25, జులై 2014, శుక్రవారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 4


వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.


(జలగం వెంగళరావు, రోశయ్య, మదన్ మోహన్ పాల్గొన్న సమావేశంలో ప్రసంగిస్తున్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి)

రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.

నేతల హామీలు పునరావృతం కారాదు


(27-07-2014 -   ఆదివారం సూర్య పత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
మెదక్ జిల్లాలో  గురువారం ఉదయం  జరగరాని ఘోరం జరిగిపోయింది. మూసాయిపేట రైల్వే క్రాసింగు వద్ద పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును వేగంగా దూసుకొచ్చిన నాందేడ్ పాసింజరు రైలు డీకొట్టింది. నాలుగు వూళ్ళు తిరిగి తమని రోజూ బడికి చేర్చే స్కూలు బస్సు ఆరోజు తమ పాలిట మృత్యు శకటంగా మారుతుందని తెలియని అందులోని చిన్నారులకు అసలు ఏమి జరుగుతున్నదో అర్ధం అయ్యేలోగా బస్సును వున్నపలాన రైలు  ముందుకు లాక్కుపోయింది. ఈ క్రమంలో బస్సు నుజ్జునుజ్జయింది. డ్రైవరు, పన్నెండు మంది పిల్లలు అక్కడికక్కడే కన్నుమూశారు.  మరో ఇద్దరు  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే  మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇరవై ఒక్కమందిని హైదరాబాదు  యశోదా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో పదకొండుమంది పరిస్తితి విషమంగా వుందని కడపటి వార్తలు తెలుపుతున్నాయి.


సమాచారం తెలియగానే తెలంగాణా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అయిదు లక్షల చొప్పున ఆర్ధిక సాయం  ప్రకటించారు. యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను, వారి తలితండ్రులను  పరామర్శించారు. ఖర్చుకు వెనకాడకుండా వారికి అవసరమైన వైద్య సాయం అందించాల్సిందని అక్కడి వైద్యులను కోరారు. మంత్రి హరీష్ రావు హుటా హుటిన బయలుదేరి దుర్ఘటన ప్రదేశానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇరవై అంబులెన్సులను రప్పించారు. గాయపడిన వారిని హైదరాబాదు తరలించారు. కాగా, ప్రమాదం గురించిన సమాచారం తెలియగానే రైల్వే మంత్రి సదానంద్ గౌడ్ లోకసభలో ప్రకటన చేశారు. తక్షణ సాయంగా రైల్వే తరపున మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, గాయపడినవారికి ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోందని అన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని కూడా దుర్ఘటనపై సంతాప ప్రకటనలు చేశారు. ఆయా పార్టీలకు చెందిన  రాష్ట్ర స్థాయి నాయకులు సరే. అంతా యశోదా  ఆసుపత్రికి క్యూ కట్టారు. బాధితులను పరామర్శించి వారికి తక్షణ సాయం అందేలా తాము శక్తివంచన లేకుండా పాటుపడతామని పాత పల్లవినే అందుకున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు. సరే. ఇవన్నీ కూడా ఒక  పద్దతి ప్రకారం జరిగిపోతుంటాయి. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా పాలక పక్షం వారు షరా మామూలు ప్రకటనలు చేస్తుంటారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మొక్కుబడి హామీలు ఇస్తుంటారు. ప్రతిపక్షాల సంగతి  చెప్పేదేముంది. ప్రభుత్వ అసమర్ధత వల్లనే ఇలాటివి జరుగుతున్నాయని ఆరోపిస్తుంటారు.        
కానీ ఈ ప్రకటనలతో పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఈ హామీలతో మళ్ళీ ఇటువంటి దుర్ఘటనలు జరగవన్న  పూచీ కూడా  లేదు.
అసలు చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి?
చక్కగా చదువుకుని జీవితంలో ఎదిగివద్దామనుకున్న చిన్నారుల బతుకు దీపాలు ఈ దుర్ఘటనలో అర్ధాంతరంగా కొండెక్కాయి. ఎవరో చేసిన పొరబాటుకు అన్నం పున్నెం ఎరుగని పసివారు  దారుణంగా మూల్యం చెల్లించారు. బస్సు పట్టాలు దాటే సమయంలో డ్రైవరు సెల్ ఫోనులో మాట్లాడుతున్నాడని కొన్ని వార్తలు తెలుపుతున్నాయి. ఇదే నిజమయితే ఇంతకంటే నిర్లక్ష్యం మరోటి వుండదు.  పొద్దున్నే తయారై , బడికి పోయొద్దామని బయలుదేరిన వాళ్ళలో చాలామంది, తమ కన్నవారికి కడుపుకోతను మిగిల్చి కానరాని  లోకాలకు తరలిపోయారు. పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయించి, ప్రేమగా  గోరుముద్దలు తినిపించి, పుస్తకాల సంచీ, టిఫిన్ బాక్సులూ చేతికందించి దగ్గరుండి బస్సెక్కించిన తలితండ్రులకు ఈ ప్రమాద వార్త ఆశనిపాతంగా మారింది. వారి ఘోష వర్ణనాతీతం.
కాపలా లేని రైలు క్రాసింగు వద్ద జరిగిన దుర్ఘటన మెదక్ జిల్లా లోని నాలుగు గ్రామాల్లో అనేక కుటుంబాల ఇళ్లలో ఆరని శోకం రగిల్చింది. వీళ్ళందరూ కలిగినవాళ్ళు కాదు. పూట కూలీలు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలతో కాపురాలు నెట్టుకొస్తూ, ఆటోలతో   బతుకు బండి లాగిస్తూ, వున్నంతలో తమ  పిల్లల్ని   మంచి చదువులు చదివించి,  వారికయినా తమకు దక్కని మంచి జీవితం లభించేలా చూడాలని  చిరు ఆశలు పెంచుకున్న బడుగు జీవులు వాళ్లు. చక్కగా తలదువ్వుకుని, యూనిఫారాలు వేసుకుని, భుజాలపై పుస్తకాల సంచీలు వేలాడేసుకుని 'అమ్మా టాటా! నాన్న టాటా! 'అంటూ స్కూలు  బస్సెక్కి పోతున్న పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోయే వాళ్లు వారు. చక్కగా మంచి స్కూళ్ళల్లో చదువుకుంటే,  వారి భవిష్యత్తు బంగారం అవుతుందనీ కమ్మని కలలు కనే వాళ్లు వారు. అలాటి వాళ్ల కన్నుల్లో ఇవాళ కనబడుతోంది కన్నీళ్ళే. ఇవి తుడిచినా ఆరేవి కావు. కానీ తుడిచేవాళ్ళే లేరు. అందరూ హామీలు ఇచ్చేవాళ్ళే. ఇదొక విషాదం.
ఈ సందర్భంలో మరో కోణం గురించి కూడా విశ్లేషించుకోవడం సముచితంగా వుంటుంది. ఏ దేశంలో అయినా డ్రైవరు పని అంటే మామూలు కాదు. డ్రైవింగు లైసెన్సు సంపాదించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ మనదగ్గర మాత్రం  పైసా వున్నా,  పలుకుబడి వున్నా  లైసెన్సు ఎగురుకుంటూ వచ్చి వల్లో పడుతుంది. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. చదువుకున్నా లేకపోయినా డ్రైవింగ్ తెలిస్తే పొట్టపోసుకోవచ్చు అనే అభిప్రాయం పల్లె పట్టుల్లో పెరిగిపోతోంది. లక్షలు పోసి బస్సులు కొనే స్కూలు యాజమాన్యాలు కూడా నైపుణ్యం  కలిగిన డ్రైవర్లకు మంచి జీతాలు ఇవ్వడానికి వెనుకాడతాయి. గీసి గీసి బేరమాడుతాయి. ఫలితం. అనుభవం లేని డ్రైవర్లు. డబ్బులు అదనంగా వస్తాయనుకుంటే నిద్రమానుకుని అదనపు పని గంటలు పనిచేసే డ్రైవర్లు స్కూలు బస్సులు నడుపుతుంటారు.  యజమానులకి కావాల్సింది అదే. ఏదో విధంగా పని నడిచిపోతే చాలు. మరి ప్రమాదాలు జరుగుతున్నాయంటే జరగవా. జరక్కపోతేనే ఆశ్చర్యపడాలి.
విలువలకు ప్రాణం ఇచ్చే ఈ పుణ్య భూమిలో ప్రాణాలకు విలువలేకుండా పోవడం మరో విషాదం.
పోతే, ప్రస్తుతానికి వస్తే,  కాపలాలేని రైలు క్రాసింగులు దేశంలో వేలకొద్దీ, రాష్ట్రంలో వందలకొద్దీ వున్నాయి. గేట్లు పెట్టి కాపలా సిబ్బందిని నియమించాలంటే ఒక్కొక్కదానికీ ఏటా ముప్పయి, నలభయ్ లక్షల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, లక్షల్లో  జీతాలు తీసుకుంటూ  అప్పనంగా లెక్కలు చెప్పే అధికారులు వందల సంఖ్యలో ఎప్పుడూ  సిద్దంగానే వుంటారు. వారి దృష్టిలో ఇది  అనవసరపు వ్యయం. మరోపక్క, పర్తి రైల్వే మంత్రీ   ఇన్నేళ్ళ వ్యవధిలో కాపలా లేని రైల్వే క్రాసింగులు అసలు వూసులోకి లేకుండా చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీలు ఇస్తూనే వుంటారు. అవన్నీ రికార్డుల్లో భద్రంగా వుండిపోతాయి.
అనకూడదు కానీ, ఈ లోగా ఇంకో సంఘటన చోటుచేసుకుంటుంది. మరికొందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మళ్ళీ యధావిదిగా ఎక్స్ గ్రేషియా ప్రకటనలు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కానిచ్చేది లేదని  షరామామూలు హామీలు. ఇదో విష చక్ర భ్రమణం.
పునరావృతం కానివ్వమనే ప్రకటనలు,  పునరావృతం కాని మంచి రోజులకోసం వేచి వుండడమే సాధారణ  ప్రజలకు మిగిలింది.   (25-07-2014)

సానియా విషయంలో కేసేయార్ చేసిన తప్పేమిటి?


మన దేశానికి స్వాతంత్రం ఇవ్వాళా వద్దా అని బ్రిటిష్ పాలకులు మల్లగుల్లాలు పడిన సందర్భంలో వాళ్లకు వచ్చిన అనుమానాల్లో ఒకటి - ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వున్న భారత దేశానికి స్వతంత్రం ఇవ్వడం అంత మంచిది కాదేమో అని.
అదే ఇప్పుడు స్వతంత్రం ఇవ్వాల్సి వస్తే వారికి పూర్తిగా విభిన్నమైన సందేహం కలిగేదేది, ఇంతమంది చదువుకున్నవాళ్ళు వున్న దేశంలో ఎక్కువ స్వతంత్రం అనేది కూడా అంత  మంచి చేయదేమో అని.
సానియా మీర్జా వ్యవహారంపై సాగుతున్న చర్చ, జరుగుతున్న రచ్చ చూసిన తరువాత ఇది నిజమేమో అని అనిపిస్తోంది.


ఎవరు అవునన్నా కాదన్నా సానియా మీర్జా అంతర్జాతీయంగా పేరున్న టెన్నిస్ స్టార్. ఏ ప్రభుత్వం అయినా 'బ్రాండ్ అంబాసిడర్' ని నియమించుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాటి పేరు ప్రఖ్యాతులు వున్నవాళ్లనే ఎంపిక చేసుకుంటుంది. అలాటి  వాళ్లు తమ రాష్ట్రానికే చెందినవారై వుండాలన్న నిబంధన ఏమీ వుండదు. అంచేతనే కేసీయార్ ఆమెను ఎంపిక చేసి వుంటారు.
ఇక ఆమె జాతీయత గురించి. టెన్నిస్ తార అయిన తరువాతనే ఆమె పెళ్లి జరిగింది. అంతర్జాతీయ క్రీడారంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఆ స్థాయి కలిగిన క్రీడాకారులని పెళ్లి చేసుకోవడం చాలా సహజమైన విషయం. పెళ్ళాడినంత మాత్రాన జాతీయత మార్చుకున్నట్టు కాదు. ఆ మాటకు వస్తే, రాజీవ్ గాంధీని పెళ్ళాడిన చాలా ఏళ్ళ వరకు సోనియా తన ఇటలీ పౌరసత్వం మార్చుకోలేదని చెబుతారు. ఈ ఉదాహరణలు కోకొల్లలు.
ఇక కోటి  రూపాయల సంగతా! సాధారణంగా ఈ పారితోషికాలు అనండి, గౌరవ పురస్కారాలు అనండి, ఇవన్నీ ఆయా వ్యక్తుల స్థాయికి తగ్గట్టుగా వుంటాయి. సచిన్ టెండూల్కర్ వంటి మేటి క్రీడాకారుడికి భారతరత్న ఇచ్చారు. అంతే కాని,  చిన్నవాటితో సరిపుచ్చరు కదా!
అయితే ఒక విషయం. సానియా మీర్జా గతంలో యేమో కాని ఇప్పుడు సంపన్నురాలు. ప్రభుత్వం గౌరవంగా ఇచ్చిన మొత్తాన్ని మళ్ళీ సర్కారుకే ఇచ్చి క్రీడల్లో చురుకుదనం కలిగిన బడుగు బలహీన వర్గాల పిల్లలకోసం ఖర్చుపెట్టమని కోరివుంటే ఆమెకూ గౌరవంగా వుండేది.
అనవసర విషయాలపట్ల రాద్ధాంతం చేయడం అంటే, అత్యవసర  విషయాల నుంచి దృష్టి మళ్ళించడం అనే అపోహ ఇప్పటికే జనంలో వుంది. దాన్ని నిజం చేయడం మంచిది కాదేమో! కాస్త ఆలోచించుకోవాలి.

పునరుద్ఘాటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి

పునరుద్ఘాటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి
'ఇలాటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం' అనే నాయకుల షరా మామూలు ప్రకటనలు 'పునరావృతం' కాకుండా వుంటే బాగుండు. లేదా (పాపము శమించుగాక) మళ్ళీ మరో సందర్భంలో వాళ్ళే  ఈ ప్రకటన చేస్తే పాత క్లిప్పింగును  కూడా జత చేసి  టీవీల్లో చూపిస్తే మరీ బాగుంటుంది.


వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 3



ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారికి సమర్దుడయిన పాలకుడిగా పేరొచ్చింది.  ఎమర్జెన్సీ కాలం  ఆయనకు కొంత  కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు అందివచ్చిన  అంశాలు.


(జలగం వెంగళరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వున్నప్పుడు పాల్గొన్న అధికారిక సమావేశం. మాట్లాడుతున్నది అప్పట్లో డీపీఆర్ఓ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు)   


వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. (ఇంకావుంది)

24, జులై 2014, గురువారం

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు - 2


నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..



రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి.
సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో, అప్పటివరకు బెజవాడ ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న  నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.

వెంగళరావు నుంచి చంద్రబాబు వరకు

వ్యాపకాల జ్ఞాపకాలు - 1   
1975 లో నేను ఆకాశవాణి విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని  కూడా  వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు  ఒక్కరే ఆయన పేషీలో  ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఒ మోస్తరు  ఉద్యోగులే.  ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి.  మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ  స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు  సీఎం ప్రధాన  భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు.


నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక  వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే!  సీ ఎం కాన్వాయ్. సచివాలయంలో ఆయన   కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది.  ఓ గదిలో ముఖ్యమంత్రి. పక్క గదిలో ఆయన సిబ్బంది. ముఖ్యమంత్రితో సహా ఓ పది పేము కుర్చీలు వుండేవి. తనను కలుసుకోవడానికి వచ్చేవారితోనే కాదు,  చివరకు విలేకరులతో  కూడా ఫైళ్ళు చూస్తూనే మాట్లాడుతుండేవారు. సమయపాలనకు బాగా విలువ ఇచ్చేవారు. చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి, 'మంచిది వెళ్ళి రండి'  అనేవారు.




ఇప్పుడు శిధిలావస్థలో వున్న (కూలగొట్టారేమో తెలియదు, సచివాలయానికి పోక ఏండ్లూ పూండ్లు గడిచిపోయాయి) పాత భవనం మొదటి అంతస్తులో సీఎం  పేషీ వుండేది.  ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న మెట్ల వరుస కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.