2, సెప్టెంబర్ 2015, బుధవారం

కపటం లేని మందహాసానికి కాపీరైట్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఆరేళ్ళ క్రితం రాసింది) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. 




ఉరిశిక్షలు, ఆత్మహత్యలు, స్వచ్చంద మరణాలు

(Published in 'SURYA' telugu daily on 03-09-2015, Thursday)

http://epaper.suryaa.com/579326/Surya-Telugu-Daily/Thursday,-Sep-03,-2015#page/4/2

ప్రాణం తీసుకోవడం మహా పాపం అనే భావం సాధారణ  ప్రజల్లో వుంది. ఆత్మహత్యకు ప్రయత్నించడం శిక్షార్హమైన నేరంగా చట్టం పేర్కొంటోంది. ఇక ఏదైనా నేరంలో ఉరిశిక్ష పడ్డప్పుడు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందడం ద్వారా దాన్ని రద్దు చేసుకోవడానికి కూడా ఓ వెసులుబాటు వుంది. అసలు మరణ శిక్షలు విధించే పద్దతికే స్వస్తి చెప్పాలనే వాదన కూడా వుంది. ఈ నేపధ్యంలో ఉరిశిక్షవిధించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది.  ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రస్తుతం వున్న  విచక్షణాధికారాలు వినియోగిస్తున్న తీరు సరిగా లేదన్నది కమిషన్ అభిప్రాయంగా వుంది. మరణ దండన విధించిన కేసుల్లో ఏదైనా న్యాయ పరమైన తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దే రక్షణ కవచంగా పొందుపరచిన రాజ్యాంగ అధికరణాలు సరిగా అమలు కావడం లేదని కూడా పేర్కొన్నది.
సరే! ఇది కేవలం సిఫారసు మాత్రమె కాబట్టి ఇది చట్ట రూపం దాల్చి, మరణ దండనకు నూకలు చెల్లడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం వుంది.


ఇదిలా ఉండగానే  దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరో కేసులో ఒక సంచలన నిర్ణయం  వెలువరించింది. తమ మతాచారం ప్రకారం ప్రాయోపవేశ దీక్ష స్వీకరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మరణం కోసం నిరీక్షించే పద్దతి, ఖచ్చితంగా ఆత్మహత్య కిందికే వస్తుందని గత నెలలో  రాజస్థాన్ హైకోర్టు నిర్ధారించడాన్ని సవాలు చేస్తూకొందరు జైన మత విశ్వాసులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు తమ మత విశ్వాసుల ప్రాధమిక హక్కులను  ఉల్లంఘించేదిగా వుందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వుందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విని రాజస్థాన్ హై కోర్టు తీర్పు అమలు కాకుండా నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.            
ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఏదో ఒకవిధంగా ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాటిది జైన మతస్తులు తమ మతాచారం ప్రకారం స్వచ్చంద మరణం కోరుకోవడమే కాకుండా దాన్ని ఒక హక్కుగా భావించడం ఆ మతం గురించి అవగాహన లేనివారికి కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. జైనుల జీవన విధానంలో అహింసను పరమ ధర్మంగా భావిస్తారు. ఉపవాస దీక్ష ద్వారా మరణం పొందడం జైన మతంలో ఒక సాంప్రదాయం. దాన్ని ‘సంథారా’ అంటారు.  రాజస్థాన్ హై కోర్టు ఈ సాంప్రదాయాన్ని నేరపూరిత చర్యగా  పరిగణించడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ నిర్ధారణకు వచ్చేముందు జైన మత గురువులు, మత పెద్దల అభిప్రాయం తీసుకుని వుండాల్సిందని పేర్కొన్నది. ఒక మతాచారం కనుక సర్వోన్నత న్యాయ స్థానం ఈ విషయంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఒక పక్క లా కమిషన్ మరణ శిక్షను రద్దు చేయాలని సిఫారసు చేస్తే మరోపక్క స్వచ్చంద మరణాలకు మతాచారం ప్రాతిపదికగా సుప్రీం పచ్చ జెండా ఊపడం ఒకే రోజున జరగడం కాకతాళీయం కావచ్చు.
ఈ స్వచ్చంద మరణాలు మనకు  భీష్ముడి కాలంనుంచి ఎరుకే. పూర్వం యుద్ధాల్లో రాజపుత్ర సంతతికి చెందిన రాజులు వీరమరణం చెందినప్పుడు, రాణీవాసపు స్త్రీలు పరాయి మూకల చెరలో చిక్కకుండా చితి పేర్పించుకుని ఆత్మాహుతి చేసుకున్న సందర్భాలు చరిత్ర పుటల్లో కానవస్తాయి. ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సంఘటనలు రోమన్ చరిత్రలో కూడా వున్నాయి. యుద్ధంలో మరణం అనివార్యం అని భావించినప్పుడు రోమన్ సైనికులు తమకు తాముగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు.    
జపాన్ లో ఓ సాంప్రదాయం వుండేది. దాన్ని ‘హరకిరి’ అంటారు. ‘హరాకిరీ’ అనేవాళ్ళు కూడా వున్నారు. సమాజంలో కులీన కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజాగ్రహానికి  గురై,  మరణశిక్ష పడ్డప్పుడు, ఆ  అవమాన భారం భరించ లేక, తమకు తామే ఈ శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకునేవారు. జపానీయుల భాషలో ’హర’ అంటే ‘పొట్ట’. ‘కిరి’ అంటే కోసుకోవడం. పేగులు చీల్చుకునేలా పొట్టను కోసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘హర కిరి’ అంటారు. కాలక్రమంలో ఈ పదాలకు అర్ధం మారిపోయింది. ఆత్మహననాలకు, ఆత్మ హత్యలకు ఇప్పుడిది పర్యాయపదం అయింది.
విదేశాల్లో కొన్ని క్రైస్తవ మఠాలకు సంబంధించిన సన్యాసులు నేల మాళిగల్లో వుండిపోయి సమాధి స్తితికి చేరుకునేవారు.  
ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అనేది మన దేశంలో పూర్వం నుంచి మహా పాపంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అకాల మృత్యువు కూడా అనేది కూడా కలలో కూడా ఊహించరాని విషయం. అకాల మరణం లేని దీర్ఘాయువు కోరుకోవడం ‘చమకం’ లో వుంది. ‘జీవంతు శరదాం శతం’ అంటే వందేళ్ళు బతకాలని కోరుకునే వారు. ఆశీర్వచనాల్లో కూడా ‘ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు’ అంటూ ఆయువుకే మొదటి పీట.
బలవంతంగా ప్రాణం తీసుకున్న సంఘటనలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. ప్రాణం ఉన్నంతవరకు జీవించాలి కాని ప్రాణం తీసుకుని ఉసురు తీసుకోవడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదనిపిస్తుంది.
నిజానికి ప్రాణ త్యాగం అనేది మామూలు విషయం కాదు. అందుకే శత్రువులనుచి రహస్యాలు రాబట్టేవారు అంతిమంగా ‘ప్రాణాలు దక్కవంటూ’ హెచ్చరించడం అనేక సినిమాల్లో  సాధారణం.
లక్ష్యం యెంత ఉన్నతమైనదైనా దాన్ని సాధించి తీరడానికి బతికి వుండాలి కాని ఆ క్రమంలో నిండు ప్రాణాలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్య సాధనను కళ్ళారా చూసే మహత్తర అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు.
కాబట్టి ఆత్మహత్య అనేది తుట్టతుది మార్గం కూడా కాదు. అసలది మార్గమే కాదు.

తోక టపా: ఎల్లాగు ఇందులో జైనుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన ఒక అంశంతో దీన్ని ముగిస్తాను.
పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో రాసుకునే ప్రతి ఉత్తరం  తప్పులున్న క్షమించగలరు అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీగా అనేక పర్యాయాలు  సారీ అనే పదాన్ని  ఉదారంగా  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇదీ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీ చెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే ఈ తరహా  విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడం అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. ‘మిచ్చామి దుఖఃడం’ అనేది ప్రాకృతంలో ఒక పదబంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే  దుష్కృత్యాలు.  చేసిన చెడ్డ పనులు అని తాత్పర్యం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున  భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  ‘నేను చేసిన తప్పులను మన్నించండి అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.
మంచి ఆచారం కదా!

 (02-09-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:   98491 30595                                

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చంద్రబాబు నాయుడు అభిమానులకోసం – ఒక వివరణ మాత్రమే, సంజాయిషీ కాదు

  
ఆరోగ్యశ్రీ గురించి రాస్తూ నేను రాజశేఖర రెడ్డిని అమాంతం ఆకాశానికి ఎత్తేసానని నా మిత్రులే కొందరు అభిప్రాయ పడ్డారు. ఆ పధకం ఎలా పురుడు పోసుకున్నదీ, ఆ నేపధ్యం ఏమిటన్నది చెప్పడం ఉద్దేశ్యం అయితే అది చివరికి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభిమానుల నడుమ ఘర్షణ వ్యాఖ్యలకు దారితీయడం విషాదం. అసలు ఈ కాలపు చాలా మందికి, ఆ మాటకు వస్తే ఈనాడు బాబు గారి పక్కన వున్నవాళ్ళకు, లేదా జగన్ బాబు చుట్టూరా ఉండేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే,  ఒకానొక కాలంలో రేడియో విలేకరిగా, నేను ఈ ఇద్దరితొను చాలా చనువుగా మసలుతూ వుండేవాడినన్న సంగతి.  మొదట్లో, అంటే డెబ్బయ్యవ దశకం చివర్లో కాస్త అటూ ఇటూగా వారిద్దరూ రాజకీయరంగ ప్రవేశం చేసి ప్యాంటూ చొక్కాలతో అసెంబ్లీలో కుడి కాలు పెట్టినప్పుడు, వాళ్ళ మాదిరిగానే ప్యాంటూ చొక్కాలు వేసుకుని తిరిగే నా బోటి విలేకరుల సంఖ్య  నాడు హైదరాబాదులో చాలా తక్కువగా వుండేది. అటు రాజకీయ నాయకులు, ఇటు సీనియర్ పాత్రికేయులు పంచ లాల్చీల తరహా కావడం, అంతటి సీనియర్లతో ఎందుకనుకునేవాళ్ళేమో కాని, వైఎస్సార్, బాబు వంటి ఎమ్మెల్యేలు   మా బోటి జూనియర్ రిపోర్టర్లతోనే  చనువుగా వుండేవాళ్ళు, అన్ని విషయాలు పంచుకునేవారు.  ఈక్రమంలోనే కాకుండా ఆ రోజుల్లో ఆకాశవాణి వార్తలకు ఇప్పటి ప్రీమియం న్యూస్ ఛానళ్ళ స్థాయిలో ‘గిరాకీ’  వుండడం నాకు రేడియో విలేకరిగా కొంత కలిసి వచ్చింది. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ రంగప్రవేశంతో వారిద్దరి దారులూ వేరయిపోయాయి. దాంతో ఇద్దరితో చనువు పెంచుకున్న మా  బోంట్లకు కొంత  ఇబ్బందిగా వుండేది. దానికి తోడు చంద్రబాబు నాయుడు అధికార పదవి ఏమీ లేకపోయినా అధికార కేంద్రానికి దగ్గరగా వుండడం, వైఎస్సార్ ప్రతిపక్ష కాంగ్రెస్ లో ‘తస్మదీయుడిగా’ ఎక్కువ కాలం వుండడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అసమ్మతి నేతగా ఆయనకు  ముద్ర పడడం, ఇవన్నీ సదా అధికార పక్షానికి ‘భజన’ చేస్తామనే ముద్ర వున్న రెడియో విలేకరిగా నన్ను చంద్రబాబుకు లేదా ఆయన ప్రభుత్వ కేంద్రానికి దగ్గరగా మసలేలా చేశాయి. పైగా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేను అడగాలే కానీ ఏదయినా చేయడానికి సిద్ధంగా వుండేవారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. మా పెద్ద పిల్లవాడికి ఉద్యోగం కోసం  అడగడానికి ధైర్యం చాలకపోతే ఆయనే అర్ధం చేసుకుని సత్యం రామలింగ రాజుగారితో  ఫోనులో నా ముందే మాట్లాడి ‘నాకు బాగా కావాల్సిన శ్రీనివాసరావు కుమారుడు, మీరు  సాయం చేస్తే అది నాకే అని భావిస్తాను’ అన్నారు. సరే! ఆ ఉద్యోగం రాలేదు కాని ఆయన నా పట్ల ఆ క్షణంలో చూపించిన అభిమానాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఇప్పటికీ బాబుగారు  ‘మా వాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు’ అని అనుకుంటూ ఉండవచ్చు కూడా.  ఎందుకంటె ఉద్యోగం రాని  సంగతి నేను మళ్ళీ ఆయనకు చెప్పలేదు.


(చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాతో ఓ ఆసుపత్రిలో) 

నేను ఒక ప్రమాదంలో కాలు విరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా వుండి  కూడా చంద్రబాబు నేనున్న  ఆసుపత్రికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళారు. అల్లాగే నాకు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపు విషయంలో కూడా చంద్రబాబు ఎంతో పెద్ద సాయం  చేసారు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కావడం, అప్పటికే అనేకమంది ఐ ఏ ఎస్ అధికారులు ఇంటి కేటాయింపు కోసం వేచి వుండడం వల్ల ఆయన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమలు కాలేదు. కానీ ఆయన, ముఖ్యమంత్రిగా తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి  ఫైలు తెప్పించుకుని,   నాకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తూ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసారు.  2005 లో  ఉద్యోగ విరమణ చేసేవరకు నేను ఎర్రమంజిల్ లోని ఆ క్వార్టర్ లోనే వున్నాను. రిటైర్ అయిన తరువాత ఒక అద్దె ఇంటికి మారాను. ఇప్పటికీ అనేక ఇళ్ళు మారుతూనే వున్నాను. ఇలా చెప్పుకుంటూ  పొతే చంద్రబాబు నాయుడుతో నాకెన్నోఅనేక మరపురాని, మరచిపోలేని జ్ఞాపకాలు,   అనుభవాలు వున్నాయి. కాకినాడలో రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కావాల్సివచ్చి ఆయన్ని అడిగితె గంటల వ్యవధిలో జీవో ఇప్పించారు. చంద్రబాబు దాదాపు పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా వుండడం వల్ల రేడియో విలేకరిగా ఎక్కువ కాలం ఆయన వార్తలు కవర్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా రాతలు చూసి చంద్రబాబు అభిమానులు చీకాకు పడుతున్నట్టే ఆ రోజుల్లో వైఎస్సార్ అభిమానులు లేదా ఆయన అనుయాయుల దృష్టిలో నేను చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాను. కానీ వారిద్దరికీ నాపట్ల ఇటువంటి అభిప్రాయం వున్న  దాఖలా నాకెన్నడూ కానరాలేదు. నా పెద్ద పిల్ల వాడి వివాహం అప్పుడు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకులూ, రెండో పిల్లవాడి పెళ్లికల్లా పాత్రలు మారిపోయాయి. అయినా రెండు పెళ్లిళ్లకు ఇద్దరూ వచ్చి నా మీద వారికున్న అభిమానం వ్యక్తం చేసారు.  తదనంతర కాలంలో వై ఎస్ ముఖ్యమంత్రి కావడంతో రేడియో విలేకరిగా నా రాకపోకలు అటు పెరిగాయి. నా ఉద్యోగ ధర్మంగా నేను దగ్గర కావడం, దూరం కావడం వారిద్దరూ సరిగా అర్ధం చేసుకున్నారు కానీ భజన బృందాలతోనే చిక్కంతా. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి నాకు ఆ విలేకరి ఉద్యోగం కూడలేదు. వై ఎస్సార్ ఎలాగూ లేరు. విలేకరి ఉద్యోగమూ లేదు.  అందుకే నేను ఇప్పుడు అంశాన్ని బట్టి టీవీల్లో నా అభిప్రాయం చెబుతూ వస్తున్నాను. బ్లాగులో రాస్తూవున్నాను. కొందరికి అవి రుచించకపోవచ్చు. కానీ  నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక దణ్ణం పెట్టి ఊరుకోవడం తప్ప.
సుదీర్ఘ కాలం రాజకీయ నాయకులతో కలసి మెలసి వుండే అవకాశం కలిగిన కొందరు జర్నలిష్టులకు కొందరు నాయకులతో సన్నిహిత అనుబంధం ఏర్పడే వీలుంటుంది. ఇది రాజకీయాలకు అతీతం. గతంలో ఎందరో సీనియర్ జర్నలిష్టులు కొందరు ముఖ్యమంత్రులకు సన్నిహితంగా వుండేవారు. కాకపోతే ఆ సాన్నిహిత్యం నీడలు  వృత్తి ధర్మంపై పడకుండా జాగ్రత్త పడేవారు. నేనూ కొన్ని సందర్భాలలో సగటు మనిషి మాదిరి గానే ఆలోచిస్తూ, పదవులు కలిగిన వారితో నాకున్న పరిచయాలను నా సన్నిహితులకోసం, స్నేహితుల కోసం, చుట్ట పక్కాలకోసం, నిజం చెప్పాలంటే నా కుటుంబ అవసరాలకోసం సద్వినియోగమో, దుర్వినియోగమో చేసి ఉండవచ్చు. కానీ అందుకోసం ఒక విలేకరిగా నా విలువలను తాకట్టు పెట్టలేదు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నా బోంట్లకు చేసిన సాయాలు చంద్రబాబు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ సాయం పొందినవారు మరచిపోతారని అనుకోను. చంద్రబాబుకు నేను గుర్తున్నానా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయన మాత్రం నాకు సదా గుర్తుంటారు. టీడీపీ అధ్యక్షుడిగా కాదు, చంద్రబాబు నాయుడిగా.

ఆయన మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత నేనెన్నడూ ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన రోజున మా కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు చాలామంది ఆయన్ని చూడాలంటే నేను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లాను. అంతమంది వెళ్ళడంతో ఆయన చాలా సంతోష పడ్డట్టు  కనిపించారు. అందర్నీ ఆదరంగా పలకరించారు. అలాగే కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయిన రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి, ఎన్నో ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన నా మాట మన్నించి ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.


(1980 లో వైఎస్ మంత్రిగా వున్నప్పుడు, నాతో ఓ పార్టీలో) 

ఆ ఇద్దరితో నాకున్న సంబంధం లేదా అనుబంధం రాజకీయాలకు అతీతం. నన్ను అంచనా వేసేవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు  (01-09-2015)          

31, ఆగస్టు 2015, సోమవారం

సాక్షిలో నా వ్యాసం – ఓ కొత్త అనుభవం


‘మాది పేద బ్రాహ్మణ కుటుంబం. ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. మా చిన్నమ్మాయికి మూత్ర పిండాల వ్యాధి అని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ‘ఆరోగ్యశ్రీ అక్కరకు వచ్చింది. మా అమ్మాయి బతికి బట్ట కట్టింది’
ఈరోజు సాక్షిలో నేను రాసిన వ్యాసం చదివి వరంగల్ నుంచి వచ్చిన ఫోను ఇది. అంతే కాదు ఆయన మరో విషయం కూడా చెప్పాడు. ‘మా అబ్బాయి ఇంజినీరింగు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ చదువు చదివించడం నా వల్ల అయ్యేపని కాదు. ఫీజు రీ ఇంబర్స్ మెంటు పధకం  పుణ్యం అది’
‘మా నాన్న గారికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. గుండె జారిపోయింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరిగింది. ఏడేళ్ళు హాయిగా బతికారు. తరువాత ప్రోస్టేట్ ఆపరేషన్ అంటే అమ్మ నగలు కుదువబెట్టి చేయించాము. అరవై వేలు అయింది. అయినా మనిషి మాకు కాకుండా పోయారు. ఆయన బతికున్నన్నాళ్ళు  అంటుండేవారు. ‘నన్ను బతికించారు. ఆయన పోయారని’ మహబూబ్ నగర్ నుంచి మరో ఫోను.    
ఆదిలాబాదు నుంచి, సత్యవేడునుంచి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల నుంచి ఫోన్లు వచ్చాయి. వాళ్ళెవరికీ రాజకీయాలతో సంబంధం లేదు. దాదాపు అందరూ ఆరోగ్యశ్రీ పధకం వల్ల ఏదో మంచి ప్రయోజనం పొందిన వాళ్ళే. లాభాలు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళు పొందారని ఆరోపణలు వున్నాయి. అవి నిజమే అయినా ‘ప్రయోజనం’ పొందిన పేద ప్రజలు కూడా చాలా మంది వున్నారు.
ఈ స్పందనలు సరే. కొన్ని అక్షింతలు కూడా పడ్డాయి. ఈ పధకం పురుడు పోసుకోవడం వెనక మా హస్తం కూడా వుందని కొందరు ఫోన్లు చేసారు. వారిలో మంద కృష్ణ మాదిగ ఒకరు. ఒకప్పుడు వికలాంగులకోసం, గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకోసం వీధి పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పధకం రూపు దాల్చడంలోను, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలోనూ  తన పాత్ర కూడా ఉందన్నారు. అదీ నిజమే. అయన పేరు మరచిపోవడం నా పొరబాటే. కానీ, ఒక నాయకుడి వర్ధంతి సందర్భంగా సంస్మరణ వ్యాసం రాసేటప్పుడు కొన్ని పరిమితులు, పరిధులు వుంటాయి. వాటిని అర్ధం చేసుకుంటే ఇలాటి అపార్ధాలు రావు.
కొద్ది సేపటి క్రితం ఉజ్వల అనే ఆవిడ ఫోను చేసారు. ఆరోగ్యశ్రీ పధకం గురించి రాసేటప్పుడు ‘కిరణ్ కుమార్ రెడ్డి’ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ఆవిడ అభ్యంతరం. నాకు కొంత ఆశ్చర్యం వేసింది కూడా. మామూలుగా నా ఆలోచన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్ళింది. ‘కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకానికి అసలు సిసలు రూపశిల్పి’ అంటూ ఉజ్వల గారు లేవనెత్తిన వాదన నన్ను కొంచెం అయోమయంలో పడేసింది. కొద్దిసేపటి తరువాత ఆవిడ మాటల్లోనే నా సంశయ నివృత్తి జరిగింది. ఉజ్వల గారు ప్రస్తావించింది ఆరోజుల్లో ముఖ్యమంత్రి పేషీలో ఆరోగ్యశ్రీ వ్యవహారాలు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి. ఆయన స్వయానా ఉజ్వల గారికి సోదరుడు కావడం వల్ల ఆరోగ్యశ్రీ పధకం రూపకల్పనలో ఆయన పడ్డ శ్రమదమాదులు వారికి తెలిసివుంటాయి. అయితే ఈ వ్యాసం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి రాసింది కాదు. ఆరోగ్యశ్రీ పధకం అమల్లోకి తేవడంలో  రాజశేఖరరెడ్డి గారిని ఏ అంశాలు ప్రభావితం చేశాయి అన్నదాన్ని గురించి మాత్రమె.
ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధాని కానీ ఒక అద్భుతమైన ఆలోచనకు పధక రచన చేసే సమయంలోను, దాన్ని అమలుచేసే సమయంలోను అనేకమంది అధికారులు, అనధికారుల  పాత్ర వుంటుంది. వారందరూ మమేకమై పనిచేస్తేనే  కొన్ని పధకాలు విజయవంతం అయి, ప్రజల ఆదరణ పొందుతాయి. కాకపొతే సహజంగా వాటికి  సంబంధించిన కీర్తి ప్రతిష్టలు ఆ నాయకుల ఖాతాలోనే పడతాయి. సహకరించిన అధికారులు, ఇతరులు ఆ పధకాలు విజయవంతం అయినందుకు సంతోషించాలి. ఇది రాజులు, మహారాజుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ.
ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా  ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా  కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు  కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి. 

పొతే, చివర్లో ఒక మాట.
ఒక సందర్భంకోసం ‘సాక్షి’ పత్రికలో నేను రాసిన ఒక వ్యాసం ఇంత స్పందన తెస్తుందని అనుకోలేదు. బహుశా దీనికి ప్రధాన కారణం నేను రాసింది వై ఎస్సార్ గురించి కావడం, ప్రచురించింది మంచి పాఠకాదరణ వున్న పత్రిక కావడం కావచ్చు.


-భండారు శ్రీనివాసరావు  (31-08-2015)              

వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనం ‘ఆరోగ్యశ్రీ’


(PUBLISHED IN ‘SAKSHI’ EDIT PAGE TODAY)
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి వుంటాయి. చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్’ అంటూ   ‘బలి చక్రవర్తి’  కాలంలో చెప్పిందీ అదే. ఈ కలియుగంలో సయితం వర్తించే వాస్తవం కూడా ఇదే.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గతించి అప్పుడే ఆరేళ్లయింది. సామాన్య జనం ఈనాటికీ ఆయన్ని ఏదో ఒకరకంగా గుర్తు చేసుకుంటూనే వున్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో వుండగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కొత్త పధకాలు.  
ఆరోగ్యశ్రీ పధకం రూపుదాల్చడానికి ఓ నేపధ్యం వుంది. అది తెలుసుకోవాలంటే కొన్నేళ్ళు వెనక్కు వెళ్ళాలి.

అది ముఖ్యమంత్రి  వైఎస్సార్ క్యాంపు కార్యాలయం.
ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.
సీఎం, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ,వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
సీఎంను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహాజనంలో ఒక అమ్మాయి కూడా వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు బాగా కలిగిన వారిని సయితం  కుదేలు చేసే క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధ పడుతోంది.
ముఖ్యమంత్రి ఆ అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఆమె మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం వెంటనే అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం.
కానీ మరోపక్క ‘మా అమ్మ నాకు కావాలి.’ అనే ఆ అమ్మాయి ఆవేదనతో కూడిన అభ్యర్ధన.
‘వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు’ అన్నారు ముఖ్యమంత్రి.
‘ఆరు నెలలు బతికినా చాలు, కొన్నాళ్ళపాటయినా  నా కన్నతల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు’ అన్నదా అమ్మాయి.
‘చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ, చూస్తూ చూస్తూ  వైద్యం చేయించకుండా వుండలేము కదా!’ అంది కూడా.
ఆ మాటతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో తెలవదు. కాకపొతే,  ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. 
‘ఏం చేద్దాం’ అన్నట్టు అధికారులవైపు చూసారు, ‘ఏదయినా చేసి తీరాలి’ అన్నట్టుగా.         
ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.
ఆ అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం  అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు.
ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘ఆరోగ్యశ్రీ’.
ఆ విధంగా ‘ఆరోగ్య శ్రీ’ పధకం పురుడు పోసుకుంది.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టబెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.
వైఎస్ ముఖ్యమంత్రి కాగానే సత్యం ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్నఆ  అంబులెన్సు సర్వీసుల నిర్వహణ  బాధ్యతను ప్రభుత్వ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. ఈ సర్వీసు వచ్చేవరకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎలాటి రక్షణా లేదు. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో దగ్గరలోని ఆసుపత్రులకు చేర్చి వైద్యం అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది. కానీ అటువంటి వీలూచాలూ లేక అనేకమంది ప్రాణాలు నడిరోడ్డు మీదనే గాలిలో కలిసిపోతున్నాయి. వై ఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలా రయ్యి రయ్యి మంటూ తిరిగిన ఈ అంబులెన్సు వాహనాల పుణ్యమా అని ఎందరెందరో బతికి బట్టకట్ట కలిగారు.
 అల్లాగే 104 గ్రామీణ ఆరోగ్య సర్వీసు.  108 అంబులెన్సు రూపకల్పనలో పాలుపంచుకున్న డాక్టర్ అయితరాజు పాండురంగారావు, డాక్టర్ ఉట్ల బాలాజీ ఒక కొత్త ఆలోచనను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారు.


అదే, ఎఫ్.డీ.హెచ్.ఎస్. అంటే -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశితదిన వైద్య సేవలు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది. ఇందులో సింహభాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

హెచ్.ఎం.ఆర్.ఐ. వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే  104 ఉచిత కాల్ సెంటరు. వ్యాధి నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం  నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం.  అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా,  ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఇలాటి పధకాలు చాలు.
అందుకే వైఎస్సార్ చనిపోయి కూడా ప్రజల దృష్టిలో జీవించే వున్నారు. 


30, ఆగస్టు 2015, ఆదివారం

An APP for HIGHWAYS



Today HINDU carried an article (Page two) on one APP useful on highways - developed by my son Santosh Bhandaru and his team (My Office IT)


(Courtesy HINDU and Rahul Devulapalli)

29, ఆగస్టు 2015, శనివారం

గుంటూరు ఆసుపత్రిలో సర్పమూషిక న్యాయం


సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ  సంఘటనను  చాలా  తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది.   మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక  విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో,  అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్  సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను  ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి  చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ  తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో పేర్కొన్నది.
‘దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్  తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.  
కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.  
సరే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు మంత్రులు, పాలక పక్షానికి చెందిన కొందరు  ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని  నలుమూలలా తనిఖీ చేసి, అక్కడి పరిస్తితులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే వాటిని చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం  తమదయిన పద్దతిలో, షరా మామూలుగా కొన్ని చర్యలు తీసుకుంది. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అమాయకులయిన పేద  రోగుల్ని, అక్కడి ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడగట్టుకున్న అక్రమ సంపాదనలతో పెంచుకున్న బొజ్జల్ని హాయిగా నిమురు కుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి  ఎవరు అడ్డుకట్ట వేస్తారు?


ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటె సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని  సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకతో చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలిమింగేసి, తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
గుంటూరు ఆసుపత్రి సంఘటనపై విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు.  ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తి  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (29-08-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595         
NOTE : Courtesy Image Owner