5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని బెజవాడ జ్ఞాపకాలు

(07-09-2014 తేదీ ఆదివారం 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 

ఒక నూతన రాష్ట్రానికి రాజధానీ నగరం అవ్వాల్సిన అవకాశం విజయవాడకు మళ్ళీ అరవై ఏళ్ళ తరువాత లభించడం నిజంగా ఒక విశేషమే. రాష్ట్ర విభజన తరువాత పాత పేరుతొ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా విజయవాడ పేరుని  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అసెంబ్లీలో అధికారికంగా  ప్రకటించడంతో ఒక్కసారిగా ఆంద్ర ప్రాంతంలోని ఈ నడిబొడ్డు పట్టణం వార్తల్లోకి ఎక్కింది. ఈ నిర్ణయంలోని మంచి చెడులను కాలపరీక్షకు వొదిలి ఒకనాటి బెజవాడ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశ్యం.


పూర్వం ఈ పట్టణాన్ని బెజవాడ అనేవారు. ఈ పేరు రావడానికి కూడా ఒక స్థల పురాణాన్ని పేర్కొంటూ వుంటారు. సముద్రుడిని త్వరగా చేరుకోవడానికి వీలుగా తనకొక దారి చూపాల్సిందని కృష్ణానదీమతల్లి పాండవ మధ్యముడయిన ఆర్జునుడిని కోరడంతో విజయుడు, నదీ మార్గానికి అవరోధంగా నిలచిన కొండలకు తన అస్త్ర శస్త్రాలతో బెజ్జం పెడతాడు. ఆ విధంగా ఆ పట్టణానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి కాలక్రమంలో అది బెజవాడగా స్థిర పడిందని చెబుతారు.
అలాగే విజయవాడ అనే పేరుకు కూడా పురాణ ప్రాశస్త్యం వుంది. దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది.  విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల,  ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే,  మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.    
ఉత్తర దక్షిణ భారత ప్రాంతాలను కలిపే రైలు మార్గం ఈ పట్టణం మీదుగా వెళ్ళడం మూలాన విజయవాడ పేరు దేశం నలుమూలల్లో ప్రసిద్ధం. మెకెన్సీ క్వార్టర్లీ అనే అంతర్జాతీయ ఆర్ధిక వ్యవహారాల మేగజైన్ విజయవాడను 'భవిష్యత్ భౌగోళిక నగరం' గా అభివర్ణించింది. దేశంలో బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలో, అంటే క్రీస్తు మరణానంతరం  639 లో భారత దేశానికి వచ్చిన చైనా యాత్రీకుడు హ్యూన్ సాంగ్  బెజవాడను కూడా సందర్శించినట్టు రాసుకున్నాడు.
భౌగోళిక, చారిత్రిక ప్రాధాన్యం కలిగిన విజయవాడకు ఇప్పుడు రాజకీయపరమైన  ప్రాముఖ్యం  లభించబోతున్న ప్రస్తుత తరుణంలో ఒకనాటి బెజవాడ గురించిన జ్ఞాపకాల దొంతర ఇది.
చంద్రబాబు పుణ్యమా అని విజయవాడ అనే బెజవాడ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.
కనుక ఆ బెజవాడ పాత ముచ్చట్లు కొన్ని.
నాకు తెలిసిన  బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు  పేరు.
 “అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ జంధ్యాల దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరికొన్ని  పేర్లు.
సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,  మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు,  శ్రీరంగం గోపాల రత్నం"
సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ  వంటి కవి పండిత శ్రేష్ఠులు,  పరిశ్రమలతో పాటు  ధార్మిక సంస్థలు నెలకొల్పిన  చుండూరు  వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ  రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -   బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని   అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,  బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,  సీడీ  కృష్ణమూర్తి  నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,  ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి,  చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డిఏబీకె ప్రసాద్,   పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు -  వీరిదీ  బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
ప్రభాకర ఉమామహేశ్వర పండితుల  ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి  లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,  నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి  ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే  నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి  లక్ష్మీ జనరల్ స్టోర్స్వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు  శ్రీ రామనవమి  పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

 తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా,  బోడెమ్మ హోటల్,  న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్,  అలంకార్  సెంటర్,  మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు,  జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే  జనం ఇవీ బెజవాడ  అంటే.
లీలా  మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు  రోడ్డు  సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె,  దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం,  పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల  హల్వా,  రామచంద్రరావు హోటల్లో  అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,  కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం,  సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక  శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమాజైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు,  ఎప్పుడూ  హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం దివ్యజ్ఞాన  సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,  ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో  గోపికలతో  సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా  కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ  మునిసిపల్ హైస్కూల్,  సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.


 “బెజవాడ చాలా గొప్పది. అరవ వాళ్లకి  మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.
NOTE: Courtesy Image Owner 

నాతో జాగ్రత్త!


ఈ మధ్య ఒక ఛానల్ యాంఖరమ్మాయి నా మొహాన ఓ కాంప్లిమెంటు పారేసింది.
'మీరిలా ప్రశాంతంగా ఎలా వుంటున్నారు. మా నాన్నగారు ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారు.'
పాపం ఆ అమ్మాయికి తెలియదు నేనూ ఇంట్లో అంతకంటే ఎక్కువ భుగభుగల మనిషినని. ఆ అమ్మాయి పుణ్యమా అని నాకొక విషయం తెలిసొచ్చింది. ప్రతిమనిషిలో ఓ అపరిచితుడు దాగుంటాడని. అందరికీ మంచిమనిషిగా కనిపించే శాల్తీలు నిజానికి అంత నిఖార్సయిన మంచి సరుకు కాకపోవచ్చని. సకల సద్గుణ రాముడని బయటవారు కీర్తించే  లక్షణాలు వారిలో ఆట్టే లేకపోవచ్చని.
ఈ రూలు నాకే కాదు మనం అందరం అభిమానించే సినీ తారలు, రాజకీయ నాయకులు, రచయితలు, జర్నలిష్టులకు  సైతం వర్తిస్తుంది. వాళ్ళ అందచందాలు, మాటల గారడీలు, రచనలు ఇవన్నీ చూసీ, వినీ, చదివీ పరమవీర అభిమానులం అయిపోతుంటాం. అక్కడే బోల్తాపడిపోతుంటాం. నిజానికి, పైకి కనిపించేవాటికీ, వారికీ ఆమడ దూరం వుంటుందన్న వాస్తవం మరచిపోతుంటాం.
అన్నింటికీ మినహాయింపు వున్నట్టే  ఈ  సూత్రం నుంచి వేరు చేసి చూడాల్సిన మహానుభావులు లేకపోలేదు.
వారు పుణ్య పురుషులు. మిగిలినవారు కాపురుషులు.




NOTE: Courtesy Image Owner 

4, సెప్టెంబర్ 2014, గురువారం

ఇద్దరు గురువులు



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.
అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.
నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు.

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.
మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను రేడియో రోజులుమరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్.  అదేమిటంటారా!
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.
ఈ గురుపూర్ణిమ నాడు ఆయన్ని సంస్మరించుకుంటూ - 



శివరాజు అప్పయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. 
    

3, సెప్టెంబర్ 2014, బుధవారం

తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు


'రామః రామౌ, హే రామ హే రామౌ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్  హైస్కూలు భవనం. విశాలమైన ప్రాంగణం. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు. ప్రధాన భవనంలో మెట్లకింద,  తెల్లని పంచె, లాల్చీ కండువా  ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే,  మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,  శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ   మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది.  అది ఒకప్పటి జ్ఞాపకం.
పొతే, ఈమధ్య నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి  పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :    
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన  అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం.  అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'   
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం  వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'  
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్నిభాగాలను  ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
తోక టపా: ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.    


(సంస్కృతం నోటు పుస్తకం)


మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!

1, సెప్టెంబర్ 2014, సోమవారం

వంద రూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు


(03-09-2014 తేదీ 'సూర్య'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
ఏదో సినిమాలో లాగా కాస్త ముందూ వెనక్కీ వెళ్ళాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా అత్యంత సమర్ధుడయిన అధికారిగా పేరుతెచ్చుకున్న తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదులోని బేగం పేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లా వెళ్లోద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణ మంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు. ఆయన ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. అదేమిటంటే పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు. ఆ విలేకరి వాళ్ళు పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆ విలేకరి క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు అంటూ యూ ఎన్ ఐ పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణ మంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇక మళ్ళీ వర్తమానంలోకి వద్దాం. ఒక చిన్న వార్తతో పెను మార్పులకు కారణం అయిన ఆ జర్నలిష్టు ఎవరంటే నిన్ననో మొన్ననో తొంభయ్యవ పడిలో అడుగిడిన  వృద్ధ బాలకుడు వీ. హనుమంతరావు గారు. డెబ్బయ్ ఏళ్ళుగా ఆయన కలం రాస్తూనే వుంది. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం. ఈనాటి నవ యువ జర్నలిష్ట్ తరానికి మార్గ నిర్దేశనం చేయగల చేవకలిగిన హనుమంతరావుగారు, తొంభయ్యవ యేట కూడా పాఠాలు నేర్పడానికి సిద్ధంగానే వున్నట్టు కానవస్తున్నారు. శతమానం భవతి అంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుందాం. 


(తొంభయ్ ఏళ్ళ యువకుడు హనుమంతరావు గారు) 

కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఈరోజు 'సాక్షి'దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


(ఎనభయ్యవ దశకంలో వైయస్సార్ తో నేను)



కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


(ముఖ్యమంత్రి వైయస్సార్ తో నేను)

వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. (01-09-2014)



31, ఆగస్టు 2014, ఆదివారం

కుంచె కన్నీళ్లు కారుస్తోంది



బాపు ఇక లేరు. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి  గుండెలు బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే  ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఈరోజు పూర్తయింది. బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ  చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు.  బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.  కాకపొతే ఇన్నేళ్ళుగా ఆయన  బొమ్మల్ని చూసి కడుపారా నవ్వుకున్న జనాలు, ఆయన మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఆదివారం తెలుగు చిత్రపరిశ్రమకు గాడాంధకారం.