1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చంద్రబాబు నాయుడు అభిమానులకోసం – ఒక వివరణ మాత్రమే, సంజాయిషీ కాదు

  
ఆరోగ్యశ్రీ గురించి రాస్తూ నేను రాజశేఖర రెడ్డిని అమాంతం ఆకాశానికి ఎత్తేసానని నా మిత్రులే కొందరు అభిప్రాయ పడ్డారు. ఆ పధకం ఎలా పురుడు పోసుకున్నదీ, ఆ నేపధ్యం ఏమిటన్నది చెప్పడం ఉద్దేశ్యం అయితే అది చివరికి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభిమానుల నడుమ ఘర్షణ వ్యాఖ్యలకు దారితీయడం విషాదం. అసలు ఈ కాలపు చాలా మందికి, ఆ మాటకు వస్తే ఈనాడు బాబు గారి పక్కన వున్నవాళ్ళకు, లేదా జగన్ బాబు చుట్టూరా ఉండేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే,  ఒకానొక కాలంలో రేడియో విలేకరిగా, నేను ఈ ఇద్దరితొను చాలా చనువుగా మసలుతూ వుండేవాడినన్న సంగతి.  మొదట్లో, అంటే డెబ్బయ్యవ దశకం చివర్లో కాస్త అటూ ఇటూగా వారిద్దరూ రాజకీయరంగ ప్రవేశం చేసి ప్యాంటూ చొక్కాలతో అసెంబ్లీలో కుడి కాలు పెట్టినప్పుడు, వాళ్ళ మాదిరిగానే ప్యాంటూ చొక్కాలు వేసుకుని తిరిగే నా బోటి విలేకరుల సంఖ్య  నాడు హైదరాబాదులో చాలా తక్కువగా వుండేది. అటు రాజకీయ నాయకులు, ఇటు సీనియర్ పాత్రికేయులు పంచ లాల్చీల తరహా కావడం, అంతటి సీనియర్లతో ఎందుకనుకునేవాళ్ళేమో కాని, వైఎస్సార్, బాబు వంటి ఎమ్మెల్యేలు   మా బోటి జూనియర్ రిపోర్టర్లతోనే  చనువుగా వుండేవాళ్ళు, అన్ని విషయాలు పంచుకునేవారు.  ఈక్రమంలోనే కాకుండా ఆ రోజుల్లో ఆకాశవాణి వార్తలకు ఇప్పటి ప్రీమియం న్యూస్ ఛానళ్ళ స్థాయిలో ‘గిరాకీ’  వుండడం నాకు రేడియో విలేకరిగా కొంత కలిసి వచ్చింది. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ రంగప్రవేశంతో వారిద్దరి దారులూ వేరయిపోయాయి. దాంతో ఇద్దరితో చనువు పెంచుకున్న మా  బోంట్లకు కొంత  ఇబ్బందిగా వుండేది. దానికి తోడు చంద్రబాబు నాయుడు అధికార పదవి ఏమీ లేకపోయినా అధికార కేంద్రానికి దగ్గరగా వుండడం, వైఎస్సార్ ప్రతిపక్ష కాంగ్రెస్ లో ‘తస్మదీయుడిగా’ ఎక్కువ కాలం వుండడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అసమ్మతి నేతగా ఆయనకు  ముద్ర పడడం, ఇవన్నీ సదా అధికార పక్షానికి ‘భజన’ చేస్తామనే ముద్ర వున్న రెడియో విలేకరిగా నన్ను చంద్రబాబుకు లేదా ఆయన ప్రభుత్వ కేంద్రానికి దగ్గరగా మసలేలా చేశాయి. పైగా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేను అడగాలే కానీ ఏదయినా చేయడానికి సిద్ధంగా వుండేవారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. మా పెద్ద పిల్లవాడికి ఉద్యోగం కోసం  అడగడానికి ధైర్యం చాలకపోతే ఆయనే అర్ధం చేసుకుని సత్యం రామలింగ రాజుగారితో  ఫోనులో నా ముందే మాట్లాడి ‘నాకు బాగా కావాల్సిన శ్రీనివాసరావు కుమారుడు, మీరు  సాయం చేస్తే అది నాకే అని భావిస్తాను’ అన్నారు. సరే! ఆ ఉద్యోగం రాలేదు కాని ఆయన నా పట్ల ఆ క్షణంలో చూపించిన అభిమానాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఇప్పటికీ బాబుగారు  ‘మా వాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు’ అని అనుకుంటూ ఉండవచ్చు కూడా.  ఎందుకంటె ఉద్యోగం రాని  సంగతి నేను మళ్ళీ ఆయనకు చెప్పలేదు.


(చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాతో ఓ ఆసుపత్రిలో) 

నేను ఒక ప్రమాదంలో కాలు విరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా వుండి  కూడా చంద్రబాబు నేనున్న  ఆసుపత్రికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళారు. అల్లాగే నాకు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపు విషయంలో కూడా చంద్రబాబు ఎంతో పెద్ద సాయం  చేసారు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కావడం, అప్పటికే అనేకమంది ఐ ఏ ఎస్ అధికారులు ఇంటి కేటాయింపు కోసం వేచి వుండడం వల్ల ఆయన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమలు కాలేదు. కానీ ఆయన, ముఖ్యమంత్రిగా తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి  ఫైలు తెప్పించుకుని,   నాకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తూ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసారు.  2005 లో  ఉద్యోగ విరమణ చేసేవరకు నేను ఎర్రమంజిల్ లోని ఆ క్వార్టర్ లోనే వున్నాను. రిటైర్ అయిన తరువాత ఒక అద్దె ఇంటికి మారాను. ఇప్పటికీ అనేక ఇళ్ళు మారుతూనే వున్నాను. ఇలా చెప్పుకుంటూ  పొతే చంద్రబాబు నాయుడుతో నాకెన్నోఅనేక మరపురాని, మరచిపోలేని జ్ఞాపకాలు,   అనుభవాలు వున్నాయి. కాకినాడలో రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కావాల్సివచ్చి ఆయన్ని అడిగితె గంటల వ్యవధిలో జీవో ఇప్పించారు. చంద్రబాబు దాదాపు పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా వుండడం వల్ల రేడియో విలేకరిగా ఎక్కువ కాలం ఆయన వార్తలు కవర్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా రాతలు చూసి చంద్రబాబు అభిమానులు చీకాకు పడుతున్నట్టే ఆ రోజుల్లో వైఎస్సార్ అభిమానులు లేదా ఆయన అనుయాయుల దృష్టిలో నేను చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాను. కానీ వారిద్దరికీ నాపట్ల ఇటువంటి అభిప్రాయం వున్న  దాఖలా నాకెన్నడూ కానరాలేదు. నా పెద్ద పిల్ల వాడి వివాహం అప్పుడు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకులూ, రెండో పిల్లవాడి పెళ్లికల్లా పాత్రలు మారిపోయాయి. అయినా రెండు పెళ్లిళ్లకు ఇద్దరూ వచ్చి నా మీద వారికున్న అభిమానం వ్యక్తం చేసారు.  తదనంతర కాలంలో వై ఎస్ ముఖ్యమంత్రి కావడంతో రేడియో విలేకరిగా నా రాకపోకలు అటు పెరిగాయి. నా ఉద్యోగ ధర్మంగా నేను దగ్గర కావడం, దూరం కావడం వారిద్దరూ సరిగా అర్ధం చేసుకున్నారు కానీ భజన బృందాలతోనే చిక్కంతా. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి నాకు ఆ విలేకరి ఉద్యోగం కూడలేదు. వై ఎస్సార్ ఎలాగూ లేరు. విలేకరి ఉద్యోగమూ లేదు.  అందుకే నేను ఇప్పుడు అంశాన్ని బట్టి టీవీల్లో నా అభిప్రాయం చెబుతూ వస్తున్నాను. బ్లాగులో రాస్తూవున్నాను. కొందరికి అవి రుచించకపోవచ్చు. కానీ  నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక దణ్ణం పెట్టి ఊరుకోవడం తప్ప.
సుదీర్ఘ కాలం రాజకీయ నాయకులతో కలసి మెలసి వుండే అవకాశం కలిగిన కొందరు జర్నలిష్టులకు కొందరు నాయకులతో సన్నిహిత అనుబంధం ఏర్పడే వీలుంటుంది. ఇది రాజకీయాలకు అతీతం. గతంలో ఎందరో సీనియర్ జర్నలిష్టులు కొందరు ముఖ్యమంత్రులకు సన్నిహితంగా వుండేవారు. కాకపోతే ఆ సాన్నిహిత్యం నీడలు  వృత్తి ధర్మంపై పడకుండా జాగ్రత్త పడేవారు. నేనూ కొన్ని సందర్భాలలో సగటు మనిషి మాదిరి గానే ఆలోచిస్తూ, పదవులు కలిగిన వారితో నాకున్న పరిచయాలను నా సన్నిహితులకోసం, స్నేహితుల కోసం, చుట్ట పక్కాలకోసం, నిజం చెప్పాలంటే నా కుటుంబ అవసరాలకోసం సద్వినియోగమో, దుర్వినియోగమో చేసి ఉండవచ్చు. కానీ అందుకోసం ఒక విలేకరిగా నా విలువలను తాకట్టు పెట్టలేదు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నా బోంట్లకు చేసిన సాయాలు చంద్రబాబు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ సాయం పొందినవారు మరచిపోతారని అనుకోను. చంద్రబాబుకు నేను గుర్తున్నానా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయన మాత్రం నాకు సదా గుర్తుంటారు. టీడీపీ అధ్యక్షుడిగా కాదు, చంద్రబాబు నాయుడిగా.

ఆయన మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత నేనెన్నడూ ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన రోజున మా కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు చాలామంది ఆయన్ని చూడాలంటే నేను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లాను. అంతమంది వెళ్ళడంతో ఆయన చాలా సంతోష పడ్డట్టు  కనిపించారు. అందర్నీ ఆదరంగా పలకరించారు. అలాగే కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయిన రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి, ఎన్నో ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన నా మాట మన్నించి ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.


(1980 లో వైఎస్ మంత్రిగా వున్నప్పుడు, నాతో ఓ పార్టీలో) 

ఆ ఇద్దరితో నాకున్న సంబంధం లేదా అనుబంధం రాజకీయాలకు అతీతం. నన్ను అంచనా వేసేవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు  (01-09-2015)          

31, ఆగస్టు 2015, సోమవారం

సాక్షిలో నా వ్యాసం – ఓ కొత్త అనుభవం


‘మాది పేద బ్రాహ్మణ కుటుంబం. ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. మా చిన్నమ్మాయికి మూత్ర పిండాల వ్యాధి అని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ‘ఆరోగ్యశ్రీ అక్కరకు వచ్చింది. మా అమ్మాయి బతికి బట్ట కట్టింది’
ఈరోజు సాక్షిలో నేను రాసిన వ్యాసం చదివి వరంగల్ నుంచి వచ్చిన ఫోను ఇది. అంతే కాదు ఆయన మరో విషయం కూడా చెప్పాడు. ‘మా అబ్బాయి ఇంజినీరింగు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ చదువు చదివించడం నా వల్ల అయ్యేపని కాదు. ఫీజు రీ ఇంబర్స్ మెంటు పధకం  పుణ్యం అది’
‘మా నాన్న గారికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. గుండె జారిపోయింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరిగింది. ఏడేళ్ళు హాయిగా బతికారు. తరువాత ప్రోస్టేట్ ఆపరేషన్ అంటే అమ్మ నగలు కుదువబెట్టి చేయించాము. అరవై వేలు అయింది. అయినా మనిషి మాకు కాకుండా పోయారు. ఆయన బతికున్నన్నాళ్ళు  అంటుండేవారు. ‘నన్ను బతికించారు. ఆయన పోయారని’ మహబూబ్ నగర్ నుంచి మరో ఫోను.    
ఆదిలాబాదు నుంచి, సత్యవేడునుంచి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల నుంచి ఫోన్లు వచ్చాయి. వాళ్ళెవరికీ రాజకీయాలతో సంబంధం లేదు. దాదాపు అందరూ ఆరోగ్యశ్రీ పధకం వల్ల ఏదో మంచి ప్రయోజనం పొందిన వాళ్ళే. లాభాలు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళు పొందారని ఆరోపణలు వున్నాయి. అవి నిజమే అయినా ‘ప్రయోజనం’ పొందిన పేద ప్రజలు కూడా చాలా మంది వున్నారు.
ఈ స్పందనలు సరే. కొన్ని అక్షింతలు కూడా పడ్డాయి. ఈ పధకం పురుడు పోసుకోవడం వెనక మా హస్తం కూడా వుందని కొందరు ఫోన్లు చేసారు. వారిలో మంద కృష్ణ మాదిగ ఒకరు. ఒకప్పుడు వికలాంగులకోసం, గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకోసం వీధి పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పధకం రూపు దాల్చడంలోను, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలోనూ  తన పాత్ర కూడా ఉందన్నారు. అదీ నిజమే. అయన పేరు మరచిపోవడం నా పొరబాటే. కానీ, ఒక నాయకుడి వర్ధంతి సందర్భంగా సంస్మరణ వ్యాసం రాసేటప్పుడు కొన్ని పరిమితులు, పరిధులు వుంటాయి. వాటిని అర్ధం చేసుకుంటే ఇలాటి అపార్ధాలు రావు.
కొద్ది సేపటి క్రితం ఉజ్వల అనే ఆవిడ ఫోను చేసారు. ఆరోగ్యశ్రీ పధకం గురించి రాసేటప్పుడు ‘కిరణ్ కుమార్ రెడ్డి’ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ఆవిడ అభ్యంతరం. నాకు కొంత ఆశ్చర్యం వేసింది కూడా. మామూలుగా నా ఆలోచన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్ళింది. ‘కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకానికి అసలు సిసలు రూపశిల్పి’ అంటూ ఉజ్వల గారు లేవనెత్తిన వాదన నన్ను కొంచెం అయోమయంలో పడేసింది. కొద్దిసేపటి తరువాత ఆవిడ మాటల్లోనే నా సంశయ నివృత్తి జరిగింది. ఉజ్వల గారు ప్రస్తావించింది ఆరోజుల్లో ముఖ్యమంత్రి పేషీలో ఆరోగ్యశ్రీ వ్యవహారాలు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి. ఆయన స్వయానా ఉజ్వల గారికి సోదరుడు కావడం వల్ల ఆరోగ్యశ్రీ పధకం రూపకల్పనలో ఆయన పడ్డ శ్రమదమాదులు వారికి తెలిసివుంటాయి. అయితే ఈ వ్యాసం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి రాసింది కాదు. ఆరోగ్యశ్రీ పధకం అమల్లోకి తేవడంలో  రాజశేఖరరెడ్డి గారిని ఏ అంశాలు ప్రభావితం చేశాయి అన్నదాన్ని గురించి మాత్రమె.
ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధాని కానీ ఒక అద్భుతమైన ఆలోచనకు పధక రచన చేసే సమయంలోను, దాన్ని అమలుచేసే సమయంలోను అనేకమంది అధికారులు, అనధికారుల  పాత్ర వుంటుంది. వారందరూ మమేకమై పనిచేస్తేనే  కొన్ని పధకాలు విజయవంతం అయి, ప్రజల ఆదరణ పొందుతాయి. కాకపొతే సహజంగా వాటికి  సంబంధించిన కీర్తి ప్రతిష్టలు ఆ నాయకుల ఖాతాలోనే పడతాయి. సహకరించిన అధికారులు, ఇతరులు ఆ పధకాలు విజయవంతం అయినందుకు సంతోషించాలి. ఇది రాజులు, మహారాజుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ.
ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా  ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా  కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు  కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి. 

పొతే, చివర్లో ఒక మాట.
ఒక సందర్భంకోసం ‘సాక్షి’ పత్రికలో నేను రాసిన ఒక వ్యాసం ఇంత స్పందన తెస్తుందని అనుకోలేదు. బహుశా దీనికి ప్రధాన కారణం నేను రాసింది వై ఎస్సార్ గురించి కావడం, ప్రచురించింది మంచి పాఠకాదరణ వున్న పత్రిక కావడం కావచ్చు.


-భండారు శ్రీనివాసరావు  (31-08-2015)              

వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనం ‘ఆరోగ్యశ్రీ’


(PUBLISHED IN ‘SAKSHI’ EDIT PAGE TODAY)
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలబడి వుంటాయి. చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్’ అంటూ   ‘బలి చక్రవర్తి’  కాలంలో చెప్పిందీ అదే. ఈ కలియుగంలో సయితం వర్తించే వాస్తవం కూడా ఇదే.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గతించి అప్పుడే ఆరేళ్లయింది. సామాన్య జనం ఈనాటికీ ఆయన్ని ఏదో ఒకరకంగా గుర్తు చేసుకుంటూనే వున్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో వుండగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి కొన్ని కొత్త పధకాలు.  
ఆరోగ్యశ్రీ పధకం రూపుదాల్చడానికి ఓ నేపధ్యం వుంది. అది తెలుసుకోవాలంటే కొన్నేళ్ళు వెనక్కు వెళ్ళాలి.

అది ముఖ్యమంత్రి  వైఎస్సార్ క్యాంపు కార్యాలయం.
ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.
సీఎం, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ,వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
సీఎంను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహాజనంలో ఒక అమ్మాయి కూడా వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు బాగా కలిగిన వారిని సయితం  కుదేలు చేసే క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధ పడుతోంది.
ముఖ్యమంత్రి ఆ అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఆమె మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం వెంటనే అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం.
కానీ మరోపక్క ‘మా అమ్మ నాకు కావాలి.’ అనే ఆ అమ్మాయి ఆవేదనతో కూడిన అభ్యర్ధన.
‘వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు’ అన్నారు ముఖ్యమంత్రి.
‘ఆరు నెలలు బతికినా చాలు, కొన్నాళ్ళపాటయినా  నా కన్నతల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు’ అన్నదా అమ్మాయి.
‘చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ, చూస్తూ చూస్తూ  వైద్యం చేయించకుండా వుండలేము కదా!’ అంది కూడా.
ఆ మాటతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో తెలవదు. కాకపొతే,  ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది. 
‘ఏం చేద్దాం’ అన్నట్టు అధికారులవైపు చూసారు, ‘ఏదయినా చేసి తీరాలి’ అన్నట్టుగా.         
ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.
ఆ అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం  అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు.
ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ‘ఆరోగ్యశ్రీ’.
ఆ విధంగా ‘ఆరోగ్య శ్రీ’ పధకం పురుడు పోసుకుంది.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టబెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.
వైఎస్ ముఖ్యమంత్రి కాగానే సత్యం ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్నఆ  అంబులెన్సు సర్వీసుల నిర్వహణ  బాధ్యతను ప్రభుత్వ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. ఈ సర్వీసు వచ్చేవరకు రోడ్డు ప్రమాద బాధితులకు ఎలాటి రక్షణా లేదు. ప్రమాదాలకు గురైన వారిని సకాలంలో దగ్గరలోని ఆసుపత్రులకు చేర్చి వైద్యం అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది. కానీ అటువంటి వీలూచాలూ లేక అనేకమంది ప్రాణాలు నడిరోడ్డు మీదనే గాలిలో కలిసిపోతున్నాయి. వై ఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలా రయ్యి రయ్యి మంటూ తిరిగిన ఈ అంబులెన్సు వాహనాల పుణ్యమా అని ఎందరెందరో బతికి బట్టకట్ట కలిగారు.
 అల్లాగే 104 గ్రామీణ ఆరోగ్య సర్వీసు.  108 అంబులెన్సు రూపకల్పనలో పాలుపంచుకున్న డాక్టర్ అయితరాజు పాండురంగారావు, డాక్టర్ ఉట్ల బాలాజీ ఒక కొత్త ఆలోచనను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారు.


అదే, ఎఫ్.డీ.హెచ్.ఎస్. అంటే -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశితదిన వైద్య సేవలు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది. ఇందులో సింహభాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

హెచ్.ఎం.ఆర్.ఐ. వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే  104 ఉచిత కాల్ సెంటరు. వ్యాధి నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం  నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం.  అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా,  ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
బడుగు ప్రజలు ఒక నాయకుడ్ని చిరకాలం గుర్తుంచుకోవడానికీ, గుండెల్లో దాచుకోవడానికీ ఇలాటి పధకాలు చాలు.
అందుకే వైఎస్సార్ చనిపోయి కూడా ప్రజల దృష్టిలో జీవించే వున్నారు. 


30, ఆగస్టు 2015, ఆదివారం

An APP for HIGHWAYS



Today HINDU carried an article (Page two) on one APP useful on highways - developed by my son Santosh Bhandaru and his team (My Office IT)


(Courtesy HINDU and Rahul Devulapalli)

29, ఆగస్టు 2015, శనివారం

గుంటూరు ఆసుపత్రిలో సర్పమూషిక న్యాయం


సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ  సంఘటనను  చాలా  తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది.   మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక  విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో,  అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్  సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను  ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి  చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ  తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో పేర్కొన్నది.
‘దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్  తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.  
కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.  
సరే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు మంత్రులు, పాలక పక్షానికి చెందిన కొందరు  ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని  నలుమూలలా తనిఖీ చేసి, అక్కడి పరిస్తితులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే వాటిని చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం  తమదయిన పద్దతిలో, షరా మామూలుగా కొన్ని చర్యలు తీసుకుంది. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అమాయకులయిన పేద  రోగుల్ని, అక్కడి ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడగట్టుకున్న అక్రమ సంపాదనలతో పెంచుకున్న బొజ్జల్ని హాయిగా నిమురు కుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి  ఎవరు అడ్డుకట్ట వేస్తారు?


ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటె సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని  సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకతో చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలిమింగేసి, తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
గుంటూరు ఆసుపత్రి సంఘటనపై విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు.  ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తి  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (29-08-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595         
NOTE : Courtesy Image Owner                    

26, ఆగస్టు 2015, బుధవారం

ఆ ఒక్కటీ తప్ప........ భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-08-2015, THURSDAY)
‘అటులయిన సావిత్రీ మరొక్క వరమ్ము కోరుకొమ్ము, అదియును నీ పతి ప్రాణమ్ము దక్క’ అనే యమధర్మరాజు డైలాగు ఒకటుంది ఒక తెలుగు సినిమాలో. ఆ మాదిరి సమాధానమే దొరికినట్టు అర్ధం అవుతోంది మొన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుమ జరిగిన భేటీలో. అలనాటి పురాణ కధలో సతీ సావిత్రి యముడ్ని తన కోరికల చిట్టాలతో తికమక పెట్టి, చివరికి పోయిన తన పతి ప్రాణాలతో సహా అన్నింటినీ సాధించుకుంటుంది. సరే! అది కధో, పురాణమో కాబట్టి సావిత్రి పట్టిన పట్టు విడవక తన పంతం నెగ్గించుకుని ఉండవచ్చు. కానీ ఈ కలికాలంలో ఇలాటి కధ ఇలానే సాగే వీలులేదు.  కాబట్టే, ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా అనేది ప్రధానాంశంగా ఎజెండాలో పెట్టుకుని,   ప్రధాని  మోడీతో భేటీ ముగిసిన తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘హోదా అనేది ఏవన్నా సంజీవనా ?’ అంటూ సమావేశం ఫలితాన్ని ఒక్క ముక్కలో తేల్చేశారు.


చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా తనదయిన రీతిలో ఇదే భావం వ్యక్తం అయ్యేలా మాట్లాడి, మళ్ళీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కారు.  
నిజమే! చంద్రబాబు  అన్నట్టు కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నింటినీ కట్టగట్టి రాత్రికి రాత్రే పరిష్కరించే  దివ్యశక్తులు ఏవీ,  ‘ప్రత్యేక హోదా’కు లేని మాట వాస్తవమే. అందుకే హోదాతో పాటు పత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రత్యేక హోదా అయినా, ప్రత్యేక ప్యాకేజీ అయినా  ఏ రూపంలో అయినా,  వాటి  అవసరం రాజకీయంగా వున్నది ప్రధానంగా తెలుగు దేశం పార్టీకే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకే. రాష్ట్రాన్ని తాను  అనుకున్న రీతిలో తీర్చిదిద్దాలన్నా, ప్రజలకు  ఇచ్చిన మరి కొన్ని హామీలు మళ్ళీ ఎన్నికలనాటికన్నా నెరవేర్చాలన్నా ప్రత్యేక హోదాలు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక   ప్యాకేజీలు వంటి ఉపశమనాలు అత్యంత ఆవశ్యకం. ఈ వాస్తవం తెలిసిన మనిషి కనుకనే ఈ కోరికల నన్నింటినీ గుదిగుచ్చి ఓ చిట్టా తయారు చేసి మరీ ప్రధానమంత్రికి సమర్పించారు. ఆంద్ర ముఖ్యమంత్రి రాకలోని ఆంతర్యం తెలిసిన బీజేపీ నాయకత్వం కూడా ఆంద్రప్రదేశ్ విషయంలో తమకు ప్రత్యేక శ్రద్ధ వున్నట్టు కనిపించడానికి ఈ భేటీకి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. చంద్రబాబు చెప్పింది ప్రధానమంత్రి సావధానంగా విన్నారని ఆ తరువాత చంద్రబాబే స్వయంగా చెప్పారు. చెప్పింది వింటే  ఎవరికయినా  సగం సంతృప్తి ఇస్తుందన్నట్టు ఆయన మొహంలో ఆ తృప్తి కనిపించింది. అయితే దీనితో అందరూ సంతృప్తి చెందుతారా ?  మరి ఈ ‘హోదా’ విషయాన్ని మొట్టమొదట తెర మీదకు తీసుకు వచ్చి అదొక్కటే కొత్త రాష్ట్రపు ఇక్కట్ల నన్నింటినీ పరిహరింపగల ‘మంత్రదండం’  అని జనాల్లో లేనిపోని ఆశలు రేకెత్తించినదెవరు ? ఈ ప్రశ్నకు జవాబు తామే అని ఏ రాజకీయ పార్టీ ఎలాగూ అంగీకరించదు. అలా అని ఏడాది క్రితం జరిగిన విషయాలు జనం అంత త్వరగా మరిచిపోయే వీలు కూడా లేదు.
సరే! షరా మామూలుగానే అంశంతో సంబంధం వున్న రాజకీయ పార్టీలన్నీ ఎదుటివారిపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాయి  తప్ప ఏ ఒక్క పార్టీ కూడా తమకూ ఇందులో కొద్దో గొప్పో పాత్ర  ఉన్నదన్న వాస్తవాన్ని నిజాయితీగా  ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ అంశం ఒక జటిల సమస్యగా రూపాంతరం చెందడానికి దోహదం చేసిన కారణాల్లో ఇది ప్రధానమైనది.
నూతన రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా దక్కకకుండా పోవడంలో పాత్ర అలావుంచి అసలు సీమాంధ్ర ప్రాంతంలో మెజారిటీ ప్రజల   అభీష్టానికి విరుద్ధంగా ఆ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సందర్భంలో, అప్పుడే ఈ అంశాన్ని విభజన చట్టంలో చేర్చి వుంటే ఈ పరిస్తితి ఉత్పన్నం అయ్యేది కాదు అనే వాదన వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ కూర్చోబెట్టి ప్రజలు తమ తీర్పు చెప్పేశారు.  చేసిన తప్పుకు ఆ పార్టీ శిక్ష కూడా అనుభవిస్తోంది. కాబట్టి,  ఇక దాన్ని తప్పుపట్టి ప్రయోజనం లేదు.         
పొతే, వై.ఎస్.ఆర్.సీ.పీ. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశలు వమ్ముకావడానికి దోహదం చేసిన కారణాల్లో విభజన అంశం కూడా ఒకటి. మిగిలివున్న మూడున్నర సంవత్సరాల కాలం నిజానికి ఆ పార్టీకి పోరాట కాలమే. ఏ చిన్న అంశం దొరికినా, దొరకకున్నా దొరకబుచ్చుకుని వీధుల్లోకి రావాల్సిన రాజకీయ ఆవశ్యకత ఆ పార్టీకి వుంది. ఉనికి కాపాడుకోవడానికి ఆ స్థానంలో ఏ పార్టీ వున్నా అదే పని చేస్తుంది. ఈ ప్రత్యెక హోదా అనేది ఆ పార్టీకి అలా అందివచ్చిన అవకాశం. ‘ఆ పార్టీ చేసే ధర్నాలవల్ల ప్రత్యెక హోదా వస్తుందా? కేవలం ప్రజలకు అసౌకర్యం తప్ప’ అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదీ. నిజమే. ధర్నాలవల్ల, ఆందోళనల వల్ల, నిరసనల వల్ల రాజకీయ నిర్ణయాలు ప్రభావితం కావు. నిర్ణయం తీసుకునే అవకాశం వున్న  ఏ రాజకీయ పార్టీ అయినా దానివల్ల కొద్దో గొప్పో లబ్ది వుంటుంది అనే నమ్మకం చిక్కిన తరువాతనే అటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్నాలు, ఆందోళనలు ఒక భాగం.  అవి సహజం’  అని ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రబోధించే పార్టీలే అధికార పీఠం ఎక్కగానే, తగవు తగవంటూ  ఇటువంటి నీతి పాఠాలు వల్లె వేస్తూ వుండడం వల్ల జనసామాన్యంలో వాటికి విలువ తగ్గిపోతూ వుంది. 
ఇక బీజేపీ. బీజేపీ అంటే ఇప్పుడు మోడీ. మోడీ అంటే బీజేపీ అనే తరహాలో ఆ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. మొత్తం వ్యవస్థను మారుస్తాను అనే నమ్మకాన్ని కలిగించి గద్దె ఎక్కిన రాజకీయ నాయకుడు ఆయన.  ఎన్నికలకు ముందు కొంతకాలం వరకు ప్రధాని అభ్యర్ధిగా తన పేరు ప్రతిపాదించడానికి కూడా సొంత పార్టీలోని కొన్ని శక్తులు అడ్డం పడ్డ సంగతి తెలియని వాడేమీ కాదు. వరుసగా పదేళ్ళు పాలించి స్కాముల ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నిర్వాకమో తెలియదు, ప్రజలు మార్పు కోరుకున్నారో తెలవదు, హరి యను రెండక్షరములు హరియించును పాతకములు అన్న చందంగా  మోడీ అనే రెండక్షరాలు, భారత రాజకీయ చరిత్రలో కనీ వినీ ఎరుగని అద్భుత విజయాన్ని ప్రజలు మోడీ నాయకత్వంలోని ఎండీయే కూటమికి కట్టబెట్టాయి.  సహజంగా ఎన్నికల్లో గెలుపోటములు దైవాధీనాలు. అందుకే ఎన్నికలకు ముందు మోడీ వ్యవహార శైలిని ఎన్నికల్లో అపూర్వ విజయం తరువాత ఆయన వ్యవహరిస్తున్న తీరుతో ముడిపెట్టడం కూడా పద్దతి కాదు.
అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకి, అధికారం చేజిక్కించుకున్న తరువాత చేష్టలకి హస్తిమశకాంతరం తేడా ఉంటుందన్నది సర్వజన విదితమే. తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చేటప్పుడు మోడీ కేవలం నరేంద్ర మోడీ. తరువాత దేశం యావత్తు పట్టం కట్టిన ప్రధానమంత్రి. తేడా ఉండదా అంటే వుండి తీరుతుంది. ఎందుకంత తేడా అని తప్పు పట్టలేము. ఆరోజు అవసరానికి ఎన్నో చెబుతారు. అవన్నీ చేసి తీరాలని రూలేమీ లేదు. దేశ ప్రధాని పీఠం ఎక్కేంతవరకు ఆంధ్రప్రదేశ్  అనేది ఒక ముఖ్యమైన  రాష్ట్రం. ఆ పీఠం అధిష్టించిన తరువాత దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు  రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది.
అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ  రాజకీయ పార్టీలు చెప్పినవన్నీ చేసి వుంటే ఇప్పటికి మన భారత దేశం మొత్తం ప్రపంచంలో అగ్రగామిగా వుండేది. అలా అని మాట నిలబెట్టుకోలేకపోతే ఎల్లా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. దానికి సరయిన జవాబు ఓటు రూపంలో సిద్ధంగా వుంటుంది. నిజానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళ కాలంలో మనదేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతోంది రాజకీయ పార్టీలు కాదు, కేవలం ప్రజలే. ఆ భరోసా ఉన్నంతవరకు రాజకీయ పార్టీల హవా కేవలం మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకే.         
పొతే ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, లేదా ప్రత్యెక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం చేతిలోని వ్యవహారం. ఇవ్వడం వల్ల అధ్బుతాలు జరక్క పోవచ్చు. కానీ ప్రత్యెక హోదా అనేది ఒక భావోద్వేగ అంశంగా మారితే జరిగే పరిణామాలు  వేరుగా వుంటాయి. తెలంగాణా విషయంలో జరిగింది అదే. లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా త్రాసులో వేసి తూస్తే తెలంగాణా అనే భావోద్వేగపు తులసి దళం పడగానే తేలిపోయాయి. ఇలాటి వాస్తవాలను రాజకీయ పార్టీలు అహరహం గుర్తుంచుకోవాలి.
అదీ వాటి బాగు కోసం కాదు, ప్రజల బాగోగుల కోసం. (26-08-2015)

రచయిత ఈ మెయిల్ :  bhandarusr@gmail.com   మొబైల్: 98491 30595                     

25, ఆగస్టు 2015, మంగళవారం

జీవితం


ఒకరై
ఒకరిద్దరై
ఇద్దరొకరై
ఒకరికొకరై
ఒకరు తోడై
ఒకరు నీడై
దరి ఎండమావై  
చివరికి ఎవరికివారై
తిరిగి ఒంటరై
బతుకు చిందరై

ఇదేనా జీవితం!