ 2015, బుధవారం

ఓటు, హక్కా? బాధ్యతా ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 08-10-2015, THURSDAY)

‘హక్కు ఒకరు ఇస్తే తీసుకునేది కాదు,  జన్మతో వచ్చేదే  హక్కు’ అనే డైలాగులు అప్పుడప్పుడూ వినబడుతుంటాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కూడా పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతివారికీ ఓటు హక్కు లభిస్తుందని అంటున్నారు. నిజంగా అలా ప్రతిఒక్క పౌరుడికీ ఓటు హక్కు లభిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఓటు ప్రతి ఒక్క పౌరుడి  హక్కు అంటారే కాని, ఆ హక్కును హక్కుభుక్తం చేసుకోవాలంటే ఎన్నెన్ని చిక్కుముళ్ళు ఎదుర్కోవాలన్నది ఆ హక్కు సంపాదించుకున్న ఎవరినడిగినా సరిపోతుంది. రాజ్యాంగంలోని 326 అధికరణం ప్రకారం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం  19 వ సెక్షన్ కింద  18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక వెసులుబాట్లు కల్పించారు. ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం ఇంటింటికీ సిబ్బందిని పంపి ఓటర్లను చేర్పించే కార్యక్రమం నిర్వహిస్తుంది.  లేదా ఏటా జనవరి నెలలో నిర్వహించే  ఓటర్ల జాబితా సవరణ  ప్రక్రియను కూడా  ఇందుకోసం ఉపయోగించు కోవచ్చు. నిర్దేశిత ధరఖాస్తు పత్రంలో వివరాలను పొందుపరచడం ద్వారా ఓటు హక్కు పొందే వీలుంది. సంబంధిత అధికారి, మీరు అందచేసిన వివరాలతో సంతృప్తి చెందితే మీ పేరును,   మీ నివాసం వున్న   ఓటర్ల జాబితాలో చేరుస్తారు. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం వుంది. ఒక నియోజక వర్గంలో నివాసం వుండే వ్యక్తి ఆ నియోజకవర్గంలోనే మాత్రమే  ఓటరుగా ఉండగలుగుతాడు. ఒకే వ్యక్తి పేరు పలు నియోజక వర్గాల ఓటర్ల జాబితాలో ఉండేందుకు చట్టం అనుమతించదు.


భన్వర్  లాల్ చెప్పినట్టు చట్టం ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించింది. ఆ హక్కు ఎలా పొందాలో కూడా నిర్దేశించింది. అయితే చట్టంలో పేర్కొన్నంత సులభంగా లేదు ఆచరణలో పరిస్తితి అన్నది  చాలామందికి అనుభవైకవేద్యం.
నిరుడు సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. అనంతరం రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాదు రాజధాని కావడం మూలాన రాష్ట్రంలోని మిగిలిన ఇరవై రెండు జిల్లాలనుంచి గత అనేక సంవత్సరాలలో పెద్ద ఎత్తున వలసలు సాగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధులకోసం, ఉన్నత విద్యల కోసం, వ్యాపారాల నిమిత్తం,  వైద్య అవసరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాదుకు తరలివచ్చారు. రాజకీయుల మాట చెప్పేపనేలేదు. ఇలా వచ్చిన వారిలో కొందరు  పూర్తిగా స్థిరపడి పోయారు. కొందరు రెండు పడవలమీదా కాళ్ళుoచి కాలం గడుపుతూ వచ్చారు. అలాటివారిలో చాలామందికి హైదరాబాదు నగరంలో సొంత నివాసాలు వున్నాయి. వాటిని కూడా తమ స్తోమతకు తగ్గట్టుగా వివిధ ప్రాంతాలకు  మారుస్తూ పోయారు. దానితో పాటు వారి చిరునామాలు కూడా మారిపోయాయి. నగరం చాలా విశాలమైంది కాబట్టి అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. నివాసం మారినప్పుడల్లా చిరునామాలు మారాయి కాని ఓటర్ల జాబితాలో ఆ మార్పులు చోటు చేసుకోలేదు. ఎక్కడయితేనేం ఓటు వేయడానికి అనుకుని చాలామంది జాబితాలో మార్పులు చేసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించి ఉండక పోవచ్చు. దానితో ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని వారి ఓటు హక్కును నిర్ధారించడానికి వెళ్ళిన సిబ్బందికి అలాటి ఓటర్లు కనిపించకపోయే అవకాశాలు మెండు. అపార్ట్ మెంటు సంస్కృతి జీర్ణించుకుపోయిన ఈనాటి జనాల్లో పక్కవారిని గురించి పట్టించుకునే తీరిక తక్కువ. గతంలో ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయి వుండడానికి ఇదొక కారణం కావచ్చు. వెనుకటి నివాసంలో నివసిస్తూ ఉండని ఒకే ఒక కారణంతో అలాటి వారిని జాబితా నుంచి తొలగించడం అంటే వారి హక్కును కాలరాసినట్టే. 
ఇక ఓటర్లలో మరో తరగతి వారున్నారు.  నిజానికి ప్రతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుతూ పోతున్నది ఈ తరగతి వాళ్ళే. వాళ్ళు పొట్టపోసుకోవడం కోసం పొట్టపట్టుకుని బస్తీలకు వస్తారు. కూలీనాలీచేస్తూ, ఆటోలు, టాక్సీలు నడుపుతూ, రోడ్డుపక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వాచ్ మన్లు గా, పనిమనుషులుగా, వంట మనుషులుగా ఇలా నానా రకాల వృత్తులు చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. కిందా మీదా పడితే కాని బతుకుగడవని ఈ బాపతు వాళ్లకు చెప్పుకోవడానికి ఓ చిరునామా అంటూ పక్కాగా వుండదు. ఎక్కడ పనిదొరికితే అదే వారి నివాస ప్రాంతం. అదే వారి అసెంబ్లీ నియోజక వర్గం. ఇలాటి వారికి బస్తీ రాజకీయ నాయకులు సహకరించి వారిని ఆ ప్రాంతంలో ఓటర్లుగా చేర్పిస్తారు. ఇది బహిరంగ రహస్యమే. వారికి వారి వారి ఊళ్ళల్లో కూడా ఓటు హక్కు వుంటుంది. అక్కడి స్థానిక రాజకీయ నాయకులే కనిపెట్టుకుని ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు వుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదీ నలుగురికీ తెలిసిన రహస్యమే. నిజానికి ఇటువంటి రాజకీయ ఏర్పాటు లేకుండా వుండి వుంటే దేశంలో ఓటర్ల సంఖ్య ఇంత  గణనీయంగా పెరిగిపోయే అవకాశాలు తక్కువ  అనేవాళ్ళు లేకపోలేదు. ఇటువంటి ద్వంద్వ ఓటు హక్కు కలిగిన వారిని ఏరివేయడం అంత అసాధ్యమేమీ కాదు. ఒకే పేరుతొ వంట గ్యాస్ కనెక్షన్లు అనేకం కలిగివున్నవారిని గ్యాస్ కంపెనీలు కంప్యూటర్ పరిజ్ఞానం వాడి ఒక్క మీట వేటుతో తొలగించిన సంగతి తెలిసిందే.  
ప్రతి ఎన్నికలో, అది ఓ క్లబ్ ఎలెక్షన్ కావచ్చు. సొసైటీ ఎన్నిక కావచ్చు, వార్డు మెంబరు ఎన్నిక కావచ్చు ఓటర్లను సకాలంలో జాబితాలో  చేర్పించుకుంటేనే అభ్యర్ధులు ఒడ్డున పడతారు. ఈ మధ్య ఓ కొత్త సంస్కృతి మొలకెత్తుతోంది. సరయిన ఓటర్లను దగ్గరుండి చేర్పించుకోవడం ఒక పద్దదయితే, తమకు ఓటు వెయ్యరు అని నమ్మకం వున్న  సిసలయిన ఓటర్లను కూడా జాబితానుంచి తొలగించే విధానం మరోటి.  హైదరాబాదులో పేరొందిన ఒక క్లబ్ ఎన్నికల్లో, ఓటర్లను పెద్దఎత్తున జాబితానుంచి తొలగించారని ఆరోపిస్తూ కొందరు ఈ మధ్య  కోర్టు గడప ఎక్కారు. అంటే ఎన్నికల్లో గెలుపు కోసం పట్టే అడ్డదార్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే వుందన్న మాట.                    
 త్వరలో హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు కాబట్టి నగరంలో రాజకీయ సందడి మొదలయింది. పాలక పక్షం కావాలని లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాల ఆరోపణ. ఇప్పుడు పాలిస్తున్న పార్టీ కూడా గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇదేమాదిరి ఆరోపణలు చేసివుండవచ్చు. అది రాజకీయాల్లో సహజాతిసహజం. కానీ చట్టం ప్రసాదించిన ఓటు హక్కు సంగతి ఏమిటి?  నివాసం మారినప్పుడల్లా  ఓటర్ల జాబితాలో పేరు మారిపోతుంటే అటువంటి అసలు సిసలు ఓటర్లకు ఉపశమనం ఎలా? ఓటు హక్కు కూడా ఇటువంటి సాంకేతిక కారణాలతో చేజారిపోతుంటే దానికి పరిష్కారం లేదా? పద్దెనిమిదేళ్ళు నిండిన వెంటనే ఒక హక్కు మాదిరిగా లభించాల్సిన ఓటు,  ఇలా ప్రతి రెండుమూడేళ్ళకు అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిందేనా? ఇప్పుడు అందుబాటులో వున్న  అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు ఓ మార్గం చూపలేదా?
నిజమే! ఓటు ప్రతి పౌరుడి హక్కు. పద్దెనిమిదేళ్ళు నిండగానే లభించే ఆ హక్కు చనిపోయేవరకు ఎందుకు వుండదు? నివాసం మారిన ప్రతిసారీ ఎందుకు పునరుద్దరించుకోవాలి? ఇటువంటి మార్పులను అతి తక్కువ శ్రమతో చేసుకునే వీలు లేదా?   ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఊదరగొడుతుండే రాజకీయ నాయకులు ఈ విషయంలో ఎందుకు చొరవ చూపరు?
వంట గ్యాస్ బుక్ చేసి,  సిలిండర్ వచ్చే సమయంలో ఇంట్లో ఉండని వినియోగదారుడికి ఓ ఎస్.ఎం.ఎస్. వస్తుంది, ‘పలానా సమయంలో ఇంటికి తాళం వేసి వుంది’ అని. ఇలాగే ఓటరు తనిఖీకి ఒక  కాల్ సెంటర్ పెట్టి వాస్తవాలను నిర్ధారించుకునే వీలు లేదా?
కాలక్రమంలో మనిషి రూపురేఖలు మారిపోవచ్చు. చేతి రాతతో పాటు సంతకం చేసే పద్దతిలో మార్పు రావచ్చు. కానీ లావాదేవీ పత్రాలపై నిరక్షరాస్యులు వేసే బొటనవేలి ముద్రలు మాత్రం దశాబ్దాల తరువాత కూడా మారిపోని విషయం గమనంలో పెట్టుకుంటే మనుషులను గుర్తించడానికి మరింత మేలైన విధానాలు స్పురించే అవకాశం తప్పకుండా వుంటుంది. నివాసాలు మారినప్పుడల్లా ఓటర్ల జాబితాలో ఆ మేరకు సవరణలు చేసుకునే అవకాశం లేకపోలేదు. కానీ అందుకు అనుసరించాల్సిన  ప్రక్రియ,  నిరక్షరాస్యులు ఎక్కువగా వున్న మన దేశానికి పెద్దగా ఉపయుక్తం కాదు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కాకపోయినా కొన్ని అందుబాటులో వుండే ప్రభుత్వ ఆఫీసుల్లో అయినా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి తగు సిబ్బందిని నియమించడం ప్రయోజనకరంగా  వుంటుంది.
పొతే ఎన్నికల క్రతువు నిర్వహించే ఎన్నికల సంఘం విషయంలో ఒక మాట. అయిదేళ్ళకోమారు మాత్రమే పని ఉంటుందనే ఉద్దేశ్యంతో కాబోలు, ఎన్నికల సంఘానికి శాస్విత యంత్రాంగం లేదు. ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే సిబ్బందితోనే పని గడుపుకోవాలి. చెప్పుకోవడానికి విశేషాధికారాలు ఉన్నప్పటికీ  సంఘం చెప్పుచేతల్లో పనిచేసే సొంత సిబ్బంది ఉండకపోవడం శోచనీయం. గతంలో ఎన్నికలు సకృత్తుగా వచ్చేవి. ఇప్పుడలా కాదు. ప్రతి ఆరు నెలలకూ, ఏడాదికీ దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలే. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘానికి శాస్విత ప్రాతిపదికమీద స్వతంత్రంగా వ్యవహరించగల సిబ్బంది అవసరం ఎంతైనా వుంది.
బోగస్ ఓట్లను ఏరివేయకపోవడం తప్పే. అయితే,  అర్హత ఉన్నవారి ఓట్లను ఏదో ఒక నెపంతో తొలగించడం కూడా అంతే  తప్పు.                    
అర్హులయిన వారికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ హక్కు వారు పక్కాగా  అనుభవించేలా చేయడం కూడా వాటి బాధ్యతే. (07-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner 

అభినవ కార్తవీర్యార్జునులు


వెనుకటి రోజుల్లో సినిమాల్లో అత్తగారి పాత్రలు వేసే సూర్యాకాంతం వంటి నటీమణులు రొండిన తాళం చేతుల గుత్తి దోపుకుని కనిపించేవాళ్ళు. ఆ గుత్తి ఇంటిపై అధికారానికి గుర్తు. దాన్ని కోడలి చేతిలో పెట్టడం అంటే అప్పటినుంచి ఇంటి పెత్తనం అంతా కోడలికి దఖలు చేసినట్టే అనుకోవాలి. ఇంటి తాళం చెవులు, ఇనప్పెట్టె తాళం చెవులు ఆ గుత్తిలో వుంటాయి కాబట్టి దానికా విలువ. ఇప్పటి అపార్ట్ మెంటు సంస్కృతిలో ఇంటికి ఒక తాళం చెవే. బ్యాంకు లాకర్ల ధర్మమా  అని ఇళ్ళల్లో ఇనప్పెట్టెలు ఎలాగూ లేవు. కాకపోతే కంప్యూటర్ల పుణ్యమా అని కొత్త తాళం చెవులు వచ్చిపడ్డాయి. వీటిని గుత్తికి తగిలించి రొంటిన దోపుకునే వీలులేదు. కంప్యూటర్ కు ఒక పాస్ వర్డు. ఏటీఎం కార్డు కార్డుకో పాస్ వర్డు. ఆన్ లైన్ డబ్బు లావాదేవీలకి ఒకటి,  మెయిల్ ఐడీ కొకటి, ఫేస్ బుక్కుకొకటి. లింక్ డిన్ కు మరోటి. ట్విట్టర్ కు ఇంకోటి. పైగా అప్పుడప్పుడూ వీటిని మార్చుకుంటే మంచిదంటూ సలహాలు. వెనకటి తాళం చెవుల గుత్తిలా వీటిని మనసుకు తగిలించుకుంటేనే కానీ రోజుగడవని పరిస్తితి.


కార్తవీర్యార్జునిడికి వేయి చేతులే! కానీ ఈ యుగపు మనుషులకి ఈ నెట్ తాళం చేతులు రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయి.    
NOTE: Courtesy Image Owner

4, అక్టోబర్ 2015, ఆదివారం

తండ్రికి తనయ నివాళి


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, ఆ రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి, కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. ఈ విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. ‘మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ’  చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
“ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. ఆ నాన్న ‘దశావతారాలు’ పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.”




ఈ చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది ‘రాంపా’         

తెగుతున్న తీగెలు


‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను  ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు  అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు  తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం  అయినా ఎక్కడో సుతారంగా తాకుతాయి అతడి మాటలు.  మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న  మాల్ కే వెళ్లాలి. అంతా కలయ  తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. కానీ ఎక్కడో ఏదో తెగిపోతోంది. అతకడం తెలియడం లేదు.

(అచ్చంగా ఇలాగే కాకపోయినా ఈ మోస్తరు అభిప్రాయాలు వున్న ఇంగ్లీష్ పోస్ట్ పెట్టిన మా కోడలు హేమలీలకు కృతజ్ఞతలు)    
NOTE: Courtesy Image Owner