17, జూన్ 2014, మంగళవారం

అడవిలో పుస్తకాలు


ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చదువుకున్నవాడిలా కానవస్తున్నాడా? లేదు కదా!
మరి ఆ పక్కనే చాప మీద అన్ని పుస్తకాలు ఏమిటి.



ఇతగాడి పేరు చిన్నతంబి. కానీ ఇతడిది పెద్ద కధే. వయస్సు కూడా చిన్నదేమీ కాదు. 73. కేరళ రాష్ట్రంలో  ఇడుక్కి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం. అతడితో కలిపి వూళ్ళో వుండేది పట్టుమని పాతిక కుటుంబాలు. అవి కూడా ఆదివాసీలవి.   చిన్నతంబి భార్య పనిపాటులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది. ఇతడేమో చిన్న టీ కొట్టు నడుపుతూ వుంటాడు. పక్కనే చాపమీద పుస్తకాలు. అవికూడా ఆషామాషీ కాలక్షేపం పుస్తకాలు కాదు. చక్కని క్లాసిక్స్. తను చదువుతూ ఇతరుల చేత చదివిస్తుంటాడు. పుస్తకాలను నామ మాత్రపు రుసుముతో అద్దెకు ఇస్తుంటాడు. అలా వచ్చిన వారికి చాయ్ ఫ్రీ.
అసలు కేరళ రాష్ట్రమే చదువుల తల్లి  నిలయం. ఆ దేవాలయంలో  పూజారులు చిన్నతంబి లాంటి పుస్తక ప్రియులు.

కళ్ళు బెట్టి చూస్తే ఈ ప్రపంచంలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నోవున్నాయి. కదా!

టీవీ 10 న్యూస్ మార్నింగ్

ఈరోజు 17-06-2014, ఉదయం ఏడుగంటలకు టీవీ 10  ఛానల్, న్యూస్ మార్నింగ్ ప్రోగ్రాంలో నాతో  పాటు టీడీపీ ప్రతినిధి శ్రీమతి సీతారత్నకుమారి, ఫోన్ ఇన్ లో కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి శ్రీ సాగర్, కృష్ణా జిల్లా ఎస్ ఎఫ్ ఐ నాయకుడు శ్రీ పాల్గొన్నారు. సమన్వయకర్తగా శ్రీ సతీష్ వ్యవహరించారు. ఫీజ్ రీఇంబర్స్ మెంట్, చుండూరు బాధితుల న్యాయపోరాటం చర్చకు వచ్చాయి. ప్రస్తావనకు వచ్చిన కొన్ని  ప్రశ్నలపై నా అభిప్రాయాలు క్లుప్తంగా:


"ప్రయోజనం పొందే  విద్యార్ధులకు వరంగా, అమలుచేసే ప్రభుత్వాలకు భారంగా పరిణమించిన పధకం ఇది. అయితే,  ఉన్నత విద్య అనేది ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సాంఘికపరమైన గుర్తింపు ఇస్తుంది. ఈ పధకం కింద చదువుకున్నవారిలో  ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయన్నది ముఖ్యం కాదు. అలాటి పెద్ద  డిగ్రీ ఒకటి  చేతికి అందడం వల్ల, అన్నిరకాలుగా  వెనుకబడివున్న  యువతీయువకులకు  సామాజికంగా లభించే గౌరవ ప్రపత్తులు, తద్వారా ఒనగూడే ఆత్మవిశ్వాసం లెక్కలోకి తీసుకుంటే ఈ పధకం మీద ఖర్చు చేసేది వృధా అనిపించదు. భారం పెనుభారం అన్న తలంపు కలగదు. లొసుగులు వుంటే సవరించుకుని పధకాన్ని అమలు చేయాలి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా పధకం అమలు జరిపి, విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంలో పడకుండా చూడాలి. వారిపై పెట్టిన ఖర్చు ప్రభుత్వాల స్థాయిలో ఒకరికొకరు రీఇంబర్స్ చేసుకోవాలి. అంతే  కాని నిధుల కొరత పేరుతొ మొత్తం పధకానికి తూట్లు పొడవకూడదు. పిల్లలకు చెప్పించే చదువులకు అయ్యే ఖర్చు  భద్రమైన భవిష్యత్తుకు ఒక విధమైన  పెట్టుబడిగా పరిగణించాలి"

16, జూన్ 2014, సోమవారం

సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం

సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం
1989 లో జరిగింది. మళ్ళీ 2014 లో.
కాకపోతే అప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎంపిక చేసుకున్నారు. ఇన్నేళ్ళకు మళ్ళీ,  తెలంగాణా స్వప్నాన్ని సాకారంచేసుకుని  ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీయార్ కూడా అదే వ్యక్తిని అదే పదవికి ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కావొచ్చేమో!  కాని దానికి పూర్తి మార్కులు మాత్రం అతగాడికే వెయ్యాలి. కేవలం ప్రతిభ కారణంగానే పదవిని పొందడం అనేది  జ్వాలాగా చిరపరిచితుడైన వనం జ్వాలా నరసింహారావుకు వెన్నతోబెట్టిన విద్య. ఆ ప్రతిభను పసికట్టే ఆనాటి  ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన వద్ద పీఆర్వోగా నా మిత్రుడు, చిన్నతనంలో సహాధ్యాయి అయిన జ్వాలాను  స్వయంగా ఎంపిక చేసి  నియమించుకుంటే, ఇప్పడు తిరిగి అదే పదవికి తెలంగాణా ముఖ్యమంత్రి  శ్రీ కె.చంద్ర శేఖర రావు గారు అదే పని చేసి తన పేషీ నుంచి పౌర  సంబంధాలను ఆజమాయిషీ చేసే గురుతర భారాన్ని ఆ జ్వాలాకే అప్పగించారు.


ఒకనాడు చేసిన ఉద్యోగమే కాని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మీడియా విస్తరణ, మాధ్యమాల నిర్వహణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్త సవాళ్ళ మధ్య కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈ నేపధ్యంలో పౌర సంబంధాలు, పేరుకు పౌర సంబంధాలు కానీ నిజానికి పత్రికా సంబంధాలు అనడమే సముచితం, వీటిని సజావుగా నిర్వహించడం ఎవరికయినా కత్తి  మీద సామే. అయితే పూర్వం సముపార్జించుకున్న అనుభవమే ఆయనకు శ్రీరామ రక్షగా అక్కరకువస్తుంది.

ఈ బాధ్యతల నిర్వహణలో జ్వాలా సంపూర్ణంగా విజయం సాధించాలని మనసారా  కోరుకుంటూ, శుభాకాంక్షలు.                

చిక్కుల్లో ఇంజినీరింగ్ ... జెమినీ న్యూస్ ఛానల్ చర్చ

చిక్కుల్లో ఇంజినీరింగ్ ... జెమినీ న్యూస్ ఛానల్ చర్చ
ఈరోజు (16-06-2014) సాయంత్రం నాలుగున్నర గంటలకు జెమినీ న్యూస్ ఛానల్, 'పబ్లిక్ వాయిస్' ప్రోగ్రాంలో  ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ విషయం చర్చకు పెట్టింది. యాంఖర్ సోమరాజు సంధానకర్తగా వ్యవహరించారు. లేవనెత్తిన అంశాలపై నా అభిప్రాయాలు సంక్షిప్తంగా:


" ఓ  నలభయ్ ఏళ్ళక్రితం  రాష్ట్రం మొత్తంలో నాలుగయిదు ఇంజినీరింగు కాలేజీలు వుండేవి. ఇప్పుడవి జిల్లాకు నాలుగయిదుకు పైగా విస్తరించాయి. మంచి నాణ్యత కలిగిన కాలేజీల్లో  సింహభాగం హైదరాబాదు చుట్టుపక్కలే ఏర్పాటయ్యాయి. అప్పటికి రాష్ట్రం విడిపోలేదు. అంచేత రాష్ట్రం లోని అనేక ప్రాంతాలనుంచి విద్యార్ధులు వాటిల్లో చేరారు.
"ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ కాలేజీ యాజమాన్యాలకు, పేద విద్యార్ధుల తలితండ్రులకు వరంగా మారితే, ప్రభుత్వాలకు మాత్రం పెను భారంగా పరిణమించింది. ఫీజ్ రీఇంబర్స్ మెంటు అనేది గత ప్రభుత్వ పధకం. ఏదో ఒక విధంగా వొదిలించుకోవాలనే ఆలోచనలు కూడా చేశారు. కాని తాత్కాలికంగా కొన్ని నిబంధనలు  మార్పుచేసి  సర్దుకున్నారు.     
"అయితే, ఈ పధకాన్ని నమ్ముకుని వేలాదిమంది కాలేజీల్లో చేరారు. ఈ నేపధ్యంలో  రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇందులో ఆ విద్యార్ధుల ప్రమేయం లేదు. కానీ,  ఆ పధకం అమలు  విషయంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాలకు ఆసక్తి వుంటుందని అనుకోలేము.
"తెలంగాణా ప్రాంతంలోని కాలేజీల్లో చదువుకునే ఆంధ్ర విద్యార్ధులకు ఫీజ్ రీఇంబర్స్ మెంటు యెందుకు ఇవ్వా లన్నది ఆ ప్రభుత్వం వాదన. వాదనలో బలం వున్నా విద్యార్ధుల పరిస్తితిని గమనంలో పెట్టుకుని  మరో ప్రత్యామ్న్నాయాన్ని అన్వేషిస్తే బాగుంటుంది. ఫీజ్ రీఇంబర్స్ మెంటు భారం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదించుకుని పరిష్కారం కనుగొనాలి కాని సంఘర్షణలకు దిగి విద్యార్ధులను గాలికి వొదిలి వేయడం సరికాదు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వంపై అనవసర భారం పడుతుంది అనుకుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి  రీఇంబర్స్ చేయాలి. కాదు కూడదు మా ప్రాధాన్యతలు వేరు అనుకుంటే ఈ పధకం విషయంలో తమ విధానాలను స్పష్ట పరచాలి. ప్రజలు తప్పనిసరిగా అర్ధం చేసుకుంటారు. అంటే కాని అసంగ్దిగ్దతకు తావివ్వరాదు." 

చంద్రబాబు నాయుడు నవ్వుతారా?


ఇదేమీ టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపొతే నవ్వించాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
చంద్రబాబు తొలిసారి  ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కబురు పెట్టారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు 'ప్రాంతీయ వార్తలు సమాప్తం' అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ  హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర  పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. 'నేనంటే ఎదురుగానే ఆఫీసుకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే' అనుకున్నా. ఈలోపల అప్పటి సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, 'సీఎం బయలుదేరి రావచ్చా' అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని.
అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

(కింది ఫోటో కబుర్లు: చంద్రబాబునాయుడు ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు మా వూరునుంచి మా అన్నయ్య కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు వచ్చి బాబుగారిని చూడాలంటే సచివాలయానికి తీసుకువెళ్ళాను. ఆ సమయంలో అక్కడ వున్న విలేకరులతో కలిపి తీసిన  ఫోటో. ఇందులో నేను లేకపోవడానికి కారణం ఫోటో తీసింది నేను కావడమే) 


కోటికొక్కడు కళ్యాణ సుందరం


ఈ కళ్యాణ సుందరం గారిని గురించి చదివిన తరువాత జన్మ ధన్యం అనిపించింది. ఇలాటి మంచి వాళ్లు ఇంకా వున్నారు. వాళ్ళ మధ్యనే మనం బతుకుతున్నాం. జన్మ ధన్యం కావడానికి ఇంకేమి కావాలి.
దాత్రుత్వంలో 'శిబి'ని తలపించే కళ్యాణ సుందరం చెన్నైలో ముప్పయ్యేళ్ళ పాటు లైబ్రేరియన్ గా పనిచేశారు. అయితే అందులో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు. అందరి ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతం తీసుకున్నాడు. కానీ ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇంటికి పట్టుకుపోలేదు. సంపాదించిన ప్రతి రూపాయి అవసరంలో వున్నవాళ్లకే దానం చేస్తూ వచ్చాడు. చివరికి ముప్పయ్యేళ్లు సర్వీసు చేసిన అనంతరం ముట్టిన పించను మొత్తం పదిలక్షలు దానధర్మాలకే ధారపోశాడు.
మరి ఉదర పోషణ అంటారా. తీరిక సమయాల్లో హోటల్లో సర్వర్ గా పనిచేసి ఆ భత్యంతో పొట్టపోసుకునేవాడు.
మూడో కంటికి తెలియకుండా చేసిన ఈ దానాలు గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి ఈ చెన్నై సుందరాన్ని గుర్తించి శతాబ్దపు ఉత్తమోత్తమ పౌరుడిగా నిర్ణయించి సత్కరించింది. మరో అమెరికన్ సంస్థ 'కోటికొక్కడు' బిరుదు ఇచ్చి, దానితోపాటు అక్షరాలా ముప్పయ్ కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందచేసింది. ఆ చెక్కు అందుకున్న కళ్యాణ సుందరం గారు  తన  అలవాటు ప్రకారం ఆ మొత్తాన్ని అవసరంలో వున్నవారికి సాయపడేందుకు దానం చేసి చేతులు దులిపేసుకున్నారు.
కధ ఇక్కడితో ఆగలేదు. చేతికి ఎముకలేనట్టు దానం చేసే ఈ అభినవ శిబి గురించి మరో గొప్ప వ్యక్తికి తెలిసింది. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఏమిచ్చినా మళ్ళీ దానం చేసేస్తాడు కాబట్టి కల్యాణసుందరం గారిని ఓ మంచి రోజు చూసి తన తండ్రిగా దత్తత తీసేసుకున్నాడు. కళ్యాణ సుందరం గారి  దాన ఫలం  ఆ విధంగా దక్కి రజనీకాంత్ వంటి మహోన్నతుడికి తండ్రి కాగలిగాడు. రజనీకాంత్ సన్ ఆఫ్ కల్యాణ సుందరం అని అనిపించుకోగలిగాడు.


కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా దానాలు చేస్తూ వచ్చిన ఈ కళ్యాణ సుందరం గారికి కళ్యాణ ఘడియ మాత్రం  తోసుకురాలేదు. దానధర్మాలకు అడ్డం అనుకున్నారో యేమో పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపోయారు.

సమీక్షల్లో విచక్షణ అవసరం

ఈ రోజు (16-06-2014) ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలవరకు ఐ న్యూస్ టీవీ ఛానల్ న్యూస్ వాచ్  కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు. ప్రసన్న యాంఖర్ గా వ్యవహరించారు  

  
"కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు పాత ప్రభుత్వాల పధకాలను సమీక్షించడం, సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ  విషయంలో కొంత విచక్షణ చూపాలి. పేద విద్యార్ధులకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్  పధకం ప్రవేశ  పెట్టినప్పుడు రెండు రాష్ట్రాలు లేవు. హైదరాబాదు రాజధాని కావడం వల్ల ఇంజినీరింగ్ కాలేజీలు చుట్టుపక్కలే ఎక్కువగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్ధులు వచ్చి చేరారు. పొరుగు రాష్ట్రం భారం యెందుకు మోయాలన్న వాదన వినడానికి బాగుండవచ్చు. భారం అనుకుంటే ఆ పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని విషయం సర్దుబాటు చేసుకోవాలి. అంతే  కాని విద్యార్ధులకు అన్యాయం చేయకూడదు.
"అలాగే హైదరాబాదులో చారిత్రిక కట్టడాల పరిరక్షణ కోసం మెట్రో మార్గంలో మార్పులు చేసే విషయం. భావావేశంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. తల తీసి కోట గుమ్మానికి వేలాడగట్టండి అనే తరహాలో కాకుండా సంబంధిత నిర్మాణ సంస్థతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలి. యెలా చేస్తే తక్కువ స్థాయిలో నష్టం జరుగుతుందో సాంకేతికంగా ఆలోచించి చూడాలి. అసలు ఇలాటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఆస్కారం లేకుండా, చారిత్రిక కట్టడాల పరిరక్షణ గురించి ముందస్తు ఆలోచన చేసి సలహాలు ఇచ్చే శాశ్విత యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. మెట్రో మార్గం యెలా వుండాలి అనే ఆలోచన చేసే రోజుల్లోనే ఇటువంటి ఏర్పాటు వుండి వుంటే బాగుండేది. కానీ ఆలశ్యం జరిగింది. ఇప్పుడు మరో తొందరపాటు నిర్ణయం చేసి ప్రాజక్టు ఆలశ్యం చేసుకోవడం వల్ల నష్టపోయేది ప్రజలే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
"తెలంగాణా రాష్ట్రం తొలి శాసన సభ సమావేశాలు ముగిసాయి. గత నాలుగయిదేళ్ల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులు గుర్తుచేసుకుంటే ఇటీవలి సమావేశాలు చాలా వూరట కలిగించేవిగా వున్నాయి. వాయిదాలతో సమయం వృధా చేసుకోలేదు. ఈ సంప్రదాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కూడా కొనసాగించాలి. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ నేతలు మంచి విషయాల్లో పోటీతత్వంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు."