11, మే 2014, ఆదివారం

ఇలానే మొదలవుతుంది


బోధి చెట్టు కింద కూర్చోకుండానే ఒక సత్యం బోధపడింది.
పోలింగుకు ఓట్ల లెక్కింపుకు మధ్య  రోజుల తరబడి వున్న వ్యవధానాన్ని కూడా కొంతమంది ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించడానికి వాడుకుంటున్నారని.


మనకో ఎస్ ఎం ఎస్  వస్తుంది. పలానా సర్వే ప్రకారం పలానా పార్టీకి ఇన్ని సీట్లని.
మనకో మెయిల్ వస్తుంది. అచ్చం అలాగే.
ఇంకేముంది. మనకో విషయం అందరికంటే ముందే తెలిసిపోయింది అన్న  ఆత్రుతలో ఆ మెసేజ్ వేరెవరికో తెలిసిన వాళ్లకి, వాళ్ళు వాళ్లకి తెలిసిన వాళ్లకి ఫార్వార్డ్ చేసేస్తాం. అంతే. అది వేరే ఎవరో బెట్టింగులు నడిపే వాళ్లకి నాలుగు రాళ్ళు పోగేసిపెడుతుంది. బెట్టింగులు కాసేవాళ్ళకి తిరుక్షవరం చేస్తుంది.
ఈ వూహాగానాలన్నీ, కోట్లు చేతులు మారే  ఈ ఆటలో భాగమే అని తెలిసి నివ్వరపోవడం మన వంతవుతుంది.

హలో! లక్ష్మణా!!

ఏరీ! వారేరీ! కనరారేమీ! 
"ఏ కష్టం వచ్చినా  మీ వెంటే వుంటాం. మీ వెన్నంటే వుంటాం. ఏ అవసరం వచ్చినా సరే,  ఓ చిటికేస్తే చాలు  చిటికెలొ మీ వద్దకు వస్తాం" నిన్న మొన్నటి వరకు ఇలాటి మాటలే రాజకీయ నేతల నోటివెంట జల్లులా కురిసాయి.

అకాల వర్షాల తాకిడితో ఆరుగాలం  కష్టం ఆవిరైపోతున్న వేళ, వాననీటిలో పంటలు మునిగి, ధాన్యం తడిసి,  పండు రాలి, గుండె పగిలి,  రైతన్నలు కన్నీరు మున్నీరై పోతూ విలవిలలాడిపోతున్న విషాద తరుణంలో -

ఏరీ! వారేరీ! ఒక్కరూ కనరారేమీ!  

10, మే 2014, శనివారం

అమ్మ

  


అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.


రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే  మదర్స్ డే   మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.
సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే  తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు  1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి  చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి  అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా  ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం  ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డే ఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే  ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా  అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ  తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్  పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే  1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో  ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.
అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా  మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో  గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ

పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.

అమ్మ ఎవరికయినా అమ్మే!

(మే 11 - మన దేశంలో మాతృమూర్తి దినోత్సవం)
(మనసును తాకే కధఅనే  ఈ కధను సందీప్ కుమార్ పోస్ట్ చేసారు. చాలామంది చదవడానికి వీలుంటుందని దాన్ని తెలుగు లిపిలోకి మార్చి ఇస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు)   
ఇక చదవండి.


బస్సు నుంచి దిగి  నా జేబులో చేయి పెట్టి చూస్తే పర్సులేదు. ఎవరో కొట్టేసారు. గుండె గుభిల్లుమంది.
పర్సులో నూట యాభయ్ రూపాయలు, అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు రోజులయింది కాని పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు. వున్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది. నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని ఉద్యోగం లేదుకదా. మళ్ళీ దొరికేదాకా వున్నదానితోనే నెట్టుకు రావాలి. ఉత్తరంలో అదే రాసాను. ప్రతినెలా పంపించే  అయిదు వందలు ఇకనుంచి పంపడం కుదరకపోవచ్చు అని.
కొన్ని రోజుల తరువాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది.  అందులో ఏం రాసి వుంటుంది. డబ్బు అందలేదు త్వరగా పంపించమని రాసి ఉంటుంది.
కాని ఆ ఉత్తరం చూసిన తరువాత నోటమాట రాలేదు.
బాబూ! నువ్వు పంపిన అయిదు వందల రూపాయల మనియార్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని తెలుసు.కానీ,  ఎవరా మనియార్డర్ పంపించింది అన్న విషయం మాత్రం  అర్ధం కావడం లేదు.
కొన్ని రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది. రాత గజిబిజిగా వుంది.

అన్నా! నీ పర్స్ కొట్టేసిన వాడిని నేనే. మీ అమ్మకు పంపిన డబ్బులో  నూట యాభై నీది. మరో 350  నేను కలిపి మనియార్డర్ చేసాను. అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు.  అమ్మ ఎవరికయినా అమ్మే.

NOTE: Courtesy Image Owner) 

రుచి తగ్గింది


'
"అదేవిటో! పేపర్లు తిరగేయడమే కానీ పూర్తిగా చదవాలని అనిపించడం లేదు"  
"అదేమరి! పచ్చడి తిన్న నాలుక్కి చప్పిడి మెతుకులు ఏం రుచిస్తాయి"  
 

9, మే 2014, శుక్రవారం

‘ఈగ’ ఖరీదు '

‘ఈగ’ ఖరీదు '
'మా మూవీస్ ఛానల్ లో రాజమౌళి 'ఈగ' సినిమావస్తోంది. 2012 జులై లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అదేమిటంటే:
‘ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.


హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకు ‘యాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా! ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’ సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని ఓసారి ‘ఈగ’ చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక కాల్చిన బాణసంచాలో ‘పని పూర్తయింది’ అనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)

నేటి అవసరం


'ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడెదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు .....'అంటాడు శ్రీరాముడు తన అనుంగు భక్తుడు ఆంజనేయుడితో, కల్పిత పౌరాణిక నాటకం 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో.
సీమాంధ్రలొ  ఎన్నికల సమరం ముగిసింది. ప్రజాతీర్పు 'ఏవీఎం'లలో నిక్షిప్తమై వుంది. మరో వారం రోజుల్లో అది యెలా వుందనేది వెల్లడి అవుతుంది.



ఈలోగా, ఆశలు, ఆశలకు తగ్గట్టుగా అంచనాలు, అంచనాలకు తగ్గట్టుగా వూహాగానాలు ఇవన్నీ  ఎలాగో రాజకీయ పార్టీలకు తప్పవు.
ఆ తీర్పు యెలా వున్నా ఏవిధంగా వున్నా దాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యానికి మేలుచేస్తుంది. విజేతకు కావాల్సింది సంయమనం, పరాజితులకు అవసరమైంది హుందాతనం.
అరవయ్యవ దశకంలో పత్రికలు చదవడం అలవాటు చేసుకుంటున్న దశలో, నాటి ఆంధ్ర పత్రిక మొదటి పుట పతాకశీర్షిక  నాకింకా గుర్తుంది.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాన్ ఫిట్జరాల్ద్ కెనెడీ అద్భుత విజయం. ఓటమిని అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన"
పోటీ అన్నాక విజేతలు పలువురు వుండరు. వోడినవారికి అదే తుది పోరు కాదు. ప్రజల విజ్ఞత మీద విశ్వాసం వుంచండి. నచ్చిన వారిని యెలా ఎన్నుకుంటున్నారో, నచ్చకపోతే అలాగే 'వోటు ఆయుధం' ప్రయోగించి దించేసిన సందర్భాలు  కోకొల్లలు.  
ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇరువురికీ అభినందనలు. ప్రజలకు చేరువ కావడానికి అన్ని పక్షాలు విశ్వప్రయత్నం చేసాయి. అన్ని రకాలుగా శ్రమించాయి. అయితే విజయం ఒకరినే వరిస్తుంది. వారు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. ఓడిన వారు కూడా అనవసర ఆరోపణలు, విమర్శలకు దిగకుండా ప్రజాస్వామ్య స్పూర్తిని గౌరవించాలి. మరో పోరాటానికి సిద్ధంగా వుండాలి.
ఇదేమీ తుది సమరం కాదు. ఈ ఎరుక అందరికీ మేలు చేస్తుంది.