15, ఆగస్టు 2014, శుక్రవారం

విజయానికి ఏడు మాటలు




నిన్న సాయంత్రం హైదరాబాదు గోల్ఫ్ క్లబ్ లో జరిగిన ఒక సమావేశంలో హెచ్.ఎం.ఆర్.ఐ.,  సీ.ఈ.ఓ., డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ విజయం సొంతం చేసుకోవడానికి కావాల్సిన ఏడు మాటలు చెప్పారు.
అవేమిటంటే:
ఆర్తి, ఆకాంక్ష, ఆవేశం, ఆలోచన, ఆచరణ, ఆమోదం, ఆధ్వర్యం
ఏపని చేయాలన్నా ఆపని పట్ల ఆర్తి అవసరం. చేయాలన్న ఆకాంక్ష, చేసి తీరాలన్న ఆవేశం అంతే అవసరం. ఆర్తి, ఆకాంక్ష, ఆవేశం వుంటే చాలదు  ఆలోచన కూడా అవసరం. ముందు వెనుకలు ఆలోచించకుండా అడిగేస్తే  అంతా నిరర్ధకం అయ్యే ప్రమాదం వుంటుంది. తరువాత కావాల్సింది ఆచరణ. ఈమొత్తం ప్రక్రియ విజయవంతం కావాలంటే ఆమోదం అంటే ప్రజల ఆమోదం కూడా వుండితీరాలి. ఇక చివరిగా, అంటే ఇవన్నీ సమకూరినప్పుడు, మొత్తం ప్రణాళికను అమలుచేసే యంత్రాంగం లేదా వ్యవస్థ అవసరం, అదే ఆధ్వర్యం. అది ప్రభుత్వం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. ఇంకేదైనా కావచ్చు.
ఈ ఏడూ కూడితే అంటే సమకూడితే అలా చేపట్టిన పని ఏదయినా విజయం సాధించి తీరుతుంది. అని డాక్టర్ బాలాజీ ఉవాచ.  

   

కంటికి చిక్కిన 'సిత్రాలు'


స్వాతంత్ర దినవేడుకల్ని అన్ని టీవీ ఛానళ్ళు పోటాపోటీగా ప్రసారం చేసాయి. ఈ సందర్భంలో కానవచ్చిన, వినవచ్చిన కొన్ని విశేషాలు.
సికిందరాబాదు పెరేడ్ మైదానంలో అమర సైనికుల స్మారక స్తూపం వద్ద  నివాళి అర్పించిన అనంతరం స్మారక ఫలకం చేరువలో కూర్చుని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్,  సైనికాధికారులు అందించిన పుస్తకంలో సంతకం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన ముందున్న స్మారక ఫలకంపై   'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు' అని ఇంగ్లీషులో రాసిన అక్షరాలు కనిపించాయి. ఆ ఫలకం వేసినప్పుడు సీఎం చంద్రబాబు కావడంవల్ల ఆయన పేరు వేశారు. కానీ ఇప్పుడది  విచిత్రంగా గోచరించింది.



స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలచిన గోల్కొండ కోట చారిత్రిక ప్రాధాన్యం గురించి టీవీ వ్యాఖ్యాతల వర్ణవను మించి  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన ప్రసంగంలో  అభివర్ణించారు. ఒకనాటి తెలంగాణ కవులను పేరుపేరునా స్మరించడం  నిజంగా అభినందనీయం. తెలుగు భాషపై ఆయనకు వున్న పట్టు ఎలాటిదో మరోసారి తెలిసివచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.   

14, ఆగస్టు 2014, గురువారం

నిర్ణయం (కధానిక) - భండారు శ్రీనివాసరావు




ప్రహరీ  గేటు తెరుస్తుంటే సెల్ మోగింది. శ్రీ కాంతం మామయ్య.
'ఒర్రేయ్ కృష్ణా - నువ్వు బాబాయి గారి వూరెళ్ళావని మీ ఆవిడ చెప్పింది. పరాంకుశం గారు పిల్లని చూడ్డానికి రేపు అక్కడికి వస్తున్నారని చెప్పు. నేనే చెబుదును కానీ, వొద్దులే నువ్వే అక్కడ వున్నావు కదా విషయం  నీకే బాగా తెలిసి వుంటుందిలే' అంటూ ఫోన్ ఆఫ్ చేసాడు. గేటు మీద చెయ్యి అప్రయత్నంగా వెనక్కు వచ్చింది. 'ఏవిటిలా అంటాడు. శ్రీ కాంతం మామయ్యకు  నాకంటే కూడా బాబాయి దగ్గర చనువు. పైగా నేను బాబాయి వూరికి  అనుకోకుండా వచ్చాను. ముందు అనుకున్నది కూడా కాదు. ఇప్పుడేం చేయాలి' అనుకుంటూనే గేటు తెరిచి చూసాను. బాబాయి ఏరి కోరి కట్టుకున్న ఇల్లు. ఇంటి ముందు పది మంచాలు వేసుకుని హాయిగా పండుకునే జాగా. మట్టే బంగారం అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఆయన గజం జాగా కూడా అమ్మలేదు. అపార్ట్ మెంటుకు ఇవ్వాలనే ఆలోచనా  చెయ్యలేదు.
అంతా నిశ్శబ్దంగా వుంది. బాబాయి కొన్ని విషయాల్లో గంభీరంగా వుంటాడు కానీ అందరితో బాగా కలివిడిగా వుండే తత్వం. వచ్చేపోయేవాళ్ళతో హడావిడిగా వుండే ఇల్లు. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో దర్బారు మొదలవుతుంది. కొన్ని విషయాల్లో వయస్సును కూడా మరిచిపోయి హుషారుగా వుంటాడు. అందుకే నాకూ ఆయనకూ చాలా ఏళ్ళు తేడా వున్నా మేమిద్దరం ఎప్పుడూ కలిసినా చాలా సరదాగా కాలక్షేపం చేస్తుంటాం.
వసారా దాటుకుని వెళ్లాను. తలుపు వోరగా వేసి వుంది. మాటలు వినబడుతున్నాయి. అంటే ఇంట్లోనే వున్నారన్నమాట. కాలింగ్ బెల్లు నొక్కకుండానే తలుపు తోసుకుని లోపలకు వెళ్లాను. రాంబాయి పిన్నీ, పిన్ని కూతురు స్పందన ఇద్దరూ  నన్ను చూసి మాటలు ఆపేశారు.
'ఏం కృష్ణా చెప్పాపెట్టకుండా దర్శనం. అంతా బాగున్నారా. మీ ఆవిడ యెలా వుంది. ఈ మధ్య వొంట్లో బాగాలేదన్నారు. బాబాయి గారు ఇంట్లో లేరు. నేనూ స్పందనా  ఏదో లోకాభిరామాయణంలే. ఏవిటి సంగతులు?...' పిన్ని గడగడా మాట్లాడేస్తోంది. కానీ ఆ స్వరంలో ఏదో తేడా. మాటలకు చూపులకు పొంతన కుదరడం లేదు. ఈ టైం లో ఎందుకువచ్చానన్న సందేహం ఆమె కళ్ళల్లో కనబడుతోంది.
నా సందేహానికి సమాధానం స్పందన మాటల్లో నాకు  బోధపడింది.
'కృష్ణప్ప బాబాయి మనకు  ఏవన్నా కొత్తా. ఆయన దగ్గర దాచేది యేవుంటుంది. అదికాదు బాబాయి. పరాంకుశం తాతయ్య కొడుకు లేడూ. సుందరం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చి వారం అయిందట. మళ్ళీ వెంటనే వెళ్ళాలట.  నన్ను చూసుకోవడానికి రేపో ఎల్లుండో వస్తాడట. అమ్మా నాన్నా ఒకటే ఇదై  పోతున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కళ్ళముందు పెరిగారు. పైగా  పరాంకుశం తాతయ్యతో వ్యవహారం. బాగుండదు వొప్పుకోమ్మా అంటారు. నిన్నటి నుంచి ఇదే నస. ఏం చెప్పమంటావు' అనేసింది తానూ తల్లిలాగే లొడలొడా.
'ఓహో అందుకా అన్నీ నీకే తెలిసివుంటాయ'న్నాడు శ్రీకాంతం మామయ్య. విషయం అర్ధం అయింది. స్పందనతో  నేరుగా యెప్పుడన్నా అన్నామేమో  తెలియదు కాని,  సుందరం, స్పందన  చిన్నప్పటి నుంచీ మా అందరి లెక్కలో భార్యాభర్తలే.
ఆ మాటే పైకి అన్నాను. నామాట వినగానే స్పందన కస్సుమని లేవలేదు. పైగా మనసులోని మాటను యండమూరి వారే  ఆవహించారేమో అన్నంత చక్కగా తేటతెల్లం చేసింది.
చిట్టి, అదే స్పందన ముద్దు పేరు,  మా అందరి కళ్ళముందు పుట్టి పెరిగిన చిట్టి తల్లి, అలా ఆరిందాలా ఒక్కొక్క విషయం చెబుతుంటే నేను చెవులొప్పగించి వింటూ వుండిపోయాను.
'చూడు బాబాయి. నువ్వన్నది కరక్టే. నేనూ సుందరం మొగుడూ పెళ్లాలమని మనవాళ్లందరూ అనుకుంటున్న సంగతి నాకూ తెలుసు. కానీ మీకు తెలియంది ఒకటి వుంది. చిన్నప్పటి నుంచీ ఎన్నో అనుకుంటూ వుంటాం. అన్నీ జరుగుతాయా. నేను డాక్టర్ అయితే చూడాలని నాన్న ఆశపడ్డాడు. నాచేత నర్సింగ్ హోం పెట్టించాలని ఇల్లు చెడగొట్టకుండా అంతే వుంచేసాడు. కానీ అయినానా. లేదే. పెళ్లి అనేది మనసుకు సంబంధించింది కాకపొతే నేనూ తలవంచి సుందరం చేత తాళి కట్టించుకునేదాన్ని. చిన్నప్పటినుంచి కలిసి తిరగడం వల్లనో యేమో, 'ఒసే చిట్టీ' అంటే 'ఏరా సుందరం' అనిపిలుచుకునే వాళ్ళం. ఈ కాలంలో మొగుడూ పెళ్ళాలు   ఇలా పిలుచుకోడం మామూలయింది కాబట్టి ఈ వాదన నిలవదనుకో. కానీ, మరి మనసునేం చేయను. అది మరోలా చెబుతోందే. ఇక పరాంకుశం తాతయ్య సంగతి. ఆయనంటే అందరికీ సింహ స్వప్నమే. కానీ నాతో చిన్న పిల్లాడిలా వుంటాడు. తాతయ్య తాతయ్య అంటూ చిన్నప్పటి నుంచి ఆయన వొళ్ళో పెరిగాను. ఇప్పుడు కోడలు అవతారంలో వెళ్ళి 'మామయ్యా కాఫీ తాగుతారా' అని యెలా అడగను. సుందరం సంగతి తలచుకుంటే మరీ విడ్డూరం. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నవాడే. మళ్ళీ ఈ పెళ్లిచూపుల తతంగానికి తల వూపడం ఏమిటి? పైగా చేసే ఉద్యోగం అమెరికాలో. నేనూ ఇందులో ఇరుక్కున్నాను కనుక సరిపోయింది. లేకపోతే ఈ విషయంలో సుందరాన్ని కడిగి గాలించి వుండేదాన్ని. చివరిగా చెబుతున్నాను బాబాయి. అమ్మకూ, నాన్నకూ, పరాంకుశం తాతయ్యకూ ఇష్టం కాబట్టి ఏమి చేయమన్నా చేస్తాను, కానీ సుందరంతో పెళ్లి మాత్రం ఇష్టపడయితే చేసుకోను. అతడు జస్ట్ నా చిన్నప్పటి ఫ్రెండ్. అంతే. అంతకు మించి ఏమీ కాదు. ఇంకోమాట. ఇలా అంటున్నానని నా మనసులో ఎవరో వున్నారని అనుకోవద్దు. ప్రేమా దోమా అలాంటివేం లేవు. వుంటే ముందు చెప్పేది మా అమ్మానాన్నతోనే.'
ఎప్పుడు వచ్చాడో తెలియదు. స్పందన  చెప్పింది ఎంతవిన్నాడో తెలియదు. బాబాయి చేతులు స్పందన  తలను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కళ్ళు అదేపనిగా వర్షిస్తున్నాయి.


 NOTE: Courtesy Image Owner



13, ఆగస్టు 2014, బుధవారం

"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ"


"వుంటే నాతొ వుండు, లేదా నా శత్రువుతో వుండు" అని అర్ధం వచ్చే ఈ మాట అన్నది ఒక అమెరికన్ ప్రెసిడెంటు. పేరు గుర్తుకు రావడం లేదు.
"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది.  ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
ఇప్పుడవి గుర్తుకువచ్చిన సందర్భం మాత్రం గుర్తుంది.
ప్రతిరోజూ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల నడుమ సాగుతున్న మాటల యుద్ధం గమనిస్తూ, వాటిని గురించి విశ్లేషణ చేసే సందర్భంలో మహా విసుగు వస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల సముఖంలో ఇలాటి చర్చ జరిగినప్పుడు మరీ ఇబ్బందిగా వుంటోంది. ఏ విషయానికయినా బొమ్మా బొరుసూ మాదిరిగా 'మంచీ చెడూ' అనే రెండు పార్శ్వాలు వుంటాయి. పీపీయేలు, ఫీజు రీఇమ్బర్స్ మెంట్లు,  సర్వే ముచ్చట్లు ఏది తీసుకున్నాఈ విషయంలో  'మాదే రైటు' అనే మొండి ధోరణి తప్ప ఒక అంగుళం దిగివచ్చి మంచేదో చెడేదో మాట్లాడుకుందాం అన్న ధోరణి కానరావడం లేదు. ఏ విధానం అయినా, ఏ ప్రణాళిక అయినా నూటికి నూరు శాతం కరక్టుగా వుండే అవకాశం  వుండదు. మొత్తం మీద బాగున్నా ఏవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. కానీ, ఒక్క చిన్న విషయంలో  కూడా అవతలవాళ్ళు చెప్పింది అంగీకరించడానికి ఇవతలవాళ్ళు సిద్ధంగా వుండరు.  వాళ్ల నాయకుల విధానాలను సమర్ధించుకుంటూ పోవాలనే ఏకైక లక్ష్యం ఒక్కటే కనబడుతుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంత గుడ్డిగా సమర్ధించుకుంటూ పోవడం ఏమేరకు మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు కూడా వుంటారని వాళ్లు మరచిపోతున్నారు. చాలా దురదృష్టకరం.


అనేక విషయాల్లో విబెదిస్తున్న అటూ ఇటూ నాయకుల వరస ఒక విషయంలో మాత్రం ఒకే విధంగా వుంది.
'మధ్యే మార్గం వద్దు. వుంటే నాతో వుండు. లేదా శత్రువుతో వుండు'
మరి నాయకుల్నిబట్టే వారి అనుచరులు.
దీనికి ముక్తాయింపు అన్నట్టుగా పక్కన  టీవీలో తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతుంటే వారి పార్టీ సభ్యులు గుడ్డిగా బల్లలు చరుస్తున్న దృశ్యం కనబడుతోంది.      

NOTE: Courtesy Image Owner 

వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ


రేడియో న్యూస్ రీడర్లు గురించి నేను రాసినవాళ్ళందరూ  నాతో పాటు హైదరాబాదు కేంద్రంలో పనిచేసినవారే!. ఇక, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ, జ్యోత్స్నాదేవి వీరంతా విజయవాడలో, చదువరుల్లో కొందరు పేర్కొంటున్న మరికొందరు న్యూస్ రీడర్లు  ఢిల్లీలో - ఉదాహరణకు కొంగర జగ్గయ్య - రేడియోలో వార్తలు చదివినవారే. తమ స్వరమాధుర్యంతో శ్రోతలని మెప్పించిన వారే. వీరిలో సుబ్బారావు, ప్రయాగలతో బెజవాడలో తాత్కాలికంగా పనిచేసిన అనుభవం వుంది. అక్కడ న్యూస్ ఎడిటర్లు సుదీర్ఘకాలం సెలవులో వెళ్ళినప్పుడు నేను హైదరాబాదు నుండి వెళ్ళి అక్కడ మూడు నాలుగు వారాలపాటు  బులెటిన్ వ్యవహారాలు చూసేవాడిని. ఆ విధంగా సుబ్బారావు, ప్రయాగలతో నాకు చక్కని సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరిదీ వొకే వూరు. మంచి స్నేహితులు కూడా. పాపం సుబ్బారావు రిటైర్ అయిన కొన్నేళ్లకే కన్ను మూసాడు. ప్రయాగ హైదరాబాదు వచ్చి సుజనా కంపెనీలో మంచి పొజిషన్ లో చేరి సమాజానికి పనికివచ్చే మంచి కార్యక్రమాలు చేస్తూవస్తున్నాడు. యెంత బిజీగా వున్నా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగానికి దూరం కాలేదు. అది ఇంకా మంచి విషయం.
పోతే, బెజవాడ వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ ప్రాంతీయ వార్తల ప్రసారం విషయంలో నాకు చక్కని సహకారం అందించేవారు. ఆరోజుల్లో సెల్ ఫోన్లు లేవు. రాత్రి బస్సెక్కి పొద్దున్నే బెజవాడ చేరేవాడిని. రేడియో కేంద్రానికి నేరుగావెళ్ళి ఆరోజు ఉదయం  ప్రాంతీయ వార్తలు నేనే చదివేవాడిని, అది నా డ్యూటీ కాకపోయినా. దానికి ఒక కారణం వుంది. పొద్దున్న వార్తలు హైదరాబాదులో వున్న మా ఆవిడ రేడియోలో  విని, నేను బెజవాడ క్షేమంగా చేరిన సంగతి తెలుసుకునేది. ఇవన్నీ వినడానికి విచిత్రంగా అనిపించినా నిజంగా జరిగిన విషయాలే. రేడియోలో నేను అనుభవించిన స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణలే.


(ప్రయాగ రామకృష్ణ)

వాక్సుద్ధి, విషయ పరిజ్ఞానం, పండితత్వం ఇవన్నీ ప్రయాగకు న్యూస్ రీడర్ గా పనికొచ్చాయి. ఒక్కోసారి బులెటిన్ అంచనా తప్పి కొద్ది నిమిషాలు తక్కువయ్యేది. వాటిని రాసి  స్టూడియోకి తీసుకువెళ్ళి అందించేలోగా రామకృష్ణ ఆశువుగా కొన్ని వార్తలు చదివి సరిపెట్టడం నాకు బాగా గుర్తుంది. శ్రీరామనవమి, శివరాత్రి సందర్భాల్లో రాత ప్రతి అవసరం లేకుండా ఏఏ దేవాలయాల్లో ఏం జరుగుతున్నదో ఆ విశేషాలన్నీ అనర్ఘళంగా చెప్పేవాడు. కొప్పుల సుబ్బారావుది మరో బాణీ. మిన్ను విరిగి మీదపడుతోందన్నా చలించని తత్వం. వార్తల టైం దగ్గరపడుతున్నా, బులెటిన్ పూర్తిగా తయారుకాకపోయినా, వున్నంతవరకు కాగితాలు తీసుకుని వెళ్ళి వార్తలు చదివే వాడు తప్ప, తను కంగారు పడడం కానీ, ఇతరులను కంగారు పెట్టడం కానీ నేను చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగివచ్చి ఉద్యోగ పర్వంలో శిఖరాగ్రం చేరిన కొన్నాళ్ళకే కన్నుమూయడం బాధాకరం.

12, ఆగస్టు 2014, మంగళవారం

మావారి ముచ్చట్లు


"ఇదిగో బాబూ! నీపేరు ఏమన్నావు రమేష్ కదా! అయినా నీ పేరుతొ పని లేదు నీ సెల్ నెంబరు వుంటే చాలు"
అంటున్నారు మావారు పొద్దున్నే.
మళ్ళీ మొదలయిందన్నమాట కారు డ్రైవరు ఇంటర్వ్యూ, మనసులోనే అనుకుంటూ నేనూ అక్కడికే వెళ్ళాను. కారుకొన్న ఈ మూడేళ్లలో పదిమంది మారారు. ఇతను అంటే  రమేష్ అంటే పేరుతొ పనిలేని సెల్ ఫోన్ కుర్రాడు, మా వారికి నచ్చి కుదిరితే పదకొండో డ్రైవర్ అవుతాడు.
"ఈ కారు ఎవరిదీ?' మా వారి ప్రశ్న.
"మీదే కదా!" అనుమానంగా అడుగుతున్నాడు ఆ కుర్రాడు.
"కాదు. ఆ కారు నాది కాదు. ఇక నుంచీ నీది. అంటే  ఏమిటి. నీ సొంత కారులా జాగ్రత్తగా చూసుకోవాలన్న మాట"
"అలానా!" అన్నాడు కుర్రాడు నిరుత్సాహంగా ఏదో పోగొట్టుకున్నట్టు మొహం పెట్టి.
"నీకు డ్రైవింగు లైసెన్స్ వుందా అని నేను అడగను. ఎందుకంటే దాన్ని చూపించమని ఈ హైదరాబాదులో ఏ పోలీసూ కారు ఆపి అడగకూడదు. అంటే ఏవిటన్నమాట. అంత జాగ్రత్తగా ఏ తప్పూ చేయకుండా డ్రైవ్ చేయాలన్నమాట"
రమేష్ అనే సెల్ నెంబరు కుర్రాడు నిలువు  గుడ్లేసుకుని వింటున్నాడు. వినేవాడు దొరికాడు కదా అని మా ఆయన చెలరేగిపోతున్నాడు. మధ్యలో కల్పించుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి వుండదని కాపురానికి వచ్చిన కొత్తల్లోనే అర్ధం అయింది.
" నాకు కారు నడపడం కాదుకదా, ఆగితే దిగి తొయ్యడం కూడా తెలవదు. కానీ కారు ఆక్సిడెంటు కాకుండా యెలా నడపాలో బోలెడు పుస్తకాలు చదివి తెలుసుకున్నాను"  
"కారు నెమ్మదిగా తోలాలి. యెంత నెమ్మదిగా అంటే వెనుకనుంచి ఎవరయినా సైకిల్ మీద వస్తూ మనల్ని దాటి పోయినా పర్వాలేదు. మనకు  అంత అర్జంటు వ్యవహారాలు ఏవీ లేవు.
"రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు విధిగా కారు ఆపాలి. చలాన్ ఇంటికి వచ్చినా, మధ్యలో పోలీసు వసూలు చేసినా అది నీ జీతంలోనుంచి కోత కోస్తాను.
"రిటైర్ అయి ఇంట్లో కూర్చున్నాను. కొంపలు మునిగి పోయే పనులేవీ లేవు. ఏదో పెట్రోలు ఆదా చేయాలని స్పీడుగా నడుపుతానంటే కుదరదు. అయినా పెట్రోలు కొట్టించేది నీవు కాదుకదా!"
"అందరూ ఇచ్చే జీతం నేను ఇవ్వనుగాక ఇవ్వను. ఎందుకంటే దానికి రెట్టింపు ఇస్తాను కాబట్టి"
ఈ చివరి మాటతో కుర్రాడు కొంత తెరిపినపడ్డట్టు మొహం పెట్టాడు. కానీ అది క్షణం నిలవలేదు.
"మాకూ మా ఆవిడకూ వూళ్ళేలే రాచకార్యాలు లేవు. వారానికి ఒకటి రెండు సార్లు వస్తే చాలు. కానీ పిలిచినప్పుడు అర్ధరాత్రీ అపరాత్రీ అని నకరాలు పోతే కుదరదు. అర్ధం అయిందా?"
అర్ధం కాకపోవడానికి ఏముంది. మావారి సంగతి ఆ కుర్రాడికి పూర్తిగా అర్ధం అయివుంటుంది.
'రేపు కలుస్తాను' అంటూ తుర్రుమన్నాడు.
నాకు తెలుసు ఆ రేపు అనేది ఇక రాదనీ. ఎల్లుండో, ఆ మర్నాడో పన్నెండో వాడు ఇంటర్వ్యూ కి వస్తాడని.

Note: Courtesy Image Owner 

11, ఆగస్టు 2014, సోమవారం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య


'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.


(ఒక సభలో ప్రసంగిస్తూ శ్రీ వెంకట్రామయ్య)

వెంకట్రామయ్య గారికి ఇలాటి నమ్మకాలు లేవుకాని, శాపవశాన గంధర్వుడు మానవ జన్మ ఎత్తినట్టు, ఆయన రేడియోలో చేరి ఉద్యోగం చెయ్యడం  ఆకాశవాణికి ఉపయోగం అయ్యింది కానీ,  ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆయన నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకట్రామయ్యగారు అనే సృజనాత్మక వ్యక్తి  రేడియో న్యూస్ రీడర్ గా సుదీర్ఘకాలం పనిచేయడంవల్ల ఆంధ్రదేశం చక్కని రచయితను కోల్పోయింది. ఇది నా నమ్మకం.
ఒక రచన చేసినా, ఒక వార్త  తర్జూమా చేసినా, లేక  రేడియోలో  చదివినా - ఏం చేసినా సరే మనసుపెట్టి చేసేవారు. అందుకే ఆ రచనలో,  ఆ వార్తలో, దానిని చదవడంలో  జీవం తొణికిసలాడేది.
రాయని రచయిత, లేదా రాసి మానేసిన రచయిత అని పేరుపడ్డ  వెంకట్రామయ్య గారిచేత మళ్ళీ రాయించాలన్నది నా చిరకాల వాంఛ.  దాన్ని మన్నించి కొన్ని రాశారు కానీ ఇంకా ఇంకా రాయాలనే కోరిక మాత్రం తీరలేదు. అలాఅని, నా ఆశా చావలేదు. చూద్దాం!  ఆయన రాయకపోతారా! నేను చదవక పోతానా?
కానీ, కార్మికుల కార్యక్రమం 'రాంబాబు'  అంత తేలిగ్గా వినే రకం కాదు. అదేకదా! బాధ.