30, జులై 2014, బుధవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9                   
ఆ తరువాత ముఖ్యమంత్రులయిన శ్రీయుతులు అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు - తమ పేషీల్లో వ్యక్తిగత సిబ్బందిని తమకు ఇష్టం వున్నవారితో మార్పులు చేసుకున్నప్పటికీ పీ ఆర్ వొ గా మాత్రం, చెన్నా(రెడ్డి) నుంచి అన్నా(ఎన్టీయార్) వరకు మా అన్నయ్య పర్వతాలరావుగారే కొనసాగారు. ముఖ్యమంత్రులు, ఆఖరికి పాలించే పార్టీలు మారినా పీ ఆర్ వొ గా ఆయన కొనసాగడం అనేది ఇప్పటికీ ఒక రికార్డు.


తన అనుభవాలను ఏర్చి కూర్చి 'చెన్నా టు అన్నా' అనే గ్రంధాన్ని రాయాలనే తలంపు వున్నట్టు ఆయన అనేకసార్లు అనుకున్నారు. మా అన్నయ్య అని చెప్పడం కాదు కాని, పర్వతాలరావు గారు మంచి ధారణ కలిగిన వ్యక్తి. ఆంధ్ర ఆంగ్ల భాషల్లో మంచి ప్రవీణుడు. చక్కని రాయసకాడు. గేయం రాసినా, వ్యాసం రాసినా సుబోధకంగా వుండేది. ప్రసంగ వ్యాసాలు  రాయడంలో దిట్ట. 'ఈ చీకటి గొందులలో, లేఖినీలాస్యం,చెప్పు తెగింది' అనే గేయ సంపుటాలు, ప్రకాశం గాధాశతి, జై భీమ్ కధలు, పరమాచార్య పావన గాధలు, Charaka - Redactor, par excellence, Veena, Mrudangam, Leather Puppets, Dwakra Crafts అనే రచనలు చేశారు.
పర్వతాలరావు గారు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర  అయిదేళ్లపాటు పనిచేసి, సమాచారశాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి,  పదవీ విరమణ చేశారు. మొదటి ఉద్యోగం నుంచి చివరి ఉద్యోగం వరకు ప్రభుత్వ వాహనం, డ్రైవర్ సదుపాయాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అనుభవించి  రిటైర్ అయిన తరువాత హాయిగా సిటీ బస్సులు, ఆటోల్లో తిరగడం చూసి మాకే చిత్రమనిపించేది. రిటైర్ అయిన కొద్ది మాసాలకే నారసింహతత్వం అధ్యయనం నిమిత్తం దక్షిణ, ఉత్తర భారతంలోని అనేక నరసింహ దేవాలయాలను దర్శించి పరిశోధన చేసి 'నమో! నారసింహాయ!' అనే పేరుతొ ఆరు సంపుటాలను వెలువరించారు. చాప మీద కూర్చుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని వేల పేజీలు వెనక్కి తిరిగి చూసుకోకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఆయన రాసిన తీరు అమోఘం. అలా ఆధ్యాత్మిక రచనా వ్యాసంగంలో తుచ్చ రాజకీయ రచనల వాసన ఆయనకు రుచించినట్టు లేదు. అందుకే కాబోలు 'చెన్నా టు అన్నా' వెలుగు చూడలేదు.

జీవిత చరమాంకంలో పుట్టపర్తిలో మా వొదినె సరోజినీదేవి  గారితో కలిసి ఓ చిన్నగదిలో వుంటూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, 2006 ఆగస్టు 21 వ తేదీన, తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా  ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.  మనిషి అనేవాడు మనీషిగా యెలా జీవించవచ్చో నిజం చేసి చూపాడు కాబట్టే ఆ సర్వేశ్వరుడు ఆయనకు అలాటి ఆనాయాస మరణం అనే వరాన్ని అనుగ్రహించాడు.         

దేశానికి పనికొచ్చిన సలహా

ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటి మాటో.
పారిశ్రామికవేత్త జె.ఎన్.టాటా ఓసారి జర్మనీ ప్రయాణం పెట్టుకున్నారు. ఓడలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఆయనతో పాటు అనేక గోనె  సంచులు. వాటిల్లో దేశంలో వివిధ ప్రాంతాలనుంచి సేకరించి తెచ్చిన మట్టి నమూనాలు.  వాటిని జర్మనీలో శాస్త్రవేత్తలకు చూపించి వాటిల్లో  ఇనుము లేదా ఇతర లోహాలు వుంటే  కనుగొని ఆయా ఖనిజాల తవ్వకం చేపట్టాలన్నది టాటా మహాశయుల ప్రయత్నం.


అదే ఓడలో కింద భాగంలో స్వామీ వివేకానంద   ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ని గురించి అప్పటికే కర్ణాకర్ణిగా విన్న టాటా, తనకు తానుగా కిందికి దిగి వెళ్ళి స్వామిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. మాటల్లో తన ప్రయాణం లక్ష్యాన్ని కూడా స్వామికి వివరించారు.
స్వామి వెలిబుచ్చిన ఓ అనుమానం టాటాని ఆలోచనలో పడవేసింది. దేశం నుంచి తీసుకు వెళ్ళిన మట్టి నమూనాల్లో నిజంగా ఖనిజాలు వున్నట్టు కనుగొన్నా, విదేశీ శాస్త్రవేత్తలు నిజాయితీగా ఆ విషయం తెలియచెప్పకపోవచ్చన్నది స్వామికి కలిగిన సందేహం.
"ఒక పని చేయండి. భారత దేశంలో మేధావులయిన యువకులకు కొదవ లేదు. దురదృష్టం ఏమిటంటే వారికి సరయిన అవకాశాలు లేక వారి ప్రజ్ఞాపాటవాలన్నీ నివురుగప్పిన నిప్పులా వుండిపోతున్నాయి. మీరు దేశానికి తిరిగివచ్చిన తరువాత మైసూరు మహారాజు చామరాజ వడయారును కలవండి. ఆయన బ్రిటిష్ పాలకులకి విధేయుడే. కానీ దేశం అంటే ప్రేమ కలిగినవాడు. చక్కటి పరిశోధనాసంస్థను ఏర్పాటు చేయడంలో మీకు తోడ్పడుతాడు' అని సలహా ఇచ్చారు.
టాటా జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామి వివేకానంద సలహా ప్రకారం వెళ్ళి మైసూరు మహారాజును కలుసుకున్నారు. పరిశోధనాసంస్థ ఏర్పాటు గురించిన తన ప్రతిపాదన గురించి చెప్పారు. చామరాజ వడయార్ ఎలాటి సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే 370 ఎకరాల భూమిని సంస్థ ఏర్పాటుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఆవిధంగా ఏర్పాటయిందే దేశంలో తొలి పరిశోధనాసంస్థ - "The Indian Institute Of Science".
మహానీయుల సంకల్పబలం ఆవిధంగా వుంటుంది.

(మిత్రులు దేవినేని మధుసూదన రావు గారు అమెరికా నుంచి పంపిన మెయిల్ సమాచారం ఆధారంగా)

29, జులై 2014, మంగళవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 9



మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు  తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో,  కారణం ఏదయినా, 1980  అక్టోబర్ 10 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జీ.వెంకటరామారావు ఆ వుదంతం గురించి  చేసిన వ్యాఖ్యానం ఇక్కడ పేర్కొనడం సముచితంగా వుంటుంది.  

    
"పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో, పదవీ విరమణ చేసే అవకాశం కాంగ్రెస్(ఐ) అధిస్థానం ముఖ్యమంత్రులకు ఏనాడు ఇవ్వలేదు. మర్రి చెన్నారెడ్డిని మూడు  నెలలు ముప్పుతిప్పలు పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదులను ప్రోత్సహించారు. గవర్నరుకు రాజీనామా లేఖ పంపమన్నారు. అంతలోనే ఇప్పుడు వద్దు అన్నారు"            
చెన్నారెడ్డి 1989 లో రెండోమారు ముఖ్యమంత్రి అయ్యారు కాని, నేను అప్పుడు మాస్కోలో వున్నాను. అప్పుడు కూడా ఇదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీయార్ నాయకత్వంలోని  అధికార తెలుగుదేశం పార్టీని వోడించి కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలో చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గురించిన అధ్యాయం ముగించేముందు ఆయనతో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.

ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే అనిపించి,  సీ.ఎం. చెన్నారెడ్డి గారి  దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫేసు చిరునామాతో నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి,  ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి.  ఆ జీవోలో  నా పేరు కూడా వుంది. 'పలానా శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తు పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది.       (ఇంకా వుంది)                    

శనగల మంగళవారం


'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం - వేయించిన  శనగలతో తప్పనిసరి పలహారం.'


వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 8



ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. చెన్నారెడ్డి వ్యతిరేకులు  ఆరోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగెట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే  చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ   విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది.


(సంజయ్ గాంధీ నడిపిన విమానం ఢిల్లీలో  కూలిన దృశ్యం)

సంజయ్  అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన  అస్థికల పాత్రను ప్రత్యేక బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి  రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి ' సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. ఆశ్చర్యపోతూనే కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా....)

ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.

28, జులై 2014, సోమవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 7


చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్ను కర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.


పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి  పని పూర్తి  చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖ పట్నమో వెళ్ళాల్సి వస్తే,  ఫైళ్ళు వెంటబెట్టుకుని రైల్లో  ప్రయాణం చేసే వారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి  అక్కడ స్టేషన్లో  సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం,  విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని  సచివాలయానికి చేరేవి.

చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే చెన్నారెడ్డి  మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు కానివాళ్ళు ఇంకా మనవెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు"

అదే కాకి, అదే పిచ్చుక, కాకపొతే కధే కొత్తది


(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం- భండారు శ్రీనివాసరావు)
అనగనగా ఒక కాకి ఒక పిచ్చుక.


వచ్చేది వర్షాకాలం కాబట్టి పిచ్చుక ముందు జాగ్రత్తగా  అక్కడి నుంచీ ఇక్కడి నుంచీ ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు వెతుక్కొచ్చి ఎత్తుకొచ్చి వెచ్చగా వుండే  ఓ గూడు కట్టుకుంది. కాకి బద్ధకస్తురాలు. 'వర్షాలు పడ్డప్పుడు చూసుకుందాములే' అనే దిలాసాతో వుండిపోయింది.  చూస్తుండగానే వర్షాలు మొదలయ్యాయి.  కష్టపడి ముందు చూపుతో కట్టుకున్న కొత్త గూడులో పిచ్చుక వెచ్చగా పడుకుంది.  తలదాచుకునే  గూడు లేక కాకి 'కావ్వో కావ్వో' అంటూ అరచుకుంటూ  పోయి, అర్జంటుగా మీడియా  సమావేశం పెట్టి తన కష్టాలు ఏకరవు పెట్టుకుంది.
'నేనూ పిచ్చుకా ఇద్దరం పక్షులమే. పిచ్చుకేమో హాయిగా వెచ్చగా గూట్లో పడుకుంటే నేనేమో ఇల్లా ఇల్లూ వాకిలీ లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అఘోరిస్తున్నాను. ఇంత అన్యాయం ఎక్కడయినా వుందా అవ్వా' అంటూ దవడలు నొక్కుకుంది. కాకి పిచ్చుకల వ్యవహారం మీడియాకు విందు భోజనంగా మారింది. పిచ్చుక గూట్లో అనుభవిస్తున్న వైభోగాలు, బయట కాకి పడుతున్న కష్టాలు,  అన్నింటినీ  గ్రాఫిక్కులు జోడించి  రంగు రంగుల విజువల్స్ తో కధనాలు వండి వార్చాయి.
'ఈ అన్యాయాన్ని సహించేది లేదు. కాకికి న్యాయం చేయాలి' అంటూ కాకిహక్కుల సంఘాలు పిచ్చుక గూడు ఎదుట ధర్నా చేశాయి.  'కాకులకూ  పిచ్చుక కట్టుకున్నలాంటి గూళ్ళు కావాలంటూ నిరసన దీక్షలు నిర్వహించాయి. గూడుకు కూడా నోచుకోని కాకులకు న్యాయం జరిగేదాకా విశ్రమించేది లేదం'టూ హెచ్చరించాయి.
ఈ కాకిగోల ప్రాంతీయ చానళ్ళ నుండి జాతీయ ఛానల్లకూ అక్కడినుండి అంతర్జాతీయ ఛానల్లకూ విస్తరించింది. దాంతో,  ఆ పల్లవి అందుకున్న అంతర్జాతీయ  వాయసహక్కుల సంఘం - ఈ విషయంలో భారత ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ఆరోపించింది.
ఇక ఇంటర్ నెట్ లో సరేసరి. కాకికి మద్దతుగా అభిప్రాయ సేకరణ ఉవ్వెత్తున ఒక ఉద్యమం మాదిరిగా మొదలయింది.
పార్ల మెంటులో ప్రతిపక్షాలు కాకులకు మద్దతుగా  వాకవుట్ చేసాయి. ప్రతిపక్షాలు బలంగా వున్నరాష్ట్రాల్లో బందులు జరిగాయి.
విషయం ఇంతగా ముదిరిపోయిన తర్వాత  ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాకులకు న్యాయం చేసేందుకు ఒక అత్యున్నతే స్తాయి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఈ కమీషన్ కాలయాపన చేయకుండా నివేదిక ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 'పోటా' తరహాలో 'కాకులపై ఉగ్రచర్యల నిరోధక చట్టం - 'కాటా' తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కాకితో అప్పటిదాకా చెట్టాపట్టాలేసుకు తిరిగి,  కాకితో మాట మాత్రం  చెప్పాపెట్టకుండా గూడు కట్టుకున్న పిచ్చుకకు మూడేళ్ళు జైలు శిక్ష విధించి అది కట్టుకున్న గూడును కాకికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆ సిఫారసులను 'ఇన్ టోటో'  అమలు చేసింది. జాతీయ ఛానల్లతో సహా దేశ వ్యాప్తంగా అన్ని టెలివిజన్ చానళ్ళు  ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి.
ఏతావాతా జరిగింది ఏమిటంటే-  
కష్టపడి గూడు కట్టుకున్న పిచ్చుకకు గూడంటూ లేకుండా పోయింది. గూడు కట్టుకోవడానికి బద్ధకించిన కాకి మాత్రం గూడు సంపాదించుకుంది.

(ఇంటర్నెట్ లో పచార్లు చేసున్న ఒక ఇంగ్లీష్ కధనానికి కొన్ని మార్పులతో చేసిన సంక్షిప్త అనువాదం)    
NOTE : Courtesy Image Owner