16, జులై 2015, గురువారం

'ఆకాశంలో సగం'

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 19-07-2015, SUNDAY)  

స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు. ఈ నేపధ్యంలో ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది. ఆ వార్త ఏమిటంటే-
ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరుమాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు  పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే  వెసులుబాటు కల్పించింది..
చట్టం ప్రకారం  ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.
సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.
వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.    
నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు  గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం  ఆడపిల్ల ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా  నొసటితో వెక్కిరించేవాళ్ళు.
మారడం కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే,  చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని  ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.
ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి  పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా  ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.
ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను  కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.
సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ అర్దిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు,  దేశ ఆర్ధిక వ్యవస్థ  పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.


మరో రకం ఆడవారు వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు అక్షరం ముక్కలే. చిన్న  చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో అయితే  నాలుగిళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు.  వీరికి బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.
మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.   
ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు, పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!   
యాభయ్ ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను చూస్తూ వున్నాను.
కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల  ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను చూడక పోతానా?  (16-07-2015)                
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE : Courtesy Image Owner

15, జులై 2015, బుధవారం

ఒక విషాదం - రెండు జ్ఞాపకాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 16-07-2015, THURSDAY)

విషాదం ఎందుకో ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. రెండు రోజులుగా అన్ని  టీవీల్లో అవే దృశ్యాలు.



రాజమండ్రిలో గోదావరి 'మహా' పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన స్నానఘట్టం ఒకదానిలో  జరిగిన దుర్ఘటన అందరి మనసులను కలచివేసింది. కారణం ఎవరయినా, మూల కారణం ఏదయినా అనేక నిండు ప్రాణాలు గోదావరి నదీమ తల్లి సాక్షిగా గాలిలో కలిసిపోయాయి. సరే. షరా మామూలుగా రాజకీయ పక్షాల నాయకులు తమ కోణాల్లో, తమదయిన బాణీల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల  బాణాలు విసురుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని టీడీపీ ప్రత్యర్ధులు డిమాండు చేస్తే, కృష్ణా పుష్కరాల దుర్ఘటనకు బాధ్యత తీసుకుని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి  యెందుకు రాజీనామా చేయలేదని అధికార టీడీపీ వారు ప్రతి విమర్శలు చేశారు. ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది నిజానికి  గత కాలపు ముచ్చట. ఈ కాలపు రాజకీయ నాయకులకు కానీ, నేటి యువతకు కానీ తెలియని విషయం. 'నైతిక విలువలు' అనేవి ప్రస్తుత కాలంలో వారి నుంచి ఆశించడం వృధా ప్రయాస. తినే అన్నం  గొంగట్లో అయినప్పుడు వెంట్రుకలు గురించి చింతించడం యెంత విజ్ఞతో ఇదీ అంతే.
జనాలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడిన సందర్భాలలో ఇలాటి దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. దీనికి పలు దృష్ట్యాంతాలు వున్నాయి. అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్ళిన భక్తులు అనేకమంది తొక్కిసలాటలో మరణించిన విషయం ప్రజల మనస్సుల్లో ఇంకా పచ్చిగానే వుంది.  పలు ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో హఠాత్తుగా సంభవించిన ఇటువంటి దుర్ఘటనలు  అనేక కుటుంబాల్లో కడుపుకోతను మిగిల్చాయి.
రాజమండ్రి దుర్ఘటన కూడా వీటిల్లో ఒకటిగా కొంతకాలం తరువాత జనం చెప్పుకుంటారు. పుష్కరాల మొదటి రోజునే ఇది జరగడం పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. సమర్ధింపు కోసం ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని రకాల వాదనలు చేసినా జనం నమ్మడం కష్టం. నిజానికి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లను శక్తికి మించి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సొంత పర్యవేక్షణలో అన్ని  పనులు జరిపించారు. అన్ని చోట్లా తానయి నిలిచారు. ఇది కూడా ఆయన్ని ఆత్మరక్షణలో పడేసింది.  పర్యవేక్షణ పేరుతొ ఆయన అధికారులను పనిచేయనీయలేదని, అందుకే పుష్కర ఏర్పాట్లన్నీ అరకొరగా జరిగాయని ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు ఆరోపణల గళం పెంచారు.  
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన కీర్తి చంద్రబాబు నాయుడు  ఖాతాలో పదిలంగా  వుంది. ఈసారి 'మహా పుష్కరాల'ను  దానికి మించి నిర్వహించి, తన మంచి పేరును మరింత సార్ధకం చేసుకోవాలని తలపోయడం సహజమే. ఈ 'ప్రచార' బలహీనతే  గోదావరి పుష్కరాలను ఉత్తరాది 'కుంభమేళా' ను మించి నిర్వహించాలనే ఆలోచన చేసేలా ఆయన్ని పురికొల్పి వుంటుందని, అదే ఇప్పుడు కొంప ముంచిందని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి అభీష్టానికి  కొందరు పండితులు చెప్పిన 'మహా పుష్కరాలు' అనే కొత్త కోణం ఆజ్యం  పోసింది. ప్రచారకర్తలు ఎవరో కాని, 'నూట నలభయ్ నాలుగేళ్ల' తరువాత వస్తున్న 'మహా పుష్కరాలు ' అనే ప్రచారం మాత్రం నేల నాలుగు చెరగులా చరచరా పొక్కిపోయింది. ఈ 'సూత్రీకరణ'కు  ప్రాతిపదిక ఏమిటో ఎవ్వరికీ తెలవదు. 'ఎవరో. ఎప్పుడో  అన్నారు, అంతే! అది కార్చిచ్చులా  జనంలో అది పాకిపోయింది.
పన్నెండేళ్ళకోసారి వచ్చే పుష్కర స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో   వయస్సు మళ్ళిన వాళ్లు కూడా చేతయినా కాకపోయినా పుష్కర యాత్రకు బయలుదేరుతారు. ఇక 'మహా పుష్కరాలు' అంటూ సాగిన ఉధృత ప్రచారంతో,  అన్ని వయస్సుల వాళ్లు పుష్కర స్నానాల కోసం ఎగబడ్డారు. జీవిత కాలంలో ఒకే ఒక్కసారి దొరికే అవకాశం అంటూ వూదరగోట్టారు.  పుష్కర యాత్రీకులకు రాష్ట్ర ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందనీ, వసతులు కల్పిస్తోందని సాగిన  ప్రచారం భక్తులను లక్షల సంఖ్యలో ఆకర్షించింది. దానితో భారీగా చేసిన ఏర్పాట్లన్నీ వెల్లువెత్తిన భక్తజనంతో గాలికి కొట్టుకుపోయాయి. ప్రచారం పాలు  ఎక్కువయితే వాటిల్లే పర్యవసానాలు  ఇలాగే వుంటాయి.
వీటన్నిటికీ అదనంగా, ఈసారి గోదావరి పుష్కరాలను వాణిజ్య ధోరణులు కమ్మివేసాయి. ఇన్ని లక్షల  ఒక్కచోట జనాలు చేరే చోట,  'కాసుల పంట' పండించుకోవాలని కొన్ని వ్యాపార వర్గాలు పుష్కర యాత్రీకులకు అరచేతిలో స్వర్గం చూపించాయి. ఆధ్యాత్మికతను వినోదంతో ముడిపెట్టి పుష్కర యాత్రను ఒక విహార యాత్రగా మార్చివేశాయి.  ఎన్ని కష్టాలు పడయినా సరే, పుష్కర స్నానం చేసి తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు పెట్టి తరిద్దామని అనేక వ్యయప్రయాసలకి ఓర్చి వచ్చే పుష్కర యాత్రీకులకు ఈ కొత్త  'విహార యాత్రీకులు ఈసారి జత కలిసారు. ఏతావాతా పుష్కరాలకోసం గోదావరి బాట పట్టే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. పుష్కర ముహూర్తం అంటూ సాగిన ప్రచారంతో  తొలిరోజునే పుణ్య స్నానాలు చేసి పుణ్యం మూటకట్టుకోవాలనే కాంక్షతో పుష్కరాల మొదటి రోజుకే లక్షలాదిమంది రాజమండ్రి చేరుకోవడం జరిగింది. పుష్కర ఘాట్ అని ఒక స్నాన ఘట్టానికి పేరు వుండడంతో, నడిచి వెళ్ళడానికి అది  అనువుగా వుండడంతో అందరూ ఆ ఘట్టం వైపే మొగ్గు చూపడం, ముఖ్యమంత్రితో సహా కొందరు ముఖ్యుల కోసం ఆ ఘాట్ ని చాలాసేపు మూసివుంచడం, వీఐపీలు తమ పనులు చక్కబెట్టుకుని వెళ్ళగానే సర్దుబాటు చేసే పోలీసులు తగిన సంఖ్యలో లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఇరవై ఏడుమంది వూపిరి ఆడక చనిపోయారని, ఇంకా చాలామంది గాయాల పాలయ్యారని తొలి వార్తలు తెలిపాయి.
పుష్కర పుణ్యకాలంలో జరగరానిది జరిగిన మాట వాస్తవం. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద స్థాయి కొంత అదుపులో వుండి వుండేదన్న వాదన కూడా  కొట్టిపారేయలేనిది. ఈ దుర్ఘటన ఇదొక గుణపాఠం వంటిది.  పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే ఆ పాఠం నేర్చుకున్నట్టు అవుతుంది. లేకపోతే, అది షరా మామూలుగా నాయకుల నోటి నుంచి జాలువారే 'ఊతపదం' గా మారుతుంది.                                
ఇక ఈ సందర్భంలో గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు, అటూ ఇటూ పోలీసులు పట్టుకున్న తాళ్ళ నడుమ ఒక వరుసలో నడుచుకుంటూ హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.



రెండో జ్ఞాపకం కూడా చాలా పాతది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. హైదరాబాదు  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను.  అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా అక్కడ  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా 'సనత్ నగర్ అయితే తీసుకుపోతా' అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం, పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడే వుండి సర్దుబాటు చేసివుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ, 'అవును, కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు.
రాజమండ్రి సంఘటనకీ, నా పాత జ్ఞాపకాలకీ సంబంధం అర్ధం అయిందనుకుంటాను.
(15-07-2015)
NOTE : Courtesy Images Owners              


14, జులై 2015, మంగళవారం

ఒక విషాదం రెండు జ్ఞాపకాలు


విషాదం ఏమిటో విడిగా చెప్పనక్కర లేదు. ఈరోజు టీవీల్లో అంతా అవే దృశ్యాలు.
ఇక జ్ఞాపకాలు ఏమిటంటే......
పాతికేళ్ళ పైచిలుకు మాట
మాస్కోలో భూగర్భ రైలుమార్గం (మెట్రో)లో ప్రయాణించి రేడియో మాస్కో  దగ్గర్లోని  స్టేషన్ లో దిగి,  ఎస్కలేటర్ ద్వారా రోడ్డుమీదకు చేరుకున్నాను. అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక దృశ్యం అక్కడ నాకు కనబడింది. స్టేషన్ వెలుపల కొందరు మిలీషియా (పోలీసులు) వాళ్లు, చేతుల్లో పొడవాటి తాళ్ళు పట్టుకుని వున్నారు. అక్కడికి దగ్గర్లో వున్న ఒక పెద్ద స్టేడియం వరకు పోలీసులు అలా తాళ్ళు పట్టుకుని కనిపించారు. నాతొ పాటు వున్న నా సహచర ఉద్యోగి, మలయాళీ న్యూస్ రీడర్ దాసన్,  నా మొహం చూసి అడక్కుండానే వివరాలు చెప్పాడు. ఆ స్టేడియంలో స్కూలు పిల్లలకు   ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి  ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, ఆ సమయంలో రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు అందరూ ఒక వరుసలో నడుచుకుంటూ వచ్చి హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. 'ఇలా కూడా చేస్తారా పోలీసులు' అనిపించింది, అప్పుడే కొత్తగా హైదరాబాదు నుంచి మాస్కో వెళ్ళిన నాకు.


మరోసారి హైదరాబాదులో  ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అక్కడ అసెంబ్లీ సమావేశాలకు ముందు  స్పీకర్ సంప్రదాయంగా  ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి.  రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను  డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్  రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. నేను చొరవతీసుకుని వెళ్ళి సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ తో అన్నాను, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అని. ఆయన నవ్వుతూ,'అవును కాన్వాయి లో వస్తూ డివైడర్ మీద నిలబడి వున్న మిమ్మల్ని చూసాను. మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నాడు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు నాకయితే అనిపించడం లేదు. (14-07-2015)

13, జులై 2015, సోమవారం

వినదగునెవ్వరు చెప్పిన ........



"తెలివికలవాడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు. అంతేకాదు, మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడమే అతడి తెలివికి నిదర్శనం.
"ఇక మేధావులు ఇతరుల తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడం కూడా వారి మేధస్సుకు గీటురాయి.

"ఇంతకీ చెప్పేదేమిటంటే, మనం తెలివికలవాళ్ళం అయినా కాకపోయినా ఒక విషయం తెలుసుకోవడం అవసరం. అదేమిటంటే తప్పులు లేదా పొరబాట్లు అనేవి మన అనుభవాన్ని పెంచుతూపోతాయి. ఆ అనుభవమే మనం చేసే  తప్పులు తగ్గించుకోడానికి ఉపయోగపడుతుంది"   

మరణ రహస్యం


చనిపోయిన తరువాత ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నారు. ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెప్పుకుంటూ వెడుతుంటే అందులో ఒక ఆత్మ రెండో ఆత్మని అడిగింది, ఇంతకీ నువ్వెలా చనిపోయావని.
మొదటి ఆవిడ చెప్పింది, 'బహుశా ఇలాటి చావు నాకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చావుకు కాసేపు ముందు వరకు నేను కలల లోకంలో  తేలిపోతూనే వున్నాను. అంతే, అరగంటలో చావు ముంచుకు వచ్చింది. భయంతో గడ్డకట్టి చనిపోయాను. ఒక్క భయంతోనే కాదు నిజంగానే గడ్డగట్టిపోయాను. మరి నీ సంగతి?'


'నాదా! నాదో విషాద గాధ. నాకు మొగుడి మీద చచ్చేంత అనుమానం. అనుమానం కాదు. అది నిజం. పెద్ద గ్రంధ సాంగుడు. నేనలా ఆఫీసు దోవ పట్టగానే ఎవత్తనో ఒకత్తిని ఇంట్లోకి తెచ్చి కులికే రకం. అందుకే అతడ్ని హఠాత్తుగా  పట్టేసి నలుగుర్లో పెట్టి పంచాయితీ చేయాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు ముడిపడింది. ఆఫీసుకు పోతున్నానని చెప్పి వెంటనే  ఇంటికి వెళ్ళి పోయాను. ఆయన హాల్లో కూర్చుని తాపీగా టీవీ చూస్తున్నాడు. పడగ్గదిలోకి వెళ్ళి చూసాను. పడక చిందరవందరగా వుంది, కాని ఆ సోకులాడి జాడ లేదు. వంటింట్లోకి వెళ్లాను. పెరట్లోకి పరుగెత్తాను. బాతు రూములో చూసాను. ఇంతట్లోకే ఎటుపోయినట్టు. నాకు ఒళ్ళు మండుతోంది. పిచ్చిపట్టినట్టు మళ్ళీ ఇల్లంతా వెతికాను. పడగ్గది, వంటగది, పెరడు, బాతు రూము, వెతికినచోటే వెతుకుతూ పోయాను. నీరసం వచ్చింది. అలుపు అనిపించింది. ఎక్కడో గుండె పట్టుకున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు మూసుకుపోయాయి. తెరిచేసరికి ఇదిగో ఇక్కడ నీతో.....'
మొదటి ఆవిడ పైకి అనబోయి తెలివి తెచ్చుకుని మనసులోనే అనుకుంది.
'ఇల్లంతా వెతికింది కాని ఈ మహా ఇల్లాలు, కాస్త  ఫ్రిజ్ తెరిచి చూసివుంటే ఇద్దరం బతికిపోయేవాళ్ళం'
(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)            

NOTE: COURTESY IMAGE OWNER

11, జులై 2015, శనివారం

ఫస్ట్ డే ఫస్ట్ షో - బాహుబలి


(TO BE PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 12-07-2015, SUNDAY)

  

"ఇస్రో భారీ వాణిజ్య ప్రయోగం - అయిదు  విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి చేర్చే ప్రయత్నం"
"బాహుబలి వాణిజ్య ప్రయోగం - భారత చలనచిత్ర చరిత్రలో సరికొత్త యత్నం"
నిన్న మొన్నటి వరకు ఈమాదిరి ప్రచారాలు సాంఘిక మాధ్యమాలను ముంచెత్తివేశాయి.
ఇస్రో ప్రయోగం విజయవంతం అయింది. అయిదు విదేశీ ఉపగ్రహాలను జయప్రదంగా నిర్దేశిత సమయానికి వాటి వాటి కక్ష్యల్లో  ప్రవేశపెట్టింది. ఏతావాతా వాణిజ్యపరంగా కూడా దేశానికి కోట్లాది రూపాయలు ఖజానాలో పడ్డాయి.
అదే సమయంలో 'బాహుబలి' అనే పేరుతొ ఒక తెలుగు సినిమా కూడా ఓ కొత్త ప్రయోగం చేసింది. ఇస్రో ప్రయోగం మాదిరిగా దీని ఫలితాలు  నిమిషాల్లో తేలిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా  తేలడానికి కొంత వ్యవధానం అవసరం. ఒక సినిమా జయాపజయాలను ముందుగానే పసికట్టి చెప్పగల శాస్త్రీయ విధానాలు లేకపోయినప్పటికీ, సాంఘిక మాధ్యమాల్లో వెలువడుతున్న అభిప్రాయాలను బట్టి ఫలితం నిరాశ కలిగించేదిగా లేదని మాత్రం అర్ధం అవుతోంది. ఈ సినిమా జయప్రదం అయితే ప్రపంచంలో తెలుగు సినిమాకు యెనలేని గౌరవం దక్కే వీలుందని నమ్మే వాళ్ల  సంఖ్య  కూడా తక్కువేమీ కాదు.
ఒక సినిమా బాగా ఆడుతుందా లేదా అనేది సాధారణ జనాలకి  అవసరం లేని సంగతే. అది ఫక్తు వాణిజ్య వ్యవహారమే. నిర్మాతలకు, ఆ సినిమా నిర్మాణంతో ఎంతో కొంత సంబంధం వున్న వాళ్లకు మాత్రమే పరిమితమైన విషయమే. అయితే, ఈ సినిమా గురించి కొంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్తితి అయితే వుంది.
ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా మిగిలిపోగలదని సినిమా నిర్మాణం మొదలయిన నాటి నుంచీ చర్చలు మొదలయ్యాయి. 'ఒక సినిమా నిర్మించడానికి ఇన్నిన్ని కోట్లు ధారపోయాల్సిన అవసరం ఏముంద'ని కొందరు అంటే, 'అంతంత  భారీ వ్యయంతో సినిమాలు నిర్మించే స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ లేద'ని మరికొందరు అన్నారు. 'సినిమా అంటేనే దృశ్య కావ్యం. కన్నుల పండువగా రూపొందించాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు' అనేవాళ్ళూ వున్నారు. 'ఈ సినిమాలో ఏముంది? యెలా తీసారు? యెలా ఆడుతుంది?' అనే ప్రశ్నలు జనాలకు అప్రస్తుతం. సినిమా బాగుందా  లేదా అనేదే వారికి ముఖ్యం. బాగా ఆడుతుందా లేదా అనేది వారికి పట్టదు. కానీ 'బాహుబలి'  సినిమా విడుదలకు ముందూ, సినిమా నిర్మాణ సమయంలోనూ  ఉవ్వెత్తున లేచి పడ్డ వూహాగానాలు, వాటి పూర్వాపరాలు చర్చించుకోవాల్సిన అగత్యం అయితే వుంది.
సినిమా అంటేనే వినోద ప్రధానం. సినీ పరిశ్రమ అంటేనే వినోద పరిశ్రమ. అయితే ఈ రంగంలో పరిస్థితులు మునుపటి మాదిరిగా లేవు.  సినిమా సినిమాకు నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. మార్కెట్ కు మించి ఖర్చు చేసే నిర్మాతలు ఎక్కువయ్యారు. పూర్వం 'పిండి కొద్దీ రొట్టె' అనే సిద్ధాంతాన్ని నిర్మాతలు నమ్ముకుంటే, ఈనాడు 'రొట్టెల సంఖ్య బట్టి పిండి సమకూర్చుకోవాల'నే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ సినిమాతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీ దారులు, థియేటర్ల వాళ్లు అందరూ పదికాలాల పాటు పచ్చగా వుండే పరిస్తితి నేడుంది. అదే సినిమా ఫట్టు మంటే, ఇక అందరి పని గోవిందే. అందుకే సినిమా విడుదలకు ముందు వారందరిలో ఏమవుతుందో అనే  బెంగ ప్రస్పుటంగా కానవస్తుంది.
పూర్వం కూడా అన్ని సినిమాలు బాగా ఆడేవి కావు. కొన్నిటికే ఆ అదృష్టం పట్టేది. కాకపొతే పెట్టుబళ్ళు పెట్టినంత తిరిగి రాకపోయినా మరో సినిమా తీసి అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఎంతో కొంత వుండేది. ఇప్పుడలా కాదు. సినిమా జయాపజయాలు కొందరి జీవితాలను ఆటో ఇటో తెల్చివేసే  విధంగా పరిస్థితులు మారిపోయాయి. కాబట్టే వినోద ప్రధానపైన ఈ రంగంలో అవాంఛనీయమైన వాణిజ్య ధోరణులు ప్రబలి పోతున్నాయి. 'ఎవరు ఏమైపోయినా పరవాలేదు తాము బాగుపడితే చాలు' అనే తరహాలో వ్యక్తుల నడుమ సంబంధాలు వుంటున్నాయి. ఒక సినిమా హిట్టు అనే మాట బయటకు  వస్తే పరవాలేదు.  'ఫట్టు' మంటే మాత్రం   కొందరు మట్టికొట్టుకు పోతారు. అయినా కొందరు  'సేఫ్ జోన్' లోనే వుండిపోతారు. అనారోగ్య ధోరణులకు ఇదే పరాకాష్ట.     
సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం అనేది ఒక్క తెలుగు చలన చిత్ర రంగానికి మాత్రమే పరిమితం కాదు. కన్నడ, మళయాళ రంగాలను మినహాయిస్తే  అనేక భాషల చిత్రాల విషయంలో ఇది వర్తిస్తుంది. కాకపోతే తెలుగు చిత్ర సీమలో ఈ మార్పు ఎక్కువగా కానవస్తోంది. హాలీవుడ్ లో కూడా ఈ ధోరణి వుంది. అనేక చారిత్రిక నేపధ్యం కలిగిన సినిమాలు ఎంతో ఖర్చుపెట్టి తీసారు. వసూళ్లు కూడా అదే రీతిలో వచ్చాయి.
సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడానికి కారణం ఎవరయినా కావచ్చు కాని  ప్రేక్షకులు మాత్రం కాదు. పెద్ద పెద్ద సెట్ట్టింగులు, విదేశీ లోకేషన్లు, భారీ తారాగణం లేని చిత్రాలను కూడా ఆదరించి కాసులు కుమ్మరించిన చరిత్ర తెలుగు ప్రేక్షకులది. కాని అపప్రద మాత్రం వారే మోస్తున్నారు. 'వారు అలానే చూస్తున్నారు కాబట్టే మేము ఇలానే తీస్తున్నాం' అనే నిర్మాతలకు కొదవలేదు.                   
"జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?" అని పాతాళభైరవి సినిమాలో మాయల పకీరు చేత ఆనాడే చెప్పించారు, 'సినిమా యెలా తీయాలి, సినిమా యెలా వుండాలి'  అనే విషయంలో అలనాడే ప్రేక్షకుల నాడి పట్టుకున్న నాగిరెడ్డి, చక్రపాణి ద్వయం.
ఒక సినిమాకు డబ్బు పెట్టడం, తిరిగి రాబట్టుకోవడం ఆ నిర్మాతల సమస్య. ముందే చెప్పినట్టు దానికీ,  జనాలకు సంబంధం లేని విషయం.
అయితే ప్రజలకు సంబంధం వున్న కొన్ని అంశాలు బాహుబలి సినిమా విడుదల సందర్భంగా చర్చకు వచ్చాయి.
ఒక సినిమా టిక్కెట్టు ధర ఎవరు నిర్ణయించాలి? ఆ సినిమా తీసిన వాళ్ళా? దాన్ని చూసేవాళ్ళా? ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వాళ్ళా? లేదా ఒకవైపు  వినోదపు పన్ను అప్పనంగా  వసూలు చేస్తూ, మరోవైపు సినిమా టిక్కెట్ల ధరవరల విషయంలో  'పేను పెత్తనం' చేసే ప్రభుత్వాలా?     
కారు తయారు చేసేవాడు దాని ధర  మార్కెట్ పరిస్తితులను బట్టి నిర్ణయించుకోగలుగుతున్నాడు. పచ్చి మిరప కాయ బజ్జీలు అమ్మేవాడు గిరాకీని  బట్టి ధర నిర్ణయించుకోగలుగుతున్నాడు. మరి కోట్లు ఖర్చుబెట్టి సినిమాలు తీసేవాళ్లకు  కూడా ఆ వెసులుబాటు యెందుకు వుండకూడదు? బాహుబలి సినిమా విడుదల సమయంలో మరోసారి చర్చకు వచ్చిన ప్రశ్నఇది. మరి ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతుకు కూడా తన పంటకు తాను ధర నిర్ణయించుకునే హక్కు వుండాలి కదా! కానీ, సినీ వాణిజ్య వర్గాల మాదిరి తమ గోడు చెప్పుకునే వెసులుబాటు వారికి లేదు. చెప్పినా వినిపించుకునే నాధుడు లేడు. ఆ విషయం పక్కన పెడదాం.  
గతంలో అద్భుతమైన సాంకేతిక ప్రతిభ కనబరచిన మాయాబజార్, పాతాళభైరవి వంటి సినిమాలను హై క్లాసులో కూర్చుని చూసిన వాళ్లు ఎక్కువ రుసుము చెల్లించిన దాఖలాలు లేవు. కానీ అవి విజయవంతం అవడమే కాకుండా నిర్మాతలపై కాసుల వర్షం కురిపించాయి. అప్పుడు ఒక పట్టణంలో రెండు థియేటర్లలో ఒక సినిమా ఒకేసారి విడుదల అయితే గొప్పగా చెప్పుకునే వారు. 'విజయవంతమయిన సంయుక్త రెండో వారం' అంటూ పోస్టర్లు వేసుకునేవారు. ఇప్పుడో. ఒక పెద్ద చిత్రం విడుదల అయ్యిందంటే మొత్తం వూళ్ళో వున్న అన్ని థియేటర్లలో అదే చిత్రం. అంటే  ఆ చిత్రం తప్ప వేరే యే చిత్రం చూసే అవకాశం ప్రేక్షకులకు లేకుండా చేయడమన్న మాట. అంటే అన్ని చిత్రాల వసూళ్ళను ఒక్క చిత్రం తాలూకు నిర్మాతలే కొన్ని రోజులపాటు  కొల్లగొట్టడం అన్నమాట. మొనోపలీ నియంత్రణ చట్టం ఇలాటి వాటికి వర్తిస్తుందో లేదో న్యాయకోవిదులే చెప్పాలి. ఒక చిత్రం పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తిని ప్రేరేపించి హెచ్చు రేట్లకు టిక్కెట్లను  ఎగబడికొనేలా చేయడం వాణిజ్య సూత్రాలకు అనుగుణ్యంగా వుండవచ్చునేమో కానీ, నైతికంగా సమర్ధనీయం అనిపించుకోదు. కాకపొతే ఈ విషయంలో ఒక్క సినిమా వారినే నిందించే పనిలేదు. డిమాండును బట్టి చార్జీలు పెంచే పని ఇప్పుడు అందరూ చేస్తున్నారు. విమానాల టిక్కెట్లు, రైలు, బస్సు టిక్కెట్లు ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ సంస్థలే ప్రయాణీకుల అవసరాలను బట్టి అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు ప్రైవేటు వారిని ఏమంటాం? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేయదు కదా!          
ఒక సినిమా జయప్రదం అయితే సినీ రంగాన్ని నమ్ముకున్న వేలాదిమందికి ఉపాధి గ్యారంటీ వుంటుందని, అంచేత స్వపర భేదం లేకుండా అన్ని సినిమాలు బాగా ఆడాలని మనసారా కోరుకోవాలని  సినిమా రంగానికి చెందిన ఒక పెద్దమనిషి పెద్దమనసుతో చెప్పారు. ఆయన చెప్పింది సబబే. సినిమాలు విజయవంతం కావాలి. విజయవంతమైన సినిమాలే రావాలి. విజయంతో పాటు ప్రేక్షకుణ్ణి రంజింప చేయడం కూడా ముఖ్యం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా సినీ రంగం పంచగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎందుకంటే ప్రజలని అత్యంత ప్రభావితం చేసే శక్తి వున్న మాధ్యమాల్లో సినిమా కూడా ఒకటి కాబట్టి. (11-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్ : 98491 30595
NOTE: Image Courtesy : Kouturi Anurag (USA) 

10, జులై 2015, శుక్రవారం

దారి



జీవితపు కూడలిలో నిలబడ్డ మనిషికి అనేక దారులు కానవస్తాయి. వాటిల్లో నూటికి తొంభయ్ తొమ్మిది శాతం చెడు మార్గాలే. చెడిపోవడానికి దగ్గరి దారులే. ఏ ఒక్కటో బాగుపడే దారి వుంటుంది. దాన్ని కనిపెట్టి ఆ దారిని ఎంపిక చేసుకోవడంలోనే మనిషి ప్రతిభ దాగివుంటుంది. 
NOTE: Courtesy Image Owner