25, జులై 2014, శుక్రవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 3



ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారికి సమర్దుడయిన పాలకుడిగా పేరొచ్చింది.  ఎమర్జెన్సీ కాలం  ఆయనకు కొంత  కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు అందివచ్చిన  అంశాలు.


(జలగం వెంగళరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వున్నప్పుడు పాల్గొన్న అధికారిక సమావేశం. మాట్లాడుతున్నది అప్పట్లో డీపీఆర్ఓ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు)   


వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. (ఇంకావుంది)

24, జులై 2014, గురువారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 2


నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..



రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి.
సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో, అప్పటివరకు బెజవాడ ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న  నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు

వ్యాపకాల జ్ఞాపకాలు - 1   
1975 లో నేను ఆకాశవాణి విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని  కూడా  వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు  ఒక్కరే ఆయన పేషీలో  ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఒ మోస్తరు  ఉద్యోగులే.  ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి.  మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ  స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు  సీఎం ప్రధాన  భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు.


నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక  వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే!  సీ ఎం కాన్వాయ్. సచివాలయంలో ఆయన   కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది.  ఓ గదిలో ముఖ్యమంత్రి. పక్క గదిలో ఆయన సిబ్బంది. ముఖ్యమంత్రితో సహా ఓ పది పేము కుర్చీలు వుండేవి. తనను కలుసుకోవడానికి వచ్చేవారితోనే కాదు,  చివరకు విలేకరులతో  కూడా ఫైళ్ళు చూస్తూనే మాట్లాడుతుండేవారు. సమయపాలనకు బాగా విలువ ఇచ్చేవారు. చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి, 'మంచిది వెళ్ళి రండి'  అనేవారు.




ఇప్పుడు శిధిలావస్థలో వున్న (కూలగొట్టారేమో తెలియదు, సచివాలయానికి పోక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి) పాత భవనం మొదటి అంతస్తులో సీఎం  పేషీ వుండేది.  ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న మెట్ల వరుస కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.        

23, జులై 2014, బుధవారం

పాత డైరీలో పాత పేజీ

కొత్త పనిమనిషి వెంకటేశ్వరమ్మ 1972 సెప్టెంబర్ మొదటి తేదీన పనిలోకి వచ్చింది. జీతం నెలకు పది రూపాయలు. పాలు తెచ్చినందుకు ఇంకో రెండు రూపాయలు


22, జులై 2014, మంగళవారం

నువ్వాదరినీ నేనీదరినీ ........


కొందరికి కొన్ని అలా కలిసి వస్తుంటాయి. నేను వుండేది ఒకచోట. మా కేబుల్ వాడి వ్యాపారం మరోచోట. మా ఇంట్లో కరెంటు కట్ వేళల్లో అక్కడ వుంటుంది. మాకు వుంటే అతగాడిదగ్గర వుండదు. మొత్తం మీద ఏమైతేనేం రోజుకు పది పన్నెండు గంటలు టీవీ మూగనోము పడుతుంది. అందుకే ఇలాటి అదృష్టాలకు పెట్టిపుట్టాలి అంటాను.


NOTE: Courtesy image owner 

బాబుగారూ వింటున్నారా!

కొద్దిగా గతం
1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. అవి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. అప్పటి నిజాం నవాబు హైదరాబాదును ఇలా వొదిలేస్తే ప్రమాదం అని భావించి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. మైసూరు నుంచి ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రభుత్వం తరపున ఆహ్వానించి వరదలు రాకుండా అరికట్టడానికి, నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేయడానికి తన సలహాదారుగా నియమించుకున్నారు. విశ్వేశ్వరయ్యగారి దూరదృష్టి పుణ్యమా అని నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు మంచి నీటి జలాశయాలు ఏర్పడ్డాయి. మూసీ వరదలకు కూడా ముకుతాడు వేసినట్టూ అయింది. అలాగే  1912 లోనే నిజాం నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసారు. ఈ మండలి ముందు చూపు ఫలితంగా హైదరాబాదు నగరానికి అప్పట్లోనే చక్కని రహదారులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు ఏర్పాటయ్యాయి.
కొద్దిగా ప్రస్తుతం

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం శివరామ కృష్ణన్ కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక ఇవ్వబోతోంది. ఈ లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరో కమిటీ వేసారు. రాజకీయ నాయకులతో పాటు నిర్మాణ రంగ ప్రతినిధులకు కూడా ఇందులో చోటు కల్పించారు. అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు. కానీ నిజాం నవాబు మాదిరిగా కొత్త రాజధాని నిర్మాణం విషయంలో చక్కని సూచనలు చేసేందుకు  ప్రముఖ ఇంజినీర్లు కొందరికి  ఈ కమిటీలో స్థానం కల్పించి వుంటే బాగుండేది. ఇంతవరకు రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ లభించని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడికి రాజధాని నగర నిర్మాణ రూపంలో లభించింది. నిజాం నవాబును విమర్శించేందుకు ఎన్నో కారణాలు వున్నాయి కాదనలేము. కానీ, హైదరాబాదు నగర పునర్నిర్మాణంలో ఆయన పాత్రను కూడా కాదనలేము.
కొత్త ముఖ్యమంత్రికి ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు.

గళ్ళు - ముళ్లు




ఎక్కడో దూరాన వున్న చంద్రుడిమీద కాలు మోపడం తెలిసిన మనిషికి పక్కింటివాడు మాత్రం పరాయి మనిషే!
ఓపక్క ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రపంచం కుంచించుకు పోయి గుప్పెట్లోకి వచ్చి దూరాభారాలు తగ్గిపోతున్నా, మనుషుల నడుమ దూరాలు, భారాలు పెరిగిపోతూనే వున్నాయి.


బాపూరమణల సినిమాలో చెప్పినట్టు 'పులిని చూసి పులి ఎన్నడు బెదరదు, పాపఖర్మమదేమొ కాని మనిషి మనిషికి కుదరదు' ఇదో విషాదం.

Note: Courtesy image owner