16, జులై 2014, బుధవారం

భార్యతో మాట్లాడ్డం యెలా?


(నిఝంగా వొట్టు నాకూ తెలవదు. కానీ రాయడానికి తెలవక్కరలేదు అని మాత్రం తెలుసు)

ఓప్పుడు అంటే చాలా చాలా కాలం  కిందట - ఓ సినిమాలో చెప్పినట్టు 'లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో' అన్నమాట. అంతకాలం క్రితం నేను మా ఆవిడతో బోలెడు బోలెడు మాట్లాడేవాడిని. పెళ్ళికి ముందు మాట్లాడడానికి వీలుండేది కాదు కాబట్టి ఎక్సర్ సైజ్ పుస్తకాల్లో  ఉత్తరాలు రాసేవాడిని. అవన్నీ మా ఆవిడ పుట్టింటి అరణంగా ఇప్పటికీ అపురూపంగా దాచి పెట్టుకుంది. అలాటివాడిని ఏమైందో ఏమిటో అసలు మాట్లాడడమే మానేసాను. ప్రపంచం పెరిగిపోయి పెళ్ళాంతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోవడం పెద్ద అబ్బురమేం కాదు. కానీ బొత్తిగా మాటలు లేకపోతే ఎల్లా. అల్లా ఆలోచించి ఆలోచించి ఎల్లాగైనా సరే మళ్ళీ పాతకాలం మాటా ముచ్చట్ల కాలంలోకి వెళ్లాలని టైం మిషన్ ఎక్కాను. దిగి చూసేసరికి మొత్తం సీనే మారిపోయింది. అరవ తెలుగు సీరియల్ చూస్తూ మా ఆవిడా సమస్త ప్రపంచాన్ని మరచిపోయి అందులో లీనమై వుంది. కల్పించుకుని మాట్లాడబోతే, 'వుండండి అత్త కోడలికి విషం కలిపిన కాఫీ ఇచ్చి ఇప్పటికి మూడు వారాలయింది ఇంతవరకు తాగి చావలేదు. మీ ముచ్చట్లు ఏవో మధ్యలో ప్రకటనలు వస్తున్నప్పుడు చెప్పండి' అనేసింది. ఓహో! మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో దాక్కున్న చిలకలో వున్నట్టు మా  ఆవిడ వీక్ నెస్ ఎక్కడ వుందో తెలిసిపోయింది. అక్కణ్ణించి వరసపెట్టి రెండో గదిలో వున్న రెండో టీవీలో అరవ తెలుగు హిందీ సీరియళ్లన్నీ ఏకధాటిగా చూడ్డం మొదలు పెట్టి, మా  ఆవిడతో మాటలు కలిపి చూసాను. ఈ చిట్కా అమోఘంగా పనిచేసింది. జీడిపాకం కధలే కాబట్టి తోచినట్టు  కధ అల్లి,  జరిగిందీ జరగబోయేది వూహించి చెబుతుంటే  మా ఆవిడ చెవులొప్పగించి వినడం మొదలెట్టింది. ఆ తరువాత నేను ఏ కబుర్లు చెప్పినా తల వూపడం ఆవిడ వొంతయింది.
చట్టబద్ధ హెచ్చరిక: ఇలాటి చిట్కాలు ఎల్లకాలం ఎల్లరు భార్యల దగ్గర పనిచేయకపోవచ్చు. అందరూ మా ఆవిడ లాంటి గంగి గోవు రకాలు కాకపోవచ్చు కదా!

నల్లధనం


దేశవ్యాప్తంగా ఇప్పడు ఒక ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. అదీ నల్ల ధనాన్ని గురించి. కొందరివద్దే వుండే ఈ నల్ల డబ్బును గురించి ఇప్పుడు ప్రతివాళ్ళు మాట్లాడుతున్నారు.  
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఈ అరవై ఏడేళ్ళ  కాలంలో పోగుపడ్డ అవినీతి సొమ్ము అక్షరాలా కోటి కోట్ల రూపాయల పైమాటే అని ఒక అంచనా.ఈ డబ్బుతో మనదేశానికి వున్న యావత్తు రుణభారాన్ని అసలు ఫాయిదాలతో  సహా రెండుసార్లు చెల్లు వేయవచ్చనే  ఒక వాదన వినిపిస్తోంది. సిగరెట్ తాగే అలవాటు వున్నవాళ్ళు రోజుకొక్క సిగరెట్ తాగడం మానగలిగితే, ఆ ఒక్క సిగరెట్ కయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే, వారి జీవితకాలంలో ఆదా అయ్యే డబ్బుతో ఏకంగా ఒక ఇల్లే కొనుక్కోవచ్చని కొంతమంది తీరి కూర్చుని లెక్కలు కడుతుంటారు.  ఆ రీతిలోనే ఈ నల్లడబ్బుతో ఏమేమి చేయవచ్చో చెవికి ఇంపైన కధనాలు అనేకం ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ నెట్ వర్క్ ల్లో అందుబాటులో ఒక అంచనా ప్రకారం ఈ మొత్తం సొమ్ము   కోటి కోట్లు. కోటి  కోట్లు  అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చప్పున చెప్పడం కష్టం. కానీ ఆ నల్ల డబ్బును తెల్లగా మార్చగలిగితే దానితో ఏమేమి చేయవచ్చో కొంతమంది ఒక జాబితా తయారుచేసారు. అది ఇలా వుంది. 
దేశంలో ఒక్కో  గ్రామానికి ఒకటి కాదు ఏకంగా  మూడేసి చొప్పున సకల సౌకర్యాలతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అవినీతి మకిలి అంటిన సొమ్ముతో ఆరోగ్యం ఎందుకనే  డౌటేహాలు వ్యక్తం అయితే, ఆ డబ్బుతో దేశ జనాభాలో అరవై కోట్లమందికి ఎంచక్కా తలా ఒక నానో కారు కానుకగా ఇవ్వవచ్చు. కారిస్తే సరిపోతుందా పెట్రోలు డబ్బులు ఎవరిస్తారు? అని శంకర రావులు ప్రశ్నిస్తే - దేశంలో ప్రతి ఒక్కరికీ పిల్లా పెద్దా తేడాలేకుండా అక్షరాలా తలా యాభయి ఎనిమిది వేల విచ్చు రూపాయలు పంచిపెట్టి పండగ చేసుకోమనవచ్చు. లేకపోతే, దేశవ్యాప్తంగా  రైతుల రుణాలన్నీ అణాపైసలతో సహా లెక్కకట్టి, కట్టగట్టి ఒక్క దెబ్బతో బాజాప్తాగా మాఫీ చేయవచ్చు. ప్రజలపై పైసా అంటే పైసా ఎలాటి పన్ను  వేయకుండా కొన్నేళ్లపాటు ప్రభుత్వాలు జనరంజక పాలన సాగించవచ్చు. 
ముందే చెప్పినట్టు ఇవన్నీ వినడానికి ఇంపుగా వుండే విషయాలు. అయితే, అడ్డమయిన అడ్డదార్లన్నీ అడ్డదిడ్డంగా తొక్కి ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎవరయినా అబ్బురంగా అవసరమయితే స్విస్ బాంకుల్లోనో, మరో మరో విదేశీ బాంకుల్లోనో భద్రంగా దాచుకుంటారు కానీ ఇలా దాన కర్ణుల మాదిరిగా, బలి చక్రవర్తుల మాదిరిగా, ఆ డబ్బుకు నీళ్ళు వొదులుకుంటారా! అంటే నమ్మడం ఒక పట్టాన కష్టమే. 
దాచేవాడు వుంటేనే దోచుకునే వాడుంటాడని ఓ సామెత. ఎంత గజ దొంగ అయినా, తాను దొంగిలించిన సొత్తును దాచిపెట్టేవాడు లేకపోతె ధైర్యంగా దొంగతనానికి దిగడు. అలాగే, దేశసంపదను రకరకాల కుంభకోణాల ద్వారా, టక్కుటమార విద్యల ద్వారా దోచుకునే స్కాముల స్వాములు అక్రమ మార్గాల్లో సంపాదించిన అవినీతి డబ్బును దాచిపెట్టడం కోసం స్విస్ బాంకుల లాటివి ఆవిర్భవించాయి. పేరయితే స్విట్జర్లాండుకు వచ్చింది కానీ ఈ మాదిరి బాంకులు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బయి దాకా వున్నాయి. టాక్స్ హెవెన్స్ అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంకులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చుట్టుపక్కలవున్న దీవుల్లో పాగావేశాయి. 
మా దగ్గర దాచుకునే డబ్బుకు పన్ను బాధ లేదు. పట్టుకుంటారనే భయం లేదు. మీ డబ్బుకు పూర్తిగా మాదే పూచీ అంటూ నల్ల కుబేరులకు ఇవి గాలం వేస్తున్నాయి. పనికొచ్చే డబ్బును, ఎందుకూ పనికి రాకుండా గోనె సంచుల్లో మూటలుకట్టి మూలన పడేయడం ఎందుకనుకునే కొందరు బడాబాబులకు ఈ బాంకులు వరప్రసాదాలుగా మారాయి. 
ఈ బాంకుల్లో దాచుకునే డబ్బుకు ఎలాటి వడ్డీ ఇవ్వరు. అయినా కోట్ల కోట్ల డబ్బును ఆ బాంకుల్లోనే దాచుకుంటారు. ఎందుకటా! వడ్డీ ఇవ్వకపోయినా డబ్బుకు మాత్రం భద్రత వుంటుంది. అసలుకు మోసం వుండదు. అంతేకాదు డబ్బు దాచుకున్న వ్యక్తి పేరును ఎట్టి పరిస్థితుల్లోను, ఎవరు అడిగినా బయటపెట్టరు అన్న హామీ కూడా వుంటుంది. ఇలా తమ వద్ద దాచుకునే డబ్బు నిజాయితీతో సంపాదించింది కాదని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ ఈ బాంకులకు వుంది. మొక్కవోని ఈ నిజాయితీ ఒక్కటే- ప్రపంచ వ్యాప్తంగా వున్న నల్ల డబ్బు దొరలను ఆ బాంకుల వైపు పరుగులు పెట్టిస్తూ వుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలవారే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే కాదు, రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల వారు కూడా ఈ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారంటే నల్ల డబ్బు ఎంత విశ్వ వ్యాప్తం అయిందో, దాని విశ్వరూపం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 


సాధారణ పౌరులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట తీసుకువెళ్ళే డబ్బు విషయంలో నానా ప్రశ్నలు వేసి విసిగించే అధికారులు  ఇంతంత డబ్బు విదేశాలకు తరలి వెడుతుంటే ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలగడం సహజం. అయితే, ఇలాటి అనుమానాలన్నీ నల్ల డబ్బు లేనివాళ్ళకే కాని వున్న దొరలకు రావు. ఎందుకంటే, డబ్బు సంపాదించే అడ్డ దారులు తెలిసినవారికి ఇలాటి రహదారులు కూడా తెలిసే వుంటాయి. 
మొత్తం మీద ఈ నల్లధనంపై  దేశవ్యాప్తంగా మీడియాలో సాగిన చర్చోపచర్చల ఫలితంగా అయితేనేమి, సుప్రీం కోర్టు పెట్టిన చివాట్లవల్లనయితేనేమి, ఈ నల్లధనం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్తితి ఏర్పడింది.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బీజేపీ విజయానికి కూడా ఈ అంశం ఒక కారణమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నల్లధనం వెలికితీత వ్యవహారం మళ్ళీ సాగతీత విధానంలోకే మళ్ళిపోయింది. మొన్నటి కేంద్ర బడ్జెట్లో కూడా దీని వూసే లేకపోవడం చూస్తే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లడబ్బును దేశంలోకి రప్పించే ప్రక్రియ మళ్ళీ అటకెక్కిందనే అనుకోవాలి. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయి.  సచ్చీలుడు, నిజాయితీపరుడు అని ప్రజలు నమ్మి పట్టంగట్టిన  ప్రధానమంత్రి  మోడీ కాలంలో అయినా  నల్లడబ్బు ఆసాముల గుట్టు రట్టు చేయడం కుదరకపోతే, ఇక  అందులోని 'లోగుట్టు' కనుక్కోవడం  కష్టమే అవుతుంది. విదేశీ బ్యాంకుల్లో నల్ల ధనం మాట అటుంచండి. పోనీ,  మన దేశంలోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న నల్లడబ్బును బయటకు తీయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు లాంటివి ఏవీ  అడ్డు రావుకదా. మరి దీనికి అడ్డం పడుతున్నదెవరు
పరిపాలనా యంత్రాంగంలో అతి చిన్న హోదా కలిగిన ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినప్పుడు బయటపడే డబ్బు లెక్కపెట్టడానికి కౌంటింగ్ యంత్రాలు అవసరమవుతున్నాయంటే, దేశంలో దొంగ డబ్బు ఎంత దర్జాగా దొరతనం చెలాయిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దందాల్లో చేతులుమారుతున్న డబ్బును గురించి వార్తలు వింటుంటే నల్లడబ్బు చేస్తున్న స్వైర విహారాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఉయ్యాలలో పాపను పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు, నల్లడబ్బుకోసం విదేశీ బాంకుల దాకా పోనవసరం లేదని ఈ వివరాలే విశదం చేస్తున్నాయి. 
ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓమారయినా మోరల్ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక,  ఓ పక్క తామే తప్పులు చేస్తూ తమ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేక, దాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. 'ఎంత సంపాదించావు' అన్నది ప్రధానం కానీ 'ఎలా' అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది, భయపడాల్సింది  మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి. 

విదేశీ బాంకుల్లో మనవాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం జరిగినా అది హర్షించదగిందే. ఆహ్వానించదగిందే. కానీ, అంతకు ముందు, నైతికంగా దిగజారిపోయిన జాతి జనులను నీతి మార్గంలోకి మళ్లించాలి. తడబడుతున్న వారి నడవడికను సరిదిద్దాలి.  అలాకాని పక్షంలో, విదేశీ బాంకుల్లోకి అక్రమంగా తరలివెళ్లిన డబ్బును పట్టి బలవంతాన దేశంలోకి లాక్కు వచ్చినా, అది నల్ల ధనాన్ని మరింత పెంచుతుందే కానీ అందరూ అనుకుంటున్నంత మేలు ఆ ప్రయత్నం వల్ల వొనగూరక పోవచ్చు.
NOTE: Cartoon Courtesy Business Line 

15, జులై 2014, మంగళవారం

భార్యలకి మాత్రమే కానీ భర్తలు నిశ్చింతగా చదవొచ్చు

ఆవిళ్ళూ (ఆవిడలూ అన్నమాట) ఇనుకోండి ఈ మాట
(భార్యలకి మాత్రమే కానీ భర్తలు నిశ్చింతగా చదవొచ్చు)
'కలం పోయింది అనుకోండి ఏం చేస్తాం. కొత్త కలం కొనుక్కుంటాం. అదే పెన్ను క్యాప్ పోయిందనుకోండి, క్యాప్ కొనుక్కుందామనుకున్నా దొరకదు కదా! ఆ క్యాప్ లాంటి వారే మన మొగుళ్ళు. ఇక్కడ 'మన' అంటే రాయల్ మన. అంతే కాని అపార్ధాలు గట్రా చేసుకోకూడదు. అంచేత మొగుళ్ళు అనేవారు పెన్ను క్యాపుల్లాంటి వాళ్ళన్నమాట. వాళ్లకి రిప్లేస్ మెంటులు వుండవు. మరోసారి అంచేత అమ్మళ్ళూ!  మీ మీ మొగుళ్ళ ఫోటోలను మీమీ  మొబైల్ ఫోన్లలో స్క్రీన్ సేవర్ గా పెట్టుకోండి. దీనివల్ల రెండు లాభాలు. ఒకటి మీ మొగుడు గారు ఎప్పుడూ మీ గుప్పిట్లో వుంటారు. రెండోది ఏదన్నా సమస్య ఎదురయినప్పుడు ఆయన ఫోటోను ఓసారి తేరిపారచూడండి. 'ఓస్ ఇంతేనా! ఇంత పెద్ద సమస్యను ఇంట్లో పెట్టుకుని హ్యాండిల్ చేస్తున్నదాన్ని,  నాకిదో సమస్యా!  అనుకోండి. అంతే! యెంత పెద్ద సమస్య అయినా సరే  చిటికెలో సాల్వ్ చేసుకోగలుగుతారు.
మరో విషయం.
ఇది ఇంగ్లీష్ లో చెప్పుకుంటేనే బాగుంటుంది.
'Living with husband is a part of living.......but living with the same husband for years is art of living'
నిజానికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నూటికి నూరుమంది భార్యలకి పక్కాగా తెలిసిందే ఇది.

గమనిక: నవ్వొచ్చినా నవ్వుకున్నా నా ఖాతాలో వేయండి. ఎందుకంటే తెనిగించడం మినహా నాకు ఇందులో ఎలాటి పూచీ లేదు. విషయం కాస్త అటూఇటూ అయితే మాత్రం  వింజమూరి వెంకట అప్పారావు గారున్నారు కదా,  ఇలాటివన్నీ పోస్ట్ చేస్తుంటారు. మీమీ   అక్షింతలన్నీ ఆయన పద్దులో వేయండి.

గుండెను తాకితీరాలి


NSK Chakravarthi గారు ఇంగ్లీష్ లో ఓ చిన్న కధ పోస్ట్ చేశారు.
అది యెంత గొప్పగా హృదయాన్ని తాకిందంటే వెంటనే క్షణం ఆలశ్యం చేయకుండా తెలుగులో అందరితో పంచుకోవాలని అనిపించింది.
తండ్రి చనిపోగానే కొడుక్కి తల్లి విషయం ఆలోచించాడు. కర్మ కండలు పూర్తికాగానే  తీసుకువెళ్ళి ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు. చాలా కాలం తరువాత ఆశ్రమం వాళ్లు తల్లికి సీరియస్ గా వుందని కబురు చేస్తే వెళ్లాడు. అప్పటికే ఆమె ఇప్పుడో అప్పుడో అనేట్టు వుంది. కొడుకుని చూడగానే దగ్గరకు తీసుకుని చెప్పింది.
'బాబూ చూడరా ఈ గదిలో ఫ్యాన్ లేదు. దోమలు చంపేస్తున్నాయి. తిండి కూడా అలాగే వుంది. ఏదో వండి మొహాన పడేస్తారు. నువ్వు ఎలాగైనా వీలు చేసుకుని ఇక్కడ అన్ని గదుల్లో ఫ్యాన్లు పెట్టించరా. అలాగే ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి భోజనం కూడా బాగుండేట్టు చూడు'
అతడికి ఆశ్చర్యం వేసింది. తల్లి తనకు ఏనాడు ఈ విషయాలు కబురు చేయలేదు. ఇప్పుడు అవసాన దశలో ఈ మాటలు యెందుకు చెబుతున్నట్టు. అదే అడిగాడు.
ఆమె సమాధానం అతడి కళ్ళు తెరిపించిందో లేదో తెలవకుండానే ఆమె కన్ను మూసింది.

'నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. రేపో మాపో మీ పిల్లలు నిన్ను ఇక్కడే చేరుస్తారు. నువ్వు ఇలా ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు చెబుతున్నాను.'

మిధునం సినిమా మహిమ



ఓ మూడు రోజులపాటు హైదరాబాదు వొదిలిపెట్టి - దాదాపు యాభై ఏళ్ళ తరువాత మా స్వగ్రామం కంభంపాడులో నిద్ర చేసాము. దాదాపు ముప్పై మందిమి - మా అన్నదమ్ముల  కొడుకులూ,  కోడళ్ళు, పిల్లజెల్లాతో కలసి ఈ 'పల్లెకు పోదాం  కార్యక్రమంలో పాల్గొన్నాము. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  మిధునంసినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు.


ఆ సన్నివేశం  అద్భుతః

(ఇది కూడా ఏన్నర్ధం క్రితమే సుమా!)

14, జులై 2014, సోమవారం

గుడిలో ఏముందీ?


గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకుఅభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అనుకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. 
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.


(దేవాలయాల్లో తీర్ధ ప్రసాదాలను విక్రయించే పద్దతిని నిరసిస్తూ శ్రీ పీఠం అధిపతి  స్వామి పరిపూర్ణానంద చేసిన ప్రకటన ఈరోజు పత్రికల్లో వచ్చిన నేపధ్యంలో - భండారు శ్రీనివాసరావు )                                  


13, జులై 2014, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన .......


ఒక విషయం మీద మనం వ్యక్తం చేసే అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. అంతమాత్రాన అక్కడికక్కడే జంధ్యాలు తెంచుకోనక్కరలేదన్నది నా నిశ్చితాభిప్రాయం. ఈ ఉదయం టీవీ 5  'న్యూస్ స్కాన్'  ప్రోగ్రాంలో నాతొ పాటు ఢిల్లీలో  టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీనియర్ న్యాయవాది పట్టాభి, టీజేయేసీ నాయకులు కోదండరామ్, కార్యక్రమ నిర్వాహకులు సాంబశివరావు పాల్గొన్నారు. ప్రధాన చర్చనీయాంశం 'పోలవరం'.




ఒక ప్రాంతానికి వరంగా, మరో ప్రాంతానికి శాపంగా మారుతూ రెండు రాష్ట్రాల  నడుమ చిచ్చుపెడుతున్న పోలవరం వివాదం మరింత ముదరకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వుంది అని చెబుతూ, పోలవరం పూర్వాపరాలను కొంత మేరకు వివరించే ప్రయత్నం చేసాను. మరోచోట నుంచి లైవ్ లో పాల్గొంటున్న కోదండ రామ్ గారికి నేను చెప్పింది సరిగా వినబడకపోవడానికి అవకాశం  వుంది. అందువల్లనేమో, కోదండరాం గారు మధ్యలో కల్పించుకుని, ఈ  (పోలవరం ప్రాజెక్ట్  చరిత్ర) విషయంలో నేను తెలుసుకోవాల్సిన విషయాలు వున్నాయని, అందుకు సంబంధించిన అనేక పుస్తకాలు తనవద్ద వున్నాయని  చెప్పారు. తెలంగాణా ఉద్యమ సారధిగా ఆయనకు వున్న అపార  అనుభవం కానీ, విషయ పరిజ్ఞానం కాని నాకుంటుందని నేననుకోను. అదీకాక కొన్ని విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి. వాదనకు దిగడం ద్వారా అవి తేలేవి కావు. అలాగే  టీవీ ల్లో నిర్వహించే ఇటువంటి చర్చల్లో అభిప్రాయ వ్యక్తీకరణ జరగాలి కాని వాదప్రతివాదాలకు తావివ్వకూడదు. చర్చలో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వైఖరులకు కట్టుబడి కొంత వాదానికి దిగినా తప్పుబట్టాల్సిన పనిలేదు కాని జర్నలిష్టులు తాము చెప్పిందే రైటు అనే రీతిలో వాదప్రతివాదాలకు దిగరాదన్నది నా సిద్ధాంతం. అందుకే సాంబశివరావు గారు జవాబుకు అవకాశం ఇచ్చినా నేను వాడుకోలేదు. హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ కీర్తిశేషులు రాజేంద్ర ప్రసాద్ గారు అంటుండేవారు. జర్నలిష్ట్ అనేవాడు ఎదుటివాడు చెప్పింది వినడం అలవాటు చేసుకోవాలని. విభిన్న రంగాలకు చెందిన వాళ్లు చెప్పే అభిప్రాయాలు వినడం ద్వారా మన పరిజ్ఞానం పెంచుకోవచ్చన్నది కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్న పాఠం. అందుకే అది టీవీ చర్చ అయినా, ఫేస్ బుక్ చర్చ అయినా నా అభిప్రాయంతో విబేధించేవారితో నేను వాదం పెంచుకోను. అది నా పాలసీ.