3, జులై 2015, శుక్రవారం

పార్టీ మార్పిడులు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 05-07-2015, SUNDAY)

మొన్నీమధ్య  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చివరి  పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన  బొత్స సత్యనారాయణ, వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరారు. దానిపై చర్చలు అనంతంగా సాగుతూ వుండగానే, అదే హోదాను  రెండు పర్యాయాలు అనుభవించి వై.ఎస్.ఆర్. తో కలిసి కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చి, 'గెలుపు గుర్రం' అని  పేరుపడ్డ డి. శ్రీనివాస్, తాజాగా గులాబీ కండువా కప్పుకుని టీ.ఆర్.ఎస్. లో చేరిపోయారు. 'పార్టీ మార్పిళ్ళకు ఈ పరిణామాలు పరాకాష్ట' అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాటి సందర్భాలలో ఉభయపక్షాల నుంచి విమర్శలకు, సమర్ధనలకు అంతే  వుండదు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా వుండడం అవసరం. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత పాత పడిపోతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       
'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  
పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిష్టు పార్టీలు వుండేవి కాని వాటి పాత్ర పరిమితంగా వుండేది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.
ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలుగా వున్న రెండు తెలుగు రాష్ట్రాలు  తొలి ఎన్నికల సమయంలో కూడా రెండు వేర్వేరు  రాష్ట్రాలుగానే వున్నాయి. కాకపొతే భౌగోళికంగా కొంత తేడా వుండివుండవచ్చు. పేర్లలో సయితం కొంత మార్పు వుండవచ్చు. ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్  అప్పుడు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణాగా  వున్నది అప్పుడు హైదరాబాదు స్టేట్ .  అప్పుడు తెలంగాణాలో వున్న కొన్ని ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల్లో చేరిపోయాయి. అలాగే, ఆంధ్ర ప్రాంతంలో వున్న కొన్ని భాగాలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయాయి.
1948లో నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అయిన తరువాత హైదరాబాద్ స్టేట్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి నాటి స్వతంత్ర సమరయోధుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1956లో ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ పేరుతొ దేశంలో తొట్టతొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది.  నిరుడు 2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా  అది  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది.
ఈ చిక్కుముళ్ళు ఎప్పుడూ విడివడతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి. 'మీరంటే మీరే కారణం' అంటూ వివాదాలకు కేంద్ర బిందువులయిన రెండు ప్రధాన పార్టీలు వీధులకెక్కి వీరంగాలు చేస్తూ వుండడం, అటూ ఇటూ పార్టీల నాయకులు. కార్యకర్తలు, అభిమానులు వేర్వేరు పారావారాలుగా విడిపోయి వాదోపవాదాలకు దిగడంతో సామరస్య పరిష్కారం ఆశలు సన్నగిల్లుతున్నాయి.   దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.
పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     
సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. వీటిల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది. 1952 లో ఆంధ్ర ప్రాంతంలో  జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో నలభయ్ ఒక్క  స్థానాలు గెలుచుకున్న కమ్యూనిష్టులు, నలభయ్ స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కావడం మూలాన, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికార పీఠం ఎక్కే అవకాశం కమ్యూనిష్టులకు లభించలేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ అనంతరం 1955లో జరిగిన ఎన్నికల నాటికి కాంగ్రెస్ తెలివిన పడింది.    ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ కాంగ్రెస్ పేరుతొ పోటీ చేసి  బయటపడగలిగింది. ఆ ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీకి కేవలం పదిహేను సీట్లే దక్కాయి. ఇక, కారణాలు ఏమైతేనేం, అప్పటి నుంచి ఈనాటివరకు కమ్యూనిష్టు పార్టీలకు ఆ పూర్వ వైభవం మళ్ళీ అనుభవం లోకి రాకుండా పోయింది. అందుకే,  ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా వున్న శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లావరకు వున్న ప్రాంతంలో 1952లో జరిగిన ఎన్నికలను, తొలి తెలుగు ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ  పోటీ చేసిన 1983 ఎన్నికలను  చరిత్రను మలుపు తిప్పిన ఎన్నికలుగా పేర్కొంటూ వుంటారు.          
గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం.
అయినా అర్ధం కానిది ఒకటే.   
రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.
ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.




ముక్తాయింపు :       
ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:
"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?" (03-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner  

2, జులై 2015, గురువారం

ఆత్మ విశ్వాసం


ఏకాంబరరానికి దిక్కు తోచడం లేదు. వున్నదంతా వ్యాపారంలో పెట్టాడు. కాలం కలిసిరాలేదు. లాభాలమాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబళ్ళు కూడా  వెనక్కి రాలేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫోను మోగితే అప్పులవాళ్లేమో అని భయం. తలుపు తడితే తీయడానికి సంకోచం, అప్పిచ్చిన వాళ్లు ఏకంగా ఇంటి మీదికే వచ్చేరేమో అని. ఒక్కోసారి ఆర్ధిక  ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా మదిలో మెదిలేది.
దిక్కు తోచని ఏకాంబరం ఓ రోజు మధ్యాన్నం నిర్మానుష్యంగా పార్కుకు వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. మొహం చూస్తే ఎక్కడో చూసిన మొహమే అనిపించేలా వుంది.  సూటూ బూటూ డబ్బున్న వాడి మాదిరిగానే కనిపించాడు. ఆ వచ్చిన వాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏకాంబరానికి అతడెవరో తెలియగానే మతి పోయింది. ఆ వృద్ధుడు ఆ వూర్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే అత్యంత ధనికుడు. దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు వున్నాయి. అతడిలా అన్నాడు.
'చూడండి. మీరేదో ఇబ్బందుల్లో వున్నట్టున్నారు. ఆర్ధిక సమస్య అయితే నాకు ఒదిలేయండి' అంటూ మాట్లాడుతూనే జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి చెక్కుపై సంతకం చేసి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. 'సరిగ్గా ఏడాది తరువాత ఇదే పార్కులో కలుద్దాం. వడ్డీ అవసరం లేదు కాని అసలు మాత్రం ఇవ్వండి చాలు'
చెక్కు చేతిలో పెట్టి అతడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
తీసి చూస్తే పాతిక లక్షలకు రాసిన చెక్కు అది. అప్పులు తీర్చగా  ఇంకా కొంత మిగులుతుంది కూడా. ఏదయితేనేం భగవంతుడు,  వృద్ధుడి రూపంలో వచ్చి  తనకో దారి చూపించాడు.
ఇంటికి వెడుతూ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో అతడికి మరో ఆలోచన వచ్చింది. పాతిక లక్షల చెక్కు. అదీ దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడు ఇచ్చిన చెక్కు. అది తన జేబులో వుంది. ఇక దేనికీ భయపడాల్సిన పనిలేదు. ముందు వ్యాపారవ్యవహారాలు చక్కదిద్దాలి. ఎటొచ్చి ఎటు పోయినా రామబాణం వంటి చెక్కు తన దగ్గరే  వుంది.


ఆ వూహ అతడిలో ఆత్మ విశ్వాసం నింపింది. ఇక ఆ రోజు నుంచి అతడి తరహా తీరు పూర్తిగా  మారిపోయాయి. చెక్కు ఇచ్చిన ఆత్మ బలంతో అతడు ముందుకు అడుగులు వేసాడు. వెనుకటి ఆత్మన్యూనతా భావం మచ్చుకు కూడా కానరాకుండా పోయింది. ఆత్మవిశ్వాసంతో సాగించిన  అతడి వ్యాపారానికి కూడా తిరుగు లేకుండా పోయింది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చాడు.
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగింది. వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెక్కు తీసుకుని అదే పార్కుకు వెళ్ళి అదే బెంచీ మీద కూర్చుని ఎదురుచూడ్డం మొదలు పెట్టాడు. అనుకున్నట్టే వృద్ధుడు వచ్చాడు. 'మిత్రమా యెలా వున్నావు? కులాసాయేనా'  అని కుశల ప్రశ్నలు వేసాడు. 'మీ దయవల్ల బాగున్నాను. పోతే, మీ చెక్కు ఉపయోగించుకునే అవసరం పడలేదు' అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టి దణ్ణం పెట్టాడు ఏకాంబరం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు మగ నర్సులు వచ్చారు. 'ఇక్కడ వున్నావా మహా ప్రభూ! నీకోసం ఆసుపత్రి అంతా వెతుకుతున్నాం' అంటూ  ఏకాంబరం వైపు చూసి చెప్పారు. 'నేను పలానా పలానా. గొప్ప ధనికుడ్ని. డబ్బేమన్నా కావాలా అని అడిగాడా! అడిగేవుంటాడు. అతడికి ఇది మామూలే. ఎందుకంటే  ఇది మామూలు పిచ్చి కాదు' అంటూ ఆ వృద్ధుడిని బలవంతాన తీసుకుపోయారు.
ఏకాంబరం నివ్వెరపోయాడు. ఎంతో ధనికుడు అనుకున్న ఇతడు పిచ్చివాడా. అతడిచ్చింది చెల్లని చెక్కా!'
కానీ ఆ తరువాత ఆలోచిస్తే ఆ పిచ్చివాడి రూపంలో అతడికో జీవిత సత్యం బోధపడింది.
ఆ చెక్కు వుందన్న భరోసాతో అతడు వ్యాపారంలో ముందుకు సాగాడు. 'అవసరం అయినప్పుడు అదే ఆదుకుంటుంది' అన్న 'నమ్మకం' అతడ్ని ముందుకు నడిపించింది. ఆ ఆత్మ విశ్వాసం ఎంతో కలిసివచ్చింది. పట్టింది బంగారం అయ్యింది. అప్పుడే ఆ చెక్కు బ్యాంకులో వేసి వుంటే అసలు విషయం తెలిసిపోయేది. కధ అక్కడే పూర్తిగా ఆగిపోయేది.
భగవంతుడు కూడా అలాటి భరోసానే. ప్రతిదానికీ దేవుడ్ని వాడుకోవాలని చూడకుండా ఆయన మన వెంటే వున్నాడనే నమ్మకంతో ముందుకు వెడితే అంతా బాగుంటుంది. మనిషి కృషికి దేవుడు అనబడే ఓ కానరాని అదృశ్య శక్తి అండ ఎప్పుడూ  వుంటుంది.
(ఓ ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)
NOTE : Courtesy Image Owner

దొందూదొందే


కొత్తగా పెళ్ళయిన వధూవరులను పల్లకిలో తీసుకువెడుతున్నారు. దారిలో పూతపూసిన చింత చెట్టు కనిపించింది.
'చింత చెత్తు పూత పూసింది' అన్నది పెళ్ళికూతురు.
ఆమెకు 'ట' పలకదు.
'పూతే కాలం వస్తే పూస్తుంది కదా!' అన్నాడు పెళ్ళికొడుకు. అతడికి 'చ' పలకదు.
ఈ ఇద్దరి మాటలు వింటూ అన్నాడు పల్లకి బోయీల్లో ఒకడు.

'దొందూదొందే కొందప్పా!'
అతగాడికి 'డ' పలకదు.  



NOTE: Courtesy Image Owner  

1, జులై 2015, బుధవారం

డాక్టర్స్ డే


ఎనిమిదేళ్ళక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో, అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం  ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో 
నిలోఫర్ లో  మరో పసికందు మృతి, సకాలంలో  వైద్యసాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృతశిశువును  వొడిలో పెట్టుకుని (నాటి) తల్లి తెలంగాణా అధినేత్రి రాములమ్మ అదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరి అనే సూక్తిని నిజం చేశారు.

అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చిలికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళనల  వల్ల సరయిన వైద్యం సరైన సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే గాలిలో కలిసిపోయాయి. మరి వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును డాక్టరు గారు అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. సైకిల్ డాక్టరుగారని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ఇప్పుడెలావుందయ్యా రాముడూ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, ఆరేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!
కనీసం ఈనాడు డాక్టర్స్ డే జరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  
(01-07-2015)

NOTE: Courtesy Image Owner 

30, జూన్ 2015, మంగళవారం

అందరి శ్రేయోభిలాషి


'ఈ పాడు ప్రపంచంలో అందరూ అందరే. ఎవరికీ మనగురించి పట్టదు. మన మేలు కోరుకునే వాళ్లు ఎవళ్ళూ లేరు' అన్నాడు ఏకాంబరం
'అలా యెలా? అసలాసంగతి ముందు చెప్పు' అడిగాడు లంబోదరం
'యెలా ఏమిటి? ఈ డాక్టర్లు వున్నారు చూడు, మనం బాగుండకపోతేనే వాళ్లకు బాగుండేది. అందుకే ఏదో రోగం రొష్టూ రావాలనే వాళ్ల యావంతా'
'అలాగా'
'అలాగే. పోలీసులకి మనం ఒక దొంగ కావాలని, అయితే ఓ పట్టు పట్టేసుకుని అడ్డదారిలో  ఓ ప్రమోషనో, రహదారిలో  ఓ ఆమ్యామ్యానో నొక్కేద్దామని దొంగచూపులు చూస్తుంటారు.  లాయర్లూ  అంతే! ఏదో ఒక కేసులో ఇరుక్కుంటే మనల్ని  బయట పడేసి తాము బాగుపడిపోదామని వెధవది వాళ్లకు వెధవాశ. పొట్టకొస్తే అక్షరమ్ముక్క రానివాళ్లమయితే ట్యూషన్లు చెప్పి నాలుగు డబ్బులు పోగేసుకుందామని చూస్తారు టీచర్లు. ఇక మన ఇంటి ఓనరు వుంటాడు చూడు, మనం ఎప్పటికీ ఏబ్రాసి మొహం వేసుకుని ఇలాగే  సొంత ఇల్లు కొనుక్కోకుండా, జీవిత పర్యంతం వాడికి కిరాయి కడుతూ అద్దె ఇంట్లోనే అఘోరించాలని పాడు ఏడుపు. పోనీ ఆ పంటి వైద్యుడికయినా మనమీద కనికరం వుందా అంటే అదీ లేదు, మనం పుటకతోనే పుచ్చిన పళ్ళతో పుడితే పండగ చేసుకునే రకం. మన స్కూటరు పంక్చరు కావాలని, కారు  ఇంజిను రీబోరింగుకు రావాలని మెకానిక్కులు దేవుడికి మొక్కుకున్నా ఆశ్చర్యం లేదు. ఏం చెప్పమంటావు లంబోదరం,  ఈ లోకంలో అందరూ మన కీడు కోరుకునేవారే. ఒక్క దొంగ తప్ప. వీళ్ళందరికన్నా ఇళ్లకు కన్నాలు వేసే ఆ దొంగే మిన్న'


'దొంగా! అదెలా!' నోరెళ్ళబెట్టి అడిగాడు లంబోదరం'
ఏకాంబరం చెప్పిన జవాబుతో లంబోదరం తెరుచుకున్న నోరు మళ్ళీ మూతపడకుండా అలాగే వుండిపోయింది.
'ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒంట్లో పుష్కలంగా వుండాలి. ఏడువారాల నగలు చేయించుకోవాలి. బ్యాంకుల్లోనే కాదు ఇళ్లల్లోను దాచుకునేంత దండిగా డబ్బులుండాలి.   రాత్రి పూట హాయిగా గురక పెట్టి నిద్రపోవాలి' అని మనసారా కోరుకునే శ్రేయోభిలాషి నిజానికి ఈ సృష్టి మొత్తంలో దొంగ ఒక్కడే. కాదంటావా లంబోదరం!
(30=06=2015)

Note : Courtesy Image Owner 

ఒక్కసారి రైలెక్కాలని వుందొదినా!


"ఈ మాట అనకపోయినా బాగుండేదని ఆ సాయంత్రం ఓ లక్ష సార్లయినా అనుకుని వుంటాను. కానీ బంగారు లేడి కోరిక కోరి భర్తకు దూరమయిన సీతాదేవి, ఆ  తరువాత  యెంత పరితపించివుంటే మాత్రం  ఏం లాభం? అయితే  సీతకు దొరకని ఆ బంగారు లేడి, దేశం కాని దేశంలో భాష కాని భాష మాట్లాడే ఓ 'లేడీ' రూపంలో  నాకు దొరికింది" అంది మా మేనకోడలు పలివెల జయ.
జయకు కబుర్ల పోగు అనే పేరుంది. గలగలా మాట్లాడుతుంది. అంతే కాదు విన్నంతసేపు ఇంకాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించేలా వుంటుందా వాక్ప్రవాహం.


(శ్రీమతి జయ పలివెల)



(శ్రీ పలివెల సుబ్బారావు)


పిల్లలు ముగ్గురూ వివిధ దేశాల్లో వుండడం మూలాన అమెరికా, ఆస్త్రేలియాలే కాకుండా పనిలోపనిగా జయ ఆడపడుచు వాళ్ళుండే న్యూజిలాండ్ కూడా చుట్టబెట్టుకొచ్చారు జయ, సుబ్బారావు దంపతులు. ఆ  నానాదేశ సందర్శన సందర్భంలో న్యూజిలాండులోని ఆక్ లాండులో జరిగిందీ సంఘటన.
'ఎప్పుడూ విమానాలు కార్లేనా ఒక్కసారన్నా రైలెక్కకపోతే యెట్లా' అన్నది జయ మనసులోని మాట. మా మేనకోడలు పుట్టిపెరిగిన ఖమ్మం మామిళ్లగూడెంలోని వాళ్ల పుట్టిల్లు రైలుకట్ట పక్కనే వుంది. రైలు చూడకుండా, రైలు కూత వినకుండా వాళ్లకు పూటగడవదు. అందుకే కాబోలు న్యూజిలాండులో రైలెక్కి తిరగాలన్న కోరిక కలిగినట్టుంది.
'రైలేనా! అదెంత భాగ్యం' అన్నది వాళ్ల ఆడపడుచు రూప. అంతే. ఆరోజు కారెక్కించుకుని వూర్లోని  వింతలూ విశేషాలు చూపిస్తున్న రూపకు, జయ కోరిన కోరిక గుర్తొచ్చి కారును రయ్యిమని దగ్గర్లో వున్న రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి ఆపింది. కారును పార్కుచేయడం, దగ్గర్లో వున్న మరో స్టేషనుకు టిక్కెట్లు కొనుక్కోవడం, ప్లాటుఫారం మీద రైలుకోసం ఎదురుచూస్తూ వుండడం క్షణాల్లో జరిగిపోయింది. ఇంటినుంచి తెచ్చుకున్న పులిహార పొట్లం వున్న సంచిని భద్రంగా చేతుల్లో పట్టుకుని,  నగలు నాణ్యాలు (వెయ్యి డాలర్లు) వున్న చేతి సంచిని ప్లాటుఫారం మీదనే వుంచి ఆడపడుచుతో కబుర్లలో పడింది. ఇంతలో రైలు రావడం, ఆగీఆగనట్టుగా ఓ లిప్తపాటు ఆగిన రైల్లోకి గబగబా ఎక్కి సీట్లలో జారగిలబడడం కూడా క్షణాల్లో జరిగిపోయింది.  సీట్లు దొరకడంతో మళ్ళీ మాటలు మొదలయ్యాయి. మాటల మధ్యలో డబ్బూ, బంగారం వున్న తన చేతి సంచీ జ్ఞాపకం వచ్చింది. అది చేతిలో లేకపోవడం చూసి గుండెల్లో గాభరా మొదలయింది. ప్లాటుఫారం మీద మర్చిపోయి రైలెక్కిన సంగతి కూడా నెమ్మదిగా గుర్తుకు వచ్చింది. కానీ ఏం లాభం అప్పటికే రైలు రెండు మూడు స్టేషన్లు దాటివచ్చింది. అందరూ గబగబా పక్క స్టేషన్ లో దిగి, మళ్ళీ తిరుగు  రైలు పట్టుకుని మొదటి స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ స్టేషన్  మాదిరిగానే వుంది, ఒక్క చేతి సంచీ తప్ప. ప్లాటుఫారం మీద హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్న వీళ్ళని చూసి ఓ న్యూజిలాండు లేడీ పలకరించింది. 'మీరు మరచిపోయిన చేతి సంచీ మీ పక్కన కూర్చున్న మరో ప్రయాణీకురాలు తీసుకుంది. ఆవిడ అర్జంటు పని మీద వెడుతున్నారల్లే వుంది. సాయంత్రం అయిదు లోపల మళ్ళీ ఇక్కడికి వస్తాను. సంచీ తాలూకు వాళ్లు వస్తే మీలో ఎవరయినా ఈ సంగతి చెప్పండి' అంటూ హడావిడిగా వెళ్ళిపోయిందం'టూ  చల్లటి కబురు వాళ్ల చెవిలో వేసింది.  ఈ కబురు తెలవడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. కాకపొతే మరికొన్ని గంటలు ప్లాటు ఫారం మీదే గడపాలి. జరిగిన దానినే నెమరు వేసుకుంటూ, తెచ్చిన పులిహారను అయిష్టంగానే లాగిస్తూ మొత్తం మీద ఏదోవిధంగా కాలక్షేపం చేస్తూ కాలం దొర్లించారు. చీకటి పడుతోంది కానీ ఆ బంగారు లేడీ జాడ లేదు. ఆ జాడ చెప్పిన మనిషీ లేదు. దాంతో  సద్దుమణిగిన గాభరా మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటున్న సమయంలో దూరంగా రైలు కూత వినబడింది. ఆగిన రైల్లోనుంచి తొందర తొందరగా దిగిన ఓ లేడీ బిగ్గరగా ఏదో మాట్లాడుతూ హాండ్ బ్యాగ్ వూపుతూ కనిపించింది. చేతి సంచీ కనబడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది జయకు. ఒక్క పెట్టున అటుగా పరిగెత్తుకు వెళ్ళింది. జయను చూడగానే, ఎవరూ ఏమిటి అని అడగకుండా చేతి  సంచీ జయ చేతిలో పెట్టి, 'గోల్డ్ గోల్డ్, కేర్ ఫుల్' అంటూ రైలెక్కి వెళ్ళిపోయింది. కలయా వైష్ణవమాయయా అనుకుంటూ గిల్లి చూసుకున్న జయ సంచీ తెరిచి చూసుకుంటే నగలతో సహా డబ్బూ దస్కం (డబ్బంటే పిల్లాడు ఇచ్చింది, దస్కం అంటే ఇల్లాళ్ళ బ్లాక్ మనీ) అన్నీ పదిలంగా వున్నాయి.
ఏదయితేనేం మొత్తం మీద కధ సుఖాంతం అయింది. ముక్కూమొహం తెలియని ఆ బంగారు 'లేడీ' పోగొట్టుకున్నవన్నీ భద్రంగా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది.
ఇంటికి చేరిన తరువాత జయను ఇంకో సందేహం పట్టి పీడించింది.
'ఈ న్యూజిలాండ్ ఆడవాళ్ళకు డబ్బంటే లెక్కలేదు సరే,  కానీ బంగారం లాంటి బంగారు నగలు కూడా వీళ్ళకు  పనికి రాకుండా యెలా పోయాయబ్బా!'      (30-06-2015)

29, జూన్ 2015, సోమవారం

రాముడు మంచి బాలుడు


ఓ చిన్న క్విజ్ (బహుమతులు గట్రా లేవన్నది టాగ్  లైన్)

ముగ్గురు వ్యక్తుల్ని గురించి చెప్పుకుందాం. వారిలో మొదటి వాడున్నాడే అతగాడికి ఇద్దరు భార్యలు. ఎంతో చెడ్డ పేరున్న రాజకీయనాయకులతో పూసుకురాసుకు తిరిగే  మాచెడ్డ స్నేహం. జ్యోతిష్యం అన్నా జ్యోతిష్కులన్నా యమ గురి. ఇక సిగరెట్లు తాగడం మొదలు పెట్టాడంటే ఇక అంతా నిర్ధూమధామమే. చైన్ స్మోకర్ అన్నమాట. ఇతడ్ని ఈ పొట్టి కధ అయ్యేదాకా 'ఏ' అని పిలుచుకుందాం.
పోతే రెండోవాడు 'బీ'. సరిగ్గా పనిచెయ్యడం లేదని రెండుమార్లు ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పారు. పడకేసాడంటే చాలు   మిట్ట మధ్యాన్నం అయ్యే దాకా పడక మీద నుంచి లేవడు. కాలేజీ రోజుల్లోనే భంగు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను  ఓ పట్టు పట్టిన ఘనకీర్తి వుంది. పోద్దుగూకడం ఆలశ్యం  'బుడ్డీదాసు' గా మారిపోతాడు. సీసాలకు సీసాలు తాగే పెద్ద  పీపా అనే పేరు కూడా వుంది.  అదీ ఈ 'బీ' గారి చరిత్ర.
ఇక మూడో పెద్దమనిషి 'సీ' అనుకుందాం. నిజంగా పెద్దమనిషే. దేశం కోసం యుద్ధాలు చేసి 'వార్ హీరో' అని పేరు తెచ్చుకున్నాడు. శుద్ధ శాకాహారి. మద్యం, మాంసం వేలేసి ముట్టడు. సిగరెట్ పొగకు ఆమడ దూరం. పరాయి ఆడదాన్ని పట్టుకుని, కట్టుకున్న భార్యను  మోసం చేయాలనే ఆలోచన ఏ కోశానా లేని అపర శ్రీరామచంద్రుడు.
ఈ ముగ్గురిలో 'జెంటిల్ మన్' ఎవరు అంటే  ఏం చెబుతారో చెప్పండి?
ఆగండాగండి. ముందు ఈ  'ఏ' బీ' సీ' ఎవరో తెలుసుకోండి.
మొదటాయన 'ఏ'. ఈయన  ఎవ్వరో కాదు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి గొప్పపేరు తెచ్చుకున్న ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్.
రెండో ఆయన అంటే మన 'బీ'గారు మరెవ్వరో కాదు, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఘన కీర్తి పొందిన విన్ స్టన్ చర్చిల్.
ఇక మూడో వ్యక్తి,  'సీ' గారు, అదే, రాముడు మంచి బాలుడు అనే లక్షణాలు అన్నీ పుణికి పుచ్చుకున్న ఈ వ్యక్తి ఎవ్వరూ అంటే .........
వరల్డ్ ఆల్ టైం రికార్డు నియంత ..... హిట్లర్ మహాశయులవారు.

పై పై లక్షణాలు చూసి స్వభావం అంచనా వేయడం సరికాదన్నది ఇందులోని నీతి.
NOTE: Courtesy Image Owner